Thursday, May 12, 2022

నూరేళ్ల స్రవంతి



(ప్రచురణ: మే 9, 2022) 


మానవ అంతరంగపు సంక్లిష్టతను మహాద్భుతంగా చిత్రించిన మహారచయితలు ఎందరో ఉన్నారు. అయితే ఆ అంతరంగపు సంక్లిష్టతకు తగిన మరింత దగ్గరి రూపాన్ని సాహిత్య ప్రపంచం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంది. అట్లా ఆధునిక వచనపు అత్యున్నత సృజనశీలతకు ప్రతి రూపంగా చైతన్య స్రవంతి టెక్నిక్‌ ఉద్భవించింది. ఆ సృజన ప్రక్రియలో శిఖరప్రాయమైన రచన – ‘ఉలిసేస్‌’ నవల. చైతన్య స్రవంతి అనగానే మొట్టమొదలు గుర్తొచ్చే ఈ నవలకు ఇది శతాబ్ది సంవత్సరం. 1922 ఫిబ్రవరి 2న దీని తొలి ఎడిషన్‌ వచ్చింది – జేమ్స్‌ జాయిస్‌ నలభయ్యో (1882–1941) పుట్టినరోజుకు సరిగ్గా అందేట్టుగా!

గ్రీకులో హోమర్‌ విరచిత ‘ఒడిస్సీ’ కావ్యానికి ఆధునిక రూపంగా ఐరిష్‌ రచయిత అయిన జేమ్స్‌ జాయిస్‌ ఆంగ్లంలో ఈ ‘ఉలిసేస్‌’ రాశాడు. ట్రోజన్‌ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి తన రాజ్యమైన ఇతకాకు వెళ్తూ, పదేళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు అన్నేళ్లుగా తనకోసమే వేచివున్న భార్య పెనలోపి, కొడుకు తలామకస్‌ను చేరుకుంటాడు హోమర్‌ కావ్యనాయకుడు ‘ఒడిస్సీస్‌’. దీన్ని లాటిన్‌లో ఉచ్చరించే విధానం ‘ఉలిసేస్‌’. అదే పేరును తన నాయకుడికి ఎంచుకున్నాడు జాయిస్‌. నవలలోని లియోపాల్డ్‌ బ్లూమ్, ఆయన భార్య మోలీ బ్లూమ్, ఇంకా స్టెఫాన్‌ డిడాలస్‌... ఈ మూడు పాత్రలూ ‘ఒడిస్సీ’లోని ఉలిసేస్, పెనలోపి, తలామకస్‌కు ఆధునిక రూపాలు. అయితే ఈ సాధారణ మనుషులు ఎదుర్కొనే కష్టాలు మాత్రం రోజువారీ అతి అల్పమైన, ‘నీచమైన’ అంశాలే. 

ఈ నవల ఒక్కరోజులో 1904 జూన్‌ 16న ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ కేంద్రంగా సాగుతుంది. లియోపాల్డ్‌ బ్లూమ్‌ ఆ ఒక్క సుదీర్ఘరోజులో ఉదయం లేచినప్పటి నుంచీ ఏ రాత్రికో కొంపకు చేరుకోవడం దాకా సాగే అనుభవాల సారం ఇది. పెంపుడు పిల్లి కోసం దుకాణంలో మాంసం కొనుగోలు చేయడం, పత్రికాఫీసుకు వెళ్లడం, ఒక చావుకు హాజరు కావడం, ఒక పుట్టుకను చూడటం, ఒక యూదుడిగా పరాయివాడి ముద్రను ఎదుర్కోవడం, మ్యూజియం దర్శించడం, తినడం, తాగడం, వ్యభిచార గృహం చేరుకోవడం, కొడుకు లాంటి తలామకస్‌కు తారసపడటం, ‘విశ్వాసం’ లేని భార్య గురించి క్షోభపడటం... ఈ ప్రతి సందర్భంలోనూ అతడి అంతరంగపు అగాథాలనూ, తాత్విక వివేచననూ, ప్రతి సూక్ష్మ వివరం సహా జాయిస్‌ దర్శింపజేస్తాడు.

నవల ఒక్క రోజులో జరిగేదైనప్పటికీ దీన్ని రాయడానికి జాయిస్‌కు ఏడేళ్లు పట్టింది. ఇరవైల్లో ఉన్నప్పుడు తన మాతృదేశంలోని పరిస్థితుల మీది విముఖతతో తనకు తాను స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు జాయిస్‌. అట్లా ట్రీఎస్ట్‌(ఇటలీ), జ్యూరిక్‌(స్విట్జర్లాండ్‌) నగరాల్లో గడిపాక ప్యారిస్‌(ఫ్రాన్స్‌) చేరుకున్నాడు. ఆ మూడు నగరాల్లోనూ రచన సాగింది. ఒక విధంగా తనకు ఎంతో ఇష్టమైన డబ్లిన్‌ను దూరం నుంచి అపురూపంగా చూసుకున్నాడు. అందుకే అక్కడి ప్రతి వీధీ ఇందులో దర్శనమిస్తుంది. దీనిలోని కొన్ని భాగాలు 1920లో యూఎస్‌ మ్యాగజైన్‌ ‘లిటిల్‌ రివ్యూ’లో అచ్చయినాయి. అయితే అశ్లీలంగా ఉందన్న కారణంగా ఆ పత్రిక సంపాదకులు విచారణను ఎదుర్కొన్నారు. జరిమానా విధిస్తూ తర్వాతి ప్రచురణను నిలిపివేయమని ఉత్తర్వులిచ్చింది కోర్టు. గ్రేట్‌ బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిందలే మోపారు. ఐర్లాండ్‌లో మాత్రం ఇది నిషేధానికి గురికాలేదు. దాన్ని ఎటూ చదివేది గుప్పెడు మంది; మళ్లీ దానికోసం నిషేధం అవసరమా అన్నది అప్పుడు వారి ఆలోచన. చాలాకాలం జాయిస్‌ను ఐర్లాండ్‌ పూర్తిగా సొంతం చేసుకోలేదు కూడా!

చివరకు ప్యారిస్‌లో ఇంగ్లిష్‌ పుస్తకాలు అమ్మే సిల్వియా బీచ్‌ దీన్ని ఏకమొత్తంగా పుస్తకంగా తెచ్చింది. ‘షేక్‌స్పియర్‌ అండ్‌ కంపెనీ’ పేరుతో పుస్తకాల దుకాణం నడిపేదామె. ప్రింటర్‌కు చెల్లించ డానికి తాను ప్రతి చిల్లిగవ్వా దాచానని పేర్కొంది. తానొక మాస్టర్‌ పీస్‌ను ప్రచురిస్తున్నానన్న నమ్మకం ఆమెను ముందుకు నడిపింది. పుస్తకం వచ్చాకా విమర్శలు ఆగలేదు. రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌ దీన్ని చెత్తగా కొట్టిపారేసింది. పైగా దీన్ని చదవడం ఏమంత సుఖమైన అనుభవం కాదు. అత్యంత సంక్లిష్టంగా ఉండి, శ్లేషలు, ప్రతీకలు, వ్యంగ్యం పరుచుకుని ఉంటాయి. అంతర్ముఖమైన గొంతుకలు వినిపిస్తుంటాయి; స్టెఫాన్, మోలీ అంతరంగాలు సహా. అందుకే ఆదరణ అంతంతే ఉండింది. అయినా జాయిస్‌ ‘కనీసం జనాల అభిరుచికి తగ్గట్టుగా కామాను మార్చడానికి కూడా’ ఇష్టపడలేదు. ఏమైనా నెమ్మదిగా తన మాతృదేశంతో సహా ప్రపంచమంతటా జేమ్స్‌ జాయిస్‌ ‘కల్ట్‌’ మొదలైంది. ‘చైతన్య స్రవంతి’ అనే పేరుతోనే తెలుగులో బుచ్చిబాబు ఈ టెక్నిక్‌ను పరిచయం చేయడానికి కథ రాశాడు. నవీన్‌ ఈ ప్రక్రియలో రాసిన నవలతో ‘అంపశయ్య’ నవీన్‌ అయ్యాడు.

2,65,000 పదాలు గల ‘ఉలిసేస్‌’ కష్టం అనే మాటతో జోడింపబడింది; నిజానికి అక్కడ ఉండాల్సిన మాట ఆనందం అంటాడు విమర్శకుడు స్టీఫెన్‌ ఫ్రై. ఈ నవల వీరాభిమానులు దీన్ని చదవడానికి కొన్ని మార్గాలు చెబుతారు: విమర్శలను చదవొద్దు, పుస్తకం చదవాలి. వేగంగా చదవొద్దు, గట్టిగా చదువుతుంటే దానికదే సజీవంగా ఆవిష్కృతమవుతుంది. నాలుగో అధ్యాయం చదవడానికి అవసరమైన క్లూస్‌ మూడో అధ్యాయంలో ఉండే డిటెక్టివ్‌ నవల కాదిది; కాబట్టి వరుస పెట్టి చదవాల్సిన పని కూడా లేదు. నెమ్మదిగా అందులో మునిగిపోతే ఇది ఇవ్వగలిగే పఠనాను భవాన్ని ఇంకో పుస్తకం ఇవ్వలేదు. ఒక్కటైతే గట్టిగా చెప్తారు. సులభంగా ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయాలనుకునేవారికి మాత్రం ఇది తగినది కాదు!

Wednesday, May 11, 2022

అంతా బానే ఉంది



(ప్రచురణ: ఏప్రిల్‌ 11, 2022)


చింతనాపరుడైన ఒక బాటసారి ఏవో యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో అలసి కాసేపు విశ్రమిద్దా మనుకున్నాడు. అడవిలోని పిల్ల బాట అది. దగ్గరలోనే పుచ్చకాయల తీగ ఒకటి కనబడి, ఆకలి కూడా పుట్టించింది. మోయలేనంత పెద్ద కాయను ఒకదాన్ని తెంపుకుని, అక్కడే ఉన్న మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు. ఏ పిట్టలు కొరికి వదిలేసినవో అంతటా మర్రిపండ్లు పడివున్నాయి. ‘‘ఈ తమాషా చూడు! అంత సన్నటి తీగకేమో ఇంత బరువైన కాయా? ఇంత మహావృక్షానికేమో ఇంతింత చిన్న పండ్లా? ఈ సృష్టి లోపాలకు అంతం లేదు కదా! పరిమాణం రీత్యా ఆ తీగకు మర్రి పండ్లు, ఈ చెట్టుకు పుచ్చకాయలు ఉండటం సబబు’’ అనుకున్నాడు.

ఆలోచిస్తూనే ఆ కాయను కడుపునిండా తిన్నాడేమో, ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ తన మీద పడకుండా చెట్టు కాపు కాస్తున్న దేమో, అటే నిద్ర ముంచుకొచ్చింది. మర్రిపండు ఒకటి ముఖం మీద టప్పున రాలినప్పుడు గానీ మెలకువ రాలేదు. ‘‘ఆ, నేను తలపోసినట్టుగానే ఆ కాయ దీనికి కాసి ముఖం మీద పడివుంటే ఏమయ్యేది నా పరిస్థితి? ఔరా, ఈ సృష్టి విలాసం!’’ అనుకుని చక్కా పోయాడు బాటసారి. ఏ దేశపు జానపద గాథో! ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉందని సృష్టి క్రమాన్ని అభినందిస్తుంది.

పాలగుమ్మి పద్మరాజు రాసిన ఓ కథలో కూడా ఇంకా సున్నితం కోల్పోని కాంట్రాక్టర్‌ అయిన కథా నాయకుడికి ఇలాంటి సందేహమే వస్తుంది. ఆ కూలీలు ఎర్రటి ఎండలో ఆ ఇంటి నిర్మాణం కోసం చెమటలు కక్కడమూ, వారి తిండీ, వారి బక్కటి శరీరాలూ, వారి మోటు సరసాలూ, అరుపులూ, ఇవన్నీ చూశాక అతడికి ఊపిరాడదు. సాయంత్రం పని ముగించి, తిండ్లు తినేసి, ఎక్కడివాళ్లక్కడ ఆదమరిచి నిద్రలోకి జారుకుంటారు. కలత నిద్రలో ఉన్నాడేమో, ఆ రాత్రి వీస్తున్న చల్లటి గాలి ఎందుకో అతడిని ఉన్నట్టుండి నిద్రలేపుతుంది. దూరంగా ఆ వెన్నెల కింద తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఆనంద పరవశపు సాన్నిహిత్యంలో ఉన్న ఒక కూలీల జంటను చూడగానే అతడిలోని ఏవో ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అవుతుంది. ప్రపంచం మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమీ లేదు అనుకుంటాడు. అసలైనదీ, దక్కాల్సినదీ ఈ భూమ్మీద అందరికీ దక్కితీరుతుందన్న భావన లోనేమో అతడు తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంటాడు.

ఈ భూమండలం నిత్య కల్లోలం. మూలమూలనా ఏదో అలజడి, ఏదో ఘర్షణ, ఏదో సమస్య, ఏదో దారుణం. శ్రీలంకలో బాలేదు, పాకిస్తాన్‌లో బాలేదు, ఉక్రెయిన్‌లో అంతకంటే బాలేదు. రష్యాలో మాత్రం బాగుందని చెప్పలేం. ఇక్కడ మనదేశంలో మాత్రం? ఇన్ని యుద్ధాలు, ఇన్ని సంక్షో భాలు చుట్టూ చూస్తూ కూడా ఈ లోకం బానేవుంది అని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ ఎప్పుడు ఈ ప్రపంచం బాగుందని! కనీసం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉందని! ప్రపంచం దాకా ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను బాగున్నానని గట్టిగా చెప్పగలిగేవాళ్లు ఎందరు? ‘నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది’ అని అనుకోగలిగే వాళ్లెవరు? దీనివల్లే అసంతృప్తులు, కొట్లాటలు, చీకాకులు, ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు. అవును, అనారోగ్యం! ఇదొక్కటే ప్రపంచంలో అసలైన సమస్య. దీని ప్రతిఫలనాలే మిగిలినవన్నీ! మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ ప్రతికూలతకూ కారణం కాలేడు– అది ప్రపంచంలోనైనా, ఇంట్లోనైనా. అందుకే మనిషికి సర్వతో ముఖ ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంతో సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంతో ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనంబాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది.

‘‘అనారోగ్యంగా పిలవబడే ప్రతిదాన్నీ మన శరీరంలో మనమే సృష్టించుకుంటాం,’’ అంటారు తొలితరం కౌన్సిలర్‌ లూయిస్‌ హే. బలమైన సంకల్పం, సానుకూల ఆలోచనలు తేగలిగే అనూహ్య మార్పులను గురించి ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. మన సమస్యలన్నీ మన అంతర్గత ఆలోచన విధానాల వల్ల కలిగే బాహ్య ప్రభావాలు మాత్రమేనని చెబుతారామె. నెగెటివ్‌ థింకింగ్‌ వల్ల బ్రెయిన్‌లో ఆటంకాలు ఏర్పడుతాయి; అక్కడ ఫ్రీగా, ఓపెన్‌గా సంతోష ప్రవాహం ముందుకు సాగ డానికి అవకాశం ఉండదంటారు. ఏ రకమైన ఆలోచనా విధానం ఏయే రకమైన జబ్బులకు కారణ మవుతుందో... దురద, చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, సైనస్, మలబద్ధకం, చిగుళ్ళ సమస్యలు, మైగ్రేన్‌... ఇలా పెద్ద జాబితా ఇస్తారు. అయితే ఏ రకమైన వ్యాధికైనా భయం, కోపం– ఈ రెండు మెంటల్‌ పాటరన్స్‌ మాత్రమే మూలకారకాలుగా ఉంటాయంటారు. మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం, ఎదుటివాళ్లను నిందించి మన శక్తిని అంతా వదిలేసుకునే బదులు ఇవ్వాల్సిన ‘క్షమాపణ’ ఇచ్చేయడం, ఆమె సూచించే మార్గాలు.

ఈ ప్రేమకు సమస్త భూగోళాన్నీ హీల్‌ చేయగల శక్తి ఉందని ఆమె స్థిర విశ్వాసం. ‘‘మనం ఏది ఆలోచించాలనుకుంటామో, ఏది నమ్మాలనుకుం టామో, ఆ ప్రతి ఆలోచననీ, నమ్మకాన్నీ విశ్వం పూర్తిగా సమర్థిస్తుంది, అవి జరగడానికి సహకరి స్తుంది’’ అంటారు. ఈ సృష్టి మనకోసం మన జీవితాన్ని దాని సర్వశక్తితో డిజైన్‌ చేసేవుంటుంది. మనం సమస్యలు అనుకునేవి సృష్టి విన్యాసంలో అసలు సమస్యలే కాకపోవచ్చు. కానీ మన ప్రాణాలకు అవన్నీ నిజమే. ‘గజం మిథ్య, ఫలాయనం మిథ్య’ అని మన సాధారణ చూపుతో అనుకోలేక పోవచ్చు. కానీ ఈ సృష్టి అశాశ్వతత్వంపై ఒక ఎరుక ఉంటే, జీవితాన్ని చూసే తీరు మారిపోవచ్చు. జీవితంతో కొనసాగిస్తున్న ఒక ఘర్షణ ఏదో తొలగిపోవచ్చు. ఎక్కడో ఒకరు మరణిస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో ఎవరో పుడుతూనే ఉన్నారు!  

Tuesday, May 10, 2022

చదవడమే మొదలు...


(ప్రచురణ: మార్చ్‌ 14, 2022)


ఒకరోజు ఆన్‌ మోర్గాన్‌ తన బుక్‌షెల్ఫ్‌ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్‌ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్‌ అమెరికన్‌ పుస్తకాలే. ఈ లండన్‌ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల!

ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్‌ సెల్లర్స్‌... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్‌ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది.

అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్‌ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్‌ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్‌ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్‌ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్‌ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్‌  నాయర్‌ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్‌ బిట్వీన్‌  టు కవర్స్‌: రీడింగ్‌ ద గ్లోబ్‌’ పుస్తకంగా ప్రచురించింది.

గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్‌  లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్‌ లైన్‌  జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్‌ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్‌ టుగెదర్‌: 85 డేస్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ పేరుతో పుస్తకంగా రాసింది లీ.

ఇరాకు చెందిన ప్రొఫెసర్‌ అజర్‌ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్‌ లోలిటా ఇన్‌  తెహ్రాన్‌ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్‌ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్‌ గాట్స్‌బీ(ఫిట్జ్‌గెరాల్డ్‌), ద డైరీ ఆఫ్‌ ఆన్‌  ఫ్రాంక్, ద ట్రయల్‌ (కాఫ్కా), ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌బెరీ ఫిన్‌ (మార్క్‌ ట్వెయిన్‌ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్‌ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్‌  లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే!
పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్‌  లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు.

‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్‌ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్‌ మందలపర్తి కిశోర్‌ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్‌ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా!
ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది?   

Sunday, March 27, 2022

నేడే చూడండి: వెళ్లిపోవాలి

 నేడే చూడండి

––––––––

నేర్చుకోవడంలో భాగం అన్నట్టుగానే ఈ సినిమా తీశాం. తీసిందాన్ని విడుదలంటూ చేయాలి కాబట్టి, యూట్యూబ్‌లో పెట్టేశాం. దీని మొత్తం ‘జీవితకాలం’లో మహా అయితే ఒక రెండు వేల మంది చూస్తారు కావొచ్చని అనుకున్నాను. అలాంటిది రెండ్రోజులు కాకముందే రెండు వేల వ్యూస్‌తో నా అంచనాలను తప్పించి ఆనందపరిచారు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు బాగా చూస్తున్నట్టున్నారు అంటే, సొంతూరు విడిచిపెట్టిన అందరూ కనెక్ట్‌ అవుతారు అంది నా వైఫ్‌. కావొచ్చు!
ఇందులోని ప్రతీ ముక్కనూ విడివిడిగా చూసినవాడిగా, అసలు ఏకమొత్తంగా ఈ సినిమా ఇవ్వగలుగుతున్న వర్జిన్‌ ఫీలింగ్‌ ఏమిటి అనేదాన్ని మాత్రం బాగా మిస్సవుతున్నాను.

#వెళ్లిపోవాలి #Vellipovaali






 

వెళ్లిపోవాలి' విడుదల

(Posted in fb on March 19, 2022) 




వెళ్లిపోవాలి' విడుదల మార్చి 25న

–––––––––––––––––––

మొత్తానికి మేము కూడా ఒక సినిమా తీయగలిగాం. ఆశ పడినట్టుగానే మార్చి కల్లా పూర్తి చేయగలిగాం. మార్చి 25న నేరుగా ఇది యూట్యూబ్‌లో విడుదల అవుతుంది.  

ఇలా సినిమా తీస్తున్నామని దీని గురించిన ప్రస్తావన మాటల్లో మాటగా చేసినప్పుడు, ఒకరిద్దరు, ‘షార్ట్‌ ఫిల్మా?’ అని అడిగారు. షార్ట్‌ ఫిలింస్‌ మీద నాకేమీ అగౌరవం లేదు. కానీ ఆ అడగటంలో దీన్ని సినిమా అనడానికి ఏదో అడ్డుపడినట్టుగా తోచింది. ఇందులో ఏముంది అన్నది వేరే విషయం. కానీ ఒక గంటా నలభై నిమిషాల నిడివి లెక్కలో ఇది సినిమానే! 

మేము ముగ్గురమూ(అజయ్‌తో కలిపి) పబ్లిష్డ్‌ రైటర్స్‌మే అయినా, ఎందుకో సాహిత్యం మీద ఆసక్తి సన్నగిల్లినప్పుడే ఈ సినిమా ఆలోచన కలగడానికి కారణం, బహుశా ఆ శక్తి ఇలా బదలాయింపు కోరుకున్నది కావొచ్చు. అయితే సాహిత్యంలో ప్రతి పదమూ, వాక్యమూ చాలా పకడ్బందీ వ్యవహారం. కానీ సినిమాలో కొంత ‘లూజ్‌’గా ఉండొచ్చు. ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఒక సిచ్యువేషన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడంలోనే మన పని సగం అయిపోతుంది. సినిమా అనే కలెక్టివ్‌ ఎఫర్ట్‌లో ఉన్న మ్యాజిక్కే అది. ఈ కలెక్టివ్‌ అనే మాట మనుషులకే కాదు, వస్తువులూ, ప్రదేశాలకూ వర్తిస్తుంది. అసలు కెమెరా కన్నుముందు సజీవం కానిదంటూ ఏమీలేదు. చూశారా, పోయిందనుకున్న ఆసక్తి అప్పుడే తిరిగొచ్చి, నన్ను ఏదో రాయాలని గోకుతోంది. అట్లా ఈ సినిమా తన మొదటి విజయం నమోదు చేసేసింది.😊

ఈ సినిమాకు నేను రచయితగా పనిచేశాను, నటించాను లాంటి పరిభాష వాడాలంటే, దీన్నేదో దూరం చేసి చెప్పినట్టుగా ఉంది. జీవితానికి వీలైనంత దగ్గరగా అలా మామూలుగా మాట్లాడుకోవడానికీ, ఉండటానికీ ప్రయత్నించాం. ఇలా మామూలుగా ఉండటం కూడా మాకు మామూలు విషయం కాలేదని తెలియాలంటే ఎప్పటికైనా మా బ్లూపర్స్ చూడాలి.

ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాలు తీయడంలో చాలా పరిమితులు ఉంటాయి. ఇలా అంటున్నానని 'ఫస్ట్‌ టైమ్‌ మినహాయింపులు’ ఏమీ కోరడం లేదు. మామూలు ప్రపంచ సినిమాను చూసే కళ్లతోనే దీన్ని విమర్శించొచ్చు. ఇలా చెప్పగలగడానికి వన్‌ మాన్‌ ఆర్మీ మెహెర్‌ ప్రతిభ మీద నాకున్న అమితమైన నమ్మకం కారణం.♥️

సాయంత్రాలు సరదాగా గడపగలిగే స్నేహితులతోనే అటు కలిసినట్టూ, ఇటు సినిమా తీసినట్టూ కావడం దీని వల్ల వచ్చిన అదనపు లాభం. 

(ఈ సినిమా ట్రైలర్‌ ఇంతకుముందు చూడనివాళ్ల కోసం కామెంట్స్‌లో లింక్‌ ఇస్తున్నా.)

#వెళ్లిపోవాలి #Vellipovaali