Friday, September 29, 2023

మా ఊరి ముచ్చట 1: ఒక వేదిక

మా ఊరి ముచ్చట 1: ఒక వేదిక

మూడేళ్ల కిందట (2020 అక్టోబర్‌) మా ఊరి (నర్సింగాపురం, చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) యువకులు కొందరు కలిసి ‘క్రీడ విజ్ఞాన కళా వేదిక’ అని ఏర్పాటు చేశారు. ఊరిలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ఉద్యోగార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ ఇవ్వడం, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం... ఇలాంటివి దాని కార్యకలాపాలు. మొత్తంగా ఊరిలో ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుచేయడం అనేది, లక్ష్యం. ఆ దిశగా మంచి సంకేతాలు కూడా కనబడుతున్నాయి. దాన్ని ప్రారంభించినప్పుడు నా అభిప్రాయాన్ని అడిగి, ఇలా వీడియోగా రికార్డ్‌ చేశారు. దాని లింక్‌ ఇక్కడ ఇస్తున్నా. దీన్ని రికార్డ్‌ చేసింది, ‘మై విలేజ్‌ షో’ టీమ్‌లో రైటర్‌గా ఉన్న మా ఊరి అనిల్‌ కంటె.


నా అభిప్రాయం: #KVKV

 

Thursday, September 21, 2023

ట్రూమన్‌ కపోటి: జర్నలిస్టు రచయిత


 జర్నలిస్టు రచయిత


ప్రపంచంలోని గొప్ప రచయితల్లో కొంతమంది వృత్తిరీత్యా జర్నలిస్టులుగా పనిచేశారు. ఒక రచయిత జర్నలిస్టు అయితే తన రోజువారీ ‘స్టోరీ’లకు కథనబలాన్ని ఇవ్వగలడు. కానీ తమలోని రచయితనూ, జర్నలిస్టునూ వేరుగా ఉంచుకోవడానికే చాలామంది ప్రయత్నించారు. అనివార్యంగా ఆ రెండు పాత్రలూ కలిసిపోయే సందర్భాలు రావొచ్చు. అయితే, పూర్తి స్పృహతో తనలోని రచయితతో జర్నలిస్టును మేళవించినవాడు ట్రూమన్‌ కపోటి. ఆ మేళన ఫలితంగా నాన్‌–ఫిక్షన్‌ నవల ఉద్భవించింది. సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియను ‘పరిచయం’ చేసిన ట్రూమన్‌ కపోటి (30 సెప్టెంబర్‌ 1924 – 25 ఆగస్ట్‌ 1984) శతజయంతి సంవత్సరానికి ప్రారంభం ఇది.

యూఎస్‌లోని లూసియానా రాష్ట్రంలో జన్మించిన ట్రూమన్‌ కపోటీ ఐదేళ్లప్పుడే బడికి నిఘంటువు మోసుకెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రచయిత అవుతాననుకున్నాడు. చాలామందికి జీవితం సగం ముగిసేదాకా తమకు ఏం కావాలో తెలీదు. కానీ తాను ఆ కోవలోకి చెందని ప్రత్యేక జీవినని కపోటికి తెలుసు. ‘ద న్యూయార్కర్‌’ సహా ఇతర పత్రికలకు పనిచేస్తూనే, కథలు రాశాడు. ఇరవైల్లోకి వచ్చేనాటికే ఆయన సెలబ్రిటీ. ‘ఆధునిక సాహిత్యపు ఆశాదీపం’ అని మెచ్చుకున్నాడు సోమర్‌సెట్‌ మామ్‌. ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’ (1958) నవలికతో కపోటి పేరు మార్మోగిపోయింది.

