Wednesday, December 27, 2023

ముస్లిం రచయితలకు, మేధావులకు ఒక ప్రశ్న

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు?
మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రం విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది.
మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.
మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం నొక్కి మాట్లాడుతుంది(ఈ రెండు భావనలు జుడాయిజం లోనూ ఉన్నాయి). అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు.
ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన.
ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది.
‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది. నాస్తికులు అయినా మినహాయింపు లేదు.
ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?
ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు?
మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. ఇంత మాట్లాడిన తర్వాత, దీన్నొక హిందువు అభిప్రాయంగానే చూస్తారు కాబట్టి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. డిగ్రీ అయ్యి, హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో, రామ్‌నగర్‌లోని నా రూమ్‌ నుంచి చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీకి వెళ్తుండేవాడిని. వేదం విన్న శూద్రుడి చెవుల్లో సీసం పోయాలన్న వాక్యం మొదటిసారి అక్కడే చదివాను. అది చదివినప్పటి ఒంటి కంపనం నాకు ఇంకా గుర్తుంది. ఇంతా చేస్తే ఇది నేను చదివింది, మనుధర్మం మీద వచ్చిన ఒక విమర్శా పుస్తకంలో. ఇదీ నేనంటున్నది! ఇలాంటి విమర్శ నేను ఎత్తిన అంశాల మీద కనీసంగా అయినా ఉన్నదా? మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

(Posted the same on my FB wall on 7th October, 2023)

1 comment:

  1. హనుమంతుడి వాహనము ఒంటె :)
    ఇదెక్కడినుండి పుట్టుకొచ్చిన కథ ?

    ౨) బూడిదలో పోసిన పన్నీరు

    ReplyDelete