Saturday, December 9, 2023

‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...


ఆవిష్కరణ: ఎల్‌.ఆర్‌.స్వామి, కొప్పర్తి వెంకట రమణమూర్తి, కె.శివారెడ్డి, పాపినేని శివశంకర్, గంటేడ గౌరునాయుడు, నందిని సిధారెడ్డి, కన్నెగంటి చంద్ర, కె.ఎన్‌.మల్లీశ్వరి, వి.వి.రమణమూర్తి,చింతకింది శ్రీనివాసరావు




నందిని సిధారెడ్డి గారి నుంచి కథ–2022 కాపీలు స్వీకరిస్తూ...
Photo: Anil Atluri



కథానేపథ్యంలో– వక్త: మధురాంతకం నరేంద్ర.
ఎ.వి.రమణమూర్తి, బహుశా వేణుగోపాల్, ఎంఎస్‌కె కృష్ణజ్యోతి, పూడూరి రాజిరెడ్డి, వల్లూరి శాంతిప్రబోధ, పి.చిన్నయ్య, చరణ్‌ పరిమి, ఎం.రవీంద్ర బాబు, వేంపల్లె షరీఫ్‌



Thotlakonda



Rock Arch, Vizag Beach. Photo: Narukurthi Sridhar


చరణ్‌ పరిమి, పూడూరి రాజిరెడ్డి, కన్నెగంటి చంద్ర, మంజుల, కె.ఎన్‌.మల్లీశ్వరి, శాంతిప్రబోధ, మధురాంతకం నరేంద్ర, నరుకుర్తి శ్రీధర్‌



కథ–2022 ఆవిష్కరణలో నా ‘కథా నేపథ్యం’


విశాఖ పౌర గ్రంథాలయం, విశాఖపట్నం

డిసెంబర్‌ 3, 2023; ఆదివారం

(అవి నాలుగు మాటలైనా సరే, ఒక నోట్‌ రాసుకోకుండా నేను మాట్లాడలేను. కానీ అనుకున్న టైముకంటే ట్రెయిన్‌ మూడు గంటలు ఆలస్యంగా చేరింది. బస నుంచి వేదికకు పరుగెత్తినంత పనైన హడావుడిలో ‘కాగితం’ మర్చిపోయాను. గుర్తుచేసుకుంటూ మాట్లాడాను కాబట్టి, యధాతథంగా మాట్లాడలేదు. కానీ స్పిరిట్‌ అదే. అప్పటికప్పుడు కూడా కొంత కలిసింది. మళ్లీ రాస్తున్నప్పుడు కొంత పెరిగింది. అవన్నీ కలుపుకొన్న తర్వాత వచ్చిన తుదిరూపం ఇది. అక్కడ మాట్లాడినదానికీ, ఇక్కడ రాస్తున్నదానికీ తేడా ఏదైనా కనబడితే ఇదే ఫైనల్‌గా భావించాలి.)


‘ఎడ్డి’ కథ ఎందుకు రాశానంటే...

అందరికీ నమస్తే.

నాకు నేను ఒక పజిల్‌ విప్పుకోవడానికి ఈ కథ రాశాను. ఏమిటా పజిల్‌? అరే, ఒక మనిషి ఎట్లా తప్పిపోతుంది? ఆ తప్పిపోయే మూమెంట్‌ ఎలా వచ్చివుంటుంది?
ఇప్పుడంటే మా ఇంట్లో వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి. మొత్తంగా వ్యవసాయానికి దూరమైనామని కాదు... నేను పెద్దయ్యి ఇంకో మార్గంలోకి రావడం ఒకటైతే, అసలు వ్యవసాయ పనులు అని మనం చెప్పుకొనేవి ఏవీ ఇప్పుడు లేవు. వరి కోతలు అయ్యాక బంతి కొట్టేవాళ్లం, కల్లాలు చేసేవాళ్లం. ఇప్పుడు ఆ పనులేవీ లేవు. అసలు మనుషులు చేతుల్తో వరి కోయడమే లేదు. ఏదో జరిగిపోయిందని నేను ఇక్కడ చెప్పడం లేదు. అది ఇక్కడ అప్రస్తుతం కూడా. నా చిన్నప్పుడు ఈ పనులు చేస్తున్నప్పుడు ముచ్చట్లు చెప్పుకోవడానికి బొచ్చెడు టైముండేది. మొత్తం టైమే. అప్పుడు మా బాపు ఏవేవో చెప్పేవాడు. అట్లా చెప్పిన ముచ్చట్లలో ఒకటి, ఒక ముసలామె, తిరుపతి యాత్రలకని పోయి, ప్రయాణంలో తప్పిపోయి, నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరడం. నాకు ఆ ముసలామె అట్లా గుర్తుండిపోయింది. ఆ చివరలో పట్టిన గతి తలుచుకుని కలుక్కుమనేది. కానీ ఆమె గురించి ఏదైనా రాద్దామనుకున్నప్పుడల్లా ఎట్లా తప్పిపోతుంది, నాకే నమ్మకం కలగట్లేదు, దీన్ని కన్విన్సింగ్‌గా చెప్పలేను అనిపించేది. మనుషులు తప్పిపోవడం గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆ మూమెంట్‌ను సాహిత్యంలోకి ఎలా తేవాలి?
ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగే ఇంకేదో శక్తి మనకు కావాలి. అంటే, ఇది నిజమే అని ఒప్పుదల రావాలంటే అలాంటిది మన జీవితంలో కూడా జరగాలి. నా జీవితంలో కూడా నేను కొన్ని విలువైన క్షణాలను అట్లా జార్చుకున్నాను. అయ్యో అయ్యో అనుకుంటూ కూడా ఏమీ చెయ్యకుండా ఉండిపోవడం అది. పెద్ద పరిణామాలకు కారణమయ్యే విషయాలే అక్కర్లేదు; చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎర్రితనం చూపిస్తుంటాం. కనీసం నా వరకూ చూపించాను, దాని తర్వాత గింజుకున్నాను. చెప్పుకుంటే సిల్లీగా అనిపిస్తాయి గానీ ఆ క్షణానికి అవి నిజం. తర్వాత పడే వేదనం కూడా నిజం. ఆ ముసలావిడ తప్పిపోవడానికి ‘కారణమైనవాడి’, లేదా ఆమె తప్పిపోకుండా కాపాడగలిగేవాడి ఆ మొద్దుతనం, ఆ ఎడ్డితనం నాలోనూ ఉన్నాయి; అలా ఉండటం సాధ్యమే అనిపించాక కథ రాయగలిగాను. అంటే, ఆ మూమెంట్‌లోకి నేను వెళ్లగలిగాను. అసలు ఆమెను అట్లా గాలికి వదిలేసి, ఇంటికి నల్లమొఖంతో వచ్చిన వాడిని నేనేనేమో!
వాస్తవంలో జరిగిందని చెప్పిన కథను నేను కొంచెం మార్చాను. ముఖ్యంగా ‘సత్తయ్య’ పాత్ర. దానివల్ల మనకంటే ముందు తరాల సంబంధాలను అదనంగా చూపొచ్చు అనిపించింది. అయితే, స్థూలంగా విషయాన్ని మార్చే అధికారం నాకు లేదు. ముసలమ్మ తప్పిపోవడం వాస్తవం. సామాన్యుల జీవితం కూడా చరిత్రలో భాగం అనుకుంటే, ఆమె జీవితం కూడా ఒక చరిత్ర లాంటిదే. కాబట్టి దాన్ని మార్చలేను. ఆ తుది పర్యవసానానికి దారితీసిన సందర్భాన్ని ఎలా రాయగలనన్నదే నా సవాలు. అది కన్విన్సింగ్‌గా లేకపోతే అది నా అసమర్థత. ఇంకా, ఈ కథను రెండు రకాలుగా రాయొచ్చనుకున్నాను. మొదటి వెర్షన్‌లో అసలు నెరేటర్‌ లేడు. అప్పుడు కూడా కథ ఇప్పుడిచ్చే ఎఫెక్టే ఇస్తుందిగానీ, అందులోకి రాజిరెడ్డితనం ఏమీ రాదు. అందుకే నెరేటర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కథకు అదనపు డైమెన్షన్‌ను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. అలాగని నెరేటర్, రాజిరెడ్డి కాదు. రాజిరెడ్డి వేరు, రాజిరెడ్డితనం వేరు. నేను మొదట రాసిన వచనంలో(కథల్లో కాదు) రాజిరెడ్డిని ప్రవేశపెట్టడానికి ఉబలాటపడేవాడిని. అది అర్థం లేనిదని తెలుసుకున్న తర్వాత రాజిరెడ్డితనంలోకి వచ్చాను. కానీ ఇందులోనే మరింత రాజిరెడ్డి ఉంటాడు. అదే తమాషా!
రాజకీయ ఉద్యమాలకు ఈ కథ దన్ను ఇచ్చేదిగా ఉందని (కథానేపధ్యం నిర్వాహకుడు) ఎ.వి.రమణమూర్తి గారు అన్నారు. బహుశా ఈ కారణం వల్లే ఈ కథను ఈ సంకలనంలోకి తీసుకున్నారని నేను అనుకున్నాను. నిజానికి ఈ కథను ఫలానా ప్రయోజనం ఆశించి అయితే రాయలేదు. అసలు ఒక రచయిత తాను ఇందుకు రాశానని చెప్పగలడా? తాను అనుకున్నది మాత్రమే అందులోకి వస్తుందా? రచయిత అనుకున్నదానికి భిన్నంగా కూడా పాఠకులు తీసుకోవచ్చు. అందుకే రమణమూర్తి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, ఈ కథ అంతిమ ప్రయోజనం ఇదీ అని నేను చెప్పలేను, అంటున్నా. ఒకవేళ ఒకటంటూ చెప్పాల్సి వస్తే, ఈ కథ రాయడంలో నా ఉద్దేశం, వ్యక్తిగతమే. అలాంటి ఒక ఎడ్డిమనిషి మన జీవితంలో కనబడితే వాడిని క్షమించొచ్చు అన్నంతవరకే నా ఊహ పోతోంది. క్షమ అనేది సామాజిక ఉద్యమాల కంటే మించినది అని నేను అనుకుంటున్నాను.
చివరగా ఒక మాట. ఇందాక ‘చరిత’ సుబ్బయ్య గారు పలకరించారు. నరసాపురం మీటింగ్‌లో(కథ–2018; అందులో నా ‘రెండో భాగం’ ఉంది.) నేను కొంచెం అల్లరి చేశాననీ, ఈసారి ఏం చేయబోతున్నాననీ నవ్వుతూ అడిగారు. కథల ఎంపికలో సంపాదకులు పెట్టుకున్న ‘సోకాల్డ్‌ అభ్యుదయ’ ప్రమాణాల వల్ల కొన్ని మంచి కథలు బయటే ఉండిపోతున్నాయని అప్పుడు అన్నాను. ఎంపిక పరమైన ఫిర్యాదులు అలాగే ఉన్నప్పటికీ ఈసారి అలాంటి అల్లరి ఏదీ చేయదలుచుకోలేదు. నేను కూడా కొంచెం పెద్దరికంతో అందరినీ క్షమించేయాలని అనుకుంటున్నాను. దానికి ఒక కారణం ఏమంటే– క్రమశిక్షణతో, పద్ధతిగా పనిచేసేవాళ్లంటే నాకు గౌరవం. పుస్తకం చివర వీళ్లిచ్చే ‘కథలు–కథకులు’ జాబితా ఒక్కటి చాలు వీళ్ల పనితీరును పట్టించడానికి. అందుకే నా కథను ఈ సంకలనంలోకి తీసుకున్న సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌ గార్లకు ధన్యవాదాలు. ‘2022లో మరికొన్ని మంచి కథలు’ జాబితాలో నా మరో కథ ‘ఎఱుక’ను కూడా ఇచ్చారు. దానికి కూడా థాంక్యూ. ఈ రెండు కథలూ మహమ్మద్‌ ఖదీర్‌బాబు గారు సంపాదకుడుగా వచ్చిన ‘కొత్త కథ–2022’, ‘తెలుగు పెద్ద కథలు’ పుస్తకాల్లో వచ్చాయి. ఆయనను కూడా ఇక్కడ తలుచుకుంటున్నా. ఈ సంకలనంలో చోటు చేసుకున్న సహ కథకులకు నా అభినందనలు.

థాంక్యూ.

--

పీఎస్‌1: ఒకరిని క్షమించడం, క్షమించే స్థితిలో ఉండటం కూడా అహంకారంలో భాగమే అని తర్వాత విడి సంభాషణల్లో చంద్ర కన్నెగంటి గారు అన్నారు. నాకు అది నచ్చింది.

పీఎస్‌2: మీటింగ్‌ జరిగింది ఒకేరోజు. నిజానికి, తర్వాతి రెండు రోజుల కోసమే అంతదూరం విశాఖ వెళ్లింది. ‘మిచౌంగ్‌’ తుపాను వల్ల అంతా కిందిమీదయ్యే పరిస్థితి వచ్చిందనే అనుకున్నాను. కానీ, వానయినా వరదయినా మిమ్మల్ని తిప్పే తీరుతాను అన్నట్టుగా నరుకుర్తి శ్రీధర్‌ గారు ఆ చినుకుల్లోనే బయల్దేరారు. రెండ్రోజులూ ఆయనే నాకు పెద్ద అండ. తగు మోతాదు వానతో ఈ పర్యటనకు ఒక భిన్న ఫీల్‌ కూడా వచ్చింది. అసలు కథంతా ఇక్కడుంది!

No comments:

Post a Comment