Monday, April 8, 2024

మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!


ఫిలిం మేకర్‌ సత్య తేజ్‌ ‘గంగరాజం బిడ్డ’ పుస్తకం మీద తన అభిప్రాయాన్ని ఏప్రిల్‌ 1, 2024న ఎఫ్బీలో పోస్ట్‌ చేశారు. అదే ఇక్కడ పంచుకుంటున్న.

 ----------------------------------------------------------------- 


మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!

"మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు."
మొట్టమొదటగా నా కళ్లని కట్టిపడేసిన ఈ మాటలు రాజిరెడ్డి గారి 'గంగరాజం బిడ్డ' కథల పుస్తకం బ్యాక్ కవర్ పేజ్ మీద అడ్డంగా ఎంతో అందంగా విష్ణుమూర్తి లా పడుకొని నన్ను ఆ ప్రపంచంలోకి రమ్మని ఎంతో సాదరంగా ఆహ్వానించాయి.
వెళ్ళాను. చదివాను. కొన్ని ఎంతో నచ్చాయి, కొన్ని అసలే నచ్చలేవు. కానీ ఏ అరక్షణమో కూడా పుస్తకాన్ని పక్కన పెట్టేద్దామని తలపించిందే లేదు. అంతలా తన రాతలు, subtleties and montonous lives లో నుండి తను పుట్టించే కవిత్వ పూరిత వచనం నన్ను కట్టిపడేసిందనే చెప్పాలి తప్పకుండా. Little things are never little అని మా చెల్లి నాతో ఎప్పుడూ చెపుతూ ఉంటుంది. ఇంతటి littlest of the little things ని ఒక్క మనిషి తాలూక observation లో బంధింపబడి, ఎంతో అందంగానూ, అబ్బురపోయే విధంగాను తను సృజించే కథలు భళే తమాషాగా మనకే జరుగుతున్నట్లుగా, మనమే ఆ vantage point నుండి చూస్తున్నట్లుగా, అవేం అతీంద్రియ శక్తులకే పరిమితమయ్యే విషయాలు కావన్నట్టు, చూడగలిగితే ఓ బోర్లించిన చెప్పు వెనకాల కూడా మనసుని కకావికలం చేసే కథని పుట్టించవచ్చని 'బోర్లించిన చెప్పు' చదివితే ఇట్టే అర్థమయిపోద్ది రాజి రెడ్డి శక్తి.. ఆయన రచనా సృష్టి!
మస్తు రాసినారు బ్రదర్ అదయితే.
నాకు ఎక్కువగా నచ్చిన కథలు గంగరాజం బిడ్డ,
మెడిటేషన్, చిన్న సమస్య & ఎఱుక.
గంగరాజం బిడ్డ లో పూర్ణలతని, ఆ అబ్బాయిని ఎన్నటికీ మరిచిపోలేను నేను. ఎంతో హృద్యంగా, విషాదంతో కూడుకొని రాసారు ప్రతీదీ. ఈ కథలో ఉన్న ambience, atmospherics ని ఆ అబ్బాయి emotional landscape లో తన మనసు తాలూక నిర్దిష్టమైన లోకంలో కొట్టుమిట్టలాడుతున్న details తో భళే విచిత్రమైన organic nature and stature తో రంగరించారు. That was phenomenal for me! ఈ కథ రాసింది మా ఊరు సిరిసిల్లకి దగ్గర్లో ఉన్న వ్యక్తేనా అని నా హృదయానికి ఆ పుస్తకాన్ని ఎంతో ప్రేమతో హత్తుకున్న సందర్భం అది. ఆశ్చర్యాల, ఆనందాల సమ్మేళనమది! కథ ముగింపులో అయితే నా కళ్ళల్లోకి నీళ్లు అచేతనంగా ఒక్కదెబ్బకి దూకాయి. చాలా అంటే చాలా నచ్చింది.
నా నాలుక మీద తేలియాడే యాస ఈ కథల్లో ఉన్న సంభాషణల రూపాల్లో కదులుతూ ఉంటే ఎంతో ముచ్చటేసింది, ఇంకెంతో మురిసిపోయా నాలో నేనే. ఇది నా యాస, నా భాష, నా నాలుక మీద నానే అక్షారాలవి అనే ఆలోచనల్తో.
'మెడిటేషన్' కథలో అయితే ఇంచుమించు రచయిత ఆలోచనల గొలుసుల తాలూక ఈ మనుష్య ప్రపంచం పట్ల ఉన్న ఆవేదన, ఆవేశం, గౌరవం, ఆశ్చర్యం, మిస్టిసిజం అన్నీ తన లోపల మండే నిప్పురవ్వల నుండి పుట్టిన అక్షరాల్లాగా తోచింది నాకయితే. పెల్లుబికిన లావా అది. Kudos!
అప్పుడప్పుడూ అమితమైన details ఉంటే character దృక్పథంలో కాకుండా రచయిత తాలూక binoculars ధరించి చూడవలసిన forced viewing తటస్తించే సందర్భం ఏర్పడవచ్చు. ఈ కథల పుస్తకంలో, తన రచనల్లో ఇదొక్కటే నాకు ఎందుకో నచ్చని విషయం, తాపుకోసారి నన్ను suffocate చేసిన ముచ్చట. అలా అనీ పక్కన పెట్టనూలేము! అదే తన గొప్పతనం.
తప్పకుండా చదవవలసిన రచనలవి. సూక్ష్మంలో కూడా సృష్టి రహస్యాన్ని మీ చెవిలో చెప్పడానికి పూనుకున్న రాజిరెడ్డి గారికి ఇదే నా whispering of the heart.. 'ఈ సృష్టిలో మీరు రచయిత అవ్వడం ఒక subtle, surrealistic beauty'.
మీరు రాస్తూ ఉండాలి ఎప్పటికీ!
ఈ కథల పుస్తకాన్ని రచయిత ఎంతో ఇష్టంగా మెహెర్ బ్రదర్ కి ఇచ్చిన మొదటి పేజీలో తనే స్వయంగా రాసిన 'మ్యాజికల్ మెహెర్ కు, ఆత్మీయంగా' అనే పదాల కింద తన సంతకం ఉంటుంది. ఇది గుర్తుచేసుకుంటూ అంతే ఆత్మీయంగా నా ఆత్మబంధువైన మెహర్ బ్రదర్ కి ఈ పుస్తకాన్ని చదవమని నాకు ఇచ్చినందుకు, నా ఊరోడ్ని నాకే పరిచయం జేశ్నందుకు, మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ..
- సత్య తేజ్

