Friday, November 24, 2023

ఒక క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌


(ఓ ఏడాది క్రితం, వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్రియేటివ్‌ రైటింగ్‌ క్లాస్‌ తీసుకోవాలని పోపూరి సురేశ్‌బాబు గారు అడిగారు. ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా కథల గురించి చెప్పాలన్నారు. నాకు ఇట్లాంటిది కొత్త. పిల్లలకూ ఎంతమాత్రం ఆసక్తి ఉంటుందో తెలీదు. నాకు తోచింది చెప్తానన్నాను. నాతో పాటు అజయ్‌ ప్రసాద్‌ కూడా వచ్చాడు. ఇదే కార్యక్రమంలో కవిత్వం గురించి అనిల్‌ బత్తుల మాట్లాడాడు. ఇదొక భిన్న అనుభవం. వాళ్లకు మధ్యమధ్యలో కొన్ని కథలు చెప్తూ దీన్ని కొనసాగించాను. పాక్షికంగా దీన్ని ఒక ఇంటెరాక్టివ్‌ సెషన్‌గా ప్లాన్‌ చేసుకున్నాను కాబట్టి, ఇందులో గ్యాప్స్‌ ఉంటాయి. అయినా దీనికిదే ఇచ్చేది కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్‌ చేస్తున్నా. చివర్లో కొంతభాగం మాత్రం కత్తిరించాను. ఇంతకుముందు చదవకపోయివుంటే, 
  ఇందులోని కథలు వెతుక్కుని చదువుకోవడం మీ ఎక్సర్‌సైజ్‌...  అన్నట్టూ,  ఎప్పుడూ చేయని పని చేసినందుకేమో, మేము బయటికి వచ్చీరాగానే జోరు వాన అందుకుంది.)







క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌

వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, హైదరాబాద్‌

 సెప్టెంబర్‌ 8, 2022

పూడూరి రాజిరెడ్డి


నాకు కొంచెం స్టేజ్‌ ఫియర్‌ ఉంది. నా వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుందోగానీ, దీనివల్ల నాకు ఒక ప్రాక్టీస్‌ సెషన్‌ అనుకోవచ్చు.


ఇక్కడికి రావడానికి నాకున్న అర్హత ఏమంటే– నేనొక మూణ్నాలుగు పుస్తకాలు రాసివున్నా. సాక్షి పేపర్లో సాహిత్యం పేజీని ఒక ఐదున్నరేళ్లు నడిపివున్నాను.


క్లుప్తంగా మీ పరిచయం: మీ పేరు– మీ ఊరు– మీ ట్రేడ్‌?


మీరు పుస్తకాలు చదువుతారా?

బాగా నచ్చిన పుస్తకాలేంటి?

మీకు తెలిసిన కొందరు రచయితల పేర్లు ఏంటి?

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు?

డైరీ ఎవరైనా రాస్తారా?

కనీసం రోజూ న్యూస్‌ పేపర్స్‌ చదువుతారా?


మీరు దేనికీ సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా నేను హేపీనే. ఎందుకో తెలుసా? ఈ మధ్య ఒక ఇట్లానే జరిగిన ఒక రైటింగ్‌ ప్రోగ్రామ్‌లో ఆ నిర్వాహకుడు అన్నారు: ప్రపంచంలో 99 శాతం మంది రాయరు. ఒక్క శాతం మందికి మాత్రమే రాయాలన్న ఆలోచన ఉంటుంది. రాస్తారో లేదో తర్వాత సంగతి. కానీ మీకు రాయాలన్న ఆలోచన వచ్చినందుకే మీరు ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేసినట్టు. అంటే క్రీమీ లేయర్‌ మీరు. అందుకనైనా మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు.

((క్లాప్స్‌))


ముందుగా ఒక కథ చెప్పుకుందాం. తర్వాత కొంత బోర్‌ కొట్టిస్తా.


వడ్ల గింజలు

––––––––

ఒకటో కథ: వడ్ల గింజలు– శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గడికి రెండు వడ్ల గింజలను పెంచుకుంటూ 64 గళ్ల వరకూ వెళ్లడం అనేది ప్లాట్‌.


రైటింగ్‌/ సాహిత్యం అంటే?

––––––––––––––––

అయితే రైటింగ్‌ అనేది ఏమిటి? (మొత్తంగా దీన్ని సాహిత్యం, లిటరేచర్‌...)


1. అయితే రైటింగ్‌ అనేది ఏమంటే– చాలా చిన్న ఏరియా. కానీ మనదైనది. సేక్రెడ్‌ స్పేస్‌. బ్యూటిఫుల్‌ స్పాట్‌.

ఒక ఇళ్లు చూడండి. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, దాని ఎత్తు, వైభవం... అన్నీ ఉండొచ్చు. కానీ ఒక చిన్న పూలమొక్క దాని ముందట నాటితే ఆ ఇళ్లు మొత్తానికి ఒక అందం వస్తుంది. ఆ ప్రక్రియ మొత్తం అర్థవంతం అవుతుంది, అదీ సాహిత్యం అంటే. అదీ సృజన.


2. ఇంకో రకంగా చెప్పాలంటే, సాహిత్యం అనేది ఒక ఎమోషన్‌. మనం ఒక చారిత్రక ప్రదేశానికి పోయామనుకుందాం. అక్కడ అద్భుతమైన నిర్మాణం కనబడుతుంది. ఒక ఫీలింగ్‌ వస్తుంది. దాన్ని ఎవరు ఎప్పుడు కట్టారో అక్కడ ఫలకాల మీద వివరాలు దొరకొచ్చు. కానీ ఆ కట్టే ప్రాసెస్‌లో జరిగిన మనుషుల అనుభవాలు ఏమిటి, ఆలోచనలు ఏమిటి, ఆ వివరాలు మనకు అక్కడ దొరకవు. వాటిని ఎవరైనా నమోదు చేస్తే అది సాహిత్యం అవుతుంది.

ఇదే కాలేజీ తీసుకోండి. ఇది ఫలానా సంవత్సరంలో ప్రారంభమైమంది, ఇక్కడ ఇంతమంది చదువుతున్నారు, ఈయీ విభాగాలున్నాయి, ఈయీ టైముల్లో బస్సులు వస్తాయి, అనే వివరాలు మనకు ఉపయోగపడతాయి. కానీ సాహిత్యం అనేది అంతకుమించి. ఆ సినిమాలో అంటాడు కదా... అట్లా అంతకుమించి. 

ఒక విద్యార్థి మొదటిరోజు ఈ కాలేజికి వచ్చినప్పుడు అతడికి ఎలాంటి ఫీలింగ్‌ కలిగింది, క్యాంటీన్లో అతడు ఏది ఇష్టంగా తింటాడు, ఫీజు కట్టడానికి అతడు ఎలాంటి ఘర్షణ అనుభవించాడు, ఈ చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న మథనం అతడిలో ఎంత తీవ్రంగా ఉంది... ఇవన్నీ సాహిత్యం అవుతాయి. 

ఎవరో మనిషి గురించి ఇంకెవరో రాస్తే అది మనకెందుకు పనికొస్తుంది? మనకెందుకు నచ్చుతుంది?

ఎందుకంటే అందులో మనల్ని చూసుకుంటాం. అక్కడ వచ్చిన విద్యార్థి తొలిరోజు భయం లాంటిదే మనకూ ఉంటుంది. అతడికి ఈ కాలేజీలో ఏదో ఒకటి ప్రత్యేకంగా నచ్చినట్టు మనకు ఇంకేదో ఉంటుంది. అతడికి వాళ్ల నాన్నతోనో అమ్మతోనో ఉండే ఉద్వేగం లాంటిది మనకూ మన కుటుంబంతో ఉంటుంది. వివరాలు మారుతాయి. కానీ ఎమోషన్‌ అదే. అందువల్ల మనం కనెక్ట్‌ అవుతాం. అతడితో కలిసి మనం కూడా ప్రయాణిస్తాం.

సాహిత్యం అనేది హ్యూమన్‌ కండీషన్‌ను చెప్పేది.


ఎ డేస్‌ వెయిట్‌

–––––––––

ఎర్నెస్ట్‌ హెమింగ్వే. ఫారిన్‌హీట్‌కూ సెంటీగ్రేడ్‌కూ తేడా తెలియని పిల్లాడి కథ. 1933. ఫస్ట్‌ పెర్సన్‌ కథ. 102 డిగ్రీల ఫారిన్‌హీట్‌. 44 డిగ్రీల సెల్సియస్‌.


రైటింగ్‌ అనేదాన్ని నేర్పవచ్చా?

––––––––––––––––––

నా ఉద్దేశంలో అయితే నేర్పలేము. మరి మీరెందుకు వచ్చినట్టు అని ప్రశ్న వస్తుంది. కానీ నేర్పలేము అని చెప్పడానికైనా నేను రావాలి కదా:–)

వంట నేర్పొచ్చు. బట్టలు కుట్టడం నేర్పొచ్చు. ఏదైనా యంత్రాన్ని ఆపరేట్‌ చేయడం నేర్పొచ్చు. అవన్నీ స్కిల్స్‌. కానీ రైటింగ్‌ అనేది ఆర్ట్‌. ఏ ఆర్ట్‌ అయినా ఎవరికి వారే నేర్చుకోవాలి. ఆర్టిస్టు ఉన్నాడనుకుందాం. ఏ కలర్‌తో ఏది కలిపితే ఏ షేడ్‌ వస్తుంది అనే వివరం చెప్పొచ్చు. ఏ కాగితం వాడాలి అని చెప్పొచ్చు. కానీ బొమ్మ ఎలా గీయాలి అనేది మనమే సాధన చేయాలి. అట్లాగే రైటింగ్‌ కూడా.

అందుకే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను.


సాహిత్యంలో ప్రక్రియలు: కథ

–––––––––––––––

ఇందులో ఎన్నో రకాల ప్రక్రియలున్నాయి. క£ý,, కవిత్వం, నవల, వ్యాసం, నాటకం. ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకునే విషయం, దాని విస్తృతి, దాన్ని చెప్పాలనుకునే పద్ధతిని బట్టి మారుతాయి. కానీ అన్నీ కూడా మొత్తంగా సాహిత్యం కిందికే వస్తాయి.


కథ ఇక్కడ మనకు టాపిక్‌ కాబట్టి– ఏది కథ అవుతుంది?


మన జీవితంలోని ఒక అధ్యాయం కథ అవుతుంది.

ఒక పాయింట్‌ నుంచి ఇంకో పాయింట్‌కు చేసే ప్రయాణం కథ.

లేదా ఒక నియమిత టైమ్‌ పీరియడ్‌లో జరిగే వ్యవహారం. అంటే ఒక ఉదయం నుంచి ఒక సాయంత్రం వరకు. కొన్ని రోజుల్లో కూడా జరగొచ్చు. అది టాపిక్‌ను బట్టి ఉంటుంది.


అసలు ఏం రాయొచ్చు?

దానికి జవాబు ఏం రాయకూడదు? అండర్‌ ద స్కై ఏదైనా రాయొచ్చు. 


సినిమాల ఉదాహరణ అయితే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా. ఎన్ని సినిమాలున్నాయో అన్ని రకాల కథలున్నాయి. ఇది వద్దు, ఇది రాయొద్దు అనేది ఏమీ ఉండదు. కానీ సినిమా అనేది నవల కిందకు వస్తుంది. ఎందుకంటే అందులో టైమ్‌ స్పాన్‌ ఎక్కువుంటుంది. పాత్రలు ఎక్కువుంటాయి. అదే కథలో తక్కువ పాత్రలు ఉంటాయి. తక్కువ టైములో అయిపోతుంది.


కథ ఎన్ని పేజీలుండొచ్చు? 

పది పేజీలు.

నాలుగు పేజీలు.

ఒక్క పేజీ.

ఒక్క పేరా.


అలాగని ఇదేమీ రూల్‌ కాదు. సాహిత్యంలో దేనికీ రూల్స్‌ ఉండవు. ఇలాగే చేయాలీ అని దేనికీ ఉండదు. ఇవన్నీ కూడా అందాజాగా చెప్పుకోవడానికే.


వంద పేజీలు కూడా ఉండొచ్చు. పాత కాలంలో అట్లా రాసేవాళ్లు. అప్పుడు నవల సైజు వెయ్యి పేజీలుండేది. కానీ ఇప్పుడు రెండొందల పేజీల్లో నవల అయిపోతుంది. జనాల చదివే ఓపికను బట్టి కూడా అది మారిపోతుంది. మీరు ఇప్పుడు వంద పేజీల కథ రాస్తా అంటే ఎవరూ వద్దనరు.


కథల్లో రకాలు

––––––––

హాస్య కథ. డ్రామా. ట్విస్ట్‌. క్రైమ్‌. పిల్లల కథ. జానపద కథ. సస్పెన్స్‌. బ్లాక్‌ హ్యూమర్‌. సెటైర్‌.


