Monday, July 29, 2024

నా గుర్రప్పిల్ల


Lucia Berlin

లూసియా బెర్లిన్‌ ‘మై జాకీ’-My Jockey- కథకు నా అనువాదం ఇది. తన జీవితకాలంలో విస్తృతమైన పాఠకలోకానికి ఎన్నడూ చేరువకాని లూసియా బ్రౌన్‌ బెర్లిన్‌ (1936–2004) రచనలు ఇప్పుడు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమెరికా దాచుకున్న రహస్యం అని ఆమెను అభివర్ణిస్తున్నారు. ‘ఎ మాన్యువల్‌ ఫర్‌ క్లీనింగ్‌ విమెన్‌’ ఎంపిక చేసిన ఆమె కథల సంపుటి. ఈ అమెరికన్‌ రచయిత్రి ఆలస్యంగా రాయడం ప్రారంభించింది. అనారోగ్యం ఆమెను దీర్ఘకాలం బాధించింది. క్లుప్తంగా రాయడం లూసియా ప్రత్యేకతల్లో ఒకటి. ఐదు పేరాలు మాత్రమే ఉన్న ఈ కథ 1985లో జాక్‌ లండన్‌ షార్ట్‌ ప్రైజ్‌ గెలుచుకుంది.

 ––


నా గుర్రప్పిల్ల

ఎమర్జెన్సీలో పనిచేయటం నాకిష్టం– అక్కడ మనం ఎటూ మగవాళ్లనే కలుస్తాం. నిజమైన మగవాళ్లు, హీరోలు. ఫైర్‌మాన్లు, జాకీలు. వాళ్లెప్పుడూ ఎమర్జెన్సీ గదుల్లోకి దూరుతుంటారు. జాకీల ఎక్స్‌రేలు అద్భుతంగా ఉంటాయి. వాళ్లు ఎప్పుడూ ఎముకలు విరగ్గొట్టుకుంటుంటారు, కానీ తమకు తామే కేవలం ఏదో టేపు చుట్టేసుకుని తరువాతి పందెంలో పాల్గొంటుంటారు. వాళ్ల అస్థిపంజరాలు చెట్లలా కనబడతాయి, పునర్నిర్మించిన బ్రాన్టోసారస్‌(1)లా. సెయింట్‌ సెబాస్టియన్‌ ఎక్స్‌రేలా.

నా దగ్గరికే జాకీల్ని ఎందుకు పంపుతారంటే వాళ్లందరూ మెక్సికన్లు, నేను స్పానిష్‌ మాట్లాడగలను. నేను కలిసిన మొదటి జాకీ మున్యోజ్‌. వచ్చినవాళ్లందరి బట్టల్ని నేను విప్పాల్సివుంటుంది, అదేం పెద్ద విషయం కాదు, కొన్ని సెకన్లలో అయిపోతుంది. మున్యోజ్‌ అక్కడ పడివున్నాడు, స్పృహలో లేకుండా, దేవుడా! కామరూపంలోని యాజ్టెక్‌(2) శిల్పంలా. అతడి దుస్తులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయంటే నేనేదో సుదీర్ఘ క్రతువును నిర్వహిస్తున్నట్టు అనిపించింది. అవి విప్పేసరికి అలసిపోయినంత పనైంది, మిషిమా(3) రచనల్లో గొప్పింటి మహిళ తన కిమోనో విప్పడానికి మూడు పేజీలు పట్టినట్టు. అతడి రాణీరంగు సిల్కు చొక్కాకు భుజం వెంబడి ప్రతి చిన్న మలుపు దగ్గరా ఎన్నో బొత్తాములున్నాయి. అతడి ప్యాంటు దట్టమైన అల్లికతో కట్టబడివుంది. అన్నీ పాతకాలపు(ప్రి–కొలంబియన్‌) ముడులు. అతడి బూట్లు పేడ, చెమట వాసన వేస్తున్నాయి, కానీ అవి సిండెరెల్లా బూట్లంత మెత్తగా, నాజూగ్గా ఉన్నాయి. అతడు పడుకొనే ఉన్నాడు, వశం చేసుకోగలిగే యువరాజు.

అతడు మేలుకోవడానికి ముందే వాళ్లమ్మ గురించి కలవరించడం మొదలుపెట్టాడు. అతడు కేవలం నా చేయిని మాత్రమే పట్టుకోలేదు కొందరు రోగుల్లా, నా మెడను వాటేసుకొని మామసీటా, మామసీటా అని వెక్కడం మొదలుపెట్టాడు. ఊయల్లోని బుజ్జాయిలా నేను పట్టుకున్నప్పుడు మాత్రమే అతడు డాక్టర్‌ జాన్సన్‌ను పరీక్షించనిచ్చాడు. అతడు పిల్లాడంత బుజ్జిగా ఉన్నాడు కానీ బలంగా, మగటిమితో ఉన్నాడు. నా ఒడిలో ఒక మగవాడు. కలల పురుషుడు? కలల చిన్నారి?

నేను మున్యోజును స్ట్రెచర్‌ మీదికి మార్చడానికి తంటాలు పడుతున్నప్పుడు డాక్టర్‌ జాన్సన్‌ నా నుదుటిని స్పాంజితో తుడిచాడు. కచ్చితంగా ఇతడి కంటె ఎముక విరిగివుంటుంది, కనీసం మూడు పక్కమెముకలు విరిగుంటాయి, బహుశా మెదడుకో గట్టి దెబ్బ తగిలేవుంటుంది. లేదు, అన్నాడు మున్యోజ్‌. రేప్పొద్దుటి పందెంలో అతడు స్వారీ చేయాలి. ఇతణ్ని ఎక్స్‌ రే తీయండి, అన్నాడు డాక్టర్‌ జాన్సన్‌. స్ట్రెచర్‌ మీద అతడు పడుకోవడం లేదు కాబట్టి కిందికి కారిడార్‌ దాకా నేనే మోసుకెళ్లాను, కింగ్‌ కాంగ్‌లాగా. అతడు భీతిల్లి ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, అతడి కన్నీళ్లతో నా రొమ్ము తడిచిపోయింది.

ఎక్స్‌ రే టెక్నీషియన్‌ వచ్చేవరకూ ఆ చీకటి గదిలో మేము వెయిట్‌ చేశాం. ఒక గుర్రాన్ని ఉపశమింపజేసినట్టుగా నేను అతడిని ఓదార్చాను. కాల్‌మాతే, లిండో, కాల్‌మాతే, ఏం ఫర్లేదు, బంగారం, ఏ ఫర్లేదు. డిస్పాసియో... డిస్పాసియో. నెమ్మదిగా... నెమ్మదిగా. నా చేతుల్లో శాంతించాడు, మృదువుగా ఎగబీల్చాడు, బుస కొట్టాడు. అతడి చక్కటి వెన్నుపూసను నిమిరాను. ఒక దివ్యమైన గుర్రప్పిల్లలాగా అదోసారి చిన్నగా పులకించింది, కంపించింది. అద్భుతంగా ఉండిందది.

(బ్రాన్టోసారస్‌= ఒక రకం డైనోసార్‌; యాజ్టెక్‌= పదిహేనో శతాబ్దంలో మెక్సికోలో వర్ధిల్లిన సామ్రాజ్యం; యుకియో మిషిమా= జపాన్‌ రచయిత;)


(సాక్షి సాహిత్యం; 2019 నవంబర్‌ 25)


 

Friday, July 26, 2024

చింతా దీక్షితులు: ముద్దు

 


చింతా దీక్షితులు

చింతా దీక్షితులు కథ ‘ముద్దు’కు ఇది సంక్షిప్త రూపం. రచనా కాలం: 1920. సౌజన్యం: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌. చింతా దీక్షితులు (1891– 28 ఆగస్ట్‌ 1960) తూర్పు గోదావరి జిల్లా దంగేరులో జన్మించారు. తొలుత తన బంధువైన చింతా శంకరదీక్షితులతో కలిసి జంటకవిత్వం చెప్పారు. బాలల కోసం విశేషంగా గేయాలు రాసి, ‘బాలవాఙ్మయ బ్రహ్మ’ అనిపించుకున్నారు. కథలు, నాటకాలు రాశారు. అపరాధ పరిశోధక రచనలు చేశారు. ఏకాదశి కథలు, హాస్య కథలు, మిసెస్‌ వటీరావు కథలు, దాసరిపాట ఆయన కథాసంపుటాలు. చలంతో ఆయనకు బాగా స్నేహం. చింతా దీక్షితులు గారికి చలం రాసిన లేఖలు పుస్తక రూపంలో వచ్చాయి.

––

ముద్దు


‘‘అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు..’’

‘‘నాకు తెలుసులెండి ఆ కథ, మీరు చెప్పనక్కరలేదు.’’

రాత్రి భోజనము చేసి, ఆఫీసు కాగితాలు చూచుకొంటూ కూర్చున్నాను. నా భార్య తమలపాకులు చుట్టిస్తూ కథ చెప్పమన్నది. జరూరు కాగితాలు చూచుకొంటూ ఉండడము మూలాన మంచి కథ తోచకపోతే అమ్మమ్మ కథ ఒకటి మొదలు పెట్టినాను. మా అమ్మమ్మ బతికివున్న కాలములో ఎన్నో కథలు చెప్పింది. చాలా మరిచిపోయినాను. ఇప్పుడంతా కలెక్టరాఫీసు తప్ప మరే కథా లేదు. అయితే నా భార్య ఎప్పుడేది కోరితే అప్పుడది చెల్లించడము నా మతము. నా భార్యకు చిన్నతనము; ఆ కారణము చేత వేళాపాళా లేకుండా అది చెప్పమనీ, ఇది చెప్పమనీ యక్ష ప్రశ్నలు వేస్తుంటుంది. ఒకనాడు నా దగ్గికికి వచ్చి, ‘‘రైలుబండి పరిగెత్తుతుంది గదా, దానికి గుర్రాలు కడతారా, ఎద్దులు కడతారా లాగడానికి?’’ 

‘‘గుర్రాలనూ కట్టరు, ఏనుగులనూ కట్టరు. ఆవిరి శక్తి వల్ల నడుస్తుంది.’’

‘‘మీరు చెప్పక్కర లేదు. దానికి ముందర సింహాలనూ పెద్దపులులనూ కట్టుతారు.’’

‘‘అయితే అవి లాగుతున్నట్టు కనపడవేమి?’’

‘‘ఇంజనులో వుంటే ఎలా అవుపడతవి?’’

వట్టి వెర్రిపిల్ల! నేను చెప్పబోయే కథ గ్రహించి మీరు చెప్పక్కరలేదన్నది. అయినా కాదని బొంకి తప్పించుకొనవలెనని, ముందున్న కాగితములు దూరముగా పెట్టి, ‘‘కథ నీకు తెలుసునన్నావు గదా, ఏమిటో చెప్పు?’’

‘‘చెప్పనా? అనగా అనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు...’’

‘‘ఆగు, ఆగు. అదికాదు నేను చెప్పబోయేది.’’

‘‘అదే. కావలిస్తే పందెం వెయ్యండి.’’

రూపాయల పందెము ఒకమాటూ, చీరలు కొనేపందెము ఇంకోమాటూ, నగ చేయించే పందెము మరోమాటూ అయినవి. ఈమాటు కొత్తరకము పందెము వేయవలె ననుకొని, ‘‘నేను గెలిస్తే ఏ మడిగితే అది నీవు నా కియ్యవలె. మరి తిరగకూడదు!’’

‘‘సరే, చెప్పండి కథ.’’

