Tuesday, August 27, 2024

బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌–2024: తెలుగు కథా ప్రపంచం







ఆగస్ట్‌ 9–11 వరకు బెంగళూరులో జరిగిన ‘బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌–2024’లో నేను కూడా పాల్గొన్నాను. ‘తెలుగు కథా ప్రపంచం’ అనే ఒక సెషన్‌కు నన్ను మోడరేటర్‌గా ఉండమని తెలుగు తరఫున బాధ్యతలు తలకెత్తుకున్న Ajay Varma Alluri అడిగాడు. 

నిజానికి, ఇట్లాంటివాటిని విమర్శక శిఖామణులు అనేలాంటివాళ్లు నిర్వహించాలి. అందుకే ‘నో’ అని చెప్పేందుకు ఎన్ని కారణాలున్నా, ‘ఎస్‌’ అని చెప్పేందుకు ఏమైనా కారణాలున్నాయా అని చూసుకుంటే... గాల్లోనే ఒక   బ్యాలన్స్‌ షీట్‌ కనబడింది. బెంగళూరు చూస్తాం, మూడు రోజులు సెలవులు, కొత్త అనుభవాలు... 

ఇంకోటేందటే, ఈ మోడరేటర్‌ అనగానే కడుపులో తిప్పినట్టయిందిగానీ, దానికి కొనసాగింపుగా మైండులో ఇంకో ఫ్లో ఒకటి నడుస్తూనే ఉంది. ఇది అడగొచ్చా, అది అడగొచ్చా... అట్లా నాకు తెలీకుండనే ఇందులో ఇన్వాల్వ్‌ అయిపోయాను. 

అయితే, ఇట్లాంటి సెషన్లను నిర్వహించడానికి అవసరమైన స్టేజ్‌ ఫియర్‌ను దాటడానికి నేను ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాను. కానీ ఏదోలా మేనేజ్‌ చేయగలిగాననే అనుకుంటున్నా.


తెలుగు కథా ప్రపంచం: చర్చ


బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌–2024

సెయింట్‌ జాన్స్‌ ఆడిటోరియం, కోరమంగళ, బెంగళూరు

ఆగస్ట్‌ 11, ఆదివారం; మంటప వేదిక, మధ్యాహ్నం 1:00–1:50


వక్తలు: వివినమూర్తి, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, కుప్పిలి పద్మ

మోడరేటర్‌: పూడూరి రాజిరెడ్డి


మోడరేటర్‌గా ఉండటంలోని అడ్వాంటేజ్‌ ఏమిటంటే, చేతిలో పేపర్లు పట్టుకునే సౌలభ్యం ఉంటుంది. అట్లాగే ఎంత మూర్ఖంగానైనా ధ్వనించే లగ్జరీ ఉంటుంది.


నమస్తే బెంగళూరు. నమస్తే కర్ణాటక. నమస్తే సౌత్‌ ఇండియా.


భైరప్పను కన్న కర్ణాటకకు; శివరాం కారంత్, మాస్తి వెంకటేశ్‌ అయ్యంగార్‌ల కర్ణాటకకు రావడం మరో సంతోషం. బెంగళూరు వరకే తీసుకుంటే, ఈ నగర నిర్మాత కెంపె గౌడ తెలుగు మూలాలున్నవాడు కావొచ్చని చదివాను. ఆయన తెలుగులో ‘గంగ గౌరీ విలాసం’ అనే యక్షగానం రాశాడంట. తెలుగువాడిగా ఇదో అదనపు సంతోషం.


ఇవ్వాళ్టి చర్చకోసం ‘తెలుగు కథా ప్రపంచం’ అనే విస్తారమైన లైన్‌ ఇచ్చారు. తెలుగు కథా ప్రపంచం... అబ్బో! చాలా పెద్ద ఏరియా... ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్‌ ఏమిటంటే, ఇంత పెద్ద బౌండరీ ఉన్నప్పుడు, ఏ దిశగా పోవాలో తెలీదు. దేని కేంద్రంగా మాట్లాడుకోవాలో తెలీదు. కానీ అడ్వాంటేజ్‌ ఏమిటంటే, ఈ కంక్లూజన్‌ రావాలన్న బలవంతం ఉండదు. చర్చను ఈ దిశగా నడపాలన్న ఒత్తిడి ఉండదు. ఏది మాట్లాడినా దీని పరిధిలోకే వస్తుంది. అలాగని కవికొండల వెంకటరావు, కనుపర్తి వరలక్ష్మమ్మ దగ్గరినుంచి మాట్లాడటం మొదలుపెడితే మనం ఎటూ తేలం. అందుకే కొంత వర్తమాన సాహిత్య ధోరణులకు పరిమితం అవుతాను. 

తెలుగు కథా ప్రపంచంలో నాకెంత ప్రవేశం ఉంది?

అంటే నేను ఎన్ని కథలు రాశాను, ఎన్ని పుస్తకాలు వేశాను అనేది కాదిక్కడ. తెలుగు కథ అనే పెద్ద చుట్టుకొలతలో నేనెంతగా తిరిగి ఉంటాను అన్నది.

ఇంటికి పేపరొస్తుంది; రోజూ చదువుతాం. ఎంత చదువుతాం? ప్రతీ అక్షరం? ప్రతీ వార్త? అంటే పేపరు చదువుతాం, చదవం. కథాసాహిత్యం మీద కూడా నా పరిమితి, అవగాహన అదే.

సాహిత్యంలో రకరకాల వాదనలు/ భావజాలాలు ఉన్నాయి. నాకు వాటి మీద గట్టి విభేదాలుగానీ, గట్టి ఆమోదాలు గానీ లేవు. ఏది చేసే పని అది చేస్తుంది అనుకుంటాను.


విచిత్రంగా ఈ ముగ్గురు సీనియర్‌ రచయితలు మూడు రకాల భావజాలాలకు లేదా మూడు రకాల సాహిత్య పాయలకు ప్రతినిధులు.

కానీ నేను అనుకోవడం, ఏ ఒక్కరూ గిరి గీసినట్టు తాము ఇది రాస్తున్నాం కాబట్టి, ఇందులోనే ఉంటాం అనలేరు. ఆ గీతలను దాటి కూడా చాలా భావధార వాళ్లలో కూడా నడుస్తుంటుంది అనుకుంటాను. 

వక్తలు అనేవారు వండి వార్చి పక్కనుంచిన పెద్ద గిన్నెల్లాంటివాళ్లు. అందులోంచి ఎంత తోడుకుంటాం అనేది మోడరేటర్‌ అనే గరిట మీద ఆధారపడి ఉంటుంది. నేను వీలైనంత పెద్ద గరిటలా ఉండటానికి ప్రయత్నిస్తాను.

(ఇక్కడినుంచి ప్రశ్నలు ప్రారంభం అవుతాయి. బీబీఎల్‌ఎఫ్‌ వాళ్లు అన్ని సెషన్స్‌ను యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు. ‘మంటప’ వేదికగా మూడో రోజు జరిగిన మా సెషన్‌ను 4 గంటల 27 నిమిషాల నుంచి వినొచ్చు.)


తెలుగు కథా ప్రపంచం: చర్చ

 

Saturday, August 24, 2024

దొంగముద్దు

ఆగస్ట్‌ నెల ఈమాట పత్రికలో నా కొత్త కథ ‘దొంగముద్దు’

 

దొంగముద్దు 

Wednesday, August 21, 2024

అపురూప కథ: గంగరాజం బిడ్డ

ఉదయిని పత్రికలో అపురూప కథగా నా ‘గంగరాజం బిడ్డ’. 

 

గంగరాజం బిడ్డ  


గంగరాజం బిడ్డ


(Aug 1, 2024)

Monday, August 19, 2024

దాశరథి స్మృతిలో...

 



దాశరథి స్మృతి


పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు. ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్‌ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.

దొరలు, దేశ్‌ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్‌ కాంగ్రెస్‌వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బ’లాన్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి. 1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్‌ సెంట్రల్‌ జైలుకూ, అనంతరం నిజామాబాద్‌ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.

తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసామ్రాట్‌’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు. ‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి (చివరి) ఆస్థాన కవిగా వ్యవహరించాడు.

ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు. ఉర్దూమయమైన హైదరాబాద్‌ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్‌’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామాజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.

భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే.  ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు. భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్‌ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్‌ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్‌ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు.

(22-7-2024)





 

Friday, August 16, 2024

ప్రమాదం


Murong Xuecun

మురాంగ్‌ స్వీకెన్‌ రాసిన చైనీస్‌ కథ ‘ది ఏక్సిడెంట్‌’కు నా సంక్షిప్త అనువాదం ఇది. దీన్ని ఇంగ్లిష్‌లోకి హార్వే థామ్లిన్‌సన్‌ అనువదించారు. 2012లో ‘ద గార్డియన్‌’ పత్రిక ప్రచురించింది. మురాంగ్‌ స్వీకెన్‌ కలంపేరుతో రాసే హావో చీన్‌ 1974లో జన్మించారు. తొలి నవల ‘లీవ్‌ మి ఎలోన్‌: ఎ నావెల్‌ ఆఫ్‌ చంగ్తూ’తో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకిస్తారు.

––

ప్రమాదం


ఉన్నట్టుండి కంటి మూల మీదుగా గమనించాడు న్యాయవాది వెయ్‌. బండి నడుపుతున్నతను గాల్లోకి ఎగిరి దబ్బుమని శబ్దం చేస్తూ కింద పడ్డాడు. ఆగేముందు రెండు సార్లు పూర్తి గుండ్రంగా తిరిగింది శరీరం. వెయ్‌ మెదడు స్తంభించింది. వెంటనే కారు ఆపాడు. 

రాత్రి కావస్తోంది. ప్రమాది రోడ్డు మీద నిశ్చలంగా పడివున్నాడు. అతడి హెల్మెట్‌ కిందుగా రక్తం కారుతోంది. మే నెలలో పూర్తిగా విచ్చుకున్న రుగోసా గులాబీ వర్ణంలో ఉందది.

వెయ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ‘దయచేసి చచ్చిపోవద్దు మిత్రమా. తాగి నడపడం కొంప ముంచుతుందనుకోలేదు. నువ్వు చచ్చిపోయావంటే నేనూ చచ్చిపోయినట్టే’ అనుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత, కారు దిగి అతడి వద్దకు నడిచాడు. అతడు ఉన్నట్టుండి లేచి కూర్చుని, ‘కండ్లు దొబ్బినయా? ఏం నడపడం అది?’ అని తిట్టడం మొదలుపెట్టాడు.

ఎంత తియ్యటి తిట్టు! 37 ఏళ్ల వెయ్‌ జీవితంలో ఎన్నో తిట్లు అతడి వైపు గురి చూసి విసరబడినప్పటికీ, ఈ తిట్టంత వినసొంపుగా మరేదీ అతడి చెవులకు సోకలేదు. స్వర్గంలోంచి వచ్చిన పిడుగులా ఉంది. బతకడమే కాదు, తిట్టగలుగుతున్నాడు కూడా అంటే... బాగుంది!

రోడ్డు మీద ముల్లంగి, ఆకుకూరలు పరిచినట్టుగా పడివున్నాయి. నగరానికి కూరగాయలు మోసుకెళ్తున్న పేద రైతు అయివుండాలి. కొన్ని అడుగులు వేయడానికి ఆయనకు సాయపడ్డాడు. రైతు పూర్తి నిటారుగా నిలబడ్డాడు. కానీ నోట్లోంచి ఇంకా నెత్తురు కారుతూనేవుంది. తాను ఎంతమాత్రమూ బలహీనత చూపకూడదని అప్పటికే ఒక నిర్ణయానికొచ్చాడు వెయ్‌. కొద్దిగా మెత్తబడినా రైతు అడ్వాంటేజీ తీసుకోవచ్చు. ఏం పరిహారం అడుగుతాడో!

రైతు నెమ్మదిగా హెల్మెట్‌ తీశాడు. ఇదే అదునుగా గట్టిగా అడిగాడు వెయ్‌. ‘నీ లైసెన్స్‌ ఏదీ? చూపించు’. ప్రమాదం చేసినవాడే ఇలా అడగటానికి సాధారణంగా సాహసించడు. కానీ అతణ్ని లొంగదీయాలంటే ఇదే దారి.

రైతు కంగారుపడ్డాడు. తల మీద రక్తం తుడుచుకున్నాడు. వణుకుతున్న చేతుల వంక చూసుకున్నాడు. అతడికి యాబై ఏళ్లుంటాయి. బట్టలు జిడ్డు కారుతున్నాయి. వాటిల్లోంచి పురుగుమందుల వాసన వస్తోంది. పసుపురంగు రబ్బరు బూట్లు తొడుక్కున్నాడు. చూడ్డానికి పెద్ద తెలిసినవాడిలా అనిపించడు.

‘ఏం చేస్తుంటావు నువ్వు? నీ డ్రైవర్‌ లైసెన్స్‌ ఏది?’ మళ్లీ అడిగాడు వెయ్, భయపెడుతున్నట్టుగా.

రైతు కొన్ని యుగాల పాటు జేబుల్ని వెతికి, సిగ్గుగా నవ్వూతూ ‘అయ్యా, నేను తేవడం మర్చిపోయాను’ అన్నాడు.

ఇదీ! అతడి ఛాతీని నెడుతూ, ‘అయితే లైసెన్స్‌ లేదా? సరే. దొబ్బెయ్‌’. రైతు తిట్టును తిరిగి అప్పగించాడు వెయ్‌. ‘నా వెనకాతలే వస్తావు, పైగా నన్నే తిడతావా?’

రైతు తల వాలిపోయింది. ఆత్మరక్షణలో పడిపోయాడు. ‘నువ్వు... నువ్వు కూడా లైట్స్‌ వేసుకోలేదు, నాకెట్లా తెలుస్తుంది’.

అప్పటికే కొంతమంది పోగవడం మొదలైంది. కుందేళ్లు కూడా ఒక్కోసారి జనాన్ని కరవొచ్చు. ఎందుకొచ్చిన గొడవ! ఎంతోకొంత ముట్టజెప్పి వదిలించుకుంటే మంచిది. రైతు బండిని నిలబెట్టడానికి వెయ్‌ సాయపడ్డాడు. ముసలాయన తల వంచుకుని వణుకుతూనే కొన్ని అడుగులు వేశాడు. ఉన్నట్టుండి మళ్లీ భూమ్మీద పడ్డాడు. ఎంత కుదిపినా లాభం లేదు.

వెనుక కార్ల బారు పెరిగిపోతూవుంది. పోలీస్‌ సైరెన్లు వినబడుతున్నాయి. ఇది బాలేదు. వెంటనే హు కోక్సింగ్‌కు ఫోన్‌ చేశాడు వెయ్‌. హు పక్కా బిజినెస్‌మాన్‌. ప్రమాదం ఎక్కడ జరిగిందీ, ఇప్పుడు పరిస్థితి ఎలావుందీ లాంటి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వెయ్‌ ఫోన్‌ కట్‌ చేసేలోపల పోలీసులు వచ్చారు. అందులో ఒకతను, డాక్యుమెంట్లు బయటికి తీయమని వెయ్‌ను ఆదేశించాడు. గొంతు తగ్గించి, ‘మీ హెడ్‌ నాకు తెలుసు’ అన్నాడు వెయ్‌. ఒకసారి దీర్ఘంగా చూసి, ‘నోర్ముయ్, ముందు నీ డాక్యుమెంట్లు బయటికి తియ్‌’ అన్నాడు పోలీసు.

రైతు దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాడు. వెయ్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంతలో పోలీసు రేడియో బర్రున ప్రాణం సంతరించుకుంది. హు కోక్సింగ్‌ అయివుండాలి! పోలీస్‌ అందులో విని, వెయ్‌ వంక ఒక చూపు చూసి, సంభాషణను కొనసాగించడానికి వీలుగా జనానికి దూరంగా నడిచాడు. రెండు నిమిషాల్లో తిరిగొచ్చాడు, పూర్తి భిన్న వైఖరితో.

రైతును ఉద్దేశించి, ‘నువ్వే ఈయన కారును ఢీకొట్టినట్టున్నావ్‌. ఏదీ చూపించు... నీ ఐడీ కార్డ్, డ్రైవర్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌’ అన్నాడు పోలీసు. రైతు ముఖం పాలిపోయింది. ఏం జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. కంపిస్తున్న శరీరాన్ని తమాయించుకోవడానికి బైక్‌ను ఆసరా చేసుకుని నిలబడ్డాడు.

‘లాయర్‌ వెయ్, ఈయనకు బాగా దెబ్బలు తగిలినయ్‌. ఎందుకైనా మంచిది ముందు హాస్పిటల్‌కు తీసుకెళ్దాం’ అన్నాడు పోలీసు.

రైతు మూర్ఖుడు అయ్యుండాలి. అప్పుడే గంప తీసుకుని కింద పడిన కూరగాయలను ఏరడం మొదలుపెట్టాడు. ఒంటి మీది రక్తపు చుక్కలు ఆకుల మీద పడ్డాయి. లాయరూ పోలీసూ చిర్నవ్వుతో చూపులు మార్చుకున్నారు. 

‘ఇప్పుడు బానేవుందా?’ అడిగాడు పోలీసు. ఛాతీ రుద్దుకుని, ‘నొప్పిగా ఉంది’ అన్నాడు రైతు.

మరో బక్కపలుచని పోలీసు ముందుకు వచ్చి, ‘దీన్నిక్కడే ఏదో పరిష్కారం చేసుకో. నీకు లైసెన్స్‌ లేదు. చూస్తుంటే నువ్వే కారును గుద్దినట్టు ఉంది. నువ్వు నష్టపరిహారం కట్టాలి తెలుసా?’ రైతుతో అని, వెయ్‌ వైపు తిరిగాడు: ‘మీది కూడా తప్పుంది. మీ లైట్స్‌ లేవు’. అవునన్నట్టుగా చిన్నగా తలూపాడు వెయ్‌.

రైతు క్షమించమని ప్రాధేయపడ్డాడు. వెయ్‌ లోపల నవ్వుకున్నాడు. హమ్మయ్య! దెబ్బ తగిలిన కారు భాగం వైపు చూస్తూ, ‘అది ఫర్లేదా?’ వెయ్‌ను అడిగాడు పోలీసు.

‘గరాజ్‌కు వెళ్లకుండా ఇప్పుడే చెప్పలేను. కానీ పెయింట్‌ పోయింది, ట్రిమ్మింగ్‌ చేయించాలి. మూడు నాలుగు వేలకు తక్కువ కావు’ అంచనా వేశాడు వెయ్‌.

రైతు ముఖంలోకి ఒక్కసారిగా భయం ప్రవేశించింది. జేబులోంచి ముడతలు పడిన నోట్లు బయటికి తీశాడు. రెండు యువాన్ల నోటు, ఒక యువాన్‌ నోటు, బోల్డన్ని మావో నాణేలు. అన్నీ కలిపినా 100 యువాన్లు కావు (1 యువాన్‌ సుమారు పది రూపాయలు). అతడి కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. ‘నా దగ్గర ఇంతే వుంది, లేదంటే నా బండి తీసుకో’.

‘నేనేం చేసుకోవాలి? ఇనుప సామాన్లకు అమ్మడానికి తప్ప పనికిరాదు’ అన్నాడు వెయ్‌. పోలీసు నెమ్మదిగా రైతు చెవిలో ఏదో చెప్పాడు. రైతు బెంబేలు పడిపోయి, జాకెట్‌లోంచి ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ బయటికి తీశాడు. 330 యువాన్లు ఉన్నాయందులో. ఒక వంద నోటు, నాలుగు యాబైలు, 3 పదులు. తీసి ఇచ్చాడు. ‘ఇవి ఎరువు కొనడానికి. నా దగ్గరున్నది ఇంతే’. వెయ్‌ వాటిని తీసుకున్నాడు. రైతు బైక్‌ నెట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

గుంపు పలుచబడింది. ‘ఒక పెగ్‌కు ఎక్కడైనా కలుద్దాం’ అన్నాడు పోలీసు. ‘మీకో పార్టీ బాకీ’ చెప్పాడు వెయ్‌. విజిల్‌ ఊదుకుంటూ పోలీసు వెళ్లిపోయాడు.

వెయ్‌ కారులోకి ఎక్కి, కొంచెం ముందుకు పోనిచ్చాడు. అక్కడ రైతు ఒక చిన్న చెట్టు కింద కడుపుకు చేతిని అడ్డం పెట్టుకుని దగ్గుతున్నాడు. ఇద్దరి చూపులూ ఒక్కసారి కలుసుకున్నాయి. ఏమీ జరగనట్టుగా ఫెంగ్‌ షాన్‌ పట్టణం వైపు సాగిపోయాడు వెయ్‌. దిగితే మళ్లీ ఏం మీద పడుతుందో! పైగా వెయ్‌ ప్రియురాలు జియావో లీ ఈపాటికే ఏమైందోనని కంగారు పడుతూ ఉంటుంది!


(సాక్షి సాహిత్యం; 2018 ఫిబ్రవరి 5)


 

Tuesday, August 13, 2024

వడ్ల గింజలు


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (1891–1961) ‘వడ్లగింజలు’ కథ ఇది. 1941లో ప్రచురితమైంది. 73 పేజీల కథని కేవలం 950 పదాలకు కుదించాను. కథక చక్రవర్తి అనిపించుకున్న శ్రీపాద ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ తెలుగులోని గొప్ప పుస్తకాల్లో ఒకటి. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా, వాక్యం మీద వాక్యం చేర్చుతూ కథను నిర్మించే శైలి శ్రీపాదది. ఆయన్ని ఎప్పుడు తలుచుకున్నా ఎందుకో ఒక రుమాలు చుట్టుకున్న రచయిత ఇమేజ్‌ నా మనసులో కదలాడుతుంది, గిడుగు రామ్మూర్తి పంతులు లాగా!

––

వడ్ల గింజలు


‘‘రాజద్వారే, రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా–’’

ద్వారంలోంచే ఆశీర్వచనం ప్రారంభించిన తంగిరాల శంకరప్పకు ఠాణేదారు గభీమని అడ్డం వచ్చి ‘‘ఫో– మళ్లీ వచ్చావూ?’’ అంటూ ‘‘ఏయ్, జవాన్లూ?’’ అని కరుగ్గా పిలిచాడు.

‘‘చిత్తం బాబయ్యా, మేమడ్డుపెడుతూనే వుండగా, జలగలాగ జారి వచ్చేస్తున్నారండి’’ అంటూ శంకరప్ప అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నారు.

‘‘దివాన్జీగా రుండగా మధ్య మీరు ఎవరయ్యా?’’ అంటూ శంకరప్ప బింకంగా ముందుకు రాబోయాడు. ‘‘నేను డబ్బు కోసం రాలేదు’’ అని యేదో చెప్పబోయాడు.

అప్పటికి తెరిపయిన దివాన్జీ ‘‘యేమిటా అల్లరి?’’ అని నిదానంగా అడిగాడు.

‘‘ఎవరో పిచ్చిబ్రాహ్మడు మహాప్రభూ! ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరీ చేస్తున్నా డండి.’’

‘‘ఒక రూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేక పోయావా?’’

‘‘నేను కార్యార్థిని గాని, పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ!’’ శంకరప్ప కేక వేశాడు.

‘‘యెదటికి రప్పించు’’ అన్నాడు దివాన్జీ.

శంకరప్ప మొగంమీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది.

‘‘ఏమిటి పని?’’

‘‘మహారాజులుంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను.’’

‘‘ఈ వేషంతోటే?’’ అనే మాటలు దివాన్జీ నాలుక చివరనుంచి జారిపోయాయి.

‘‘విద్వత్తు వున్నచోట వేషం అక్కర్లేదండి’’ శంకరప్ప బదులు చెప్పాడు. ‘‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్ధంతులు ఘోష పెడుతూ వుండడం వల్ల– ఒక్క ఆట వారితో ఆడాలని–’’

దివాన్జీకి అభిజాత్యం తోచింది. ‘‘చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభువు’’ అని మాట జారి వచ్చేసింది.

‘‘ఎంచేతో?’’

‘‘తగిన వుజ్జీ దొరక్క... ఆట కట్టడం మాట దేవు డెరుగును, నాలుగైదు యెత్తులయినా పొంకంగా వెయ్యగలవాడు కనబడలేదు పృథివి మీద.’’

‘‘విపులా చ పృథ్వీ!’’

దివాన్జీ వులిక్కిపడ్డాడు. వుగ్రుడైనాడు. ‘‘బతకతలుచుకోలేదూ?’’

‘‘నా విద్వత్తుకి వినియోగం కనబడలేదు. ఇక బతికేం ప్రయోజనమూ? మొండిపట్టు పట్టి ఆటలో కూచుని వోడిపోతే, మహారాజులుంగారు వచ్చినవాడి తలకొట్టించి కోట కొమ్ములకు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు. సిద్ధపడే వచ్చేశాను.’’

తన అంతస్తు స్మరించుకుని ఈ దరిద్రుడి మీద పడి మొట్టాలన్నంత ఆవేశం వచ్చింది దివాన్జీకి. ‘‘ఇక దయ చెయ్యి.’’

‘‘నాకేమి చెప్పినట్టూ?’’ ముదలకించాడు శంకరప్ప.

‘‘ఏయ్‌ జవాన్లూ!’’ దురుసుగా పిలిచాడు దివాన్జీ.

‘‘ఏం జరిగింది నాయనా?’’ ఆత్రంగా అడిగింది పేదరాసి పెద్దమ్మ.

‘‘వ్యవహారం అంతా తల్లకిందులయి పోయింది పెద్దమ్మా’’ అంటూ చతికిలబడ్డాడు శంకరప్ప.

నిరాశా, వుడుకుమోత్తనమూ, దుఃఖమూ అతని శరీరంలో ప్రతీ అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ వున్నాడు. ముప్ఫయేళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయినాడు. 

‘‘విద్వాంసుల మంటూ వచ్చేవాళ్లని చాలామందిని చూశాను; అందరూ యిలాగే లౌక్యం సుతరామూ లేక...’’

‘‘ఆ పెద్దమనిషి మొదటే హేళనలోకి దిగాడు.’’

‘‘మరి విను. ఇప్పటిదాకా రాజదర్శనానికి నువు తిప్పలుపడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలుపడాలి.’’

‘‘నీళ్లముంచినా పాలముంచినా– పెద్దమ్మా, నేను నీ కొడుకుని’’ అంటూ ఆమె పాదాలు పట్టుకున్నాడు.

‘‘ఇంత వెర్రిబాగుల నాయనవు, చదరంగంలో నీకింత నేర్పెలా వచ్చిందోయ్‌?’’

‘‘దాని కంతకీ కారణం యీశ్వరానుగ్రహం.’’

ఒక్కమాటు పైకి చూసి ‘‘పెద్దాపురప్పట్నం అంతా యెప్పుడైనా చూశావా?’’ అని అడిగింది.

‘‘సెబాస్‌’’ అంటూ లేచి, గుమ్మంలోకి వొక్కటే వురక. అక్కణ్ణుంచి వీధిలోకి వొక్కటే అంగ.

శంకరప్ప సందు మళ్లాటప్పటికొక పెద్ద భవంతి కనపడింది. మండువా వాకట్లోనుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ వినవచ్చింది.

లోపల యిద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు. వారికిద్దరికీ చెరో సలహాదారూ దగ్గిరసా కూచుని వున్నారు. ఒక్కమాటు నలుగురి మొగాలూ చూశాడు. బలమున్నూ చూశాడు. స్తంభానికానుకు నుంచున్నాడు. అరగడియ గడిచినా యెత్తు పడలేదు. శంకరప్ప విసిగిపోయాడు. ‘‘ఏమండీ, యెత్తు వెయ్యరేం?’’ అని సరసంగానే అడిగాడు. 

‘‘నీకెందుకయ్యా మా గొడవ’’ అని సలహాదారు మిడుతూ చూసి కొంచెం విసుక్కున్నాడు.

‘‘మీ గొడవ నా కెందుకూ? ఆట గొడవ అడుగుతున్నాను.’’

‘‘నాలుగ్ఘళ్ల పొద్దెక్కేటప్పటికి ఆట యీ స్థితికి వచ్చింది.’’

‘‘ఇంతమంది– యింతసేపు– యిందులో యేం వుందీ?’’

ఆటకాడి కిది కొట్టినంత పని చేసింది. బుస్సుముంటూ మొగం పైకెత్తి ‘‘చదరంగం అంటే మీ కేమయినా తెలుసా?’’ అని అడిగాడు.

ఆటగాడి మొగం మీద చక్కని వర్ఛస్సు కనపడింది శంకరప్పకి. ‘‘ఇతగాణ్ణి భృత్యుణ్ణి చేసుకుతీరాలి’’ అని నిశ్చయించుకున్నాడు. ‘‘వారి ఆట నేను కట్టిస్తాను. నేను చెప్పినట్టెత్తు వెయ్యండి’’ అన్నాడు.

‘‘అయితే సలహా చెప్పు’’ అని బల్లకేసి తిరిగా డాటగాడు.

‘‘ఎన్ని యెత్తుల్లో ఆట కట్టమంటారు?’’

‘‘సొరకాయలు నరుకుతున్నావే!’’

‘‘మీ నల్లగది శకటు వారి గుర్రం ముందు వెయ్యండి’’అన్నాడు శంకరప్ప. చెప్పినట్టు వేశాడు ఆటకాడు.

‘‘వోస్‌! అయితే, మరి, గుర్రం యిక్కడ వేశాను’’ అన్నాడు ప్రతిపక్షి.

‘‘ఆ బంటుతో మీరు తోసిరాజనండీ!’’

‘‘అరే, అరే’’ అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు. ‘‘మహానుభావా’’ అని శంకరప్పను కౌగిలించుకున్నాడు. 

‘‘అయ్యా, యీపూట మీరు భోజనానికి మా యింటికి దయచెయ్యాలి’’ అని ఆహ్వానించాడు సలహాదారు.

‘‘మీ అనుగ్రహానికి సంతోషం. నే నింతలో యీవూరు విడిచివెళ్లను. ఇప్పటికి నన్ను విడిచి పెట్టండి.’’ అని శంకరప్ప చెయ్యి విడిపించుకున్నాడు.

దాంతో రామశాస్త్రీ, యాజులూ ఆయన సహచరులయ్యారు.

తర్వాతి ఆట పంతులుతో. మరో ఆట రాజుతో. ఒక తెలగా, ఒక వైశ్యుడూ, ఒక బ్రాహ్మడూ.

‘‘మూడెత్తుల్లో ఆట కట్టేస్తారు వీరు’’ అని శంకరప్పను పరిచయం చేయసాగారు శాస్త్రీ, యాజులూ.

‘‘అంత సమర్థులా వారు’’ అని ఎదుటివారు అనుమానపడటమూ, తర్వాత నోరు కుట్టేసుకోవడమూ.

మరో ఆట భీమరాజుతో. ఇంకో ఆట కృష్ణంరాజు గారితో. అటుపై దుర్వాసుల ఆదివారాహ మూర్తితో.

‘‘కుడివైపునున్న మన యేనుగుని వారి శకటు దగ్గిరగా వేయించండి.’’ 

‘‘మన యెర్రగది శకటు రాజుకి అయిమూల గదిలో పడెయ్యండి.’’

పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు చిత్తయిపోయారు. తంగిరాల శంకరప్ప పేరు చుట్టుపట్ల రామనామం అయిపోయింది. అనేకులు పట్టంచుల చాపు లివ్వ వచ్చారు. ఉప్పాడ జరీజామార్లు కట్టబెట్టపోయారు. బరంపురం తాపితాలు సమర్పించపోయారు. కాశ్మీర శాలువాలు కప్పపోయారు. శంకరప్ప వొకటీ పుచ్చుకోలేదు.

సామంతులూ, సేనాధిపతులూ, రాజబంధువులూ, రాజపురుషులూ, సంపన్నులూ, సరసులూ కోరి శంకరప్పతో ఆడి, ఆట కట్టించుకుని, అదే తమకొక గొప్పగా ఆనందించసాగారు. పాలకీ, పదహారుగురు బోయీలు, పది పదిహేనుగురు భటులు ‘‘చామర్లకోట శ్రీ రావు రాయడప్ప రంగా రాయణింగారి మనుష్యులం’’ అంటూ వచ్చారు. రాజనర్తకి అలివేణి, మహారాజు సన్నిధిని వుండవలసిన నలుగురు వేశ్యలలోనూ వొకతె రంగనాయిక కూడా శంకరప్ప ప్రతిభను చూసి ‘ధన్యులు’ అయినారు. 

‘‘పట్నంలో కెవరో అసాధ్యపు ఆటకాడు వచ్చారుట, మీ కేమయినా జాడ?’’

‘‘లేదు మహాప్రభూ!’’

రాజ కార్యాలన్నీ ముగించుకుని, పెద్దాపురం కోటలో, మహా రాజాధిరాజ, పేషణి హనుమంత, నెలవోలు గండాంక శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు లక్కమేడ వసారాలో పచారుజేస్తున్నారు. కాగితాలు చేత పట్టుకుని దివాన్జీ మాట్టాడుతున్నాడు.

‘‘ఊరంతా కోడయికూస్తోందిట– మీకు తెలవకపోవడం యేమిటండీ?’’ మహారాజు అసంతృప్తి కనపరిచాడు.

దివాన్జీ వెళ్లిపోయిన తర్వాత, ఆట దగ్గర కూర్చోకుండానే ‘‘గోడ అవతల నుంచుని నాలుగెత్తుల్లో’’ ఆట కట్టించిన శంకరప్ప గొప్పతనాన్ని వివరించింది ‘రంగి’.

ఈలోగా దాట్ల అప్పలనరసింహరాజు లోగిట్లో వత్సవాయి విజయరామరాజుతో ఆడుతుండగా– ప్రౌఢ, మధ్య, ముగ్ధలు చిలకలు చుడుతూ, విసనకర్ర విసురుతూ, బంగారపు గంధపు గిన్నెలతో యేకాగ్రత భంగపరిచేందుకు ప్రయత్నించినా వికారం యేమీ కనబరచకుండా శంకరప్ప నెగ్గాడు. ‘‘తమ రొక్కమాటు మహారాజులుంగారితో ఆడాలండీ!’’

పాలకీ కోటగుమ్మంలోకి వెళ్లింది. శంకరప్పకు ఠాణేదారు నమస్కరించాడు. దివాన్జీ ఆహ్వానించాడు. మహారాజుకి శంకరప్ప దగ్గిర మహేశ్వరాంశ కనబడింది. మహారాజు దగ్గిర శంకరప్పకి విష్ణ్వంశ ద్యోతకం అయింది.

రంగ నాయిక బలం సద్ది వుంది. ఒక పక్షానికి కెంపులూ, వొక పక్షానికి పచ్చలూ పొదిగిన బంగారపు బలం అది. పచ్చల వేపు శంకరప్ప, కెంపుల వేపు మహారాజు. ఆ నడకే కొత్తగా సాగింది. దిగ్ధంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే. అయినా ద్రష్టలకు దర్శనీయమే. తాపీగా ప్రారంభం అయిన ఆట నాలుగ్ఘడియలు గడిచేటప్పటికి ‘‘యెత్తు పడదేం?’’ అన్న స్థితికి వచ్చింది. మరో గడియ. మన్నాడు. తరువాత. వారాలు, మాసాలు. ‘‘నెగ్గేశాం పెద్దమ్మా. ఆరుమాసాలకయినా ఆట కట్టిందని మహారాజు వొప్పుకోవలసిందే.’’ 

ఠాణేదారుకి దేవిడిమన్నా అయిపోయింది. పెద్దాపురంలో ఉండటానికే లేదు. దివాన్జీ మీద వీరభద్రావతారం తాల్చేశారు మహారాజు. 

చివరికి ఒకరోజు మహారాజు శంకరప్పని కౌగలించుకున్నాడు. ‘‘చదరంగంలో నాకిదే మొదటి వోటమి. ఇంతటి ఉత్కటానందం నాకింతవరకు కలగలేదు. పెద్దాపురం రాజ్యంలో వున్నది యేమయినా సరే తమకి సమర్పించుకుంటాను, సెలవిప్పించండి.’’

‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపుచేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ!’’

విషయం ఎవరికీ బోధపడినట్టులేదు.

‘‘ఏమి, లెక్క తేలిందా?’’ అడిగాడు మహారాజు.

‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అంటూ షరాబు కాగితం మహారాజు కందించాడు. 

రాజ్యమే సమర్పించుకునేందుకు మహారాజు సిద్ధపడ్డాడు. శంకరప్ప అంగీకరించలేదు. చివరకు సర్వలక్షణ సంపన్నమైన అగ్రహారం, పెద్దమ్మకు సాలీనా నూటాపదహారు రూపాయల బహుమానం, శాస్త్రీ, యాజుళ్లకు చెరొక నూటపదహారు రూపాయల బహుమానం ఏర్పాటు చేసి, శంకరప్పను దగ్గిర వుండి గజారోహణం చేయించాడు మహారాజు.


(సాక్షి సాహిత్యం; 2019 జూన్‌ 24)

 

Saturday, August 10, 2024

Samsa In Love


Haruki Murakami

 

హారుకి మురకామి (జననం: 1949) జపనీస్‌ కథ ‘జాంజా ఇన్‌ లవ్‌’ కథాసారం ఇది. దీన్ని ‘ద న్యూయార్కర్‌’ కోసం ఇంగ్లిష్‌లోకి అనువదించింది టెడ్‌ గూసెన్‌. తెలుగులో ఇక్కడ క్లుప్తంగా చెప్పాను. ఫ్రాంజ్‌ కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’ నవలికకు ఈ కథ ట్రిబ్యూట్‌ అనుకోవచ్చు. దాన్నే నిర్ధారిస్తున్నట్టుగా కథ కాఫ్కా పుట్టిన చెకొస్లొవేకియా రాజధాని ప్రాగ్‌లోనే జరుగుతుంది. ఉన్నట్టుండి ఒకరోజు మనిషి(గ్రెగర్‌ జంజా) కీటకంగా మారిపోవడం కాఫ్కా కథైతే, అలాంటి ఒక కీటకం మనిషిగా మారడం మురకామి కథ.

––

జాంజా ఇన్‌ లవ్‌


మేల్కొనేసరికి తాను రూపాంతరం చెంది గ్రెగర్‌ జాంజా అయినట్టు అతడు గుర్తించాడు. మంచం మీద అలాగే వెల్లకిలా పడుకుని పైకప్పు కేసి చూశాడు. కాంతికి కళ్లు అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది. పైకప్పుకు వేసిన రంగు తెల్లదే కావొచ్చు, కానీ ఏళ్లతరబడి మురికిపట్టడం వల్ల పాడైపోయిన పాలరంగులా కనబడుతోంది.

గదికి ఎడమవైపున ఉన్న పెద్ద కర్టెన్లు లేని కిటీకీలోంచి పడుతున్న సూర్యకాంతి నేల మీద సమాంతర రేఖల్ని ఏర్పరుస్తోంది. కిటికీకి చుట్టూ మందపాటి చెక్క కొట్టివుంది. దాన్ని ఎందుకు రక్షణగా పెట్టివుంటారు? తుఫాను ఏమైనా రానుందా? ఎవరైనా లోపలికి రాకుండానా? ఎవరైనా(బహుశా, అతడు) బయటికి పోకుండానా?

కొద్దిగా తలతిప్పి గదిని పరికించాడు. కుర్చీలు, టేబుల్‌ ఏమీలేవు, తను పడుకున్న మంచం తప్ప. అక్కడ ఎందుకున్నాడో, ఏం చేయాలో అర్థం కాలేదు. అతడికి తెలిసిందల్లా తానొక మనిషి, తన పేరు గ్రెగర్‌ జాంజా. అదైనా ఎలా తెలిసింది? నిద్రిస్తున్నప్పుడు ఎవరో చెవిలో చెప్పివుంటారు. కానీ గ్రెగర్‌ జాంజా కాకమునుపు ఏమిటి? ఆ ప్రశ్న తలెత్తగానే తలలో దోమల రొద మొదలైనట్టు అనిపించింది. ఆలోచించడం అనవసరమైన ఒత్తిడి పెట్టుకోవడమే అని విరమించుకున్నాడు.

ఏదేమైనా శరీరాన్ని ఎలా కదపాలో అతడు నేర్చుకోవాల్సి ఉంది. పైకప్పును చూస్తూ ఎల్లకాలం పడుకోలేడు. పైగా పడుకుంటే దేన్నుంచీ కాపాడుకునే వీలు లేదు. పిట్టలేమైనా వచ్చి తినేస్తే? మొదటి ప్రయత్నంగా చేతివేళ్లను కదిలించి చూశాడు. రెండు చేతులకు కలిపి మొత్తం పదున్నాయి. మళ్లీ వాటికి కీళ్లుండటం వాటి కదలికను సంక్లిష్టం చేస్తోంది. పరిస్థితిని మరింత దిగజారుస్తూ శరీరం నిస్సత్తువగా అనిపించింది, ఏదో చిక్కటి ద్రవంలో తాను మునిగివున్నట్టూ, తన బలాన్ని చిట్టచివరి కొసదాకా అందించడంలో విఫలమైనట్టూ.

చాలా ప్రయత్నాల తర్వాత అతడు వేళ్లను నియంత్రించుకోవడంలో సఫలమయ్యాడు. చేతివేళ్లు కదలడం మొదలుకాగానే నిస్సత్తువ మాయమైంది. కానీ లోపలేదో నొప్పి పీడించసాగింది. కొంతసేపటికి ఆ నొప్పి ఆకలి అని గుర్తించాడు. ఆకలి కోసం అలమటించడం అతడికి కొత్త. కనీసం అలాంటిది ఒకటి అనుభవించినట్టు తన జ్ఞాపకాల్లో లేదు. ఒక వారంగా ఏమీ తిననంత ఆకలి. ఆ నొప్పిని ఇంకా భరించలేక మోచేతుల ఆసరగా కొద్దికొద్దిగా లేచాడు. శరీరం ఎదురు తిరిగింది. అయినప్పటికీ శక్తినంతా కూడగట్టుకుని కూర్చోగలిగాడు.

తన నగ్నదేహాన్ని దిగులుగా చూసుకున్నాడు. ఎంత అనారోగ్యకరమైన ఆకృతి! ఏ విధమైన స్వీయరక్షణ వ్యవస్థ లేదు. బలహీనమైన నరాలు, కవచం లేని పొట్ట, ఇట్టే విరిగిపోగలిగే మెడ, కురూపి తల, నత్తపెంకుల్లాంటి రెండు చెవులు. నిజంగా ఇది తానేనా? ఇంత అసంగతమైన, ఇంత సులభంగా నాశనం చేయగలిగిన శరీరం ఈ ప్రపంచంలో బతికి బట్టకట్టగలదా? దీనికి బదులు తాను చేపగా ఎందుకు మారలేదు? కనీసం పొద్దుతిరుగుడు పువ్వు ఎందుక్కాలేదు?

కాళ్లను మంచం నుంచి కిందికి దించాడు. చాలా కష్టం మీద రెండు కాళ్ల మీద తన శరీరాన్ని నియంత్రించుకోగలిగాడు. తల మోయలేనంత బరువుగా అనిపించింది. ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో అతడు నడక నేర్చుకోవాల్సి ఉంది. కానీ అదెంత హింస! ముందు కుడి, తర్వాత ఎడమ కాళ్లను ఒకదానితర్వాత ఒకటి వేయడం అనేది అన్ని సహజ సూత్రాలను బేఖాతరు చేస్తోంది, పైగా ఇక్కడెక్కడో ఉన్న కళ్లతో కిందెక్కడో ఉన్న కాళ్లను చూసుకోవడం అతణ్ని భయంతో వణికించింది. కానీ ఈ గదిలోనే ఎల్లకాలం ఉండలేనని అతడికి తెలుసు. నత్త వేగంతో అతడు అడుగులు ప్రారంభించాడు. తెలుస్తున్న నొప్పి తప్ప సమయాన్ని కొలిచే సాధనం లేదు.

తలుపు పిడి పట్టుకుని లాగాడు. చప్పుడు చేస్తూ తెరుచుకుంది. హాల్లో మొత్తం నాలుగు తలుపులున్నాయి ఒకేరకంగా. వాటి వెనక ఏమి ఉండివుంటాయి? కానీ పొట్ట నింపుకోవాల్సిన అవసరం అతడి కుతూహలాన్ని పక్కకునెట్టింది. ముక్కుతో వాసన పీలుస్తూ అది వస్తున్న దిశగా కదిలాడు. నోట్లో లాలాజలం ఊరింది. ఆ వాసన వస్తున్న దగ్గరికి చేరాలంటే ఏటవాలుగా ఉన్న మెట్లు దిగాల్సిందే. మొత్తం పదిహేడున్నాయి. జాంజా మనసులోకి మళ్లీ చేప, పొద్దుతిరుగుడు పువ్వు కదిలాయి. వాటిగా రూపాంతరం చెందివుంటే ఈ మెట్లు దిగే బాధ లేకుండా శాంతిగా ఉండగలిగేవాడిని అనుకున్నాడు.

అండాకారంలో ఉన్న టేబుల్‌ మీద ఆహారం పెట్టివుంది. చుట్టూ ఐదు కుర్చీలున్నాయి. కానీ మనుషుల జాడ లేదు. లిల్లీ పువ్వులున్న గ్లాసు వేజ్‌ టేబుల్‌ మధ్యలో ఉంది. వడ్డించిన పళ్లేల్లోంచి ఆవిర్లు లేస్తున్నాయి. నాప్కిన్లు, చంచాలు ఎవరూ తాకినట్టు లేదు. తినడానికి కూర్చుండగానే హఠాత్తుగా సంభవించినదేదో వాళ్లను పరుగెత్తించినట్టు కనబడుతోంది. వాళ్లు తినడానికి తిరిగొస్తారా?

సమీపంలో ఉన్న కుర్చీలో కూర్చుని తన చేతులతో అందుకోగలిగే పదార్థాల్ని నోట్లోకి కుక్కుకున్నాడు. బ్రెడ్డు, సాసేజులు, నలగ్గొట్టిన ఆలుగడ్డ కూరుకున్నాడు. ఉడికించిన గుడ్లను పొట్టు తీయకుండానే మింగాడు. తొక్కులను వేళ్లతో నాకాడు. పులుపు, కారం అన్నింటి రుచీ ఒకటే. అన్నింటినీ ఖాళీ చేసి, అలుపు తీర్చుకోవడానికి కుర్చీకి ఒరిగాక చూస్తే టేబుల్‌ మీద జగడాలమారి కాకులు కొట్లాడినట్టుంది. తాకనిది ఏదంటే ఆ లిల్లీలు మాత్రమే. తిండి గనక తక్కువ పడివుంటే వాటిని కూడా దిగమింగేవాడు.

ఉన్నట్టుండి అతడికి చలేసింది. ఆకలి తీవ్రత మిగతా ఇంద్రియాలను పనిచేయనీయలేదు. ఎప్పుడైతే తృప్తిగా తిని తేన్చాడో పొద్దుటి చలి వణికించింది. పైగా పూర్తి దిగంబరంగా ఉన్నాడు. చుట్టుకోవడానికి ఏదో కావాలి. 

మూలన కొన్ని వాకింగ్‌ స్టిక్స్‌ ఉన్నాయి. ఒకదాన్ని తీసుకున్నాడు. కనీసం పిట్టలు ఏవైనా దాడికొస్తే రక్షణగా పనికొస్తుంది. ఇంటికి ఎదురుగా ఒక వీధి ఉంది. మరీ పెద్దదేం కాదు, చాలామంది కూడా వెళ్లడం లేదు. కానీ వెళ్తున్నవాళ్లంతా పూర్తిగా బట్టలు వేసుకుని ఉన్నారు. కొందరు టోపీలు పెట్టుకున్నారు. నడవడం గురించి వాళ్లు పెద్ద ఇదిగా ఆలోచిస్తున్నట్టే లేదు. తనను తాను అద్దంలో చూసుకున్నాడు జాంజా. తొడుక్కోవడానికి ఏవైనా కావాలి.

మళ్లీ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. దిగడం కంటే పైకి ఎక్కడం సులభమనిపించింది. నొప్పి కూడా అంతగా లేదు. అదృష్టం అతడి పక్కన ఉంది. తలుపులు ఏవీ తాళం వేసి లేవు. తెరుస్తూ మూస్తూ వెతికాడు. ఒక పెద్ద గదిలో బట్టలు కనబడ్డాయి. కానీ వాటిని ఎట్లా వేసుకోవాలో అర్థం కాలేదు. ముందేది, వెనకేది? పైనేది, కిందేది?

నీలపు రంగు డ్రెస్సింగ్‌ గౌన్‌ అన్నింట్లోకీ తొడుక్కోవడానికి సులభంగా తోచింది. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో వేసుకోగలిగాడు. అది చర్మానికి మృదువుగా అనిపించింది. గౌనుకు మేచ్‌ అయ్యే స్లిప్పర్స్‌ కూడా సంపాదించగలిగాడు.

--

డోర్‌ బెల్‌ మోగుతున్నప్పుడు ఆ ఇంట్లోని పెద్ద గదిలోని పెద్ద మంచంలో కునుకు తీస్తున్నాడు. ఆ దుప్పటి కింద వెచ్చగా పడుకోవడం కోడిగుడ్డులో నిద్రిస్తున్నట్టుగా ఉంది. ఉన్నట్టుండి ఏదో కలలోంచి మేల్కొన్నాడు. దాని వివరాలు గుర్తులేవు కానీ అది బాగుండింది. కానీ బెల్‌ మోత వాస్తవంలోకి తెచ్చింది. మంచంలోంచి లేచి, గౌనును కట్టుకుని, స్లిప్పర్స్‌ వేసుకుని, వాకింగ్‌ స్టిక్‌ పట్టుకుని, నెమ్మదిగా మెట్లు దిగాడు. మొదటిసారి దిగినదానికంటే ఈసారి మరింత సులభమైంది. డోర్‌ బెల్‌ మాత్రం అదేపనిగా మోగుతూనే ఉంది. వాళ్లెవరోగానీ సహనం లేనివారై ఉండాలి.

తలుపు తీసేసరికి అక్కడో పొట్టావిడ కనబడింది. చాలా పొట్టి మనిషి. అసలు ఆమెకు డోర్‌బెల్‌ ఎలా అందిందో ఆశ్చర్యమే. తర్వాత అర్థమైంది– ముందుకు వంగడం వల్ల చిన్నదిగా కనబడిందిగానీ లేదంటే మామూలు కొలతల అమ్మాయే. ముందుకు పడకుండా రబ్బరు బ్యాండుతో జుట్టు బిగించుకుంది. మెడకో గీతల కాటన్‌ స్కార్ఫ్‌ చుట్టుకుంది. ఇరవైల్లో ఉండొచ్చు. ఇంకా ఏదో ఉంది ఈ అమ్మాయిలో. కళ్లు పెద్దవి. ముక్కు చిన్నది. పెదవులు చంద్రవంకల్లా ఉన్నాయి.

‘‘ఇది జాంజా ఇల్లేనా?’’ అతడి వైపు మెడ ఎత్తి అడిగిందామె.

‘‘అవును’’ అన్నాడు. తను గ్రెగర్‌ జాంజా అయినప్పుడు ఇది జాంజాల ఇల్లే అయివుండాలి.

(ఈ కథ ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఆమె నిజానికి పెద్ద అల్మారా తాళం బాగుచేయడానికి వచ్చిన అమ్మాయి. బయటంతా యుద్ధ ట్యాంకర్లు తిరుగుతుంటాయి. అమ్మాయి అయితే చెక్‌పాయింట్లను దాటడం సులభమని వాళ్ల కుటుంబం ‘అప్రెంటిస్‌’ అయిన ఈమెను పంపిస్తుంది. బయట అంత కాల్పులు జరుగుతున్నా కూడా బాగు చేయాల్సిన తాళాల గురించి పట్టించుకునేవాళ్లూ, వాటిని బాగుచేయడానికి ఇంత నిబద్ధతతో వచ్చేవాళ్లూ... ఇంత చిన్న విషయాల పట్ల నిజాయితీగా ఉండటం ద్వారానే ఈ విధ్వంసకర ప్రపంచంలో పిచ్చివాళ్లం కాకుండా కాపాడుకోగలం అని ఆమె వ్యాఖ్యానిస్తుంది. ఆమె పట్ల అతడి మగప్రాణం నెమ్మదిగా విప్పుకోవడం మొదలవుతుంది. జాంజా మాట్లాడే తీరు వల్ల అతడు మానసికంగా ఎదగలేదమో అని ఆమె ముందు అనుకుంటుంది, కానీ మనిషి మంచివాడే అని గ్రహిస్తుంది. చివరలో ఆమె తిరిగి వెళ్లిపోతున్నప్పుడు, మళ్లీ మిమ్మల్ని చూడొచ్చా అని అతడు అడుగుతాడు. గట్టిగా తలుచుకుంటే కలుసుకోవడం కష్టమేం కాదని ఆమె సెలవు తీసుకుంటుంది. చేపలాగో, పొద్దుతిరుగుడు పువ్వులాగో పుట్టివుంటే నేను ఈ ఉద్వేగాన్ని అనుభవించేవాడిని కాదని జాంజా అనుకోవడంతో కథ ముగుస్తుంది.)


(సాక్షి సాహిత్యం; 2018 నవంబర్‌ 26)

Wednesday, August 7, 2024

గొల్ల రామవ్వ


పి.వి.నరసింహారావు 


భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కథ ‘గొల్ల రామవ్వ’కు సంక్షిప్త రూపం ఇది. ఈ కథ కాకతీయ పత్రికలో 1949లో అచ్చయింది. ‘విజయ’ కలంపేరుతో రాశారు. బహుభాషా కోవిదుడిగా కీర్తినొందిన పీవీ ఆత్మకథాత్మక నవల ‘ఇన్‌సైడర్‌’(లోపలి మనిషి) రాశారు. 

––

గొల్ల రామవ్వ


ఢాం... ఢాం... ఢాం..!

బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. గాఢనిద్రలో వున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి నిద్ర నుండి త్రుళ్లిపడి లేచారా అన్నంత అలజడి. ఊరిచుట్టు పెరండ్లలో కుక్కల అరుపు. తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. 

గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని వుంది. ఆమె కాళ్లు చేతులు వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని వుంది. పేరు మల్లమ్మ.

హఠాత్తున కిటికీ నెవరో తట్టారు. కిటికీ అంటే దాని ప్రాణమెంత? మంటిగోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి రెండు చిన్న తలుపులు. చప్పుడుకు వారిద్దరు ఉలికిపడ్డారు. శ్వాస బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. మళ్లీ అదే చప్పుడు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు, పిల్లి అసలే కాదు. ఏం చేయాలి?

ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. ‘నాకు బయమైతాందే అవ్వ’.

‘అట్లుండు! ఏదో చూత్తాం’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. గొళ్లెం తీస్తూ ‘ఎవర్రా?’ అంది. ఆ ప్రశ్న ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే అతడే తలుపులు బిగించాడు.

ఏ రజాకారో ఇంట్లో దూరాడు. తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన మనుమరాలికి మానభంగం తప్పదు. తాను పిల్లను సాది సంబాళించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా? ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది. ఆ తరువాత పాపం మల్లి!

ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్లు దొరికించుకుంది. ‘నీ బాంచెను. నీ కాళ్లు మొక్కుత. అది నీ చెల్లెలనుకో’.

ఆ వ్యక్తి గుసగుసగా చెప్పాడు: ‘నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను’.

కాళ్లు పట్టుకొన్న ముసలవ్వ మెల్లగా లేస్తూ అతని మోకాళ్లు, నడుము తడుమసాగింది. చొక్కా లేదు. దేహమంతటా పల్లేరుకాయలు, జిట్టరేగు ముండ్లు. గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి. శరీరం జ్వరంతో రొట్టెపెంకవలె మసలి పోతున్నది. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు.

‘మల్లీ! దీపం ముట్టియ్యే జెప్పన.’ 

‘వద్దవ్వా వద్దు. దీపం వెలిగించకు. పోలీసులు నా వెంటపడ్డారు, పట్టుకుంటారు.’

‘పోలీసుల కన్నా ముందు నిన్ను సావుదేవతే పట్టుకునేటట్టున్నది’ గద్దించింది ముసలమ్మ.

మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ మూలకొక గొంగడి పరిచింది. అతడు పదునెనిమిదేండ్లకు మించని బక్కపలుచని యువకుడు. 

‘మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్లెక్కియ్యే. ఎక్కిచ్చినవా? ఇగరా. కూకో వాని పక్కన. ముండ్లు తీసెయ్యి ఉల్లుల్లుగ. అయొ! సిగ్గయితాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానవతివి గదనే! పాపం పీనుగోలె పడున్నడుగాదె!’ ముసలవ్వ గొణుగు మహాప్రవాహం వలె సాగిపోతున్నది. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు.

యువకుని దేహమంతా శుభ్రమైంది. ఇంతలో తలె తెచ్చి, ముసలవ్వ యువకుని తలాపున కూర్చుంది. ‘ఇగ లే కొడుకా. కొద్దిగంత గట్క చిక్కటి సల్లల పిసుక్కచ్చిన. పొయ్యే పాణం మర్లుతది. కులం జెడిపోతవని భయపడుతున్నవా? మొదలు పాణం దక్కిచ్చుక్కో’.

ఆమె మాటలకు చిరునవ్వుతో యువకుడు తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు గటగట త్రాగాడు. సగం పోయిన ప్రాణాలు తిరిగివచ్చాయి. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది.

యువకుడి దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగింది. ‘గిదేందిరో’ అంటూ ఒక్కు వస్తువ తీసింది.

‘అది తోటాల తుపాకి’ అన్నాడు యువకుడు.

‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదమనుకున్నవా ఏంది?’

‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్లను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే.’

‘ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’

‘నేను స్టేట్‌ కాంగ్రెస్‌ వాలెంటియర్ను. నైజాం రాజుతోటి కాంగ్రెస్‌ పోరాడుతున్నది.’

పెద్ద పెద్దోల్లేమో పట్నంల ముచ్చట్లు పెట్టుకుంటు కూకుంటరట, పసిపోరగాళ్లనేమో పోలీసోల్ల మీదికి పొమ్మంటరట... అని రామవ్వ కాసేపు గొణిగింది. కొద్దిగ కన్ను మలుపుకొమ్మని యువకునికి చెప్పింది.


పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు. 

అకస్మాత్తుగా బజారులో మోటారు ట్రక్కు చప్పుడైంది. ఎటువిన్నా బూటుకాళ్ల తటతటలే. 

మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచాడు. బయటికి పోబోతే ముసలవ్వ వారించింది. 

‘అటో యిటో తేలిపోవాలి. నా వల్ల మీకు అపాయం కలుగుతుంది’ అన్నాడు యువకుడు. 

ముసలవ్వ అతణ్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పేసింది. 

బయట మనుషుల అలికిడి. 

మల్లమ్మకు చెప్పింది: ‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలె? ఆ దుప్పటిన్నూ కండువా తీస్కరా!...’ 

తలుపు మీద నాలుగుసార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. 

యువకుడిని దుప్పటి కట్టుకొమ్మంది. కండువాను నెత్తికి చుట్టుకొమ్మంది. 

‘ఓ రామీ! తల్పూకి ఖోల్‌’ 

మల్లివి రెండు దండె కడాలు తీయించి అతడికి తొడిగింది. ‘గొల్ల వేషం’ తయారైంది. 

మళ్లీ తలుపు మీద దిబదిబ. ‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. నీకి తోడ్కల్‌ తీస్తం ఠైర్‌. ఫౌరన్‌ తీ తల్పు’.

‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో.’

యువకునికి ఎటూ తోచలేదు. తుదకు పట్టుపడటమే నొసటన వ్రాసి యున్నట్లుంది. విధి లేక పడుకున్నాడు.

ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ– ‘ఎవర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు. మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యీపులు పెట్న బలుగుతయ్‌’ అంది. ‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు, ఊ నడూ!... ’

బయటినుండి ‘మేం పోలీసోళ్లం’ అన్నది ముసలవ్వ వినిపించుకోలేదు. 

‘నన్నేం దోసుకుంటర్రా? లేచి తలుపు తీసేదాక గూడా ఓపిక లేకపోతే పగులగొట్టుండ్రి. దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గిలేదు. మల్లికి నిన్న మొగడచ్చిండేమో, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినిపించుకోదు...’

‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద. చూసెటోని కనుమానం రావద్దు... ’

‘ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఊహూ వీల్లు లేవరు. వీల్ల వైసు వక్కలుగాను, బజార్ల గంత లొల్లాయితాంటె మా రాజుగ గుర్రుకొడతాన్రు... నా ముంగట్నే కొడుకూ కోడలూ రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. యాడున్నవురో కొడుకా’ అంటూ రాగం పెట్టి ఏడువసాగింది.

బయటివాళ్లు నానావిధాల మాట్లాడుతున్నారు. ‘పాపం పోనీ’ అని ఒకరు. ‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్‌’ అని మరొకరు. బయటినుంచి పగలగొట్టుదామనే లోపు తలుపు తీసింది.

‘పోరి మెడల గంటెపుత్తెలున్నయి, పోరగానికి రెండు దండె కడియాలున్నయి, ఇగేం కావాల్నో తీసుకోండి’ అంది.

అప్పుడే నిద్రలోంచి లేచినట్టు మల్లమ్మ కండ్లు నులుముకుంటూ లేచింది. యువకుడు కూడా లేచి కూర్చున్నాడు. యువకుని వైపు చూపిస్తూ పోలీసు ‘వాడు కాంగ్రెసోడా యేం’ అని ప్రశ్నించాడు.

‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నవా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది?’ ముసలవ్వ తీవ్రతకు పోలీసులు చకితులైనారు. రేపు వీన్ని హాజరు చెయ్యాలని ఆదేశించి వెళ్లిపోయారు.

‘అవ్వా నువ్వు సామాన్యురాలవు కావు, సాక్షాత్‌ భారతమాతవే’ అన్నాడు యువకుడు.

‘దోడ్త్‌! నాకే పేర్లు బెడుతున్నావు? నేను గొల్లరామిని. గంతే. ఇగ నువ్వెల్లు. మల్లిని అత్తోరింటికి తోలుకపోత’.


(సాక్షి సాహిత్యం; 2018 మార్చ్‌ 5)


 

Sunday, August 4, 2024

Katherine Mansfield: బొమ్మరిల్లు


Katherine Mansfield


కేథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌(1888–1923) కథ ‘ద డాల్స్‌ హౌజ్‌’కు నా సంక్షిప్త అనువాదం ఇది. కేథరీన్‌ న్యూజిలాండ్‌లో జన్మించారు. 34 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసేప్పటికే ఎన్నో గొప్ప కథలు వెలువరించారు.

––

బొమ్మరిల్లు


బర్నెల్‌ కుటుంబంతో కొన్నాళ్లు ఉండి, పట్టణానికి తిరిగి వెళ్లాక, పిల్లలకు ప్రేమగా మిసెస్‌ హే ఒక బొమ్మరిల్లు పంపింది. అది ఎంత పెద్దదంటే కార్టర్, ప్యాట్‌ ఇద్దరూ పెరట్లోకి మోయాల్సివచ్చింది. ఎండాకాలమే కాబట్టి తడుస్తుందన్న భయం లేదు. దానికి చుట్టిన కవర్లు ఇంకా తీయకముందే, దాని గాఢమైన పెయింటు వాసన జబ్బు కలిగించేట్టుగా ఉందని అభిప్రాయపడింది అత్త బెరీల్‌. 

నున్నటి ముదురు పాలకూర రంగులో ఉన్న ఆ బొమ్మరిల్లు ప్రకాశవంతమైన పసుపు వెలుతురులో మరింత మెరిసిపోతోంది. దాని పైకప్పుకు ఎరుపు, తెలుపుల్లో రెండు చిమ్నీలు అంటించివున్నాయి. తలుపులు పసుపు వార్నిష్‌లో మెరుస్తున్నాయి. నాలుగు కిటికీలను ఆకుపచ్చ రంగుతో పేన్లుగా విభజించారు. ముందు కొంత పసుపు రంగు వరండా కూడా ఉంది. ఎంత చక్కటి బొమ్మరిల్లు! పెయింటు వాసనొస్తే ఏం? 

‘ఎవరైనా తెరవండి, తొందరగా!’

ప్యాట్‌ హుక్‌ తీయగానే ఇల్లు వెనక్కి వెళ్లిపోయింది. డైనింగ్‌ రూమ్, డ్రాయింగ్‌ రూమ్, కిచెన్, రెండు బెడ్రూములను ఒకే చూపుతో చూడొచ్చు. ‘ఓఓఓహ్‌!’ పిల్లలు అరిచారు. ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ల జీవితంలో ఇంతవరకూ ఇలాంటిది చూడలేదు. గదులన్నింటికీ వాల్‌పేపర్‌ అంటించివుంది. వాటిమీద బంగారు ఫ్రేముల్లో చిత్రాలుంచారు. కిచెన్‌లో తప్ప అంతటా రెడ్‌ కార్పెట్‌ పరిచివుంది. డ్రాయింగ్‌ రూమ్‌లో మెత్తటి సోఫాలున్నాయి. టేబుళ్ల మీదా, బెడ్స్‌ మీదా క్లాత్‌ వేసివుంది. ఊయల, స్టవ్, డ్రెస్సింగ్‌ టేబుల్, చిన్న ప్లేట్లు, ఒక పెద్ద జగ్గు... వీటన్నింటికన్నా కెజియా పాపకు బాగా నచ్చింది మాత్రం ల్యాంప్‌. తెల్లగా గుండ్రంగా ఉంది, డైనింగ్‌ రూమ్‌ మధ్యలో. వెలిగించలేముగానీ అందులో నూనె ఏదో నింపివుంది.

అమ్మ, నాన్న బొమ్మలు స్టిఫ్ఫుగా డ్రాయింగ్‌ రూములో కూర్చునివున్నాయి. వాళ్ల ఇద్దరు పిల్లలు పై అంతస్తులో పడుకునివున్నారు. ఎందుకో పిల్లలు ఈ ఇంటికి చెందినవాళ్లలా లేరు. కానీ ల్యాంప్‌ మాత్రం సరిగ్గా సరిపోయింది.

తెల్లారి బర్నెల్‌ పిల్లలు బడికి నడుస్తూ వెళ్లడం కష్టమైంది. బడి గంట మోగేలోగా అందరికీ చెప్పేయాలన్న ఆత్రం. ‘నేనే చెప్తాను, నేను మీకన్నా పెద్దదాన్ని’ అంది ఇసాబెల్‌. చిన్నవాళ్లిద్దరికీ ఒప్పుకోక తప్పలేదు. పెద్దవాళ్లుగా ఉండటంలో వచ్చే అధికారాలు ఏమిటో లాటీకీ, కెజియాకూ తెలుసుకాబట్టి ఏమీ మాట్లాడలేదు. ‘కాకపోతే మీరు నా తర్వాత మాట కలపొచ్చు’ అని వెసులుబాటు ఇచ్చింది ఇసాబెల్‌. ‘ఎవరిని ముందు చూడనివ్వాలో కూడా నేను నిర్ణయిస్తా’ అంది. ‘కావాలంటే అమ్మ ఎవరినైనా పిలవొచ్చంది’. బొమ్మరిల్లు ఎటూ పెరట్లోనే ఉంది కాబట్టి, స్కూల్లో ఇద్దరిద్దరినీ ఒకసారి ఇంటికి ఆహ్వానించొచ్చు. 

కానీ వాళ్లు చేరేసరికే బడిగంట మోగింది. టోపీలు తీసి వెంటనే వరుసల్లో నిలబడాల్సి వచ్చింది. ఏం ఫర్లేదు! తాను ఎంతో ప్రాధాన్యమున్న మనిషిలా ముఖం పెట్టి, వెనక అమ్మాయితో ‘ఆటల పీరియడ్‌లో చెప్పడానికి నా దగ్గర ఒక సంగతి ఉంది’ అని గుసగుసలాడింది ఇసాబెల్‌.

ఆటల పీరియడ్‌లో ఇసాబెల్‌ను అమ్మాయిలందరూ చుట్టుముట్టారు. ఆమె భుజం మీద చేయి వేయడానికి అందరూ పోటీపడ్డారు. ఈ గుంపుకు అవతల ఉన్నది ఇద్దరే అమ్మాయిలు. కెల్వీ కుటుంబీయులు.

నిజానికి ఆ ఊళ్లో మరో స్కూలంటూ ఉంటే బర్నెల్‌ పిల్లలు ఇక్కడికి వచ్చేవారే కాదు. కానీ మైళ్ల దూరంలోనూ మరోటి లేదు. దాని ఫలితం ఏమిటంటే, అన్ని స్థాయులవాళ్లూ ఈ బడికి రావాల్సిందే. న్యాయమూర్తి చిన్నారి కూతుళ్లూ, డాక్టర్‌ బిడ్డలూ, దుకాణదారు పిల్లలూ, ఆఖరికి పాలుపోసేవాళ్ల పిల్లలు కూడా. మరి వీళ్లందరి మధ్యా ఎక్కడో ఓ గీత గీయాలి కదా! అది కెల్వీల దగ్గర గీయబడింది. బర్నెల్‌ పిల్లలతో సహా చాలామందికి వాళ్లతో మాట్లాడటానికి కూడా అనుమతి లేదు. అందుకే కెల్వీలను ఎవరూ తమలో కలుపుకోరు.

కెల్వీలు ఇల్లిల్లూ తిరిగి బట్టలు ఉతికే ఆమె పిల్లలు. వాళ్లాయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. జైలులో ఉన్నాడని చెప్పుకుంటారు. కెల్వీ చిన్నారులు వేరేవాళ్లు దానంగా ఇచ్చిన గుడ్డముక్కలతో కుట్టిన బట్టలు తొడుక్కున్నారు. బొద్దుగా ఉండే ‘లిల్‌’(లిటిల్‌) బర్నెల్‌ వాళ్లు ఇచ్చిన టేబుల్‌క్లాత్‌ లాంటి బట్టతో కుట్టిన గౌను వేసుకుంది. దానికి లోగన్‌ వాళ్లు ఇచ్చిన తెరలతో స్లీవులు కుట్టివున్నాయి. ఆమె పెట్టుకున్న టోపీ ఒకప్పుడు మిస్‌ లెకీ వాడింది. ఇక చిన్నది, బక్కపలుచటి ‘మన ఎల్స్‌’(అవర్‌ ఎల్స్‌) తెల్ల నైట్‌గౌను లాంటిది వేసుకుంది. ఎల్స్‌ జుట్టు పొట్టిగా కత్తిరించివుంది. కళ్లు చాలా పెద్దవి. కానీ వాటిల్లో భయం ఉంటుంది. తెల్ల గుడ్లగూబ! ఆమె నవ్వగా ఎవరూ చూడలేదు. నోరూ తెరవదు. అక్క లిల్‌ ఎటు వెళ్తే అటు గౌను పట్టుకుని వెంట పోతుంది. రోడ్డు, స్కూలు, మైదానం... ఏదైనా కావాలంటే గౌను పట్టుకుని గుంజుతుంది. అప్పుడు లిల్‌ ఆగి వెనక్కి చూస్తుంది. చెల్లికి ఏం కావాలో ఆమెకు అర్థమైపోతుంది.

ఇసాబెల్‌ తన స్నేహితురాళ్లతో బొమ్మరిల్లు గురించి గొప్పగా చెబుతోంది. కార్పెట్లు, మంచాలు... ‘నువ్వు ల్యాంప్‌ సంగతి మరిచిపోయావక్కా’ గుర్తుచేసింది కెజియా. ‘ఓ, అవును’ అని చెప్పడం మొదలుపెట్టింది ఇసాబెల్‌. కానీ దాని గొప్పతనం సగమైనా చెప్పలేదనుకుంది కెజియా. సాయంత్రం ఏ ఇద్దరిని పిలవాలన్న ధ్యాస మీదుంది ఇసాబెల్‌. ఎమ్మీ కోల్, లీనా లోగన్‌ ఆ అదృష్టవంతులు. కానీ అందరికీ తెలుసు, తమ వంతు రేపైనా వస్తుందని. అందుకే ‘ఇసాబెల్‌ నా ఫ్రెండు’ అని గొప్పలకు పోతున్నారు. లిల్, ఎల్స్‌ మాత్రం తలదించుకుని వెళ్లిపోయారు.

కొన్ని రోజులు గడిచేసరికి అందరి నోళ్లలోనూ అదే మాట. ‘నువ్వు బర్నెల్‌ వాళ్ల బొమ్మరిల్లు ఇంకా చూడలేదా?’ లంచ్‌ టైములో, ప్లే గ్రౌండులోనూ ఇవే మాటలు. 

ఒకరోజు భోంచేస్తున్నప్పుడు, ‘అమ్మా, నేను కెల్వీలను ఇంటికి పిలవొచ్చా?’ అడిగింది కెజియా.

‘కచ్చితంగా వద్దు.’ ‘ఎందుకొద్దు?’ ‘కెజియా, ఎందుకొద్దో నీకు తెలుసు.’

చివరికి లిల్, ఎల్స్‌ తప్ప అందరూ బొమ్మరిల్లు చూశారు.

ఒకరోజు పైన్‌ చెట్ల కింద కూర్చుని పిల్లలు భోంచేస్తున్నారు. లిల్, ఎల్స్‌ దూరంగా కూర్చున్నారు. విషయం అటూయిటూ మారి కెల్వీలు పెద్దయ్యాక ఏమవుతారు అన్నదాని మీదకు మరలింది. ‘లిల్‌ కచ్చితంగా పనిమనిషి అవుతుంది’ గుసగుసగా అంది ఎమ్మీ కోల్‌. ‘నేను ఆమెను అడగనా?’ అంది లీనా లోగన్‌. ‘నువ్వు అడగలేవు’ పందెం కాసింది జెస్సీ మే. ‘నువ్వు పెద్దయ్యాక పనిమనిషివి అవుతావట నిజమేనా?’ అరిచింది లీనా. ఎల్స్‌ తినడం ఆపి చూస్తోంది. జవాబివ్వకుండా అవమానంగా నవ్వింది లిల్‌.

బడయ్యాక గుర్రపుబగ్గీలో ఇసాబెల్, లాటీ, కెజియా ఇంటికి వెళ్లిపోయారు. బట్టలు మార్చుకున్నారు. కెజియా దొంగతనంగా ఇంట్లోంచి బయటపడి గేటు మీద ఊగుతోంది. ఉన్నట్టుండి రోడ్డు వైపు చూస్తే చిన్న బిందువులేవో కనబడ్డాయి. నెమ్మదిగా అవి పెద్దవై రోడ్డువైపే వస్తున్నాయి. లిల్, ఎల్స్‌. ముందు సంకోచించింది కెజియా. కానీ తర్వాత ‘హలో’ అని పలకరించింది. ఊహించని పలకరింపుకు వాళ్లు విస్తుపోయారు. ‘కావాలంటే మీరు బొమ్మరిల్లు చూడొచ్చు’ అంది కెజియా. లిల్‌ తల అడ్డంగా ఊపింది. ‘ఎవరూ చూడట్లేదు’ అంది కెజియా. అయినా లిల్‌ అలాగే నిలబడింది. లిల్‌ గౌను లాగింది ఎల్స్, చిట్లించిన కళ్లతో. చెల్లిని అనుమానంగా చూసింది లిల్‌. మళ్లీ గౌను లాగింది ఎల్స్‌. కెజియా దారి చూపుతుండగా ఇద్దరూ పెరటిలోకి వెళ్లారు. అక్కడుంది బొమ్మరిల్లు! లిల్‌ గట్టిగా గాలి పీల్చింది. ఎల్స్‌ రాయిలా నిలబడింది. మెల్లిగా ఓపెన్‌ చేసింది కెజియా. ‘ఇది డ్రాయింగ్‌ రూమ్, ఇది డైనింగ్‌ రూమ్‌...’ 

‘కెజియా!’ బెరీల్‌ అత్త అరుపు. తను చూస్తుంది నమ్మలేనట్టుగా ఆమె ముఖం. ‘వాళ్లను పిలవడానికి ఎంత ధైర్యం నీకు?’ ‘పొండి, అవతలికి పొండి పిల్లలు’ కోడిపిల్లల్లా తరిమింది.

సిగ్గుతో కంపిస్తూ, లోపలికి కుంచించుకుపోతూ వాళ్లు బయటికి పరుగెత్తారు. బర్నెల్‌ ఇల్లు కనబడనంత దూరం వచ్చాక ఓ చోట కూలబడ్డారు. లిల్‌ చెంపలు ఎరుపెక్కాయి. ఎల్స్‌ అక్క దగ్గరికి జరిగి కూర్చుంది. దూరంగా గుర్రాలశాల, పాలు పితకాల్సిన ఆవులు... క్షణంలో ఎల్స్‌ ఆ గద్దింపు మనిషిని మరిచిపోయింది. అక్కను లాగుతూ అందంగా నవ్వింది. ‘నేను ల్యాంపును చూశాను’ అంది మృదువుగా.


(సాక్షి సాహిత్యం; 2018 మే 7)







 

Thursday, August 1, 2024

గ్యారా కద్దూ బారా కోత్వాల్‌


సురవరం ప్రతాపరెడ్డి

 

సురవరం ప్రతాపరెడ్డి(1896–1953) ‘గ్యారా కద్దూ బారా కోత్వాల్‌’ సంక్షిప్త రూపం ఇది. పదకొండు ఆనిగెపుకాయలు పన్నెండుమంది ఆయగాండ్లు అని ఈ శీర్షిక అర్థం. ‘మొగలాయి జమానాలో కర్ర యెవనిదో బర్రె వానిది అనే బాపతుగా’ సాగుతున్న వ్యవహారాన్ని ఈ కథ చిత్రించింది. సురవరం– రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు, నాయకుడు. ఆయన పరిశోధన గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ సుప్రసిద్ధం. ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ కవుల సంచిక’ అపురూపమైనది.

––

గ్యారా కద్దూ బారా కోత్వాల్‌


ఒకనాడు ఒక పల్లెకాపు పదకొండు సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్లినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరంచేస్తూ వున్నారు. అంతలో మాలీపటేల్‌ వేంచేసినాడు. ‘‘ఒరేయ్‌! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచి మాటతో ఒక కాయ ఇచ్చిపో’’ అంటూ ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు. గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు. ‘‘పట్టుకొని రారా వాణ్ని. ముసాఫిర్ల లెక్కలో వానిపేరు రాయాల్సింది వుంది’’ అని గర్జించినాడు. తలారి వచ్చి తనపాలి ఒక కాయ, పటేలు పాలిటి ఒక కాయ లాగుకొని పోయినాడు. కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు. ‘‘ఏయ్, మొన్న నీవంటివాడే వచ్చిండెను. పొద్దు మునిగినప్పుడు కూరగాయ లమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ల యింట్లో కన్నం వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్‌’’ అంటూ తానున్నూ ఒక కాయ చేతబట్టుకున్నాడు. ఈ విధంగా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన పదకొండు మంది ఆయగాండ్లు ఒకరి వెనుక ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. కాపు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య అప్పుడే ప్రత్యక్షమైనాడు. ‘‘ఏమిరా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు చెప్పు. తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను’’ అన్నాడు. న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ వూరిలో వున్నాడురా నారాయణా అనుకొని కాపు తన పదకొండు సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి ‘‘అయ్యా నన్నెట్లన్నా గడ్డ కేయండి’’ అని గొంగడి ఆయన కాళ్లమీద వేసి కాళ్లు పట్టుకొన్నాడు. కర్ణం ఝాడించి తన్ని కంబలి చంకబెట్టుకొని, ‘‘అరే లుచ్ఛా! అందరికీ యిచ్చి నా వంతు తప్పించినావా? నేను తలారివానికంటే పనికిరానివాణ్నా? నా వంతు సొరకాయ యిచ్చి యీ గొంగడి తీసుకుపో’’ అని యింటికి పోయినాడు.

కాపు ‘‘నా వంటి దిక్కులేనివారు బతికేదెట్లా’’ అని చిన్న పిల్లవానివలె కొంతసేపు ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు ‘‘పో నాయనా! పొద్దున్నే ఎవరి ముఖం చూచినావో. యీ వూళ్లో అందరూ ఇట్లాంటి మారాజులే. ఇంకోమారు రావద్దు’’ అని బుద్ధి చెప్పినారు. కాపు దీర్ఘాలోచన చేస్తూ ఇంటిబాట పట్టినాడు. ‘‘థూ, దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే బీదోన్ని ఏమి చేయగలను? దేవునికైనా దెబ్బే గురువు. నేనున్నూ ఏదో మొండి తొండి చేస్తా’’ ఇట్లా ఆలోచనలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. తటాలున ఒక మెరుపు మెరిసినట్లా వాని తలలో ఆలోచన తళుక్కుమంది.

చటుక్కున లేచినాడు. ఊళ్లోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్లి ‘‘ఒసేయి! నీ వంకి ఇట్లా తే. ఇయ్యమంటే! నీకేం ఫర్వాలేదు. మళ్లీ వుగాది నాటికి ఒకటికి నూరు వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య అను’’ అని వంకీని లాగుకున్నాడు. పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ల దూరంలో వుండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజాలు, పగిడీ, నడుముపట్టి, బిల్లలు మొదలైనవి సిద్ధము చేసుకొన్నాడు. నలుగురు అరబ్బు జవానుల జతచేసుకున్నాడు. వారికి బిల్లలను తగిలించినాడు. తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు. ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నాడు.

రెండామడ దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారి పేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యే స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావి గట్టున ఒక పెద్ద మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడువారు నీటికి వస్తే ఆ జవానులు ‘‘ఖబర్దార్, కడవకొక పైసా యిచ్చి నీళ్లు తీసుకోండి’’ అని బెదిరించినారు. పటేలు పట్వారీ వచ్చినారు. ‘‘ఒరేయ్‌! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్‌’’ అని ఉర్దూ ముద్రలతోనుండే ఫర్మాను చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారు లూరకైనారు.

దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణా ఎక్కువైంది. ‘మర్రిమాన్‌ పరగణా సుంకం’ చుట్టూ రెండామడ వరకు ప్రసిద్ధి అయిపోయింది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి. ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే ‘‘పైసా లావ్‌’’ అన్నారు జవానులు. వారు ఉత్త కడవలతో వాపసు పోయి ‘‘సర్కార్‌! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్లు తీసుకోనివ్వరు. అరే సుబేదార్‌ సర్కారు వారికిరా అంటే జంబియాలతో పొడిచేదానికే పైబడవస్తారు సర్కార్‌!’’ అని విన్నవించుకొన్నారు. అక్కడనే సేవలో ఉన్న పటేలు పట్వారీ లిట్లన్నారు: ‘‘హుజూర్‌! పదేండ్ల నుండి యీ మర్రిమాన్‌ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది’’. ‘‘ఉంటే ఉండవచ్చును’’ అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు.

ఒకనాడు దీవాన్‌ బహద్దర్‌ గారు అక్కడ ఢేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదేగతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవానుగారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు: ‘‘మా హుజూర్‌ గారు ఫర్మానిచ్చి నారేమో, లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసే గుండె వుందా వీనికి?’’ దీవాను గూడా సుంకం చెల్లించుకొన్నాడు. కాపువాణ్ని పట్టే పగ్గాలు లేవు.

ఇట్లావుండగా నవాబుగారు షికారుకు పోతూ పోతూ పొద్దు పోయిందని రాత్రికి ఆ వూరులోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపువానికెవరున్నూ కంటికాగేటట్లు కనబడలేదు. పైసా ఆడబెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబుగారిట్లా తమలోనే అనుకున్నారు. ‘‘మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో, పట్నం పోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడుమాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధుణ్నై ఉండాల్సిందే’’ అని నీటిసుంకం చెల్లించుకొన్నాడు.

ఈ పాటికి మర్రిమాన్‌ పరగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చినాడు. నవాబు నగరానికి వేంచేసిన తర్వాత దివాన్జీని పిలిచి ‘‘దివాన్‌సాబ్, మీరెందుకు నీటి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయము కాదా?’’ అని విచారించినాడు. అందుకు దీవాను ‘‘హుజూర్‌! నేను కూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్‌ గారు ఫర్మానె ముబారక్‌ జారీ చేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను’’ అని మనవి చేసుకున్నాడు. ‘‘అరే నీవూ హుకుం ఇయ్యలేదు, నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాణ్ని గిరఫ్తారీ చేయించి తక్షణం పట్టి తెప్పించు’’ అని ఉరిమినారు.

కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు. 1000 అష్రఫీలు బంగారు తట్టలో పోసుకొని జరీ పనిచేసిన మఖ్మల్‌ బట్ట పైన మూసుకొని హుజూరువారికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచేవరకు నవాబు చల్లబడ్డారు. ‘‘క్యారే నీకీ యెవ్వర్‌ నీటి సుంకం హుకుం ఇచ్చినార్‌?’’ అన్నారు నవాబు. ‘‘హుజూర్‌! గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్‌ పరగణా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది’’ అన్నాడు కాపు. ‘‘ఏమంటున్నావురా? సరిగా చెప్పు’’.

‘‘నా తప్పులంతా మాఫ్‌ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను’’ అని తన కథంతా వర్ణించి చెప్పుకొన్నాడు కాపు. హుజూరు అదేపనిగా నవ్వుతూ ‘‘అరే! నీవు చాలా హుష్యారు మనిషివి. నీ తప్పంతా మాఫ్‌. ఇకముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొట్తూ వుండుము. అదే నీకు శిక్ష’’ అని సెలవిచ్చినారు.

కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్కలేచినట్టుండేది. ఏమిన్నీ ఆదాయం లేదు. అధికారం లేదు. రాత్రులంతా నిద్రకాయవలెను. ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరిచిపోయినాడు. 12 గంటలకు లేచి కొట్టినాడు. ఈ చిన్నపొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందులయ్యింది.

హుజూరు 8 గంటల నుండి గంటకొక బేగంగారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 గంటల బేగంగారు గంటల కాపును పిలిపించి ‘‘అరేయ్‌! నా గంట మరిచిపోకుండా కొట్తూ వుండుము. నెలకు 50 రూపాయిలిస్తాను’’ అన్నది. ‘‘చిత్తం చిత్తం హుజూర్‌’’ అని కాపు తత్తరపాటుతో అన్నాడు. ‘‘ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా’’ అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 9 తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట తప్పితే మరునాడే ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. ఈ విధంగా నెలకు 400 రూపాయీల జీతం ఏర్పాటైంది. 

కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతి తెలిసింది. వీడు చలాకీవాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి ఇనాముగా ఇచ్చి పంపివేసినాడు.


(సాక్షి సాహిత్యం; 2018 సెప్టెంబర్‌ 17)