మీకు వివరాల కంటే కూడా ఇంకో కథ చెప్తా. 


ద లేడీ ఆర్‌ ద టైగర్‌

–––––––––––––

ద లేడీ ఆర్‌ ద టైగర్‌. రచయిత: ఫ్రాంక్‌ ఆర్‌.స్టాక్‌టన్‌. 1882. అమెరికన్‌ రైటర్‌.

బార్బారిక్‌ కింగ్‌. టూ కేజెస్‌. లేడీ. టైగర్‌. శిక్షలో భాగంగా లేడీని వివాహం చేసుకోవాలి. లేదా పులికి అర్పణం కావాలి. కూతురి ప్రేమికుడు. అందులో ఉన్న అమ్మాయి మీద యువరాణికి జెలసీ. పజిల్‌ స్టోరీ.


సింపుల్‌గా మీకు నేరేట్‌ చేయడానికి పనికొచ్చేవి చెప్తున్నా. వంద పేజీల కథలు ఇట్లా ఉండవు.

ఇంకో కథ.


గుమస్తా మరణం

––––––––––

చెహోవ్‌. రష్యన్‌.


భాష, శైలి, శిల్పం

–––––––––––

భాష: స్పోకెన్‌ / రిటెన్‌ లాంగ్వేజెస్‌

మీ ప్రాంత మాండలీకాన్ని వాడుకోవడం. 

పిల్లాడి కోణంలో కథ చెప్తే ఆ పిల్లాడికి తెలిసిన భాష వరకే వాడాలి. మీకు తెలిసిన పదాలన్నీ పెట్టొద్దు. మీకు భాష వచ్చు కదా అని రాయొద్దు.

అట్లాగే ఒక పేదవాడు, చదువుకోనివాడు కథలో ఉంటే ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో అంతవరకే రాయాలి. 


మధ్యాహ్న భోజనానికి ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు. ఒక మిడిల్‌ క్లాస్, అర్బన్‌ మిడిల్‌ క్లాస్‌ అయితే అట్లాంటిది జరగడం సంభవమే. అంటే మనం చెప్పేది ఎదుటివాడు నమ్మేట్టుగా ఉండాలి.


శైలి:

ఆ రచయితకే ప్రత్యేకం.


శిల్పం:

ఫస్ట్‌ పెర్సన్‌.

సెకండ్‌ పెర్సన్‌.

థర్డ్‌ పెర్సన్‌.


కథను ఎట్లా చెబుతున్నాం. ఇందాకటి ఫారిన్‌హీట్‌(ఎ డేస్‌ వెయిట్‌) స్టోరీలో– తండ్రి ఆ కథ చెప్పినట్టుగా రాయొచ్చు. ఆ కొడుకు చెప్పినట్టుగా రాయొచ్చు. వాళ్లింట్లో ఉండే ఓ పనిమనిషి చెప్పినట్టు రాయొచ్చు. లేదా వాళ్లింట్లో కుక్క చెప్పినట్టు కూడా రాయొచ్చు. ఏం ఎందుకు రాయకూడదు? కానీ అప్పుడు ఆ కుక్క అనేదానికి దగ్గరగా మనం వెళ్లాలి. 


సాహిత్యం అనేది ఏమంటే, మనం ఒకటి చెప్పి ఎదుటివాటిని ఒప్పించడం. 

అలా లేదంటే– కథ అయితే చదవబుద్ధి కాదు.

పుస్తకం కొనుక్కుంటే విసరకొట్టబుద్ధి అవుతుంది.

సినిమా అయితే ఫ్లాప్‌ అవుతుంది.


మనమూ ఒక కథ రాద్దాం

–––––––––––––––

ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు అన్నాను. కానీ ఇదే కథ రాయకూడదా? రాయొచ్చు. అతడు ఏ బిల్డింగ్‌ పనికో పోయాడనుకుందాం, అక్కడ ఎవరో బుక్‌ చేసుకోవడం చూస్తాడు, తనకూ అట్లా తినాలని ఆశ పుడుతుంది, దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తాడు... ఇంక ఇప్పుడు.... 


ఏది సాహిత్యం అవుతుంది?

(మనలోంచి రాకుండా, మన అనుభవంలోంచి, మన ట్రూ ఎమోషన్‌లోంచి రానిదేదీ సాహిత్యం కాదు.

దిశకూ అప్లై అయ్యి, ఇంకొకరికి కాకూడదు. తేడా అర్థం చేసుకోండి.

స్పెసిఫిగ్గా ఉండాలి. అప్పుడు అది జనరలైజ్‌ అవుతుంది.


ద గిఫ్ట్‌ ఆఫ్‌ ద మ్యాజి

––––––––––––

ఓ.హెన్రీ. 1905. జిమ్‌. డెల్లా. ఆర్నమెంటల్‌ కోంబ్‌. తండ్రి నుంచి వచ్చిన వాచీకి చెయిన్‌. పరస్పరం రహస్య క్రిస్ట్‌మస్‌ బహుమతులు.


రాయడం వల్ల ఏమొస్తుంది?

––––––––––––––––

1. ఒక సమస్య నుంచి రిలీవ్‌ అయిపోతాం.

2, లార్జర్‌ పెర్‌స్పెక్టివ్‌లో విషయాన్ని చూస్తాం.

3. క్రియేటివ్‌ ప్లెజర్‌.

4. ఆటో బయాగ్రఫీ.

5. ఇంకా ఏంటంటే– రాస్తే మీ ఆలోచనలు ఒక పర్ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తాయి. మీ వేగ్‌ థాట్స్‌ ఒక క్రమబద్ధీకరణ జరగుతుంది.

6. ఇంకో ఆనందం ఏమిటంటే– మీరు రాస్తూ కూర్చున్నప్పుడు వాటికవే కొన్ని ఆలోచనలు తన్నుకుని వస్తాయి. అవి మన లోపల ఉన్నట్టు మనక్కూడా తెలియదు. అదొక మ్యాజిక్‌.

7. ఉన్న జీవితాన్ని మరింత అందంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి సాహిత్యం పనికొస్తుంది.


బాగా రాయాలంటే ఏం చేయాలి?

––––––––––––––––––––

రాయడానికి చదవడం ఒక్కటే దారి. ఎంత చదివితే అంత తెలుస్తుంది.


నేను ఎట్లా రాస్తాను?

–––––––––––––

1. ఆలోచన రాగానే ఇట్లా నోటుబుక్కులో(నా పాకెట్‌ నోట్స్‌) రాసుకుంటాను.

2. రియాలిటీ అనేది బట్ట అనుకుంటే, దానికి నా ఊహతో కుట్లు వేస్తాను.

3. చీకట్లో హెడ్‌లైట్‌ వేసుకుని చేసే ప్రయాణం లాంటిది. దానితోపాటే మనమూ ప్రయాణిస్తాం. మనక్కూడా అప్పుడే తెలుస్తుంటుంది, తొవ్వ.

4. మన పెర్సనాలిటీ కలుపుకొని ఒక పాత్రను సృష్టిస్తాం. ఒక్కోసారి రెండు మూడింటిని కలిపి సృష్టిస్తాం.


నాకోసం ఒక ఎక్సర్‌సైజ్‌

––––––––––––––

ఈత గురించి మీకు ఎంత చెప్పినా ఈత రాదు. నీళ్లలోకి దిగితేనే ఈత వస్తుంది.

రాయడం బద్దకం. సినిమా చూస్తే చేరగిలబడి చూడటం లాంటిది కాదు. దిగాలి. పని. పెయిన్‌. కాని రాసింది చూసుకుంటే ఆనందం వస్తుంది. కాబట్టి రాయాలి.


క్లుప్తత:

50 పదాలు – 500 పదాలు

ఏది రాసినా దానికదే కేంద్రకం ఉండాలి.

అమీబా తెలుసుగా...ద్విదా విచ్ఛిత్తి... ఎన్నిసార్లు విడిపోయినా ప్రతిదీ ఒక పరిపూర్ణమైన జీవి కదా...

అట్లా మీరు రాసేది కూడా ఎంత నిడివితో అయినా అంతే ప్రాణంతో ఉండాలి.


మా పెద్దాడు– చిన్నప్పుడు ఏదీ తింటా అనడు. 

ఉప్మా.

ఆ పల్లీలు

ఆ వాసన

నెమ్మదిగా అందులోకి దిగుతాడు.

మీరు కూడా తెల్లకాగితం ముందుపెట్టుకుని కూర్చోండి. మీకు మీరు హిప్నటైజ్‌ చేసుకోండి...

2 comments: