Thursday, July 11, 2024

పేరులో అభిమానం




పేరులో అభిమానముంది!


జపనీస్‌ భాషలో ‘కా’ అంటే మంచి, సాధ్యం అని అర్థాలున్నాయట. ‘ఫుకా’ అంటే చెడు, అనంగీకారం అని అర్థమట. ‘కాఫుకా’ అని వాటిని జోడించినప్పుడు, మంచి చెడుల వ్యతిరేకతను కలుపుకొని, ఒక కొత్త సందిగ్ధమైన అర్థాన్ని ఇవ్వడం ఆ పదాన్ని మరింత ఆకర్షణీయం చేస్తోంది. అయితే, ‘కాఫ్కా ఆన్‌ ద షోర్‌’ అని తన నవలకు పేరు పెట్టడానికి హరూకీ మురకామీకి ఉన్న ముఖ్య కారణం, ఈ అసందిగ్ధత కన్నా కూడా ఫ్రాంజ్‌ కాఫ్కా మీద ఉన్న అభిమానమే. కాఫ్కాను జపనీస్‌ భాషలో కాఫుకా అని రాస్తారు. ఈ నవల్లో ప్రధాన పాత్ర అయిన పదిహేనేళ్ల బాలుడు కాఫ్కా తమూరా తనకున్న శాపం నుంచి తప్పించుకోవడానికి ఇల్లు వదిలి పారిపోతాడు. కాఫ్కా సుప్రసిద్ధ కథ ‘మెటమార్ఫసిస్‌’ స్ఫూర్తితో, అందులో ఉన్నట్టుండి తెల్లారి నిద్ర లేచేసరికల్లా ఒక పెద్ద పురుగుగా మారిపోయే గ్రెగర్‌ జామ్జా స్ఫురించేలా ‘సాంసా ఇన్‌ లవ్‌’ అనే కథను కూడా రాశారు మురకామీ.


అమెరికాలో పుట్టిన స్విట్జర్లాండ్‌ జర్నలిస్ట్‌ దీనా లీ కూంగ్‌ తను రాస్తున్న నవల్లో ఒక వివేకవంతుడైన వృద్ధుడి పాత్రకు ఏకంగా వాల్టేర్‌నే భూమ్మీదికి దింపారు. ‘నువ్వు చెప్పేదానితో నేను అంగీకరించలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పే హక్కు కోసం నా చివరిదాకా పోరాడుతాను’ అన్న ఫ్రెంచ్‌ తత్వవేత్తగా వాల్టేర్‌ సుప్రసిద్ధులు. పిల్లాడి ఉబ్బసం సమస్య, భర్త దూరంగా ఉండటం, గ్రామంలోని సమస్యలు– ఇవన్నీ తీర్చడానికి పద్దెనిమిదో శతాబ్దపు గొప్ప మెదళ్లలో ఒకటైన వాల్టేర్‌ ఉన్నట్టుండి కిటికీలోంచి ఊడిపడితే? జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం ఎలాగో సరళంగా చెప్పిపోతే? అదే దీనా రాసిన ‘ఎ విజిట్‌ ఫ్రమ్‌ వాల్టేర్‌’ నవల అవుతుంది.


రచయితలు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటారు. ఏకంగా తమకు నచ్చిన రచయితలను టైటిల్‌లోకే తెచ్చేయడం అనేది ఆ అభిమానంలో ఇంకో లెవెల్‌; గరిష్ఠ స్థాయి. రచయితలు లేదా వారి రచనలు లేదా వారిని స్ఫురించేలా చేసే ఏదో ఒకటి శీర్షికగా మారడం అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఇందాక చెప్పుకొన్నదే; దాచుకోలేని అభిమాన ప్రదర్శన. రెండోది, సాహిత్య లోకంలో దీని ద్వారా కొత్త అటెన్షన్‌ దొరుకుతుంది. మూడో కారణం, దీనికిదే ఒక సంకేతం అవుతుంది. తద్వారా వెల్లడించాల్సిన విషయం ఇట్టే పాఠకులకు వెళ్లిపోతుంది. ఉదాహరణకు నాజీల మారణహోమంలో తనవారిని కోల్పోయిన వెతుకులాటను ప్రతిబింబిస్తూ రాసిన పుస్తకానికి అమెరికా కాలమిస్ట్‌ డేనియల్‌ మెండెల్‌సన్‌ ‘ద లాస్ట్‌: ఎ సెర్చ్‌ ఫర్‌ సిక్స్‌ ఆఫ్‌ సిక్స్‌ మిలియన్‌’ అని పేరు పెట్టారు. దీనికి స్ఫూర్తి, గతించిన కాలాన్ని వెతుక్కుంటూ ఫ్రెంచ్‌ రచయిత మార్సెల్‌ ప్రూస్ట్‌ రాసిన ఆత్మకథాత్మక క్లాసిక్‌ నవల ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’. ఈ నామకరణాన్ని ఒక రాజకీయ ప్రకటనగానూ వాడుకున్న రచయితలు ఉన్నారు. సామాజికంగా అనంగీకార లైంగికతను ఎక్స్‌ప్లోర్‌ చేస్తూ రష్యన్‌–అమెరికన్‌ రచయిత వ్లదీమీర్‌ నబకోవ్‌ రాసిన ‘లోలిటా’ ఒక పెనుసంచలనం. అయితే, ఇరాన్‌లో స్త్రీల లైంగికత మీద ఉన్న అణచివేతకు నిరసనగా తన జ్ఞాపకాల పుస్తకానికి ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ పెట్టిన పేరు ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌ తెహ్రాన్‌’. అలాగే, వివాహ బంధంలోని సంక్లిష్టతను చాటడానికి ఏకంగా రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌నే ఒక ప్రతీకగా చేసుకున్నారు అమెరికన్‌ నాటక రచయిత ఎడ్వర్డ్‌ అల్బీ. ‘హూ ఈజ్‌ అఫ్రయిడ్‌ ఆఫ్‌ వర్జీనియా వూల్ఫ్‌?’ పేరుతో అల్బీ రాసిన మూడంకాల నాటకం, అటుపై సినిమాగానూ వచ్చి ఎలిజబెత్‌ టేలర్, రిచర్డ్‌ బర్టన్‌ అనితరసాధ్యమైన నటులని చాటింది.


రచయితలు హీరోలను సృష్టిస్తారు. ఆ కల్పిత హీరోల వల్ల సమాజంలో నిజమైన హీరోలు ఆవిర్భవిస్తారు. అయితే మైకేల్‌ పాలిన్‌ నవల ‘హెమింగ్వేస్‌ చైర్‌’లో రచయితే హీరోగా కనబడతాడు. ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’ రచయితగా సుప్రసిద్ధుడైన హెమింగ్వే అంటే ఈ నవలలోని అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌కు వెర్రి అభిమానం. తను చేరాల్సిన హోదాను తన్నుకుపోవడమే కాకుండా, నమ్మకంగా పనిచేస్తున్న వాళ్లను తొలగిస్తూ, ప్రైవేటైజేషన్‌ చేయడానికి పూనుకుంటాడు కొత్తగా వచ్చిన పోస్ట్‌మాస్టర్‌. దానికి తలొగ్గడమా, తన హీరో హెమింగ్వేలా ఎదిరించి నిలబడటమా? దీన్నే సరదాగా చెప్పారు ఆంగ్ల నటుడు, కమెడియన్, రచయిత అయిన మైకేల్‌ పాలిన్‌. అదే హెమింగ్వేను కాలంలో ప్రయాణం, సమాంతర విశ్వాలను మేళవిస్తూ రాసిన ‘ది హెమింగ్వే హోక్స్‌’ నవలలోనూ ప్రతీకగా వాడుకున్నారు సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత జో హాల్డ్‌మాన్‌.


ఫ్రెంచ్‌ సాహిత్య దిగ్గజం గుస్తావ్‌ ఫ్లాబర్ట్‌ పేరు మీదుగా ఆంగ్ల రచయిత జూలియన్‌ బార్నెస్‌ రాసిన ‘ఫ్లాబర్ట్స్‌ ప్యారట్‌’, మరో ఫ్రెంచ్‌ మహారచయిత హొనొరే డె బాల్జాక్‌ పేరుమీద చైనీస్‌–ఫ్రెంచ్‌ రచయిత దాయి సిజీ రాసిన ‘బాల్జాక్‌ అండ్‌ ద లిటిల్‌ చైనీస్‌ సీమ్‌స్ట్రెస్‌’, అమెరికా పౌర యుద్ధం నేపథ్యంలో ఇటాలియన్‌ సాహిత్య శిఖరం డాంటే స్ఫురించేలా మాథ్యూ పెర్ల్‌ రాసిన ‘ద డాంటే క్లబ్‌’ నవల– ఇలాంటివన్నీ ఆయా రచయితలు తమ అభిమాన రచయితలకు రాసుకున్న ఆత్మీయ లేఖలే. అంతెందుకు; గాంధీ, బుద్ధ లాంటి మాటల్ని ఒక ప్రతీకగా వాడుకున్న సృజనాత్మక ప్రక్రియలు మన దగ్గర కూడా లేకపోలేదు. అందుకే ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రండ్‌ అనీ కాదు, ఒక భాషకు పరిమితం అనీ కాదు. కాకపోతే ఈ ట్రిబ్యూట్‌గా రాస్తున్న నవలలు కూడా ఒరిజినల్స్‌ స్థాయిలో ప్రసిద్ధం అవుతుండటమే వాటి గురించి మాట్లాడేట్టు చేస్తోంది!

(29-4-2024)




No comments:

Post a Comment