Sunday, December 31, 2023

బ్లాగునామ సంవత్సరం

బ్లాగునామ సంవత్సరం


ఈ బ్లాగును ఇంకా ఎవరు చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో తెలీదుగానీ– నాకైతే ఈ బ్లాగు మీద ఆసక్తిలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేను కూడా ‘అందరిలాగే’ ఎఫ్బీ వైపు మళ్లినప్పటికీ, ఏదైనా వెనక్కి తిరిగి చదువుకోవాలంటే అక్కడ కష్టం; స్క్రోలింగ్‌ చేస్తూనే పోవాలి. మనం రాసినవి కొంత పద్ధతిగా కూర్చుకునే వీలు బ్లాగులోనే ఉంటుంది. ఇది కూడా కొత్తగా నా ఆసక్తి మళ్లీ పెరగడానికి కారణం. 

ఈ బ్లాగును 2007లో మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు ఎక్కువే పోస్టులు పెట్టాను. ఆరు సంవత్సరాల్లో 30, అంతకుమించి పోస్టులున్నాయి. 2014లో అత్యధికం(38). ప్రారంభ సంవత్సరం వదిలేస్తే, నాలుగేళ్లలో పది, అంతకుతక్కువ పోస్టులున్నాయి. 2020లో అత్యల్పం (4). బాగా పోస్టులు ఉన్న సంవత్సరాల్లో కూడా, నెలల వారీగా చూస్తే కొన్ని నెలల్లో ఏమీలేవు. ఈ ఒక్క 2023లో మాత్రమే ప్రతి నెలా ఏదో ఒకటి పోస్టు చేస్తూ వచ్చానని గమనించాను. అందుకే ఇదొక అదనపు పోస్టు. ఎఫ్బీలోవి కొన్ని రీపోస్టు చేసినప్పటికీ, అత్యధిక పోస్టులు(45+) కూడా ఈ సంవత్సరమే అవుతున్నాయి. అందుకే ఇది బ్లాగునామ సంవత్సరం.



 

Friday, December 29, 2023

‘గంగరాజం బిడ్డ’ కోసం...





(Posted by Aju Publications on FB on 16th December 2023)

మేమెంతగానో అభిమానించే రచయిత పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం 'గంగరాజం బిడ్డ'ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
రాజిరెడ్డి 2017-2023 కాలంలో రాసిన పన్నెండు కథలున్నాయీ పుస్తకంలో. అజు పబ్లికేషన్స్ నుంచి వస్తున్న పదకొండో పుస్తకం ఇది.
'గంగరాజం బిడ్డ' మీ అందరి మెప్పు పొందుతుందని నమ్ముతున్నాం 🤗
Order your copy from amazon:
Gangaraajam Bidda | Collection of Short Stories by Poodoori Rajireddy.


--
--


(Posted by V.Mallikarjun, my friend and one of the publishers, on his FB wall on 19th December 2023)


నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ఆదివారమొస్తే పొద్దున్నే చౌరస్తాకి వెళ్ళి సాక్షి పత్రిక కొనుక్కొని పరుగులాంటి నడకతో ఇంటికొచ్చి ముందు ఫన్‌డే మ్యాగజైన్ తీసి అందులో వచ్చే 'రియాలిటీ చెక్' చదివితేగానీ నా రోజు మొదలయ్యేది కాదు. అంత ఇష్టంగా ఆ కాలమ్ చదువుకునేవాడిని.
అప్పట్నించి రాజిరెడ్డి అభిమానిని నేను. రాజిరెడ్డితోనే నవ్వుతూ అంటూ ఉంటాను - ఈ ప్రపంచంలో నాకంటే పెద్ద అభిమాని మీకెవ్వరూ ఉండరని.
నేను సాక్షి ఫన్‌డేలో ఉద్యోగానికి చేరినప్పుడు రాజిరెడ్డిని వెతుక్కుంటూ వెళ్ళి, "రాజిరెడ్డి అంటే ఎంత పెద్ద మనిషో అనుకున్న" అంటే, "ఏందబ్బా, బట్టతల, పొట్టతో ఉండింట అని ఎట్లనుకున్నవ్?" అని నవ్వాడు. ఆ తర్వాత పక్క పక్క సీట్లలో కూర్చొని పనిచేసే రోజులకి కూడా వచ్చా. 'చింతకింది మల్లయ్య ముచ్చట' ఫస్ట్ కాపీలు వచ్చినప్పుడు నేనక్కడే ఉన్నా. నాకొక కాపీ ఇస్తూ - 'నా సరికొత్త స్నేహితుడు మల్లిక్‌కి' అని రాశాడు. నేనెంత సంబరపడ్డానో.
అదిగో అక్కడ్నించి ఇప్పుడు ఆయన రెండో కథాసంపుటి 'గంగరాజం బిడ్డ'ను మా అజు పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించే వరకొచ్చా.
This is one of the best moments. Rajireddy sir, thank you for giving us this opportunity to publish your book. 🤗
గంగరాజం బిడ్డ కథల్లో కొత్త రాజిరెడ్డి కనిపిస్తాడు. నేనైతే రాజిరెడ్డి 2.0 అని పిలుస్తుంటాను. పబ్లిషర్‌గా పుస్తకం గురించి ఎక్కువేం మాట్లాడలేను, మీరూ చదివి చెప్పండి. మాట్లాడుకుందాం.
మీ అందరికీ గంగరాజం బిడ్డ నచ్చుతుందని నమ్ముతున్నా.
Order your copy from amazon:


Wednesday, December 27, 2023

ముస్లిం రచయితలకు, మేధావులకు ఒక ప్రశ్న

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు?
మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రం విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది.
మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.
మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం నొక్కి మాట్లాడుతుంది(ఈ రెండు భావనలు జుడాయిజం లోనూ ఉన్నాయి). అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు.
ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన.
ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది.
‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది. నాస్తికులు అయినా మినహాయింపు లేదు.
ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?
ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు?
మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. ఇంత మాట్లాడిన తర్వాత, దీన్నొక హిందువు అభిప్రాయంగానే చూస్తారు కాబట్టి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. డిగ్రీ అయ్యి, హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో, రామ్‌నగర్‌లోని నా రూమ్‌ నుంచి చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీకి వెళ్తుండేవాడిని. వేదం విన్న శూద్రుడి చెవుల్లో సీసం పోయాలన్న వాక్యం మొదటిసారి అక్కడే చదివాను. అది చదివినప్పటి ఒంటి కంపనం నాకు ఇంకా గుర్తుంది. ఇంతా చేస్తే ఇది నేను చదివింది, మనుధర్మం మీద వచ్చిన ఒక విమర్శా పుస్తకంలో. ఇదీ నేనంటున్నది! ఇలాంటి విమర్శ నేను ఎత్తిన అంశాల మీద కనీసంగా అయినా ఉన్నదా? మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

(Posted the same on my FB wall on 7th October, 2023)

Sunday, December 17, 2023

కొందరు రచయితల రెండో గొంతు

 



రెండో గొంతు

మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో. భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు.

1978లో బేస్‌బాల్‌ గేమ్‌ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్‌ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్‌ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం, తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే. దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నాలాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పను, ఫౌంటెన్‌ పెన్‌ను వదిలించుకోవడం. అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్‌ టేబుల్‌ ఫిక్షన్‌’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్‌ ద విండ్‌ సింగ్‌’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది.

కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్‌ప్రిటర్‌ ఆఫ్‌ మాలడీస్‌’ నవలకు ‘పులిట్జర్‌’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్‌’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్‌లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది, అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్‌ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్‌కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్‌లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్‌లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా. ‘ఇటాలియన్‌ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’.

తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్‌ ఫర్‌ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్‌ బెకెట్‌ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్‌ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో(పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్‌’ రచయిత కాగలిగాడు.

వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది.