Friday, July 12, 2024

ఆధ్యాత్మికవాది చెస్టర్‌టన్‌

 


ఆంగ్ల ఆధ్యాత్మికవాది


ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె.చెస్టర్‌టన్‌. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్‌ కీత్‌ చెస్టర్‌టన్‌ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్‌ ఆఫ్‌ నాటింగ్‌ హిల్‌’, ‘ద మ్యాన్‌ హూ వాజ్‌ థర్స్‌డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్‌’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్‌ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్‌లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్‌ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్‌ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.

‘ఆయన ప్రతిదానీ గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్‌టన్‌ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్‌ చెస్టర్‌టన్‌ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్‌ అహ్లిక్విస్ట్‌. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్‌టన్‌ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్‌ రచయిత సి.ఎస్‌.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా  చెస్టర్‌టన్‌ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్‌టన్‌ బీటిఫికేషన్‌కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథెలిక్‌ రచయిత జోసెఫ్‌ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్‌ బెర్నార్డ్‌ షా, హె.జి.వెల్స్, బెర్ట్రాండ్‌ రసెల్‌ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్‌టన్‌ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్‌ డిటెక్టివ్‌ ‘ఫాదర్‌ బ్రౌన్‌’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్‌ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్‌ బ్రౌన్‌.

చెస్టర్‌టన్‌ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్‌ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్‌ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం, ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు. చెస్టర్‌టన్‌ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్‌ బెల్లోక్‌ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్‌ చనిపోయాక చెస్టర్‌టన్‌ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జి.కె.స్‌ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు, ఆవు’ అనేది వీరి స్లోగన్‌.

సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్‌టన్‌ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’లో చెస్టర్‌టన్‌ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్‌ ఒపీనియన్‌’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్‌ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్‌ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్‌టన్‌. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్‌ కాదు, ఇంగ్లిషిస్థాన్‌ అవుతుంది’ అని రాశారు.

విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు అత్యంత గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినప్పటికీ చెస్టర్‌టన్‌ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్‌. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్‌టన్‌ను ఎడ్గార్‌ అలెన్‌ పోతో పోల్చారు బోర్హెస్‌. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్‌ బెర్నార్డ్‌ షా. అయితే జాన్‌ పైపర్‌ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్‌టన్‌ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన.

(27-5-2024)
 

Thursday, July 11, 2024

పేరులో అభిమానం




పేరులో అభిమానముంది!


జపనీస్‌ భాషలో ‘కా’ అంటే మంచి, సాధ్యం అని అర్థాలున్నాయట. ‘ఫుకా’ అంటే చెడు, అనంగీకారం అని అర్థమట. ‘కాఫుకా’ అని వాటిని జోడించినప్పుడు, మంచి చెడుల వ్యతిరేకతను కలుపుకొని, ఒక కొత్త సందిగ్ధమైన అర్థాన్ని ఇవ్వడం ఆ పదాన్ని మరింత ఆకర్షణీయం చేస్తోంది. అయితే, ‘కాఫ్కా ఆన్‌ ద షోర్‌’ అని తన నవలకు పేరు పెట్టడానికి హరూకీ మురకామీకి ఉన్న ముఖ్య కారణం, ఈ అసందిగ్ధత కన్నా కూడా ఫ్రాంజ్‌ కాఫ్కా మీద ఉన్న అభిమానమే. కాఫ్కాను జపనీస్‌ భాషలో కాఫుకా అని రాస్తారు. ఈ నవల్లో ప్రధాన పాత్ర అయిన పదిహేనేళ్ల బాలుడు కాఫ్కా తమూరా తనకున్న శాపం నుంచి తప్పించుకోవడానికి ఇల్లు వదిలి పారిపోతాడు. కాఫ్కా సుప్రసిద్ధ కథ ‘మెటమార్ఫసిస్‌’ స్ఫూర్తితో, అందులో ఉన్నట్టుండి తెల్లారి నిద్ర లేచేసరికల్లా ఒక పెద్ద పురుగుగా మారిపోయే గ్రెగర్‌ జామ్జా స్ఫురించేలా ‘సాంసా ఇన్‌ లవ్‌’ అనే కథను కూడా రాశారు మురకామీ.


