Wednesday, October 23, 2024

కెథెడ్రల్‌


Raymond Carver


అంధుల పట్ల ఒక సహానుభూతిని కలిగించే కథ ఇది. అలాగని నాటకీయ పరిణామాలు ఏమీవుండవు. కళ్లు లేకుండా బతకడం అంటే ఏమిటో నెరేటర్‌ సున్నితంగా అనుభవంలోకి తెచ్చుకోవడమే ఇందులోని విశేషం. కథ పేరు ‘కెథెడ్రల్‌’. 1981లో రాసింది. రచయిత రేమండ్‌ కార్వర్‌ (1938–1988). అమెరికన్‌. ప్రధానంగా కవి. ఊపిరితిత్తుల కేన్సర్‌తో యాభై ఏళ్లకే మరణించారు. కెథెడ్రల్‌ పేరుతో ఆయన కథాసంకలనం వచ్చింది. మరో కథా సంకలనం పేరు ‘వాట్‌ వి టాక్‌ ఎబౌట్‌ వెన్‌ వి టాక్‌ ఎబౌట్‌ లవ్‌’. 

––––––––––

చీకట్లో చిత్రం


కథను మనం నెరేటర్‌ గొంతులో వింటాం. సంభాషణ శైలిలో చెబుతూవుంటాడు. ఈ గుడ్డాయన కథకుడి ఇంటికి వస్తున్నట్టు తెలియడంతో కథ మొదలవుతుంది. వచ్చి ఒక రాత్రి ఉండి వెళ్లాలనేది ప్లాను. ఆ అంధుడు కథకుడి భార్యకు పాత స్నేహితుడు. ఆయన భార్య చనిపోయింది. భార్య బంధువుల ఇంటికి వెళ్తూ, అక్కడి నుంచి ఫోన్‌ చేశాడు. అతడు ట్రెయిన్‌లో రావాలి. కథకుడి భార్య పికప్‌ చేసుకోవాలి. ఐదు గంటల ప్రయాణం. పదేళ్ల క్రితం సియాటిల్‌లో ఒక వేసవి కాలం ఆమె అతడి కోసం పనిచేసింది. ఇన్నేళ్లలో వాళ్లు మళ్లీ కలుసుకోలేదు. కానీ ఇరువురూ తమ సంగతులు చేరవేసుకుంటూనే ఉన్నారు.

అతడు వస్తున్నాడంటే కథకుడికేమీ ఉత్సాహంగా లేదు. ఆ గుడ్డితనం ఇబ్బంది పెడుతోంది. సినిమాల్లో గుడ్డివాళ్లు ఎలా ఉంటారు? నెమ్మదిగా నడుస్తారు, ఎప్పుడూ నవ్వరు. 

ఒక వేసవిలో వార్తా పత్రికలో ‘హెల్ప్‌ వాంటెడ్‌’ అన్న ప్రకటన ‘ఈమె’ చూసింది. ఇచ్చింది ఈ అంధుడే. అప్పుడామెకు అర్జెంటుగా ఏదో ఒక జాబ్‌ కావాలి. వెళ్లగానే పనిలోకి తీసుకున్నాడు. అతడికి ఏవి అవసరమో అవి చదివిపెట్టడం ఆ పని. కేస్‌ స్టడీలు, రిపోర్టుల లాంటివి. సోషల్‌ సెర్వీస్‌ డిపార్ట్‌మెంటులో అతడి ఆఫీసు. అట్లా  స్నేహితులయ్యారు. పని మానేసే చివరి రోజున ఆ అంధుడు ఆమెను ముఖం తాకవచ్చా అని అడిగాడు. ముఖం, ముక్కు అంతా వేళ్లతో తడిమి చూశాడనీ భార్య ఓసారి చెప్పినప్పుడు కథకుడు ఇబ్బంది పడతాడు. అట్లా వేళ్లు కదలాడిన అనుభవంతో ఆమె ఒక కవిత కూడా రాయడానికి ప్రయత్నిస్తుంది.

