పారిస్ పవనాలు
తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్‌గా పేరున్న ‘ద పారిస్ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్ బుకర్ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్ పురస్కారం పొందిన పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి.
‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘ఫిక్షన్ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్‌ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్‌కు దూరమైన వ్లాదిమీర్ నబకోవ్. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్–బ్రిటిష్ రచయిత వి.ఎస్.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, జేమ్స్ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్ కింగ్, రేమండ్ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్’ విభాగంలో ప్రచురించింది పారిస్ రివ్యూ. జార్జ్ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్ కుందేరా, సైమన్ దె బువా, ఒర్హాన్ పాముక్, సల్మాన్ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్ ఆఫ్ పొయెట్రీ’గా రాబర్ట్ ఫ్రాస్ట్, టీఎస్ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్ ఎట్ వర్క్’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్ బెలామీ.
ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్ ప్లింప్టన్ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్ హ్యూస్... ప్లింప్టన్ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్.
ఫిలిప్ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్ బెకెట్, డేవిడ్ ఫాస్టర్ వాలెస్ లాంటి మహామహుల రచనలు పారిస్ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్‌లైన్ వ్యూస్ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్ విడాల్. ‘పారిస్ రివ్యూ చచ్చేంత బోర్ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్ జెస్సా క్రిస్పిన్. ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్ యాప్ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్ క్లాస్’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్ రివ్యూ’!
(Sakshi, 27-3-2023)
No comments:
Post a Comment