అమెరికాలో పుట్టిన స్విట్జర్లాండ్‌ జర్నలిస్ట్‌ దీనా లీ కూంగ్‌ తను రాస్తున్న నవల్లో ఒక వివేకవంతుడైన వృద్ధుడి పాత్రకు ఏకంగా వాల్టేర్‌నే భూమ్మీదికి దింపారు. ‘నువ్వు చెప్పేదానితో నేను అంగీకరించలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పే హక్కు కోసం నా చివరిదాకా పోరాడుతాను’ అన్న ఫ్రెంచ్‌ తత్వవేత్తగా వాల్టేర్‌ సుప్రసిద్ధులు. పిల్లాడి ఉబ్బసం సమస్య, భర్త దూరంగా ఉండటం, గ్రామంలోని సమస్యలు– ఇవన్నీ తీర్చడానికి పద్దెనిమిదో శతాబ్దపు గొప్ప మెదళ్లలో ఒకటైన వాల్టేర్‌ ఉన్నట్టుండి కిటికీలోంచి ఊడిపడితే? జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం ఎలాగో సరళంగా చెప్పిపోతే? అదే దీనా రాసిన ‘ఎ విజిట్‌ ఫ్రమ్‌ వాల్టేర్‌’ నవల అవుతుంది.


రచయితలు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటారు. ఏకంగా తమకు నచ్చిన రచయితలను టైటిల్‌లోకే తెచ్చేయడం అనేది ఆ అభిమానంలో ఇంకో లెవెల్‌; గరిష్ఠ స్థాయి. రచయితలు లేదా వారి రచనలు లేదా వారిని స్ఫురించేలా చేసే ఏదో ఒకటి శీర్షికగా మారడం అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఇందాక చెప్పుకొన్నదే; దాచుకోలేని అభిమాన ప్రదర్శన. రెండోది, సాహిత్య లోకంలో దీని ద్వారా కొత్త అటెన్షన్‌ దొరుకుతుంది. మూడో కారణం, దీనికిదే ఒక సంకేతం అవుతుంది. తద్వారా వెల్లడించాల్సిన విషయం ఇట్టే పాఠకులకు వెళ్లిపోతుంది. ఉదాహరణకు నాజీల మారణహోమంలో తనవారిని కోల్పోయిన వెతుకులాటను ప్రతిబింబిస్తూ రాసిన పుస్తకానికి అమెరికా కాలమిస్ట్‌ డేనియల్‌ మెండెల్‌సన్‌ ‘ద లాస్ట్‌: ఎ సెర్చ్‌ ఫర్‌ సిక్స్‌ ఆఫ్‌ సిక్స్‌ మిలియన్‌’ అని పేరు పెట్టారు. దీనికి స్ఫూర్తి, గతించిన కాలాన్ని వెతుక్కుంటూ ఫ్రెంచ్‌ రచయిత మార్సెల్‌ ప్రూస్ట్‌ రాసిన ఆత్మకథాత్మక క్లాసిక్‌ నవల ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’. ఈ నామకరణాన్ని ఒక రాజకీయ ప్రకటనగానూ వాడుకున్న రచయితలు ఉన్నారు. సామాజికంగా అనంగీకార లైంగికతను ఎక్స్‌ప్లోర్‌ చేస్తూ రష్యన్‌–అమెరికన్‌ రచయిత వ్లదీమీర్‌ నబకోవ్‌ రాసిన ‘లోలిటా’ ఒక పెనుసంచలనం. అయితే, ఇరాన్‌లో స్త్రీల లైంగికత మీద ఉన్న అణచివేతకు నిరసనగా తన జ్ఞాపకాల పుస్తకానికి ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ పెట్టిన పేరు ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌ తెహ్రాన్‌’. అలాగే, వివాహ బంధంలోని సంక్లిష్టతను చాటడానికి ఏకంగా రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌నే ఒక ప్రతీకగా చేసుకున్నారు అమెరికన్‌ నాటక రచయిత ఎడ్వర్డ్‌ అల్బీ. ‘హూ ఈజ్‌ అఫ్రయిడ్‌ ఆఫ్‌ వర్జీనియా వూల్ఫ్‌?’ పేరుతో అల్బీ రాసిన మూడంకాల నాటకం, అటుపై సినిమాగానూ వచ్చి ఎలిజబెత్‌ టేలర్, రిచర్డ్‌ బర్టన్‌ అనితరసాధ్యమైన నటులని చాటింది.