తప్పనిసరి గదా అని అల్లడము ప్రారంభించాను. నేను పడ్డపాట్లు ఆ పరమాత్ముడికే ఎరుక!

’ ’ ’

‘‘అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు భార్యలు. అందులో చిన్నభార్య అంటే ఆయనకు ఇష్టము. అందుచేత ఎప్పుడూ చిన్న భార్య అంతఃఫురములోనే వుండేవాడు. అన్నట్టు, ఏడుగురు భార్యలకూ ఏడు మేడలు కట్టించినాడు. చిన్న భార్యకు ఒంటిస్తంభము మేడ. మేడ చుట్టూ తోట, తోటలో పక్షులూ లేళ్లూ, కుందేళ్లూ. తోటలో పెద్ద సరస్సు తవ్వించినాడు. దానికి నాలుగు వైపులా రాతిమెట్లు. నీటినిండా ఎర్ర తామరలు, తెల్ల తామరలు, పచ్చ తామరలు.’’

‘‘అదేమిటి? పచ్చతామరలుంటవా?’’

‘‘కాశ్మీర దేశము నుంచి తెప్పించి వేశారట. అవి బంగారములాగు వుంటవి.’’

‘‘అవన్నీ ఎందుకు? కథ చెప్పుదురు’’

‘‘ఇది కథ కాదూ! చిన్న రాణి చెలికత్తెలతో జలక్రీడలూ, దండలు గుచ్చడమూ, ఈ విధముగా హాయిగా కాలము గడుపుతున్నది. ఒకనాడు ఒక బ్రాహ్మడు మేడలోకి వచ్చినాడు. ఆయన పెద్ద జ్యోతిష్కుడట. తన మీద రాజుగారికి ఎప్పుడు దయ కలుగుతుందో చెప్పమని చిన్నరాణీ దాసీద్వారా బ్రాహ్మడికి కబురు పంపింది.’’

‘‘అదేమిటి? రాజుగారికి చిన్న భార్యమీద మమకారమని చెప్పినారు.’’

‘‘అవును, అన్నట్టు మరిచిపోయినాను.’’

‘‘కథ చెప్పమంటే ఏమిటో కల్పించి చెపుతున్నారు. ఇది నిజం కథ కాదు.’’

‘‘నిద్రమత్తున ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పినాను. చిన్నభార్య మేడ గోడల మీద చెక్కినారుట రకరకాల బొమ్మలు. మాణిక్యాలతో! మిగిలిన ఆరుగురికీ కోపం వచ్చింది. పట్టపు రాణికి అసూయ కూడా. ఓరవలేనితనం అంటువ్యాధి వంటిది. చెవిలో నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ పురుగు చెలికత్తెల మాటల ద్వారా మనస్సులో ప్రవేశించి తొలవడం ప్రారంభిస్తుంది.’’

‘‘ఏమిటి, కథ మానివేసి జబ్బుల సంగతి చెపుతారు!’’

‘‘పట్టపురాణికి క్రోధం పుట్టింది. కసి ఎలాగు తీర్చుకొనడము?’’ తరువాత తోచింది కాదు. కొంచెము గడుసుతనం చేసి, ‘‘కసి ఎలా తీర్చుకుంటుందో నీవు చెప్పు?’’

‘‘చంపించవలెనని ప్రయత్నం చేసింది.’’

‘‘కాదు, మళ్లీ చెప్పు.’’

‘‘మీరు చెపుదురూ!’’

‘‘కసి తీర్చుకోవడం తన వొక్కర్తె వల్ల కాదనుకుంది. కుట్ర చెయ్యడానికి ఇద్దరు మనుషులుండవలె. ఒకడు చెప్పినదానికి రెండోవాడు తల వూపితేనే గాని మొదటివాడికి వుషారీ పుట్టదు. ఒద్దరూ ఒక మోస్తరు మనుషులే కావలె. దొంగకు దొంగవాడే స్నేహితుడు. దుర్మార్గుడికి మంచివాడితో స్నేహము పొసగదు, పైగా విషమిస్తుంది.’’

‘‘ఏమీటీ వేదాంతం, మీరు కథ నడపడం లేదు.’’

‘‘వూరికే అన్నారు, ఆడవాళ్లకు చపలచిత్తమని! రవ్వంత సేపు ఓపిక పట్టలేవు కదా!’’

‘‘ఔను, ఆడవాళ్లకి చపలచిత్తమే– మొగవాళ్ల మోస్తరే. మీరు వెళ్లే దారిని వెళ్లనియ్యకపోతే తిరగబడతారు. నాకు నిద్ర వస్తుంది. వెళ్లి పడుకుంటాను.’’

‘‘పందెం వేశానన్న మాట మరిచిపోయినావు కాబోలు.’’

‘‘నిజం కథ అయితే పందెం.’’

‘‘నిజమో, కల్పనో నీకెలా తెలిసింది? పెద్దరాణీ, దాసీది కుట్ర పన్నారు. రాజుగారు తీర్పులు చెబుతూ వుండే సమయానికి సభలోకి వెళ్లదలుచుకున్నారు.’’

‘‘వెళ్లితే నలుగురూ ఏమయినా అనుకుంటారని వుండదూ?’’

‘‘పట్టు వచ్చిందంటే ఆడవాళ్లు ఎంతపనైనా చేస్తారు. అయినా నలుగురికీ తెలిసేలాగు వెళ్లుతారా ఏమిటి? మారువేషం వేసుకొని...’’

‘‘రాజు ఆనవాలు పట్టలేడు కామోసు.’’

‘‘కాపుదానిలాగు వేషం వేసుకుంటే ఎలా గుర్తుపడతాడు?’’

‘‘ఎప్పుడూ ఇలా సాధిస్తూవుంటారు. కథ కానియ్యండి.’’

‘‘వాళ్లిద్దరూ చిన్నరాణికి జాబు కూడా వ్రాద్దామనుకున్నారు. ఎవరి పేరైనా పెట్టి. ఆ, దేవుడు వెంకటేశ్వర్లు పేరు పెట్టి.’’

‘‘ఉత్తరం ఏమని?’’

‘‘చెప్పుతున్నాను కాదూ? పట్టపురాణీ దాసి ఒకనాడు చిన్నరాణీ దాసీ యింటికి వెళ్లింది. పెద్దరాణీగారు నీ దగ్గరికి పంపించినారు, నీకు కాసులపేరు బహుమతి ఇమ్మన్నారు అన్నది.’’

‘‘ఏదీ అక్కా! ఎంత బాగుంది!’’

‘‘ఇదే, నీవు పుచ్చుకోవలె. ఇదిగో చూడు, ఈ ఉత్తరం చిన్నరాణీ గారి పరుపు మీద ఉంచాలి.’’

‘‘అదెంతసేపు?’’

‘‘తర్వాత పెద్దరాణీ, దాసీ కలిసి, అదివరకనుకొన్నట్టు సభలోకి వెళ్లినారు. రాజుగారితో మొరబెట్టుకున్నారు.’’

‘‘ఇద్దరూ వకమాటే మొరబెట్టుకున్నారా?’’

‘‘లేదు, పెద్దరాణీ మొరబెట్టుకుంది. దాసీ సాక్ష్యం పలికింది.’’

‘‘ఏమని మొర?’’

‘‘భర్త తన్ను ఒల్లడం లేదనిన్నీ, ఎవర్తెనో వలిచినాడనీ. ఎందుకు వల్లడం లేదని రాజుగారు అడిగినారు. తన తప్పు ఏమీ లేదనీ, ఇంకో చిన్న పెళ్లాము దొరకడమే కారణమనీ చెప్పింది. అప్పుడు రాజుగారు అన్నారు: ఇద్దరు భార్యలను పెండ్లాడటము బట్టీ ఇద్దరినీ వకవిధంగానే చూడవలసి వుంటుందనీ, పెద్దదాన్ని ఏలకపోవడం తప్పనీ, వాడిని దండిస్తాననీ. ‘బంగారానికే తుప్పు పట్టితే ఇనుము గతి ఏమి కావలసింది’ అని వాళ్లు వెళ్లిపోయినారు. రాజుకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది.’’

‘‘నే చెప్పలేదూ, ఆనవాలు పడతాడని.’’

‘‘చెప్పావు. అయితే ఎక్కడ చెప్పవలసింది అక్కడే చెప్పవలె. కాపువాడిని తాను దండిస్తా నన్నట్లే తన్ను దైవం దండిస్తాడేమో అనుకొన్నాడు రాజు.’’

‘‘అదివరకు పుట్టింది కాదు కాబోలు ఈ బుద్ధి?’’

‘‘పుట్టివుంటే ఏ బాధ లేకపోను. పుట్టకపోబట్టే నేను కథ చెప్పడమూ, నీకు వినడమూ తటస్థించింది. తరువాత చిన్నరాణీ పక్కమీద పడివున్న ఉత్తరం చదివింది. నా భక్తురాలైన చిన్నరాణీని తిరుపతి వెంకటేశ్వర్లు దీవించి వ్రాసేది యేమనగా. రాజు నీ మూలాన పెద్దరాణీని నిర్లక్ష్యము చేస్తూవున్నాడు. ఆవిడ ఉసురుకొట్టి నీవు చెడిపోతావు... ఉత్తరము చదివేటప్పటికి చిన్నరాణి పై ప్రాణాలు పైనే పోయినవి. వింటున్నావూ? కునికిపాట్లు పడుతున్నావు.’’

‘‘కునికిపాట్లూ లేవు గినికిపాట్లూ లేవు. మా బాగాపన్నారు కుట్ర.’’

‘‘ఆడవాళ్లు గట్టివాళ్లు కారూ మరి?’’

‘‘కానిస్తురూ కథ. ఎప్పుడూ ఆడవాళ్లను దెప్పడమే మీ పని.’’

‘‘అంతే. ఆ రోజు మొదలుకొని రాజు తన భార్యలందరినీ వక్క మోస్తరుగా’’

‘‘అమ్మయ్యా, నిద్దర వస్తున్నది, వెళ్లి పడుకోవలె.’’

‘‘పందెం గెలుచుకొన్నాను. నేనడిగింది యిచ్చి మరీ కదులు.’’

‘‘ఎలా గెల్చారేమిటి?’’

‘‘నీ వనుకొన్న కథనే చెప్పింది?’’

‘‘కాకపోతే మాత్రం, నిజం కథా యేమిటి?’’

‘‘నిజం కథ కాదూ, పుస్తకాల్లో కథలలాగు లేదూ?’’

‘‘దీన్ని మీరు కల్పించారు. నే నోడినట్టు ఒప్పుకోను.’’

‘‘ఒప్పుకోకపోతే సరా?’’

‘‘బాగానే వుంది. నే నియ్యనంటూ వుంటే మీరెలా పుచ్చుకుంటారు?’’

‘‘అదో పెద్ద బ్రహ్మాండమా! ఇదుగో నీవు ఇవ్వనంటున్నా నేను పుచ్చుకొంటున్న దేమిటో చూశావా...’’


(సాక్షి సాహిత్యం; 2020 జూన్‌ 8)



 

Tuesday, July 23, 2024

Ernest Hemingway: ఒకరోజు ఎదురుచూపు

 


Ernest Hemingway


ఎర్నెస్ట్‌ హెమింగ్వే(1899–1961) ‘ఎ డేస్‌ వెయిట్‌’ -A Day's Wait- కథకు నా అనువాదం ఇది. అమెరికా కథకుడు, నవలాకారుడైన హెమింగ్వేను 1954లో నోబెల్‌ పురస్కారం వరించింది. పొడిగా, క్లుప్తంగా చెప్పే ఆయన శైలి ఇరవయ్యో శతాబ్దపు సాహిత్యం మీద ప్రభావం చూపింది. ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ద సీ, ఎ ఫేర్‌వెల్‌ టు ఆర్మ్స్, ఫర్‌ హూమ్‌ ద బెల్‌ టోల్స్, ద సన్‌ ఆల్సో రైజెస్‌ ఆయన ప్రసిద్ధ నవలలు. హెమింగ్వే పాత్రికేయుడిగా పనిచేశాడు. 

––


ఒకరోజు ఎదురుచూపు


మేమింకా మంచంలోనే ఉన్నాం అప్పటికి. వాడు వస్తూనే గదిలోని కిటికీలన్నీ మూసేశాడు. అనారోగ్యంగా కనిపించాడు. ఒళ్లు వణుకుతోంది, ముఖం పాలిపోయివుంది. నడుస్తుంటే  నొప్పిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా అడుగులు వేశాడు.

‘ఏమైంది షట్స్‌?’

‘నాకు తలనొప్పిగా ఉంది.’

‘నువ్వు కాసేపు పడుకుంటే బాగుంటుంది.’

‘ఏం ఫర్లేదు.’

‘నువ్వెళ్లి పడుకో. నేను డ్రెస్‌ మార్చుకుని వస్తాను.’

కానీ నేను కిందికి దిగేప్పటికి వాడు డ్రెస్‌ చేసుకుని, మంట పక్కన కూర్చున్నాడు. తొమ్మిదేళ్ల పిల్లాడు జబ్బుతో నీరసంగా ఉన్నాడు. నుదుటి మీద చేయి వేస్తే జ్వరంగా ఉందని తెలుస్తోంది.

‘కాసేపు పడుకో, నీకు బాలేదు’ అన్నాను.

‘నాకు బానేవుంది’ అన్నాడు వాడు.

డాక్టర్‌ వచ్చాక వాడి ఉష్ణోగ్రత చూశాడు.

‘ఎంతుంది?’ అడిగాను.

‘నూటా రెండు.’

డాక్టర్‌ మూడు రంగుల్లో ఉన్న మూడు రకాల గోళీలు ఇచ్చి, ఎలా వేయాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గడానికి, ఇంకోటి విరేచనం సాఫీగా కావడానికి, మరొకటి కడుపులో మంట ఏమైనా ఉంటే పోవడానికి. కడుపులో ఆమ్లగుణం ఉన్నప్పుడే ఇన్‌ఫ్లూయెంజా క్రిములు బతుకుతాయని చెప్పాడు డాక్టర్‌. చూస్తుంటే ఆయనకు ఇన్‌ఫ్లూయెంజా గురించి సమస్తం తెలిసినట్టు అనిపించింది. జ్వరం నూటా నాలుగు డిగ్రీలకు మించనంతవరకు భయపడవలసింది ఏమీలేదన్నాడు. కొద్దికొద్దిగా వ్యాపిస్తున్న ఫ్లూ ఫలితం ఇది, నిమోనియా రాకుండా చూసుకుంటే ప్రమాదం ఏమీలేదు అన్నాడు.

వాడి ఉష్ణోగ్రత ఎంతుందో నోట్‌ చేసి, ఏ మందు ఏ టైముకు వేసుకోవాలో రాసిపెట్టాను.

‘నీకోసం నన్ను ఏదైనా చదవమంటావా?’ 

‘నీ ఇష్టం’ అన్నాడు వాడు. వాడి ముఖం పాలిపోయివుంది, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మంచం మీద పడుకున్నాడు. చుట్టూ జరుగుతున్నదానికి పట్టనట్టుగా కనబడ్డాడు. హొవార్డ్‌ పైల్‌ సముద్రపు దొంగల పుస్తకం గట్టిగా చదివాను. కానీ వాడు దానిమీద మనసు పెట్టి వింటున్నట్టు అనిపించలేదు.

‘ఇప్పుడేమనిపిస్తోంది షట్స్‌’ అని అడిగాను.

‘ఇందాకటిలాగే ఉంది’ అన్నాడు.

వాడికి తరువాతి మాత్ర వేసే సమయం కోసం వేచి చూస్తూ, వాడి కాళ్ల దగ్గర కూర్చుని కాసేపు పుస్తకం నాది నేను చదువుకున్నాను. ఇట్లాంటి సమయంలో వాడు నిద్ర పోవడం సహజం. కానీ నేను మళ్లీ తలెత్తేప్పటికి వాడు నా వైపే వింతగా చూస్తూవున్నాడు.

‘కొద్దిసేపు నిద్రపో నానా, నేను మందు వేసుకోవడానికి లేపుతాన్లే.’

‘నేను పోను.’

కాసేపుండి అన్నాడు నాతో, ‘నీకు విసుగ్గా వుంటే, నా దగ్గర కూర్చోనక్కర్లేదు నానా.’

‘నాకెందుకు విసుగ్గా వుంటుందిరా?’

‘అంటే, ఇబ్బందిగా ఉండేట్టయితే కూర్చోనక్కర్లేదు అంటున్నా.’

జ్వరం వల్ల ఉండే చపలచిత్తంతో అట్లా మాట్లాడుతున్నాడేమో అనిపించి, వాడికి పదకొండింటికి వేయాల్సిన గోళీ వేసి, కాసేపు బయటికి వెళ్లాను.

బయట తేటగా, చల్లగా ఉంది. నేల మీదంతా కురిసి గడ్డ కట్టుకుపోయిన సన్నటి మంచు వల్ల   చెట్లు, పొదలు, కుప్పేసిన కలప మెరుపు పూత పూసినట్టుగా కనబడుతున్నాయి. నా ఐరిష్‌ సెట్టర్‌ను కూడా నడకకు తీసుకెళ్లాను. కాసేపు రోడ్డు మీదా, కాసేపు గడ్డకట్టిన కయ్య పక్కనా నడిచాం. కానీ దాని మీద నిలబడటానికిగానీ నడవడానికీ గానీ కష్టంగా ఉంది. ఎర్ర కుక్క తొట్రుపడింది, జారింది, రెండు సార్లు కింద పడింది, ఓసారి దెబ్బ గట్టిగానే తాకించుకుంది, ఇంకోసారి నా తుపాకీని కింద పడగొట్టి మంచు మీద జారుతూపోయేట్టు చేసింది. పొదల్లోంచి మేము ఓ పూరేళ్ల గుంపును లేవగొట్టి, అవి ఒడ్డు వెంబడి కనబడకుండా పోయేలోపల రెండింటిని వేటాడాం. గుంపులోంచి కొన్ని చెట్లమీదకు ఎక్కాయి, కొన్ని కట్టెల మండెల్లోకి మాయమైనాయి, కొన్ని పొదల్లోకి చెల్లాచెదురైనాయి.

స్థిరంగా నిల్చోవడానికి కష్టంగా ఉండటంతో గురి కుదరలేదు. రెండింటిని కాల్చాం, ఐదింటి గురి తప్పాం. కానీ తిరిగి వస్తుండగా ఇంటికి దగ్గరలోనే మరో పూరేళ్ల గుంపు కనబడి సంతోషం వేసింది, మరో రోజు వెతకడానికి కావాల్సినన్ని మిగిలేవున్నాయి.

ఇంటికెళ్లేసరికి పిల్లాడు ఎవరినీ గదిలోకి రావద్దు అన్నాడని తెలిసింది. ‘మీరెవరూ రావడానికి వీల్లేదు, నాకున్నది మీకూ అంటుకుంటుంది’ అన్నాడట.

నేను పైకి వెళ్లేసరికి వాడిని ఎలా పడుకోబెట్టి వెళ్లానో అలాగే కదలకుండా ఉన్నాడు మంచంలో. అదే పాలిపోయిన ముఖం. చెంపలు మాత్రం జ్వరంతో ఎర్రబారివున్నాయి. రెప్పలు కదల్చకుండా మంచం  కాళ్లవైపు చూస్తున్నాడు, ఇందాకటిలాగే. మరోసారి ఉష్ణోగ్రత చూశాను.

‘ఎంతుంది?’

‘నూటికి దగ్గర’ అన్నాను. నూటా రెండు పాయింట్‌ నాలుగు ఉంది.

‘నూటా రెండు’ అన్నాడు వాడు.

‘ఎవరన్నారు?’

‘డాక్టర్‌.’

‘మరీ ఎక్కువేమీ లేదు, భయపడనక్కర్లేదు.’

‘నేనేం భయపడట్లేదు, కానీ మళ్లీ మళ్లీ అదే గుర్తుకు వస్తోంది’ అన్నాడు.

‘ఎక్కువ ఆలోచించొద్దు, తేలిగ్గా తీసుకో’.

‘నేను తేలిగ్గానే తీసుకుంటున్నాను’ అని నిటారుగా చూశాడు. దేన్నో నాకు తెలియకుండా వాడు దాస్తున్నాడు.

‘ఇది వేసుకుని కొన్ని నీళ్లు తాగు.’

‘దీని వల్ల నిజంగా నయం అవుతుందంటావా?’

‘తప్పకుండా అవుతుంది.’

నేను మళ్లీ మంచం మీద కూర్చుని, ఇందాకటి సముద్రపు దొంగలు పుస్తకం చదువుదామని చూశాను. కానీ వాడు దృష్టిపెట్టడం లేదని మానుకున్నాను.

‘నేను ఏ టైము వరకు చచ్చిపోతానంటావ్‌?’ అడిగాడు వాడు.

‘ఏంటి?’

‘నేను చచ్చిపోవడానికి ఇంకా ఎంత సేపుంది?’

‘నీకేమీ కాదు. ఏమైంది నీకు?’

‘నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. డాక్టర్‌ నూటా రెండు అని చెప్పడం నేను విన్నాను.’

‘నూటా రెండు జ్వరానికి మనుషులు ఎవరూ చచ్చిపోరు. పిచ్చి మాటలు మాట్లాడకు.’

‘నాకు తెలుసు, చచ్చిపోతారు. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో నా స్నేహితులు అన్నారు, నలభై నాలుగు డిగ్రీలు దాటితే అంతేనట, మరి నాకుందేమో నూటా రెండు.’

వాడు ఈ రోజంతా, పొద్దున తొమ్మిదింటినుంచీ ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురుచూస్తున్నాడు.

‘ఒరే పిచ్చి కన్నా, నా పిచ్చి బంగారం. అది మైళ్లు, కిలోమీటర్ల లాంటిది. నువ్వు చనిపోవు. ఆ థర్మామీటర్‌ వేరే. దాన్లో ముప్పై ఏడు సాధారణం. ఇలాంటిదాన్లో తొంభై ఎనిమిది.’

‘నిజంగానా?’

‘నిజంరా. మైళ్లు, కిలోమీటర్ల లాగే. ఇప్పుడు చెప్పు, మన కార్లో డెబ్బై ప్రయాణించామంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది?’

‘ఓ’ అన్నాడు. నెమ్మదిగా మంచం కాళ్ల వైపు సారించిన వాడి చూపు తీక్షణత తగ్గింది, వాడి శరీరపు బిర్రు తగ్గింది. తెల్లారేసరికి పూర్తిగా మామూలైపోయాడు. ఏ ప్రాధాన్యతా లేని చిన్న చిన్న విషయాల కోసం కూడా మళ్లీ అల్లరి చేయడం మొదలుపెట్టాడు.


(సాక్షి సాహిత్యం; 2018 అక్టోబర్‌ 14)


 

Saturday, July 20, 2024

కనుపర్తి వరలక్ష్మమ్మ: గౌరవ స్థానం


కనుపర్తి వరలక్ష్మమ్మ 

కనుపర్తి వరలక్ష్మమ్మ కథ ‘గౌరవ స్థానం’కు సంక్షిప్త రూపం ఇది. ‘నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము బూనితిని’ అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మమ్మ (6 అక్టోబర్‌ 1896– 13 ఆగస్ట్‌ 1978). ఆమె తొలి రచన 1919లో అచ్చయింది. తర్వాత ఆరేళ్లపాటు లీలావతి కలంపేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ కాలమ్‌ ఆంధ్రపత్రికలో రాశారు. అనంతరం ‘శారద లేఖలు’ 1929 నుండి 1934 వరకు గృహలక్ష్మి మాసపత్రికలో రాశారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద రాసినట్టుగా ఉండే ఈ లేఖలు అనేక స్త్రీల సమస్యలను చర్చిస్తాయి. ఎన్నో కథలతోపాటు, లేడీస్‌ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా నవోదయం, పునఃప్రతిష్ట వంటి నాటికలు; వసుమతి, విశ్వామిత్ర మహర్షి నవలలు; ద్రౌపది వస్త్ర సంరక్షణ, సత్యా ద్రౌపది సంవాదం వంటి పద్య రచనలు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ కార్యక్రమాల్లో ప్రసంగించేవారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన తొలి మహిళ(1934). గాంధీజీ అంటే అభిమానం. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆమె జన్మించిన బాపట్లలో స్త్రీహితైషిణి మండలిని స్థాపించారు. ఆమె చాలా కథల్లో రాజేశ్వరీ, రాఘవరావు దంపతులు పునరావృతం అవుతారు. ఇక్కడ కూడా వాళ్ల సంభాషణే కథ. మంచి కథ లక్షణాలను చర్చిస్తూ ఆమె రాసిన ‘కథ ఎట్లా ఉండాలె’ మరో చదవాల్సిన కథ. స్త్రీ రచయితల్లో ఈమె నాకు ప్రత్యేకంగా కనిపించారు.

 ––

గౌరవ స్థానం


రేడియో కొన్న తర్వాత రాఘవరావుకూ రాజేశ్వరికీ వారి పిల్లలకూ దానితోడిదే లోకమైపోయింది. ఏ రోజుకారోజు నవనవమైన కార్యక్రమాలు వినడమూ వానిని గుఱించి మళ్లీ మళ్లీ చెప్పుకోడమూ వాదించుకోడమూ. 

సాయంత్రం నాలుగు గంటలైంది. విజయవాడ రేడియో పేరంటం కార్యక్రమం వినడానికి త్వరత్వరగా కాఫీలు ఫలహారాలు ముగించుకొని వచ్చి కుర్చీలో కూర్చున్నది రాజేశ్వరి. 

‘‘ఆహా! తయారైనావూ, మీ స్త్రీల కార్యక్రమం వినడమంటే నీకెంత సరదా. ఎంత పనైనా మానుకొని వస్తావు’’ అన్నాడు రాఘవరావు నవ్వుతూ. 

‘‘రేడియో పెట్టండి. స్వతంత్ర భారతవర్షంలో స్త్రీల స్థానము గుఱించి ఒక విదుషీమణి ప్రసంగం ఉన్న’’దన్నది రాజేశ్వరి. ప్రారంభ గీతమైన తర్వాత ప్రసంగం ప్రారంభమైంది. సతీపతులిద్దరు శ్రద్ధగా విన్నారు– భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కులు బాధ్యతలు ఉపన్యాసకురాలు చక్కగా వివరించింది. ఆ యీ కాగితాలమీద వ్రాయబడిన హక్కులకేమిలే అన్నట్టు రాజేశ్వరి అసంతృప్తిగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. వెంటనే రాఘవరావు ఆమె వంక మందహాసంతో చూస్తూ ‘‘ఇకనేమీ మీ రొట్టె నేతిలో పడ్డదన్నమాటే. మీరు పురుషులతో బాటు సమానమగు ఏ హక్కులు కావలెనని పదింపదిగా తీర్మానిస్తున్నారో అవన్నీ వచ్చేసినాయి’’ అన్నాడు.

‘‘రొట్టె నేతిలో పడంగానే ఏం సంబరము, చేతిలో పడొద్దూ?’’ అన్నది రాజేశ్వరి.

‘‘నేతిలో పడ్డది చేతిలోకి రాకేం చేస్తుంది. స్త్రీ అన్న కారణంగా ఎందునూ నిషేధించరాదు– చదువులు, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు, వోటు హక్కులు, ప్రాతినిధ్యపు హక్కులు ఒకటేమిటి అన్నీ వచ్చాయిగా?’’

‘‘ఈ రావడాని కేమిలెండి?’’

‘‘రాబట్టే గవర్నరులు, మంత్రులు, రాయబారిణులు, శాసన సభల్లో సభ్యతలు, స్పీకర్లు– ఓ అన్నీ చేస్తున్నారు.’’

‘‘పదహారు కోట్ల నలభై లక్షల స్త్రీలల్లోను వీరెన్ని వేలవంతూ?’’

‘‘అందరికి రాలేదనా నీ కోపం? మగవాళ్లు మాత్రం అందరూ మహోన్నత పదవుల్లోనే ఉన్నారూ.’’

‘‘అదే నేను చెప్పేదీని. స్త్రీలైనా పురుషులైనా ఏ పదిమందో గొప్ప ఉద్యోగాలు చేస్తే ఏమి జరిగింది. అయినా మీ మగవారితో మాకు సాటేమిటండీ. మావన్నీ కాగితాల మీది హక్కులు.’’

‘‘ఎవరికైనా కాగితముల మీద వ్రాసిన తర్వాతనేగా అమలులోకి వచ్చేది? ఇప్పుడు ఏ స్త్రీౖయెనా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్త్రీలకు యివ్వబడదని త్రోసివేయడానికి వీలవుతుందా?’’

‘‘చూడండీ. లంచాలు పుచ్చుకొనే ఉద్యోగస్థులను, బ్లాకుమార్కెట్టు సాగించే వ్యాపారస్థులను శిక్షించడానికీ ఎన్నో చట్టాలున్నాయి శిక్షాస్మృతిలో. అయితేనేమీ చట్టానికి కానరాని వెలుతులేవో వారి ఆశలను పూరిస్తూనే ఉన్నాయి. దొంగకు తోడుపొయ్యే పిచ్చిదేశం మనది.’’

‘‘అయితే ఏమంటావు?’’

‘‘చట్టాలు ప్యాసైతే చాలదంటాను.’’

‘‘ముందు శాసనాలైతే గాదూ తర్వాత ఉద్యోగాలు వచ్చేది?’’

‘‘ఉద్యోగా లెవరికి కావాలండీ?’’

‘‘అయితే ఏమి కావాలె?’’

‘‘గౌరవ స్థానం.’’

‘‘పదవితో బాటు అదీ వస్తుంది.’’

‘‘పదవిలో ఉన్న ఏ పదిమందో ఆ పదవి ఉన్న నాల్గు రోజులు గౌరవింపబడితే స్త్రీ సంఘమంతా గౌరవింపబడినట్లేనా? కాదుగా. స్త్రీ అనే వ్యక్తికే గౌరవం రావాలె.’’

‘‘ఆహా! అయితే సరే ఎప్పటికీ తరుగూ ఒరుగూ లేని శాశ్వతమైన గౌరవస్థానం రావలెనంటావు. ఆడపిల్ల అనేది మాతృగర్భంలోంచి బయటికి వచ్చి కాలగర్భంలో కలిసి పోయేవరకూ ఒక్క విధమైన గౌరవం రావాలెనంటావు. భేష్‌–’’

‘‘మీ రిట్లా ఆక్షేపిస్తే నేను చెప్పలేను.’’

‘‘ఇదే నీతో వచ్చిన చిక్కు. నేనేమన్నాను? మీరు ఎన్నాళ్ల నుంచో సమాన హక్కులు కావాలెనంటున్నారు గనుక అవి వచ్చేశాయన్నాను.’’

‘‘ఏమి వచ్చాయి? మన దేశంలో స్త్రీల కష్టాలు లాకు బద్ధం కానివీ, శాసనాలకు లొంగనివీని. వానిని రాజశాసనాలు పరిష్కారం చెయ్యలేవు. నిజం చెప్పవలసివస్తే మన దేశంలో పురుషులకు స్త్రీలను గౌరవంగా చూడటము తెలియదు. స్త్రీని మన్నించడం న్యూనతగా గూడా భావిస్తారు.’’

‘‘నీవు పొరబడుతున్నావు. మన పురాణాల్లో త్రిమూర్తుల భార్యలకున్న గౌరవం ఎవరికున్నది? మనదేశంలో మాతృస్థానంలో స్త్రీకివున్న పూజ్యత ఎక్కడున్నది?’’

‘‘త్రిమూర్తుల భార్యల కథలు ధర్మశాస్త్రాల్లోని శ్లోకాలు బాగానే ఉండవచ్చును కాని ప్రస్తుతం ఆచరణలో ఉన్న విషయం చూడండి.’’

‘‘ఆచరణలో మాత్రం?’’

‘‘అవును మీకేమి తెలుస్తుంది, మీరు అపోజిషన్‌ పార్టీవారు. చట్టాల ఆడంబరం చూచి మీరట్లా అభిప్రాయపడుతున్నారు.’’

‘‘తార్కాణం?’’

‘‘వేలు లక్షలు.’’

‘‘ఉదాహరణకొక్కటి.’’

‘‘ఆధునికులు వ్రాసే కథలు చదవండి, కావ్యాలు చదవండి, పత్రికలు చదవండి, సినిమాలు చూడండి, నాటకాలు చూడండి, హరికథలు వినండి. స్త్రీ యెంత చులకనగా చూడబడుతున్నదో తెలుస్తుంది. ప్రతిక్రియా విరహితమైన స్త్రీలంటే మగవారికెంత తేలిక. ఇంట్లోనైనా భార్యను మన్ననగా చూచే భర్త ఒక్కడైనా మచ్చునకైనా కనిపిస్తాడేమో.’’

‘‘ఆ, నే నుండగానే ఎంత అన్యాయానికి ఒడి గట్టావు!’’

‘‘(నవ్వుతూ) మీరు మహా మన్నిస్తున్నారు.’’

‘‘మన్నింపక చేసేదేమున్నది? పడతుకల యొద్ద మగవారు బానిసీలు.’’

‘‘ఆ యీ వ్రాతలకేమి, మీవంటి భావకవులుంటే యిట్లాంటి వెన్నైనా వ్రాస్తారు.’’

‘‘ఇది నేను వ్రాసింది కాదు.’’

‘‘మీవంటివారు వేరొకరు. నూతన రాజ్యాంగ చట్టం ప్రకారం స్త్రీకి చదువుకోవడానికీ, ఉద్యోగాలు చేయడానికీ ఆస్తిపాస్తులు అనుభవించడానికీ, వోట్ల నివ్వడానికీ శాసనసభల్లో ప్రవేశించడానికీ, స్థానాధికారాలు చలాయించడానికీ అధికారాలు వచ్చాయి యిక మీకేమి తక్కువని మీరంటున్నారు– నిజంగా మనకన్నీ వచ్చినాయని స్త్రీలు అనుకుంటున్నారు. కాని స్త్రీ పురుషుల మధ్యనున్న యజమాని బానిస భావం అట్లాగే వున్నది. అతని నిరంకుశత్వం ఆమెపై బహుముఖాలుగా చెలాయింపబడుతూనే వున్నది. ఆమెను జోగిని చేయతలుచుకుంటే జోగినీ, భోగిని చేయతలుచుకుంటే భోగినీ చేయడం యింకా అతని చేతులలోనే ఉన్నది. స్త్రీగూడా మనిషేననీ, ఆమెకు హృదయం ఉన్నదనీ, యుక్తాయుక్త పరిజ్ఞాన మున్నదనీ, ఆమెను తనతో సమానంగా చూడటం తన ధర్మమనీ పురుషునకు తోచడమే లేదు. ఈ తలంపు పురుషుని హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవమెట్లా వస్తుంది? ఏ చట్టాలు వీరిని రక్షిస్తాయి. అందువల్లనే మహాత్ముడు ప్రతి సంస్కరణకూ మనఃపరివర్తన ముఖ్యమంటూ ఉండేవాడు. దీనికీ అంతే.’’

‘‘ఆహాహా! ఏమి మహోపన్యాసము. నీ ప్రసంగం గూడా రేడియోకెక్కిస్తే బాగా ఉండును. మీ స్త్రీలంతా విని ఆనందిస్తారు.’’

‘‘మీరు మాత్రం సంతోషించరన్నమాట.’’

‘‘నేను అపోజిషను పార్టి వాడవని యిందాకనే అన్నావుగా. నేను సంతోషిస్తానంటే నమ్ముతావూ.’’

‘‘ఇంతకూ ఈ స్త్రీ హైన్యతకంతకూ కీలకం ఒకటే ఉన్నది.’’

‘‘ఏమిటో అదిగూడ వినిపిస్తే.’’

‘‘స్త్రీకి ఆర్థికోపపత్తి లేదు. అందువల్లనే స్వయం వ్యక్తిత్వం గూడా లేదు– ఎప్పుడైతే స్త్రీ ఒకరి పెట్టు పోతలు మీద ఆధారపడి ఉన్నదో అప్పుడే ఆమె బ్రతుకు తేలికైపోయింది–’’

‘‘బరువెక్కడానికి నీవే ఏదో ఉపాయం సూచించూ.’’

‘‘తన్ను దాను పోషించుకోడం నేర్చుకోవాలె.’’

‘‘సరిసరి యిదా నీ సూచన. పాటకపు స్త్రీ లందరూ తమ్ము దాము పోషించుకొనేవాళ్లే– వాళ్లేం సుఖంగా ఉంటున్నారు?’’

‘‘వాళ్లే నయం. సంపన్న కుటుంబినులు, మధ్య కుటుంబినులు– పురుషుల పోషణ తప్పితే అధోగతిపాలై పోతున్నారు. వాళ్లకు స్వయం పోషణశక్తి ఉండాలి. ఇంతకూ స్త్రీని మిత్రురాలి వలె పురుషుడు చూడాలె. కుటుంబాల్లో శాంతి భద్రతలు చేకూరితే దేశానికి శాంతి భద్రతలు చేకూరినట్లే.’’

‘‘అయితే యీ క్లిష్ట సమస్య భద్రతా సంఘానికి నివేదించవలసిందే.’’

‘‘ఎందుకూ? కాశ్మీర సమస్యకు తోడుగా ఉంటుందనా?’’

‘‘కాదుకాదు వాళ్లు బాగా చర్చించి యీ విధంగా మెలగండని మా పురుషులకు సూచిస్తే ఆ విధంగా మెలగుదామని.’’

‘‘అదికాదులెండి. అక్కడా మనవాళ్లేనని మీ యెత్తు.’’

రాఘవరావు పకాలున నవ్వాడు.

 

(సాక్షి సాహిత్యం; 2020 జూన్‌ 6)






 

Wednesday, July 17, 2024

వర్లామ్‌ షలమోవ్‌: రాత్రి పూట


వర్లామ్‌ షలమోవ్‌


స్టాలిన్‌ హయాంలో ‘గులాగ్‌’లుగా పిలిచే సైబీరియా నిర్బంధ క్యాంపుల్లో మైనస్‌ 60 డిగ్రీల చలిలో బతకాల్సిన దుఃస్థితిని ఈ 1954 నాటి రష్యన్‌ కథ చిత్రించింది. రచయిత వర్లామ్‌ షలమోవ్‌(1907–1982) స్వయంగా అందులో ఒక క్యాంపైన కొలీమా బాధితుడు. పదిహేనేళ్ల పాటు రాజకీయ ఖైదీగా శిక్షను అనుభవించి, విడుదలైన తర్వాత తన అనుభవాల సారంతో రాసిన కథలే ‘కొలీమా టేల్స్‌’గా ప్రసిద్ధి కెక్కాయి. ఈ కథను ‘ఇన్‌ ద నైట్‌’ పేరుతో జాన్‌ రీడ్, ‘ఎట్‌ నైట్‌’ పేరుతో డొనాల్డ్‌ రేఫీల్డ్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ రెండింటి ఆధారంగా ఈ తెలుగు అనువాదం చేశాను. నిడివిలో చిన్నదే కాబట్టి, ఇది పూర్తి అనువాదమే. సంక్షిప్తం కాదు.

––

రాత్రి పూట


రాత్రి భోజనం అయింది. గిలియబొవ్‌ మనసారా తన గిన్నెనంతా నాకి, టేబుల్‌ మీద పడిన రొట్టె తుంపులను ఒడుపుగా తన ఎడమ చేతిలోకి ఊడ్చుకున్నాడు. అమాంతం మింగేయకుండా, తన నోటిలో ఊరిన లాలాజలం ఆ రొట్టెలో ప్రతి చిన్న తునకనూ తడపి ముద్దజేయడాన్ని అనుభవించాడు.  దాని రుచి బాగుందో, లేదో మాత్రం గిలియబొవ్‌ చెప్పలేడు. అన్నింటినీ మరిపింపజేసే ఈ తీక్షణమైన అనుభవంతో పోలిస్తే రుచి అనేది చాలా స్వల్ప విషయం. దాన్ని మింగడానికి గిలియబొవ్‌ ఏమీ తొందర పడలేదు; దానికదే నోట్లో వేగంగా కరిగి కనబడకుండా మాయమైంది.

గిలియబొవ్‌ నోటి నుంచి తన మిణుకుమంటున్న గుంటలుపడిన కళ్లను తిప్పుకోలేకపోయాడు బాగ్రెత్సోవ్‌. మరొకరి నోటిలోకి మాయమవుతున్న తిండిని చూస్తూ కళ్లు తిప్పుకోగలిగే శక్తి అక్కడ ఎవరికీ లేదు. గిలియబొవ్‌ తన లాలాజలమంతా మింగేయగానే, దూరంగా ఆకాశం మీదికి పాకుతూ వస్తున్న పెద్ద నారింజరంగు చంద్రుడి మీదకు బాగ్రెత్సోవ్‌ తన చూపును మార్చుకున్నాడు.

‘‘ఇదే అదును,’’ అన్నాడు బాగ్రెత్సోవ్‌.

మౌనంగా వాళ్లిద్దరూ ఒక పెద్ద రాయి దగ్గరికి కొనిపోయే తోవ వెంట నడిచి, ఒక కొండను చుట్టుకొనివున్న చిన్న దిన్నెను ఎక్కారు. కాసేపటి కిందే పొద్దు మునిగినప్పటికీ, పగటి పూట తమ రబ్బరు బూట్లలోని బిత్తల కాళ్లను మండించిన ఈ రాళ్లు అప్పటికే చల్లబడి ఉన్నాయి. గిలియబొవ్‌ తన పై జాకెట్‌ గుండీలు పెట్టుకున్నాడు. నడక కూడా అతడిని వెచ్చబరచలేదు.

‘‘అదింకా చాలా దూరమా?’’ గుసగుసగా అడిగాడు.

‘‘బాగా,’’ నెమ్మదిగా బదులిచ్చాడు బాగ్రెత్సోవ్‌.

కాసేపు అలుపు తీర్చుకోవడానికి కూలబడ్డారు. మాట్లాడుకోవాల్సింది గానీ, ఆలోచించవలసింది గానీ ఏమీ లేదు– అంతా స్పష్టంగా, సులువుగా ఉంది. ఆ దిన్నె చివరున్న సమస్థలంలో ఒక రాళ్లకుప్పా, తవ్విపోయగా ఎండిన మట్టికుప్పా ఉన్నాయి. 

‘‘ఇదంతా నాకు నేనే చేసుకుందును,’’ వంకరగా నవ్వుతూ అన్నాడు బాగ్రెత్సోవ్‌. ‘‘కానీ ఇద్దరమూ కలిసి చేస్తే మజాగా ఉంటుంది, పైగా నువ్వు నా పాత స్నేహితుడివాయె...’’

గతేడాది వాళ్లిద్దరూ ఒకే నౌక మీద ఇక్కడికి తేబడ్డారు. బాగ్రెత్సోవ్‌ మాటలు ఆపేశాడు. ‘‘వంగు, లేదంటే కనబడతాం.’’

ఇద్దరూ వంగునే రాళ్లను పక్కకు విసరసాగారు. ఇక్కడున్న ఏ రాయి కూడా వీళ్లిద్దరూ కలిసి ఎత్తలేనంత, కదల్చలేనంత బరువున్నది కాదు; పొద్దున వాటిని ఇక్కడ కుప్ప బోసిన ఎవరూ కూడా గిలియబొవ్‌ కన్నా బలమైనవాళ్లేం కాదు.

బాగ్రెత్సోవ్‌ తనను తాను తిట్టుకున్నాడు: అతడి వేలు తెగి నెత్తురు కారసాగింది. గాయం మీద  కొంచెం ఇసుక చల్లుకున్నాడు, తన జాకెట్‌కున్న అతుకులోంచి చిన్నబట్టపేగును చింపి గాయాన్ని ఒత్తుకున్నాడు, అయినా రక్తం ఆగలేదు.

‘‘రక్తం గడ్డకట్టడం లేదు,’’ ఉదాసీనంగా అన్నాడు గిలియబొవ్‌.

‘‘దీనికి మునుపు నువ్వు డాక్టరా?’’ అడిగాడు బాగ్రెత్సోవ్, రక్తాన్ని నోటితో పీల్చుకుంటూ.

గిలియబొవ్‌ మాట్లాడలేదు. అతడు వైద్యుడిగా ఉండిన కాలం ఎప్పుడో చాలా ఏళ్ల క్రితపు సంగతిలా తోచింది. అసలు వైద్యుడిగా పనిచేశాడా? చాలాసార్లు అతడికి ఈ పర్వతాల, సముద్రాల ఆవలి ప్రపంచం అవాస్తవికంగా, ఒక స్వప్నంలా, కల్పనలా కనబడుతుంది. వాస్తవం ఏమిటంటే, ఈ నిమిషం, ఈ గంట, ఈ రోజు– నిద్ర లేపుతూ వినబడే నగారా ధ్వని మొదలు, ఇక పని ఆపవచ్చని వచ్చే ఆదేశం వరకే. అంతకుమించి అతడు ఏనాడూ యోచించలేదు, ఆలోచించే శక్తి కూడా లేదు, ఇక్కడున్న అందరికి మళ్లేనే.