Sunday, April 7, 2024

ఫార్‌స్టర్‌ ఇండియా ప్రయాణం


ఇండియా ప్రయాణం

భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్‌ రాజ్‌ అనుభవాలతో ఇ.ఎం.ఫార్‌స్టర్‌ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్‌ సీనియర్‌లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్‌ పవార్‌ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్‌స్టర్‌ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్‌మన్‌ కవితా సంకలనం ‘పాసేజ్‌ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్‌స్టర్‌ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్‌లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్‌ లీన్‌. ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం.


నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్దమనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్‌ అజీజ్‌. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్‌ ఫీల్డింగ్‌. అజీజ్‌ తబ్బిబ్బయిపోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్‌. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్‌ పట్టణానికి వచ్చిన మిసెస్‌ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్‌’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్‌. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్‌ అయిన మూర్‌ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్‌ మూర్‌ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్‌ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్‌ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి!


కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమైపోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్‌. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్‌మన్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు.


‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్‌స్టర్‌ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్‌స్టర్‌ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్‌ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్‌ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్‌స్టర్‌ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది!

(సాక్షి ఎడిటోరియల్‌ పేజీ; ఏప్రిల్‌ 1,2024)

 






Tuesday, April 2, 2024

'ఆంధ్రజ్యోతి'లో 'గంగరాజం బిడ్డ' సమీక్ష


గంగరాజం బిడ్డ


బహుముఖ విన్యాసాల కదంబం

కల్పనకు, వాస్తవానికి మధ్య ఉన్న పొరను ఒలిచేస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి, వాక్యాన్ని భావగర్భితంగా నిర్మించే వీరి రెండో కథా సంపుటి 'గంగరాజం బిడ్డ'. 12 కథల ఈ సంపుటిలో మనిషి మానసిక విన్యాసాలతోపాటు, భౌతిక పరిస్థితుల ప్రభావిత చర్యలు, అనేకానేక పరిమితుల్లో చర్య, ప్రతిచర్యల క్రియలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, వాతావరణ పరికల్పన, అద్భుత పాత్రచిత్రణలతో కనిపిస్తాయి. 'బోర్లించిన చెప్పు'లో గతంలోని ఆవేశపు మాటల్ని వదులుచేసే వర్తమాన సన్నివేశం కలిగించే హాయి ఉంది. 'గంగరాజం బిడ్డ'లో తండ్రి చేసిన తప్పులకు బిడ్డకు ఎందుకు శిక్షపడాలని ఓ అవ్వచేసే తిరుగుబాటు అబ్బురపరుస్తుంది. 'మెడిటేషన్' కథ సంకల్పిత, అసంకల్పితాల్లోంచి పుట్టిన మనో నిర్మిత చైతన్యస్రవంతి, తాత్విక సిద్ధాంతాల పోరును వెల్లడిస్తుంది. 'జీవగంజి' వాస్తవాన్ని సత్యమని స్వీకరించడమే ఉత్తమమని అన్నం మెతుకు సాక్షిగా బోధిస్తుంది. 'చిలుము' స్వప్నంలా రాలిపోయిన ప్రేమతో పాటు, ప్రాంతం, మతం, భాషల ఆధిపత్య భావజాలాన్ని బలంగా చూపిస్తుంది. జ్ఞాపకాల పొత్తిళ్లలోకి కథనాత్మకంగా జారిపోయే ఈ రచయిత, కళ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం అని నమ్మి, మిగిలిన కథల్లోనూ అదే విష యాన్ని నిరూపించాడు. నిజంగా, ఇవి పెనుగులాటలోంచి పుట్టిన మేలైన కథలు.

- ప్రణ

గంగరాజం బిడ్డ మరిన్ని కథలు, రచన: పూడూరి రాజిరెడ్డి

పేజీలు: 114, వెల: రూ.150, ప్రతులకు: 99124 60268 మరియు 'అమెజాన్' 

(24-3-2024; ఆంధ్రజ్యోతి ఆదివారం )

Monday, April 1, 2024

సాక్షి- పుస్తక పరామర్శ - గంగరాజం బిడ్డ



రాజిల్లే జీవన తాత్త్వికత


సీనియర్ జర్నలిస్ట్, రచయిత పూడూరి రాజిరెడ్డి ఏడేళ్ల 'కలం’కారీ తనం కలబోసుకుని 'గంగరాజం బిడ్డ'గా మన ముందుకు వచ్చింది. పన్నెండు కథల ఈ సంపుటి రచయిత గత
కథలకు భిన్నమైనది. ఇందులోని కథలలో సగం ఒక విధమైన మోహపరవశంతో కూడినవి కాగా మరో సగం కథలు 'రెండోభాగం', 'మెడిటేషన్', 'ఎడ్డి, 'జీవగంజి' 'కొండ', 'ఎఱుక' కథలు ఒకవిధమైన జీవన తాత్త్వికతను చెబుతాయి. వీటన్నింటిలోనూ బాల్యం నుంచి టీనేజీ, పెళ్లీడు, ఆ తర్వాత, మధ్య వయసు... ఇలా అన్ని దశలలోనూ పురుషుడే తనలో ముప్పిరిగొనే అనేక భావాలను వ్యక్తం చేస్తూ పోతాడు. ఆయా పాత్రల ఆలోచనాధారలో 'ఇదంతా నా గురించేనేమో' అని చదువరులు అనుభూతి చెందేలా చేసే రచనా చాతుర్యం అబ్బుర పరుస్తుంది. అచ్చమైన తెలంగాణ మాండలికంతో కొసంటా చదివింపజేసే ఈ కథలలో కొన్ని పదాలకు అర్థాలు తెలియకున్నా, కథాగమనానికి భంగం వాటిల్లదు. 

గంగరాజం బిడ్డ, మరిన్ని కథలు
రచన: పూడూరి రాజిరెడ్డి, ఫోన్: ---
పుటలు:116; వెల రూ. 150
ప్రతులకు: సేపియన్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్,
1-3-63/2, మల్బౌలి స్ట్రీట్, నల్గొండ-
508001. 9912460268; 
పుస్తక విక్రయ కేంద్రాలు

-DVR

(03/03/2024 | ఫన్‌డే) 

Sunday, March 17, 2024

తమిళంలోకి ‘ఎడ్ది’







 

నా 'ఎడ్డి' కథ తమిళ అనువాదం కాలచువాడు మాసపత్రిక మార్చి 2024 సంచికలో ప్రచురితమైంది. అనువాదకులు మారియప్పన్‌ గారికీ, సంపాదకులకూ ధన్యవాదాలు.

Saturday, March 16, 2024

శాస్త్రి గారు - ఇడ్లీ పొట్లం




పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చినట్టుగా తెలియజేసిన వార్తాపత్రిక ఇడ్లీ పొట్లంగా మారడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ అది సరిగ్గా ఆ రచయిత దగ్గరికే చేరడంలోనే సృష్టి కుట్ర ఏదో ఉందనిపిస్తుంది. దీనికిదే ఒక చిన్న కథ అవుతుంది. టైటిల్ కావాలంటే పైది పెట్టుకోవచ్చు

😊
Patanjali Sastry గారి FB పోస్టు (3-2-24) చూశాక నాకో సంగతి గుర్తొచ్చింది. సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్నప్పుడు, దేనికోసమో కిరాణా షాపుకు వెళ్తే, అనుకోకుండా నా కళ్లు పొట్లాలు కట్టడానికి ఉంచిన కాగితాల మీద పడ్డాయి. నా పేరుందేమిటి? నా కంటే ముందు ఒక్క మనిషి ఆ దుకాణానికి వెళ్లినా ఈ కాగితం నాకు దక్కకపోవును, ఇలాంటిదొకటి వేసినట్టుగా నాకు తెలియకపోవును. సృష్టి కుట్ర ఇలా కూడా ఉంటుంది!