రచయితలు హీరోలను సృష్టిస్తారు. ఆ కల్పిత హీరోల వల్ల సమాజంలో నిజమైన హీరోలు ఆవిర్భవిస్తారు. అయితే మైకేల్‌ పాలిన్‌ నవల ‘హెమింగ్వేస్‌ చైర్‌’లో రచయితే హీరోగా కనబడతాడు. ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’ రచయితగా సుప్రసిద్ధుడైన హెమింగ్వే అంటే ఈ నవలలోని అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌కు వెర్రి అభిమానం. తను చేరాల్సిన హోదాను తన్నుకుపోవడమే కాకుండా, నమ్మకంగా పనిచేస్తున్న వాళ్లను తొలగిస్తూ, ప్రైవేటైజేషన్‌ చేయడానికి పూనుకుంటాడు కొత్తగా వచ్చిన పోస్ట్‌మాస్టర్‌. దానికి తలొగ్గడమా, తన హీరో హెమింగ్వేలా ఎదిరించి నిలబడటమా? దీన్నే సరదాగా చెప్పారు ఆంగ్ల నటుడు, కమెడియన్, రచయిత అయిన మైకేల్‌ పాలిన్‌. అదే హెమింగ్వేను కాలంలో ప్రయాణం, సమాంతర విశ్వాలను మేళవిస్తూ రాసిన ‘ది హెమింగ్వే హోక్స్‌’ నవలలోనూ ప్రతీకగా వాడుకున్నారు సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత జో హాల్డ్‌మాన్‌.


ఫ్రెంచ్‌ సాహిత్య దిగ్గజం గుస్తావ్‌ ఫ్లాబర్ట్‌ పేరు మీదుగా ఆంగ్ల రచయిత జూలియన్‌ బార్నెస్‌ రాసిన ‘ఫ్లాబర్ట్స్‌ ప్యారట్‌’, మరో ఫ్రెంచ్‌ మహారచయిత హొనొరే డె బాల్జాక్‌ పేరుమీద చైనీస్‌–ఫ్రెంచ్‌ రచయిత దాయి సిజీ రాసిన ‘బాల్జాక్‌ అండ్‌ ద లిటిల్‌ చైనీస్‌ సీమ్‌స్ట్రెస్‌’, అమెరికా పౌర యుద్ధం నేపథ్యంలో ఇటాలియన్‌ సాహిత్య శిఖరం డాంటే స్ఫురించేలా మాథ్యూ పెర్ల్‌ రాసిన ‘ద డాంటే క్లబ్‌’ నవల– ఇలాంటివన్నీ ఆయా రచయితలు తమ అభిమాన రచయితలకు రాసుకున్న ఆత్మీయ లేఖలే. అంతెందుకు; గాంధీ, బుద్ధ లాంటి మాటల్ని ఒక ప్రతీకగా వాడుకున్న సృజనాత్మక ప్రక్రియలు మన దగ్గర కూడా లేకపోలేదు. అందుకే ఇదేదో ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రండ్‌ అనీ కాదు, ఒక భాషకు పరిమితం అనీ కాదు. కాకపోతే ఈ ట్రిబ్యూట్‌గా రాస్తున్న నవలలు కూడా ఒరిజినల్స్‌ స్థాయిలో ప్రసిద్ధం అవుతుండటమే వాటి గురించి మాట్లాడేట్టు చేస్తోంది!

(29-4-2024)




Monday, April 8, 2024

మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!


ఫిలిం మేకర్‌ సత్య తేజ్‌ ‘గంగరాజం బిడ్డ’ పుస్తకం మీద తన అభిప్రాయాన్ని ఏప్రిల్‌ 1, 2024న ఎఫ్బీలో పోస్ట్‌ చేశారు. అదే ఇక్కడ పంచుకుంటున్న.

 ----------------------------------------------------------------- 


మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!

"మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు."
మొట్టమొదటగా నా కళ్లని కట్టిపడేసిన ఈ మాటలు రాజిరెడ్డి గారి 'గంగరాజం బిడ్డ' కథల పుస్తకం బ్యాక్ కవర్ పేజ్ మీద అడ్డంగా ఎంతో అందంగా విష్ణుమూర్తి లా పడుకొని నన్ను ఆ ప్రపంచంలోకి రమ్మని ఎంతో సాదరంగా ఆహ్వానించాయి.
వెళ్ళాను. చదివాను. కొన్ని ఎంతో నచ్చాయి, కొన్ని అసలే నచ్చలేవు. కానీ ఏ అరక్షణమో కూడా పుస్తకాన్ని పక్కన పెట్టేద్దామని తలపించిందే లేదు. అంతలా తన రాతలు, subtleties and montonous lives లో నుండి తను పుట్టించే కవిత్వ పూరిత వచనం నన్ను కట్టిపడేసిందనే చెప్పాలి తప్పకుండా. Little things are never little అని మా చెల్లి నాతో ఎప్పుడూ చెపుతూ ఉంటుంది. ఇంతటి littlest of the little things ని ఒక్క మనిషి తాలూక observation లో బంధింపబడి, ఎంతో అందంగానూ, అబ్బురపోయే విధంగాను తను సృజించే కథలు భళే తమాషాగా మనకే జరుగుతున్నట్లుగా, మనమే ఆ vantage point నుండి చూస్తున్నట్లుగా, అవేం అతీంద్రియ శక్తులకే పరిమితమయ్యే విషయాలు కావన్నట్టు, చూడగలిగితే ఓ బోర్లించిన చెప్పు వెనకాల కూడా మనసుని కకావికలం చేసే కథని పుట్టించవచ్చని 'బోర్లించిన చెప్పు' చదివితే ఇట్టే అర్థమయిపోద్ది రాజి రెడ్డి శక్తి.. ఆయన రచనా సృష్టి!
మస్తు రాసినారు బ్రదర్ అదయితే.
నాకు ఎక్కువగా నచ్చిన కథలు గంగరాజం బిడ్డ,
మెడిటేషన్, చిన్న సమస్య & ఎఱుక.
గంగరాజం బిడ్డ లో పూర్ణలతని, ఆ అబ్బాయిని ఎన్నటికీ మరిచిపోలేను నేను. ఎంతో హృద్యంగా, విషాదంతో కూడుకొని రాసారు ప్రతీదీ. ఈ కథలో ఉన్న ambience, atmospherics ని ఆ అబ్బాయి emotional landscape లో తన మనసు తాలూక నిర్దిష్టమైన లోకంలో కొట్టుమిట్టలాడుతున్న details తో భళే విచిత్రమైన organic nature and stature తో రంగరించారు. That was phenomenal for me! ఈ కథ రాసింది మా ఊరు సిరిసిల్లకి దగ్గర్లో ఉన్న వ్యక్తేనా అని నా హృదయానికి ఆ పుస్తకాన్ని ఎంతో ప్రేమతో హత్తుకున్న సందర్భం అది. ఆశ్చర్యాల, ఆనందాల సమ్మేళనమది! కథ ముగింపులో అయితే నా కళ్ళల్లోకి నీళ్లు అచేతనంగా ఒక్కదెబ్బకి దూకాయి. చాలా అంటే చాలా నచ్చింది.
నా నాలుక మీద తేలియాడే యాస ఈ కథల్లో ఉన్న సంభాషణల రూపాల్లో కదులుతూ ఉంటే ఎంతో ముచ్చటేసింది, ఇంకెంతో మురిసిపోయా నాలో నేనే. ఇది నా యాస, నా భాష, నా నాలుక మీద నానే అక్షారాలవి అనే ఆలోచనల్తో.
'మెడిటేషన్' కథలో అయితే ఇంచుమించు రచయిత ఆలోచనల గొలుసుల తాలూక ఈ మనుష్య ప్రపంచం పట్ల ఉన్న ఆవేదన, ఆవేశం, గౌరవం, ఆశ్చర్యం, మిస్టిసిజం అన్నీ తన లోపల మండే నిప్పురవ్వల నుండి పుట్టిన అక్షరాల్లాగా తోచింది నాకయితే. పెల్లుబికిన లావా అది. Kudos!
అప్పుడప్పుడూ అమితమైన details ఉంటే character దృక్పథంలో కాకుండా రచయిత తాలూక binoculars ధరించి చూడవలసిన forced viewing తటస్తించే సందర్భం ఏర్పడవచ్చు. ఈ కథల పుస్తకంలో, తన రచనల్లో ఇదొక్కటే నాకు ఎందుకో నచ్చని విషయం, తాపుకోసారి నన్ను suffocate చేసిన ముచ్చట. అలా అనీ పక్కన పెట్టనూలేము! అదే తన గొప్పతనం.
తప్పకుండా చదవవలసిన రచనలవి. సూక్ష్మంలో కూడా సృష్టి రహస్యాన్ని మీ చెవిలో చెప్పడానికి పూనుకున్న రాజిరెడ్డి గారికి ఇదే నా whispering of the heart.. 'ఈ సృష్టిలో మీరు రచయిత అవ్వడం ఒక subtle, surrealistic beauty'.
మీరు రాస్తూ ఉండాలి ఎప్పటికీ!
ఈ కథల పుస్తకాన్ని రచయిత ఎంతో ఇష్టంగా మెహెర్ బ్రదర్ కి ఇచ్చిన మొదటి పేజీలో తనే స్వయంగా రాసిన 'మ్యాజికల్ మెహెర్ కు, ఆత్మీయంగా' అనే పదాల కింద తన సంతకం ఉంటుంది. ఇది గుర్తుచేసుకుంటూ అంతే ఆత్మీయంగా నా ఆత్మబంధువైన మెహర్ బ్రదర్ కి ఈ పుస్తకాన్ని చదవమని నాకు ఇచ్చినందుకు, నా ఊరోడ్ని నాకే పరిచయం జేశ్నందుకు, మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ..
- సత్య తేజ్

