Friday, October 18, 2024

ద థింగ్స్‌ దే క్యారీడ్‌


Tim O'Brien


టిమ్‌ ఓ’బ్రెయిన్‌ (జననం 1946) అమెరికన్‌ కథ ‘ద థింగ్స్‌ దే క్యారీడ్‌’ క్లుప్త సారాంశం ఇది. అమెరికా కథా సంకలనాల్లో ఎక్కువసార్లు చోటు చేసుకున్న కథగా దీనికి ప్రసిద్ధి. ఇదే పేరుతో రచయిత కథాసంకలనం 1990లో వచ్చింది. ఇవన్నీ వియత్నాం యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైనికుడి అనుభవాల నేపథ్యంలో సాగుతాయి. ఆ యుద్ధంలో పనిచేసిన టిమ్‌ తన ఆత్మకథ ‘ఇఫ్‌ ఐ డై ఇన్‌ ఎ కంబాట్‌ జోన్‌’ రాశారు; ‘యుద్ధ వ్యతిరేక’ నవల ‘గోయింగ్‌ ఆఫ్టర్‌ క్యాసియాతో’ వెలువరించారు.

––––

మోస్తున్న యుద్ధం

 

కథ ప్రారంభమయ్యే సమయానికి– 

ఫస్ట్‌ లెఫ్ట్‌నెంట్‌ జిమ్మీ క్రాస్‌ వెంట మార్తా అనే అమ్మాయి రాసిన రెండు ఉత్తరాలున్నాయి. ఆమె న్యూజెర్సీలోని మౌంట్‌ సెబాస్టియన్‌ కాలేజీలో తన జూనియర్‌. అవేమీ ప్రేమలేఖలు కాదు, కానీ అయితే బాగుండునని తలపోస్తాడు జిమ్మీ. అందుకే వాటిని జాగ్రత్తగా ప్లాస్టిక్‌ కవర్లో పెట్టి తన వీపుబ్యాగులో దాచాడు. మధ్యాహ్నం తరువాత, ఆ రోజుటి ప్రయాణం ముగిశాక, కందకం తవ్వుకుని, చేతులు కడుక్కుని, ప్లాస్టిక్‌ కవర్‌ తెరిచి, కొనవేళ్లతో ఫొటోలను పట్టుకుంటాడు జిమ్మీ. ఆమెతో వైట్‌ మౌంటెయిన్స్‌లో ప్రయాణాలు చేసినట్టుగా ఊహించుకుంటాడు. ఒక్కోసారి ఆ లిఫాఫా అంచులను రుచి చూస్తాడు, ఆమె నాలుక అక్కడ ఆడించివుంటుందన్న ఎరుకతో. ఆమెను తను ఎంత ప్రేమిస్తున్నాడో ఆమె కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ ఆ ఉత్తరాల్లో ఆమె ప్రేమ ఎంతటిదో అంచనాకి చిక్కదు. వాళ్ల రూమ్‌మేట్స్‌ గురించీ, పరీక్షల గురించీ అందంగా రాస్తుంది; వర్జీనియా వూల్ఫ్‌ పట్ల ఆరాధనను ప్రదర్శిస్తుంది; కానీ ఈ యుద్ధం గురించి ప్రస్తావించదు. ‘నువ్వు జాగ్రత్త జిమ్మీ’ అని మాత్రం రాస్తుంది. ఆ ఉత్తరాలు పది ఔన్సుల బరువుంటాయి. వాటిని ‘ప్రేమతో, మార్తా’ అని సంతకం చేస్తుంది. కానీ ‘ప్రేమతో’ అనేది సంతకానికి ముందు మాటవరుసకు తగిలిస్తుందా? చీకటి పడటంతో అతడు ఉత్తరాల్ని బ్యాగులో యధాస్థానంలో ఉంచి, మిగతా సైనికులతో పని చూసుకుని, స్థావరం చుట్టూ పరిశీలించి, మళ్లీ కందకం దగ్గరికి వచ్చి, రాత్రంతా మార్తా గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

తర్వాత రచయిత సైనికులు తమవెంట మోసే ప్రతి వస్తువునూ, ప్రతి సూక్ష్మ వివరంతో, ముఖ్యంగా వాటి బరువుతో సహా వివరిస్తాడు.

వాళ్లు మోసే వస్తువులు చాలావరకు అవసరం నిర్దేశించినవి. అవసరాలు లేదా అవసరాల్లాంటి వాటిల్లో ఉన్నవి పి–38 క్యాన్‌ ఓపెనర్లు, చిన్న చాకులు, చేతి గడియారాలు, దోమల మందులు, సిగరెట్లు, ఉప్పు టాబ్లెట్లు, చిరుతిళ్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, కుట్టుదారాలు, వేతన సర్టిఫికెట్లు, సి–రేషన్లు(క్యాన్లలోని తిండి) మరియు రెండు మూడు బాటిళ్ల నీళ్లు. ఇవన్నీ కలిపి ఏడెనిమిది కిలోల బరువుంటాయి, ఒక్కో మనిషి అలవాట్లనూ అరిగించుకునే శక్తినీ బట్టి మారుతూ. భారీ మనిషి హెన్రీ డాబిన్స్‌ అదనపు రేషన్లను మోస్తాడు, ప్రత్యేకించి పీచ్‌ పళ్ల డబ్బాలంటే అతడికి ఇష్టం. పరిశుభ్రత మీద పట్టింపున్న డేవ్‌ జెన్సన్‌ టూత్‌బ్రష్, చిన్న హోటళ్లలో ఇచ్చే పరిమాణపు సబ్బుబిళ్లలు మోస్తాడు. ఏప్రిల్‌ మధ్యలో థాన్‌ ఖే గ్రామ పొలిమేరలో కాల్పుల్లో చనిపోయేదాకా భయస్థుడైన టెడ్‌ లావెండర్‌ నిద్రగోళీలను మోసేవాడు. అవసరార్థమూ, విధివిధానాల్లో భాగంగానూ అందరూ రెండున్నర కిలోలుండే స్టీలు హెల్మెట్లు ధరిస్తారు. యూనిఫామ్‌ ఉండనేవుంది. కాళ్లకు 0.95 కిలోల ఎత్తుబూట్లు ఉంటాయి. డేవ్‌ జెన్సన్‌ దగ్గర మూడు జతల సాక్సులు, కాళ్లు చెడిపోకుండా ముందుజాగ్రత్తగా రాసుకునే పౌడరు ఉంటాయి. కాల్చబడేదాకా టెడ్‌ లావెండర్‌ దగ్గర, అతడికి అత్యవసరమైన ఓ 200 గ్రాముల మాదకద్రవ్యం ఉండేది. నార్మన్‌ బౌకర్‌ డైరీ మోస్తాడు. ర్యాట్‌ కైలీ దగ్గర కామిక్‌ పుస్తకాలుంటాయి. భక్తి శ్రద్ధలున్న కియోవా దగ్గర తండ్రి బహూకరించిన కొత్త నిబంధన పుస్తకం ఉంది. అంతటా మందుపాతరలు ఉన్నందున స్టీలు జాకెట్లు వేసుకొమ్మని అవసరం శాసించింది. దీని బరువు 3 కిలోలు, కానీ ఎండగా ఉన్నరోజున మరింత బరువుగా తోస్తుంది. చనిపోవడం ఇట్టే జరిగే వీలున్నందున, త్వరగా అందేలా అందరూ తమ హెల్మెట్లలో బ్యాండేజీ ఉంచుకుంటారు. రాత్రుళ్లు మరీ చల్లగా ఉంటాయి కాబట్టి అందరూ ఆకుపచ్చ ప్లాస్టిక్‌ షీట్‌ ఉంచుకుంటారు; రెయిన్‌కోట్‌లా, పరుచుకునే పక్కలా, తాత్కాలిక టెంటులా కూడా వాడుకోవడానికి. ఓ కిలో బరువుంటుంది గానీ ప్రతి అంగుళం ఉపయోగకరం. ఉదాహరణకు ఏప్రిల్‌లో టెడ్‌ లావెండర్‌ కాల్చబడ్డాక అతడి షీట్‌లోనే అతణ్ని చుట్టి, కొనిపోవడానికి వచ్చిన చాపర్‌ దగ్గరకు మోసుకెళ్లారు.

జిమ్మీ క్రాస్‌ దగ్గరున్న రెండో ఫొటోల్లో ఒకదానిలో మార్తా ఇటుక గోడకు ఆనుకుని నిల్చుని ఉంది. రెండో ఫొటో కాలేజీ ఇయర్‌ బుక్‌లోంచి చించింది. వాలీబాల్‌ ఆడుతుండగా తీసిన ఆ ఫొటోలో ఆమె వైట్‌ జిమ్‌ షార్ట్స్‌ వేసుకుంది. కాళ్లు కనబడుతున్నాయి. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లినరోజున ఎడమ కాలిని అతడు మృదువుగా తాకాడు, కానీ ఆమె చూసిన చూపు చేతిని వెనక్కి తీసుకునేలా చేసింది. కానీ ఆ స్పర్శ ఇంకా జ్ఞాపకం. 

సైనికులు మోసేవాటిల్లో కొన్ని వాళ్ల స్థాయితో ముడిపడినవి. చిన్న దళానికి నాయకుడిగా జిమ్మీ క్రాస్‌ కంపాస్, మ్యాపులు, కోడ్‌ బుక్స్, బైనాక్యులర్స్, 1.3 కిలోలుండే లోడ్‌ చేసిన .45 క్యాలిబర్‌ పిస్టల్‌ మోయవలసి ఉంటుంది. తన సైనికుల ప్రాణాల బాధ్యత కూడా అతడు మోస్తాడు. రేడియో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా మిషెల్‌ శాండర్స్‌ బహుచక్కని పన్నెండు కిలోల పీఆర్‌సి–25 రేడియో మోస్తాడు. డాక్టరుగా ర్యాట్‌ కైలీ మార్ఫైన్, మలేరియా మాత్రలు, సర్జికల్‌ టేప్‌ లాంటి ఓ పదికిలోల అత్యవసర వస్తువులు మోస్తాడు. 

లోడ్‌ చేయకపోతే పది కిలోలుండే, కానీ ప్రతిసారీ లోడ్‌ చేసేవుంటుంది, ఎం–60 మిషన్‌ గన్‌ని భారీకాయుడు హెన్రీ డాబిన్స్‌ మోస్తాడు. అదనంగా ఐదారు కిలోల మందుగుండు అతడి ఛాతీకీ, భుజానికీ చుట్టివున్న బెల్టుల్లో ఉంటుంది. ఎక్కువమంది ఇరవై రౌండ్ల మ్యాగజీన్‌తో లోడ్‌ చేసిన 3.7 కిలోల ఎం–16 రైఫిళ్లు మోస్తారు. పరిస్థితిని బట్టి 12–20 మ్యాగజీన్లు వెంట ఉంచుకుంటారు. అదో 4–6 కిలోల బరువు. కొందరి దగ్గర లోడ్‌ చేయకపోతే రెండున్నర కిలోలుండే ఎం–79 గ్రెనేడ్‌ లాంచర్లు ఉంటాయి. తేలికైనదే, కానీ మందుగుండే బరువు. సాధారణ లోడ్‌ 25 రౌండ్లు. దాని బరువు 7 కిలోలు. టెడ్‌ లావెండర్‌ థాన్‌ ఖేలో చనిపోవడానికి ముందు 34 రౌండ్లు ఉంచుకున్నాడు. 9 కిలోల మందుగుండు, కవచం జాకెట్, హెల్మెట్, రేషన్లు, నీళ్ల సీసాలు, టాయ్‌లెట్‌ పేపర్, నిద్రగోళీలు, వీటన్నింటికి తోడు తెలియని భయం. ఇసుకబస్తా కూలినట్టు పడిపోయాడు. ఢాం. పడ్డాడు. 

లావెండర్‌ చనిపోవడానికి ముందు మార్తా దగ్గరి నుంచి జిమ్మీ క్రాస్‌ చిన్న గులకరాయి అందుకున్నాడు. నునుపైన తెల్లటి అండాకార రాయి. 25 గ్రాములుంటుంది. సముద్ర తీరంలో ఎత్తైన అల భూమిని తాకేచోట, రెండు కలుస్తూ విడిపోయే చోట, దొరికిందని రాసింది మార్తా. కలిసి విడిపోయే గుణం ఆమెను ఆకర్షించింది. కానీ దాని అర్థం ఏమిటి?

తర్వాత– థాన్‌ ఖే ప్రాంతంలో ఉన్న అన్ని సొరంగాలను కూల్చేయమని పైనుంచి ఉత్తర్వులు అందుతాయి. అయితే, ముందు వాటిని వెతకమని ఆదేశాలు జారీ అవుతాయి. ఆ ఇరుకైన పొడవాటి సొరంగాల్లోకి మనిషి దూరి వెతకాలి. ఒక్కోసారి అందులోనే పేలిపోవచ్చు, చిక్కుబడిపోతే అరిచినా ఎవరికీ వినబడకపోవచ్చు. ఎవరు వెళ్లాలి? అప్పుడు వాళ్లను వాళ్లు అంకెలు లెక్క పెట్టుకుంటారు. 17 నంబర్‌ వచ్చిన లీ స్ట్రంక్‌ వెళ్లాడు. ఎంతకీ బయటికి రాడు. అప్పుడు జిమ్మీ క్రాస్‌ వంగి పాక్కుంటూ అతడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకెంత దూరం? ఉన్నట్టుండి  ఇది కుప్ప కూలితే? మార్తా గుర్తొస్తుంది. ఆమె ఊపిరితిత్తుల్లో నిద్రపోవాలని అనిపిస్తుంది. ఎట్టకేలకు జిమ్మీ క్రాస్, లీ స్ట్రంక్‌ క్షేమంగా బయటపడతారు.

ఏ ఊళ్లు ఎందుకు తగలబెడుతున్నారో, కుక్కలనూ కోళ్లనూ కూడా ఎందుకు కాల్చేస్తూ పోతున్నారో తెలియనంతగా వాళ్లు యుద్ధాన్ని మోస్తూ నడుస్తుంటారు. చచ్చిపోయేవాళ్ల ఉద్వేగాలనూ, ఒంటరితనాలనూ, సిగ్గుపడే జ్ఞాపకాలనూ, పిరికితనాన్నీ వాళ్లు మోస్తూవుంటారు. గాయపడిని సహచరులనూ, రోగాలనూ, నొప్పులనూ, పేలనూ, గజ్జితామరలనూ, తమ జీవితాలనూ వాళ్లు మోస్తూ సాగుతుంటారు. వియత్నామీస్‌– ఇంగ్లిష్‌ నిఘంటువులనూ, అక్కడి నేలల ఎర్రటి మట్టినీ, ఆకాశాన్నీ, అక్కడి మనుషుల ముఖాలనూ వాళ్లు మోస్తూ పోతుంటారు. అది యుద్ధం కాదు, గ్రామం నుంచి గ్రామానికీ, లక్ష్యం లేకుండా, గెలుపోటములు తేలకుండా సాగిస్తున్న దండయాత్ర.

టెడ్‌ లావెండర్‌ చనిపోయిన రోజునే, అతడిని తన షీట్‌లోనే చుట్టి విమానం ఎక్కించిన తర్వాత, తన కందకంలో కిందికి నక్కి, మార్తా ఉత్తరాలనూ, ఆ రెండు ఫొటోలనూ కాల్చేస్తాడు క్రాస్‌. ఆ రోజు వర్షం పడటం వల్ల ఆహారం వేడిచేసుకోవడానికి ఇచ్చే ఇంధనం క్యానును వాడి మంట వేస్తాడు. వేళ్ల చివర్లతో ఫొటోలు కాలేదాకా పట్టుకుంటాడు. ‘జిమ్మీ, నువ్వు జాగ్రత్త’. అందులో ప్రేమ లేదు, ఈ యుద్ధంలో ఆమె మునిగి లేదు. ప్రేమతో అని చేసిన సంతకం ప్రేమ కాదు. ఈ మోస్తున్న యుద్ధం, తను నడిపించాల్సిన మనుషులు మాత్రమే నిజం. ఎంతైనా అతడు సైనికుడు.


(సాక్షి సాహిత్యం; డిసెంబర్‌ 10, 2018)


 

No comments:

Post a Comment