Sunday, September 8, 2024

కొడవటిగంటి కుటుంబరావు: దుక్కిటెద్దు


కొడవటిగంటి కుటుంబరావు

కొడవటిగంటి కుటుంబరావు(1909–1980) కథ ‘దుక్కిటెద్దు’ సంక్షిప్త రూపం ఇది. సౌజన్యం: అ.ర.సం. గుంటూరు శాఖ. కథలు, నవలలు, నాటికలు, గల్పికలు, వ్యాసాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కొ.కు. ఆయన ‘చదువు’ తప్పక చదవాల్సిన తెలుగు నవలల్లో ఒకటి.

–––––––––


దుక్కిటెద్దు


‘‘వద్దు, వద్దు! నాకు డాక్టరొద్దు! రెండు రోజులుంటే అదే నిమ్మళిస్తుంది!’’ అన్నాడు కిష్టయ్య ఆయాసంగా.

‘‘అదేమిటి, నాన్నగారూ? అసలు జబ్బేమిటో తెలుసుకోనివ్వండి. ముందుగా జాగర్తపడాలి గాని, రోగం ముదర బెట్టుకుంటారా?’’ అన్నది అనసూయ. ఆమె పిల్లలు నలుగురూ ఆమె చుట్టూ నిలుచున్నారు.

‘‘పిల్లల కోడి’’ అని కిష్టయ్య తన కూతురికి ఏనాడో పేరు పెట్టుకున్నాడు. కాని ఆయన ఆ మాట ఎప్పుడూ పైకి అనలేదు. ఆయన పెళ్లాంతోగాని, పిల్లలతోగాని అనని విషయాలు, ఇటువంటివి, బోలెడున్నై.

ఒకప్పుడు కిష్టయ్య తన భార్యను గురించీ, పిల్లల్ని గురించీ మురిసినవాడే. ఆయన చిన్నతనంలో కష్టాలు పడ్డాడు. ఆయన తన తల్లి నెరగడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. మారుతల్లి కిష్టయ్యని హీనంగా చూసేది. వాళ్ల పల్లెటూళ్లో ఇంగ్లీషు బడి లేదు. బస్తీ చదువు డబ్బు దండగన్నది మారుతల్లి. తండ్రి కాదనలేదు. కిష్టయ్య– పదేళ్లవాడు– ఇంట్లో చెప్పకుండా బస్తీకి వెళ్లి వారాలు చేసుకుని, పుస్తకాలు, జీతం డబ్బులు, ఇతరులు పారేసిన బట్టలు ముష్టెత్తి చదువుకున్నాడు. తాను మేజరై తండ్రితో ఆస్తి పంపకం చేసుకునేసరికి కిష్టయ్య చదువు అయేపోయింది. ‘‘మంచివాడు’’ అనిపించుకోవటం ఇతరులను ఏ మాత్రమూ నొప్పించకుండా వారి సహకారం పొందటం, పొందిన సహాయానికి రెట్టింపు కృతజ్ఞత చూపటం ఆయనకు అలవాటైపోయింది. ఇదే ఆయనకు ఉద్యోగంలో పైకి రావటానికి కూడా ఉపకరించింది. చదివినది స్కూలు ఫైనలే అయినా పెళ్లి అయేనాటికి అప్పుడే నూరు రూపాయలు– ఆ రోజుల్లో బియ్యేలు కూడా చెయ్యలేని సంపాదన– సంపాదిస్తున్నాడు.

భార్య కాపరానికి వచ్చాక కిష్టయ్య ఆనందానికి మితి లేదు. ‘‘తన’’ అన్న మనిషంటూ కిష్టయ్య ఎరగడు. ఇప్పుడాయనకు భార్యా, సహజీవనమూ, తన యిష్టప్రకారం ఇల్లు అమర్చుకోవటం, వంట చేయించుకు తినటం ఏర్పాటయింది. పిల్లలు పుట్టుకొచ్చారు– ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ, మళ్లీ ముగ్గురు కొడుకులూనూ. భార్యనూ, ఆరుగురు పిల్లల్నీ సాధ్యమైనంతగా సుఖపెడతానని కిష్టయ్య శపథం చేసుకున్నాడు. అదనంగా రెండు రూపాయలు సంపాదించటానికి రెండు పూటలు తిండిలేకుండా తిరగవలసి వస్తే తిరిగాడు.

కిష్టయ్య ఏళ్ల తరబడి దుక్కిటెద్దులాగా పని చేశాడు. ఎన్ని వ్యాపారాలలోనో భాగం తీసుకున్నాడు. దీని ఫలితం, కిష్టయ్య తప్ప అందరూ అనుభవించారు. కిష్టయ్య పెళ్లాం నూరు రూపాయలకు తక్కువ చీర కట్టి బయటికి పొయ్యేది కాదు. కిష్టయ్య కొడుకులకు చదువు సంధ్యలు అబ్బినా, అబ్బకపోయినా సరికొత్త ఫాషన్‌లో దుస్తులు ధరించటం, మోటారు సైకిళ్లెక్కి తిరగటం, టెన్నిస్‌ ఆడటం మొదలైనవన్నీ అబ్బినై.

పెద్దవాడు చిన్న టెన్నిస్‌ ఛాంపియన్‌. తాను ఉద్యోగం చెయ్యబోవటం లేదని వాడు చదువుతూండగానే ప్రకటించాడు. రెండోవాడు ఇంజనీరు చదివి, జంషెడ్పూరులో ఉద్యోగం సంపాదించాడు. వాడి భార్య లక్షాధికార్ల బిడ్డ. ఆవిడ తాహతుకు తగినట్టుగా బతకడానికి తండ్రి దగ్గరినుంచి ప్రతి నెలా వందా, రెండువందలు తెప్పించుకుంటాడు. మూడోవాడికి చీట్లాట పిచ్చి. అందులో వాడు సంపాదిస్తాడని ప్రతీతి. కాని వాడికింద కిష్టయ్య ఏటా నాలుగైదు వేలు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. నాలుగోవాడికి సినిమా స్టారు కావాలని. వాడు స్కూలు ఫైనల్‌తో చదువు ఆపేశాడు. చదవరా అని కిష్టయ్య అంటే, ‘‘నీవు చదివినంత నేనూ చదివాను. సినిమాస్టారు ఛాన్సు రానీ, నీకన్న ఎక్కువే సంపాదిస్తాను’’ అనేవాడు. అయిదోవాడు మట్టుకు చదువుతున్నాడింకా.

అనసూయకు పదోఏటనే పెళ్లిచేశాడు– శారదా చట్టాన్ని ధిక్కరించి. ఉన్నవాళ్ల పిల్లవాణ్ణే చూసి చేశారు. అనసూయను మొగుడి దగ్గరికి పంపిన కొద్ది రోజులకే డిప్రెషన్‌ వాళ్ల మీద పెద్ద దెబ్బ తీసింది. ‘‘మహాతల్లి మెట్టిన వేళావిశేషం’’ అని అనసూయ వింటుండగా అత్తవారు అన్నారు. పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. వారం రోజులు వెనకగా అనసూయ భర్త కామేశ్వరరావు కూడా వచ్చేశాడు.

అనసూయకు చాలారోజులు పిల్లలు లేక వరసగా నలుగురు పుట్టుకొచ్చారు. కిష్టయ్య వాళ్లందర్నీ పగవాళ్లళ్లే చూసేవాడు. కొడుకుల పిల్లలూ, కూతురి పిల్లలూ డజనుమంది దాకా ఉన్నారు. ‘‘లంకంత ఇల్లున్నది! వీళ్లు నేనున్నచోటికే ఎందుకువస్తారో?’’ అనుకునేవాడు.

కిష్టయ్యకు మనుషులంటే అసహ్యం మనవలతో మనవరాళ్లతో ఆరంభం కాలేదు; పెళ్లాం పిల్లలతో ఆరంభమయింది. వాళ్లు ఆయనను డబ్బు సంపాదించే యంత్రంగా చూడసాగారు. డబ్బు దేనికో తెలుసుకుందామని తాను ఎప్పుడన్నా విచారిస్తే చెప్పటానికి విసుక్కునేవాళ్లు. 

తాను ఏపూటా వేళకు భోంచేసేవాడు కాడు కిష్టయ్య. దానికి అందరూ అలవాటు పడిపోయారు. ఒకరాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తే అందరూ నిద్రపోతున్నారు. ‘‘భోజనం చేస్తావా?’’ అని అడిగినవాళ్లు లేరు.

ఇంట్లో కిష్టయ్య తప్ప మిగిలిన వాళ్లందరి మధ్యా ఏవో బంధాలున్నాయి. వాళ్లు ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్లు. అంతలో చడామడా తిట్టుకునేవాళ్లు. కాని వాళ్ల మధ్య కిష్టయ్యకు ఏమీ స్థానం లేదు.

‘‘వీళ్లందరి కోసం నేనెందుకు హూనం కావాలి. నా తిండికీ బట్టకూ యాభై చాలు, నాకు నస్యం కూడా అలవాటు లేదు’’ అని కిష్టయ్య చాలాసార్లు అనుకున్నాడు. కాని దొర్లే రాయి దొర్లుతూనే ఉంది. ఎప్పుడైనా పెందలాడే ఇంటికి వచ్చినా, ఇల్లుదాటి పోకపోయినా ఏదో ఆత్మద్రోహం చేసినట్టుగా తోచేది.

‘‘ఈవాళ తాత ఇంట్లోనే ఉన్నాడే!’’ అనేవాళ్లు కుర్రాళ్లు. అందులో కిష్టయ్యకి ఏదో వెటకారం వినిపించేది.

ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదని తెలుసుకోవడనికి కిష్టయ్యకు చాలాకాలం పట్టింది. డబ్బు ఇవ్వటానికి తప్ప మిగిలిన అన్ని విషయాలకూ తాను పరాయివాడే.

కిష్టయ్యకు జబ్బు చేసింది. జబ్బు నుంచి ఆయనకు కోలుకోవాలని లేదు. ఈ అవతారం ఇక చాలించవచ్చు ననిపించింది.

మిగిలినవాళ్లకు ఆయనను చావనివ్వాలని లేదు. డాక్టరును పిలవనంపారు. డాక్టరు ఏవో ఇంజెక్షన్లూ టానిక్కులూ రాసి ఇచ్చాడు.

ఇంజెక్షన్లు పని చేశాయి. విశ్రాంతి కూడా పనిచేసిందేమో? కిష్టయ్య మంచంలో లేచి కూచుంటే అందరి ముఖాలూ విప్పారినై.

‘‘బంగారుగుడ్లు పెట్టే కోడి చావలేదని ఎంత సంతోషం!’’ అనుకున్నాడు కిష్టయ్య.

కాస్త ఆరోగ్యం కుదుటపడగానే కిష్టయ్యకు ఏమీ చెయ్యకుండా ఉండటం దుర్భరమనిపించింది. అధమం ఏదన్నా చదువుదామనుకున్నాడు. అనసూయ ఆఖరు కొడుకు కనిపిస్తే వాణ్ని పిలిచి, ‘‘చదువుకునేందుకు ఏదన్నా పట్రారా?’’ అని అడిగాడు.

వాడు వెళ్లి ఏదో పత్రిక తెచ్చి యిచ్చాడు. కిష్టయ్య పేజీలు తిరగేస్తూ, ‘‘వట్టి చెత్త! ఇహమూ, పరమూ లేని రాతలు!’’ అనుకున్నాడు. అకస్మాత్తుగా ఆయన దృష్టి కొన్ని పద్యాల మీద పడింది. పద్యాలకు ‘‘దుక్కిటెద్దు’’ అని శీర్షిక ఉంది. దాని కింద తన ఆఖరు కొడుకు పేరుంది.

‘‘వీడు తిక్కన సోమయాజి అని నేను ఎరగనే!’’ అనుకుంటూ కిష్టయ్య పద్యాలు చదవసాగాడు. పొలాల మొహం ఎరగని తన ఆఖరు కొడుకు దుక్కిటెద్దు గురించి పద్యాలు రాయటమేమిటి?

కాని కుర్రాడు, కిష్టయ్య అనుకున్నంత తెలివితక్కువవాడు కాడు. వాడు తానెరిగిన దుక్కిటెద్దు గురించే రాశాడు. ఆ దుక్కిటెద్దుకు జీవించటం చేతకాదు. తన కష్టసుఖాలను ఇంకొకరితో పంచుకోదు. ఇతరుల కోసం అస్తమానం శ్రమపడి వాళ్లను సోమరిపోతులను చేసి, వారంతా తనకు రుణపడి ఉన్నారని సంతోషిస్తుంది. వాళ్లు తనకు కృతజ్ఞత చూపటం లేదని మనసులో బాధపడుతుంది. ఆఖరుకు కోపం వచ్చి కొమ్ము విసరటం కూడా చాతగాని స్థితిలో పడి చావుకోసం ఎదురుచూడసాగుతుంది.

కిష్టయ్య ఆఖరు కొడుకు కొద్దిపాటి హాస్యధోరణిలో రాసిన అయిదు పద్యాల సారాంశమూ ఇంతే.

‘‘ఓరి పిడుగా!’’ అనుకున్నాడు కిష్టయ్య. కిష్టయ్యలో కొద్దిపాటి హాస్యం ఉంది. అదే తన కొడుక్కు కూడా సంక్రమించింది. 

అనసూయ గ్లాసులో పళ్లరసం తెచ్చింది.

‘‘ప్రతిపూటా నాకు పంచదార తక్కువవుతున్నది!’’ అంటూ గొణిగాడు కిష్టయ్య.

‘‘తక్కువైతే అడిగి వేయించుకోరాదూ?’’ అన్నది అనసూయ ఆశ్చర్యంగా.

‘‘అదే దుక్కిటెద్దు లక్షణం!’’ అన్నాడు కిష్టయ్య.

‘‘ఏమిటీ?’’ అన్నది అనసూయ, అయోమయంగా.

‘‘ఏం లేదులే! పిల్లల్నందర్నీ ఒకసారి పంపించు.’’

‘‘దేనికి?’’

‘‘దేనికేమిటి? పంపించమంటుంటే!’’

అనసూయ తల అడ్డంగా ఆడించి వెళ్లిపోయింది.

కాస్సేపటికి ఏడెనిమిది మంది పిల్లలు కిష్టయ్య గదిలోకి వచ్చి కుక్కిన పేలల్లే నిలబడ్డారు.

‘‘చదవండి, నా వెంట!’’ అంటూ ‘‘దుక్కిటెద్దు’’ పద్యాలు వాళ్ల చేత చదివించాడు. వాళ్లు మొదట బెరుకు బెరుకుగా చదివారుగాని రాను రాను గొంతులు హెచ్చినై.

తండ్రి పంచదార కావాలని అడిగినమాట మరచిపోయిన అనసూయ తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని పంచదారసీసా, చంచా పట్టుకుని వచ్చేసరికి కిష్టయ్య గది వీధిబడిలాగా ఉంది. పిల్లలంతా కప్పెగిరిపోయేట్టు తాతవెంట పద్యాలు చదువుతున్నారు. పళ్లరసం గ్లాసు పక్కనే బల్లమీద ఖాళీగా పెట్టి ఉంది. దాని అడుగున చంచాడు పంచదార కరిగీ కరగకుండా మిగిలి ఉన్నది.

‘‘పంచదార చాలా ఎక్కువేశావ్‌!’’ అన్నాడు కిష్టయ్య అనసూయకేసి చూడకుండానే.


(సాక్షి సాహిత్యం: 2018 డిసెంబర్‌ 17)



 

No comments:

Post a Comment