ఆజన్మం పుస్తకం వచ్చిన తర్వాత రాసింది. ప్రచురణ: ఈమాట
Monday, November 29, 2021
ఉండాల్సిన మనిషి
(సాకం నాగరాజ గారికి డెబ్బై యేళ్లు వచ్చిన సందర్భంగా చిన్న అభినందన సంచిక వేస్తున్నామనీ, మీరు ఏదైనా రాయాలనీ నామిని ఫోన్ చేశారు. చిన్న పీస్ రాసి పంపాను. దేనికైనా ఒక హెడ్డింగ్ పెడతాం కదా, అలా ఒకటి పెట్టాను. అయితే, ఈ సంకలనం మొత్తానికి తాను ఒక పేరు ఎలాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాడో సరిగ్గా నేను అలాంటిదే పెట్టానని సంతోషపడ్డారు నామిని. అలా నా శీర్షికతోనే పుస్తకం వచ్చింది.)
ఉండాల్సిన మనిషి
సాకం నాగరాజ గారితో నాకు పరిచయం ఉందని చెప్పలేను. అసలు అలాంటివారితో ఎవరికైనా పరిచయం ఉంటుందా! అలాగని ఉండకుండానూ ఉంటుందా? వాళ్లు ఒక ప్రవాహంలా కదిలిపోతుంటారు. నామిని చెప్తూవుంటాడు: ఆయన మా ఇంటికొస్తాడా, నాతో ఒక్క మాటా మాట్లాడడు సా; ఇక్కడినుంచి కోట పురుషోత్తంకు ఫోన్ చేస్తాడు. మళ్లీ కోట పురుషోత్తం ఇంటికి వెళ్తాడా; అక్కడినుంచి మా ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇదీ సాకం. ఆయన అంతటా ఉంటాడు; ఎక్కడా ఉండడు. బహుశా ఈ హైరానా ఆయన జీవలక్షణం కావొచ్చు. ఎప్పుడూ ఏదో పనిలో మునిగి ఉండేవాళ్లకు మాత్రమే ఉండే హడావుడి.
నెత్తిన గంప ఉన్నవాడు వడివడిగా నడుస్తాడు. అయితే ఆ బరువు ఆయన స్వచ్ఛందంగా మోపుకున్నదే. అందువల్లే ఆయన చాలా పుస్తకాలు వేయగలిగాడు. వాటిని కొరియర్ డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ పంపుతాడు. తెలుగు కథకు జేజే, రైతు కథలు, విరామం, డిగ్రీ విద్యార్థులకు ప్రపంచ కథలతో మొదలుకొని నిన్నా మొన్నా సింగమనేని నారాయణ నివాళి పొత్తం దాకా. వీటి సంకలనం వెనుక నామిని ఉన్నాడేమో అని నా అనుమానం. కానీ ఎవరు వెనకున్నా, పుస్తకం చిన్నదైనా, పెద్దదైనా ఎవరో ఒకరు ముందుండి చేయగలిగితేనే జరిగే పనులు ఇవన్నీ. అట్లాంటి గట్టి సంకల్పం సాకం.
ఆయన్ని మొదటిసారి తిరుపతిలో జరిగిన వర్తమాన కథ–2009 ఆవిష్కరణ సభలో చూశాను. నేను అదే మొదటిసారి తిరుపతి వెళ్లడం. నా చింతకింది మల్లయ్య ముచ్చట కథ అందులో వేశారు. అప్పటినుంచీ మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మన సాకం ఉన్నాడులే అనే భరోసా కలిగింది. ఆ ఆవిష్కరణ వల్లే నామిని, కోట, ఆర్‌ఎం(ఉమామహేశ్వరరావు) పరిచయం కలిగింది. చిత్రంగా ఈ పదేళ్లలో సాకం కంటే వీళ్లందరితోనే నేను మాట్లాడింది ఎక్కువ. అందుకే అన్నాను, ఆయనతో ఎవరికీ పరిచయం ఉండే అవకాశం లేదని. పోతూ ఉండటమే ఆయన స్వభావం. పూర్తిగా పాతకాలం మనిషి. కానీ ఈ భూమ్మీద ఉండాల్సిన మనిషి.
– పూడూరి రాజిరెడ్డి
మార్చ్ 2021
Sunday, November 28, 2021
వారిదైన వ్యక్తీకరణ
వారిదైన వ్యక్తీకరణ
‘బ్రదర్స్ కరమజవ్’లో ఇవాన, అల్యోషా ఇద్దరూ ఒక హోటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు– గ్లాసు తీసిన తర్వాత టేబుల్ క్లాత్ మీద గ్లాసు అచ్చును గమనిస్తాడు ఇవాన్. అంత సున్నితమైన గమనింపును పాఠకుల దృష్టికి తెచ్చిన దాస్తోయెవస్కీ ముద్ర అది. నోటి దుర్వాసనను చెక్ చేసుకోవడానికి ‘ద క్యాచర్ ఇన్ ద రై’లోని హోల్డెన్ కింది పెదవిని పైకి వంచి ముక్కుకు తగిలేలా గాలి వదులుతాడు. అసలైన సాహిత్య పరిమళాన్ని ఆనందించడానికి శాలింజర్ ఇచ్చిన వివరం అది. ‘ది ఓల్డ్‌మాన్ అండ్ ద సీ’లో సముద్రంలో చేపల వేటకెళ్లి వచ్చాక, సామగ్రిని అక్కడే వదిలేద్దామనుకుంటాడు వృద్ధుడు. అక్కడ వదిలేయడం ద్వారా ఎవరికైనా దొంగతనం చేయాలన్న టెంప్టేషన్ ఎందుకు పుట్టించాలని తన నిర్ణయం మార్చుకుంటాడు. ఈ వాక్యాన్ని రాసిన దొర హెమింగ్వే. ఆ రచయిత మాత్రమే రాయగలిగే వాక్యం ఆ రచయితని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆ పసి రాకుమారుడు కాంతిగల వీపు కానవచ్చేటట్లుగా బోరగిలపడటం– నున్నని వీపుగల కూర్మావతారంగా కనబడుతున్నదట. ఈ చిత్రిక ‘కవికర్ణ రసాయనము’ లోనిది. అదే పద్యంలో ఇంకా వివిధ భంగిమల్లో దశావతారాలను కళ్లకు కడతాడు సంకుపాల నృసింహకవి. అసలే సూర్యుడు ఒక అగ్నిగుండం. దానికితోడు సాయంకాలం కమలినీ విరహంలో ఉన్నాడు. ఇంక ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలో మునిగాడని సూర్యాస్తమయాన్ని దృశ్యమానం చేస్తుంది భాస్కర రామాయణం. సూర్యుడి వాడిౖయెన కిరణాల తాకిడికి వేగిపోయిన జగత్తు మీద వీచడం కోసం గుండ్రని విసనకర్రగా వికాసం పొందాడని చంద్రోదయాన్ని వర్ణిస్తాడు విష్ణుమాయా విలాసములో రోసనూరి వేంకటపతి. ఇక గయోపాఖ్యానములో రామనామాత్యుడు– ఆమె సౌందర్యాన్ని చూపడానికి తాను కూడా తగనని అద్దం గుర్తించి, ముఖం చాటేసిందంటాడు. తెలుగు పద్యసాహిత్యం నిండా ఎన్నో గొప్ప వ్యక్తీకరణలు.
చలికాలంలో రైల్వే స్టేషన్‌లో అంచులు పగిలిన కప్పుల్లో టీ తాగుతున్న శాలువా ముసుగులో ఉన్న కూలీలను చిత్రించిన త్రిపుర నుంచి, చెరువులో బెకబెకమంటున్న కప్పలు చీకట్లో మనిషి ఒంటేలు శబ్దానికి ఒక క్షణం నిలిచి, మళ్లీ అరవడం మొదలుపెట్టాయని రాసిన అజయ్‌ప్రసాద్ దాకా ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ కాలాన్ని నిలిపి చూపే ఎన్నో విలువైన క్షణాలు! తల్లి కాళ్లకు వంగి దండం పెట్టే కొడుక్కు తల్లి పాదాల పసుపు వాసన తగలడం; ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే ఉద్యోగిణి చీర కుచ్చిళ్లలో చిన్నారి కొడుకు తలదాచుకోవడం, మౌన రుషిని తలపించే కప్ప కూర్చున్న భంగిమ; ఇలాంటి వ్యక్తీకరణలు సాహిత్యానికి ప్రాణం. సూక్ష్మంలో మోక్షం చూపే వాక్యాలివి. ఒక దగ్గర కనబడిన వాక్యం ఇంకో దగ్గర ఉండదు. అది అక్కడికి సర్వ స్వతంత్రమైనది. ఆ కవిదో, ఆ రచయితదో ఇక వారిదే. అలాంటిది ఇంకొకరు ముట్టుకోరు. ఎంగిలి వాక్యాలు రాయలేదని చలాన్ని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించింది అలాంటి ఎంగిలి వాక్యాలు రాయని ఏ రచయితకైనా వర్తిస్తుంది.
సాహిత్యానికి మరో వైపు కూడా ఉంది. పునరుక్తి దీని ప్రధాన లక్షణం. లేత భానుడి కిరణాలు భూమిని తాకుతున్నాయి అనే వాక్యాన్ని కథల్లో ఎన్నిసార్లు చదివుంటారు? పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని పత్రిక చదివే పరంధామయ్య ఆదివారపు అనుబంధాల్లో ఎన్నిసార్లు పరామర్శించి ఉంటాడు? పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా బాల్యంలోనే ప్రతిభను చాటే నాయకులు ఎందరు తగిలారు? చిట్టచివరన, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఎందరు కథానాయికలు పయనించివుంటారు? ఇలాంటి వ్యక్తీకరణలు ముందుగా ఎప్పుడు, ఎలా వచ్చాయో చెప్పగలిగే సాహిత్య చరిత్రలు మనకు లేవు. అవి వచ్చినప్పుడు తాజావే కావొచ్చు. వాటికవే విలువైనవే కావొచ్చు. కానీ వాడీ వాడీ అరగదీయడం వల్ల పాతకంపు కొడతాయి.
ఈ జాడ్యం తెలుగుకే పరిమితమైనది అనుకోవాల్సిన పనిలేదు. ‘ఇట్ వాజ్ ఎ డార్క్ అండ్ స్టార్మీ నైట్’(అదొక చీకటి తుఫాను రాత్రి) అనే వాక్యం ఎక్కడినుంచి ఊడిపడిందనే చర్చ ఆంగ్ల సాహిత్యంలో ఈమధ్య బాగా జరిగింది. అదొక చీకటి తుఫాను రాత్రి... అని గంభీరంగా ఎత్తుకోగానే తర్వాత ఏమయివుంటుందన్న కుతూహలం సహజంగానే పుడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆ కుతూహలం నిలుస్తుంది? కథల్లో మహాచెడ్డ ప్రారంభాలకు పెట్టింది పేరుగా ఈ వాక్యాన్ని అభివర్ణించింది ‘రైటర్స్ డైజెస్ట్’ పత్రిక. క్లీషేకూ, మెలోడ్రామాకూ, అతిగా రాయబడిన వచనానికీ ఉదాహరణగా నిలిచిన ఈ వాక్యంతో ఎన్నో కథలు మొదలయ్యాయి. బ్రిటన్ రచయిత ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ 1830లో రాసిన ‘పాల్ క్లిఫ్పోర్డ్’ అనే నవల ప్రారంభంతో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. ఆయన ఎంతో సాహిత్యం సృజించినప్పటికీ, ఈ ‘అపకీర్తి’ వాక్యంతో ఆయన కీర్తి నిలిచిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు విమర్శకులు. కానీ తమాషా ఏమిటంటే, 1809లో ‘ఎ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్’ పుస్తకం రాస్తూ వాషింగ్టన్ ఇర్వింగ్ ఇదే వాక్యాన్ని వ్యంగ్యంగా ఉదాహరిస్తాడు. అంటే, అంతకు ఎంతోముందే ఈ వాక్యం సాహిత్యంలోకి చొరబడి పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట! చిన్న కథల పితామహుడు అని చెప్పే ఎడ్డార్ అలెన్ పో కూడా దీన్ని వాడకుండా తమాయించుకోలేకపోయాడు.
‘మాస్టర్లు’ పునరుక్తులు వాడినా వారి ఇతరత్రా విస్తారమైన ప్రతిభలో అవి చెల్లిపోతాయి. కానీ సాహిత్య ‘విద్యార్థులు’ వాటికి దూరంగా ఉండటమే వారిని స్వతంత్రంగా నిలబెడుతుంది. జీవితపు అనుభవం లేకపోవడం, జీవితానికి చేరువగా వెళ్లి వాక్యాలను పిండుకోవడం తెలియనివారు మాత్రమే స్టాక్, ప్లాస్టిక్ వ్యక్తీకరణలను ఏ ప్రయత్న బరువూ లేకుండా తమ రాతల్లోకి తెచ్చేసుకుంటారు. ఎవరిని చదివినా ఒకేలా అనిపించడానికి ఇదే కారణం.
(ప్రచురణ: 22 నవంబర్ 2021)
Saturday, November 27, 2021
ఎల్లలు దాటించే కళ
Friday, November 26, 2021
‘శ్రవణ’ మేఘాలు
‘శ్రవణ’ మేఘాలు
చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం.
పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించేవాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ తన జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. ఆరుబయట వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లల గుంపును పోగేసుకుని కథల మీద కథలు చెప్పేవారు. పురాతన మానవులు తాము వేటాడి తెచ్చిన జంతువును విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. బహుశా మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, అంతకంటే ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది. వాడకట్టు అనుభవంగానో, యావత్ గ్రామ అనుభవంగానో విస్తరించింది.
కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం అనేది పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్ గూటెన్‌బెర్గ్ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చిట్టచివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూపమిచ్చాడు. రెండూ విడి విడి అంశాలే అయినా, రెండింటి సామ్యం మనిషి మనో ప్రపంచ విస్తరణకు తోడ్పడటం! అయినా మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు. అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని అమాంతం మింగేసింది.
మరి పెరిగిన సాంకేతిక జ్ఞానం ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది ఒక అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, కుర్చీలో తలవాల్చి, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి.
అంధులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్ బుక్స్) సంకల్పించాడు థామస్ ఆల్వా ఎడిసన్ 1877లో. కానీ 1952లో న్యూయార్క్ కేంద్రంగా గల క్యాడ్‌మాన్ రికార్డ్స్ వాళ్లు కవి డైలాన్ థామస్ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్ మార్కెట్ పరిధిని 2019లో 2.67 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు.
మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్‌లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది. అయితే స్వీడన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘స్టోరీటెల్’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ దిగ్గజం అమెజాన్ కూడా ‘ఆడిబుల్’ పేరుతో ఈ ఆడియో బుక్స్ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీకే పరిమితమైంది.
చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది.
(ప్రచురణ: సెప్టెంబర్ 27, 2021)