రోజూ కనబడే చంద్రుడు కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నాడు. 1959లో రష్యా చంద్రుడి మీద దిగింది. అదే ఏడాది అమెరికాలో పెరోల్‌లో ఉన్న ఇద్దరు నేరస్థులు కాన్సాస్‌లోని ఒక ధనిక రైతును దోచుకోవడానికి పథకం వేశారు. ఇంట్లోకి ప్రవేశించి, యజమాని, ఆయన భార్య, వాళ్ల ఇద్దరు కౌమార కూతుళ్లను బంధించారు. తీరా నగదు రూపంలో ఏమీ దొరకదు. కేవలం సాక్ష్యంగా మిగిలిపోతారని నలుగురినీ హత్య చేశారు. అది అమెరికాలో పెను సంచలనం సృష్టించిన నేరవార్తల్లో ఒకటి. దాని ఆధారంగా ఆరేళ్ల పరిశోధన అనంతరం ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ (1965) రాశాడు కపోటి. దీనికి వాడిన కథనాత్మక పాత్రికేయ టెక్నిక్‌ను ‘నాన్‌ఫిక్షన్‌ నవల’ అన్నాడు. జర్నలిజం, కథనం కలిసి కొత్త కళారూపానికి దారి తీయగలదని భావించాడు. సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు, వాస్తవ కథనం కోసం శ్రమ పడటం దేనికి అన్న వైఖరి కొందరు రచయితల్లో ఉంటుంది. సీరియస్‌ రచయితల కళాత్మక స్థాయికి జర్నలిజం తగనిది అన్న అభిప్రాయమూ ఉండకపోదు. ఇదంతా కాదన్నా, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వడగట్టి రచనలోకి తేవడం అంటే చాలా రకాలుగా సిద్ధపడాలి. ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’ తన క్యారెక్టర్‌నే పెట్టి రాశాడని ఒకావిడ 8 లక్షల డాలర్లకు తెచ్చిన (విఫల) దావాను ఎదుర్కొన్న చేదు అనుభవం అప్పటికే కపోటికి ఉంది. పైగా, ఎంత నిజజీవిత కథనానికైనా ఊహాశక్తి లేకపోతే ప్రాణం పోయలేము. ‘లిటెరరీ ఫొటోగ్రాఫర్‌’లా సూక్ష్మాంశాలను మనసులోకి ఎక్కించుకోవాలి. ‘హ్యూమన్‌ టేప్‌ రికార్డర్‌’లా మారాలి. మరి విషయ సేకరణ ఎట్లా? తలుపులు తట్టడం సరే, వాళ్ల మనసులను మీటడం ఎలా? కపోటి ముందు ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలా మాట్లాడితే అసౌకర్యం కాబట్టి, టేప్‌ రికార్డర్లు ఉపయోగించలేదు. వెళ్లేముందు ఒక సాధన చేశాడు: స్నేహితుడు ఓ పుస్తకంలోని పేజీలను చదివి వినిపిస్తాడు. దాన్ని కపోటి విని, తిరిగి రాసేవాడు. ‘దాదాపు 95 శాతం కచ్చితత్వం’ సాధించాడు. ఇన్ని చేసినా వార్తా కథనాలకు కాలం చెల్లిపోయే ప్రమాదం ఎక్కువ. వాస్తవ ఘటన ఒక తార్కిక ముగింపునకు వస్తే తప్ప రచనను ముగించలేం. ఈ సందర్భంలో తార్కిక ముగింపు అంటే, నేరస్థుల ఉరిశిక్ష అమలు కావడమే. రచయిత ఆ క్షణం కోసం ఎదురుచూడాలి. ‘ఇది హింస,’ అంటాడు కపోటి. ఆఖరికి 6,000 పేజీల నోట్సుతో– హంతకులు, బాధితులు, గ్రామీణ సమాజపు మనుషులు– మూడు కోణాల్లో చిత్రించిన 340 పేజీల ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ తక్షణ బెస్ట్‌ సెల్లర్‌గా, కపోటి అత్యుత్తమ రచనగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాన్‌–ఫిక్షన్‌ నవల అనే ప్రక్రియను తాను పరిచయం చేయడం అనడం కంటే, అప్పటికే ఉన్నదాన్ని తాను అత్యున్నత స్థితికి తీసుకెళ్లానని మాత్రమే అనేవాడు కపోటి.

చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, బంధువుల ఇంట్లో పెరిగాడు కపోటి. ఎప్పుడూ వ్యాకులతతో ఉండేవాడు. ఆయన ఒంటరితనంలో స్నేహపు సెలయేరు పొరుగున ఉండే హార్పర్‌ లీ. అనంతర కాలంలో ‘టు కిల్‌ ఎ మాకింగ్‌బర్డ్‌’ నవలా రచయిత్రి.  అందులోని ‘డిల్‌’ పాత్రను ఆమె కపోటి నమూనాగా తీర్చిదిద్దారు. కపోటి రచన ‘అదర్‌ వాయిసెస్, అదర్‌ రూమ్స్‌’లో ఇడాబెల్‌ పాత్రకు లీ ప్రేరణగా నిలిచారు. వారి బాల్య స్నేహం చివరిదాకా కొనసాగింది. ‘ఇన్‌ కోల్డ్‌ బ్లడ్‌’ క్షేత్రస్థాయి పరిశోధనలో లీ సహాయం చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు సాధించడంలో. హోమోసెక్సువల్‌ అని ప్రకటించుకున్న కపోటి, దాని తాలూకు తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తన జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశమే ఉంటే, వ్యాకులత లేకుండా చూసుకుంటానన్నాడు. ‘ఒక కథను ఎంత సహజంగా చెప్పవచ్చో ఆ రూపాన్ని రచయిత కనుక్కున్నాడనేదానికి పరీక్ష ఏమిటంటే– ఆ కథ చదివాక, నువ్వు దాన్ని ఇంకోలా ఊహించగలుగుతున్నావా లేక అది నీ ఊహను నెమ్మదించేలా చేసి, అదే సంపూర్ణమూ, అంతిమమూ అనిపిస్తోందా? ఒక నారింజ ఫలాన్ని ప్రకృతి సరిగ్గా ఎలా చేసిందో అలా’ అన్నాడు కపోటి. సాహిత్య జీవితం గురించి సరేగానీ, అరవై ఏళ్లు నిండకుండానే కన్నుమూసిన కపోటి జీవితం సంపూర్ణ ఫలమేనా అంటే చెప్పడం కష్టం!
 

Thursday, September 14, 2023

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కోసం నా మాటలు







ఫొటో రైటప్‌ (తలల క్రమం): ఆదిత్య, మంజుల, రహ్మానుద్దీన్‌ షేక్, సంవరుణ్‌(?), ఆదిత్య 2, మాధవ్, రాజిరెడ్డి, ‘కవనమాలి’, పవన్, పవన్‌ 2, శ్రీరామ్, శివగణేశ్, శ్రవణ్‌



ఆదిత్య అన్నావఝల, పూడూరి రాజిరెడ్డి


(నోట్‌ 1: ఎంచుకున్న వేదిక చాలా లైవ్లీగా ఉంది. అక్కడ, అక్కడి నుంచి చూస్తే కనబడేదంతా పాత హైదరాబాద్‌ నగరపు ఈస్తటిక్స్‌కు పూర్తి భిన్నం. ఇది నయా హైదరాబాద్‌. ఇలా కూడా బాగుంది.

నోట్‌ 2: పోగైంది అతి చిరు సమూహమే కాబట్టి, దాదాపు ముఖాముఖిలా నడిచింది. అందరూ నా పుస్తకాల గురించి ఎంత బాగా మాట్లాడారంటే, నేను వాటి గురించి చెబుదామనుకుని రాసుకెళ్లింది ఇక అనవసరమని వదిలేశాను.)


మీట్‌ అండ్‌ గ్రీట్‌

నిర్వహణ: ద తెలుగు కలెక్టివ్‌

ఆదివారం, 10 సెప్టెంబర్‌ 2023

మధ్యాహ్నం: 3– 6

స్థలం: WE హబ్- తెలంగాణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

ఆవరణ, హైదరాబాద్‌


స్పోకెన్‌ ప్రసంగాలు నేను చేయలేను; రిటెన్‌ ప్రసంగాలే నాకు చేతనవును.

‘నేను ఒక ఉపన్యాసం అయితే ఇవ్వను; ఊరికే ఎవరైనా అడిగితే దానికి నాకు తోచింది చెప్తాను, ఊరికే ఒక చిట్‌చాట్‌లాగా’ అన్న ప్రీ–కండిషన్‌ మీదే ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ తీరా ఆ ఇన్విటేషన్‌ పోస్టులో రాసిన భారీ మాటలు చూసి భయమేసింది. సాహిత్య ప్రస్థానం... రైటింగ్‌ స్టైల్‌... సహ రచయితలకు సూచనలు... బాబోయ్‌!

వచ్చి ఉత్త వెర్రిమొహం వేసుకుని కూర్చోకుండా ఈ నాలుగు మాటలు సిద్ధం చేసుకుని వచ్చాను.


మీట్‌ అండ్‌ గ్రీట్‌

ఒక వ్యవహారంగా మనుషులతో కలవాలంటే నాకు తెలియని భయం ఉంటుంది. పోయి ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పించడం, బండిని సర్వీస్‌కు ఇవ్వడం... అవెంత మామూలు విషయాలైనా సరే, నాకు చిన్న దడ ఉంటుంది లోపల. చాలామందికి మహా అయితే చిన్న చిరాకు ఉంటుంది కావొచ్చు, కానీ నాకు నిజంగా అదొక పెద్ద ఇష్యూ.

మనుషులతో ఏ వ్యవహారమూ లేక, ఊరికే రికామీగా కలవడం అయితే నాకు ఎప్పుడూ ఇంట్రెస్టింగే. ఎంతసేపైనా మాట్లాడగలను.

నేను ఇక్కడికి ఎందుకొచ్చాను అంటే– ఒక కొత్త గ్రూపుతో పరిచయం అవుతుంది. మనకు ఏమాత్రం తెలియని మనుషులు మనతో ఏం మాట్లాడదామని వచ్చివుంటారు? వాళ్లు ఏం చదువుతున్నారు? అసలంటూ ఏమైనా చదువుతున్నారా? నన్ను చదివితే, వాళ్లు ఆ విషయాలను ఎలా చూస్తున్నారు? ఇవన్నీ నాకు ఎక్కువ కుతూహలం. మీట్‌ అండ్‌ గ్రీట్‌ అని–– ‘ఇక్కడ’ కూర్చునేవాడి కోణంలో పెట్టివుంటారు గానీ నా ఉద్దేశంలో అక్కడ కూర్చునేవాళ్లను నేను మీట్‌ అయ్యి, గ్రీట్‌ చేద్దామని వచ్చాను.


నేను రచయితనేనా?

నన్ను నేను రచయితను అనుకోవచ్చా? టాల్‌స్టాయ్, చలం, భైరప్ప... ఇట్లాంటివాళ్లు రచయితలు అయినప్పుడు, మనల్ని మనం కూడా రచయితలం అని చెప్పుకోవచ్చా? అలా అనుకున్నప్పుడు ఎందుకు రాస్తున్నట్టు? 

ప్రపంచంలోని ప్రతివాడూ తన కథ చెప్పుకోవడానికి అర్హుడే. లేదా తనకు తెలిసిన కథ చెప్పడానికి అర్హుడే. ఎన్ని కథలు చెప్తాం, ఎంత బాగా చెప్తాం, ఎంతమంది వాటిల్లో తమను తాము చూసుకునేట్టుగా చెప్తాం అనేది వేరే చర్చ. కథ అంటే ఇక్కడ ఒక ప్రక్రియ అనుకోవద్దు. ఒక ఊసు. ఒక సంగతి. ఒక ముచ్చట. ఒక మనిషి, ఇంకో మనిషితో చెప్పుకోగలిగేది.

అది ఎవరైనా చెప్పొచ్చు. అట్లా నేనూ చెప్తున్నాను. మౌఖిక సాహిత్య దశలో లేము కాబట్టి, వాటిని రాస్తున్నాము. రాసే ప్రతి ఒక్కరినీ ఇప్పటి అర్థంలో రచయితే అంటున్నాం, కాబట్టి, నేనూ రచయితనే! సో, టాల్‌స్టాయ్‌ రచయితే, రాజిరెడ్డీ రచయితే. టాల్‌స్టాయ్‌ రాయనిది నేను ఏం రాయగలను?

చిన్న ఉదాహరణ చెప్తాను.

మామూలుగా బైక్‌ మీద లెఫ్ట్‌ టర్న్‌ అయితే షార్ట్‌ కర్వ్‌ తీసుకుంటాం. అదే రైట్‌ టర్న్‌ అయితే, లాంగ్‌ కర్వ్‌ చేయాలి. ఒకసారి ‘నవోదయ కాలనీ’లో పోతున్నప్పుడు, షార్ట్‌ కర్వ్‌లో మలిగేశాను. ఎదుటినుంచి వస్తున్నవాళ్లకు ఎదురెళ్లినట్టయింది. ట్వెంటీస్‌లో ఉన్నట్టున్నారు ఇద్దరు. వెనక ఉన్నతను, ‘అన్నా, నువ్వు అట్ల పోవాలి’ అన్నాడు. నేను అంతకుముందు నాకు తెలియకుండానే అట్లాగే చేస్తున్నాను కావొచ్చు, కానీ అది స్పృహతో చేసింది కాదు. ఇది జరిగిన తరవాత– అరే అవును కదా, ఇతను చెప్పింది నిజం, అనుకున్నా. చాలా చిన్న విషయమే కావొచ్చు, కానీ అది అప్పటినుంచీ నా వివేకంలోకి చేరింది. ఇంత అల్ప విషయమా అనుకోవచ్చు. ఇలాంటి అల్ప విషయాలే మన జీవితాన్ని అర్థవంతం చేస్తాయని నా నమ్మకం. అందుకే ఎంత చిన్న అనుభవానికైనా దానిదైన విలువ ఉంటుంది. ఇదెందుకు చెప్తున్నానంటే– సాహిత్యంలో అందరూ అన్నీ మాట్లాడేశారని అనుకుంటాం. కానీ ఎందరు ఎన్ని మాట్లాడినా ఇంకేదో మాట్లాడటానికి మిగిలిపోతూనే ఉంటుంది. 

