Sunday, June 26, 2022

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం


నలిమెల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గూడూరి వేణు, జూలూరి గౌరీశంకర్, పూడూరి రాజిరెడ్డి, జుకంటి జగన్నాథం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి ప్రవీణ్, పత్తిపాక మోహన్, ఎలగొండ రవి





 

గూడూరి సీతారాం కథా పురస్కార స్వీకరణ ప్రసంగం

సినారె విజ్ఞాన మందిరం, సిరిసిల్ల

ఉదయం 10:00; 19 జూన్‌ 2022

---------------------------------------------

ఇలా ఈ పురస్కారం తీసుకుంటున్నానని ఫేస్‌బుక్‌లో పెడితే, కొందరు మిత్రులు గూడూరి–పూడూరి మధ్య ఉన్న రైమింగ్‌ను ప్రస్తావించారు. నాకు తెలియకుండానే ఎప్పుడో గూడూరితో నా పేరు ముడిపడిపోయినట్టుగా ఉంది.

మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు కదా. సాహిత్యం అనేది గెలుపు ఓటములకు సంబంధం ఉన్నది కాదు. కానీ నన్ను నిజంగా ఎంతోకొంత సీరియస్‌గా చదివే ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ మాట అంటే మేము లేమా అని నామీద అభిమానంతో కోపానికి వచ్చే తెలంగాణవాళ్లు కూడా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది, ఆ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుండె... ఇక్కడ నన్ను నిజంగా చదువుతున్నారా, నిజంగా సాహిత్యం అనేదాన్ని అర్థం చేసుకునే పాఠకులున్నారా... వీళ్లకు అలవాటైన మూసలు దాటితే వీళ్లకు అర్థమైతదా... కానీ ఈ పురస్కారం వల్ల ఇక్కడ కూడా నన్ను చదువుతున్నారు, పట్టించుకుంటున్నారు అన్న చిన్న ఫీలింగ్‌ వచ్చింది. ఒక విధంగా ఇంట కూడా గెలిచిన ఫీలింగ్‌ వచ్చింది.

ఇంకోటి ఏంటంటే– నేను ఆరో తరగతి నుంచి ఊరికి దూరంగానే ఉంటున్నా. మేడ్చల్, కీసరగుట్ట, పటాన్‌చెరు, హైదరాబాద్‌... చదువు, ఉద్యోగం... ఏం చేసినా ఆల్మోస్ట్‌ ముప్పై ఏళ్లుగా నేను హైదరాబాద్‌లోనో, హైదరాబాద్‌తో సంబంధంలోనో ఉంటున్నా. దసరాకూ, సంక్రాంతికీ ఏదో పండుగకు ఊరికి వచ్చినట్టే అయిపోయింది. ఈ ఒకట్రెండేళ్ల నుంచే కొంచెం ఊరికి ఎక్కువ వచ్చిపోతున్నా, ఎక్కువ ఉంటున్నా కూడా. కరోనా వల్ల జరిగిన మంచి విషయాల్లో అదొకటి. నలభై ఐదు రోజులు వరుసగా, రెండు దఫాల్లో ఉండగలిగిన. ఎప్పుడు ఇట్ల వీలు గాలె. ఉరుకుడు, ఉరుకుడు... మూడ్రోజులు సెలవు పెట్టుకునుడు, ఆదివారం కలిసి వచ్చేటట్టు చూసుకునుడు... వచ్చుడు, పోవుడు ఇదే కథ... కానీ నేను ఎక్కడినుంచన్నా రానీ... ఈ సిద్దిపేట, సిరిసిల్ల మోపుకు రాంగనే... ఆ వాతావరణమే మారిపోతది. మన మనుషుల్ల పడ్డం అనిపిస్తది. వాళ్ల ఎవ్వరితోటి మనకు పరిచయం ఉండది. మనం పోయి మాట్లాడకపోవచ్చు. కానీ మనోళ్లు అని అనిపిస్తది. మన భూమితో, మన ప్రాంతంతో, మన ఊరితో ఉండే సంబంధం అది. ఏదో ఒక గుండె నిండినట్టు. అట్ల ఈ అవార్డు మన మనుషుల్ల తీసుకునుడు ఇంకొంచెం సంబురం.

సీతారాం గారిది హన్మాజీపేట అని తెలిసి అది ఇంకా పెరిగింది. ఇగ అది మన ఊళ్లే, మన ఇంట్ల తీసుకున్నట్టే.

నా బాధ్యత పెరిగింది, నేనేదో సమాజానికి ఏదో చేశాను ఇట్లాంటి మాటలేమీ చెప్పను. నా వరకు పురస్కారం అంటే ఏమిటంటే, అది ప్రశంసకు ఒక భౌతికరూపం ఇవ్వడం. మీరు రాసింది బాగుంది అంటే ఎట్లాంటి సంతోషం అనిపిస్తదో, అట్లాంటిదే ఇది కూడా.

అయితే అవార్డుల మీద నేను మరీ ఎక్కువేమీ ఆలోచించలేదుగానీ ఇవి తీసుకోవడం అనేది లేని బరువును మీద పెట్టుకున్నట్టు అవుతుందా? తెలియకుండానే దేనికో కమిట్‌ చేసుకోవడం లాంటిది అవుతుందా? అని కొంత సంశయించాను. మళ్లీ ఈ స్మారక అవార్డులు అంటే– వాళ్లు ఏ ఆదర్శానికో, ఏ భావజాలానికో నిలబడి ఉంటారు. నేను అట్లాంటి ప్రకటిత భావజాలాల్లోకి రాను. మన ధోరణికీ, వాళ్ల దానికీ మధ్య వైరుధ్యం ఉంటే ఇదొక ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. అందుకే ఇట్లా పురస్కారం అని నాకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు– నా పేరు మీ దృష్టికి రావడం సంతోషమేగానీ వద్దులేవే అనే చెప్పాను. ఒక రెండు, మూడు వారాలకు మళ్లీ చేశారు. నాకు రకరకాల బలహీనతలు ఉన్నాయిగానీ ఈ పురస్కారాల లౌల్యం అయితే లేదనే అనుకుంటాను. కానీ రెండోసారి చేసినప్పుడు– నిరాకరించలేని మొహమాటం ఒకటి, రెండోది మర్యాద కూడా కాదనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందున్నాను.

మనం ఒకరి పేరు మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్లు ఏమిటి అని తలుచుకోవడం ఒక సాహిత్య మర్యాద. నేను గూడూరి సీతారాం గారి కథలు మరీ ఎక్కువ చదవలేదు. అవైనా మనకంటే ముందుతరంలో రాసినవాళ్లు ఏం రాసివుంటారు అనే చిన్నపాటి కుతూహలంతో చదివినవే. అందుకే నేను చదివినవాటితో ఆయన నిజమైన ప్రతిభను అంచనా కట్టవచ్చా అన్నది చెప్పలేను. కానీ చదివినమేరకు కథకు ఉండే నిజమైన పొటెన్షియల్‌ను, విస్తృతిని ఆయన అందుకోలేదేమో అనిపించింది. కానీ ఆయన రాసిన కథలు చూస్తే– నారిగాని బతుకు, మారాజు ఇట్లాంటివి– 1954, 1957 ఇట్లా ఉన్నాయి అవి అచ్చయిన సంవత్సరాలు. 1936లో జన్మించారనుకుంటే– ఆయన ఎర్లీ ట్వెంటీస్‌లో, పచ్చి యువకుడిగా రాసిన కథలు. అంత చిన్న వయసులో ఆయన సాహిత్య రంగం మీదకు రావడం ఒక విశేషం... 

ఇంకా ముఖ్యంగా, ఇప్పుడు తెలంగాణ భాష కూడా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్‌ స్థాయిని అందుకోవడం వల్ల ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లలో కూడా యధేచ్ఛగా మాట్లాడే పరిస్థితి వచ్చిందిగానీ... ఆ 1950, 60ల కాలంలో, అలాంటివి అచ్చుకు నోచుకోవడం చాలా కష్టమైన రోజుల్లో ఆయన తెలంగాణ మాండలికంలో రాయడం గొప్ప విషయం. బహుశా సీతారాం గారిని సాహిత్య లోకం తలుచుకుంటున్నది ఆయన కథల కంటే కూడా ఆయన భాష కోసం అనుకుంటున్నాను. ఈ అవార్డు పెట్టిన ఉద్దేశం కూడా తెలంగాణ భాషలో రాస్తున్నవాళ్లకు ఇవ్వడానికే.

అయితే భాష మీద నా వైఖరి కూడా చెప్తాను. రాతపూర్వక భాషకూ, మాట్లాడే భాషకూ కొంత తేడా ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటాను. అంటే, భాష కోసం భాష అని మరీ తెచ్చిపెట్టి కృతకం చేయను. కానీ తెలంగాణ ఫ్లేవర్‌ నా రైటింగులో చాలానే ఉంటుందనుకుంటాను. ఇంక స్పోకెన్‌ సందర్భాలు వచ్చినప్పుడు– రియాలిటీ చెక్‌ పుస్తకంలో చాలాచోట్ల... ఆజన్మం పుస్తకంలో కొన్ని చోట్ల... చింతకింది మల్లయ్య ముచ్చట, కాశెపుల్ల, చినుకు రాలినది, రెండో భాగం, గంగరాజం బిడ్డ, కొండ లాంటి కథల్లో సందర్భాన్ని బట్టి జీవితానికి చాలా దగ్గరగా ఉండే భాషను వాడగలిగానని అనుకుంటాను. అదొక్కటే నేను ఈ పురస్కారం అందుకోవడానికి అర్హత అనుకోగలిగేది.

గూడూరి సీతారాం పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటుచేయడమూ, దాన్ని మొదటగా నాకే ఇవ్వడమూ చాలా సంతోషంగా ఉంది. ఇది ఫార్మాలిటీ మాటగా చెప్పేదే కావొచ్చు. కానీ ఆ ‘మొదటి’ అనే మాట సంతోషాన్ని రెట్టింపు కూడా చేస్తోంది. దీన్ని ఏర్పాటుచేసిన సీతారాం గారి సంతానం గూడూరి వేణు గారికీ, సీతారాం తమ్ముడు రాఘవేంద్ర గారికీ, నాకు ఈ పురస్కారం ఇవ్వడానికి చొరవ చూపిన పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా ఈ వేడుకలో భాగమైన జూలూరు గౌరీశంకర్‌ గారికీ, ఆకునూరి శంకరయ్య గారికీ, గూడూరి ప్రవీణ్‌ గారికీ, గరిపెల్లి అశోక్‌ గారికీ... నిర్వహణలో భాగం పంచుకున్న మానేరు రచయితల సంఘం కవులు ఎలగొండ రవి, జిందం అశోక్, గోనె బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం గార్లకూ ధన్యవాదాలు. ఇంకా దీన్ని ముఖ్యమైన ఈవెంట్‌గా తలచి వచ్చిన ‘మీ అందరికీ’ కూడా!


(ఫొటోలు పంపిన నాగేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు.)



No comments:

Post a Comment