Tuesday, January 28, 2014

రియాలిటీ చెక్ రివ్యూ: ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...

రియాలిటీ చెక్ పుస్తకం మీద సాక్షి సాక్షిత్యం పేజీలో జనవరి 25, 2014న వచ్చిన సమీక్ష:


రియాలిటీ చెక్...

మంచి పుస్తకం

ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...

కలం భుజాన వేసుకొని బయల్దేరడం కష్టమే అందరికీ. ఎవరు వెళ్తారు -చెప్పండి. ఒకనాడు ఒక శ్మశానానికి, ఒకనాడు ఒక శవాల గదికి, ఒకనాడు పొగలు చిమ్మే కిక్కిరిసిన సిటీబస్సు తొడతొక్కిడిలోకి, ఒకనాడు ఒక వేసవి ఎండ వడగాడ్సులోకి, ఒకనాడు ఒక సెక్స్ వర్కర్ ఎదుట కూచుని ఆమె చెప్పే ఒకరాత్రి 17 సార్ల మృగరతి అనుభవంలోకి, ధైర్యం కావాలి. ధైర్యమేనా? ప్రేమ కావాలి, చేతులు సాచి కావలించుకునే గుణం. ఎవరూ చూడకుండా కన్నీరు కార్చుకునే కరుణ. అయ్యో... అయ్యో... అని గుండెలు బాదుకునే స్పందన. దానిని వ్యాఖ్యానించగల తాత్త్వికత.

పూడూరి రాజిరెడ్డి ఇవన్నీ తాను పడి తన వాక్యం వల్ల, తన కలానికి ఉన్న లెన్సుల వల్ల, ఆ లెన్సు మాత్రమే చిత్రిక పట్టే దృశ్యాల వల్ల మనకు చూపించాడు 'రియాలిటీ చెక్'లో. సాక్షి ఫన్ డేలో సూపర్ హిట్ కాలమ్ ఇది. వారం వారం వచ్చింది. ప్రతి వారం రాజిరెడ్డి ఏదో ఒక పరిచిత, అపరిచిత ప్రాంతానికి వెళ్లి మనకు పరిచితమైన సంగతిలోని అపరిచితమైన విశేషాన్ని అపరిచితమైన విశేషంలో అతి పరిచితమైన మానవ సహజ స్వభావాలను చూసి అబ్బుర పరుస్తాడు. ఇదంతా పిచ్చిలా ఉంది- పాతరోజుల్లో జర్నలిజమే ఒక వెర్రి అనుకునే జర్నలిస్టులు ఇలా చేశారు- ఇవాళ ఎవరు చేస్తున్నారు అనంటే? అప్పుడూ నదులు పారాయి. రేపూ పారుతాయి. కొత్తతరం వచ్చి కొత్తగా గోపురాలెక్కి అరచి అరచి చూపిస్తుంది లోకాన్ని- ఇటు చూడండి అని. యాభైకి మించిన వారాలు హైదరాబాద్లోని యాభైకి మించిన తావుల్లో రాజిరెడ్డి కూలబడి కూచుని ఏం చూశాడో చెప్పాడు ఇందులో.

ఇది వర్తమానమా. ఇలాగే గతం లేదూ? ఇలాగే భవిష్యత్తు ఉండదూ? మరి దీనిని ఎందుకు చదవాలి. మనల్ని మనం చూసుకొని మనం మాత్రమే ఇలా కాదు అందరూ ఇలాగే ఉన్నారు అనుకొని ఊరట చెందడానికి, బాధ పడే వాళ్లను చూసి బాధ పడ్డానికి, ధైర్యంగా ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చు కోవాడానికి ఇది ఒక వైద్యం. లేదా సుఖమయమనుకునే దొంగ గంతలు కట్టుకున్నవారిని ఈడ్చుకెళ్లి తప్పనిసరిగా ఎక్కించాల్సిన రోగం. మన చుట్టూ ఎలా ఉందో తెలుసుకోకపోతే ఎలా? వార్తల చాటున దాగిన కథలు ఇవి, రచయితలకు పట్టని సజీవ చిత్రాలు. మంచి వచనానికి ముఖం వాచిన వాళ్లు దీనిని చదివి పాయసం చేసుకొని తిని అమ్మయ్య అనుకోరూ. తెలుగును ఎవరూ కాపాడనక్కర్లేదు. అదే ఎవడిదో ఒకడి కడుపులో దూరి తనను తాను కాపాడుకుంటుంది. అందుకొక సాక్ష్యం కూడా ఈ పుస్తకం. దీనిని చాలా అందంగా ఖర్చుతో తెనాలి ప్రచురణల వాళ్లు పుస్తకంగా తెచ్చారు. మంచితో మిలాఖత్ అయ్యేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. వయసాచ్చిన పిల్లలందరి చేత దీనిని చదివిస్తే ఎలా ఉంటుందంటారు? పోనీ పి.జి కుర్రాళ్లందరినీ బెత్తంతో కొట్టి చదివిస్తే? మన సమాజపు రియాలిటీ తెలిసి దారిలో పడరూ?

 

రియాలిటీ చెక్: పూడూరి రాజిరెడ్డి

తెనాలి ప్రచురణలు

హార్డ్ బౌండ్ ఎడిషన్

నెల: రూ.250

ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

వివరాలకు: 9550930789

 


No comments:

Post a Comment