అసందర్భమే కావొచ్చు. ఇంకో విషయం చెప్తాను. ఒకసారి లామకాన్‌లో ఒక స్వీడిష్‌ సినిమా వేశారు. కొత్త సినిమా. 2014లో వచ్చింది. స్వీడన్‌ అంటేనే బెర్గ్‌మన్‌ కదా. ఆయన అన్ని తీసిన తర్వాత, ఇంకా వీళ్లు ఏం తీసివుంటారా అన్న కుతూహలంతో వెళ్లాను. ఆ సినిమా పేరు: ఫోర్స్‌ మజూర్‌. ఇది కూడా బాగుంది. కాబట్టి ప్రతి రచయితా, ఆర్టిస్టు ఆ కాలానికి రిలవెంటే.


మానవోద్వేగ మహాసముద్రం

సాహిత్యం హ్యూమన్‌ కండిషన్‌ గురించి మాట్లాడుతుందంటారు కదా. అంటే ఏమిటి? నీకూ నాకూ మధ్య ఏం జరుగుతోంది? నాకూ ఇంకొకతనితో ఏం జరుగుతోంది? మనకు అయినవాళ్లు, బంధువులు, స్నేహితులు, పరిచితులు, కొన్నిసార్లు అపరిచితులతో కూడా కావొచ్చు... ప్రతి మనిషికీ, ఇంకో మనిషికీ మధ్య ఒక నిరంతర డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇంకో మనిషితో అన్నానుగానీ, మనిషి కూడా కానక్కరలేదు. మనిషితో ముడిపడినదైతే చాలు... కుక్క, చెట్టు, చెరువు... శ్రీశ్రీ అననే అన్నాడు కదా: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అని! ఈ డ్రామాలో వందలు, వేలు, లక్షలు, కోట్ల ఉద్వేగాలకు సంభావ్యత ఉంది. ఇది అసలు అనంతం. భూమి పుట్టినప్పటినుంచో, భూమ్మీద మనుషులు నడుస్తున్నప్పటినుంచో, లేదా మనుషులకు ఈ రకమైన స్పృహ వచ్చినప్పటినుంచో మనిషికీ మనిషికీ మధ్య ఎంత తమాషా నడిచివుంటుంది! ఇదంతా సాహిత్యంగా రావలసిందే. అది ఏ ప్రక్రియల రూపంలో వస్తుందనేది అంత ముఖ్యం కాదు. కానీ వచ్చింది, వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది.

మొత్తం సాహిత్యాన్ని నేనొక మానవోద్వేగాల మహాసముద్రంగా చూస్తాను. ఒక ఊహ చేయండి! మొత్తం ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాసిన సాహిత్య పుస్తకాలన్నీ ఒక నీటి బిందువుల రూపంలోకి కరిగిపోయి, అలలుగా తేలియాడుతూ, ఎల్లలు లేని సముద్రంగా పరుచుకుని ఉంటే ఎలా ఉంటుంది? కానీ ఈ మహాసముద్రం ఎంత పోసినా నిండేది కాదు; ఇంక చాలు అనేది కాదు. మనుషులు ఉన్నంతవరకూ వాళ్ల మధ్యలో సంభవించే సకల ఉద్వేగాలను ఇందులో పోయొచ్చు. ఒకరికి ఏం జరిగిందో ఇంకొకరికి తెలుస్తూనే ఉండాలి కదా. అట్లా తెలుసుకోవాలన్న కుతూహలం మానవ సహజం కదా. అందుకే మనం రాస్తుంటాం. రచయిత అనేవాడు రాస్తుంటాడు. వాడు మహారచయిత అయితే ఆ మానవోద్వేగ మహాసాగరంలోకి బిందెలు, ట్యాంకర్లతో ఉద్వేగ జలాన్ని కుమ్మరిస్తుంటాడు. నేను మరీ చంచాతో కాకపోయినా ఒక టీ గ్లాసుతో పోస్తుంటాను.

అట్లా పోసిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? సముద్రంలో నీళ్లు ఆవిరై తిరిగి వానరూపంలో నేల మీద కురిసినట్లు, ఈ ఉద్వేగాలన్నీ సామూహిక వివేకంగా మారి మానవ హృదయ సీమల మీద కురుస్తాయని అనుకుంటే ఈ ఉద్వేగాల పోలికకు ఒక లాజికల్‌ కంక్లూజన్‌ వస్తుంది.


నాకేం ఫిలాసఫీ ఉంది?

