Sunday, June 26, 2022

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం


నలిమెల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గూడూరి వేణు, జూలూరి గౌరీశంకర్, పూడూరి రాజిరెడ్డి, జుకంటి జగన్నాథం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి ప్రవీణ్, పత్తిపాక మోహన్, ఎలగొండ రవి





 

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం

సినారె విజ్ఞాన మందిరం, సిరిసిల్ల

ఉదయం 10:00; 19 జూన్‌ 2022

---------------------------------------------

ఇలా ఈ పురస్కారం తీసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పెడితే, కొందరు మిత్రులు గూడూరి–పూడూరి మధ్య ఉన్న రైమింగ్‌ను ప్రస్తావించారు. నాకు తెలియకుండానే ఎప్పుడో గూడూరితో నా పేరు ముడిపడిపోయినట్టుగా ఉంది.

మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు కదా. సాహిత్యం అనేది గెలుపు ఓటములకు సంబంధం ఉన్నది కాదు. కానీ నన్ను నిజంగా ఎంతోకొంత సీరియస్‌గా చదివే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ మాట అంటే మేము లేమా అని నామీద అభిమానంతో కోపానికి వచ్చే తెలంగాణవాళ్లు కూడా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుండె... ఇక్కడ నన్ను నిజంగా చదువుతున్నారా, నిజంగా సాహిత్యం అనేదాన్ని అర్థం చేసుకునే పాఠకులున్నారా... వీళ్లకు అలవాటైన మూసలు దాటితే వీళ్లకు అర్థమైతదా... కానీ ఈ పురస్కారం వల్ల ఇక్కడ కూడా నన్ను చదువుతున్నారు, పట్టించుకుంటున్నారు అన్న చిన్న ఫీలింగ్‌ వచ్చింది. ఒక విధంగా ఇంట కూడా గెలిచిన ఫీలింగ్‌ వచ్చింది.

ఇంకోటి ఏంటంటే– నేను ఆరో తరగతి నుంచి ఊరికి దూరంగానే ఉంటున్నా. మేడ్చల్, కీసరగుట్ట, పటాన్‌చెరు, హైదరాబాద్‌... చదువు, ఉద్యోగం... ఏం చేసినా ఆల్మోస్ట్‌ ముప్పై ఏళ్లుగా నేను హైదరాబాద్‌లోనో, హైదరాబాద్‌తో సంబంధంలోనో ఉంటున్నా. దసరాకూ, సంక్రాంతికీ ఏదో పండుగకు ఊరికి వచ్చినట్టే అయిపోయింది. ఈ ఒకట్రెండేళ్ల నుంచే కొంచెం ఊరికి ఎక్కువ వచ్చిపోతున్నా, ఎక్కువ ఉంటున్నా కూడా. కరోనా వల్ల జరిగిన మంచి విషయాల్లో అదొకటి. నలభై ఐదు రోజులు వరుసగా, రెండు దఫాల్లో ఉండగలిగిన. ఎప్పుడు ఇట్ల వీలు గాలె. ఉరుకుడు, ఉరుకుడు... మూడ్రోజులు సెలవు పెట్టుకునుడు, ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకునుడు... వచ్చుడు, పోవుడు ఇదే కథ... కానీ నేను ఎక్కడినుంచన్నా రానీ... ఈ సిద్దిపేట, సిరిసిల్ల మోపుకు రాంగనే... ఆ వాతావరణమే మారిపోతది. మన మనుషుల్ల పడ్డం అనిపిస్తది. వాళ్ల ఎవ్వరితోటి మనకు పరిచయం ఉండది. మనం పోయి మాట్లాడకపోవచ్చు. కానీ మనోళ్లు అని అనిపిస్తది. మన భూమితో, మన ప్రాంతంతో, మన ఊరితో ఉండే సంబంధం అది. ఏదో ఒక గుండె నిండినట్టు. అట్ల ఈ అవార్డు మన మనుషుల్ల తీసుకునుడు ఇంకొంచెం సంబురం.

సీతారాం గారిది హన్మాజీపేట అని తెలిసి అది ఇంకా పెరిగింది. ఇగ అది మన ఊళ్లే, మన ఇంట్ల తీసుకున్నట్టే.

నా బాధ్యత పెరిగింది, నేనేదో సమాజానికి ఏదో చేశాను ఇట్లాంటి మాటలేమీ చెప్పను. నా వరకు పురస్కారం అంటే ఏమిటంటే, అది ప్రశంసకు ఒక భౌతికరూపం ఇవ్వడం. మీరు రాసింది బాగుంది అంటే ఎట్లాంటి సంతోషం అనిపిస్తదో, అట్లాంటిదే ఇది కూడా.

అయితే అవార్డుల మీద నేను మరీ ఎక్కువేమీ ఆలోచించలేదుగానీ ఇవి తీసుకోవడం అనేది లేని బరువును మీద పెట్టుకున్నట్టు అవుతుందా? తెలియకుండానే దేనికో కమిట్‌ చేసుకోవడం లాంటిది అవుతుందా? అని కొంత సంశయించాను. మళ్లీ ఈ స్మారక అవార్డులు అంటే– వాళ్లు ఏ ఆదర్శానికో, ఏ భావజాలానికో నిలబడి ఉంటారు. నేను అట్లాంటి ప్రకటిత భావజాలాల్లోకి రాను. మన ధోరణికీ, వాళ్ల దానికీ మధ్య వైరుధ్యం ఉంటే ఇదొక ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. అందుకే ఇట్లా పురస్కారం అని నాకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు– నా పేరు మీ దృష్టికి రావడం సంతోషమేగానీ వద్దులేవే అనే చెప్పాను. ఒక రెండు, మూడు వారాలకు మళ్లీ చేశారు. నాకు రకరకాల బలహీనతలు ఉన్నాయిగానీ ఈ పురస్కారాల లౌల్యం అయితే లేదనే అనుకుంటాను. కానీ రెండోసారి చేసినప్పుడు– నిరాకరించలేని మొహమాటం ఒకటి, రెండోది మర్యాద కూడా కాదనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందున్నాను.

మనం ఒకరి పేరు మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్లు ఏమిటి అని తలుచుకోవడం ఒక సాహిత్య మర్యాద. నేను గూడూరి సీతారాం గారి కథలు మరీ ఎక్కువ చదవలేదు. అవైనా మనకంటే ముందుతరంలో రాసినవాళ్లు ఏం రాసివుంటారు అనే చిన్నపాటి కుతూహలంతో చదివినవే. అందుకే నేను చదివినవాటితో ఆయన నిజమైన ప్రతిభను అంచనా కట్టవచ్చా అన్నది చెప్పలేను. కానీ చదివినమేరకు కథకు ఉండే నిజమైన పొటెన్షియల్‌ను, విస్తృతిని ఆయన అందుకోలేదేమో అనిపించింది. కానీ ఆయన రాసిన కథలు చూస్తే– నారిగాని బతుకు, మారాజు ఇట్లాంటివి– 1954, 1957 ఇట్లా ఉన్నాయి అవి అచ్చయిన సంవత్సరాలు. 1936లో జన్మించారనుకుంటే– ఆయన ఎర్లీ ట్వెంటీస్‌లో, పచ్చి యువకుడిగా రాసిన కథలు. అంత చిన్న వయసులో ఆయన సాహిత్య రంగం మీదకు రావడం ఒక విశేషం... 

ఇంకా ముఖ్యంగా, ఇప్పుడు తెలంగాణ భాష కూడా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ స్థాయిని అందుకోవడం వల్ల ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లలో కూడా యధేచ్ఛగా మాట్లాడే పరిస్థితి వచ్చిందిగానీ... ఆ 1950, 60ల కాలంలో, అలాంటివి అచ్చుకు నోచుకోవడం చాలా కష్టమైన రోజుల్లో ఆయన తెలంగాణ మాండలికంలో రాయడం గొప్ప విషయం. బహుశా సీతారాం గారిని సాహిత్య లోకం తలుచుకుంటున్నది ఆయన కథల కంటే కూడా ఆయన భాష కోసం అనుకుంటున్నాను. ఈ అవార్డు పెట్టిన ఉద్దేశం కూడా తెలంగాణ భాషలో రాస్తున్నవాళ్లకు ఇవ్వడానికే.

