Tuesday, December 31, 2024

పుస్తకం హస్తభూషణం

 


మంచినీళ్ల కుండ


‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్‌!’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్య కశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ చదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుక్కు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.

అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతక కర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హృదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.

మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తలమీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్‌ లిటెరసీ ట్రస్ట్‌’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతి రోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దార్లు మూస్తున్నట్టే!

ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ డిసెంబర్‌ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్‌ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్‌ ఫెయిర్‌. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్‌ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్‌. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం, రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్‌ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి.

 (Sakshi: December 16th, 2024)

Tuesday, December 3, 2024

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా



Isaac Bashevis Singer

 

నోబెల్‌ పురస్కారం పొందిన ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌ కథ ‘ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా’కు సంక్షిప్త రూపం. 1973లో ద న్యూయార్కర్‌ పత్రికలో ఈ కథ తొలిసారి ప్రచురితమైంది. ఇందులో పరుచుకునే ఉండే శాంతి నాకు బాగా నచ్చింది. దీన్ని కె.బి.గోపాలం గారు కూడా ‘అమెరికా కొడుకు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

–––––––

ద సన్‌ ఫ్రమ్‌ అమెరికా


అదొక చిన్న పల్లె. పేరు లెంట్షిన్‌. దాన్నిండా గుడిసెలు, పూరిపాకలు. మధ్యనే పొలాలు. అందులో కూరగాయలు పండిస్తారు. మేకలు పెంచుతారు.

ఒక చిన్న గుడిసెలో బెర్ల్‌ ఉంటాడు. ఆయన వయసు ఎనబై దాటింది. రష్యా నుండి తరిమివేయబడి పోలండ్‌కు వచ్చి స్థిరపడిన యూదు కుటుంబాల్లో వీరిదీ ఒకటి. బెర్ల్‌ పొట్టివాడు. గడ్డం తెల్లబడింది. ఏ కాలమైనా తలమీద గొర్రెచర్మం టోపీ పెట్టుకుంటాడు. ఆయనకో అర ఎకరం పొలం ఉంది. ఆవు, మేక, కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి.

బెర్ల్‌ భార్య బెర్ల్‌చా. ఆమె ముఖం క్యాబేజీ ఆకులాగా ముడతలు పడివుంటుంది. సగం చెవుడు. ప్రతీ మాటను రెండుసార్లు చెప్పాలి.

బెర్ల్‌ దంపతులకు ఒక కొడుకు. పేరు శామ్యూల్‌. నలబై ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. అక్కడ లక్షలు సంపాదించాడని ఊళ్లో చెప్పుకుంటారు. పోస్ట్‌మాన్‌ బెర్ల్‌ ఇంటికి అప్పుడప్పుడు మనీయార్డర్, ఉత్తరం తెచ్చిస్తుంటాడు. ఆ ఉత్తరంలో చాలా మాటలు ఇంగ్లీషులో ఉంటాయి, కనుక ఎవరూ దాన్ని చదవలేరు.

శామ్యూల్‌ పంపించిన డబ్బును తండ్రి ఎక్కడ పెట్టాడన్నది ఎవరికీ పట్టదు. ఆ గుడిసెలోనే బల్ల, మాంసం అర, పాలవస్తువుల షెల్ఫ్, రెండు మంచాలు, మట్టి పొయ్యి ఉంటాయి. బయట చలిగా ఉంటే కోళ్లు పొయ్యి పక్కనే చేరతాయి. ఊళ్లో కలిగినవాళ్ల ఇంట్లో కిరోసిన్‌ దీపాలు ఉన్నాయి. బెర్ల్‌ వాళ్లకు కొత్త వస్తువులంటే నమ్మకం లేదు. సబ్బత్‌కు మాత్రం బెర్ల్‌చా కొవ్వొత్తులు కొంటుంది. 

దంపతులు సూర్యోదయంతో నిద్ర లేస్తారు. కోళ్లతో పాటు నిద్రకు ఉపక్రమిస్తారు. ఒక ఆవు దూడను ఈనింది, ఒక యువ జంటకు పెళ్లయింది లాంటి సంగతులు తప్ప లెంట్షిన్‌లో మరేమీ జరగవు.

శామ్యూల్‌కు కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. వాళ్ల పేర్లన్నీ చిత్రంగా ఉంటాయి. అందుకే ముసలి దంపతులకు గుర్తుండవు. పేర్లలో ఏముంది? అమెరికా సముద్రానికి అటువైపు ఉంటుందట. అది ప్రపంచం అవతలి అంచు. ఊరికి వచ్చిన ఒక తాల్మూడ్‌ టీచర్, అమెరికా వాళ్లు బుర్ర నేలకు, కాళ్లు పైకి పెట్టి నడుస్తారని చెప్పాడు. అదెట్లా కుదురుతుంది? చెప్పింది టీచర్‌ కనుక అది నిజమే అయివుండాలి.

ఒక శుక్రవారం ఉదయాన బెర్ల్‌చా సబ్బత్‌ రొట్టెల కొరకు పిండి పిసుకుతోంది. అప్పుడు తలుపు తీసుకుని ఒక పెద్దమనిషి లోపలికి వచ్చాడు. పొడుగ్గా ఉన్నందున వంగి రావలసి వచ్చింది. వెంట వచ్చిన బండి మనిషి రెండు తోలు సూట్‌కేసులు తెచ్చాడు. బెల్‌చా ఆశ్చర్యంగా కళ్లెత్తింది. బండిమనిషికి అతను వెండి రూబుల్‌ అందిస్తూ, ఇద్దిష్‌లో ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అన్నాడు. తర్వాత, ‘అమ్మా’ అని పిలిచాడు. ‘నేను శామ్యూల్‌ని. శాన్‌’. బెల్‌చా కాళ్లు మొద్దుబారాయి. పెద్దమనిషి ఆమెను కౌగిలించుకున్నాడు. నుదుటిని ముద్దాడాడు. బెల్‌చా కోడిపెట్టలాగా కిచకిచలాడింది. ‘మా బాబే’ అంది.

అప్పుడే బెర్ల్‌ కొట్టం నుండి లోపలికి వచ్చాడు. ఆయన చేతుల నిండా కట్టెలున్నాయి. వెంట మేక కూడా ఉంది. పెద్దమనిషిని చూసి బెర్ల్‌ కట్టెలు కింద పడేశాడు. ఆ పెద్దమనిషి బెల్‌చాను వదిలి బెర్ల్‌ను వాటేసుకున్నాడు. ‘నాన్నా!’ బెర్ల్‌కు నోటమాట రాలేదు. కాసేపటికి ‘నువ్వు శామ్యూల్‌వా?’ అని అడిగాడు. ‘అవును నాన్నా. నేను శామ్యూల్‌ని’. ‘చల్లగా బతుకు నాయనా’ అని కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. అప్పటికీ ఆయనకు నమ్మకం కుదరడం లేదు. శామ్యూల్‌ ఈ మనిషంత పెద్దగా లేడు. అయితే అబ్బాయి అమెరికా వెళ్లినప్పుడు అతడి వయసు పదిహేనేళ్లని గుర్తొచ్చింది. ‘నువ్వొస్తున్నట్టు మాకు చెప్పనేలేదు’ అన్నాడు బెర్ల్‌.

‘నా కేబుల్‌ మీకు అందలేదా?’ అడిగాడు శామ్యూల్‌. అదేమిటో బెర్ల్‌కు అర్థంకాలేదు.

‘ఇదంతా చూసేవరకు నేను బతుకుతానని అనుకోలేదు. ఇప్పుడిక ఆనందంగా చస్తాను’ అన్నది బెర్ల్‌చా.

బెర్ల్‌ ఆశ్చర్యపోయాడు. సరిగ్గా ఈ మాటలే తానూ అనబోయాడు.

కాసేపైన తర్వాత బెర్ల్‌ ‘పేశ్చా, నువ్వు సబ్బత్‌ కొరకు మామూలు పులుసుతో పాటు మంచి డబుల్‌ ఫుడింగ్‌ కూడా చేయాలి సుమా’ అన్నాడు. బెర్ల్‌ తన భార్యను సొంతపేరుతో పిలిచి కొన్నేళ్లయి వుంటుంది. ఆమె కళ్ల నుంచి పసుపు నీళ్లు కారాయి. దృశ్యం అలుక్కుపోయింది. ‘ఇవ్వాళ శుక్రవారం. నేను సబ్బత్‌ కోసం తయారీలు చేయాలి’ అంది. ఆమె మళ్లీ రొట్టెల కోసం పిండి పిసకవలసివుంది. మరి ఇలాంటి చుట్టం వస్తే మరింత మంచి పులుసు కాయవలసి ఉంటుంది! మొదలే చలిరోజులు. చీకటి పడేలోగా పని జరగాలి.

అమెరికా నుంచి బెర్ల్‌ కొడుకు వచ్చాడన్న శుభవార్త ఇరుగుపొరుగుకు తెలిసింది. పలకరించడానికి వచ్చారు. గది నిండా మనుషులే. ఆడవాళ్లు బెర్ల్‌చాకు పనిలో సాయం పట్టారు. ఆమె కొవ్వొత్తులు ముట్టించింది. అప్పుడిక తండ్రి, కొడుకు వీధి అవతల ఉన్న చిన్న సినగాగ్‌కు బయల్దేరారు. కొడుకు పెద్ద అంగలుగా నడుస్తున్నాడు. ‘నెమ్మదిరా’ అంటూ బెర్ల్‌ హెచ్చరించాడు. ఊరంతా మంచు కప్పుకుని వుంది. కిటికీల్లోంచి కొవ్వొత్తుల వెలుగు కనిపిస్తోంది. ‘ఇక్కడ ఏమీ మారలేదు’ అన్నాడు శామ్యూల్‌.

వచ్చేసరికి బెర్ల్‌చా బియ్యంతో చికెన్‌ పులుసు చేసింది. చేపకూర వండింది. మాంసం, క్యారెట్‌ పులుసు సిద్ధం చేసింది. కుటుంబం కలిసి తాగారు, తిన్నారు. నిశ్శబ్దంలో చిమ్మెటల రొద వినబడుతోంది.

చివరి ప్రార్థన తర్వాత అడిగాడు శామ్యూల్‌: ‘నాన్నా, నేను పంపిన డబ్బంతా ఏం చేశావు?’

బెర్ల్‌ తన తెల్లటి కనుబొమ్మలను ఎగరేస్తూ, ‘ఇక్కడే వుంది’ అన్నాడు.

‘బ్యాంకులో వేయలేదా?’

‘లెంట్షిన్‌లో బ్యాంకు లేదు.’

‘మరి డబ్బులు ఎక్కడున్నాయి?’

బెర్ల్‌ తటపటాయించాడు. సబ్బత్‌లో డబ్బు తాకడం తప్పు. అయినా చూపిస్తానంటూ మంచం కిందకు వంగి బరువైనదేదో బయటికి లాగాడు. ఒక బూట్‌. దాంట్లో పైన గడ్డి కుక్కివుంది. అది తీసేశాడు. నిండా బంగారు నాణేలు!

‘నాన్నా బోలెడు సొమ్ము!’ 

‘సరే’

‘ఎందుకు ఖర్చు పెట్టలేదు?’

‘దేనికని? దేవుడి దయ. మాకు అన్నీ ఉన్నాయి.’

‘ఎక్కడికన్నా వెళ్లివుండవచ్చు కదా!’

‘ఎక్కడికి? ఇదే మన ఇల్లు’.

‘డబ్బు ఏమవుతుంది మరి?’

‘నువ్వే పట్టుకుపో.’

బెర్ల్‌ దంపతులకు నెమ్మదిగా కొడుకు అమెరికన్‌ యిద్దిష్‌ అలవాటవుతోంది. బెర్ల్‌చా కొడుకు మాటలు బాగా పోల్చుకుంటున్నది. ‘మనం ఇక్కడ ఒక పెద్ద సినగాగ్‌ కట్టొచ్చు’ అన్నాడతను. ‘ఉన్న సినగాగ్‌ పెద్దదే’ జవాబిచ్చాడు బెర్ల్‌.

‘ముసలివాళ్ల కొరకు ఒక ఇల్లు కడితే?’

‘ఎవరూ వీధుల్లో పడుకోవడం లేదు.’

మరుసటి రోజు సబ్బత్‌ భోజనం తర్వాత బెర్ల్‌ దంపతులు కాసేపు నడుం వాల్చారు. మేక కూడా కునికిపాట్లు పడుతున్నది. కొడుకు కోటు వేసుకుని, టోపీ పెట్టుకుని నడకకు బయల్దేరాడు. కోటు జేబులో చెక్‌బుక్, రుణపత్రాలు చేతికి తగిలాయి. అతడు ఏవో పెద్ద పథకాలు వేసుకుని వచ్చాడు. అమ్మానాన్నలకు సూట్‌కేస్‌ నిండా బహుమతులు తెచ్చాడు. ఊరివాళ్లకు ఏదైనా సాయం చేయాలనివుంది. న్యూయార్క్‌లోని లెంట్షిన్‌ సొసైటీ నుండి కూడా డబ్బు తెచ్చాడు. కానీ ఈ ఊరికి ఏదీ అవసరం లేదు. దూరంగా సినగాగ్‌లో ప్రార్థనలు వినబడుతున్నాయి. 


(సాక్షి సాహిత్యం; 2018 జనవరి 1)




 

Sunday, December 1, 2024

సాహిత్య సందళ్లు



సాహిత్య సందడి


సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ  సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్‌ మీట్‌ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావుడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్‌ ఫోకస్‌ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.

సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్‌ పురస్కార ప్రకటన. అక్టోబర్‌ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌కు నోబెల్‌ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్‌ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్‌ ఏసియన్‌ ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్‌ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్‌ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో ‘ఫ్రాంక్‌ఫర్ట్‌ బుక్‌ ఫెయిర్‌’ జరిగింది. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్‌ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్‌ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్‌ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్‌ కోసం ఐదు నవలల షార్ట్‌ లిస్ట్‌ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి. పురస్కార ప్రకటన నవంబర్‌ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్‌ ఫెస్టివల్‌’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్‌ లిస్ట్‌ ప్రకటించింది. విజేతలను డిసెంబర్‌ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్‌ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఆరవ ఎడిషన్‌ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్‌ కపూర్, సల్మాన్‌ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్‌ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.

ఇక, ‘ముంబయి లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నవంబర్‌ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్‌ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్‌ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్‌’ను ఫోకస్‌ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్‌ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది. ‘ద మెటమార్ఫసిస్‌’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్‌ అమెరికా రచయిత గాబ్రియేల్‌ గార్సియా మార్వె్కజ్‌. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్‌ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్‌ రిక్రియేషన్‌ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నవంబర్‌ 29 నుంచి మూడ్రోజుల పాటు డెహ్రడూన్‌లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్‌ ఝా, సుజయ్‌ ఘోష్, హుస్సేన్‌ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు.

లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్‌’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్‌ ఫెయిర్‌’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు.

(11-11-24)