Saturday, January 21, 2023

జిబ్రాన్‌ వాణి

 ప్రవక్త వాణి


అల్‌ముస్తఫా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. పన్నెండేళ్లుగా ఉంటున్న ఆర్ఫాలీస్‌ ద్వీప నగరాన్ని ఇక విడిచిపెట్టాలి. సముద్రాన్ని దాటిస్తూ తన జన్మస్థలానికి తిరిగి చేర్చగలిగే సరైన(?) ఓడ వచ్చేస్తోంది. కానీ నగరవాసులు ఆయన్ని వదిలిపెడతారా? వియోగం వచ్చేంతవరకూ ప్రేమలోని లోతు తెలియదు కదా! నువ్వు మాకు అతిథివి కావు, మాలో ఒకడివి, మాకు ప్రియమైనవాడివి, మా కలలకు కలలిచ్చేందుకు నీ యవ్వనాన్ని ధారబోసినవాడివి, నువ్వు ఎలా వెళ్లగలవని వాళ్లు నిలదీయరా? తనకోసం చాలులోనే నాగలి వదిలేసివచ్చిన మనిషికి ఏం జవాబివ్వాలి? తనకోసం ద్రాక్షసారా యంత్ర చక్రాన్ని ఆపి పరుగెత్తుకొచ్చినవాడికి ఏం చెప్పాలి? హృదయం విరగకాసిన పళ్ల చెట్టయి వాటన్నింటినీ రాల్చితే? వారి పాత్రలను కోర్కెల జలధారై నింపితే? సర్వేశ్వరుడి శ్వాసను తనలోంచి పోనిచ్చే వేణువు అయితే? నిశ్శబ్దాల్లో కనుగొన్న నిధిని మాటల ద్వారా పంచితే? వారిని సముద్రపు అలలు వేరుపరచకముందే వీడ్కోలు చెప్పడానికి ఒకరి వెంట ఒకరు రావడంతో అక్కడ గుంపు పోగైంది. అలా విడిపోబోయే రోజే సమావేశపు రోజు కూడా అయ్యింది. అందరూ నెమ్మదిగా మందిరం వైపు అడుగులు వేశారు. మందిరంలోంచి యోగి అల్‌మిత్ర బయటికి వచ్చింది. వాళ్లందరి తరఫునా ఆమె మేము మా పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు చెప్పుకొనేలా జనన మరణాల మధ్యలి సత్యాన్ని తెలియజేయమని కోరింది. జనంలో గమనించిన సత్యాన్ని జనానికే చెప్పడానికి పూనుకొంటాడు అల్‌ముస్తఫా.

లెబనాన్‌ మూలాలున్న అమెరికన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌(6 జనవరి 1883–10 ఏప్రిల్‌ 1931) రచన ‘ద ప్రాఫెట్‌’కు ఇదీ భూమిక. నూరేళ్లుగా అన్ని ప్రపంచ భాషల్లోకీ మళ్లీ మళ్లీ అనువాదమవుతూ, ఇప్పటికీ కొత్త ఆసక్తి రేపుతున్న ఈ మహత్తర రచన 1923లో ప్రచురితమైంది. వచన కవిత్వం రూపంలో జిబ్రాన్‌ తన పాఠకులకు ఎన్నో అంశాల మీద సున్నితమైన దృక్కోణాన్ని ఇస్తారు. ‘ప్రేమ’తో మొదలైన సంభాషణ–  తాపీమేస్త్రి, నేత కార్మికుడు, సత్రం నిర్వాహకుడు, పిల్ల తల్లి, న్యాయమూర్తి ఇలా ఒక్కొక్కరూ తమ సందేహాలను తీర్చమనడంతో అల్‌ముస్తఫా–– పెళ్లి, పిల్లలు, కాలం, జ్ఞానం, మంచి, చెడు, ప్రార్థన, దయ, ఆనందం, అందం, మతం, ఇవ్వడం... ఇలా అన్నింటికీ సమాధానాలు ఇస్తూపోతాడు. స్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వని ప్రేమ ప్రాధాన్యతను ప్రేమగా చెబుతాడు. మీ పిల్లలు మీ పిల్లలు కాదు; వాళ్లు మీ ద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు; వాళ్లు మీతో ఉన్నప్పటికీ మీకు చెందరంటాడు. నీకు ఎంతో ప్రియమైనవాళ్లు ఆ ఇంటిలో నివసిస్తారన్నట్టగా ఒక ఇంటిని నిర్మించమని చెబుతాడు. ఆకలి కోసం ఒక సీమరేగిపండు తిన్నాకూడా దాని విత్తనాలు నీ శరీరంలో పెరుగుతాయన్నంత స్పృహతో ఆ పనిచేయమని చెబుతాడు. ఆనందమూ దుఃఖమూ వేర్వేరు కాదు; నీ హృదయానికి సాంత్వన ఇచ్చే వేణువు కూడా కత్తి గాట్లకు గురైందని అంటాడు. జీవితాన్ని ఎంత సుతారంగా, సుందరగా సమీపించవచ్చో అత్యంత మృదువుగా, సరళంగా వివరిస్తాడు.

స్వయంగా చిత్రకారుడు కూడా అయిన జిబ్రాన్‌ పుస్తకంలోని పన్నెండు చిత్రాలను స్వయంగా గీశారు. విడుదలైన సంవత్సరం ప్రచురించిన రెండు వేల కాపీలకుగానూ 1,500 మాత్రమే అమ్ముడుపోయింది. కానీ ఆ తర్వాత అది పునర్ముద్రణలు వరుసగా పొందుతూనే ఉంది. లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం ఒక దశలో వారంలో సగటున 5,000 కాపీలు ఎక్కడో ఓచోట అమ్ముడవుతూనే ఉంది. ఈ నూరేళ్లలో ఏ ఒక్క సందర్భంలోనూ ఈ చిరుపొత్తం అచ్చులో లేకుండా లేదు. ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించేట్టుగా రాయడం వల్ల ఇది తరచుగా బహుమానాలు ఇచ్చుకునే పుస్తకంగా కూడా ఉంటోంది. అయితే మేధావులు మాత్రం దీన్నొక పంచదార పాకంగా భావించకపోలేదు.

‘శాండ్‌ అండ్‌ ఫోమ్‌’, ‘ద వాండెరర్‌’ లాంటి ఇతర ప్రసిద్ధ రచనలు కూడా వెలువరించిన జిబ్రాన్‌– అరబిక్, ఆంగ్లం రెండు భాషల్లోనూ రాయగలరు. ఆయన్ని బహాయీ, సూఫీ మతాలు విశేషంగా ఆకర్షించాయి. వాటి అంతస్సారమైన నిశ్శబ్దం, ప్రేమ ‘ద ప్రాఫెట్‌’ నిండుగా పరుచుకొని ఉంటాయి. చిత్రంగా జిబ్రాన్‌ తల్లిదండ్రులు క్రైస్తవులు. తాతల కాలంలో ముస్లింలు. అలా అన్ని మతాలనూ ఇముడ్చుకునే గుణం ఆయనకు చిన్నతనంలోనే అలవడింది. అందుకే ఒక చోట నేను నీ మసీదులో, నీ చర్చిలో, నీ సినగాగ్‌లో కూడా ప్రార్థిస్తాను అంటాడు. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే అన్ని మతాల మధ్య సమన్వయం జరగాలన్న భావన ఆయనది. దానికి కావాల్సిన హృదయ వైశాల్యాన్ని పెంచేదిగా ఈ పుస్తకం ఉంటుంది.  ప్రతి ఒక్క చెడుకూ ప్రతి ఒక్కరూ బాధ్యులేనన్న సామూహిక ఇచ్ఛ ఇందులో దర్శనమిస్తుంది. వ్యాపారంలో ప్రేమ, కరుణపూరిత న్యాయం చూపకపోతే, అది కొందరి దురాశకూ, మరికొందరి ఆకలికీ కారణమవుతుందని చెబుతుంది.

అల్‌ముస్తఫా నిజానికి వెళ్లింది స్వస్థలానికేనా? తన కాలం ముగిసి, మళ్లీ మరో జీవితపు చక్రానికి సిద్ధం చేసే సముద్రాన్ని దాటాడు. ఇప్పుడిక జీవితం అనేది ఒక కల. అనంత శక్తి ప్రవాహంలో లిప్తకాలపు జీవులం మనం. ఈ భావన మనశ్శాంతినీ, సాంత్వననూ ప్రసాదిస్తుంది. జీవితం నుంచి ఒక విముక్త భావనను కలిగిస్తుంది. ముఖ్యంగా మతాల్లోని అసలైన ఆధ్యాత్మిక గంధం ఇగిరిపోయి, కేవలం అవి బల ప్రదర్శనలకు మాత్రమే పనికొస్తున్నప్పుడు– అన్ని జీవుల్లోనూ దేవుడిని చూసుకోవడమనే ప్రాచ్య భావనను రేకెత్తిస్తుంది. పుస్తకం ఒక పంచదార పాకమే కావొచ్చు. కానీ ఈ కల్లోల ద్వేషాల కాలంలో అప్పుడప్పుడూ నోటికి అత్యవసరమైన తీపి!

(9th Jan 2023. Sakshi Monday Edit)

No comments:

Post a Comment