Monday, November 29, 2021

కళ - మనిషి

ఆజన్మం పుస్తకం వచ్చిన తర్వాత రాసింది. ప్రచురణ: ఈమాట

కళ - మనిషి

ఉండాల్సిన మనిషి



(సాకం నాగరాజ గారికి డెబ్బై యేళ్లు వచ్చిన సందర్భంగా చిన్న అభినందన సంచిక వేస్తున్నామనీ, మీరు ఏదైనా రాయాలనీ నామిని ఫోన్ చేశారు. చిన్న పీస్ రాసి పంపాను. దేనికైనా ఒక హెడ్డింగ్ పెడతాం కదా, అలా ఒకటి పెట్టాను. అయితే, ఈ సంకలనం మొత్తానికి తాను ఒక పేరు ఎలాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాడో సరిగ్గా నేను అలాంటిదే పెట్టానని సంతోషపడ్డారు నామిని. అలా నా శీర్షికతోనే పుస్తకం వచ్చింది.)


ఉండాల్సిన మనిషి


సాకం నాగరాజ గారితో నాకు పరిచయం ఉందని చెప్పలేను. అసలు అలాంటివారితో ఎవరికైనా పరిచయం ఉంటుందా! అలాగని ఉండకుండానూ ఉంటుందా? వాళ్లు ఒక ప్రవాహంలా కదిలిపోతుంటారు. నామిని చెప్తూవుంటాడు: ఆయన మా ఇంటికొస్తాడా, నాతో ఒక్క మాటా మాట్లాడడు సా; ఇక్కడినుంచి కోట పురుషోత్తంకు ఫోన్‌ చేస్తాడు. మళ్లీ కోట పురుషోత్తం ఇంటికి వెళ్తాడా; అక్కడినుంచి మా ఇంటికి ఫోన్‌ చేస్తాడు. ఇదీ సాకం. ఆయన అంతటా ఉంటాడు; ఎక్కడా ఉండడు. బహుశా ఈ హైరానా ఆయన జీవలక్షణం కావొచ్చు. ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉండేవాళ్లకు మాత్రమే ఉండే హడావుడి.


నెత్తిన గంప ఉన్నవాడు వడివడిగా నడుస్తాడు. అయితే ఆ బరువు ఆయన స్వచ్ఛందంగా మోపుకున్నదే. అందువల్లే ఆయన చాలా పుస్తకాలు వేయగలిగాడు. వాటిని కొరియర్‌ డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ పంపుతాడు. తెలుగు కథకు జేజే, రైతు కథలు, విరామం, డిగ్రీ విద్యార్థులకు ప్రపంచ కథలతో మొదలుకొని నిన్నా మొన్నా సింగమనేని నారాయణ నివాళి పొత్తం దాకా. వీటి సంకలనం వెనుక నామిని ఉన్నాడేమో అని నా అనుమానం. కానీ ఎవరు వెనకున్నా, పుస్తకం చిన్నదైనా, పెద్దదైనా ఎవరో ఒకరు ముందుండి చేయగలిగితేనే జరిగే పనులు ఇవన్నీ. అట్లాంటి గట్టి సంకల్పం సాకం.


ఆయన్ని మొదటిసారి తిరుపతిలో జరిగిన వర్తమాన కథ–2009 ఆవిష్కరణ సభలో చూశాను.  నేను అదే మొదటిసారి తిరుపతి వెళ్లడం. నా చింతకింది మల్లయ్య ముచ్చట కథ అందులో వేశారు. అప్పటినుంచీ మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మన సాకం ఉన్నాడులే అనే భరోసా కలిగింది. ఆ ఆవిష్కరణ వల్లే నామిని, కోట, ఆర్‌ఎం(ఉమామహేశ్వరరావు) పరిచయం కలిగింది. చిత్రంగా ఈ పదేళ్లలో సాకం కంటే వీళ్లందరితోనే నేను మాట్లాడింది ఎక్కువ. అందుకే అన్నాను, ఆయనతో ఎవరికీ పరిచయం ఉండే అవకాశం లేదని. పోతూ ఉండటమే ఆయన స్వభావం. పూర్తిగా పాతకాలం మనిషి. కానీ ఈ భూమ్మీద ఉండాల్సిన మనిషి.


– పూడూరి రాజిరెడ్డి

మార్చ్‌ 2021

 

Sunday, November 28, 2021

వారిదైన వ్యక్తీకరణ


 

వారిదైన వ్యక్తీకరణ


‘బ్రదర్స్‌ కరమజవ్‌’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు– గ్లాసు తీసిన తర్వాత టేబుల్‌ క్లాత్‌ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్‌. అంత సున్నితమైన గమనింపును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్‌ చేసుకోవడానికి ‘ద క్యాచర్‌ ఇన్‌ ద రై’లోని హోల్డెన్‌ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్‌ ఇచ్చిన వివరం అది. ‘ది  ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్‌ ఎందుకు పుట్టించాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఆ పసి రాకుమారుడు కాంతిగల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం– నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుపాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది భాస్కర రామాయణం. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు విష్ణుమాయా విలాసములో రోసనూరి వేంకటపతి. ఇక గయోపాఖ్యానములో రామనామాత్యుడు– ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు.

చలికాలంలో రైల్వే స్టేషన్‌లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్‌ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు వంగి దండం పెట్టే కొడుక్కు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిణి చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం, మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ; ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది.

సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించివుంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావొచ్చు. వాటికవే విలువైనవే కావొచ్చు. కానీ వాడీ వాడీ అరగదీయడం వల్ల పాతకంపు కొడతాయి.

ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్‌ వాజ్‌ ఎ డార్క్‌ అండ్‌ స్టార్మీ నైట్‌’(అదొక చీకటి తుఫాను రాత్రి) అనే వాక్యం ఎక్కడినుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుఫాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూహలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్‌ డైజెస్ట్‌’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్‌ రచయిత ఎడ్వర్డ్‌ బుల్వర్‌ లిట్టన్‌ 1830లో రాసిన ‘పాల్‌ క్లిఫ్పోర్డ్‌’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్‌ న్యూయార్క్‌’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్‌ ఇర్వింగ్‌ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరిస్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్న కథల పితామహుడు అని చెప్పే ఎడ్డార్‌ అలెన్‌ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు.

‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండటమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండుకోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్‌ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం.

(ప్రచురణ: 22 నవంబర్ 2021)



Saturday, November 27, 2021

ఎల్లలు దాటించే కళ




ఎల్లలు దాటించే కళ



నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువ మంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియజేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాలీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్‌ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం.

గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ మనకు కావాల్సినవాడే. గోర్కీ ఎక్కడో రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో కూడా సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో ఎక్కడో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఎక్కడో ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్‌ కుమార్‌ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం.

బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా తన అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో, ఎందుకు తపిస్తాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి దాన్ని ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్‌ కవిత్వాన్ని ఇంకో భాషలోకి అనువదించలేమంటారు. అది నిజమే కావొచ్చు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు కనీసం సువాసన అయినా పీల్చే అవకాశం లేకుండాపోతుంది కదా. దీనికి భిన్నంగా, అనువాదకుల వల్ల కూడా ఆ లక్ష్యభాషలు అభివృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన అనేది ఒక కళ అయితే, అనువాదం కూడా దాదాపుగా అంతకు తగ్గని కళ.

బహుశా ఆ స్వీయాభిమానంతోనే కాబోలు, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్‌ ఆన్‌ ద కవర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక చిరు ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్‌ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్‌ ఆథర్స్‌’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా ప్రసార మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు దీనికి సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్‌ గిల్డ్‌’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది.

ఇక్కడొక సంగతి ప్రస్తావించాలి. సుమారు యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజు సొమ్మును రచయితతోపాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్‌’ పుస్తకానికిగానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్‌ రచయిత్రి ఓల్గా తొకార్చుక్‌ పేరును కవర్‌ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్‌ క్రాఫ్ట్‌ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే ఇది అనువాదం అని తెలియకుండా ఉండేందుకు అదో చిన్న యుక్తి అనేది కొంతమంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్‌ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్‌ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం.

భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు అడిగినా అనువాదకుడి పేరు కవర్‌ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్‌ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. బహుశా కవర్‌ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియజెప్పడానికి కావాల్సిన డ్రైవ్‌ ఇవ్వడానికీ కారణం కాగలదేమో.

‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ని’ అన్నాడు స్పానిష్‌ రచయిత సెర్వాంటెజ్‌. కదా! అందువల్లే ఆయన ‘డాన్‌ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అనువాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు.

(ప్రచురణ: అక్టోబర్ 25, 2021)


 

Friday, November 26, 2021

‘శ్రవణ’ మేఘాలు

 



‘శ్రవణ’ మేఘాలు


చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం.


పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించేవాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ తన జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. ఆరుబయట వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లల గుంపును పోగేసుకుని కథల మీద కథలు చెప్పేవారు. పురాతన మానవులు తాము వేటాడి తెచ్చిన జంతువును విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. బహుశా మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, అంతకంటే ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. వాడకట్టు అనుభవంగానో, యావత్‌ గ్రామ అనుభవంగానో విస్తరించింది.


కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం అనేది పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్‌ గూటెన్‌బెర్గ్‌ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చిట్టచివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూపమిచ్చాడు. రెండూ విడి విడి అంశాలే అయినా, రెండింటి సామ్యం మనిషి మనో ప్రపంచ విస్తరణకు తోడ్పడటం! అయినా మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని అమాంతం మింగేసింది.


మరి పెరిగిన సాంకేతిక జ్ఞానం ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది ఒక అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, కుర్చీలో తలవాల్చి, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి.


అంధులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్‌ బుక్స్‌) సంకల్పించాడు థామస్‌ ఆల్వా ఎడిసన్‌ 1877లో. కానీ 1952లో న్యూయార్క్‌ కేంద్రంగా గల క్యాడ్‌మాన్‌ రికార్డ్స్‌ వాళ్లు కవి డైలాన్‌ థామస్‌ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్‌’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్‌ మార్కెట్‌ పరిధిని 2019లో 2.67 బిలియన్‌ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు.


మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్‌లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్‌ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్‌ కంపెనీ ‘స్టోరీటెల్‌’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్‌ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్‌ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ‘ఆడిబుల్‌’ పేరుతో ఈ ఆడియో బుక్స్‌ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీకే పరిమితమైంది.


చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది.


(ప్రచురణ: సెప్టెంబర్ 27, 2021)

Thursday, November 25, 2021

యుద్ధము–అశాంతి

సాక్షి సోమవారం ఎడిటోరియల్ కోసం రాజకీయాలకు ఆవల కొత్తగా కళ, సాహిత్యం, సంస్కృతి అంశాల పరిధిలో ఏదైనా రాయాలని నిర్ణయమయ్యాక, నా వాటాగా నెలకొకటి రాయాల్సి వస్తోంది. అందులో భాగంగా రాసిన మొదటి ఎడిట్ ఇది. ప్రచురణ: ఆగస్టు 30, 2021





యుద్ధము–అశాంతి


ప్రపంచం తన గురించి తాను రాసుకోగలిగితే గనక, అది టాల్‌స్టాయ్‌లాగా రాస్తుంది, అంటాడు ఐజాక్‌ బేబెల్‌. అదే ప్రపంచం తన గురించి ఒకే ఒక్క నవల రాసుకుంటే గనక, అది కచ్చితంగా ‘వార్‌ అండ్‌ పీస్‌’ అవుతుంది. పన్నెండు వందల పేజీలు, ఐదు వందలకు పైగా పాత్రలు, ఇందులో కనీసం 160 మంది చరిత్రలో వాస్తవమైన మనుషులు, ప్రతి పాత్రకూ తనదైన వ్యక్తిత్వం, ఆహార్యం, దృక్కోణం లాంటి భయపెట్టే వివరాలకు తోడు, తన కాలానికి అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లి టాల్‌స్టాయ్‌ ఈ మహానవలను రాశాడు. ఇది రెండు రకాల ఫీట్‌. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకోవడంతో పాటు వాటన్నింటినీ గతంలో భాగం చేయడం! పైగా ఈ బృహత్‌ నవలను టాల్‌స్టాయ్‌ తొమ్మిది సార్లు తిరగరాశాడంటారు. ఆ అన్నిసార్లూ కూడా టాల్‌స్టాయ్‌ చేతిరాతను అర్థం చేసుకుంటూ ఆయన భార్య సోఫియా దాన్ని ఫెయిర్‌ చేసింది. అలా ఈ మహా నిర్మాణానికి ఆమె కూడా రాళ్లెత్తిన కూలీ.


తొలుత టాల్‌స్టాయ్‌ దీనికి పెట్టిన పేరు: 1805. జారిస్టు రష్యాను నెపోలియన్‌ నేతృత్వంలోని ఫ్రాన్స్‌ ఆక్రమించిన 1805–1812 నాటి కాలాన్ని చిత్రించిన ఈ నవల తొలిభాగం 1863లో ప్రచురితమైంది. చరిత్ర పుస్తకాలు, తత్వశాస్త్ర పాఠాలు, డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ శోధించి, క్రిమియన్‌ యుద్ధంలో సైనికుడిగా తన అనుభవాలను జోడించి, చరిత్రనూ కల్పననూ కలగలుపుతూ, తన యౌవనశక్తిని అంతా రంగరించి టాల్‌స్టాయ్‌ సృజించిన ఈ నవల వంద కెమెరాలు మోహరించినట్టుగా యుద్ధ బీభత్సాన్ని ప్రతి కోణం నుంచి చూపుతుంది. వేలాది మంది చచ్చిపోతారు, మాస్కో తగలబడుతుంది, జనాలు బళ్లు కట్టుకుని దొరికిన సామాన్లు వేసుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోతారు, ఇవ్వాళ్టి యుద్ధంలో గెలిచిన సైనికుడు రేపు ఓడిపోతాడు. గుడారాల్లో కాగితం మీద గీసుకునే గీతలు, కార్యక్షేత్రంలో పూర్తి భిన్న తలరాతను రాస్తాయి.

జీవితానికో అర్థవంతమైన లక్ష్యం ఏర్పరుచుకోవడానికి విఫలయత్నాలు చేసే పియరీ(పీటర్‌), రష్యన్‌ విలాస సమాజం పట్ల విసిగిపోయిన ఆంద్రేయ్‌(ఆండ్రూ), చురుకైన బాలిక నుంచి పొందికైన ప్రౌఢగా పరిణామం చెందే నటాషా ప్రధాన పాత్రలుగా, బెష్కోవులు, బోల్‌కోన్‌స్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, డ్రౌబెట్‌స్కాయ్‌లు అనే ఐదు కులీన కుటుంబాల మధ్య గల సంబంధాల భూమికగా రాసిన ఈ నవలలో టాల్‌స్టాయ్‌– ఆర్టిస్టు, సైకాలజిస్టు, తాత్వికుడు, చరిత్రకారుడిగా భిన్న పాత్రలు పోషిస్తాడు. పూర్తి నవలా లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ– యుద్ధ సన్నివేశాలను మాంటేజ్‌ షాట్స్‌లా చూపడం, ప్రతి సన్నివేషాన్ని ఎవరో ఒకరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పడమనే శిల్పపరమైన పనితనం టాల్‌స్టాయ్‌ను గొప్ప దృశ్యమాన రచయితగా నిలబెడుతాయి.

అది సూడాన్, ఇరాక్, కశ్మీర్, అఫ్గానిస్తాన్‌ ఏదైనా కావచ్చు; రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అన్నట్టుగా, ఈ ప్రపంచం నిత్య సంక్షోభం, కల్లోలం. అయితే, నెపోలియన్‌ చక్రవర్తి అంతటివాడే అయినాసరే, అతడు కోరుకున్నంత మాత్రాన యుద్ధం రాదు; ఒకవేళ అతడు ఆపాలనుకున్నా ఆపలేడు. మనం ఇచ్ఛా స్వాతంత్య్రాలు అనుకునేవి భ్రాంతి జన్యం. ఇంద్రియ గోచరం కాని పరాధీనత అనేది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఎన్నో శక్తులు ఎన్నో రీతుల్లో ప్రవర్తిస్తున్న తుది పర్యవసానం ఈ వర్తమానపు వాస్తవం. నవల చివరన టాల్‌స్టాయ్‌ చేసే ప్రతిపాదనలు ఈ ప్రపంచ నడతకు మనల్ని ఏకకాలంలో బాధ్యులుగానూ, బాధితులుగానూ నిలబెడతాయి. అయితే ఈ యుద్ధం ‘అనివార్యం’ అవుతున్నప్పుడు కూడా, సామాన్య మానవుడు తన రోజువారీ జీవన సంరంభంలో భాగం అవుతున్నాడు. అదే అతడి ధిక్కార ప్రకటన. ఆ యుద్ధ శాంతులను సమాంతరంగా చిత్రించడమే జీవితానికి టాల్‌స్టాయ్‌ ఇచ్చిన భరోసా!

టాల్‌స్టాయ్‌ రుషుల పరంపరలోని రచయిత. అందుకే గాంధీజీ లాంటి మరో రుషితుల్యుడిని దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ‘టాల్‌స్టాయ్‌ ఫార్మ్‌’ నెలకొల్పేలా ప్రభావితం చేయగలిగాడు. మరింత సమకాలీనం కావడమే గొప్ప రచనల లక్షణం. అట్లా ఈ కాలానికి కూడా అవశ్యమైన రచన ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం కావడంతోపాటు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా, సంగీత రూపకాలుగా, నాటకాలుగా, రేడియో నాటకాలుగా ఎన్నో రూపాల్లో ఇది ప్రపంచంలోని శూన్యాన్ని భర్తీ చేస్తూనేవుంది. దీన్ని ఒక్కసారైనా చదవడం ఏ సీరియస్‌ పాఠకుడికైనా జీవితలక్ష్యం లాంటిది కావడంలో తప్పేమీలేదు. దాన్నే మరోసారి పురిగొల్పుతోంది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్‌ లీ.

కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో ఈ అనిశ్చిత జీవితంతో విసుగెత్తి, అందివచ్చిన ఆన్‌లైన్‌ ఆయుధాన్ని అర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంది లీ. మనుషులను కలిసే వీల్లేని సంక్షోభ కాలంలో, అంతరంగాలకు చేరువయ్యేలా సామూహిక పఠనానికి పిలుపునిచ్చింది. దానికిగానూ ఆమె ఎంచుకున్న నవల: వార్‌ అండ్‌ పీస్‌. ‘పబ్లిక్‌స్పేస్‌’ ఆధ్వర్యంలో 2020 మార్చ్‌ 18 నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాల్‌స్టాయ్‌ అభిమానులు భాగమయ్యారు. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం చేశారు. 85 రోజుల్లో మొత్తం నవల పూర్తయ్యింది. ఆ పఠనానుభవాలతో ‘టాల్‌స్టాయ్‌ టుగెదర్‌: 85 డేస్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఈ సెప్టెంబర్‌ 14న అది విడుదల కానుంది. అదే కాదు విశేషం, ఈ ఉత్సాహంతో మరో విడత పఠనానికి ఆ తెల్లవారి, సెప్టెంబర్‌ 15 నుంచి సిద్ధమవుతున్నారు. పాల్గొనడానికి అర్హత ఆ పుస్తకం చేతిలో ఉండటమే!

తెలుగులో కూడా రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు చేసిన అనువాదం ‘యుద్ధము–శాంతి’ మన ముందుంది. ఆ మధ్య ‘సాహితి’ వారి రీప్రింట్‌ కూడా వచ్చింది. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి పనికి పూనుకోవచ్చు.