రచయిత అన్నాక ఒక ధార ఏదో ఉండాలి. చాలామందికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. గట్టి అభిప్రాయాలు, నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి. నాకు మొదటినుంచీ ఉన్నది ఏమిటంటే, గందరగోళం, డోలాయమానం. ఎవరు ఏది చెప్తే అందులోనూ కొంత పాయింట్‌ ఉందనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఒక ఫ్లోటింగ్‌ స్థితిలోనే ఉంటాను. ఇది స్థిరం, ఖాయం, కచ్చితం అనేది ఉండదు. స్థిరత్వం లేకపోవడం అంటే నా అభిప్రాయాలు బలహీనమైనవని కాదు, గాలివాటం అని కాదు. నా ఆలోచనలు ఎప్పుడూ తర్కానికి లోనవుతూనే ఉంటాయి. అదీ, ఇదీ అని లోపల చింతన నడుస్తూనే ఉంటుంది. ఇదీ అని ఒకటి గట్టిగా పైకి తేలదు. ఇప్పుడు ఒకటి ఇటు మాట్లాడుతుండగానే, ఇంకొకటి లోపల ఫామ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి, ఏ పాయింట్‌ దగ్గర నేను నిలబడాలి? 

నేను ఫలానా అని ఒక వాదంలోకి పోలేకపోవడానికి ఇదీ కారణం అనుకుంటాను. అందుకే నా రచనల్లో అన్ని వాదాల ప్రతిఫలనాలు ఉంటాయి. లేదా ఏ వాదాలు లేకపోవచ్చు. ఉన్నవాటికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. కానీ రాజిరెడ్డి ఏమిటి? దేనికి నిలబడతాడు? మీకు తెలుసో లేదోగానీ... మన విమర్శకులు, కవులు... ఫలానా రచయిత ఎటువైపున్నాడు? అని అడుగుతుంటారు. ప్రజల వైపున్నాడా? పేదల వైపున్నాడా? అని మాటల్లో ఉంటుంది. మాటలు చాలా ట్రిక్కీగా ఉంటాయి. పేదల వైపు ఉండను, మంచి వైపు ఉండను అని ఎవడైనా చెప్తాడా, చెప్పగలడా? కానీ ‘సారం’గా వాళ్ల దిక్కున్నామా లేదా; ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్లు బలపరిచే రాజకీయాలకు మనం మద్దతిస్తున్నామా లేదా అని చూడటమే వాళ్లు అడిగే ప్రశ్నకు అసలైన అంతరార్థం. ఆ అర్థంలో అయితే నేను ఎటువైపూ ఉండను. నా అనుభవంలో, నా తర్కంలో అప్పటికి నాకు నిగ్గుదేలింది మాత్రమే నా సత్యం. ఆ సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.

ఇంకా ముఖ్యమైనది, మనుషులు! మనుషులు ఎట్లా అంటే, మనం ఎంతో గొప్ప వాదం అనుకున్నదాన్ని కూడా ఎడమకాలితో తంతుంటారు. జీవితం చాలా రకాలుగా ఉంటుంది. ఆ మనుషుల బహుముఖీనతను, జీవితపు సంక్లిష్టతను, అర్థం కాలేకపోవడాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం.


ఎలా రాస్తే బాగుంటుంది?

పాలన్నీ ఒక్కటే, అన్నీ తెల్లగా ఉంటాయి అని మనకు చిన్నప్పుడు చెప్పారు. అందులోని సారం గ్రహించడం వరకు సరే. కానీ పెద్దయ్యేకొద్దీ అర్థమవుతుంటుంది– ఏ బర్రెపాలు ఇంకో బర్రెలా ఉండవు, ఏ బాయి నీళ్లు ఇంకో బాయిలా ఉండవు. అట్లాగే మనిషి కూడా. ఆ లిటిల్‌ డిఫరెన్స్‌ ఏమిటనేదే మనకు ముఖ్యం.

ప్రజల పక్షం, పేదల పక్షం అన్నప్పుడు– ఆ ప్రజలు అనేవాళ్లు ఎవరూ నీ కథల్లోకి రారు. వచ్చేది ఒకటో రెండో ముఖ్య పాత్రలు. వాళ్లను ప్రజలు అందామా అంటే కుదరదు. అయితే ఆయన చింతకింది మల్లయ్య అవుతాడు. లేదంటే లింగయ్య కొడుకు బుచ్చిరెడ్డి అవుతాడు. వాళ్లు వాళ్ల లెక్కనే ప్రవర్తిస్తారు గానీ ప్రజల్లా కాదు. ప్రజలు అనేది రాజకీయాల్లో నిజం కావొచ్చు గానీ, సాహిత్యంలో మాయ.

