Wednesday, January 14, 2026

నలభై ఏళ్లు దాటకుండానే...


 నూటా నలభై


‘నేను బూడిదగానైనా మిగులుతానుగానీ మట్టిగొట్టుకుపోను’ అన్నాడు జాక్‌ లండన్‌. బతికినన్నాళ్లూ అగ్నిజ్వాలలా బతికాడు. లోకాన్ని మెరుపులా చుట్టాడు. చేయగలిగిన పనులన్నీ చేశాడు. యాక్టివిస్టు, సాహస యాత్రికుడు, యుద్ధక్షేత్రంలో విలేఖరి; నావికుడు, పేపర్‌ బాయ్, బొగ్గు గని కార్మికుడు, ఐసు బండి డ్రైవరు, వలస కూలీ, ఫొటోగ్రాఫర్, గోల్డ్‌ డిగ్గర్‌ లాంటి రెండు డజన్ల పనులు చేశాడు. నియమంగా రోజుకు వెయ్యి పదాలైనా రాసేవాడు. నవలలు, జ్ఞాపకాలు, కథలు, నాటకాలు, కవిత్వం, వ్యాసాలతో సుమారు 50 పుస్తకాలు వెలువరించాడు. తన కాలంలో అత్యంత ప్రభావశీల అమెరికా రచయితగా వెలిగాడు. కానీ నలభై ఏళ్లకే మరణించాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి నలభై ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోవడమేమిటి? కాలానికి ఏ కనికరమూ ఉండదేమో! లేదా, దాని లెక్కలు మనకు అర్థం కావేమో! ఏ లెక్కలూ పాటించని కాలాన్ని మన లెక్కల్లోకి తీసుకునే ప్రయత్నంలో దానికి లేని లక్షణాలను ఆపాదిస్తామేమో! ఫ్రాంజ్‌ కాఫ్కా, ఎడ్గార్‌ అలెన్‌ పో, కాథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌; జాన్‌ కీట్స్, ఎమిలీ బ్రాంటే, పి.బి.షెల్లీ, లార్డ్‌ బైరన్‌; స్వామి వివేకానంద; అలెగ్జాండర్‌; మొజార్ట్‌; బ్రూస్‌ లీ, మార్లిన్‌ మన్రో; మాల్కమ్‌ ఎక్స్, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌; త్రిపురనేని శ్రీనివాస్, నాగప్ప గారి సుందర్రాజు, చిత్రకొండ గంగాధర్‌– వీళ్లంతా కూడా నలభై ఏళ్లు దాటకుండానే ఈ అవనీ తీరం దాటేసినవారు!

నలభై ఏళ్లంటే మనిషి సరిగ్గా పక్వానికి వచ్చే వయసు. అన్ని బాల్య, యవ్వన చాపల్యాలను అధిగమించి నింపాదితనాన్ని సంతరించుకునే వయసు. జీవితాన్ని అత్యంత సమీపంగా దర్శించే వయసు. స్వీయ అనుభవాల వెలుతురులో గత చీకట్లను తరచి చూసుకునే వయసు. తాను నేర్చుకున్నదానికీ, తన జీవిత పాఠాలకూ మధ్యగల తేడాను నిశితంగా పట్టుకుని, తనదైన చింతనకు రూపు కట్టుకునే వయసు. ఉరుకులాటలు, వెంపర్లాటలు తగ్గి తనదైన స్థిమితాన్ని నెలకొల్పుకునే వయసు. అవసరం రీత్యా వేసుకున్న అన్ని మేకప్పులనూ కరిగించుకునే వయసు. స్పష్టమైన, స్థిరమైన గొంతును ఏర్పరుచుకునే వయసు. లోకానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే వయసు. కానీ వీళ్లెవరూ ఈ వయసుకు చేరకుండానే అంతకుమించిన పరిణతిని చూపారు, మహాద్భుతాలు చేశారు. కాలం కఠినాత్మురాలే కాదు, కరుణామయి కూడానేమో. వాళ్లకు పుట్టుకతోనే నూరేళ్ల వివేకాన్ని ఆశీర్వదించింది. అట్లా వాళ్లు నూటా నలభై ఏళ్లు బతికేసి వెళ్లారు.

‘ద కాల్‌ ఆఫ్‌ ద వైల్డ్‌’, ‘ద సీ–వూల్ఫ్‌’, ‘వైట్‌ ఫాంగ్‌’, ‘ది ఐరన్‌ హీల్‌’ లాంటి నవలలు రాసిన జాక్‌ లండన్‌ 1876లో జన్మించాడు. ఈ జనవరి 12తో 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. కిడ్నీ ఫెయిలై, స్కర్వీతో ముందటి నాలుగు పళ్లు కోల్పోయి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుదిదశలో అగ్ని ప్రమాదంలో కాలిపోయి, డిసెంట్రీ, యురేమియా లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ తాను  చేయగలిగింది చేసిపోయాడు లండన్‌. గొగోల్, చెకోవ్, డి.హెచ్‌.లారెన్స్, ఎఫ్‌. స్కాట్‌ ఫిట్జ్‌గెరాల్డ్, సాదత్‌ హసన్‌ మంటో లాంటివాళ్లంతా కూడా నలభైల్లోనే వెళ్లిపోయారు. ఇంకా యుద్ధ క్షేత్రాల్లో, విప్లవ రణరంగంలో, సామాజిక కార్యాచరణలో తమ నిండు యవ్వనాల్ని బలిచ్చిన జ్ఞాత, అజ్ఞాత తేజోదివ్వెలు ఎన్నో! వీళ్లు ఇంకా కొన్నేళ్లు బతికివుంటే మరింత వెలుగు కురిసేదా? అసలు, కురిసినదే చాలినంతా? ఏ కారణాల వల్లయినా వీళ్లు లోకం వీడొచ్చుగాక! ఈ వెళ్లిపోవడంలో బాధతో పాటు, అబ్బురం కలగలిసి ఉండటం ఒక వైచిత్రి. పాతుకుపోతున్నకొద్దీ అంటే ఈ లోకపు మకిలిని పులుముకోకుండానే, ఇంకా లోకం వారిపట్ల సంభ్రమంగా కళ్లు విప్పార్చుతున్నప్పుడే వెళ్లిపోవడం ఇందులోని మరో పార్శ్వం. డాట్‌ బాల్స్‌ ఆడుతూ విసుగెత్తించకుండా, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ రిటైర్‌ కావడం లాంటిదది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము అని అన్నమయ్య ఏ అర్థంలో పాడినా, నాటకం లాంటి ఈ జీవిత రంగస్థలం మీద ఉజ్జ్వలంగా, ధగద్ధగాయమానంగా తమ పాత్రను వెలిగించి నిష్క్రమించారు. సెల్యూట్‌!

(5 జనవరి 2025)