Saturday, July 20, 2024

కనుపర్తి వరలక్ష్మమ్మ: గౌరవ స్థానం


కనుపర్తి వరలక్ష్మమ్మ 

కనుపర్తి వరలక్ష్మమ్మ కథ ‘గౌరవ స్థానం’కు సంక్షిప్త రూపం ఇది. ‘నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము బూనితిని’ అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మమ్మ (6 అక్టోబర్‌ 1896– 13 ఆగస్ట్‌ 1978). ఆమె తొలి రచన 1919లో అచ్చయింది. తర్వాత ఆరేళ్లపాటు లీలావతి కలంపేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ కాలమ్‌ ఆంధ్రపత్రికలో రాశారు. అనంతరం ‘శారద లేఖలు’ 1929 నుండి 1934 వరకు గృహలక్ష్మి మాసపత్రికలో రాశారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద రాసినట్టుగా ఉండే ఈ లేఖలు అనేక స్త్రీల సమస్యలను చర్చిస్తాయి. ఎన్నో కథలతోపాటు, లేడీస్‌ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా నవోదయం, పునఃప్రతిష్ట వంటి నాటికలు; వసుమతి, విశ్వామిత్ర మహర్షి నవలలు; ద్రౌపది వస్త్ర సంరక్షణ, సత్యా ద్రౌపది సంవాదం వంటి పద్య రచనలు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ కార్యక్రమాల్లో ప్రసంగించేవారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన తొలి మహిళ(1934). గాంధీజీ అంటే అభిమానం. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆమె జన్మించిన బాపట్లలో స్త్రీహితైషిణి మండలిని స్థాపించారు. ఆమె చాలా కథల్లో రాజేశ్వరీ, రాఘవరావు దంపతులు పునరావృతం అవుతారు. ఇక్కడ కూడా వాళ్ల సంభాషణే కథ. మంచి కథ లక్షణాలను చర్చిస్తూ ఆమె రాసిన ‘కథ ఎట్లా ఉండాలె’ మరో చదవాల్సిన కథ. స్త్రీ రచయితల్లో ఈమె నాకు ప్రత్యేకంగా కనిపించారు.

 ––

గౌరవ స్థానం


రేడియో కొన్న తర్వాత రాఘవరావుకూ రాజేశ్వరికీ వారి పిల్లలకూ దానితోడిదే లోకమైపోయింది. ఏ రోజుకారోజు నవనవమైన కార్యక్రమాలు వినడమూ వానిని గుఱించి మళ్లీ మళ్లీ చెప్పుకోడమూ వాదించుకోడమూ. 

సాయంత్రం నాలుగు గంటలైంది. విజయవాడ రేడియో పేరంటం కార్యక్రమం వినడానికి త్వరత్వరగా కాఫీలు ఫలహారాలు ముగించుకొని వచ్చి కుర్చీలో కూర్చున్నది రాజేశ్వరి. 

‘‘ఆహా! తయారైనావూ, మీ స్త్రీల కార్యక్రమం వినడమంటే నీకెంత సరదా. ఎంత పనైనా మానుకొని వస్తావు’’ అన్నాడు రాఘవరావు నవ్వుతూ. 

‘‘రేడియో పెట్టండి. స్వతంత్ర భారతవర్షంలో స్త్రీల స్థానము గుఱించి ఒక విదుషీమణి ప్రసంగం ఉన్న’’దన్నది రాజేశ్వరి. ప్రారంభ గీతమైన తర్వాత ప్రసంగం ప్రారంభమైంది. సతీపతులిద్దరు శ్రద్ధగా విన్నారు– భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కులు బాధ్యతలు ఉపన్యాసకురాలు చక్కగా వివరించింది. ఆ యీ కాగితాలమీద వ్రాయబడిన హక్కులకేమిలే అన్నట్టు రాజేశ్వరి అసంతృప్తిగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. వెంటనే రాఘవరావు ఆమె వంక మందహాసంతో చూస్తూ ‘‘ఇకనేమీ మీ రొట్టె నేతిలో పడ్డదన్నమాటే. మీరు పురుషులతో బాటు సమానమగు ఏ హక్కులు కావలెనని పదింపదిగా తీర్మానిస్తున్నారో అవన్నీ వచ్చేసినాయి’’ అన్నాడు.

‘‘రొట్టె నేతిలో పడంగానే ఏం సంబరము, చేతిలో పడొద్దూ?’’ అన్నది రాజేశ్వరి.

‘‘నేతిలో పడ్డది చేతిలోకి రాకేం చేస్తుంది. స్త్రీ అన్న కారణంగా ఎందునూ నిషేధించరాదు– చదువులు, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు, వోటు హక్కులు, ప్రాతినిధ్యపు హక్కులు ఒకటేమిటి అన్నీ వచ్చాయిగా?’’

‘‘ఈ రావడాని కేమిలెండి?’’

‘‘రాబట్టే గవర్నరులు, మంత్రులు, రాయబారిణులు, శాసన సభల్లో సభ్యతలు, స్పీకర్లు– ఓ అన్నీ చేస్తున్నారు.’’

‘‘పదహారు కోట్ల నలభై లక్షల స్త్రీలల్లోను వీరెన్ని వేలవంతూ?’’

‘‘అందరికి రాలేదనా నీ కోపం? మగవాళ్లు మాత్రం అందరూ మహోన్నత పదవుల్లోనే ఉన్నారూ.’’

‘‘అదే నేను చెప్పేదీని. స్త్రీలైనా పురుషులైనా ఏ పదిమందో గొప్ప ఉద్యోగాలు చేస్తే ఏమి జరిగింది. అయినా మీ మగవారితో మాకు సాటేమిటండీ. మావన్నీ కాగితాల మీది హక్కులు.’’

‘‘ఎవరికైనా కాగితముల మీద వ్రాసిన తర్వాతనేగా అమలులోకి వచ్చేది? ఇప్పుడు ఏ స్త్రీౖయెనా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్త్రీలకు యివ్వబడదని త్రోసివేయడానికి వీలవుతుందా?’’

‘‘చూడండీ. లంచాలు పుచ్చుకొనే ఉద్యోగస్థులను, బ్లాకుమార్కెట్టు సాగించే వ్యాపారస్థులను శిక్షించడానికీ ఎన్నో చట్టాలున్నాయి శిక్షాస్మృతిలో. అయితేనేమీ చట్టానికి కానరాని వెలుతులేవో వారి ఆశలను పూరిస్తూనే ఉన్నాయి. దొంగకు తోడుపొయ్యే పిచ్చిదేశం మనది.’’

‘‘అయితే ఏమంటావు?’’

‘‘చట్టాలు ప్యాసైతే చాలదంటాను.’’

‘‘ముందు శాసనాలైతే గాదూ తర్వాత ఉద్యోగాలు వచ్చేది?’’

‘‘ఉద్యోగా లెవరికి కావాలండీ?’’

‘‘అయితే ఏమి కావాలె?’’

‘‘గౌరవ స్థానం.’’

‘‘పదవితో బాటు అదీ వస్తుంది.’’

‘‘పదవిలో ఉన్న ఏ పదిమందో ఆ పదవి ఉన్న నాల్గు రోజులు గౌరవింపబడితే స్త్రీ సంఘమంతా గౌరవింపబడినట్లేనా? కాదుగా. స్త్రీ అనే వ్యక్తికే గౌరవం రావాలె.’’

‘‘ఆహా! అయితే సరే ఎప్పటికీ తరుగూ ఒరుగూ లేని శాశ్వతమైన గౌరవస్థానం రావలెనంటావు. ఆడపిల్ల అనేది మాతృగర్భంలోంచి బయటికి వచ్చి కాలగర్భంలో కలిసి పోయేవరకూ ఒక్క విధమైన గౌరవం రావాలెనంటావు. భేష్‌–’’

‘‘మీ రిట్లా ఆక్షేపిస్తే నేను చెప్పలేను.’’

‘‘ఇదే నీతో వచ్చిన చిక్కు. నేనేమన్నాను? మీరు ఎన్నాళ్ల నుంచో సమాన హక్కులు కావాలెనంటున్నారు గనుక అవి వచ్చేశాయన్నాను.’’

‘‘ఏమి వచ్చాయి? మన దేశంలో స్త్రీల కష్టాలు లాకు బద్ధం కానివీ, శాసనాలకు లొంగనివీని. వానిని రాజశాసనాలు పరిష్కారం చెయ్యలేవు. నిజం చెప్పవలసివస్తే మన దేశంలో పురుషులకు స్త్రీలను గౌరవంగా చూడటము తెలియదు. స్త్రీని మన్నించడం న్యూనతగా గూడా భావిస్తారు.’’

‘‘నీవు పొరబడుతున్నావు. మన పురాణాల్లో త్రిమూర్తుల భార్యలకున్న గౌరవం ఎవరికున్నది? మనదేశంలో మాతృస్థానంలో స్త్రీకివున్న పూజ్యత ఎక్కడున్నది?’’

‘‘త్రిమూర్తుల భార్యల కథలు ధర్మశాస్త్రాల్లోని శ్లోకాలు బాగానే ఉండవచ్చును కాని ప్రస్తుతం ఆచరణలో ఉన్న విషయం చూడండి.’’

‘‘ఆచరణలో మాత్రం?’’

‘‘అవును మీకేమి తెలుస్తుంది, మీరు అపోజిషన్‌ పార్టీవారు. చట్టాల ఆడంబరం చూచి మీరట్లా అభిప్రాయపడుతున్నారు.’’

‘‘తార్కాణం?’’

‘‘వేలు లక్షలు.’’

‘‘ఉదాహరణకొక్కటి.’’

‘‘ఆధునికులు వ్రాసే కథలు చదవండి, కావ్యాలు చదవండి, పత్రికలు చదవండి, సినిమాలు చూడండి, నాటకాలు చూడండి, హరికథలు వినండి. స్త్రీ యెంత చులకనగా చూడబడుతున్నదో తెలుస్తుంది. ప్రతిక్రియా విరహితమైన స్త్రీలంటే మగవారికెంత తేలిక. ఇంట్లోనైనా భార్యను మన్ననగా చూచే భర్త ఒక్కడైనా మచ్చునకైనా కనిపిస్తాడేమో.’’

‘‘ఆ, నే నుండగానే ఎంత అన్యాయానికి ఒడి గట్టావు!’’

‘‘(నవ్వుతూ) మీరు మహా మన్నిస్తున్నారు.’’

‘‘మన్నింపక చేసేదేమున్నది? పడతుకల యొద్ద మగవారు బానిసీలు.’’

‘‘ఆ యీ వ్రాతలకేమి, మీవంటి భావకవులుంటే యిట్లాంటి వెన్నైనా వ్రాస్తారు.’’

‘‘ఇది నేను వ్రాసింది కాదు.’’

‘‘మీవంటివారు వేరొకరు. నూతన రాజ్యాంగ చట్టం ప్రకారం స్త్రీకి చదువుకోవడానికీ, ఉద్యోగాలు చేయడానికీ ఆస్తిపాస్తులు అనుభవించడానికీ, వోట్ల నివ్వడానికీ శాసనసభల్లో ప్రవేశించడానికీ, స్థానాధికారాలు చలాయించడానికీ అధికారాలు వచ్చాయి యిక మీకేమి తక్కువని మీరంటున్నారు– నిజంగా మనకన్నీ వచ్చినాయని స్త్రీలు అనుకుంటున్నారు. కాని స్త్రీ పురుషుల మధ్యనున్న యజమాని బానిస భావం అట్లాగే వున్నది. అతని నిరంకుశత్వం ఆమెపై బహుముఖాలుగా చెలాయింపబడుతూనే వున్నది. ఆమెను జోగిని చేయతలుచుకుంటే జోగినీ, భోగిని చేయతలుచుకుంటే భోగినీ చేయడం యింకా అతని చేతులలోనే ఉన్నది. స్త్రీగూడా మనిషేననీ, ఆమెకు హృదయం ఉన్నదనీ, యుక్తాయుక్త పరిజ్ఞాన మున్నదనీ, ఆమెను తనతో సమానంగా చూడటం తన ధర్మమనీ పురుషునకు తోచడమే లేదు. ఈ తలంపు పురుషుని హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవమెట్లా వస్తుంది? ఏ చట్టాలు వీరిని రక్షిస్తాయి. అందువల్లనే మహాత్ముడు ప్రతి సంస్కరణకూ మనఃపరివర్తన ముఖ్యమంటూ ఉండేవాడు. దీనికీ అంతే.’’

‘‘ఆహాహా! ఏమి మహోపన్యాసము. నీ ప్రసంగం గూడా రేడియోకెక్కిస్తే బాగా ఉండును. మీ స్త్రీలంతా విని ఆనందిస్తారు.’’

‘‘మీరు మాత్రం సంతోషించరన్నమాట.’’

‘‘నేను అపోజిషను పార్టి వాడవని యిందాకనే అన్నావుగా. నేను సంతోషిస్తానంటే నమ్ముతావూ.’’

‘‘ఇంతకూ ఈ స్త్రీ హైన్యతకంతకూ కీలకం ఒకటే ఉన్నది.’’

‘‘ఏమిటో అదిగూడ వినిపిస్తే.’’

‘‘స్త్రీకి ఆర్థికోపపత్తి లేదు. అందువల్లనే స్వయం వ్యక్తిత్వం గూడా లేదు– ఎప్పుడైతే స్త్రీ ఒకరి పెట్టు పోతలు మీద ఆధారపడి ఉన్నదో అప్పుడే ఆమె బ్రతుకు తేలికైపోయింది–’’

‘‘బరువెక్కడానికి నీవే ఏదో ఉపాయం సూచించూ.’’

‘‘తన్ను దాను పోషించుకోడం నేర్చుకోవాలె.’’

‘‘సరిసరి యిదా నీ సూచన. పాటకపు స్త్రీ లందరూ తమ్ము దాము పోషించుకొనేవాళ్లే– వాళ్లేం సుఖంగా ఉంటున్నారు?’’

‘‘వాళ్లే నయం. సంపన్న కుటుంబినులు, మధ్య కుటుంబినులు– పురుషుల పోషణ తప్పితే అధోగతిపాలై పోతున్నారు. వాళ్లకు స్వయం పోషణశక్తి ఉండాలి. ఇంతకూ స్త్రీని మిత్రురాలి వలె పురుషుడు చూడాలె. కుటుంబాల్లో శాంతి భద్రతలు చేకూరితే దేశానికి శాంతి భద్రతలు చేకూరినట్లే.’’

‘‘అయితే యీ క్లిష్ట సమస్య భద్రతా సంఘానికి నివేదించవలసిందే.’’

‘‘ఎందుకూ? కాశ్మీర సమస్యకు తోడుగా ఉంటుందనా?’’

‘‘కాదుకాదు వాళ్లు బాగా చర్చించి యీ విధంగా మెలగండని మా పురుషులకు సూచిస్తే ఆ విధంగా మెలగుదామని.’’

‘‘అదికాదులెండి. అక్కడా మనవాళ్లేనని మీ యెత్తు.’’

రాఘవరావు పకాలున నవ్వాడు.

 

(సాక్షి సాహిత్యం; 2020 జూన్‌ 6)






 

No comments:

Post a Comment