Friday, March 15, 2024

గ్రంథాలయాల హననం



పుస్తక హననం

నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ సాగన్‌. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్‌ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్‌ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్‌ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్‌ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్‌ ఓవెండెన్‌. ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్‌ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం.


ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్‌ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్‌ కలిగివున్న గ్రేట్‌ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్‌ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్‌–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్‌ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్‌ విమర్శకుడు జాక్వెస్‌ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడువునా జరుగుతూనే ఉంది.


ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నాలంద విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిష్యం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట. క్రీ.శ.1193లో భక్తియార్‌ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్‌.


బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్‌ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్‌ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్‌’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్‌సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్‌సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్‌ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు.


అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్‌ డార్న్‌టన్‌. అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్‌ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్‌ పెన్హ్‌ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్‌ రూజ్‌’ తుడిచిపెట్టింది.


దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్‌ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్‌ పాట్‌ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్‌ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది.
ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం. అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా?

4-3-2024

Thursday, March 14, 2024

సోమర్‌సెట్‌ మామ్‌: ఫస్ట్‌–రేట్‌ రచయత





 ఫస్ట్‌–రేట్‌ రచయత

సెకండ్‌–రేట్‌ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్‌సెట్‌ మామ్‌. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్స్, టాల్‌స్టాయ్, దోస్తోవ్‌స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్‌ అవుతుంది. ఇక్కడ కూడా మామ్‌ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్‌ సోమర్‌సెట్‌ మామ్‌. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్‌ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్‌ అనుభవించాడు. హాలీవుడ్‌ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్‌ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్‌ అండ్‌ సిక్స్‌పెన్స్‌’, ‘ద పేంటెడ్‌ వీల్‌’, ‘కేక్స్‌ అండ్‌ ఎయిల్‌’, ‘ద రేజర్స్‌ ఎడ్జ్‌’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్‌ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత అదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం.

మామ్‌ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్‌ గడ్డ మీద. అలా ఫ్రెంచ్‌ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్‌ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్‌ కుటుంబం ఫ్రాన్స్‌లోని బ్రిటిష్‌ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్‌ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్‌ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్‌–అంకుల్‌ గుర్తుగా పెట్టిన సోమర్‌సెట్‌ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్‌లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్‌ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం.

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్‌ చేశాడు మామ్‌. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్‌ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్‌ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్‌. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్నన్‌ నిఘా నెట్‌వర్క్‌ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్‌ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్‌ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్‌ అనేది కవర్‌. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢాచార రచయిత మామ్‌ అయ్యాడు. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ రాయడానికి ఇయాన్‌ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు.

ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్‌’లో హోమోసెక్సువల్‌ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్‌ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్‌. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్‌ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్‌ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్‌ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్‌ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు.


5-2-24

Friday, January 19, 2024

గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారి స్పందన


(గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారు తన అభిప్రాయాన్ని జనవరి 3న తన ఫేస్‌బుక్‌ వాల్‌ మీద పోస్ట్‌ చేశారు. దాన్నే ఇక్కడ కాపీ చేస్తున్నా.)

 

గంగరాజం బిడ్డ - పూడూరి రాజిరెడ్డి

"ఈ వగలాడులు ఎందుకు వశం చేసుకోవాలి? ఎందుకు పశ్చాత్తాపానికి గురి చేయాలి?‘‘
వీటికి ముందువాక్యంలోనే ‘‘ఎందుకింత ఇమోషనల్ గా డిపెండ్ అవుతారు వీళ్ళు?‘‘ అంటూ ప్రశ్నరూపంలో పై ప్రశ్నలకు జవాబు!
‘‘ఎంత అనుభవించినా ఇంకా మిగిలిపోయే స్త్రీ శరీరం‘‘
ఈ కొన్ని వాక్యాలనే కాదు, ఈ ప్రస్తుత పుస్తకానికి క్రితం ఈ రచయిత కలం నుంచి వచ్చిన ఆత్మకథనాత్మక రచనలూ, ఇంకొన్ని వేరే కథలూ చదివిన వారికి ఇతని wonderment at woman కాస్త జాస్తిగానే amusing గా తోస్తుంది.
తనతో క్షణం సేపు, గుడికి ఒక ప్రదక్షిణ చేసినంతసేపు, ఆకాశం పంచుకున్నందుకా లేక ఈ ఆకాశం కింద ఎక్కడకు వెళ్ళినా తనతో ఆ నేలలను ఎప్పుడూ సమంగా పంచుకుంటున్నందుకా స్త్రీకి అంత ఆకర్షణ!?
కానీ ఈ ముచ్చట ఎక్కడినుంచో పనిగట్టుకుని రాదు, తీర్మానంగా కొన్ని specific స్త్రీ పురుష సంబంధాల గురించిన కథలైనందు వల్ల రాదు. ఆరాధనీయమైన ప్రేమకథలైనందువల్ల రాదు. ఎక్కడా, పెద్ద మోతాదుల సంఘర్షణలలోనో పుట్టిన ఉలికిపాటు వాక్యాలూ కావివి.
దినసరి చాయ్ రోటీల వలెనే, మరీ మాట్లాడితే ఊపిరి తీసుకోవడం వలెనే ఈ observations.
"ఒక స్త్రీ కలిగించగలిగే ఆవేశము, ఆమె మీద నాకు ఏ అధికారమూ లేదన్న వాస్తవమూ ఏకకాలంలో ఆశనిరాశల మధ్య ఊగించాయి" ఎంత మంది మగవాళ్ళు ఎవరూ కాదనలేని ఈ పురుష సత్యాన్ని ఒప్పుకుంటారు!
అన్ని బలహీనతలలోకి బలమైనది స్త్రీ అందం పట్ల ఆకర్షణ. అది ఉండదనటం ఎంత అబద్ధమో, దానికి చలించి వెంటపడం అంత అధమం.
మరో మగ వ్యథ!
పదో యేట నుంచే అస్తిత్వ భయం, తనకు నిరూపణకు వచ్చిందాకా తన పురుషాస్తిత్వ ఆందోళనం!
దీన్ని వ్రాతల్లో నమోదు చేయడమూ అంత తేలికైన పనేమీ కాదు.
ఏ కల్పిత పాత్ర వెనకనో నుంచోకుండా తనను సాంతం చదివేసుకున్న వ్రాతలు ఈ రచయితవి.
కానీ, ఈ సంచలనాలను నీళ్ళమీద గులకరాయి చేసే వలయాలను చూస్తున్నట్లు ఒడ్డున ఉండి చూసినప్పటి ముచ్చట్లు ఇవి. స్థితప్రజ్ఞత వంటి పెద్ద మాటలు పరిచయం అయిందాకా అతనికే తెలీదు అది తనకు కాస్తో కూస్తో ముందునుంచే ఉందని.
కాబట్టే ఇలా అనుకోగలడు, ఏం సంబంధం లేకపోయినా ఆ సౌందర్యస్వరూపాలతో ఒక ఉమ్మడితనమేదో తనకు ఉండగలిగితే బావుండునని.
అది ఇతనికి కేవలం అనుకోవడంలో ఆగిపోలేదు.
సౌందర్యాన్ని ఎంత నిశితంగా గమనిస్తాడో ఈ రచయిత తన శ్వాసను అంత నిమగ్నతతో చూస్తాడు, కళ్ళు మూసుకుని.
"మెడిటేషన్" ఈ పుస్తకంలో అత్యుత్తమ రచన. బోలెడంత హాస్యం, లిప్తపాటులో ఎగిరిపోయి ఎక్కడెక్కడో తిరిగి, తిరిగి వచ్చి ముక్కు కొనమీద వాలే మనసు తాలూకు అల్లరి కబుర్లు, తర్వాత కావలసినంత సద్విచారం, సత్యమైన అనుభవం!
ప్రాణికి నేర్చుకోకుండా అబ్బే మొదటి విద్య శ్వాసించడం. ఆ అనులోమ విలోమ శ్వాసలను ఎఱుకతో గమనించడం అంతిమ అధ్యయనం .
ఈ రెండింటి మధ్య చేసేవి చూసేవి నేర్చేవి కోటి విద్యలు. కొన్ని పొట్ట కూటికి అయితే కొన్ని కంటికి భోజనం.
మెడిటేషన్ లో 'రియల్ బ్లిస్' దొరికితే చాలా !?
ఎంత సేపు?!
చిన్న పిట్టొకటి వచ్చి పచ్చికాయ కొరికిన వాసన మరింతగా అనుభవానికి వస్తేనే ఈ తోటలో మనిషొక యోగి.
భోగి.
ధ్యానం నేర్పిన గురువు చేసిందల్లా, ధ్యానించటం అనే మానవ సహజ లక్షణానికి తనను మేల్కొలపటమే.
ఈ సంకలనంలోని కథలు కుదిపేస్తాయి, మీకూ తెలుసుకదా ఇవన్నీ అని నిలదీస్తాయి.
'ఎడ్డి', 'కొండ' కథలు కదిలిస్తాయి.
అన్నీ చదవవలసిన కథలే.
రచయిత స్టైల్ ఎవరూ అనుకరించలేనిది,
అతని పరిశీలనలు, వాటికి స్పందనలు, వ్యక్తీకరణలు అతనివే సాంతం అయుండటమే అందుకు కారణము.
Cover design, cover art ముచ్చటగా ఉన్నాయి.

(3-1-2024)


Thursday, January 18, 2024

కొలెట్‌: ఒక ప్రవాహం


ఒక ప్రవాహం


మనుషుల మీద లేబుల్స్‌ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్‌’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్‌ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్‌’, ‘ద ప్యూర్‌ అండ్‌ ది ఇంప్యూర్‌’ లాంటి రచనలు చేసిన కొలెట్‌ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం.

తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్‌’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్‌ కొలెట్‌. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్‌ విల్లర్స్‌ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్‌’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు. మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్‌ సహజంగానే రైటర్‌ మెటీరియల్‌. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్‌ ఎట్‌ స్కూల్‌’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది. వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్‌ ఇన్‌ పారిస్‌’, ‘క్లాడైన్‌ మేరీడ్‌’ రాసింది కొలెట్‌. క్లాడైన్‌ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్‌తో సిగరెట్లు, లింజెరీ, పెర్‌ఫ్యూమ్‌ కూడా విల్లీ ప్రారంభించాడు.


విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్‌. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్‌’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్‌ రూజ్‌’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది. ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్‌ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు.

కొలెట్‌ అంటే ఒక స్కాండల్‌. పరస్పర వైరుధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు. సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్‌ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్‌ ఒక బైసెక్సువల్‌. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్‌ అండ్‌ బటర్‌’’ అన్నారు. అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్‌–లిఫ్ట్‌’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి.

‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్‌ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్‌ జానెట్‌ ఫ్లానర్‌. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్‌ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్‌ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి!

(8-1-2024)

Wednesday, January 3, 2024

2023లో నేను చూసిన సినిమాలు













2023లో నేను చూసిన సినిమాలు


ఈ సంవత్సరం చూసిన సినిమాలు, సిరీసులు, డాక్యుమెంటరీల జాబితా ఇది.   దీన్ని కూర్చడానికి నేనేమీ శ్రమ పడలేదు. కొన్నేళ్లుగా, ఆ సంవత్సరం చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు ఏమిటో డైరీ వెనకాలి పేజీల్లో రాసుకునే అలవాటు ఉంది కాబట్టి, వాటిని చూసి టైప్‌ చేయడమే నేను చేసింది. దర్శకుల పేర్లను మాత్రం చాలావాటికి వెతికి రాశాను. అది వాళ్లకు నా గౌరవ ప్రకటన. పక్కన ఏదైనా నా ఇంప్రెషన్‌ రాద్దామనుకున్నాను గానీ, అది మొదలుపెడితే నిజంగానే పని అవుతుంది. అందుకే ఆ జోలికి పోలేదు. జస్ట్‌ జాబితా అంటే జాబితా! 

సగంలో వదిలేసినవి ఇందులో పేర్కొనడం లేదు. తిరిగి రాస్తున్నప్పుడు, కొన్నయితే నేను చూసినట్టుగా మర్చిపోయినవి కనబడ్డాయి. మళ్లీ సెర్చ్‌ చేస్తే, ఓ ఇది అది కదా అని గుర్తొచ్చింది. అంటే, అవి బాగాలేకపోవడం కాదు సమస్య. టూమచ్‌ ఫీడింగ్‌ కావడం వల్లో; తాత్కాలికంగా వాటి తాలూకు మెమరీ రద్దయిపోవడమో... అయినా, ఇదేమీ అసాధారణ విషయం అనుకోవడం లేదు. 

నా చూడటానికి ఒక పద్ధతంటూ లేదు. ఎక్కడో ఒక హింట్‌ అందుకొని చూడటం, కొన్ని ఎప్పటినుంచో అనుకున్నవి చూడటం, కొన్ని ఒక అంచనాతో చూడటం, డైరెక్టర్‌ మీద ఒక ఐడియా ఉంటే చూడటం, ఇట్లా తప్పితే పెద్ద ప్రణాళిక ఏమీలేదు. కానీ జాబితా చదువుతుంటే కూడా కొన్నిసార్లు నేను చూసిన క్రమం ఏదో తట్టవచ్చు.

ఇంగ్లీష్‌ వాటికి ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ అని రాయడం లేదు. భారతీయ భాషలవి తప్ప మిగిలినవాటికి ఆ దేశాల పేర్లు ఇచ్చాను. ‘రీ’ అంటే మళ్లీ చూసినవి. ఒకట్రెండు పిల్లలకు చూపించడానికి మళ్లీ చూశాను.

ఇందులోంచి ఏవి బెస్ట్‌ అంటే– ఆల్రెడీ చాలా పేరున్న వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండోసారి చూసినవి అంటేనే అందులో ఏదో నాకు నచ్చింది ఉన్నట్టు. అవన్నీ పోగా, ఇవి ఏడాది నా టాప్‌–10 అనుకోవచ్చు: నాన్‌పక్కల్‌ నేరత్తు మయక్కమ్‌; ద స్టోరీ ఆఫ్‌ ద వీపింగ్‌ కామెల్‌; ఎ సన్‌; సెక్స్, లైస్‌ అండ్‌ వీడియోటేప్‌; రఫ్‌ డైమండ్స్‌; స్కూప్‌; కోహ్రా; తలైకూతాల్‌; బర్నింగ్‌; అహింస.


జాబితా: 

1. Breaking Bad (Final 5th Season) (Cr. Vince Gilligan)

2. El Camino(Breaking Bad Film) (Vince Gilligan)

3. Sudani from Nigeria (Zakariya) (Malayalam) (Re)

4. Blue Velvet (David Lynch)

5. In the Pursuit of a Big Fish (Satya Tej) 

6. సిరోంచా (చంటి)

7. బటర్‌ఫ్లై (ఘంటా సతీశ్‌బాబు)

8. Mission Majnu(Shantanu Bagchi) (Hindi)

9. బింబిసార (మల్లాది వశిష్ఠ)

10. Baran (Majid Majidi) (Iran) (Re)

11. The Little Hours (Jeff Baena)

12. Victoria and Abdul (Stephen Frears)

13. The Good, The Bad and The Ugly (Sergio Leone)

14. Nanpakkal Nerattu Mayakkam (Lijo Jose Pellissery) (Malayalam)

15. అ! (ప్రశాంత్‌ వర్మ)

 16. A Sun (Chung Mong-hong) (Taiwan)

17. Shadows in Paradise (Aki Kaurismaki) (Finland)

18. Thalaikoothal (Jayaprakash Radhakrishnan) (Tamil)

19. RRR (S.S.Rajamouli) (Hindi)

20. Apartment (Billy Wilder)

21. The Elephant Whisperers (Kartiki Gonslaves) (Doc) (Re)

22. All Quiet on the Western Front (Edward Berger)

23. బలగం (వేణు యెల్దండి)

24. Navigator (Buster Keaton)

25. Sex, Lies and Videotape (Steven Soderbergh)

26. Faraaz (Hansal Mehta) (Hindi)

27. Hunger (Sittisiri Mongkolsiri) (Thailand)

28. The 40 year old Version (Radha Blank)

29. The Davinci Code (Ron Howard) (Re)

30. Iratta (Rohit M.G.Krishnan) (Malayalam)

31. The Story of the Weeping Camel (Byambasuren Davaa) (Doc) (Germany/Mongolia)

32. దసరా (శ్రీకాంత్‌ ఓదెల)

33. Ocean's Eleven (Steven Soderbergh)

34. Sehar (Kabeer Kaushik) (Hindi)

35. New Delhi Times (Ramesh Sharma) (Hindi)

36. Ek Doctor ki Maut (Tapan Sinha) (Hindi)

37. Ozark (First Season) (Cr. Bill Dubuque, Mark Williams)

38. Angels and Demons (Ron Howard)

39. Inferno (Ron Howard) (Dan Brown Triology)

40. Hiroshima mon Amour (Alain Resnais) (France/Japan)

41. The Great Indian Kitchen (Jeo Baby) (Malayalam)

42. Searching (Aneesh Chaganty)

43. The Cave of the Yellow Dog (Byambasuren Davaa) (Germany/Mongolia)

44. Gumrah (Vardhan Ketikar) (Hindi) (New)

45. విరూపాక్ష (కార్తీక్‌ వర్మ దండు)

46. The Last Forest (Luiz Bolegnesi) (Doc)

47. Three Songs for Benazir (Gulistan Mirzaei. Elizabeth Mirzaei) (Short Doc) (Afghanistan)

48. Father and Daughter (Michael Dudok de Wit) (Short Animation) (Netherlands)

49. అంజలి (మణిరత్నం) (రీ)

50. Rough Diamonds (Cr. Rotem Shamir, Yuval Yefet) (Series) (Belgium)

51. Scoop (Hansal Mehta) (Series)

52. There will be Blood (Paul Thomas Anderson)

53. Budhia Singh: Born to Run (Soumendra Padhi) (Hindi)

54. Trishanku (Achyuth Vinayak) (Malayalam)

55. Lust Stories 2 (Konkonasen Sharma, Sujoy Ghosh, R.Balki, Amit Sharma)

56. Under the Shadow (Babak Anvari) (Iran)

57. The Joke (Jaromil Jires) (Milan Kundera) (Czechoslovakia)

58. Caliphate (Goran Kapetanovic) (Series) (Sweden)

59. The Green Prince (Nadav Schirman) (Doc) (Israel)

60. The Mummy (Aelx Kurtzman) (New)

61. 2018 (Jude Anthany Joseph) (Malayalam)

62. Kohra (Randeep Jha) (Series) (Punjabi)

63. The Hurt Locker (Kathryn Bigelow)

64. జై భీమ్‌ (టి.జె.జ్ఞానవేల్‌)

65. Steve Jobs (Danny Boyle)

66. House of Gucci (Ridley Scott)

67. Lunana: A Yak in the Classroom (Pawo Choyning Dorji) (Bhutan)

68. Robin Hood (Ridley Scott) (2010)

69. Alkhallat+ (Fahad Alammari) (Saudi Arabia)

70. Kumbalangi Nights (Madhu C. Narayanan) (Malayalam) (Re)

71. Made in Heaven (Season 2) (Cr. Zoya Akhtar, Reema Kagti)

72. Sardar Udham (Shoojit Sircar) (Hindi)

73. October (Shoojit Sircar) (Hindi) (Re)

74. Gulabo Sitabo (Shoojit Sircar) (Hindi)

75. Live to 100: Secrets of the Blue Zones (Dan Buettner) (Doc)

76. Seinfeld (Two Seasons) (Cr. Larry David, Jerry Seinfeld)

77. Zindagi Tamasha (Sarmad Sultan Khoosat) (Pakistan)

78. జైలర్‌ (నెల్సన్‌ దిలీప్‌కుమార్‌)

79. The Hunger Games (Gary Ross)

80. Ordinary Men: The Forgotten Holocaust (Manfred Oldenburg, Oliver Halmburger) (Doc)

81. మన కాళోజీ (అమర్‌నాథ్‌ సందిపాము) (డాక్యు)

82. Jaane Jaan (Sujoy Ghosh) (Hindi)

83. To Kill a Mockingbird (Robert Mulligan) (Harper Lee)

84. Pathonpatham Noottandu (Vinayan) (Malayalam)

85. Burning (Lee Chang-dong) (South Korea) (Haruki Murakami)

86. Okja (Bong Joon-ho) (Korean/English)

87. The Salesman (Asghar Farhadi) (Iran)

88. The Making of the Mahatma (Shyam Benegal)

89. Ahimsa- Gandhi: The Power of the Powerless (Ramesh Sharma) (Doc)

90. A Hero (Asghar Farhadi) (Iran)

91. Money Shot: The Pornhub Story (Suzanne Hillinger) (Doc)

92. Android Kunjappan Ver 5.25 (Ratheesh Balakrishnan Poduval) (Malayalam) (Re)

93. The Wonderful Story of Henry Sugar (Wes Anderson) (Roald Dahl)

94. Poison (Wes Anderson) (Roald Dahl)

95. Kaala Paani (Series) (Sameer Saxena, Amit Golani) (Biswapati Sarkar)

96. Kapoor and Sons (Shakun Batra)

97. Holy Hell (Will Allen) (Doc)

98. Neurons to Nirvana: Understanding Psychedelic Medicines (Oliver Hockenhull) 

99. Fasting: The Healer Within (Sinclair Fischer-Gray, Saxon Fischer-Gray)

100. Dhobhi Ghat: Mumbai Diaries (Kiran Rao)

101. Crown 6 (Season 6) (Cr. Peter Morgan)

102. Three of Us (Avinash Arun)






 

 

Monday, January 1, 2024

కొతిమీర పూలు, ఇంకొన్ని

 


కొతిమీర

ఉల్లిమొగ్గ–1


ఉల్లిమొగ్గ–2


చుక్కకూర–1


చుక్కకూర–2


మిరప
 


మెంతి
 


కంది


సొర / ఆనిగెపు కాయ


నువ్వు


టమోటా


తుమ్మి


(అన్నీ మా ఊళ్లో తీసినవి.)

(ఆనిగెపు పువ్వులో మధ్యలోని డీటెయిల్‌ కోసం మళ్లీ తీశాను.)