Saturday, January 21, 2023

జిబ్రాన్‌ వాణి

 ప్రవక్త వాణి


అల్‌ముస్తఫా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. పన్నెండేళ్లుగా ఉంటున్న ఆర్ఫాలీస్‌ ద్వీప నగరాన్ని ఇక విడిచిపెట్టాలి. సముద్రాన్ని దాటిస్తూ తన జన్మస్థలానికి తిరిగి చేర్చగలిగే సరైన(?) ఓడ వచ్చేస్తోంది. కానీ నగరవాసులు ఆయన్ని వదిలిపెడతారా? వియోగం వచ్చేంతవరకూ ప్రేమలోని లోతు తెలియదు కదా! నువ్వు మాకు అతిథివి కావు, మాలో ఒకడివి, మాకు ప్రియమైనవాడివి, మా కలలకు కలలిచ్చేందుకు నీ యవ్వనాన్ని ధారబోసినవాడివి, నువ్వు ఎలా వెళ్లగలవని వాళ్లు నిలదీయరా? తనకోసం చాలులోనే నాగలి వదిలేసివచ్చిన మనిషికి ఏం జవాబివ్వాలి? తనకోసం ద్రాక్షసారా యంత్ర చక్రాన్ని ఆపి పరుగెత్తుకొచ్చినవాడికి ఏం చెప్పాలి? హృదయం విరగకాసిన పళ్ల చెట్టయి వాటన్నింటినీ రాల్చితే? వారి పాత్రలను కోర్కెల జలధారై నింపితే? సర్వేశ్వరుడి శ్వాసను తనలోంచి పోనిచ్చే వేణువు అయితే? నిశ్శబ్దాల్లో కనుగొన్న నిధిని మాటల ద్వారా పంచితే? వారిని సముద్రపు అలలు వేరుపరచకముందే వీడ్కోలు చెప్పడానికి ఒకరి వెంట ఒకరు రావడంతో అక్కడ గుంపు పోగైంది. అలా విడిపోబోయే రోజే సమావేశపు రోజు కూడా అయ్యింది. అందరూ నెమ్మదిగా మందిరం వైపు అడుగులు వేశారు. మందిరంలోంచి యోగి అల్‌మిత్ర బయటికి వచ్చింది. వాళ్లందరి తరఫునా ఆమె మేము మా పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు చెప్పుకొనేలా జనన మరణాల మధ్యలి సత్యాన్ని తెలియజేయమని కోరింది. జనంలో గమనించిన సత్యాన్ని జనానికే చెప్పడానికి పూనుకొంటాడు అల్‌ముస్తఫా.

లెబనాన్‌ మూలాలున్న అమెరికన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌(6 జనవరి 1883–10 ఏప్రిల్‌ 1931) రచన ‘ద ప్రాఫెట్‌’కు ఇదీ భూమిక. నూరేళ్లుగా అన్ని ప్రపంచ భాషల్లోకీ మళ్లీ మళ్లీ అనువాదమవుతూ, ఇప్పటికీ కొత్త ఆసక్తి రేపుతున్న ఈ మహత్తర రచన 1923లో ప్రచురితమైంది. వచన కవిత్వం రూపంలో జిబ్రాన్‌ తన పాఠకులకు ఎన్నో అంశాల మీద సున్నితమైన దృక్కోణాన్ని ఇస్తారు. ‘ప్రేమ’తో మొదలైన సంభాషణ–  తాపీమేస్త్రి, నేత కార్మికుడు, సత్రం నిర్వాహకుడు, పిల్ల తల్లి, న్యాయమూర్తి ఇలా ఒక్కొక్కరూ తమ సందేహాలను తీర్చమనడంతో అల్‌ముస్తఫా–– పెళ్లి, పిల్లలు, కాలం, జ్ఞానం, మంచి, చెడు, ప్రార్థన, దయ, ఆనందం, అందం, మతం, ఇవ్వడం... ఇలా అన్నింటికీ సమాధానాలు ఇస్తూపోతాడు. స్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వని ప్రేమ ప్రాధాన్యతను ప్రేమగా చెబుతాడు. మీ పిల్లలు మీ పిల్లలు కాదు; వాళ్లు మీ ద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు; వాళ్లు మీతో ఉన్నప్పటికీ మీకు చెందరంటాడు. నీకు ఎంతో ప్రియమైనవాళ్లు ఆ ఇంటిలో నివసిస్తారన్నట్టగా ఒక ఇంటిని నిర్మించమని చెబుతాడు. ఆకలి కోసం ఒక సీమరేగిపండు తిన్నాకూడా దాని విత్తనాలు నీ శరీరంలో పెరుగుతాయన్నంత స్పృహతో ఆ పనిచేయమని చెబుతాడు. ఆనందమూ దుఃఖమూ వేర్వేరు కాదు; నీ హృదయానికి సాంత్వన ఇచ్చే వేణువు కూడా కత్తి గాట్లకు గురైందని అంటాడు. జీవితాన్ని ఎంత సుతారంగా, సుందరగా సమీపించవచ్చో అత్యంత మృదువుగా, సరళంగా వివరిస్తాడు.

స్వయంగా చిత్రకారుడు కూడా అయిన జిబ్రాన్‌ పుస్తకంలోని పన్నెండు చిత్రాలను స్వయంగా గీశారు. విడుదలైన సంవత్సరం ప్రచురించిన రెండు వేల కాపీలకుగానూ 1,500 మాత్రమే అమ్ముడుపోయింది. కానీ ఆ తర్వాత అది పునర్ముద్రణలు వరుసగా పొందుతూనే ఉంది. లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం ఒక దశలో వారంలో సగటున 5,000 కాపీలు ఎక్కడో ఓచోట అమ్ముడవుతూనే ఉంది. ఈ నూరేళ్లలో ఏ ఒక్క సందర్భంలోనూ ఈ చిరుపొత్తం అచ్చులో లేకుండా లేదు. ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించేట్టుగా రాయడం వల్ల ఇది తరచుగా బహుమానాలు ఇచ్చుకునే పుస్తకంగా కూడా ఉంటోంది. అయితే మేధావులు మాత్రం దీన్నొక పంచదార పాకంగా భావించకపోలేదు.

‘శాండ్‌ అండ్‌ ఫోమ్‌’, ‘ద వాండెరర్‌’ లాంటి ఇతర ప్రసిద్ధ రచనలు కూడా వెలువరించిన జిబ్రాన్‌– అరబిక్, ఆంగ్లం రెండు భాషల్లోనూ రాయగలరు. ఆయన్ని బహాయీ, సూఫీ మతాలు విశేషంగా ఆకర్షించాయి. వాటి అంతస్సారమైన నిశ్శబ్దం, ప్రేమ ‘ద ప్రాఫెట్‌’ నిండుగా పరుచుకొని ఉంటాయి. చిత్రంగా జిబ్రాన్‌ తల్లిదండ్రులు క్రైస్తవులు. తాతల కాలంలో ముస్లింలు. అలా అన్ని మతాలనూ ఇముడ్చుకునే గుణం ఆయనకు చిన్నతనంలోనే అలవడింది. అందుకే ఒక చోట నేను నీ మసీదులో, నీ చర్చిలో, నీ సినగాగ్‌లో కూడా ప్రార్థిస్తాను అంటాడు. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే అన్ని మతాల మధ్య సమన్వయం జరగాలన్న భావన ఆయనది. దానికి కావాల్సిన హృదయ వైశాల్యాన్ని పెంచేదిగా ఈ పుస్తకం ఉంటుంది.  ప్రతి ఒక్క చెడుకూ ప్రతి ఒక్కరూ బాధ్యులేనన్న సామూహిక ఇచ్ఛ ఇందులో దర్శనమిస్తుంది. వ్యాపారంలో ప్రేమ, కరుణపూరిత న్యాయం చూపకపోతే, అది కొందరి దురాశకూ, మరికొందరి ఆకలికీ కారణమవుతుందని చెబుతుంది.

అల్‌ముస్తఫా నిజానికి వెళ్లింది స్వస్థలానికేనా? తన కాలం ముగిసి, మళ్లీ మరో జీవితపు చక్రానికి సిద్ధం చేసే సముద్రాన్ని దాటాడు. ఇప్పుడిక జీవితం అనేది ఒక కల. అనంత శక్తి ప్రవాహంలో లిప్తకాలపు జీవులం మనం. ఈ భావన మనశ్శాంతినీ, సాంత్వననూ ప్రసాదిస్తుంది. జీవితం నుంచి ఒక విముక్త భావనను కలిగిస్తుంది. ముఖ్యంగా మతాల్లోని అసలైన ఆధ్యాత్మిక గంధం ఇగిరిపోయి, కేవలం అవి బల ప్రదర్శనలకు మాత్రమే పనికొస్తున్నప్పుడు– అన్ని జీవుల్లోనూ దేవుడిని చూసుకోవడమనే ప్రాచ్య భావనను రేకెత్తిస్తుంది. పుస్తకం ఒక పంచదార పాకమే కావొచ్చు. కానీ ఈ కల్లోల ద్వేషాల కాలంలో అప్పుడప్పుడూ నోటికి అత్యవసరమైన తీపి!

(9th Jan 2023. Sakshi Monday Edit)

Tuesday, January 17, 2023

‘ద వేస్ట్‌ లాండ్‌’కు శతాబ్ది

 నూరేళ్లుగా ఫలవంతం


ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యత కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్‌ లాండ్‌’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్‌.ఎలియట్‌ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రచురితమైంది. అదే ఏడాది డిసెంబరులో మొదటిసారి పుస్తకరూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్‌) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్‌! నీకేం కావాలి?’’
‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’

బ్రిటిష్‌ గాథల్లో ‘హోలీ గ్రెయిల్‌’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్‌ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్‌ కింగ్‌. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల  ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్‌ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్‌ ఖండాన్ని కూడా ఎలియట్‌ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు.

అమెరికాలోని ‘బోస్టన్‌ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్‌లో స్థిరపడిన ఎలియట్‌ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్‌తో కలిసి ఇంగ్లండ్‌లోని కెంట్‌ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గతపు సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చిపోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్‌ కవితలో ప్రధాన విషయం,’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి.

ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్‌ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్‌ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతి స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్‌కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేయబోయే కవిత అని సరిగ్గానే గుర్తించాడు.

ఏప్రిల్‌ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్‌ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్‌ లాండ్‌’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్‌. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్‌స్పియర్, మిల్టన్, హెర్మన్‌ హెస్, బాదలేర్‌ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్‌ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్‌. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్‌. దాన్ని భావ సంగీతం అన్నాడు.

సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్‌. అన్నీ అవాస్తవికం. లండన్‌ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తున్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడుస్తున్నారు.
మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్‌ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్‌ బ్రిడ్జ్‌ ఈజ్‌ ఫాలింగ్‌ డౌన్‌ ఫాలింగ్‌ డౌన్‌ ఫాలింగ్‌ డౌన్‌... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః

ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్‌ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్‌ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ని చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్‌ లాండ్‌’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్‌ ఎరిక్‌ షూమేకర్‌ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్‌ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు.


(21st Nov 2022)

 

Friday, January 13, 2023

కామూ: అర్థం లేనితనం

అర్థం లేనితనం


‘‘అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా బహుశా నిన్న, నాకు తెలీదు.’’ ఈ ప్రారంభ వాక్యాలతో ఉదాసీన గొంతుకతో మొదలయ్యే ‘ద స్ట్రేంజర్‌’ నవల సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 1942లో వచ్చింది. ఆల్బర్ట్‌ కామూ ఫ్రెంచ్‌ భాషలో రాసిన, ఆంగ్లంలో ‘ది ఔట్‌సైడర్‌’ పేరుతో కూడా ప్రసిద్ధమైన ఈ నవల అసంబద్ధవాద తాత్విక చింతనకు శిఖరాయమానమైన రచనగా నిలిచింది.

ఈ ప్రపంచానికి ఏ క్రమమూ లేదు, జీవితం అనేదానికి ఏ పరమార్థమూ లేదని అసంబద్ధవాదం చెబుతుంది. ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుందనే అంచనాతో జనాలు ప్రవర్తిస్తారు. అలా ఉన్నా, ఉండకపోయినా ఈ ప్రపంచానికి పోయేదేమీ లేదు. కానీ మన తార్కిక మెదడు ఒక క్రమాన్నీ, అర్థాన్నీ అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ కఠిన సత్యాన్ని మనిషి అనేవాడు ఎదుర్కోవాల్సిందే. లేదా చచ్చిపోవడమే దారి. అలా చేయలేనివాళ్లు దేవుడినో, ఆధ్యాత్మికతనో ఆశ్రయిస్తారు. దానికి బదులుగా ఆ అర్థంలేనితనాన్ని అంగీకరించడం ఉత్కృష్ట మార్గం. దీన్నే మహత్తరమైన వచన సరళతతో, అత్యంత సంక్లిష్టమైన యాంటీ–హీరో పాత్ర చిత్రణతో నిరూపిస్తాడు కామూ.

ఫ్రెంచ్‌–అల్జీరియాలోని అలై్జర్స్‌ నగరంలో మ్యార్‌సో ఒక మామూలు ఉద్యోగి. వచ్చేది అరాకొరా జీతం. తల్లిని మరెంగో గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఆమె మరణవార్త టెలిగ్రామ్‌ అందుకున్నాక, అంత్యక్రియలకు రెండ్రోజుల సెలవు అడుగుతాడు. (దానికి బాస్‌ చిరాకుగా ముఖం పెడతాడు. కారణం: అంత్యక్రియలు శుక్రవారం కాబట్టి, వీకెండ్‌తో కలుపుకొని ఆ సెలవు నాలుగు రోజులవుతుంది.) అలా సెలవు అడగాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూనే తల్లి దగ్గరికి వెళ్లిన మ్యార్‌సో ప్రవర్తనలోని పొసగనితనాన్ని ప్రపంచం అడుగడుగునా గమనిస్తుంది. తల్లి శవం పక్కన జాగారం చేస్తూ సిగరెట్‌ కాల్చుతాడు. కాఫీ తాగుతాడు. అతడు వెళ్లేప్పటికే మూసేసివున్న శవపేటిక తలుపు తెరవనక్కర్లేదని చెప్పి అక్కడి సహాయకుడిని విస్తుపోయేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తల్లి చనిపోయిందని ఏడ్వడు. తెల్లారి బీచిలో మాజీ సహోద్యోగి మరీ కార్డోనా అనుకోకుండా ఎదురవుతుంది. ఇద్దరూ ఈత కొడతారు. మ్యార్‌సో కోరిక మీద సినిమాకు వెళ్తారు. అది కూడా కామెడీ సినిమా. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గడుపుతారు. గతం రోజే తల్లి ఖననం జరిగివుందనేది ఒక నేపథ్య వాస్తవం. మ్యార్‌సో తన చర్యల పరిణామాల గురించి ఆలోచించడు. ఇతరులు ఏమనుకుంటారో అని తలచడు. సందర్భ శుద్ధి గల ఉద్వేగాలు ప్రకటించడు. సింపుల్‌గా చెప్పాలంటే, అతడు జీవితపు ఆట ప్రకారం ఆడడు. అందుకే అతడు సమాజానికి ‘అపరిచితుడు’, లేదా ‘బయటివాడు’. అందువల్ల దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు. అనుకోకుండా అతడు చేసిన హత్య కన్నా, అతడి (అ)ప్రకటిత ఉద్వేగాలు ఎక్కువ ప్రశ్నార్థకం అవుతాయి.

నిజాయితీతో కూడిన జవాబులే అయినప్పటికీ– విచారణ సమయంలో తాను అరబ్బును చంపడానికి కారణం మండుటెండ పుట్టించిన చీదర అని జవాబివ్వడం ద్వారా న్యాయమూర్తినీ, జైల్లో పడ్డాక కూడా తనకు దేవుడు అక్కర్లేదని మతగురువునూ చికాకుపెడతాడు మ్యార్‌సో. ప్రకృతి మాత్రమే మన జీవితాల్ని శాసిస్తుందని చెప్పడం కామూ ఉద్దేశం. భౌతిక అవసరాలు మాత్రమే మ్యార్‌సోను శాసిస్తాయి. జైలు మూలంగా ఈత కొట్టలేకపోవడం, సిగరెట్లు కాల్చలేకపోవడం, శృంగార జీవితం లేకపోవడం గురించి బాధపడతాడు. ఆ శృంగారం కూడా ప్రత్యేకించి మరీయే అని కాదు. నిజానికి మనుషులు లోలోపల ఇలాగే ఉంటారు. కానీ పైన ఒక ఆమోదనీయ పొరను కప్పుకొంటారు. ఇంకోలా ఉండాలనో, ఉండలేకపోవడం తప్పనో భావిస్తారు.

ఒకప్పుడు లక్ష్యం ఉండి, ఇప్పుడు అంతా ఒకటే అనే స్థితి మ్యార్‌సోది. ప్రమోషన్‌ వచ్చినా, రాకపోయినా తేడా లేదనే మనిషి ఎవరు ఉండగలరు? ఇదొక రుషిత్వపు లక్షణంలా కనబడుతుంది. కానీ ఎలా ఉన్న అర్థమే లేనప్పుడు, దానికోసం మళ్లీ ప్రత్యేకంగా తపన పడటం ఎందుకనేది అతడి వాదం. నిజానికి ఒక సున్నితమైన మనిషి మ్యార్‌సోలో ఉంటాడు. అరబ్బును చంపిన తర్వాత తానిక సంతోషంగా ఉండలేనని అతడికి తెలుసు. అయినా అది జరిగిపోయింది. దానికి ఇదమిద్ధంగా కారణం చెప్పలేడు. అరబ్బు హత్య, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇవేవీ కూడా ఒక క్రమం వల్ల జరిగినవి కావు. కానీ మ్యార్‌సో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. జీవితానికో ప్రత్యేక క్రమం ఉందన్న వాదనను ఇది పటాపంచలు చేస్తుంది. అందుకే చివరలో గిలటిన్‌తో తలను తెగ్గొట్టే మరణ శిక్ష అనుభవించడానికి ముందు, ఇక అక్కడ పోగుకాబోయే కోపగ్రస్థ మూక అరుపులను ఊహించుకున్నాక, ప్రపంచం గురించి అతడికి ఉన్న ఆ చివరి భ్రమలు కూడా తొలగిపోతాయి. జీవితపు సున్నితమైన ఉదాసీనతకు మేలుకుంటాడు. శిక్షను తేలిగ్గా అనుభవించే మానసిక స్థితికి వస్తాడు. అతడి చింతన సంపూర్ణమవుతుంది.

ఊహ తెలిసేనాటికే మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్నాడు కామూ. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలు చెదిరిపోవడం చూశాడు. అల్జీరియాలో ఫ్రెంచివారి అణిచివేతకు సాక్షిగా ఉన్నాడు.  పేదరికాన్ని అనుభవించాడు. జీవితపు అర్థరాహిత్యం ఆయన అనుభవసారం. కథకుడు, నాటకకర్త, పాత్రికేయుడు అయిన కామూ తన 28వ యేట ‘స్ట్రేంజర్‌’ రాశాడు. 1957లో నోబెల్‌ వరించింది. ఆ పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచాడు. కానీ మూడేళ్లకే తన 46వ యేట కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూశాడు, ప్రపంచపు అసంబద్ధతను తన జీవితం ద్వారా కూడా నిజం చేస్తూ!

Dec 18th 2022. 

Tuesday, January 10, 2023

2022లో చూసిన సినిమాలు






2022లో చూసిన సినిమాలు

ఈసారి సిరీసులు ఎక్కువ టైమ్‌ తిన్నాయి. ఇంక చూడకూడదని గట్టిగా అనుకుంటున్నాను. ఒక సిరీస్‌కు పెట్టే టైముతో కనీసం 15–20 క్లాసిక్స్‌ చూసుకోవచ్చు. కానీ బెటర్‌ కాల్‌ సాల్, బ్రేకింగ్‌ బ్యాడ్‌... ఏం రైటింగ్‌ అది! క్యారెక్టర్లను ఎంత లోతుగా తవ్వుతూ పోవచ్చో అంతగా తవ్విపోశారు. క్రౌన్‌ పెద్ద అంచనాలతో మొదలుపెట్టలేదుగానీ, చూడటంలో ఒక ప్లెజర్‌ ఉండింది. జి.అరవిందన్‌ సినిమాలు వరుసగా చూశాను. అంతకుముందు చిదంబరం ఒక్కటే చూశాను. కాన్‌లో థంప్‌ సినిమా వేస్తున్నారన్న న్యూస్‌ ఈ ఆసక్తికి కారణం. దాదాపుగా కదలదు అనిపించే పోక్కువెయిల్‌ ఆయన బెస్ట్‌ అని నా ఫీలింగ్‌. బిల్లీ వైల్డర్‌ను ఆలస్యంగా ఈ ఏడాదే పరిచయం చేసుకున్నాను. రియల్‌ ఫన్‌! ఈ ఏడాది నాకు బాగా నచ్చిన సినిమాల్లో పిగ్‌ ఒకటి. సుతారమైన సినిమా. ... వర్జీనియా వూల్ఫ్‌ లాంటి సినిమాలు చూసినప్పుడు నటుల మీద గౌరవం పెరుగుతుంది. ఇక, రవీంద్ర భారతిలో మా ‘వెళ్లిపోవాలి’ సినిమాను ప్రదర్శించారు కాబట్టి, ఇంకెవరిదో సినిమాలాగా కొంచెం పెద్ద తెర మీద చూడటం బాగుండింది.

పిల్లల కోసమని థియేటర్‌కు వెళ్లి చూసిన ఏకైక సినిమా అవతార్‌–2. సినిమా ఎటూ ఏంలేదు, కానీ థియేటర్‌కు వెళ్లి చూడకపోవడంలో నేనేమీ మిస్సవట్లేదన్న భావన కలిగించింది ఈ మాల్‌ థియేటర్‌. (పెద్ద మాల్‌లో ఎనిమిది స్క్రీన్స్‌లో ఇదొకటి. థియేటర్‌లోనే ఒక పక్కన చిన్నపిల్లలు గోలగా ఆడుతున్నారు. సినిమాను ఎలా చూడకూడదో అలాంటి ఆంబియెన్స్‌. ఇంట్లో కూర్చుని టీవీ చూడటం నయం. కనీసం వాళ్లు మన పిల్లలైతే గద్దరించి అయినా కూర్చోబెట్టొచ్చు.)

సినిమాల గురించి కామెంట్లు, అవి ఏ భాషవి అని ఏమీ లేకుండా వరుసగా జాబితా ఇస్తున్నా. మంచి మొదటి సినిమాతో నా ఏడాది ప్రారంభమైంది.
 


The Best of Enemies (Robin Bissel)
Chernobyl 1986 (Danila Kozlovsky)
Loveless (Andrey Zyagintsev)
Chandigarh Kare Aashiqui (Abhishek Kapoor)
Minnal Murali (Basil Joseph)
Kappela (Mustafa)
The Power of the Dog (Jane Campion)
Silence (Martin Scorsese)
Kramer Vs Kramer (Robert Benton)
Final Solution (Doc) (Rakesh Sharma)
Snowden (Oliver Stone)
Who is afraid of Virginia Woolf (Mike Nichols)
Adaptation (Spike Jonze)
All the President's Men (Alan J.Pakula)
Sunset Boulevard (Billy Wilder)
Aparajitho (Re) (Satyajith Ray)
Doctor Zhivago (David Lean)
Searchers (John Ford)
83 (Kabir Khan)
Tenet (Christopher Nolan)
Punch, Drunk and Love (P.T.Anderson)
Vellipovaali (Meher)
Ulysses (1967) (Joseph Strick)
Ulysses (1954) (Mario Camerini)
Marie Antoniette (Sofia Koppola)
Some like it hot (Billy Wilder)
Certified Copy (Abbas Kiarostami)
Licorice Pizza (P.T.Anderson)
Gangs of Vassepur 1 (Anurag Kashyap)
Gangs of Vassepur 2 (Anurag Kashyap)
PIG (Michael Saronski)
Klute (Alan J. Pakula)
Thamp (G.Aravindan)
Kanchan Sita (G.Aravindan)
Pokku Veyil (G.Aravindan)
Uttarayanam (G.Aravindan)
Andhadhun (re) (Sriram Raghavan)
Life in Colour (Doc) (Nar. David Attenborough)
Sex, Explained (Doc) (Nar. Janelle Monae)
Narcos (1, 2 Seasons only) (Cr. Chris Brancato, Carlo Bernard, Doug Miro)
Paan Singh Tomar (Tigmanshu Dhulia)
Better Call Saul (6 Seasons) (Cr. Vince Gilligan, Peter Gould)
The Stoning of Soraya M. (Cyrus Nowrasteh)
Viraata Parvam (Venu Udugula)
Tokyo Trial (Re) (Pieter Verhoeff, Rob W. King)
Ante Sundaranikee! (Vivek Atreya)
Lord of the Flies (Peter Brook)
Darlings (Jasmeet K. Reen)
Anatomy of a Scandal (Cr. David E. Kelley, Melissa James Gibson)
Guns, Gems and Steel (Doc) (Jared Diamond)
Anger Management (Peter Segal)
Caligula (1979) (Malcom Mcdowell)
The Crown (5 Seasons) (Cr. Peter Morgan)
Thallumala (Khalid Rahaman)
Vikram (Lokesh Kanagaraj)
Hell's Angel (Doc) (Christopher Hitchens)
Mother and Son (Aleksander Sokurov)
Do Baara (Anurag Kashyap)
Anbe Sivam (C.Sundar)
Maya Memsaab (Ketan Mehta)
Garam Hawa (M.Sathyu)
Elappathayam (Adoor Gopalakrishnan)
Breaking Bad (5 Seasons) (Cr. Vince Gilligan)
Nothing Personal (Urszula Antoniak)
Kanthara (Rishab Shetty)
Farha (Darin J. Sallam)
Avatar 2 (James Cameron)