వ్యక్తిగత ప్రపంచం
‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో సంభాషిస్తూ అక్షతామూర్తి(బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భార్య). తల్లికీ, తండ్రి(నారాయణమూర్తి)కీ విడి పర్సనల్ లైబ్రరీలు ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్ మూర్తి పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్’ కుటుంబం పర్సనల్ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.
వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికి, సౌకర్యానికి అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్ సోంటాగ్ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా–కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.
ఏ సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే. అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటకమీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘గత పాతికేళ్లుగా మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేసాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. అయితే, ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతున్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్ రచయితల పేర్లు బయటికి చదువుకోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో కూడా తెలుస్తుంది.
ఇటాలియన్ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పై వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్–అమెరికన్ వ్యాసకర్త నసీమ్ నికోలస్ తలాబ్. ఒక్క క్లిక్ దూరంలో వందల ఈ–బుక్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం.