Sunday, August 4, 2024

Katherine Mansfield: బొమ్మరిల్లు


Katherine Mansfield


కేథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌(1888–1923) కథ ‘ద డాల్స్‌ హౌజ్‌’కు నా సంక్షిప్త అనువాదం ఇది. కేథరీన్‌ న్యూజిలాండ్‌లో జన్మించారు. 34 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసేప్పటికే ఎన్నో గొప్ప కథలు వెలువరించారు.

––

బొమ్మరిల్లు


బర్నెల్‌ కుటుంబంతో కొన్నాళ్లు ఉండి, పట్టణానికి తిరిగి వెళ్లాక, పిల్లలకు ప్రేమగా మిసెస్‌ హే ఒక బొమ్మరిల్లు పంపింది. అది ఎంత పెద్దదంటే కార్టర్, ప్యాట్‌ ఇద్దరూ పెరట్లోకి మోయాల్సివచ్చింది. ఎండాకాలమే కాబట్టి తడుస్తుందన్న భయం లేదు. దానికి చుట్టిన కవర్లు ఇంకా తీయకముందే, దాని గాఢమైన పెయింటు వాసన జబ్బు కలిగించేట్టుగా ఉందని అభిప్రాయపడింది అత్త బెరీల్‌. 

నున్నటి ముదురు పాలకూర రంగులో ఉన్న ఆ బొమ్మరిల్లు ప్రకాశవంతమైన పసుపు వెలుతురులో మరింత మెరిసిపోతోంది. దాని పైకప్పుకు ఎరుపు, తెలుపుల్లో రెండు చిమ్నీలు అంటించివున్నాయి. తలుపులు పసుపు వార్నిష్‌లో మెరుస్తున్నాయి. నాలుగు కిటికీలను ఆకుపచ్చ రంగుతో పేన్లుగా విభజించారు. ముందు కొంత పసుపు రంగు వరండా కూడా ఉంది. ఎంత చక్కటి బొమ్మరిల్లు! పెయింటు వాసనొస్తే ఏం? 

‘ఎవరైనా తెరవండి, తొందరగా!’

ప్యాట్‌ హుక్‌ తీయగానే ఇల్లు వెనక్కి వెళ్లిపోయింది. డైనింగ్‌ రూమ్, డ్రాయింగ్‌ రూమ్, కిచెన్, రెండు బెడ్రూములను ఒకే చూపుతో చూడొచ్చు. ‘ఓఓఓహ్‌!’ పిల్లలు అరిచారు. ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ల జీవితంలో ఇంతవరకూ ఇలాంటిది చూడలేదు. గదులన్నింటికీ వాల్‌పేపర్‌ అంటించివుంది. వాటిమీద బంగారు ఫ్రేముల్లో చిత్రాలుంచారు. కిచెన్‌లో తప్ప అంతటా రెడ్‌ కార్పెట్‌ పరిచివుంది. డ్రాయింగ్‌ రూమ్‌లో మెత్తటి సోఫాలున్నాయి. టేబుళ్ల మీదా, బెడ్స్‌ మీదా క్లాత్‌ వేసివుంది. ఊయల, స్టవ్, డ్రెస్సింగ్‌ టేబుల్, చిన్న ప్లేట్లు, ఒక పెద్ద జగ్గు... వీటన్నింటికన్నా కెజియా పాపకు బాగా నచ్చింది మాత్రం ల్యాంప్‌. తెల్లగా గుండ్రంగా ఉంది, డైనింగ్‌ రూమ్‌ మధ్యలో. వెలిగించలేముగానీ అందులో నూనె ఏదో నింపివుంది.

అమ్మ, నాన్న బొమ్మలు స్టిఫ్ఫుగా డ్రాయింగ్‌ రూములో కూర్చునివున్నాయి. వాళ్ల ఇద్దరు పిల్లలు పై అంతస్తులో పడుకునివున్నారు. ఎందుకో పిల్లలు ఈ ఇంటికి చెందినవాళ్లలా లేరు. కానీ ల్యాంప్‌ మాత్రం సరిగ్గా సరిపోయింది.

తెల్లారి బర్నెల్‌ పిల్లలు బడికి నడుస్తూ వెళ్లడం కష్టమైంది. బడి గంట మోగేలోగా అందరికీ చెప్పేయాలన్న ఆత్రం. ‘నేనే చెప్తాను, నేను మీకన్నా పెద్దదాన్ని’ అంది ఇసాబెల్‌. చిన్నవాళ్లిద్దరికీ ఒప్పుకోక తప్పలేదు. పెద్దవాళ్లుగా ఉండటంలో వచ్చే అధికారాలు ఏమిటో లాటీకీ, కెజియాకూ తెలుసుకాబట్టి ఏమీ మాట్లాడలేదు. ‘కాకపోతే మీరు నా తర్వాత మాట కలపొచ్చు’ అని వెసులుబాటు ఇచ్చింది ఇసాబెల్‌. ‘ఎవరిని ముందు చూడనివ్వాలో కూడా నేను నిర్ణయిస్తా’ అంది. ‘కావాలంటే అమ్మ ఎవరినైనా పిలవొచ్చంది’. బొమ్మరిల్లు ఎటూ పెరట్లోనే ఉంది కాబట్టి, స్కూల్లో ఇద్దరిద్దరినీ ఒకసారి ఇంటికి ఆహ్వానించొచ్చు. 

కానీ వాళ్లు చేరేసరికే బడిగంట మోగింది. టోపీలు తీసి వెంటనే వరుసల్లో నిలబడాల్సి వచ్చింది. ఏం ఫర్లేదు! తాను ఎంతో ప్రాధాన్యమున్న మనిషిలా ముఖం పెట్టి, వెనక అమ్మాయితో ‘ఆటల పీరియడ్‌లో చెప్పడానికి నా దగ్గర ఒక సంగతి ఉంది’ అని గుసగుసలాడింది ఇసాబెల్‌.

ఆటల పీరియడ్‌లో ఇసాబెల్‌ను అమ్మాయిలందరూ చుట్టుముట్టారు. ఆమె భుజం మీద చేయి వేయడానికి అందరూ పోటీపడ్డారు. ఈ గుంపుకు అవతల ఉన్నది ఇద్దరే అమ్మాయిలు. కెల్వీ కుటుంబీయులు.

నిజానికి ఆ ఊళ్లో మరో స్కూలంటూ ఉంటే బర్నెల్‌ పిల్లలు ఇక్కడికి వచ్చేవారే కాదు. కానీ మైళ్ల దూరంలోనూ మరోటి లేదు. దాని ఫలితం ఏమిటంటే, అన్ని స్థాయులవాళ్లూ ఈ బడికి రావాల్సిందే. న్యాయమూర్తి చిన్నారి కూతుళ్లూ, డాక్టర్‌ బిడ్డలూ, దుకాణదారు పిల్లలూ, ఆఖరికి పాలుపోసేవాళ్ల పిల్లలు కూడా. మరి వీళ్లందరి మధ్యా ఎక్కడో ఓ గీత గీయాలి కదా! అది కెల్వీల దగ్గర గీయబడింది. బర్నెల్‌ పిల్లలతో సహా చాలామందికి వాళ్లతో మాట్లాడటానికి కూడా అనుమతి లేదు. అందుకే కెల్వీలను ఎవరూ తమలో కలుపుకోరు.