అయితే భాష మీద నా వైఖరి కూడా చెప్తాను. రాతపూర్వక భాషకూ, మాట్లాడే భాషకూ కొంత తేడా ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటాను. అంటే, భాష కోసం భాష అని మరీ తెచ్చిపెట్టి కృతకం చేయను. కానీ తెలంగాణ ఫ్లేవర్‌ నా రైటింగులో చాలానే ఉంటుందనుకుంటాను. ఇంక స్పోకెన్‌ సందర్భాలు వచ్చినప్పుడు– రియాలిటీ చెక్‌ పుస్తకంలో చాలాచోట్ల... ఆజన్మం పుస్తకంలో కొన్ని చోట్ల... చింతకింది మల్లయ్య ముచ్చట, కాశెపుల్ల, చినుకు రాలినది, రెండో భాగం, గంగరాజం బిడ్డ, కొండ లాంటి కథల్లో సందర్భాన్ని బట్టి జీవితానికి చాలా దగ్గరగా ఉండే భాషను వాడగలిగానని అనుకుంటాను. అదొక్కటే నేను ఈ పురస్కారం అందుకోవడానికి అర్హత అనుకోగలిగేది.

గూడూరి సీతారాం పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటుచేయడమూ, దాన్ని మొదటగా నాకే ఇవ్వడమూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఫార్మాలిటీ మాటగా చెప్పేదే కావొచ్చు. కానీ ఆ ‘మొదటి’ అనే మాట సంతోషాన్ని రెట్టింపు కూడా చేస్తోంది. దీన్ని ఏర్పాటుచేసిన సీతారాం గారి సంతానం గూడూరి వేణు గారికీ, సీతారాం తమ్ముడు రాఘవేంద్ర గారికీ, నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి చొరవ చూపిన పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా ఈ వేడుకలో భాగమైన జూలూరు గౌరీశంకర్‌ గారికీ, ఆకునూరి శంకరయ్య గారికీ, గూడూరి ప్రవీణ్‌ గారికీ, గరిపెల్లి అశోక్‌ గారికీ... నిర్వహణలో భాగం పంచుకున్న మానేరు రచయితల సంఘం కవులు ఎలగొండ రవి, జిందం అశోక్, గోనె బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా దీన్ని ముఖ్యమైన ఈవెంట్‌గా తలచి వచ్చిన ‘మీ అందరికీ’ కూడా!


(ఫొటోలు పంపిన నాగేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు.)



Friday, June 24, 2022

జీవన సంగీతం

 జీవన సంగీతం


ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమీ లేమిల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యూనిక్, స్పెషల్‌. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకేరకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు.

నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్‌ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్‌ చేసుకుంటున్నాం. కెరియర్‌ వరకూ ఏమోగానీ, కరెంట్‌ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధానమయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు, మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కడినుంచి వస్తుంది?

కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు, ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం.

‘‘ప్రతిమనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమాచారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగాబైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్‌. చెర్నోబిల్‌ దుర్ఘటన, సోవియట్‌ పతనం, సోవియట్‌–అఫ్గానిస్తాన్‌ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్‌ భాషలో రాసే ఈ బెలారూస్‌ పాత్రికేయురాలు నోబెల్‌ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’(ఒరిజినాలిటీ లేకుండాపోవడం) నిండిపోయివుంది. వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకుముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు.

యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకోగలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి.

జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి. నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వేగపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవన సంగీతమే ప్రపంచంలో తీవ్రంగా వ్యాపితమవుతున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు.

(జూన్‌ 20, 2022 నాటి సాక్షి ఎడిటోరియల్‌)
 

Wednesday, June 22, 2022

అవధుల్లేని కళ

 అవధుల్లేని కళ


గోవిందుని అరవిందన్‌ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్‌ స్ట్రిప్‌ ‘చెరియ మనుష్యారుమ్‌ వలియ లోకవుమ్‌’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతృభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కృషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ చిత్ర పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది.
 
మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్‌(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడుమందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దృశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. సినిమా పట్ల ఆయన దృక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్రకెక్కింది. ఈ సినిమా షూటింగ్‌ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడం వల్ల తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది.

అరవిందన్‌ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్‌ డేరా. దీన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్‌ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్‌ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు.

ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కువెయిల్‌’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్‌. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్‌. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్‌.కరుణ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం.
 
56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్‌ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. తన ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్‌ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకతగా విమర్శకులు చెబుతారు.

‘పాన్‌ ఇండియా’, ‘పాన్‌ వరల్డ్‌’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్‌ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక జి.అరవిందన్‌ లాంటి దర్శకుల స్ఫూర్తి విస్మరించలేనిది.

ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్‌ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్‌ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి.అరవిందన్‌ ‘థంప్‌’. (కొత్త వెర్షన్‌లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా!
 
(మే 30, 2022 నాటి సాక్షి ఎడిటోరియల్‌)