అయితే నేనతణ్ని బౌలింగ్‌కు తీసుకెళ్తాను, అంటాడు కథకుడు. ఆ వ్యంగ్యం భార్యకు అర్థమవుతుంది. ఇద్దరూ వంటింట్లో ఉంటారప్పుడు. ఆమె ఆలుగడ్డలను గుండ్రంగా తరుగుతోంది. నీకే ఒక స్నేహితుడుండి, అతడు ఇంటికి వస్తే నేను అతణ్ని సౌకర్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తానంటుంది. కానీ నాకు గుడ్డి స్నేహితులు ఎవరూ లేరంటాడతను. ఆయన భార్య చనిపోయింది, నీకు అర్థం కావట్లేదా? పాపం ఆయన భార్యను పోగొట్టుకున్నాడని ఆమె జాలి పడుతుంది. 

గుడ్డాయన భార్య పేరు బ్యూలా. నీగ్రోలా ధ్వనించే పేరు. ఈమె ఉద్యోగం మానేశాక బ్యూలా అక్కడ చేరింది. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లపాటు విడదీయలేనంత బాగా బతికారు. కానీ ఆమె క్యాన్సర్‌తో పోయింది. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆమె చేయిని ఇతడు పట్టుకుని వీడ్కోలు ఇవ్వడం కథకుడు ఊహించుకున్నాడు. ఎనిమిదేళ్లు ఒక ఇంట్లో ఉండి, కలిసి బతికి, ఆమె ముఖం ఎలావుంటుందో కూడా ఇతడికి తెలియకపోవడం అనేది కథకుడి అవగాహనలో లేని విషయం. ముందు అంధుడి పట్ల జాలిపడతాడు. కానీ ఆమెది కదా అసలైన బాధ! ప్రేమిస్తున్నవాడి కళ్లు ఎలా చూస్తాయో ఆమె ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె ముఖంలో మార్పులు అతడు గమనించలేడు. ఈ రోజు ఇలా ఉన్నావని ప్రశంసించలేడు. తయారైనా, కాకపోయినా తేడా ఉండదు.

సాయంత్రం కథకుడి భార్య రాబర్ట్‌ను, ఆ అంధుడి పేరు రాబర్ట్, స్వాగతించడానికి స్టేషన్‌కు వెళ్తుంది. వాళ్లు తిరిగి వచ్చేసరికి కథకుడు ఒక డ్రింకు కలుపుకొని, టీవీ చూస్తూవుంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు. అంటే కారు ఆగాక, ఈమె దిగి అతడి డోర్‌ తెరుస్తుంది. పెద్ద సూట్‌కేస్‌తో కిందికి దిగుతాడు రాబర్ట్‌. అతడికి పెద్ద గడ్డం ఉంది. ‘గుడ్డి మనిషికి గడ్డం’! ఇతడు టీవీ ఆపేసి తలుపు దగ్గరికి వెళ్తాడు. భార్య పరస్పరం ఇద్దరికీ పరిచయం చేస్తుంది. వెల్కమ్‌ అని మర్యాదకు అంటాడు. తర్వాత ఏం మాట్లాడాలో తోచదు. రాబర్ట్‌ మాత్రం మీ గురించి చాలా విన్నానంటాడు. కథకుడి భార్య ‘రాబర్ట్‌ ఇక్కడ కుర్చీ ఉంది, రాబర్ట్‌ నీ కుడి పక్కన’ అంటూ సూచనలు ఇస్తూ ఇంట్లోకి తోలుకొస్తుంది. 

ప్రయాణంలో హడ్సన్‌ నది అందం చూడాలంటే, న్యూయార్క్‌ వైపు వెళ్తున్నట్టయితే కుడివైపు కూర్చోవాలి; న్యూయార్క్‌ నుంచి వస్తుంటే ఎడమవైపు కూర్చోవాలి. ‘రైలు ప్రయాణం బాగా జరిగిందా, అవునూ వచ్చేప్పుడు కుడివైపు కూర్చున్నారా, ఎడమవైపా?’ అని ఇతడు అడుగుతాడు.

అదేం ప్రశ్న అని అతడి భార్య అంటుంది. కుడివైపు కూర్చున్నానని రాబర్ట్‌ చెబుతాడు. నలబై ఏళ్లుగా తను రైలే ఎక్కలేదనీ, పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కలేదనీ చెబుతాడు. రాబర్ట్‌ నలబైల చివర్లో ఉన్నాడు. బరువు మోసి వంగిపోయినట్టుగా ఉన్న భుజాలు. లేత గోధుమరంగు చొక్కా, గోధుమరంగు బూట్లు. నల్ల కళ్లద్దాలు మాత్రం పెట్టుకోలేదు. చూడ్డానికి మామూలు కళ్లలాగే ఉన్నాయి. కానీ దగ్గరగా చూస్తే తేడా ఉంది. కనుగుడ్డులో తెలుపు ఎక్కువ. కంటిపాపలు నియంత్రణ లేకుండా కదులుతున్నాయి.

ఒక డ్రింకు తీసుకొస్తానని ఇతడు చెప్పగానే, ‘సరే బాబు, నేను స్కాచ్‌ మనిషిని’ అన్నాడు రాబర్ట్‌. బాబు!

రాబర్ట్‌ తన వేళ్లతో సూట్‌కేసును తడుముకున్నాడు. దాన్ని నేను పైన నీ గదిలో పెట్టనా? అంది కథకుడి భార్య. ఏం ఫర్లేదు, నేను పైకి వెళ్లినప్పుడు అదీ వస్తుంది అన్నాడు రాబర్ట్‌. స్కాచ్‌లో చాలా తక్కువ నీళ్లు పోయమన్నాడు రాబర్ట్‌. దానికి ఐరిష్‌ నటుడు బారీ ఫిట్జ్‌గెరాల్డ్‌ కొటేషన్‌ ఒకటి చెప్పాడు. నీళ్లు తాగాలనుకున్నప్పుడు నీళ్లు తాగుతా, విస్కీ తాగాలనుకున్నప్పుడు విస్కీ తాగుతా. కథకుడి భార్య నవ్వింది. రాబర్ట్‌ తన గడ్డాన్ని చేత్తో లేపుకుని మళ్లీ వదిలేశాడు.

డ్రింక్సు తీసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాబర్ట్‌ తన ప్రయాణం గురించి చెప్పాడు. వదులుతున్న పొగను చూడలేరు కాబట్టి, గుడ్డివాళ్లు స్మోక్‌ చేయరని కథకుడు ఎక్కడో విన్నాడు. కానీ రాబర్ట్‌ హాయిగా సిగరెట్లు ఊదాడు. 

తర్వాత డిన్నర్‌ కోసం టేబుల్‌ దగ్గర చేరారు. టేబుల్‌ మీద ఉన్న ప్రతి పదార్థాన్నీ ఇద్దరూ ఆవురావురుమని ఆరగించారు. మాంసం, బీన్సు, బటర్‌ బ్రెడ్, ఆలుగడ్డలు. తన పళ్లెంలో ఏది ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకున్నాడు రాబర్ట్‌. కత్తి ఫోర్కులు అవసరమైనప్పుడు సరిగ్గా వాడాడు. ఇంక మళ్లీ రేపు లేదన్నట్టుగా తిని తేన్చి ఇద్దరూ టేబుల్‌ వదిలేసి, మళ్లీ లివింగ్‌ రూములోకి వచ్చారు. రాబర్ట్, కథకుడి భార్య సోఫాలో కూర్చున్నారు. కుర్చీలో కథకుడు ఉన్నాడు. పదేళ్లలో జరిగిన విశేషాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

నిద్ర ముంచుకొస్తుండగా, అన్ని జాగ్రత్తలూ చెప్పి కథకుడి భార్య పైన గదిలో పడుకోవడానికి వెళ్తుంది. వీళ్లిద్దరూ మాట్లాడుతూ టీవీ ఆన్‌ చేస్తారు. వాతావరణం, స్పోర్ట్స్‌ రౌండప్‌ లాంటి కార్యక్రమాలు ఏవో మారుతూ కెథెడ్రల్‌(పెద్ద చర్చి; బిషప్‌ నడిపేది) గురించి వస్తోంది. పోర్చుగల్‌లో ఉన్న కెథెడ్రల్స్‌కూ, ఇటలీ, ఫ్రాన్సుల్లో ఉన్నవాటికీ తేడా చెబుతూ, పోర్చుగల్‌లో ఉన్నవి నిర్మాణపరంగా అంత ఉన్నతమైనవి కావని దాని సారాంశం. 