ఒక కమ్యూనిటీకి ప్రాతినిధ్య పాత్రలు ఉండటం దోషం కాదు. కానీ అప్పుడు కూడా అతడు ప్రజల్లో భాగం కాకుండా, విడిగా అతడిలాగే ఉంటాడు. నిర్దుష్టంగా అతడిలాగే ప్రవర్తిస్తాడు. దీనికోసం డీటెయిల్స్‌ ముఖ్యమవుతాయి. ఇవే ఏ పాత్రకైనా ప్రాణం. ఈ హాల్‌కు చేరడానికి అందరమూ ఒకే దారిలో వచ్చివుండొచ్చు. కానీ ‘ఆదిత్య’ను మన నుంచి వేరు చేసేది ఏమిటి? అది పట్టుకోవాలి. తను మాత్రమే గ్రహించగలిగింది రాయడం ద్వారా అది సాధ్యమవుతుంది.

ఆర్కే నారాయణ్‌ ఎక్కడో అన్నది చదివాను: ఒక దొంగ పాత్ర గురించి రాస్తుంటే నాకు ఆ పాత్ర మీద కూడా ప్రేమ కలుగుతుందీ అని. ఇలా దుష్టపాత్ర మీద ప్రేమ కలగడం మంచిదేనా? దీన్ని ఇంకోరకంగా చూడాలి. నీకు ఇష్టం లేని పాత్రకు కూడా ఇవ్వాల్సిన స్కోప్‌ ఇవ్వడం. అట్లా నేను రాస్తున్నానో లేదో నాకు తెలీదుగానీ, ఏకపక్షంగా ఒక్క వైపుకే కథను మళ్లించకుండా రాసేవాళ్లు నాకు ఇష్టం.


ఇవి సూచనలా?

వాదంలో రాయడం తేలిక, సోమరితనం. పైగా ఎంతోకొంత పేరు కూడా వస్తుంది. ఎందుకంటే, ఆల్రెడీ ఫ్రేమ్స్‌ ఫిక్స్‌ అయివున్నాయి. మీరు రాయగానే మన గ్రూపులోకి ఒకరు వచ్చారని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అది మీదా? మీ అనుభవం కూడా అదే చెప్తోందా? మీ సత్యం భిన్నంగా ఉంటే దానికి ఎదురు నడవగలరా? ఈ ప్రశ్నల మీద మీ సాహిత్యాన్ని మలుచుకుంటే... కనీసం మీకు మిమ్మల్ని ఒక కానుక చేసుకున్నవాళ్లవుతారు. ఇదొక్కటే ఎవరైనా రాయాలనుకుంటే నేను ఇవ్వగలిగే సలహా.


థాంక్యూ

నేను పొద్దున్నే పిల్లల్ని స్కూలు బస్సెక్కించడానికి వెళ్తాను. వస్తూ వస్తూ ఏవో కూరగాయలు తెస్తుంటాను. అప్పుడప్పుడూ గిర్నీకి వెళ్లి పిండి పట్టిస్తుంటాను. కత్తులు మొండిపోతే దారు పట్టించడానికి వెళ్తాను. నా భార్య ‘లైనింగ్‌’ క్లాత్స్‌ తీసుకుంటుంటే రోడ్డు మీద నిలబడి ఉంటాను. కుట్టు మిషన్‌ పాడైతే రిపేరుకు తీసుకెళ్తాను. ఈ ఏ సందర్భంలోనూ నేను రచయితను కాదు. ఒక సినిమా నటుడు సెట్‌లోనూ నటుడిగానే ఉంటాడు; రోడ్డు మీదికి వచ్చినా నటుడిగానే ఉంటాడు. కానీ రచయితలు అలాక్కాదు. 99 శాతం జీవితంలో రచయితగా ఉండం. ఆ మిగిలిన ఒక్క శాతం సందర్భం ఇలాంటి మీట్స్, గ్రీట్స్‌. నా రచయిత మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేయడానికి సంకల్పించిన ఆదిత్య(అన్నావఝల)కూ, ‘ద తెలుగు కలెక్టివ్‌’ టీమ్‌కూ, ఇక్కడికి వచ్చి నన్ను విలువైన మనిషిని చేసిన యువ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తెలుగు కలెక్టివ్‌ యానివర్సరీ ఈవెంట్‌కు నన్ను ప్రత్యేకంగా ఎంచుకోవడం నాకు మరింత గౌరవం. థాంక్యూ ఎగైన్‌.

Monday, September 4, 2023

నా అన్ని పుస్తకాలు...



నా అన్ని పుస్తకాలు ఇప్పుడు నవోదయా బుక్‌ హౌజ్‌‌లో (కాచిగూడ, హైదరాబాద్‌) దొరుకుతున్నాయి. పార్శిల్‌ కూడా పంపుతున్నారట.

1. మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్)
2. రియాలిటీ చెక్ (కొన్ని కిటికి ప్రయాణాలు)
3. చింతకింది మల్లయ్య ముచ్చట - ఇతర కథలు
4. ఆజన్మం (ఆత్మ కథాత్మక వచనం)

ఆన్‌లైన్ లింక్ ఇక్కడ:

https://www.telugubooks.in/search?type=product&q=puduri

Sunday, September 3, 2023

మెహెర్‌ను పరిచయం చేసిన పుస్తకం







నేను, అజయ్, మెహెర్‌



మెహెర్‌ను పరిచయం చేసిన పుస్తకం


మెహెర్‌ కొత్త పుస్తకం ‘పడి మునకలు’ బోధి ఫౌండేషన్‌ ద్వారా వెలువడింది. ఇంకే కామన్‌ గ్రౌండూ లేని మాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం అయ్యేలా చేసింది సాహిత్యమే. తను బ్లాగులో విరివిగా రాస్తున్న తొలి రోజుల్లో(2009) ప్రశంసించకుండా ఉండలేక ఒక కామెంట్‌ పెట్టాను. ఇది కూడా చెప్పుకోవాల్సిన విషయమా, అంటే, నేను మనుషుల పట్ల ఉదారంగా ఉంటాను గానీ, ఆ మనుషులు సాహిత్య జీవులైనప్పుడు వారిని ప్రశంసించడంలో నాకు చాలా పట్టింపులు ఉంటాయి. కాబట్టి నా ప్రశంసకు నాకు నేను చాలా విలువిచ్చుకుంటాను. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా రాయగలిగే వీలున్నప్పుడు, ఏదైనా రాసిపడేసి దాన్ని పలుచన చేయకుండా, ప్రధాన స్రవంతి పరిమితులను అధిగమించడం అనే స్పృహతో ‘ఏదైనా’ రాయగలిగే వీలును కల్పించుకున్నాడు మెహెర్‌. అలా తన రాతల్లో నేను కూడా ‘పడి మునకలు’ వేశాను. దీని సైడ్‌ ఎఫెక్ట్‌ ఏమిటంటే, అది మెహెర్‌ అంతటి రాత అయితే తప్ప ఇంకొకరిని మెచ్చుకోలేని స్థితి రావడం!

కథల కంటే ముందు మెహెర్‌ సాహిత్య వ్యాసాలే చదివాను. మెహెర్‌ను నాకు పరిచయం అయ్యేలా చేసిన తొలి వ్యాసాలు(‘దువ్వూరి స్వీయ చరిత్ర’, ‘‘కాఫ్కాయెస్క్‌’ని ఆవిష్కరించే ఒక వాక్యం’ లాంటివి) కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. తర్వాత కూడా రాసిన వ్యాసాలను కలుపుకొని(చివరివి 2022లో రాసినవి), వాటిల్లోంచి కొన్నింటిని వడగట్టుకుని, పద్ధతిగా కూర్చిన ఈ 200 పేజీల పుస్తకం వచ్చింది. ‘ఇంకేమనాలో తెలీక’ వీటిని వ్యాసాలు అనడమేగానీ– ఇవన్నీ ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రతిఫలనాలు, రీడింగ్‌ నోట్స్‌... పేరేదైనా ఇవన్నీ మెహెర్‌ సాహిత్య అవగాహనా విస్తృతిని తెలియజేస్తాయి. ఏ సీరియస్‌ సాహిత్య జీవి అయినా చదవాల్సిన పుస్తకం ఇది.

పీఎస్‌:
ఇవన్నీ నేను ఇంతకుముందు విడిగా చదివినవే. అయినా మళ్లీ మొదలుపెట్టాను. ‘పేదజనంలో దొస్తొయేవ్‌స్కీ కూడా ఒకడు’ వ్యాసంలో, ‘‘గదిలోకి అడుగుపెట్టగానే, ‘నాకు చప్పున రస్కోల్నికోవ్‌ ఉండే గది గుర్తొచ్చింది– అని తర్వాత రాసుకుంది’’ అని అనంతర కాలంలో భార్య అయి, దొస్తొయేవ్‌స్కీని అన్ని విధాలుగా కాచుకున్న అన్నా గ్రొగొర్‌యెవ్నాను ఉటంకించాడు మెహెర్‌. నాకెందుకో కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

(fb Post: 30th August 2023)