అలెజాండ్రో జాంబ్రా, చిలీ దేశపు కవి, కథకుడు, నవలా రచయిత. 1975లో జన్మించారు. బోన్సాయ్ నవల ఆయనకు పేరు తెచ్చింది. స్పానిష్‌లో రాసిన ఆయన ‘థాంక్ యూ’ కథ ఆంగ్లానువాదానికి ఇది సంక్షిప్త రూపం. అలెజాండ్రో తెంపు లేకుండా వాక్యాలు రాస్తూపోతాడు. గొంతులో తీవ్రమైన వ్యంగ్యం ధ్వనిస్తుంది. దాన్ని కొంచెమైనా పట్టుకునే ప్రయత్నం జరిగింది.
––––––––––––––––––––
దుర్మార్గపు దయ
మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు అని గనక ఎవరైనా అంటే, ఇద్దరూ ఏకగొంతుతో అలాంటిదేమీ లేదని బదులిస్తారు, అది నిజం కూడా. ఒక నెలకు పైగా వాళ్లు కలిసి తింటున్నారు, కలిసి చదువుతున్నారు, కలిసి పనిచేస్తున్నారు– గోరంతలు కొండంతలు చేసే స్వభావం ఉన్నవాళ్లు ఎవరైనా వీళ్లు ఒకరి కొకరు చెప్పుకుంటున్న మాటలు గమనించినా, ఒకరిమీద పడ్డట్టుగా మరొకరు ఉంటున్న తీరును చూసినా, వీళ్లు కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని చెబుతారు. ఆమెది అర్జెంటీనా, అతడిది చిలీ.
వాళ్లిద్దరూ దూరపు నడకలంటే ఇష్టం ఉన్నవాళ్లే, నడుస్తూ దూర ప్రయాణాలు చేయడం ఎంత బాగుంటుందో అని మాట్లాడుకున్నవాళ్లే, అసలు ప్రపంచాన్ని దూరపు నడకలు ఇష్టపడేవాళ్లూ, ఇష్టపడనివాళ్లూ అని విభజించేంతగా వాళ్ల సంభాషణ కొనసాగింది కూడా. అయినప్పటికీ ఏదో చపలచిత్తంతో వాళ్లు టాక్సీ ఎక్కారు, ఆ టాక్సీలు ఎక్కకూడదని వాళ్లకు మెక్సికో సిటీలో అడుగు పెట్టడానికి నెలలకు ముందే హెచ్చరికలు వచ్చివున్నప్పటికీ, ప్రత్యేకించి వీధుల్లోవి, వాళ్లకు కూడా ఇన్నిరోజులూ టాక్సీ తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు, కానీ ఈ రోజు ఏదో చపలచిత్తంతో టాక్సీ తీసుకోవడమూ, డ్రైవరు రాంగ్ రూట్లో పోతున్నాడని ఆమె గ్రహించడమూ, చిలీ అబ్బాయితో ఆమె ఏదో గొణగడమూ, అతడు ఏం కాదన్నట్టుగా భరోసా ఇవ్వడమూ జరిగింది. కానీ అతడి మాటలకు ఏ ప్రభావమూ లేనట్టుగా టాక్సీ ఆగింది, ఇద్దరు మనుషులు టాక్సీలోకి వచ్చారు. చిలియన్ ధైర్యంగా, నిర్లక్ష్యంగా, కంగారుగా, పిల్లతనంతో, మూర్ఖత్వంతో స్పందించాడు, ఒక దోపిడీదారు ముక్కు మీద గుద్దాడు, ఆమె అప్పటికే ఆపండి, ఆపండి అని అరుస్తూనే ఉంది. చిలీ అబ్బాయి ఆగాడు, దోపిడీదారులు చిలియన్‌ను ఆడుకున్నారు, వాళ్లు ఏ కనికరమూ చూపలేదు, లోపల ఏమైనా విరిగివుండొచ్చు కూడా. కానీ ఇదంతా జరిగి అప్పటికే పది నిమిషాలైంది, అప్పటికే వీళ్ల డబ్బులూ, క్రెడిట్ కార్డులూ లాక్కున్నారు, ఏటీఎం పిన్ నంబర్లు కంఠస్తం చేశారు.