ఈ సమయంలో కథకుడికి ఉన్నట్టుండి అనుమానం వస్తుంది. అసలు కెథెడ్రల్‌ అన్నప్పుడు, ఆ మాట అనగానే రాబర్ట్‌కు ఏం ఊహ కదలాడుతుంది? అదేంటో తెలుసా అసలు?

ఎవరో చెబుతుంటే విన్నాను, వందల మంది దానికోసం శ్రమిస్తారు, కొన్ని తరాలు పనిచేస్తాయి, విషాదం ఏమిటంటే పూర్తయిన నిర్మాణం చూసుకునేదాకా ఎవరూ బతకరు, మనకూ వాళ్లకూ తేడా ఏం లేదు కదా? అని బదులిస్తాడు రాబర్ట్‌. టీవీలో ఇప్పుడు జర్మనీలోని కెథెడ్రల్‌ గురించి చెబుతున్నారు. బాబూ, నాకు ఇంతే తెలుసు, నువ్వు చెబితే వినాలనుందని అంటాడు రాబర్ట్‌. కానీ ఎలా వర్ణించడం? చాలా పొడుగ్గా ఉంటాయి, పొడుగ్గా పొడుగ్గా, ఆకాశం తాకేట్టుగా, కొన్నిసార్లు రాయితో, కొన్నిసార్లు పాలరాయితో కడతారు, దాన్ని ఎలా బొమ్మ కట్టించాలో అర్థం కాక, సిగ్గుపడతాడు కథకుడు. 

అయితే, ఇద్దరం కలిసి బొమ్మ గీద్దామని సూచిస్తాడు రాబర్ట్‌. పరుగెత్తికెళ్లి పెన్నుకోసం వెతుకుతాడు. భార్య గదిలో పెన్నులు దొరుకుతాయి. తర్వాత దళసరి కాగితం కావాలి. ఎలా? కిచెన్‌లో అడుగున ఉల్లిగడ్డ పొట్టు ఉన్న ఒక బ్యాగు కనబడుతుంది. దాన్ని సరిచేసి టేబుల్‌ మీద పెడతాడు. ఈ లోపు పై గది నుంచి వచ్చిన భార్యకు ఏమీ అర్థం కాక, ఏం చేస్తున్నారని అడుగుతుంది. కెథెడ్రల్‌ గీస్తున్నామని చెబుతాడు రాబర్ట్‌. రాబర్ట్‌ చేతులను పట్టుకుని కథకుడు బొమ్మ గీయించడానికి ప్రయత్నిస్తాడు. ఆర్చులు, తలుపులు, అక్కడక్కడా జనం...

సరిగ్గా ఈ సమయంలో రాబర్ట్‌ ఒకసారి కళ్లు మూసుకొమ్మని కథకుడిని అడుగుతాడు. మూయాలి, తెరవొద్దు. కథకుడు మూసుకుంటాడు. ఇప్పుడు బొమ్మ గీద్దామంటాడు. రాబర్ట్‌ చేతులు కదిలిస్తూవుండగా కథకుడు చేతులు కదుపుతూవుంటాడు. గీయడం ఆగుతుంది. కథకుడు ఇంకా కళ్లు మూసుకునే ఉంటాడు. చూస్తున్నావా? అంటాడు రాబర్ట్‌.  కథకుడు ఇంకా కళ్లు తెరవడు. ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఎందులోనూ లేనట్టుగా అనిపిస్తుంది. 


(సాక్షి సాహిత్యం; 24 డిసెంబర్‌ 2018)






 

No comments:

Post a Comment