కెల్వీలు ఇల్లిల్లూ తిరిగి బట్టలు ఉతికే ఆమె పిల్లలు. వాళ్లాయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. జైలులో ఉన్నాడని చెప్పుకుంటారు. కెల్వీ చిన్నారులు వేరేవాళ్లు దానంగా ఇచ్చిన గుడ్డముక్కలతో కుట్టిన బట్టలు తొడుక్కున్నారు. బొద్దుగా ఉండే ‘లిల్‌’(లిటిల్‌) బర్నెల్‌ వాళ్లు ఇచ్చిన టేబుల్‌క్లాత్‌ లాంటి బట్టతో కుట్టిన గౌను వేసుకుంది. దానికి లోగన్‌ వాళ్లు ఇచ్చిన తెరలతో స్లీవులు కుట్టివున్నాయి. ఆమె పెట్టుకున్న టోపీ ఒకప్పుడు మిస్‌ లెకీ వాడింది. ఇక చిన్నది, బక్కపలుచటి ‘మన ఎల్స్‌’(అవర్‌ ఎల్స్‌) తెల్ల నైట్‌గౌను లాంటిది వేసుకుంది. ఎల్స్‌ జుట్టు పొట్టిగా కత్తిరించివుంది. కళ్లు చాలా పెద్దవి. కానీ వాటిల్లో భయం ఉంటుంది. తెల్ల గుడ్లగూబ! ఆమె నవ్వగా ఎవరూ చూడలేదు. నోరూ తెరవదు. అక్క లిల్‌ ఎటు వెళ్తే అటు గౌను పట్టుకుని వెంట పోతుంది. రోడ్డు, స్కూలు, మైదానం... ఏదైనా కావాలంటే గౌను పట్టుకుని గుంజుతుంది. అప్పుడు లిల్‌ ఆగి వెనక్కి చూస్తుంది. చెల్లికి ఏం కావాలో ఆమెకు అర్థమైపోతుంది.

ఇసాబెల్‌ తన స్నేహితురాళ్లతో బొమ్మరిల్లు గురించి గొప్పగా చెబుతోంది. కార్పెట్లు, మంచాలు... ‘నువ్వు ల్యాంప్‌ సంగతి మరిచిపోయావక్కా’ గుర్తుచేసింది కెజియా. ‘ఓ, అవును’ అని చెప్పడం మొదలుపెట్టింది ఇసాబెల్‌. కానీ దాని గొప్పతనం సగమైనా చెప్పలేదనుకుంది కెజియా. సాయంత్రం ఏ ఇద్దరిని పిలవాలన్న ధ్యాస మీదుంది ఇసాబెల్‌. ఎమ్మీ కోల్, లీనా లోగన్‌ ఆ అదృష్టవంతులు. కానీ అందరికీ తెలుసు, తమ వంతు రేపైనా వస్తుందని. అందుకే ‘ఇసాబెల్‌ నా ఫ్రెండు’ అని గొప్పలకు పోతున్నారు. లిల్, ఎల్స్‌ మాత్రం తలదించుకుని వెళ్లిపోయారు.

కొన్ని రోజులు గడిచేసరికి అందరి నోళ్లలోనూ అదే మాట. ‘నువ్వు బర్నెల్‌ వాళ్ల బొమ్మరిల్లు ఇంకా చూడలేదా?’ లంచ్‌ టైములో, ప్లే గ్రౌండులోనూ ఇవే మాటలు. 

ఒకరోజు భోంచేస్తున్నప్పుడు, ‘అమ్మా, నేను కెల్వీలను ఇంటికి పిలవొచ్చా?’ అడిగింది కెజియా.

‘కచ్చితంగా వద్దు.’ ‘ఎందుకొద్దు?’ ‘కెజియా, ఎందుకొద్దో నీకు తెలుసు.’

చివరికి లిల్, ఎల్స్‌ తప్ప అందరూ బొమ్మరిల్లు చూశారు.