Sunday, April 7, 2024

ఫార్‌స్టర్‌ ఇండియా ప్రయాణం


ఇండియా ప్రయాణం

భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్‌ రాజ్‌ అనుభవాలతో ఇ.ఎం.ఫార్‌స్టర్‌ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్‌ సీనియర్‌లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్‌ పవార్‌ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్‌స్టర్‌ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్‌మన్‌ కవితా సంకలనం ‘పాసేజ్‌ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్‌స్టర్‌ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్‌లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్‌ లీన్‌. ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం.


నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్దమనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్‌ అజీజ్‌. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్‌ ఫీల్డింగ్‌. అజీజ్‌ తబ్బిబ్బయిపోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్‌. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్‌ పట్టణానికి వచ్చిన మిసెస్‌ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్‌’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్‌. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్‌ అయిన మూర్‌ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్‌ మూర్‌ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్‌ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్‌ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి!


కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమైపోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్‌. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్‌మన్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు.


‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్‌స్టర్‌ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్‌స్టర్‌ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్‌ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్‌ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్‌స్టర్‌ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది!

(సాక్షి ఎడిటోరియల్‌ పేజీ; ఏప్రిల్‌ 1,2024)

 






Tuesday, April 2, 2024

'ఆంధ్రజ్యోతి'లో 'గంగరాజం బిడ్డ' సమీక్ష


గంగరాజం బిడ్డ


బహుముఖ విన్యాసాల కదంబం

కల్పనకు, వాస్తవానికి మధ్య ఉన్న పొరను ఒలిచేస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి, వాక్యాన్ని భావగర్భితంగా నిర్మించే వీరి రెండో కథా సంపుటి 'గంగరాజం బిడ్డ'. 12 కథల ఈ సంపుటిలో మనిషి మానసిక విన్యాసాలతోపాటు, భౌతిక పరిస్థితుల ప్రభావిత చర్యలు, అనేకానేక పరిమితుల్లో చర్య, ప్రతిచర్యల క్రియలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, వాతావరణ పరికల్పన, అద్భుత పాత్రచిత్రణలతో కనిపిస్తాయి. 'బోర్లించిన చెప్పు'లో గతంలోని ఆవేశపు మాటల్ని వదులుచేసే వర్తమాన సన్నివేశం కలిగించే హాయి ఉంది. 'గంగరాజం బిడ్డ'లో తండ్రి చేసిన తప్పులకు బిడ్డకు ఎందుకు శిక్షపడాలని ఓ అవ్వచేసే తిరుగుబాటు అబ్బురపరుస్తుంది. 'మెడిటేషన్' కథ సంకల్పిత, అసంకల్పితాల్లోంచి పుట్టిన మనో నిర్మిత చైతన్యస్రవంతి, తాత్విక సిద్ధాంతాల పోరును వెల్లడిస్తుంది. 'జీవగంజి' వాస్తవాన్ని సత్యమని స్వీకరించడమే ఉత్తమమని అన్నం మెతుకు సాక్షిగా బోధిస్తుంది. 'చిలుము' స్వప్నంలా రాలిపోయిన ప్రేమతో పాటు, ప్రాంతం, మతం, భాషల ఆధిపత్య భావజాలాన్ని బలంగా చూపిస్తుంది. జ్ఞాపకాల పొత్తిళ్లలోకి కథనాత్మకంగా జారిపోయే ఈ రచయిత, కళ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం అని నమ్మి, మిగిలిన కథల్లోనూ అదే విష యాన్ని నిరూపించాడు. నిజంగా, ఇవి పెనుగులాటలోంచి పుట్టిన మేలైన కథలు.

- ప్రణ

గంగరాజం బిడ్డ మరిన్ని కథలు, రచన: పూడూరి రాజిరెడ్డి

పేజీలు: 114, వెల: రూ.150, ప్రతులకు: 99124 60268 మరియు 'అమెజాన్' 

(24-3-2024; ఆంధ్రజ్యోతి ఆదివారం )