నా ‘నగరంలో వాన’ కన్నడ అనువాదం, మయూర కన్నడ మంత్లీ 2018 డిసెంబర్ సంచికలో ప్రచురితమైంది. ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సంకలనంలోంచి దీన్ని అనువదించినవారు జగదీశ్ చంద్ర బాగ్లి. ఖదీర్‌బాబు గారి సంపాదకత్వంలో కృష్ణమోహన్‌బాబు గారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని కువెంపు భాషాభారతి ప్రాధికార సంస్థ మొత్తంగా కన్నడంలోకి అనువదించే పని చేపట్టింది. అయితే జగదీశ్ గారు తన చొరవ కొద్దీ దాన్ని మయూరకు కూడా ఇచ్చారు. ఈ మాసపత్రికను నేను ఎలా రిలేట్ చేసుకోగలనా అని చూస్తే, పి.లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి లాంటివాళ్లు దానికి ఒకప్పుడు సంపాదకులుగా పనిచేశారని వికీ చెబుతోంది. ఇక కన్నడ అక్షరాల్లో ఉన్న నా పేరును మా పిల్లలిద్దరు కూడా పోల్చుకోగలగడం అదనపు సంతోషం.
జగదీశ్ చంద్ర బాగ్లి, పూడూరి రాజిరెడ్డి
పూడూరి రాజిరెడ్డి, జగదీశ్ చంద్ర బాగ్లి, ఆర్టిస్ట్ అన్వర్
ఈ కథ అచ్చయ్యాక, జగదీశ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, మా ఆఫీసుకు కూడా వచ్చారు(2019 జనవరి 1). ఆయన్ని అదే చూడటం. అంతకుముందు అనువాదం గురించి ఒకట్రెండు ఫోన్ కాల్స్, మెసేజెస్ మార్పిళ్లు మాత్రం జరిగాయి. ఒకట్రెండు సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామి అని కూడా అప్పుడే తెలిసింది. అన్వర్ గారు ఆయనకు ముందే పరిచయం. దాంతో ముగ్గురం కలిశాం. అప్పటి ఫొటోలు ఇవి. దురదృష్టవశాత్తూ కోవిడ్ కాలంలో జగదీశ్ గారు పోయారని తెలిసింది. బాధాకరం!
No comments:
Post a Comment