తన చుట్టుపక్కలవాళ్ల ఎవరి గతమూ అతడికి తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. కానీ రేపెప్పుడైనా బాగ్రెత్సోవ్‌ తాను డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ అనో, విమానయాన సేనాధిపతి అనో వెల్లడిస్తే గనక గిలియబొవ్‌ మారు మాట్లాడకుండా అంగీకరిస్తాడు. కానీ నిజంగా తాను డాక్టర్‌గా పనిచేశాడా? తన యథాలాప అంచనా శక్తితో పాటు, యథాలాప పరిశీలనా శక్తిని కూడా అతడు కోల్పోయాడు. బాగ్రెత్సోవ్‌ తన వేలిని చప్పరించడాన్ని గిలియబొవ్‌ చూశాడుగానీ ఏమీ స్పందించలేదు. పరిస్థితి అతడి చేతనను తాకిందిగానీ తనలోంచి దానికి జవాబును గానీ, ఆ జవాబు ఇవ్వగలిగే సంకల్పబలాన్ని గానీ వెతికే పని పెట్టుకోలేదు. అతడిలో మిగిలిపోయిన చైతన్యం– బహుశా ఇంకేమాత్రం మనిషిది కాని చైతన్యం– కొద్ది పార్శా్వలనే మిగుల్చుకున్నది–  దాని మొత్తం దృష్టీ ఒకే లక్ష్యం మీద ఉంది, అక్కడున్న రాళ్లన్నింటినీ సాధ్యమైనంత త్వరగా తొలగించాలి!

‘‘లోతుగా ఉందంటావా?’’ దమ్ము తీసుకోవడానికి ఆగినప్పుడు అడిగాడు గిలియబొవ్‌.

‘‘లోతుగా ఎలావుంటుంది?’’ బదులిచ్చాడు బాగ్రెత్సోవ్‌.

తన ప్రశ్నలోని అసంబద్ధతను గ్రహించాడు గిలియబొవ్, గొయ్యి లోతుగా ఉండే వీలే లేదు.

‘‘ఇదిగో దొరికాడు,’’ అన్నాడు బాగ్రెత్సోవ్‌. ఒక మనిషి కాలి బొటనవేలిని అతడు దొరికించుకున్నాడు. రాళ్ల సందుల్లోంచి పెద్ద వేలు వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడింది. ఆ వేలు గిలియబొవ్‌ వేలిలాగానో, బాగ్రెత్సోవ్‌దిగానో లేదు– నిర్జీవంగా, బిరుసుగా ఉండటం దానికి కారణం కాదు, ఆ మాటకొస్తే వాళ్లవి కూడా అలాగే ఉన్నాయి. చచ్చిపోయినవాడి కాలిగోరు కత్తిరించి ఉంది, వేలు మృదువుగా, కండపట్టి ఉంది. వాళ్లు వేగంగా మృతదేహం మీద కుప్పగా ఉన్న రాళ్లను తీసేశారు.

‘‘మరీ కుర్రాడు,’’ బాగ్రెత్సోవ్‌ అన్నాడు.

ఇద్దరూ కలిసి కాళ్లను పట్టి శరీరాన్ని బలంగా గోరీ నుంచి బయటికి లాగారు.

‘‘మంచి ఆరోగ్యంగా ఉన్న కుర్రాడు,’’ దమ్ము తీసుకుంటూ అన్నాడు గిలియబొవ్‌.

‘‘అతడు ఇంత బలంగా ఉండకపోయుంటే,’’ కొనసాగించాడు బాగ్రెత్సోవ్‌. ‘‘మనందరిలాగే అతణ్నీ పూడ్చేసివుండేవాళ్లూ, మనం ఇంతదూరం ఈరోజు వచ్చివుండేవాళ్లమూ కాదు.’’

వాళ్లు ఆ శవపు చేతుల్ని చక్కగా చాపి, చొక్కా లాగారు.

‘‘చూడు, ఇతడి చెడ్డీ కొత్తదిలా ఉంది,’’ అన్నాడు బార్గెత్సోవ్‌ తృప్తిగా. దాన్ని కూడా పట్టి గుంజారు.

గిలియబొవ్‌ ఆ చెడ్డీని తన జాకెట్‌ కింద దాచాడు.

‘‘అది తొడుక్కుంటే మంచిది,’’ చెప్పాడు బార్గెత్సోవ్‌.

‘‘వద్దు, వేసుకోను,’’ గొణిగాడు గిలియబోవ్‌.

తిరిగి మృతదేహాన్ని గొయ్యిలోకి లాగి, దాని మీద రాళ్లను పేర్చారు.

ఇప్పుడు ఇంకాస్త పైకి ఉదయించిన చంద్రుడి నీలపు కాంతి ఆ రాళ్ల మీద, ఆ కురచ మంచు వనాల మీద పడి, ప్రతి రాతి కొననూ, ప్రతి చెట్టునూ ఒక ప్రత్యేకమైన, పగటికి భిన్నమైన కాంతిలో చూపిస్తోంది. చుట్టూ వున్నవన్నీ వాస్తవంగానే కనిపిస్తున్నాయి, కానీ తమ పగటి స్వభావాన్ని పోగొట్టుకున్నాయి. ప్రపంచానికి ఏదో రెండో ముఖం, చీకటి ముఖం ఉన్నట్టు.

చచ్చిపోయినవాడి చెడ్డీ గిలియబొవ్‌ జాకెట్‌ కింద వెచ్చగా ఉంది, అది ఇంక ఎంతమాత్రమూ పరాయిదిగా అనిపించలేదు.

‘‘నాకు పొగ తాగాలని ఉంది,’’ కలలో విహరిస్తున్నట్టుగా అన్నాడు గిలియబొవ్‌.

‘‘రేపు నీకు తప్పకుండా దొరుకుతుంది,’’ నవ్వుతూ బదులిచ్చాడు బార్గెత్సోవ్‌.

రేపు వాళ్లు ఆ బట్టలు అమ్ముతారు, బదులుగా రొట్టెను పొందుతారు, ఏమో, కొంత పొగాకు కూడా దొరకొచ్చు...


(సాక్షి సాహిత్యం; 2018 నవంబర్‌ 5)

 

Sunday, July 14, 2024

మధురాంతకం రాజారాం: నేలా– నింగీ

నోట్‌: 

సాక్షి సాహిత్యం పేజీ కోసం 2018–2020 మధ్య ఓ మూడేళ్లపాటు ఓ వంద దాకా కథల్ని ‘కథాసారం’ పేరిట సంక్షిప్తం చేశాను. అందులో తెలుగుతో పాటు ఇతర భాషలవీ ఉన్నాయి. ఇతర భాషల కథలకు అదివరకే ఉన్న అనువాదాల్ని కొన్నింటిని సంక్షిప్తం చేస్తే, కొన్ని నేనే నేరుగా అనువాదం చేశాను. కొన్నింటికి కేవలం ఎసెన్సు మాత్రం ఇచ్చాను. దాదాపు 800 పదాల నిడివికి వీటిని కుదించాల్సి రావడమే దీనికి కారణం. ఇవన్నీ చక్కటి కథలు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. శ్రీపాద ‘వడ్లగింజలు’ కథను ఒక రిఫరెన్సు కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుంటే, నా సంక్షిప్తం నాకే కనబడింది. ఓహో, వీటి ప్రయోజనం ఈ మేరకైనా ఉందికదా అనిపించింది. అందుకే నాకు వీలైనన్ని ఇక్కడ పోస్ట్‌ చేస్తాను. మొదటి కథగా మధురాంతకం రాజారం కథ ‘నేలా–నింగీ’ ఎంచుకున్నాను.

––


 మధురాంతకం రాజారాం

మధురాంతకం రాజారాం (1930–99) ‘నేలా– నింగీ’ కథకు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ 1973లో యువ మాసపత్రికలో ప్రచురించబడింది. సౌజన్యం: మధురాంతకం నరేంద్ర. తెలుగులో గొప్ప కథకుల్లో ఒకరైన రాజారాం సుమారు నాలుగు వందల కథలు రాశారు. నాకు బాగా నచ్చే కథకుల్లో ఆయన  ఒకరు. నింపాదిగా నడిచే శైలి. మన ఊళ్లో ఒక పెద్దాయనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆయన్ని చదవడం!

––

 నేలా– నింగీ

సుందరానికి అలిపిరి గాలిగోపురం అందుకోవలసిన ఆదర్శంలా కనిపిస్తూ ఉండేది. అప్పట్లో అతడు హైస్కూల్లో చదువుకునే కొంటె విద్యార్థి. కొత్తగా కొండపైకి రహదారి వేసిన రోజులు. బస్సుల్లో వెళ్తే రావలసినంత పుణ్యం రాదేమోనని యాత్రికుల్లో ఎక్కువమంది మెట్ల వెంబడే వెళ్తుండేవాళ్ళు. ఎత్తయిన కొండపైన ఠీవిగా నిలబడి, అలిపిరి గాలిగోపురం సుందరాన్ని కవ్విస్తుండేది. ప్రతి సాయంకాలమూ అదొక హేలగా చెంగు చెంగున ఎగురుతూ కొండ మెట్లెక్కి పోయేవాడు. చెట్లతో, పొదరిళ్ళతో, సెలయేళ్ళతో, మాటిమాటికీ క్రిందికి జారివచ్చే మబ్బు తెరలతో అదొక కొండల రాజు మేడ. తన ఇష్టం వచ్చినంత సేపు తానా మేడలో విడిది చేయవచ్చు. 

ఆ అందానికి పాతికేళ్ళు దూరమై పోయాడు సుందరం. మురికి పేటల్లో నివసించాడు. పైకి చూస్తే ఆకాశం, ప్రక్కలికి చూస్తే జనం, కిటకిటలాడే ఇరుకైన ఇండ్లు, క్రిందికి చూస్తే సైడుకాలువలు. జీవితాశయం నుంచి వంచింపబడి కాలం వెళ్లదీసిన సుందరానికి ఓ కాగితం చేతికొచ్చింది. మరేం లేదు. ప్రమోషను. సుందరానికి ఆమందానందం కలిగినందుకు అదొక్కటే కారణం గాదు. ప్రమోషను మూలంగా వచ్చిన బదిలీ తిరుపతికే వచ్చింది. కోరిన కొండలో కురిసిన వాన!

తిరుపతికి వచ్చి ఉద్యోగంలో జాయినైన సాయంకాలమే కొండవైపు వెళ్లాడు. ఈనాటి తిరుపతి చిట్టడవుల్ని కబళిస్తూ కొండవైపు బారలు చాస్తూ ఉండడం గమనించి నొచ్చుకున్నాడు. 

కానీ అలిపిరి కనిపించేసరికి అంతై, ఇంతై, ఇంతింతై తాను మళ్లీ ఒకసారి చిన్నవాడై, ఆ ఉత్సాహంలో అవలీలగా పదిమెట్లు ఎక్కేశాడు. పదకొండో మెట్టు దగ్గరికి వచ్చేసరికి కాస్తా మెల్లగా ఎక్కితేనే బాగుండుననిపించింది. అసురుసురై పోయిన సుందరం యాభయ్యో మెట్టు దగ్గర కూలబడిపోయాడు. ఇంకొక అంచెలో ఇంకొక యాభై మెట్లు. అలా ఎన్ని అంచెలు దాటితేనో అలిపిరి.

యాభయ్యో మెట్టు దాటి పైకి వెళ్లనే లేదు. అందుకో కారణం ఉంది. కపిలతీర్థం దగ్గర మలుపు తిరిగి కొండకు సమాంతరంగా వస్తున్న రోడ్డుకు ప్రక్కగా, రూయా హాస్పిటలుకు గూడా రెండు ఫర్లాంగుల దూరంలో అతడి కొక మేడ కనిపించింది. ప్రశాంతతే రాజ్యమేలుతున్న నిర్జన ప్రదేశంలో చిన్న మేడ. చుట్టూ ప్రాకారం. ముందు వైపుగా వసారా. మిద్దెపైన ఒకటో రెండో గదులు. ఈ కొండ, ఈ కోన, ఈ సోపాన పంక్తీ, ఈ అలిపిరి గాలిగోపురం ఇవన్నీ కనిపించేటట్లుగా మిద్దెపైన గదులకు కిటికీలు గూడా ఉన్నాయి.

ఎవరు కట్టించినా తన బోటివాడు కాపుర ముండడానికేనని అనుకున్నాడు. పుట్టి భూమిపైన బ్రతుకు తున్నందుకు ఇలాంటి సుందర సీమకు దగ్గరగా ఉండగలిగితేనే మానవ జన్మకు సార్థక్యమనుకున్నాడు. రేపో, మరునాడో లారీలో సామాన్లొచ్చేస్తాయి. పది పదిహేను రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని రాజ్యం వస్తుంది. అమాంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి చేసెయ్యాలి.

అన్నీ అతడనుకున్నట్టే జరుగుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన చిత్రకారుడెవరో ఏకాంతంగా ఉండడం కోసం ఆ ఇల్లు కట్టించుకున్నాడని తెలిసింది. వెళ్తూ వెళ్తూ దాన్నొక పెద్దమనిషికి అమ్మకం చేసిపోయాడు. మళ్లీ అంత డబ్బు పెట్టి కొనడానికిగానీ, కనీసం అద్దెకుండడానికి గానీ ఎవ్వరూ ముందుకు రాకుండా ఉన్న ఆ ఇంట్లో సుందరం తానుంటానని చెప్పేసరికి ఇంటి యజమాని విస్తుపోయాడు.

ముందుగా జాబు వ్రాసి, బస్‌స్టాండులో దిగిన భార్యా బిడ్డల్ని టాక్సీలో తీసుకొస్తున్నాడు సుందరం. కపిలతీర్థం ఛాయలకు రాగానే అడిగింది రాజ్యం– ‘‘ఏమండీ? మనం కాపురముండడానికి కొండపైన కాటేజీ ఏదైనా చూచారా?’’

‘‘లేదు లేదు. కొండ కొందనే మన కాపురం’’ అన్నాడు.

కారియర్‌లో తెచ్చుకున్న భోజనంతో ఆ పూట గడిచిపోయింది.

వర్షం కోసం ముఖం వాచిపోయి ఉన్న తిరుపతిలో నెల రోజుల నుంచీ వానజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచీ చిత్తడి వాన. చీకటి పడింది. కొండమెట్ల దీపాలు వెలిగాయి.

‘‘చూచావా రాజ్యం!’’ అన్నాడు సుందరం. ‘‘రాత్రివేళ ఈ కొండవైపు చూస్తే పద్మావతీదేవి పడుకున్నట్టుంది. కొండమెట్ల దీపాల చాలు ఆమె వేసుకున్న పూలజడలా కనిపిస్తుంది. వేలకొలది దీపాలతో వెలిగిపోతున్న అలిపిరి గాలి గోపురమే జడబిళ్ల. క్రింది గోపురాన్ని జడకుచ్చులనుకోవచ్చు. అద్భుతమైన దృశ్యం కదూ!’’

రాజ్యం భయంగా కొండవైపు చూచింది. 

అంతలో వినీల(1) జలదాలు(2) కొన్ని కొండపైన విరుచుకు పడసాగాయి.

‘‘ఏమండీ! పద్మావతీదేవి ఏమయ్యేటట్టు?’’ అంది రాజ్యం.

‘‘మరేం భయపడొద్దులే. స్వామి నీలమేఘశ్యాముడు గదా! ఆయనిప్పుడు అమ్మవారి సరసకొస్తున్నాడని ఊహించుకో’’ అన్నాడు సందరం.

ఆలోగా మబ్బులు చరచరా క్రిందికి దిగి వచ్చేశాయి. ఇప్పుడు కొండలో సగానికి పైగా మబ్బుల చాటున మాటుపడి పోయింది.

‘‘శరీరచ్ఛాయ మాత్రమే కాదులెండి! మనిషి గూడా మోటువాడల్లేనే ఉన్నాడు. లేకుంటే పూలజడపైకి దొర్లుకునే వాడేనా?’’ తోటి ఇల్లాలి పైన జాలిపడి పోతూ అంది రాజ్యం.

అలిపిరి వెనుక మబ్బుల్లో మెరుపులు తళుక్కు తళుక్కుమని మెరిసిపోతున్నాయి.

‘‘గిలిగింతలు పెడితే నవ్వినట్టుంది గదూ?’’ 

‘‘పుణ్యాత్ముడు! రాత్రంతా నిద్ర పోనివ్వడేమో గదూ! ఐనా ఇన్ని గిలిగింతలు పెడితే ఆ ఒళ్లేమి కావాలని?’’

ఉన్నట్టుండి ఆమె మాట కడ్డొచ్చాడు సుందరం. ‘‘ఆహా చూచావా? ఏదీ గోపురం? ఏదీ అలిపిరి? అదృశ్యమైపోయింది. ఆవరించి ఉన్న కారుమబ్బే నిజమనిపిస్తుంది. ‘‘మాయ’’ ఎంత పనిచేసిందో చూచావా, ఆత్మ పదార్థాన్నే కనిపించకుండా చేసింది గదూ!’’

‘‘అబ్బ, ఊరుకుందురూ! కాసేపటికదే కనిపిస్తుంది గానీ’’ ఆవలిస్తూ అంది రాజ్యం.

మరునాటి ఉదయం రాజ్యం లేవదీసిన రకరకాల సమస్యలతో తెల్లవారింది. పిల్లలెలా బడికి వెళ్తారు? మార్కెట్టు కెలా వెళ్లిరావాలి? ప్రొద్దు పోకపోతే ఎవరితో మాట్లాడాలి?

‘‘ఏముంది? కిటికీ తెరిచి పెట్టుకుని మెట్లదారి వైపు చూస్తుంటే తెల్లవారిపోదా రాజ్యం?’’

ఎంచినట్టుగా పదిహేను రోజులు గడిచిపోయాయి. మేడపైకి వెళ్లి కిటికి తలుపులు తెరిస్తే అంతులేని అందం. దిగివచ్చిన అలికిడి వినిపిస్తే రాజ్యం తెచ్చిపెట్టే సరిక్రొత్త సమస్య. ఆ రెండింటి మధ్య సుందరానికి ఒక రోజు గడిచినట్టుగా ఇంకొక రోజు గడవడం లేదు.

ఆ నెలలో రెండో శనివారం వచ్చింది. సుందరం తలంటి పోసుకున్నాడు. భోజనం చేసి నాలుగింటి దాకా నిద్రపోయాడు. టౌనులోకి బయల్దేరుతుండగా రాజ్యం పిలిచింది. ‘‘ఏమండీ! ఈ రోజు మీరు ఒక ప్రొద్దని మరిచి పోకండి. మిగిలి ఉన్న అన్నం పిల్లలకి సరిపోతుంది. అగ్గిపెట్టె తీసుకొస్తేనే మనకు టిఫిను’’ అంటూ హెచ్చరించింది.

ఆరుగంటలకల్లా తిరిగి వచ్చేయాలన్న సదుద్దేశంతోనే సుందరం టౌనుకు బయల్దేరాడు. సహోద్యోగి ఒకతను కనిపించి బలవంతం చేయడంతో సినిమాకు వెళ్లక తప్పింది కాదు. సినిమా పసందుగా ఉంది. తాత్కాలికంగా బాహ్య ప్రపంచం మరపు కొచ్చింది. సినిమా తలపుల్లోనే మునిగి తేలుతూ పది గంటల తర్వాత ఇల్లు చేరుకున్నాడు.

‘‘కిటికీ తెరిచి పెట్టాను. హాయిగా ఈ మంచినీళ్లు తాగి పడుకోండి’’ అంటూ టంబ్లరు నిండుకూ నీళ్లు తీసుకొచ్చింది రాజ్యం.

‘‘అదేమిటి! టిఫిను చేయలేదా?’’ అన్నాడు సుందరం.

‘‘ఆటవికులమల్లే అడవుల్లో బ్రతుకుతున్నాం సరే! కానీ చెకుముకి రాయితో నిప్పు చేయడం నాకు తెలిసి ఏడ్చిందా, ఏమన్నానా?’’ ముసుగు బిగదన్ని పడుకుంటూ అంది రాజ్యం.

సుందరానికి కోపం వచ్చింది. ఆకలితో పేగులు గీ పెడుతున్న కొద్దీ కుర్చీని ముక్కలు చేసి, టేబిలును బద్దలు గొట్టి ఏదైనా అఘాయిత్యం చేసెయ్యాలని అనిపిస్తూ ఉంది. టేబుల్‌ పైన తలవాల్చుకుని అరగంట సేపలాగే కుర్చీలో కూరాకు కాడలా సోలి ఉండిపోయాడు. చలిగాలికి నరాలు జివ్వు జివ్వు మనడంతో ఎక్కడలేని చిరాకొచ్చింది. చెయ్యి సాచి ఫెడీల్‌ ఫెడీల్మని కిటికీ తలుపులు వేసేశాడు. వెక్కిరిస్తున్నట్లుగా వేసిన తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.

ఎట్ట యెదట గాజుల చెయ్యి, ఆ చేతిలో ప్లేటు, అందులో అందుకు తగిన అనుపానంతో బాటుగా ఆరు పూరీలు...

తల పైకెత్తి చూచాడు సుందరం. ముసి ముసి నవ్వులతో కనిపించింది రాజ్యం.

నీతో నాకేం పని లెమ్మన్నట్టు గబ గబ ఒక పూరీ తిని, గ్రుక్క పట్టి ఒక లోటా నీళ్లు తాగేశాడు. ‘‘ఏమండీ! అలిపిరి కిప్పుడు ఒకటీ బై ఆరోవంతు అందం వచ్చేసింది గదండీ’’ అంది రాజ్యం.

టిఫిను పూర్తయ్యేదాకా భార్యా భర్తల మధ్య మౌనమే తాండవించింది. చేయి కడుక్కున్నాక టవలు తీసుకొచ్చి ఇస్తూ ‘‘ఏమైనా ఆత్మ పదార్థం కన్నా ఆహార పదార్థమే ముఖ్యమేమోనండి? అగ్గిపెట్టె సులభంగా దొరికే చోటికి వెళ్లిపోదామండీ’’ అంది గోముగా రాజ్యం.

‘‘సర్లే, సర్లే’’ అంటూ తన స్థానాన్ని కుర్చీ పై నుంచి పడక పైకి మార్చుకున్నాడు సుందరం.

------------

(1.వినీలము= నల్లనిది; 2.జలదము= మేఘము)


 (సాక్షి సాహిత్యం; 2019 మార్చ్‌ 18)


 



Saturday, July 13, 2024

బ్లూ జోన్స్‌ జీవితం



సంపూర్ణ జీవితం


భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.

ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్‌ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.

సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్‌ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్‌ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్‌ ఆఫ్‌ ఏజింగ్‌ అండ్‌ ద క్వెస్ట్‌ ఫర్‌ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్‌ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్‌ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్‌ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్‌ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్‌ రీసెర్చ్‌) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్‌. ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.

ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా(జపాన్‌), సార్డీనియా(ఇటలీ), నికోయా(కోస్టా రికా), ఇకారియా(గ్రీస్‌), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్‌’గా నిలుస్తున్నాయి. ‘లివ్‌ టు 100: సీక్రెట్స్‌ ఆఫ్‌ ద బ్లూ జోన్స్‌’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్‌ బ్యూట్నర్‌... ఈ బ్లూ జోన్స్‌ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్‌ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్‌ అయినా, బ్లూ జోన్స్‌ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి.

(24-6-2024)

Friday, July 12, 2024

ఆధ్యాత్మికవాది చెస్టర్‌టన్‌

 


ఆంగ్ల ఆధ్యాత్మికవాది


ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె.చెస్టర్‌టన్‌. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్‌ కీత్‌ చెస్టర్‌టన్‌ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్‌ ఆఫ్‌ నాటింగ్‌ హిల్‌’, ‘ద మ్యాన్‌ హూ వాజ్‌ థర్స్‌డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్‌’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్‌ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్‌లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్‌ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్‌ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.

‘ఆయన ప్రతిదానీ గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్‌టన్‌ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్‌ చెస్టర్‌టన్‌ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్‌ అహ్లిక్విస్ట్‌. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్‌టన్‌ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్‌ రచయిత సి.ఎస్‌.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా  చెస్టర్‌టన్‌ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్‌టన్‌ బీటిఫికేషన్‌కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథెలిక్‌ రచయిత జోసెఫ్‌ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్‌ బెర్నార్డ్‌ షా, హె.జి.వెల్స్, బెర్ట్రాండ్‌ రసెల్‌ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్‌టన్‌ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్‌ డిటెక్టివ్‌ ‘ఫాదర్‌ బ్రౌన్‌’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్‌ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్‌ బ్రౌన్‌.

చెస్టర్‌టన్‌ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్‌ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్‌ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం, ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు. చెస్టర్‌టన్‌ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్‌ బెల్లోక్‌ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్‌ చనిపోయాక చెస్టర్‌టన్‌ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జి.కె.స్‌ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు, ఆవు’ అనేది వీరి స్లోగన్‌.

సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్‌టన్‌ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’లో చెస్టర్‌టన్‌ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్‌ ఒపీనియన్‌’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్‌ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్‌ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్‌టన్‌. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్‌ కాదు, ఇంగ్లిషిస్థాన్‌ అవుతుంది’ అని రాశారు.

విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు అత్యంత గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినప్పటికీ చెస్టర్‌టన్‌ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్‌. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్‌టన్‌ను ఎడ్గార్‌ అలెన్‌ పోతో పోల్చారు బోర్హెస్‌. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్‌ బెర్నార్డ్‌ షా. అయితే జాన్‌ పైపర్‌ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్‌టన్‌ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన.

(27-5-2024)
 

Thursday, July 11, 2024

పేరులో అభిమానం




పేరులో అభిమానముంది!


జపనీస్‌ భాషలో ‘కా’ అంటే మంచి, సాధ్యం అని అర్థాలున్నాయట. ‘ఫుకా’ అంటే చెడు, అనంగీకారం అని అర్థమట. ‘కాఫుకా’ అని వాటిని జోడించినప్పుడు, మంచి చెడుల వ్యతిరేకతను కలుపుకొని, ఒక కొత్త సందిగ్ధమైన అర్థాన్ని ఇవ్వడం ఆ పదాన్ని మరింత ఆకర్షణీయం చేస్తోంది. అయితే, ‘కాఫ్కా ఆన్‌ ద షోర్‌’ అని తన నవలకు పేరు పెట్టడానికి హరూకీ మురకామీకి ఉన్న ముఖ్య కారణం, ఈ అసందిగ్ధత కన్నా కూడా ఫ్రాంజ్‌ కాఫ్కా మీద ఉన్న అభిమానమే. కాఫ్కాను జపనీస్‌ భాషలో కాఫుకా అని రాస్తారు. ఈ నవల్లో ప్రధాన పాత్ర అయిన పదిహేనేళ్ల బాలుడు కాఫ్కా తమూరా తనకున్న శాపం నుంచి తప్పించుకోవడానికి ఇల్లు వదిలి పారిపోతాడు. కాఫ్కా సుప్రసిద్ధ కథ ‘మెటమార్ఫసిస్‌’ స్ఫూర్తితో, అందులో ఉన్నట్టుండి తెల్లారి నిద్ర లేచేసరికల్లా ఒక పెద్ద పురుగుగా మారిపోయే గ్రెగర్‌ జామ్జా స్ఫురించేలా ‘సాంసా ఇన్‌ లవ్‌’ అనే కథను కూడా రాశారు మురకామీ.


అమెరికాలో పుట్టిన స్విట్జర్లాండ్‌ జర్నలిస్ట్‌ దీనా లీ కూంగ్‌ తను రాస్తున్న నవల్లో ఒక వివేకవంతుడైన వృద్ధుడి పాత్రకు ఏకంగా వాల్టేర్‌నే భూమ్మీదికి దింపారు. ‘నువ్వు చెప్పేదానితో నేను అంగీకరించలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పే హక్కు కోసం నా చివరిదాకా పోరాడుతాను’ అన్న ఫ్రెంచ్‌ తత్వవేత్తగా వాల్టేర్‌ సుప్రసిద్ధులు. పిల్లాడి ఉబ్బసం సమస్య, భర్త దూరంగా ఉండటం, గ్రామంలోని సమస్యలు– ఇవన్నీ తీర్చడానికి పద్దెనిమిదో శతాబ్దపు గొప్ప మెదళ్లలో ఒకటైన వాల్టేర్‌ ఉన్నట్టుండి కిటికీలోంచి ఊడిపడితే? జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం ఎలాగో సరళంగా చెప్పిపోతే? అదే దీనా రాసిన ‘ఎ విజిట్‌ ఫ్రమ్‌ వాల్టేర్‌’ నవల అవుతుంది.


రచయితలు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటారు. ఏకంగా తమకు నచ్చిన రచయితలను టైటిల్‌లోకే తెచ్చేయడం అనేది ఆ అభిమానంలో ఇంకో లెవెల్‌; గరిష్ఠ స్థాయి. రచయితలు లేదా వారి రచనలు లేదా వారిని స్ఫురించేలా చేసే ఏదో ఒకటి శీర్షికగా మారడం అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఇందాక చెప్పుకొన్నదే; దాచుకోలేని అభిమాన ప్రదర్శన. రెండోది, సాహిత్య లోకంలో దీని ద్వారా కొత్త అటెన్షన్‌ దొరుకుతుంది. మూడో కారణం, దీనికిదే ఒక సంకేతం అవుతుంది. తద్వారా వెల్లడించాల్సిన విషయం ఇట్టే పాఠకులకు వెళ్లిపోతుంది. ఉదాహరణకు నాజీల మారణహోమంలో తనవారిని కోల్పోయిన వెతుకులాటను ప్రతిబింబిస్తూ రాసిన పుస్తకానికి అమెరికా కాలమిస్ట్‌ డేనియల్‌ మెండెల్‌సన్‌ ‘ద లాస్ట్‌: ఎ సెర్చ్‌ ఫర్‌ సిక్స్‌ ఆఫ్‌ సిక్స్‌ మిలియన్‌’ అని పేరు పెట్టారు. దీనికి స్ఫూర్తి, గతించిన కాలాన్ని వెతుక్కుంటూ ఫ్రెంచ్‌ రచయిత మార్సెల్‌ ప్రూస్ట్‌ రాసిన ఆత్మకథాత్మక క్లాసిక్‌ నవల ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’. ఈ నామకరణాన్ని ఒక రాజకీయ ప్రకటనగానూ వాడుకున్న రచయితలు ఉన్నారు. సామాజికంగా అనంగీకార లైంగికతను ఎక్స్‌ప్లోర్‌ చేస్తూ రష్యన్‌–అమెరికన్‌ రచయిత వ్లదీమీర్‌ నబకోవ్‌ రాసిన ‘లోలిటా’ ఒక పెనుసంచలనం. అయితే, ఇరాన్‌లో స్త్రీల లైంగికత మీద ఉన్న అణచివేతకు నిరసనగా తన జ్ఞాపకాల పుస్తకానికి ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ పెట్టిన పేరు ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌ తెహ్రాన్‌’. అలాగే, వివాహ బంధంలోని సంక్లిష్టతను చాటడానికి ఏకంగా రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌నే ఒక ప్రతీకగా చేసుకున్నారు అమెరికన్‌ నాటక రచయిత ఎడ్వర్డ్‌ అల్బీ. ‘హూ ఈజ్‌ అఫ్రయిడ్‌ ఆఫ్‌ వర్జీనియా వూల్ఫ్‌?’ పేరుతో అల్బీ రాసిన మూడంకాల నాటకం, అటుపై సినిమాగానూ వచ్చి ఎలిజబెత్‌ టేలర్, రిచర్డ్‌ బర్టన్‌ అనితరసాధ్యమైన నటులని చాటింది.


రచయితలు హీరోలను సృష్టిస్తారు. ఆ కల్పిత హీరోల వల్ల సమాజంలో నిజమైన హీరోలు ఆవిర్భవిస్తారు. అయితే మైకేల్‌ పాలిన్‌ నవల ‘హెమింగ్వేస్‌ చైర్‌’లో రచయితే హీరోగా కనబడతాడు. ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’ రచయితగా సుప్రసిద్ధుడైన హెమింగ్వే అంటే ఈ నవలలోని అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌కు వెర్రి అభిమానం. తను చేరాల్సిన హోదాను తన్నుకుపోవడమే కాకుండా, నమ్మకంగా పనిచేస్తున్న వాళ్లను తొలగిస్తూ, ప్రైవేటైజేషన్‌ చేయడానికి పూనుకుంటాడు కొత్తగా వచ్చిన పోస్ట్‌మాస్టర్‌. దానికి తలొగ్గడమా, తన హీరో హెమింగ్వేలా ఎదిరించి నిలబడటమా? దీన్నే సరదాగా చెప్పారు ఆంగ్ల నటుడు, కమెడియన్, రచయిత అయిన మైకేల్‌ పాలిన్‌. అదే హెమింగ్వేను కాలంలో ప్రయాణం, సమాంతర విశ్వాలను మేళవిస్తూ రాసిన ‘ది హెమింగ్వే హోక్స్‌’ నవలలోనూ ప్రతీకగా వాడుకున్నారు సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత జో హాల్డ్‌మాన్‌.


ఫ్రెంచ్‌ సాహిత్య దిగ్గజం గుస్తావ్‌ ఫ్లాబర్ట్‌ పేరు మీదుగా ఆంగ్ల రచయిత జూలియన్‌ బార్నెస్‌ రాసిన ‘ఫ్లాబర్ట్స్‌ ప్యారట్‌’, మరో ఫ్రెంచ్‌ మహారచయిత హొనొరే డె బాల్జాక్‌ పేరుమీద చైనీస్‌–ఫ్రెంచ్‌ రచయిత దాయి సిజీ రాసిన ‘బాల్జాక్‌ అండ్‌ ద లిటిల్‌ చైనీస్‌ సీమ్‌స్ట్రెస్‌’, అమెరికా పౌర యుద్ధం నేపథ్యంలో ఇటాలియన్‌ సాహిత్య శిఖరం డాంటే స్ఫురించేలా మాథ్యూ పెర్ల్‌ రాసిన ‘ద డాంటే క్లబ్‌’ నవల– ఇలాంటివన్నీ ఆయా రచయితలు తమ అభిమాన రచయితలకు రాసుకున్న ఆత్మీయ లేఖలే. అంతెందుకు; గాంధీ, బుద్ధ లాంటి మాటల్ని ఒక ప్రతీకగా వాడుకున్న సృజనాత్మక ప్రక్రియలు మన దగ్గర కూడా లేకపోలేదు. అందుకే ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రండ్‌ అనీ కాదు, ఒక భాషకు పరిమితం అనీ కాదు. కాకపోతే ఈ ట్రిబ్యూట్‌గా రాస్తున్న నవలలు కూడా ఒరిజినల్స్‌ స్థాయిలో ప్రసిద్ధం అవుతుండటమే వాటి గురించి మాట్లాడేట్టు చేస్తోంది!

(29-4-2024)