పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ యేట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు.
1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది.
పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్‌ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్‌వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.)
స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్‌బేరబుల్ లైట్‌నెస్ ఈఫ్ బీయింగ్’(1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్‌గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్వరిల్లచేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ.
తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్‌లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్‌సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి.