Saturday, November 18, 2023

ఎందరో మహానుభావులు

 


పీవీ సతీశ్ (ఈ పొటో నెట్లోంచి తీసుకున్నది)


ధాన్యాగారం


లక్ష్మమ్మ


కొర్ర


సజ్జ


రాగి


అరికె


పులిచింత


గుంట గలగర







తెల్లాపూర్ ప్రదర్శన


ఎందరో మహానుభావులు

––––––––––––––––
పీవీ సతీశ్‌ గారు పోయారని తెలిసింది (2023 మార్చి 19). ఆయన్ని రెండుసార్లు చూశాను. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) తరఫున తినదగిన ‘కలుపు’ మొక్కల గురించిన ఒక అవగాహనా కార్యక్రమాన్ని జహీరాబాద్‌ దగ్గరి పస్తాపూర్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసి, బస్సులు పెట్టారు. నేను మా ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. అక్కడ పనిచేస్తున్న గ్రామీణ మహిళలతో చేన్లలోనే మాట్లాడుతూ, సాధారణంగా మనం కలుపు అని తీసివేసే ఎన్నింటిని నిజానికి తినవచ్చో ప్రత్యక్షంగా చూపించే కార్యక్రమం అది. దానికి తగినట్టుగానే ఆ రోజు మధ్యాహ్న భోజనం ఆ ఆకుకూరలతోనే అద్భుతంగా వడ్డించారు. వాళ్ల ఉద్దేశంలో కలుపు అనేది లేదు. అవి వైల్డ్‌ ప్లాంట్స్‌ లేదా సాగుచేయని మొక్కలు మాత్రమే. చిన్నప్పటినుంచీ బతుకమ్మలో పువ్వుగా ఉపయోగించే గునుగు లేత ఆకుల్ని కూడా కూరగా వండుకోవచ్చని అంతకుముందు నాకు తెలీదు. ఇదే గునుగుకు కవలలా అనిపించే జొన్న చెంచలి అత్యంత పోషక పదార్థాలున్న వైల్డ్‌ ప్లాంట్‌ అని వాళ్ల పరిశోధనలో తేలిందన్నారు. వంటలు, ఇతర ప్రదర్శన ఏర్పాటుచేసిన ఆ ప్రదేశం కూడా సింపుల్‌గా, కళాత్మకంగా ఉంటుంది. అది నాకు ఎంత నచ్చిందంటే, నా యూట్యూబ్‌ ఛానల్‌కు పెట్టుకున్న కవర్‌ ఫొటో అక్కడ తీసుకున్నదే. ఆ రోజంతా కార్యక్రమాలు ముగిసిపోయాక, మళ్లీ తిరుగు ప్రయాణంలో హెడ్‌ ఆఫీసు దగ్గర కాసేపు ఆగాం. అప్పుడు సతీశ్‌ గారు మాతో పిచ్చాపాటీలాగే కానీ చాలా మంచి విషయాలు మాట్లాడారు.
డీడీఎస్‌ లక్ష్యాలు నాకు ఆసక్తికరమైనవి. పర్యావరణ హిత పంటలు పండించడం, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ఆహార వైవిధ్యాన్ని గుర్తించడం, సహజ విత్తనాలను కాపాడటం, జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్ట పంటలతో ఆర్థిక స్వావలంబన కలిగించడం. గ్రామీణ మహిళల మహిళల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడటం లాంటివి వారి కార్యకలాపాలు. ఆ మహిళలే వాళ్ల కమ్యూనిటీ రేడియో నడుపుతారు. డీడీఎస్‌ లాగే సతీశ్‌ గారి కెరియర్‌ కూడా ఆసక్తికరమే, 1990ల మొదట్లో డీడీఎస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన కీలక పనుల్లో ఉన్నారు.
‘ఆకుకూరల పండుగ’ అవగాహనతో తర్వాత్తర్వాత మేము మా ఇంట్లో జొన్న చెంచలి, గునుగుతో పాటు, బంకంటి, ఎన్నాద్రి, గుంట గలగర, గలిజేరు, పులిచింత లాంటి ఆకుకూరల్ని వండటం మొదలుపెట్టాం. అంటే ఎప్పుడైనా నగర శివార్లు దాటినప్పుడు, ‘అరే ఇది తగరంచ కూర కదా, పనికొస్తుంది’ అని ఆత్రంగా తెంపుకొచ్చేవాడినన్నమాట! తెంపుకొచ్చేవాడిని అంటే, ఇప్పుడు చేయట్లేదా అంటే– ఆ ఉడుకు కొంచెం తగ్గింది.
మళ్లీ రెండోసారి ఆయన్ని ఇదే డీడీఎస్‌ వాళ్లు తెల్లాపూర్‌లో ఇవే సాగుచేయని ఆకుకూరలతో భోజనం, అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేసినప్పుడు చూశాను. ఆయన మాట్లాడుతుంటే తెలంగాణవాడు కాదని తెలిసిపోతుంది(కర్ణాటక పెద్దమనిషి). కానీ పాత తెలంగాణ యాస ఒకటి ఆయన నోట చిత్రంగా పలుకుతుంది. బహుశా దశాబ్దాలుగా పల్లీయులతో మమేకం కావడం వల్ల ఒంటబట్టిన భాష అయివుండాలి.
నిజానికి ఈ సాగుచేయని ఆకుకూరలు అనేవి డీడీఎస్‌ వల్ల నాకు అందిన ఒక పార్శ్వం మాత్రమే. రోజువారీ బియ్యానికి ప్రత్యామ్నాయ ఆహారం గురించిన ఆలోచన చేస్తున్నప్పుడు– అంబటి సురేంద్రరాజు గారు ఈ డీడీఎస్‌ గురించి మొదటిసారి చెప్పారు. అసలు వందల ఎకరాల్లో గ్రామీణ స్త్రీలు మెట్టపంటలు పండిస్తున్నారన్న విషయం నన్ను ఎక్సయిట్‌ చేసింది. వ్యవసాయం, ఆహారం గురించి చాలా విషయాలు పంచుకునే పంతంగి రాంబాబు గారు డీడీఎస్‌ దగ్గరికి వెళ్లేలా పురిగొల్పారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో కనబడి ఉత్తేజితం చేసే ‘యవలు’ మొదటిసారి బేగంపేటలోని డీడీఎస్‌ స్టోర్‌లోనే చూశాను. చూడ్డానికి పొడువు రకం గోధుమల్లా ఉంటాయివి.
కేవలం స్టోర్‌ నుంచి తెచ్చుకుని ఏదో వండుకోవడం కాకుండా, వాటిని మా ఊళ్లోనే పండించాలని అనుకుని– అంటే ఈ ఆకుకూరల పండుగలన్నింటికన్నా చాలా ముందు– పస్తాపూర్‌ వెళ్లి చిరుధాన్యాల విత్తనాలను సంపాదించాను. ప్రతిచోటికీ కలిసి తిరిగే అజయ్‌ ప్రసాద్‌ తానూ వస్తానని నా వెంట వచ్చాడప్పుడు. ఝరాసంగం పర్యటన అని మాకు మేము చెప్పుకొంటాం దాని గురించి. మా ఆసక్తికి ముచ్చటపడి, ఆ విత్తనాలను ఆ పెద్ద నిల్వ చేసిన కాగుల్లోంచి తోడి ఇచ్చింది లక్ష్మమ్మ. అప్పుడు తెచ్చిన సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊదల్ని మా ఊళ్లో వేశాం. మా ఊళ్లో చాలామంది ఆసక్తికి కారణమవుతూ కొన్నేళ్లు వరుసగా పండించాం. కానీ మానవ ప్రయత్నం చాలా ఎక్కువ. అన్నీ మాన్యువల్‌గానే చేయాలి. విస్తారంగా అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ ప్రాసెస్‌ కొంత సుళువవుతుంది. (తర్వాత ఖాదర్‌వలీ గారు రంగప్రవేశం చేయడం, ఆయన ఐదింటిని– కొర్ర, అండుకొర్ర, అరికె, సామ, ఊద– ప్రత్యేకంగా చిరుధాన్యాలుగా నామకరణం చేయడం తర్వాతి సంగతి. ఈ స్ఫూర్తితో డీడీఎస్‌ దగ్గర లేని అరికలు, అండుకొర్రలు కూడా విడిగా సంపాదించి పండించాను. అరికలను రాజేంద్ర నగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ సురేశ్‌ గారు ఇచ్చారు. అండుకొర్రల్ని రాంబాబు గారు కడప నుంచి సంపాదించి ఇచ్చారు.)
పీవీ సతీశ్‌ గురించి మొదలుపెట్టి నేను చాలామంది పేర్లు తలుస్తున్నానని తెలుసు. అంటే ఏ ఒక్కరో మన ప్రపంచాన్ని విస్తృతపరచరు. ఉదాహరణకు నేల ఉసిరి, తుమ్మికూర, అటకమామిడి గురించి నేను మొదటిసారి నామిని దగ్గర విన్నాను. నిజానికి ఇదంతా మనకు పరంపరగా రావాల్సిన జ్ఞానం. కానీ ఎక్కడో లంకె తెగిపోయింది. దాన్ని తిరిగి ముడివేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించి చాలా విలువైనవాళ్లు. అందులో డీడీఎస్‌ వ్యవస్థాపకుడిగా పీవీ సతీశ్‌ మొదటి వరుసలో ఉంటారు.

21-3-2023

No comments:

Post a Comment