Friday, January 13, 2023

కామూ: అర్థం లేనితనం

అర్థం లేనితనం


‘‘అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా బహుశా నిన్న, నాకు తెలీదు.’’ ఈ ప్రారంభ వాక్యాలతో ఉదాసీన గొంతుకతో మొదలయ్యే ‘ద స్ట్రేంజర్‌’ నవల సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 1942లో వచ్చింది. ఆల్బర్ట్‌ కామూ ఫ్రెంచ్‌ భాషలో రాసిన, ఆంగ్లంలో ‘ది ఔట్‌సైడర్‌’ పేరుతో కూడా ప్రసిద్ధమైన ఈ నవల అసంబద్ధవాద తాత్విక చింతనకు శిఖరాయమానమైన రచనగా నిలిచింది.

ఈ ప్రపంచానికి ఏ క్రమమూ లేదు, జీవితం అనేదానికి ఏ పరమార్థమూ లేదని అసంబద్ధవాదం చెబుతుంది. ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుందనే అంచనాతో జనాలు ప్రవర్తిస్తారు. అలా ఉన్నా, ఉండకపోయినా ఈ ప్రపంచానికి పోయేదేమీ లేదు. కానీ మన తార్కిక మెదడు ఒక క్రమాన్నీ, అర్థాన్నీ అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ కఠిన సత్యాన్ని మనిషి అనేవాడు ఎదుర్కోవాల్సిందే. లేదా చచ్చిపోవడమే దారి. అలా చేయలేనివాళ్లు దేవుడినో, ఆధ్యాత్మికతనో ఆశ్రయిస్తారు. దానికి బదులుగా ఆ అర్థంలేనితనాన్ని అంగీకరించడం ఉత్కృష్ట మార్గం. దీన్నే మహత్తరమైన వచన సరళతతో, అత్యంత సంక్లిష్టమైన యాంటీ–హీరో పాత్ర చిత్రణతో నిరూపిస్తాడు కామూ.

ఫ్రెంచ్‌–అల్జీరియాలోని అలై్జర్స్‌ నగరంలో మ్యార్‌సో ఒక మామూలు ఉద్యోగి. వచ్చేది అరాకొరా జీతం. తల్లిని మరెంగో గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఆమె మరణవార్త టెలిగ్రామ్‌ అందుకున్నాక, అంత్యక్రియలకు రెండ్రోజుల సెలవు అడుగుతాడు. (దానికి బాస్‌ చిరాకుగా ముఖం పెడతాడు. కారణం: అంత్యక్రియలు శుక్రవారం కాబట్టి, వీకెండ్‌తో కలుపుకొని ఆ సెలవు నాలుగు రోజులవుతుంది.) అలా సెలవు అడగాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూనే తల్లి దగ్గరికి వెళ్లిన మ్యార్‌సో ప్రవర్తనలోని పొసగనితనాన్ని ప్రపంచం అడుగడుగునా గమనిస్తుంది. తల్లి శవం పక్కన జాగారం చేస్తూ సిగరెట్‌ కాల్చుతాడు. కాఫీ తాగుతాడు. అతడు వెళ్లేప్పటికే మూసేసివున్న శవపేటిక తలుపు తెరవనక్కర్లేదని చెప్పి అక్కడి సహాయకుడిని విస్తుపోయేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తల్లి చనిపోయిందని ఏడ్వడు. తెల్లారి బీచిలో మాజీ సహోద్యోగి మరీ కార్డోనా అనుకోకుండా ఎదురవుతుంది. ఇద్దరూ ఈత కొడతారు. మ్యార్‌సో కోరిక మీద సినిమాకు వెళ్తారు. అది కూడా కామెడీ సినిమా. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గడుపుతారు. గతం రోజే తల్లి ఖననం జరిగివుందనేది ఒక నేపథ్య వాస్తవం. మ్యార్‌సో తన చర్యల పరిణామాల గురించి ఆలోచించడు. ఇతరులు ఏమనుకుంటారో అని తలచడు. సందర్భ శుద్ధి గల ఉద్వేగాలు ప్రకటించడు. సింపుల్‌గా చెప్పాలంటే, అతడు జీవితపు ఆట ప్రకారం ఆడడు. అందుకే అతడు సమాజానికి ‘అపరిచితుడు’, లేదా ‘బయటివాడు’. అందువల్ల దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు. అనుకోకుండా అతడు చేసిన హత్య కన్నా, అతడి (అ)ప్రకటిత ఉద్వేగాలు ఎక్కువ ప్రశ్నార్థకం అవుతాయి.

నిజాయితీతో కూడిన జవాబులే అయినప్పటికీ– విచారణ సమయంలో తాను అరబ్బును చంపడానికి కారణం మండుటెండ పుట్టించిన చీదర అని జవాబివ్వడం ద్వారా న్యాయమూర్తినీ, జైల్లో పడ్డాక కూడా తనకు దేవుడు అక్కర్లేదని మతగురువునూ చికాకుపెడతాడు మ్యార్‌సో. ప్రకృతి మాత్రమే మన జీవితాల్ని శాసిస్తుందని చెప్పడం కామూ ఉద్దేశం. భౌతిక అవసరాలు మాత్రమే మ్యార్‌సోను శాసిస్తాయి. జైలు మూలంగా ఈత కొట్టలేకపోవడం, సిగరెట్లు కాల్చలేకపోవడం, శృంగార జీవితం లేకపోవడం గురించి బాధపడతాడు. ఆ శృంగారం కూడా ప్రత్యేకించి మరీయే అని కాదు. నిజానికి మనుషులు లోలోపల ఇలాగే ఉంటారు. కానీ పైన ఒక ఆమోదనీయ పొరను కప్పుకొంటారు. ఇంకోలా ఉండాలనో, ఉండలేకపోవడం తప్పనో భావిస్తారు.

ఒకప్పుడు లక్ష్యం ఉండి, ఇప్పుడు అంతా ఒకటే అనే స్థితి మ్యార్‌సోది. ప్రమోషన్‌ వచ్చినా, రాకపోయినా తేడా లేదనే మనిషి ఎవరు ఉండగలరు? ఇదొక రుషిత్వపు లక్షణంలా కనబడుతుంది. కానీ ఎలా ఉన్న అర్థమే లేనప్పుడు, దానికోసం మళ్లీ ప్రత్యేకంగా తపన పడటం ఎందుకనేది అతడి వాదం. నిజానికి ఒక సున్నితమైన మనిషి మ్యార్‌సోలో ఉంటాడు. అరబ్బును చంపిన తర్వాత తానిక సంతోషంగా ఉండలేనని అతడికి తెలుసు. అయినా అది జరిగిపోయింది. దానికి ఇదమిద్ధంగా కారణం చెప్పలేడు. అరబ్బు హత్య, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇవేవీ కూడా ఒక క్రమం వల్ల జరిగినవి కావు. కానీ మ్యార్‌సో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. జీవితానికో ప్రత్యేక క్రమం ఉందన్న వాదనను ఇది పటాపంచలు చేస్తుంది. అందుకే చివరలో గిలటిన్‌తో తలను తెగ్గొట్టే మరణ శిక్ష అనుభవించడానికి ముందు, ఇక అక్కడ పోగుకాబోయే కోపగ్రస్థ మూక అరుపులను ఊహించుకున్నాక, ప్రపంచం గురించి అతడికి ఉన్న ఆ చివరి భ్రమలు కూడా తొలగిపోతాయి. జీవితపు సున్నితమైన ఉదాసీనతకు మేలుకుంటాడు. శిక్షను తేలిగ్గా అనుభవించే మానసిక స్థితికి వస్తాడు. అతడి చింతన సంపూర్ణమవుతుంది.

ఊహ తెలిసేనాటికే మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్నాడు కామూ. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలు చెదిరిపోవడం చూశాడు. అల్జీరియాలో ఫ్రెంచివారి అణిచివేతకు సాక్షిగా ఉన్నాడు.  పేదరికాన్ని అనుభవించాడు. జీవితపు అర్థరాహిత్యం ఆయన అనుభవసారం. కథకుడు, నాటకకర్త, పాత్రికేయుడు అయిన కామూ తన 28వ యేట ‘స్ట్రేంజర్‌’ రాశాడు. 1957లో నోబెల్‌ వరించింది. ఆ పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచాడు. కానీ మూడేళ్లకే తన 46వ యేట కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూశాడు, ప్రపంచపు అసంబద్ధతను తన జీవితం ద్వారా కూడా నిజం చేస్తూ!

Dec 18th 2022. 

2 comments:

  1. యండమూరి గారు వ్రాసిన అంతర్ముఖం కధ ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
  2. Anonymous18.1.23

    Antharmukham. Hamma yandamuri.

    ReplyDelete