Sunday, May 28, 2023

ఫ్యూచర్‌ లైబ్రరీ


 


భావి ఫలం


పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన  బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్‌లాండ్‌కు చెందిన విజువల్‌ ఆర్టిస్ట్‌ కేటీ పేటర్సన్‌. ఈమె వయసు 41 ఏళ్లు.

ఈ భవిష్యత్‌ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్‌ అట్‌వుడ్‌ (కెనడా) తన ‘స్క్రిబ్లర్‌ మూన్‌’ సమర్పించారు. 2015కు డేవిడ్‌ మిషెల్‌(ఇంగ్లండ్‌) తన ‘ఫ్రమ్‌ మి ఫ్లోస్‌ వాట్‌ యు కాల్‌ టైమ్‌’ను ఇచ్చారు. 2016కు షివోన్‌(ఐస్‌లాండ్‌), 2017కు ఏలిఫ్‌ షాఫక్‌(టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్‌ కాంగ్‌(దక్షిణ కొరియా), 2019కి కార్ల్‌ ఊవ్‌ నాస్‌గార్డ్‌(నార్వే), 2020కి ఓసియన్‌ వువాంగ్‌(వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు.

విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్‌ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్‌ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్‌ హర్‌ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్‌ షలన్‌స్కీ (జర్మనీ) ఈ జూన్‌లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్‌–ఎడిషన్‌గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్‌ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరేట్‌ అట్‌వుడ్‌ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్‌ ట్రాన్స్‌ట్రోమార్‌(స్వీడన్‌), ఉంబెర్టో ఎకో(ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్‌ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరేట్‌ అట్‌వూడ్‌. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్‌ ఆఫ్‌ ఇస్తాంబుల్‌’, ‘ద ఫార్టీ రూల్స్‌ ఆఫ్‌ లవ్‌’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్‌ షఫాక్‌. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్‌ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో!

‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికివుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్‌ ఓవ్‌ నాస్‌గార్డ్‌.

ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ!

22nd May 2023
Sakshi Edit Page

Thursday, May 25, 2023

ఆజన్మం ఆడియో బుక్‌


ఓ నెల రోజుల వ్యవధి, ఏడు సిట్టింగులు, మూడు ప్యాచప్‌ సిట్టింగులతో ఈ స్టోరీటెల్‌ ఆజన్మం ఆడియో బుక్‌ పూర్తయ్యింది. దీన్ని చదవడం దీనికిదే ఒక మంచి అనుభవం. 

#Storytel #Aajanmam

Link:

  ఆజన్మం ఆడియో బుక్‌

జేసీబీ ప్రైజ్‌


 


ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!


అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్‌ ఫర్‌ లిటరేచర్‌’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్‌ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్‌ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం.

‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్‌ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్‌ జావేద్‌. 2022లో ‘ద ప్యారడైజ్‌ ఆఫ్‌ ఫుడ్‌’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రైజ్‌’ను స్వీకరించారు. ‘నేమత్‌ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్‌ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్‌ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్‌ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.

నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్‌ వ్యాపారవేత్త జోసెఫ్‌ సిరిల్‌ బామ్‌ఫోర్డ్‌ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్‌ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్‌ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్‌సైట్‌లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్‌ వర్క్‌’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్‌ లిస్ట్‌ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్‌ లిస్ట్‌ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది.

ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్‌ డేస్‌’ నవలకుగానూ బెన్యామిన్‌ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్‌ హబీబ్‌ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్‌’ నవలకుగానూ ప్రైజ్‌ గెలుచుకున్న ఎస్‌.హరీశ్‌ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్‌పగల్‌ నేరత్తు మయక్కమ్‌’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్‌ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాకీ’ని కూడా ఈ ప్రైజ్‌ వరించింది. రచయిత ఎం.ముకుందన్‌. 2019లో ‘ద ఫార్‌ ఫీల్డ్‌’ నవలకుగానూ మాధురీ విజయ్‌ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు.

పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్‌’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అవుతే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు!

24th April 2023
Sakshi Edit Page

Wednesday, April 5, 2023

70 ఏళ్ల పారిస్‌ రివ్యూ




 పారిస్‌ పవనాలు


తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్‌గా పేరున్న ‘ద పారిస్‌ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్‌’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్‌ బుకర్‌ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్‌ పురస్కారం పొందిన పోలండ్‌ రచయిత్రి ఓల్గా తొకార్చుక్‌ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి.

‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్‌ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్‌’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్‌ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్‌ గార్సియా మార్వె్కజ్‌. ‘ఫిక్షన్‌ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్‌ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్‌కు దూరమైన వ్లాదిమీర్‌ నబకోవ్‌. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్‌–బ్రిటిష్‌ రచయిత వి.ఎస్‌.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జేమ్స్‌ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్‌ కింగ్, రేమండ్‌ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్‌ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ ఫిక్షన్‌’ విభాగంలో ప్రచురించింది పారిస్‌ రివ్యూ. జార్జ్‌ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్‌ కుందేరా, సైమన్‌ దె బువా, ఒర్హాన్‌ పాముక్, సల్మాన్‌ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ పొయెట్రీ’గా రాబర్ట్‌ ఫ్రాస్ట్, టీఎస్‌ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్‌ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్‌ ఎట్‌ వర్క్‌’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్‌ బెలామీ.

ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్‌ ప్లింప్టన్‌ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్‌ హ్యూస్‌... ప్లింప్టన్‌ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్‌ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్‌.

ఫిలిప్‌ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్‌ బెకెట్, డేవిడ్‌ ఫాస్టర్‌ వాలెస్‌ లాంటి మహామహుల రచనలు పారిస్‌ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్‌ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్‌లైన్‌ వ్యూస్‌ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్‌’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్‌ విడాల్‌. ‘పారిస్‌ రివ్యూ చచ్చేంత బోర్‌ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్‌ జెస్సా క్రిస్పిన్‌. ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్‌ యాప్‌ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్‌ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్‌ క్లాస్‌’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్‌ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్‌ రివ్యూ’!

(Sakshi, 27-3-2023)

Sunday, March 5, 2023

అన్నపరెడ్డి బౌద్ధ్ధసాగరం

 



బౌద్ధ్ధసాగరం


దేనికైనా మధ్యేమార్గంలో పోవాలంటారు పెద్దలు. అతివాదాలు ప్రపంచానికి వినాశనకరం. ఈ మధ్యేమార్గం అనేది బౌద్ధం నుంచి ప్రజల్లోకి వచ్చిన భావధార. ఇంతకీ మధ్యేమార్గం అంటే ఏమిటి? మధ్యమాప్రతిపద్‌ అని సంస్కృతంలో, మజ్జిమాపతిపదా అని పాలీలో పిలిచే ఈ మార్గం ‘రెండు అంత్యాలను వదిలి, ఆ అంత్యాన్నో ఈ అంత్యాన్నో కౌగిలించుకోకుండా, అంటే మరీ అతికి పోకుండా, మధ్య దారిలో పోవాలని చెబుతుంది.’ ‘సత్యం, ఆ అంత్యంలోనో, ఈ అంత్యంలోనో కాక మధ్యలో ఉంటుందనే భావనను బౌద్ధ సిద్ధాంతాలకు అన్వయించడం జరిగిం’దని విశదీకరిస్తుంది ‘మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు’. దీన్ని కూర్చినవారు ‘ఉపాసక’ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.
 
మధ్యేమార్గం మన జీవితాలకు ఒక సంయమనాన్ని ఇస్తే, మరి ఆ సంయమనం సాధించడానికి కావాల్సిన ఉపకరణం– ధ్యానం. ఆ ధ్యానంలో రకరకాల మార్గాలున్నాయి, రకరకాల తుది ఫలితాలున్నాయి. బుద్ధుడి ద్వారా ప్రపంచానికి అందిన ఒక ధ్యాన ప్రక్రియ– విపశ్యన. ‘ఇది ఎరుక, అప్రమత్తత, జాగరూకత, పరిశీలనల మీద ఆధారపడినది.’ ఇది ఉనికిలో ఉన్న మిగిలిన ధ్యానాలకు భిన్నం. సమాధి స్థితిలో మనస్సు ‘అనేక మార్మిక స్థితులను చేరుతుంది. కానీ ప్రపంచాన్ని యథాతథంగా చూడలేడు. కాని బుద్ధునికి కావలసింది ప్రపంచాన్ని యథాతథంగా చూడగలగడం...(అందుకే) విపశ్యనను కనిపెట్టాడు. విపశ్యన అంటే, మనస్సును పూర్తిగా విముక్తం చేసి, వస్తువుల యథార్థ స్థితికి తీసుకెళ్లి, తద్వారా నిర్వాణానికి చేర్చే అంతర్ప్రజ్ఞ’ అని చెబుతుంది ఇదే మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు. ఇది ఒక విశ్లేషణాత్మక విధానం. ‘దుఃఖాన్ని, రూపారూప ప్రపంచంలో ఆత్మలేని తనాన్ని ఎరుకపరిచేది ఈ జ్ఞానం’.

2008లో వెలువడిన ఈ మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువులో ఇంకా ఇలాంటి ఎన్నో మాటలకు, రీతులకు అర్థాలు, వివరాలు తెలుస్తాయి. రెండు అట్టల నడుమ బౌద్ధ మహాసాగరాన్ని ఇముడ్చుకున్న గ్రంథం ఇది. పదం పదంలో జ్ఞాన పథం! తెలిసీ, అసత్యం పలకడానికి ఎవరైనా సిగ్గుపడాలనీ, అలాగే పర్యాలోచన(రిఫ్లెక్షన్‌) చేసి కర్మలను పరిశుద్ధం కావించుకోవాలనీ రాహులునికి బుద్ధుడు బోధించింది రాహులోవాద సూత్రం. ‘ఏ ధర్మమూ, వస్తువూ అదే విధంగా ఏ రెండు క్షణాల పాటు ఉండదు’ అని చెప్పేది క్షణికవాదం. యోగ అంటే, కాడి కిందకు తేవటమే. ‘ఎలాగైతే కాడికి పూన్చిన ఎద్దులు నియమబద్ధంగా నడుస్తాయో, అలాగే యోగం మనిషి మనస్సును సంయమిస్తుంది’. ఇక పవిత్రాక్షరం ఓమ్‌ తాంత్రిక బౌద్ధంలో శూన్యతను సూచిస్తుంది. అయితే ఈ గ్రంథం వట్టి ప్రతి పదార్థాల పదకోశం కాదు. ఇది బౌద్ధ సూత్రాలను, శాస్త్రాలను, సిద్ధాంతాలను, పారిభాషిక పదాలను గణనీయంగా వివరిస్తుంది. కొత్తగా బౌద్ధాన్ని తెలుసుకోగోరేవారికీ, అవగాహన చేసుకోగోరేవారికీ ఇది ఒక కరదీపిక. ‘ఇటువంటి బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు తెలుగులో– బుద్ధుని కాలంలోనే బౌద్ధం ఆంధ్రదేశంలో ప్రవేశించినా, క్రీ.పూ. 300ల నుంచి క్రీ.శ. 700ల వరకు, వేయి సంవత్సరాల పాటు, ఆంధ్రదేశాన్ని దున్ని వేసినా– ఒక్కటీ వెలువడలేదు’ అని ప్రకాశకులు (మిసిమి ప్రచురణలు) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, ‘తెలుగులో వెలువడిన ప్రథమ మహా బౌద్ధ విజ్ఞాన నిఘంటువు’ ఇదని ఘనంగా ప్రకటించారు. అయితే, ‘నేను త్రిపిటకాచార్యుడను కాను. అంతకంటె బౌద్ధ వాజ్ఞయ మహాధ్యక్షుడను అసలే కాను. ఒక సామాన్య బౌద్ధ విద్యార్థిని. అలాగే ఈ ప్రయత్నం చేశాను... ఆ మహా సముద్రంలోని జ్ఞాన జలాన్ని నా ‘బుడ్డి చెంబు’ పట్టింనత మేరకే గ్రహించాను’ అని వినయంగా చెప్పుకొన్నారు కూర్పరి అన్నపరెడ్డి. నిఘంటువు ముందు ‘మహా’ అని చేర్చడం కూడా, బౌద్ధ సంప్రదాయాన్ని(ఉదా: మహా నిదాన సుత్త, మహా పదాన సుత్త) పాటించాలనే కోరికతో చేశానని చెప్పినప్పటికీ ఇది ‘మహా’ అని చేర్చడానికి తగినదే.

బౌద్ధానికి సంబంధించిన అనేక గ్రంథాలను తెలుగులో వెలువరించిన అరుదైన రచయితగా కూడా అన్నపరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇందులో అనువాదాలు, పరిశోధనలు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. మానవీయ బుద్ధ, బుద్ధ దర్శనం, బుద్ధుని దీర్ఘ సంభాషణలు, బుద్ధుని సూత్ర సమచ్ఛయం, తెలుగులో బౌద్ధం, ఆచార్య నాగార్జునుడు, మహోన్నత బుద్ధుడు, నలభై రెండు ప్రకరణాల సూత్రం, బుద్ధుని ధర్మం– శిష్యులు, పోషకులు లాంటి పుస్తకాలను ఆయన వెలువరించారు.
 
1933 ఫిబ్రవరి 22న మహాశివరాత్రి పర్వదినాన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు అన్నపరెడ్డి. లెక్చరర్‌గా పనిచేశారు. ‘చదివింది తత్వశాస్త్రం. బోధించింది సమాజశాస్త్రం. రాసింది మనోవిజ్ఞాన శాస్త్రం. అభిమాన విషయం సాహిత్యం, గ్రంథ రచన’. 1996 నుంచి 2011 వరకు ‘మిసిమి’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. చాలామంది సాధారణ తెలుగు పాఠకులకు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ఆయన ద్వారానే పరిచయం. మేధావుల మెతకలు, అస్తిత్వవాదం ఆయన ఇతర రచనలు. ‘చింతనాగ్ని కొడిగట్టిన వేళ’ ఆయన ఆత్మకథ. బౌద్ధమతం అవలంబించిన తర్వాత తన పేరును బుద్ధఘోషుడు అని పెట్టుకున్నారు. ఆ పేరుతో రచనలు చేశారు. కానీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిగానే ఎక్కువమందికి పరిచితుడు. 2021 మార్చ్‌ 9న ఆయన మరణించారు. ఇది ఆయన జయంతి, వర్ధంతుల ఉమ్మడి సందర్భం. కొంతమంది తాము బతికి ఉన్నంతకాలం సెలయేరుల్లా్ల ప్రవహిస్తారు. వారి దగ్గరికి ఎప్పుడు సమీపించినా మెదడుకు ఇంత జ్ఞానతడి చేసుకుని రావొచ్చు. అలాంటి ఒక తెలుగు సెలయేరు అన్నపరెడ్డి!

(27 ఫిబ్రవరి 2023)