ఒకరోజు పైన్‌ చెట్ల కింద కూర్చుని పిల్లలు భోంచేస్తున్నారు. లిల్, ఎల్స్‌ దూరంగా కూర్చున్నారు. విషయం అటూయిటూ మారి కెల్వీలు పెద్దయ్యాక ఏమవుతారు అన్నదాని మీదకు మరలింది. ‘లిల్‌ కచ్చితంగా పనిమనిషి అవుతుంది’ గుసగుసగా అంది ఎమ్మీ కోల్‌. ‘నేను ఆమెను అడగనా?’ అంది లీనా లోగన్‌. ‘నువ్వు అడగలేవు’ పందెం కాసింది జెస్సీ మే. ‘నువ్వు పెద్దయ్యాక పనిమనిషివి అవుతావట నిజమేనా?’ అరిచింది లీనా. ఎల్స్‌ తినడం ఆపి చూస్తోంది. జవాబివ్వకుండా అవమానంగా నవ్వింది లిల్‌.

బడయ్యాక గుర్రపుబగ్గీలో ఇసాబెల్, లాటీ, కెజియా ఇంటికి వెళ్లిపోయారు. బట్టలు మార్చుకున్నారు. కెజియా దొంగతనంగా ఇంట్లోంచి బయటపడి గేటు మీద ఊగుతోంది. ఉన్నట్టుండి రోడ్డు వైపు చూస్తే చిన్న బిందువులేవో కనబడ్డాయి. నెమ్మదిగా అవి పెద్దవై రోడ్డువైపే వస్తున్నాయి. లిల్, ఎల్స్‌. ముందు సంకోచించింది కెజియా. కానీ తర్వాత ‘హలో’ అని పలకరించింది. ఊహించని పలకరింపుకు వాళ్లు విస్తుపోయారు. ‘కావాలంటే మీరు బొమ్మరిల్లు చూడొచ్చు’ అంది కెజియా. లిల్‌ తల అడ్డంగా ఊపింది. ‘ఎవరూ చూడట్లేదు’ అంది కెజియా. అయినా లిల్‌ అలాగే నిలబడింది. లిల్‌ గౌను లాగింది ఎల్స్, చిట్లించిన కళ్లతో. చెల్లిని అనుమానంగా చూసింది లిల్‌. మళ్లీ గౌను లాగింది ఎల్స్‌. కెజియా దారి చూపుతుండగా ఇద్దరూ పెరటిలోకి వెళ్లారు. అక్కడుంది బొమ్మరిల్లు! లిల్‌ గట్టిగా గాలి పీల్చింది. ఎల్స్‌ రాయిలా నిలబడింది. మెల్లిగా ఓపెన్‌ చేసింది కెజియా. ‘ఇది డ్రాయింగ్‌ రూమ్, ఇది డైనింగ్‌ రూమ్‌...’ 

‘కెజియా!’ బెరీల్‌ అత్త అరుపు. తను చూస్తుంది నమ్మలేనట్టుగా ఆమె ముఖం. ‘వాళ్లను పిలవడానికి ఎంత ధైర్యం నీకు?’ ‘పొండి, అవతలికి పొండి పిల్లలు’ కోడిపిల్లల్లా తరిమింది.

సిగ్గుతో కంపిస్తూ, లోపలికి కుంచించుకుపోతూ వాళ్లు బయటికి పరుగెత్తారు. బర్నెల్‌ ఇల్లు కనబడనంత దూరం వచ్చాక ఓ చోట కూలబడ్డారు. లిల్‌ చెంపలు ఎరుపెక్కాయి. ఎల్స్‌ అక్క దగ్గరికి జరిగి కూర్చుంది. దూరంగా గుర్రాలశాల, పాలు పితకాల్సిన ఆవులు... క్షణంలో ఎల్స్‌ ఆ గద్దింపు మనిషిని మరిచిపోయింది. అక్కను లాగుతూ అందంగా నవ్వింది. ‘నేను ల్యాంపును చూశాను’ అంది మృదువుగా.


(సాక్షి సాహిత్యం; 2018 మే 7)







 

No comments:

Post a Comment