ఇప్పుడు వాళ్లు ముగ్గురయ్యారు, కారు ఆగిన వెంటనే డ్రైవరు దిగిపోయాడు, ఆ కారునే మరో ట్రక్కుతో ఫాలో అవుతున్న ఇంకో దొంగ కారెక్కి స్టీరింగ్ తీసుకున్నాడు, ఈ కొత్త దొంగ మరోసారి చిలియన్‌ను కొట్టాడు, అమ్మాయిని తినేసేలా చూశాడు, ఆ దెబ్బలనీ, దగ్గరికి లాక్కోవడాన్నీ ఇంక చేసేదేమి లేదన్నట్టుగా వాళ్లు అంగీకరించారు. దొంగలు ఎంతో దయగా వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారని అడిగి, లా కొందేస వెళ్తున్నారని తెలుసుకుని, మేము దగ్గరలో మిమ్మల్ని డ్రాప్ చేస్తామనీ, మేము మరీ అంత చెడ్డవాళ్లమేమీ కాదనీ చెప్పారు. వాళ్లని దింపెయ్యడానికి ముందు నమ్మశక్యం కానట్టుగా వాళ్లకు నూరు పెసోలు ఇచ్చారు కూడా, తిరిగి మళ్లీ ఇంటికి టాక్సీలో వెళ్లమని చెప్పి, కానీ వీళ్లు టాక్సీ తీసుకోలేదు, సబ్‌వే వైపు బయల్దేరారు, మధ్యమధ్యలో ఆమె ఏడుస్తూ ఉంది, అతడు ఆమెను ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు, ఒక్కోసారి అతడు అయోమయంగా కన్నీరును ఆపుకున్నాడు.
మెక్సికో సిటీ సబ్‌వేలో తరచూ ట్రెయిన్ చాలాసేపు ఆగుతుంది, ఒక మధ్య స్టేషన్‌లో ఒక ఆరేడు నిమిషాలపాటు, ఆ అతిసాధారణ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా వాళ్లను హింస పెట్టింది, ఆ ట్రెయిన్ డోర్లు మూసుకుని, ట్రెయిన్ కదిలి, చివరికి వాళ్ల స్టేషన్‌లో దిగి, నడుచుకుంటూ ఆమె ఉంటున్న ఇల్లు చేరేదాకా. ఈ అర్జెంటైన్, చిలియన్ ఒక దగ్గర ఉండరు. చిలియన్ ఒక ఈక్వెడార్ రచయితతోనూ అర్జెంటైన్ ఇద్దరు స్నేహితులతోనూ ఉంటారు– ఒక స్పానియార్డ్, ఒక చిలియన్, మరో చిలియన్– నిజానికి వాళ్లు స్నేహితులు కూడా కారు, వాళ్లంతా రచయితలు, మెక్సికో ప్రభుత్వం ఇస్తున్న ఒక గ్రాంటు వల్ల మెక్సికో వచ్చారు, వాళ్లు చేసే పనులన్నింట్లోకీ రాయడం తక్కువైనప్పటికీ. వాళ్లు వచ్చి తలుపు తెరిచేప్పటికి, స్పానియార్డ్, బక్కపలుచటి స్నేహశీలి ఏదో రాసుకుంటున్నాడు, రెండో చిలియన్ అక్కడ లేడు. మొదటి చిలియన్, రెండో చిలియన్ స్నేహితులు కారు, చెప్పాలంటే వాళ్లు శత్రువుల లాంటివారు, కనీసం చిలీలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మెక్సికోలో ఉన్నప్పుడు కూడా పోట్లాడుకోవడం అనుచితమని ఇద్దరికీ తెలుసు. వీళ్లు ఇద్దరు వెళ్లేప్పటికి లివింగ్ రూములో శ్రద్ధగా రాసుకుంటున్న స్పానియార్డ్ జరిగింది విని దాదాపుగా కదిలిపోయాడు, వీళ్లను ఓదార్చడానికి ప్రయత్నించాడు, ఉల్లాసపరిచే సందర్భోచిత జోకొకటి చెప్పాడు, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయడానికి అవసరమైన నంబర్ సంపాదించి ఇవ్వడంలో సాయపడ్డాడు– దొంగలు 3000 పెసోలు తీసుకున్నారు, రెండు క్రెడిట్ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, రెండు లెదర్ జాకెట్లు, ఒక వెండి గొలుసు, ఒక కెమెరా కూడా, ఈ చిలియన్ కెమెరా తేవడానికి మళ్లీ తిరిగి వెళ్లాడు, ఎందుకంటే అతడు అర్జెంటైన్ ఫొటోలు తీద్దామనుకున్నాడు, ఆమె నిజంగా అందంగా ఉంటుంది, ఇది పడికట్టు మాటే, కానీ ఏం చేయగలం, నిజంగా కూడా ఆమె అందంగా ఉంటుంది, అతడు అది కూడా ఆలోచించాడు, ఆ కెమెరా తేవడానికి గనక తిరిగి ఇంటికి వెళ్లకపోయుంటే వాళ్లు అదే టాక్సీని ఎక్కకపోయేవాళ్లు, కానీ చాలా విషయాలు అలాగే జరుగుతాయి, వాళ్లు కొంచెం ముందు వెళ్లినా కొంచెం వెనక వెళ్లినా ఆ కిడ్నాప్ బారి నుంచి కాపాడుకోగలిగేవాళ్లు.
అర్జెంటైన్, చిలియన్ జరిగిందేమిటో రెండోసారి, మూడోసారి స్పానియార్డ్‌కు చెబుతూ ఉపశమనం పొందుతున్నప్పుడు, రెండో చిలియన్ వచ్చాడు, అతడో పార్టీ నుంచి తిరిగొస్తున్నాడు, కూర్చుని తన చికెన్ ముక్క తినబోతూ, ఏం జరిగిందో చూసుకోకుండా ఉన్నపళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, అప్పుడుగానీ మొదటి చిలియన్ ముఖం ఉబ్బివుండటం, దానికి అతడు ఐస్‌బ్యాగ్ పెట్టుకోవడం గమనించలేదు, ముందైతే అతడికి అది సహజంగానే కనబడింది, అతడిదైన కవి ప్రపంచంలో ఎవరైనా ఒకరు ముఖానికి మంచుగడ్డలు పెట్టుకుని అలా రాత్రంతా గడపడం సాధారణమే కదా అనిపించింది, కానీ ఏం జరిగిందో తెలుసుకున్నాక, ‘ఘోరం, ఇవ్వాళ మధ్యాహ్నం నాకూ దాదాపు ఇలాగే జరగబోయింది’ అన్నాడు, అతడు ఒక్క లిప్తకాలంలో ఆ టాక్సీ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకోవడం వల్ల బచాయించాడు.
మళ్లీ ఎవరో వచ్చారు, ఆ స్పానియార్డ్ స్నేహితుడై ఉండాలి, మళ్లీ వీళ్లు కథంతా చెప్పారు, ముఖ్యంగా చివరి భాగం, టాక్సీలోని తుది అరగంట, ఇది వాళ్లకు రెండో భాగం లాంటిది. అపహరణ వ్యవహారం మొత్తం గంటసేపు సాగింది, మొదటి అరగంట వీళ్లు ప్రాణాల కోసం భయపడ్డారు, రెండో అరగంటలో భయం ఉన్నప్పటికీ ఆ దొంగలు తమను కచ్చితంగా చంపరని వాళ్లకు నమ్మకం కుదిరింది, ఎందుకంటే వాళ్ల మాటలు అంత భయంకరంగా లేవనిపించింది: ‘అర్జెంటైన్లను పట్టుకున్నాంగానీ ఒక్క చిలియన్‌ను కూడా ఇంతకుముందు పట్టుకోలేదు’ అన్నాడు సీట్లో కూర్చున్న వ్యక్తి, ఇంకా ముందుకెళ్లి చిలీ దేశ పరిస్థితి ఏంటని కూడా విచారించాడు, వాళ్లేదో రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా. ఇంతలో వెనకసీట్లో కూర్చుని చేతిలో గన్ పట్టుకున్న వ్యక్తి, ‘మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తుంది, కానీ మీరు దాన్ని దాస్తున్నారు’ అన్నాడు, దానికి వాళ్లు ఏకస్వరంతో లేదులేదన్నారు. ఏం అతడు బాగానే ఉన్నాడు కదా అని అర్జెంటైన్‌ను ఉద్దేశించి అని, నువ్వా 70ల పొడుగు జుట్టు కత్తిరిస్తే ఇంకా బాగుంటావని చిలియన్‌కు సలహా ఇచ్చి, పెద్ద కళ్లద్దాలు అతడి ముఖం మీంచి తీయించి కిటికీలోంచి పారేశాడు.
‘ఈసారొచ్చినప్పుడు కత్తెర వెంట తెచ్చుకోవాలి’ అన్నాడు గన్‌మాన్, మళ్లీ చిలియన్‌ను పట్టుకున్నప్పుడు ఈ జుట్టు కత్తిరించాలని చెబుతూ, ముందుముందు మనం చిలియన్లనే, ప్రత్యేకించి పొడువు జుట్టు ఉన్నవాళ్లనే పట్టుకోవాలనీ, అర్జెంటైన్లను ఇంతకుముందు పట్టుకున్నాంగానీ మొదటిసారి మనకు ఈ కుక్కలకొడుకు దొరికాడనీ అన్నాడు. నా దగ్గరో కత్తివుందిగానీ దానితో జుట్టు కత్తిరించలేననీ, కాకపోతే వృషణాలు కోయగలననీ, కానీ అవి తీసేస్తే వీడి గర్ల్‌ఫ్రెండుకు కష్టమైపోతుందనీ బాధపడ్డాడు, పైగా అర్జెంటైన్ అమ్మాయి సెక్సీగా కూడా ఉందాయె, అంత అందగత్తెను ఏమీ చేయకుండా వదిలేయడం కష్టంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయనన్నాడు.
డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు అమ్మాయిని మారడోనా గురించి అడిగాడు, ఆమె ఏదో బదులిస్తుండగానే వాడు తమాషాగా మెస్సీ కంటే చిచారిటో హెర్నాండెజ్ మంచి ఆటగాడని చెబుతూ, మెక్సికోలో ఏ ఫుట్‌బాల్ క్లబ్ నీ ఫేవరేట్ అని అడిగాడు, ఆమె తనకు తెలియదంది, అది పచ్చి అబద్ధం, వాడికంటే కచ్చితంగా ఆ అమ్మాయికి సాకర్ గురించి ఎక్కువ తెలుసు. దీని గురించే చిలియన్ కూడా ఆలోచించాడు, ఎలా అబద్ధం చెప్పాలో తెలియక, ప్యూమా, షివాస్, క్రూజ్ అజుల్ క్లబ్బుల్లో దొంగలు దేని ఫ్యాన్సో అంచనా వేయలేక, మాంటెరీ అన్నాడు, అక్కడ చుపెటె సువాజో ఆడతాడు కాబట్టి. ఈ మాంటెరీ అంటే ఆ దొంగకు ఇష్టం లేకపోయినా చుపెటె సువాజోకు అతడు ఫ్యాన్ కాబట్టి, చుపెటె సువాజో గౌరవార్థం వాళ్లను చంపకుండా వదిలేయాలని తీర్మానించాడు.
ఈ చుపెటె సువాజో ఎవరని అడిగాడు రెండో చిలియన్, తనకు కచ్చితంగా తెలిసినా, తాను సాకర్‌ను అంత పట్టించుకోనని బిల్డప్ ఇచ్చేందుకు. మొదటి చిలియన్ జవాబు ఇచ్చేలోగా స్పానియార్డ్ అందుకుని అతడు చిలీ సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడని బదులిస్తాడు.
అర్జెంటైన్, మొదటి చిలియన్ ఇంకా అలాగే దగ్గరగా కూర్చుని ఉన్నారు. ఈ అన్ని వివరాలతో కూడిన కిడ్నాప్ డ్రామా గురించి చెప్పీ చెప్పీ అలసి, నిజంగా వాళ్లకు ఒంటరిగా ఉండాలనిపించింది. చివరకు బాత్రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి అర్జెంటైన్ బెడ్రూములోకి వెళ్లాడు చిలియన్. కాసేపుండి అర్జెంటైన్ కూడా లేచి బాత్రూములోకి వెళ్లి కిడ్నాపును కడుక్కునేలా స్నానం చేసింది, ఇంకా నయం ఆమెకు జరిగింది తక్కువే కాబట్టి, ఈ రోజంతా ఆమె అందరికీ కృతజ్ఞతతో ‘థేంక్యూ, థేంక్యూ’ అని చెబుతూనేవుంది, ఏం చేయకుండా వదిలేసిన కిడ్నాపర్లకూ, తనను ఓదార్చిన స్పానియార్డ్‌కూ, పట్టించుకోకుండా వదిలేసి కూడా సాంత్వన ఇచ్చిన రెండో చిలియన్‌కూ, ఇంకా ముఖ్యంగా మొదటి చిలియన్‌కూ. ఇప్పుడు అర్జెంటైన్‌నూ చిలియన్‌నూ చూసేవాళ్లెవరైనా, ప్రేమంటే ఏమిటో తెలిసిన వాళ్లెవరైనా వీళ్లిద్దరూ చాలాకాలం కలిసివుంటారని అనుకుంటారు.
(సాక్షి సాహిత్యం: 2018 జూలై 30)
No comments:
Post a Comment