Sunday, November 9, 2025

చిరుస్పర్శల కథలు



(5-1-2025 నాటి స్వరూప్‌ తోటాడ ఎఫ్బీ పోస్ట్‌) 


ఈ పుస్తకంలో "మెడిటేషన్" అనే కథ కథలో ఆలోచనని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్న మనిషి నియంత్రణ లోంచి తప్పించుకుని మనసు ఎన్ని గంతులు వేస్తుందో భలే వివరం ఉంటుంది. ఆ చిన్న చిన్న nuances of thoughts and feelings లోనే మనం కధల్లోకి ఎక్కవనుకునే ఎన్నో జీవితపు నీటి బుడగలు పేలుతాయి. "మట్టిపాము లా కనబడిన బుక్ షెల్ఫ్ చెదలు, క్రిస్మస్ ట్రీని తలపించే సీతాఫలం లోపలి తొడిమ" ప్రత్యేకంగా ప్రస్తావించబడి, ఆ వివరాల్ని ప్రత్యేకంగా దాచుకునే చిన్న మెదడు గదుల తలుపుల్ని తడతాయి. బ్రాడ్ బ్రష్ స్ట్రోక్స్ లో జీవితాల్ని జీవించేస్తూ ఈ వివరాల్ని కేవలం collateral, peripheral feelings గా అనుకుని మనం ముందుకెళ్ళిపోతుంటే ఇలాంటి చిరుస్పర్శల్ని గుచ్చి కథలు చెప్పే రచయిత ఈ micro-macro juxtaposition ని కాగితం మీదకి తెస్తాడు. ఐతే చిత్రంగా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథ "ఎడ్డి" మళ్ళీ బ్రాడ్ స్ట్రోక్స్ ఎమోషనే. అవును, మనకు జీవితం మీద ఓవరాల్ వ్యాఖ్యానం చేసే కథలు కావాలి, ఆ కథ చెప్పే రచయితకు మన శరీరానిదో మనసుదో ఇంకా తేలని మన immediate senses స్పందన తాలూకు ఊగిసలాటలూ తెలియాలి. వీటన్నిటినీ కలిపి మూడేసుకోవాలనే మన ప్రయత్నమూ, నిస్సహాయతా జీవితమైతే వాటిని కలిపి ముద్ద తినిపించే కథలు ఒక ప్రత్యేకమైన రుచి.

- S


Thursday, November 6, 2025

ఫస్ట్ ప్లేస్ దేనికి...



(16-12-2024 నాటి వి.మల్లికార్జున్‌ ఎఫ్బీ పోస్ట్‌)


ఈ పుస్తకం గురించీ ఇందులోని రెండు కథల గురించీ ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నా. మొన్ననే రాజిరెడ్డితో కూడా చెప్పానిది. కొండ, ఎడ్డి అని రెండు కథలుంటాయీ పుస్తకంలో. రాజిరెడ్డి రాసినవాటిల్లో ఈ రెండింటినీ టాప్-టూలో పెట్టి చూసుకుంటాను. ఫస్ట్ ప్లేస్ దేనికివ్వాలా అని నాతో నేనే గొడవ పడుతుంటాను. మొన్న ఒక రోజు ఎందుకో కొండ కథ గురించి ఆలోచిస్తూ ‘ఇదేనేమో బెస్ట్’ అనేసుకున్నా.

నేను చాలాసార్లు చెప్పినట్టు రాజిరెడ్డి ఇంతకుముందు రాసినవన్నీ ఒక ఎత్తు, ఈ పుస్తకంలోని పన్నెండు కథలు మాత్రం ఇంకో ఎత్తు. టాప్ క్లాస్ రైటింగ్. ‘అరె, ఇట్ల ఎట్ల రాసుంటడురా’ అనుకుంటుంటా ఈ కథల్ని ఎప్పుడు చదివినా.
అజు పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం దక్కడం నేను మర్చిపోలేనివాటిల్లో ఒకటి. ఇవ్వాళ్టికి ఈ పుస్తకం బయటికొచ్చి ఏడాదయ్యింది. మీరింకా చదవకపోయి ఉంటే బుక్‌ఫెయిర్‌కి కొనాలనుకుంటున్న పుస్తకాల్లో ఒకటిగా ‘గంగరాజం బిడ్డ’ను చేర్చుకొండి.
I just want you all experience his writings.
All love Poodoori Rajireddy sir. 💙🤗

- వి.మల్లికార్జున్‌ 

Monday, November 3, 2025

యుగాంత రచయిత



యుగాంత రచయిత


ఆధునిక యూరప్‌ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్‌ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్‌నాహోర్‌కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్‌ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్‌ రుషి’కి ఈ గౌరవం దక్కింది. తన తొలి నవల ‘సాటాన్‌టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ (1989), ‘వార్‌ అండ్‌ వార్‌’ (1999), ‘బారన్‌ వెంక్‌హెయిన్స్‌ హోమ్‌కమింగ్‌’ (2016) లాంటి ఇతర పోస్ట్‌మాడర్న్‌ నవలలు రాశారు.

కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్‌నాహోర్‌కైయే ప్రధానంగా హంగేరియన్‌ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్‌లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్‌ విమర్శకురాలు సూసన్‌ సోంటాగ్‌ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్‌ రచయిత ఆడమ్‌ థర్ల్‌వెల్‌.

కాఫ్కా ‘ద క్యాజిల్‌’, దోస్తోవ్‌స్కీ ‘ది ఇడియట్‌’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్‌పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్‌ ఆయనతో జట్టు కట్టడం యావత్‌ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్‌ను బేలా టార్‌గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్‌’, ‘ద లాస్ట్‌ బోట్‌– సిటీ లైఫ్‌’, ‘వెర్క్‌మెయిస్టర్‌ హార్మనీస్‌’, ‘ద ట్యూరిన్‌ హార్స్‌’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్‌టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం, దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.

లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్‌స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు.

(13-10-2025)

Friday, October 31, 2025

నిద్రకళ


 ఆదిమ నిద్రకళ


నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.

నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా. ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలను పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.

మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే. అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో. ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది. లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్‌ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.

ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు. అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్‌ లైక్‌ ఎ కేవ్‌మాన్‌: ఏన్షియెంట్‌ విజ్‌డమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ నైట్స్‌ రెస్ట్‌’ రచయిత డాక్టర్‌ మెరిజిన్‌ వాన్‌ డె లార్‌. పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్‌ ఫైర్‌ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు. దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్‌ డె లార్‌. నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ‘స్లీప్‌ సైంటిస్ట్‌’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండు రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమే!

(15-9-2025)

Wednesday, October 29, 2025

కుక్క కథ



కుక్క కథ


కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.

కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్‌ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు, 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్‌’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!

జపాన్‌లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్‌లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్‌ విధుల్లోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్‌కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్‌లో ఎదురుచూసింది. జపాన్‌లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.

ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.
 
జాక్‌ లండన్‌ రాసిన ‘కాల్‌ ఆఫ్‌ ద వైల్డ్‌’ నవలలోని బక్‌ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు(ఉదా: జూలియన్‌ మే రాసిన ‘ఇంటర్వెన్షన్‌’). ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌సిరీస్‌లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా!

(18-8-2025; Sakshi)