గిరీశ్ కాసరవల్లి సినిమాలు నేను కొన్ని చూశాను. మొన్న బెంగళూరు ఫెస్టివల్‌లో (Book Brahma Literature Festival-2024) ఆయన్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు చేసిన ప్రశంస మాత్రం సినిమాలకు సంబంధం లేనిది. అది కూడా ఏ పెద్ద విలువా లేని చిన్న విషయం. యు.ఆర్.అనంతమూర్తి మీద ఆయన ఒక డాక్యుమెంటరీ తీశారు (‘అనంతమూర్తి: నాట్ ఎ బయాగ్రఫీ బట్ ఎ హైపోథీసిస్’). ‘లామకాన్’లో వేసినప్పుడు చూశాను. మామూలుగా డాక్యుమెంటరీల్లో ఎవరో ఒకరు ఏదో చెబుతుంటారు. అది బయట ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి అని మనకు అర్థమైపోతుంది. కానీ ఎవరైనా ఏదైనా ఎందుకు తలుచుకుంటారు? పైగా ఏ మూర్తిమత్వం లేని శూన్యంతో. ఈ డాక్యుమెంటరీలో ఆ చెప్పేవాళ్ల ముందు ఒక కుర్చీ వేశాడు డైరెక్టర్. అందులో ఎవరో ఒకరు కూర్చుని వింటూవుంటారు. అప్పుడు ఎవరితోనో మాట్లాడటంలా కాకుండా, అదొక సంభాషణలా కనబడుతుంది. ఆ డాక్యుమెంటరీ చూసినప్పుడు ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోవడం నాకు గొప్పగా అనిపించింది.
బెంగళూరులో మా సెషన్‌కు ముందే ఆయనది. మమ్మల్ని కొంచెం ముందే ‘గ్రీన్ రూమ్’లో కూర్చోమన్నారు కాబట్టి, ఆయన్ని వినే అవకాశం లేకపోయింది. పోనీ వాళ్ల సెషన్ తర్వాత కలుద్దామా అంటే, అప్పటికి మేము వేదిక మీద ఉండాలి; ఆయన ఎటూ వెళ్లిపోతారు. మిస్సయ్యాను అనుకున్నా. అయితే, ఆయన బయటికి వెళ్లేప్పుడు పొరపాటున మేమున్న గదిలోకి వచ్చారు. ఆశ్చర్యం! ఖదీర్ గారు వెంటనే తేరుకుని, ఒక చిన్న కేకతో పిలిచారు. ఆయనతో ఫొటో దిగిన కొద్ది సెకన్ల సమయంలోనే నేను నా ప్రశంసా వాక్యాలను పూర్తిచేశారు. పైదంతా చెప్పి, అట్లా చేయడం నాకు చాలా సెన్సిబుల్‌గా అనిపించింది అనగానే, కళ్లెగరేసి నవ్వారు.
No comments:
Post a Comment