Friday, November 24, 2023

ఒక క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌


(ఓ ఏడాది క్రితం, వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్రియేటివ్‌ రైటింగ్‌ క్లాస్‌ తీసుకోవాలని పోపూరి సురేశ్‌బాబు గారు అడిగారు. ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా కథల గురించి చెప్పాలన్నారు. నాకు ఇట్లాంటిది కొత్త. పిల్లలకూ ఎంతమాత్రం ఆసక్తి ఉంటుందో తెలీదు. నాకు తోచింది చెప్తానన్నాను. నాతో పాటు అజయ్‌ ప్రసాద్‌ కూడా వచ్చాడు. ఇదే కార్యక్రమంలో కవిత్వం గురించి అనిల్‌ బత్తుల మాట్లాడాడు. ఇదొక భిన్న అనుభవం. వాళ్లకు మధ్యమధ్యలో కొన్ని కథలు చెప్తూ దీన్ని కొనసాగించాను. పాక్షికంగా దీన్ని ఒక ఇంటెరాక్టివ్‌ సెషన్‌గా ప్లాన్‌ చేసుకున్నాను కాబట్టి, ఇందులో గ్యాప్స్‌ ఉంటాయి. అయినా దీనికిదే ఇచ్చేది కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్‌ చేస్తున్నా. చివర్లో కొంతభాగం మాత్రం కత్తిరించాను. ఇంతకుముందు చదవకపోయివుంటే, 
  ఇందులోని కథలు వెతుక్కుని చదువుకోవడం మీ ఎక్సర్‌సైజ్‌...  అన్నట్టూ,  ఎప్పుడూ చేయని పని చేసినందుకేమో, మేము బయటికి వచ్చీరాగానే జోరు వాన అందుకుంది.)







క్రియేటివ్‌ రైటింగ్‌ సెషన్‌

వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, హైదరాబాద్‌

 సెప్టెంబర్‌ 8, 2022

పూడూరి రాజిరెడ్డి


నాకు కొంచెం స్టేజ్‌ ఫియర్‌ ఉంది. నా వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుందోగానీ, దీనివల్ల నాకు ఒక ప్రాక్టీస్‌ సెషన్‌ అనుకోవచ్చు.


ఇక్కడికి రావడానికి నాకున్న అర్హత ఏమంటే– నేనొక మూణ్నాలుగు పుస్తకాలు రాసివున్నా. సాక్షి పేపర్లో సాహిత్యం పేజీని ఒక ఐదున్నరేళ్లు నడిపివున్నాను.


క్లుప్తంగా మీ పరిచయం: మీ పేరు– మీ ఊరు– మీ ట్రేడ్‌?


మీరు పుస్తకాలు చదువుతారా?

బాగా నచ్చిన పుస్తకాలేంటి?

మీకు తెలిసిన కొందరు రచయితల పేర్లు ఏంటి?

మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు?

డైరీ ఎవరైనా రాస్తారా?

కనీసం రోజూ న్యూస్‌ పేపర్స్‌ చదువుతారా?


మీరు దేనికీ సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా నేను హేపీనే. ఎందుకో తెలుసా? ఈ మధ్య ఒక ఇట్లానే జరిగిన ఒక రైటింగ్‌ ప్రోగ్రామ్‌లో ఆ నిర్వాహకుడు అన్నారు: ప్రపంచంలో 99 శాతం మంది రాయరు. ఒక్క శాతం మందికి మాత్రమే రాయాలన్న ఆలోచన ఉంటుంది. రాస్తారో లేదో తర్వాత సంగతి. కానీ మీకు రాయాలన్న ఆలోచన వచ్చినందుకే మీరు ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేసినట్టు. అంటే క్రీమీ లేయర్‌ మీరు. అందుకనైనా మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు.

((క్లాప్స్‌))


ముందుగా ఒక కథ చెప్పుకుందాం. తర్వాత కొంత బోర్‌ కొట్టిస్తా.


వడ్ల గింజలు

––––––––

ఒకటో కథ: వడ్ల గింజలు– శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గడికి రెండు వడ్ల గింజలను పెంచుకుంటూ 64 గళ్ల వరకూ వెళ్లడం అనేది ప్లాట్‌.


రైటింగ్‌/ సాహిత్యం అంటే?

––––––––––––––––

అయితే రైటింగ్‌ అనేది ఏమిటి? (మొత్తంగా దీన్ని సాహిత్యం, లిటరేచర్‌...)


1. అయితే రైటింగ్‌ అనేది ఏమంటే– చాలా చిన్న ఏరియా. కానీ మనదైనది. సేక్రెడ్‌ స్పేస్‌. బ్యూటిఫుల్‌ స్పాట్‌.

ఒక ఇళ్లు చూడండి. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, దాని ఎత్తు, వైభవం... అన్నీ ఉండొచ్చు. కానీ ఒక చిన్న పూలమొక్క దాని ముందట నాటితే ఆ ఇళ్లు మొత్తానికి ఒక అందం వస్తుంది. ఆ ప్రక్రియ మొత్తం అర్థవంతం అవుతుంది, అదీ సాహిత్యం అంటే. అదీ సృజన.


2. ఇంకో రకంగా చెప్పాలంటే, సాహిత్యం అనేది ఒక ఎమోషన్‌. మనం ఒక చారిత్రక ప్రదేశానికి పోయామనుకుందాం. అక్కడ అద్భుతమైన నిర్మాణం కనబడుతుంది. ఒక ఫీలింగ్‌ వస్తుంది. దాన్ని ఎవరు ఎప్పుడు కట్టారో అక్కడ ఫలకాల మీద వివరాలు దొరకొచ్చు. కానీ ఆ కట్టే ప్రాసెస్‌లో జరిగిన మనుషుల అనుభవాలు ఏమిటి, ఆలోచనలు ఏమిటి, ఆ వివరాలు మనకు అక్కడ దొరకవు. వాటిని ఎవరైనా నమోదు చేస్తే అది సాహిత్యం అవుతుంది.

ఇదే కాలేజీ తీసుకోండి. ఇది ఫలానా సంవత్సరంలో ప్రారంభమైమంది, ఇక్కడ ఇంతమంది చదువుతున్నారు, ఈయీ విభాగాలున్నాయి, ఈయీ టైముల్లో బస్సులు వస్తాయి, అనే వివరాలు మనకు ఉపయోగపడతాయి. కానీ సాహిత్యం అనేది అంతకుమించి. ఆ సినిమాలో అంటాడు కదా... అట్లా అంతకుమించి. 

ఒక విద్యార్థి మొదటిరోజు ఈ కాలేజికి వచ్చినప్పుడు అతడికి ఎలాంటి ఫీలింగ్‌ కలిగింది, క్యాంటీన్లో అతడు ఏది ఇష్టంగా తింటాడు, ఫీజు కట్టడానికి అతడు ఎలాంటి ఘర్షణ అనుభవించాడు, ఈ చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న మథనం అతడిలో ఎంత తీవ్రంగా ఉంది... ఇవన్నీ సాహిత్యం అవుతాయి. 

ఎవరో మనిషి గురించి ఇంకెవరో రాస్తే అది మనకెందుకు పనికొస్తుంది? మనకెందుకు నచ్చుతుంది?

ఎందుకంటే అందులో మనల్ని చూసుకుంటాం. అక్కడ వచ్చిన విద్యార్థి తొలిరోజు భయం లాంటిదే మనకూ ఉంటుంది. అతడికి ఈ కాలేజీలో ఏదో ఒకటి ప్రత్యేకంగా నచ్చినట్టు మనకు ఇంకేదో ఉంటుంది. అతడికి వాళ్ల నాన్నతోనో అమ్మతోనో ఉండే ఉద్వేగం లాంటిది మనకూ మన కుటుంబంతో ఉంటుంది. వివరాలు మారుతాయి. కానీ ఎమోషన్‌ అదే. అందువల్ల మనం కనెక్ట్‌ అవుతాం. అతడితో కలిసి మనం కూడా ప్రయాణిస్తాం.

సాహిత్యం అనేది హ్యూమన్‌ కండీషన్‌ను చెప్పేది.


ఎ డేస్‌ వెయిట్‌

–––––––––

ఎర్నెస్ట్‌ హెమింగ్వే. ఫారిన్‌హీట్‌కూ సెంటీగ్రేడ్‌కూ తేడా తెలియని పిల్లాడి కథ. 1933. ఫస్ట్‌ పెర్సన్‌ కథ. 102 డిగ్రీల ఫారిన్‌హీట్‌. 44 డిగ్రీల సెల్సియస్‌.


రైటింగ్‌ అనేదాన్ని నేర్పవచ్చా?

––––––––––––––––––

నా ఉద్దేశంలో అయితే నేర్పలేము. మరి మీరెందుకు వచ్చినట్టు అని ప్రశ్న వస్తుంది. కానీ నేర్పలేము అని చెప్పడానికైనా నేను రావాలి కదా:–)

వంట నేర్పొచ్చు. బట్టలు కుట్టడం నేర్పొచ్చు. ఏదైనా యంత్రాన్ని ఆపరేట్‌ చేయడం నేర్పొచ్చు. అవన్నీ స్కిల్స్‌. కానీ రైటింగ్‌ అనేది ఆర్ట్‌. ఏ ఆర్ట్‌ అయినా ఎవరికి వారే నేర్చుకోవాలి. ఆర్టిస్టు ఉన్నాడనుకుందాం. ఏ కలర్‌తో ఏది కలిపితే ఏ షేడ్‌ వస్తుంది అనే వివరం చెప్పొచ్చు. ఏ కాగితం వాడాలి అని చెప్పొచ్చు. కానీ బొమ్మ ఎలా గీయాలి అనేది మనమే సాధన చేయాలి. అట్లాగే రైటింగ్‌ కూడా.

అందుకే కొన్ని విషయాలు మాత్రం చెప్తాను.


సాహిత్యంలో ప్రక్రియలు: కథ

–––––––––––––––

ఇందులో ఎన్నో రకాల ప్రక్రియలున్నాయి. క£ý,, కవిత్వం, నవల, వ్యాసం, నాటకం. ఇవన్నీ కూడా మనం ఎంపిక చేసుకునే విషయం, దాని విస్తృతి, దాన్ని చెప్పాలనుకునే పద్ధతిని బట్టి మారుతాయి. కానీ అన్నీ కూడా మొత్తంగా సాహిత్యం కిందికే వస్తాయి.


కథ ఇక్కడ మనకు టాపిక్‌ కాబట్టి– ఏది కథ అవుతుంది?


మన జీవితంలోని ఒక అధ్యాయం కథ అవుతుంది.

ఒక పాయింట్‌ నుంచి ఇంకో పాయింట్‌కు చేసే ప్రయాణం కథ.

లేదా ఒక నియమిత టైమ్‌ పీరియడ్‌లో జరిగే వ్యవహారం. అంటే ఒక ఉదయం నుంచి ఒక సాయంత్రం వరకు. కొన్ని రోజుల్లో కూడా జరగొచ్చు. అది టాపిక్‌ను బట్టి ఉంటుంది.


అసలు ఏం రాయొచ్చు?

దానికి జవాబు ఏం రాయకూడదు? అండర్‌ ద స్కై ఏదైనా రాయొచ్చు. 


సినిమాల ఉదాహరణ అయితే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా. ఎన్ని సినిమాలున్నాయో అన్ని రకాల కథలున్నాయి. ఇది వద్దు, ఇది రాయొద్దు అనేది ఏమీ ఉండదు. కానీ సినిమా అనేది నవల కిందకు వస్తుంది. ఎందుకంటే అందులో టైమ్‌ స్పాన్‌ ఎక్కువుంటుంది. పాత్రలు ఎక్కువుంటాయి. అదే కథలో తక్కువ పాత్రలు ఉంటాయి. తక్కువ టైములో అయిపోతుంది.


కథ ఎన్ని పేజీలుండొచ్చు? 

పది పేజీలు.

నాలుగు పేజీలు.

ఒక్క పేజీ.

ఒక్క పేరా.


అలాగని ఇదేమీ రూల్‌ కాదు. సాహిత్యంలో దేనికీ రూల్స్‌ ఉండవు. ఇలాగే చేయాలీ అని దేనికీ ఉండదు. ఇవన్నీ కూడా అందాజాగా చెప్పుకోవడానికే.


వంద పేజీలు కూడా ఉండొచ్చు. పాత కాలంలో అట్లా రాసేవాళ్లు. అప్పుడు నవల సైజు వెయ్యి పేజీలుండేది. కానీ ఇప్పుడు రెండొందల పేజీల్లో నవల అయిపోతుంది. జనాల చదివే ఓపికను బట్టి కూడా అది మారిపోతుంది. మీరు ఇప్పుడు వంద పేజీల కథ రాస్తా అంటే ఎవరూ వద్దనరు.


కథల్లో రకాలు

––––––––

హాస్య కథ. డ్రామా. ట్విస్ట్‌. క్రైమ్‌. పిల్లల కథ. జానపద కథ. సస్పెన్స్‌. బ్లాక్‌ హ్యూమర్‌. సెటైర్‌.


మీకు వివరాల కంటే కూడా ఇంకో కథ చెప్తా. 


ద లేడీ ఆర్‌ ద టైగర్‌

–––––––––––––

ద లేడీ ఆర్‌ ద టైగర్‌. రచయిత: ఫ్రాంక్‌ ఆర్‌.స్టాక్‌టన్‌. 1882. అమెరికన్‌ రైటర్‌.

బార్బారిక్‌ కింగ్‌. టూ కేజెస్‌. లేడీ. టైగర్‌. శిక్షలో భాగంగా లేడీని వివాహం చేసుకోవాలి. లేదా పులికి అర్పణం కావాలి. కూతురి ప్రేమికుడు. అందులో ఉన్న అమ్మాయి మీద యువరాణికి జెలసీ. పజిల్‌ స్టోరీ.


సింపుల్‌గా మీకు నేరేట్‌ చేయడానికి పనికొచ్చేవి చెప్తున్నా. వంద పేజీల కథలు ఇట్లా ఉండవు.

ఇంకో కథ.


గుమస్తా మరణం

––––––––––

చెహోవ్‌. రష్యన్‌.


భాష, శైలి, శిల్పం

–––––––––––

భాష: స్పోకెన్‌ / రిటెన్‌ లాంగ్వేజెస్‌

మీ ప్రాంత మాండలీకాన్ని వాడుకోవడం. 

పిల్లాడి కోణంలో కథ చెప్తే ఆ పిల్లాడికి తెలిసిన భాష వరకే వాడాలి. మీకు తెలిసిన పదాలన్నీ పెట్టొద్దు. మీకు భాష వచ్చు కదా అని రాయొద్దు.

అట్లాగే ఒక పేదవాడు, చదువుకోనివాడు కథలో ఉంటే ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో అంతవరకే రాయాలి. 


మధ్యాహ్న భోజనానికి ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు. ఒక మిడిల్‌ క్లాస్, అర్బన్‌ మిడిల్‌ క్లాస్‌ అయితే అట్లాంటిది జరగడం సంభవమే. అంటే మనం చెప్పేది ఎదుటివాడు నమ్మేట్టుగా ఉండాలి.


శైలి:

ఆ రచయితకే ప్రత్యేకం.


శిల్పం:

ఫస్ట్‌ పెర్సన్‌.

సెకండ్‌ పెర్సన్‌.

థర్డ్‌ పెర్సన్‌.


కథను ఎట్లా చెబుతున్నాం. ఇందాకటి ఫారిన్‌హీట్‌(ఎ డేస్‌ వెయిట్‌) స్టోరీలో– తండ్రి ఆ కథ చెప్పినట్టుగా రాయొచ్చు. ఆ కొడుకు చెప్పినట్టుగా రాయొచ్చు. వాళ్లింట్లో ఉండే ఓ పనిమనిషి చెప్పినట్టు రాయొచ్చు. లేదా వాళ్లింట్లో కుక్క చెప్పినట్టు కూడా రాయొచ్చు. ఏం ఎందుకు రాయకూడదు? కానీ అప్పుడు ఆ కుక్క అనేదానికి దగ్గరగా మనం వెళ్లాలి. 


సాహిత్యం అనేది ఏమంటే, మనం ఒకటి చెప్పి ఎదుటివాటిని ఒప్పించడం. 

అలా లేదంటే– కథ అయితే చదవబుద్ధి కాదు.

పుస్తకం కొనుక్కుంటే విసరకొట్టబుద్ధి అవుతుంది.

సినిమా అయితే ఫ్లాప్‌ అవుతుంది.


మనమూ ఒక కథ రాద్దాం

–––––––––––––––

ఒక పేదవాడు జొమాటోలో బుక్‌ చేసుకున్నాడు అని రాయకూడదు అన్నాను. కానీ ఇదే కథ రాయకూడదా? రాయొచ్చు. అతడు ఏ బిల్డింగ్‌ పనికో పోయాడనుకుందాం, అక్కడ ఎవరో బుక్‌ చేసుకోవడం చూస్తాడు, తనకూ అట్లా తినాలని ఆశ పుడుతుంది, దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తాడు... ఇంక ఇప్పుడు.... 


ఏది సాహిత్యం అవుతుంది?

(మనలోంచి రాకుండా, మన అనుభవంలోంచి, మన ట్రూ ఎమోషన్‌లోంచి రానిదేదీ సాహిత్యం కాదు.

దిశకూ అప్లై అయ్యి, ఇంకొకరికి కాకూడదు. తేడా అర్థం చేసుకోండి.

స్పెసిఫిగ్గా ఉండాలి. అప్పుడు అది జనరలైజ్‌ అవుతుంది.


ద గిఫ్ట్‌ ఆఫ్‌ ద మ్యాజి

––––––––––––

ఓ.హెన్రీ. 1905. జిమ్‌. డెల్లా. ఆర్నమెంటల్‌ కోంబ్‌. తండ్రి నుంచి వచ్చిన వాచీకి చెయిన్‌. పరస్పరం రహస్య క్రిస్ట్‌మస్‌ బహుమతులు.


రాయడం వల్ల ఏమొస్తుంది?

––––––––––––––––

1. ఒక సమస్య నుంచి రిలీవ్‌ అయిపోతాం.

2, లార్జర్‌ పెర్‌స్పెక్టివ్‌లో విషయాన్ని చూస్తాం.

3. క్రియేటివ్‌ ప్లెజర్‌.

4. ఆటో బయాగ్రఫీ.

5. ఇంకా ఏంటంటే– రాస్తే మీ ఆలోచనలు ఒక పర్ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తాయి. మీ వేగ్‌ థాట్స్‌ ఒక క్రమబద్ధీకరణ జరగుతుంది.

6. ఇంకో ఆనందం ఏమిటంటే– మీరు రాస్తూ కూర్చున్నప్పుడు వాటికవే కొన్ని ఆలోచనలు తన్నుకుని వస్తాయి. అవి మన లోపల ఉన్నట్టు మనక్కూడా తెలియదు. అదొక మ్యాజిక్‌.

7. ఉన్న జీవితాన్ని మరింత అందంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి సాహిత్యం పనికొస్తుంది.


బాగా రాయాలంటే ఏం చేయాలి?

––––––––––––––––––––

రాయడానికి చదవడం ఒక్కటే దారి. ఎంత చదివితే అంత తెలుస్తుంది.


నేను ఎట్లా రాస్తాను?

–––––––––––––

1. ఆలోచన రాగానే ఇట్లా నోటుబుక్కులో(నా పాకెట్‌ నోట్స్‌) రాసుకుంటాను.

2. రియాలిటీ అనేది బట్ట అనుకుంటే, దానికి నా ఊహతో కుట్లు వేస్తాను.

3. చీకట్లో హెడ్‌లైట్‌ వేసుకుని చేసే ప్రయాణం లాంటిది. దానితోపాటే మనమూ ప్రయాణిస్తాం. మనక్కూడా అప్పుడే తెలుస్తుంటుంది, తొవ్వ.

4. మన పెర్సనాలిటీ కలుపుకొని ఒక పాత్రను సృష్టిస్తాం. ఒక్కోసారి రెండు మూడింటిని కలిపి సృష్టిస్తాం.


నాకోసం ఒక ఎక్సర్‌సైజ్‌

––––––––––––––

ఈత గురించి మీకు ఎంత చెప్పినా ఈత రాదు. నీళ్లలోకి దిగితేనే ఈత వస్తుంది.

రాయడం బద్దకం. సినిమా చూస్తే చేరగిలబడి చూడటం లాంటిది కాదు. దిగాలి. పని. పెయిన్‌. కాని రాసింది చూసుకుంటే ఆనందం వస్తుంది. కాబట్టి రాయాలి.


క్లుప్తత:

50 పదాలు – 500 పదాలు

ఏది రాసినా దానికదే కేంద్రకం ఉండాలి.

అమీబా తెలుసుగా...ద్విదా విచ్ఛిత్తి... ఎన్నిసార్లు విడిపోయినా ప్రతిదీ ఒక పరిపూర్ణమైన జీవి కదా...

అట్లా మీరు రాసేది కూడా ఎంత నిడివితో అయినా అంతే ప్రాణంతో ఉండాలి.


మా పెద్దాడు– చిన్నప్పుడు ఏదీ తింటా అనడు. 

ఉప్మా.

ఆ పల్లీలు

ఆ వాసన

నెమ్మదిగా అందులోకి దిగుతాడు.

మీరు కూడా తెల్లకాగితం ముందుపెట్టుకుని కూర్చోండి. మీకు మీరు హిప్నటైజ్‌ చేసుకోండి...

Wednesday, November 22, 2023

ఉండకూడని స్పేస్‌







పేపర్లో ఒక వెబ్‌ సిరీస్‌ గురించిన ఫుల్‌ పేజీ యాడ్‌ కనబడింది (21-11-2023). పోస్ట్‌ ఆ సిరీస్‌ గురించి కాదు. దాని వంకన ఒక దోషం గురించి మాట్లాడుదామని. ఆ ప్రకటనలో ఇలా ఉంది:
బుధవారం నుంచి వెజాగ్‌ ని వణికిస్తున్న అంతుచిక్కని హత్యలు
ఇక్కడ వైజాగ్, ని మధ్యన స్పేస్‌ ఉండకూడదు. కానీ కలిపి రాస్తే వైజాగ్ని అయిపోతుంది. అందుకే స్పేస్‌ ఇవ్వడం ద్వారా దాన్ని మేనేజ్‌ చేసివుంటారు. చాలామంది పెట్టే ఎఫ్బీ పోస్టుల్లో కూడా దీన్ని గమనించాను. మనోహర్‌ కు, రాజస్థాన్‌ లో, కంప్యూటర్‌ తో... నకారంతో ముగిసే పదాలు వచ్చినప్పుడే ఈ సమస్య వస్తోంది. విషయాన్ని బట్టి ఫ్లోలో పెద్ద ఇబ్బందిగా ఉండదు గానీ, మరీ కొట్టొచ్చినట్టు కనబడితే బాగోదు. అది పక్కనపెడితే, అట్లా ఉండకూడదు కదా! సరిగ్గా అతుకు పడనట్టుగా రాయడం భాషా దోషమే.
నేనైతే పాత తెలుగు పద్ధతిలో వైజాగును, రాజస్థానులో, కంప్యూటరుతో అని రాయడం ద్వారా ఈ దోషాన్ని అధిగమించేవాడిని. కానీ అన్నిసార్లూ అలా కుదరదు. నామవాచకాలు యథాతథంగా రాస్తేనే బాగుంటుంది. ఈ సమస్య నాకు మొబైల్‌ ఫోన్లో చేసే టైపింగుకు మాత్రమే వస్తుంది. ఆఫీసు సాఫ్ట్‌వేర్‌లో ఈ ఇబ్బంది లేదు. కొందరు, రెండింటి మధ్యా క్యారట్ (^) వాడతారు. కొంత నయం. అప్పుడు అది వైజాగ్‌^ని అవుతుంది. కానీ సమస్య అలాగే ఉంది.
ఇంత సాఫ్ట్‌వేర్‌ తయారుచేసినవాళ్లు ఈ దోషాన్ని ఎలా వదిలేసివుంటారు అని చాలాసార్లు అనుకున్నాను. అందుకే ఒకరోజు మొబైల్‌ కీ–ప్యాడ్‌ను కిందికీ, మీదికీ గాలించి, ఈ కీ(ఫొటో చూడండి) పట్టుకున్నాను. ఈ కీయే ఆ సమస్యకు కీ అన్నమాట! ఇది చాలామందికి తెలిసేవుండొచ్చు. నాకైతే అదొక యురేకా మూమెంట్‌! రాయాల్సిన పదం(వైజాగ్‌) రాసి, ఈ కీ నొక్కి, తర్వాతిది (ని) రాస్తే– ఆ పదం వైజాగ్ని అని కలిసిపోకుండా, వైజాగ్‌ని అవుతుంది.
(నేనైతే వైజాగ్‌ని అనకుండా, వైజాగ్‌ను అని రాస్తాను. అదింకో చర్చ. మనోహర్‌ని–మనోహర్‌ను; రాజస్థాన్‌ని–రాజస్థాన్‌ను; చిరంజీవిను అనకపోతే చాలు.)

Monday, November 20, 2023

కన్నడ వాన





నా ‘నగరంలో వాన’ కన్నడ అనువాదం, మయూర కన్నడ మంత్లీ 2018 డిసెంబర్‌ సంచికలో ప్రచురితమైంది. ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సంకలనంలోంచి దీన్ని అనువదించినవారు జగదీశ్‌ చంద్ర బాగ్లి. ఖదీర్‌బాబు గారి సంపాదకత్వంలో కృష్ణమోహన్‌బాబు గారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని కువెంపు భాషాభారతి ప్రాధికార సంస్థ మొత్తంగా కన్నడంలోకి అనువదించే పని చేపట్టింది. అయితే జగదీశ్‌ గారు తన చొరవ కొద్దీ దాన్ని మయూరకు కూడా ఇచ్చారు. ఈ మాసపత్రికను నేను ఎలా రిలేట్‌ చేసుకోగలనా అని చూస్తే, పి.లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి లాంటివాళ్లు దానికి ఒకప్పుడు సంపాదకులుగా పనిచేశారని వికీ చెబుతోంది. ఇక కన్నడ అక్షరాల్లో ఉన్న నా పేరును మా పిల్లలిద్దరు కూడా పోల్చుకోగలగడం అదనపు సంతోషం.

Saturday, November 18, 2023

ఎందరో మహానుభావులు

 


పీవీ సతీశ్ (ఈ పొటో నెట్లోంచి తీసుకున్నది)


ధాన్యాగారం


లక్ష్మమ్మ


కొర్ర


సజ్జ


రాగి


అరికె


పులిచింత


గుంట గలగర







తెల్లాపూర్ ప్రదర్శన


ఎందరో మహానుభావులు

––––––––––––––––
పీవీ సతీశ్‌ గారు పోయారని తెలిసింది (2023 మార్చి 19). ఆయన్ని రెండుసార్లు చూశాను. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) తరఫున తినదగిన ‘కలుపు’ మొక్కల గురించిన ఒక అవగాహనా కార్యక్రమాన్ని జహీరాబాద్‌ దగ్గరి పస్తాపూర్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసి, బస్సులు పెట్టారు. నేను మా ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. అక్కడ పనిచేస్తున్న గ్రామీణ మహిళలతో చేన్లలోనే మాట్లాడుతూ, సాధారణంగా మనం కలుపు అని తీసివేసే ఎన్నింటిని నిజానికి తినవచ్చో ప్రత్యక్షంగా చూపించే కార్యక్రమం అది. దానికి తగినట్టుగానే ఆ రోజు మధ్యాహ్న భోజనం ఆ ఆకుకూరలతోనే అద్భుతంగా వడ్డించారు. వాళ్ల ఉద్దేశంలో కలుపు అనేది లేదు. అవి వైల్డ్‌ ప్లాంట్స్‌ లేదా సాగుచేయని మొక్కలు మాత్రమే. చిన్నప్పటినుంచీ బతుకమ్మలో పువ్వుగా ఉపయోగించే గునుగు లేత ఆకుల్ని కూడా కూరగా వండుకోవచ్చని అంతకుముందు నాకు తెలీదు. ఇదే గునుగుకు కవలలా అనిపించే జొన్న చెంచలి అత్యంత పోషక పదార్థాలున్న వైల్డ్‌ ప్లాంట్‌ అని వాళ్ల పరిశోధనలో తేలిందన్నారు. వంటలు, ఇతర ప్రదర్శన ఏర్పాటుచేసిన ఆ ప్రదేశం కూడా సింపుల్‌గా, కళాత్మకంగా ఉంటుంది. అది నాకు ఎంత నచ్చిందంటే, నా యూట్యూబ్‌ ఛానల్‌కు పెట్టుకున్న కవర్‌ ఫొటో అక్కడ తీసుకున్నదే. ఆ రోజంతా కార్యక్రమాలు ముగిసిపోయాక, మళ్లీ తిరుగు ప్రయాణంలో హెడ్‌ ఆఫీసు దగ్గర కాసేపు ఆగాం. అప్పుడు సతీశ్‌ గారు మాతో పిచ్చాపాటీలాగే కానీ చాలా మంచి విషయాలు మాట్లాడారు.
డీడీఎస్‌ లక్ష్యాలు నాకు ఆసక్తికరమైనవి. పర్యావరణ హిత పంటలు పండించడం, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ఆహార వైవిధ్యాన్ని గుర్తించడం, సహజ విత్తనాలను కాపాడటం, జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్ట పంటలతో ఆర్థిక స్వావలంబన కలిగించడం. గ్రామీణ మహిళల మహిళల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడటం లాంటివి వారి కార్యకలాపాలు. ఆ మహిళలే వాళ్ల కమ్యూనిటీ రేడియో నడుపుతారు. డీడీఎస్‌ లాగే సతీశ్‌ గారి కెరియర్‌ కూడా ఆసక్తికరమే, 1990ల మొదట్లో డీడీఎస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన కీలక పనుల్లో ఉన్నారు.
‘ఆకుకూరల పండుగ’ అవగాహనతో తర్వాత్తర్వాత మేము మా ఇంట్లో జొన్న చెంచలి, గునుగుతో పాటు, బంకంటి, ఎన్నాద్రి, గుంట గలగర, గలిజేరు, పులిచింత లాంటి ఆకుకూరల్ని వండటం మొదలుపెట్టాం. అంటే ఎప్పుడైనా నగర శివార్లు దాటినప్పుడు, ‘అరే ఇది తగరంచ కూర కదా, పనికొస్తుంది’ అని ఆత్రంగా తెంపుకొచ్చేవాడినన్నమాట! తెంపుకొచ్చేవాడిని అంటే, ఇప్పుడు చేయట్లేదా అంటే– ఆ ఉడుకు కొంచెం తగ్గింది.
మళ్లీ రెండోసారి ఆయన్ని ఇదే డీడీఎస్‌ వాళ్లు తెల్లాపూర్‌లో ఇవే సాగుచేయని ఆకుకూరలతో భోజనం, అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేసినప్పుడు చూశాను. ఆయన మాట్లాడుతుంటే తెలంగాణవాడు కాదని తెలిసిపోతుంది(కర్ణాటక పెద్దమనిషి). కానీ పాత తెలంగాణ యాస ఒకటి ఆయన నోట చిత్రంగా పలుకుతుంది. బహుశా దశాబ్దాలుగా పల్లీయులతో మమేకం కావడం వల్ల ఒంటబట్టిన భాష అయివుండాలి.
నిజానికి ఈ సాగుచేయని ఆకుకూరలు అనేవి డీడీఎస్‌ వల్ల నాకు అందిన ఒక పార్శ్వం మాత్రమే. రోజువారీ బియ్యానికి ప్రత్యామ్నాయ ఆహారం గురించిన ఆలోచన చేస్తున్నప్పుడు– అంబటి సురేంద్రరాజు గారు ఈ డీడీఎస్‌ గురించి మొదటిసారి చెప్పారు. అసలు వందల ఎకరాల్లో గ్రామీణ స్త్రీలు మెట్టపంటలు పండిస్తున్నారన్న విషయం నన్ను ఎక్సయిట్‌ చేసింది. వ్యవసాయం, ఆహారం గురించి చాలా విషయాలు పంచుకునే పంతంగి రాంబాబు గారు డీడీఎస్‌ దగ్గరికి వెళ్లేలా పురిగొల్పారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో కనబడి ఉత్తేజితం చేసే ‘యవలు’ మొదటిసారి బేగంపేటలోని డీడీఎస్‌ స్టోర్‌లోనే చూశాను. చూడ్డానికి పొడువు రకం గోధుమల్లా ఉంటాయివి.
కేవలం స్టోర్‌ నుంచి తెచ్చుకుని ఏదో వండుకోవడం కాకుండా, వాటిని మా ఊళ్లోనే పండించాలని అనుకుని– అంటే ఈ ఆకుకూరల పండుగలన్నింటికన్నా చాలా ముందు– పస్తాపూర్‌ వెళ్లి చిరుధాన్యాల విత్తనాలను సంపాదించాను. ప్రతిచోటికీ కలిసి తిరిగే అజయ్‌ ప్రసాద్‌ తానూ వస్తానని నా వెంట వచ్చాడప్పుడు. ఝరాసంగం పర్యటన అని మాకు మేము చెప్పుకొంటాం దాని గురించి. మా ఆసక్తికి ముచ్చటపడి, ఆ విత్తనాలను ఆ పెద్ద నిల్వ చేసిన కాగుల్లోంచి తోడి ఇచ్చింది లక్ష్మమ్మ. అప్పుడు తెచ్చిన సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊదల్ని మా ఊళ్లో వేశాం. మా ఊళ్లో చాలామంది ఆసక్తికి కారణమవుతూ కొన్నేళ్లు వరుసగా పండించాం. కానీ మానవ ప్రయత్నం చాలా ఎక్కువ. అన్నీ మాన్యువల్‌గానే చేయాలి. విస్తారంగా అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ ప్రాసెస్‌ కొంత సుళువవుతుంది. (తర్వాత ఖాదర్‌వలీ గారు రంగప్రవేశం చేయడం, ఆయన ఐదింటిని– కొర్ర, అండుకొర్ర, అరికె, సామ, ఊద– ప్రత్యేకంగా చిరుధాన్యాలుగా నామకరణం చేయడం తర్వాతి సంగతి. ఈ స్ఫూర్తితో డీడీఎస్‌ దగ్గర లేని అరికలు, అండుకొర్రలు కూడా విడిగా సంపాదించి పండించాను. అరికలను రాజేంద్ర నగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ సురేశ్‌ గారు ఇచ్చారు. అండుకొర్రల్ని రాంబాబు గారు కడప నుంచి సంపాదించి ఇచ్చారు.)
పీవీ సతీశ్‌ గురించి మొదలుపెట్టి నేను చాలామంది పేర్లు తలుస్తున్నానని తెలుసు. అంటే ఏ ఒక్కరో మన ప్రపంచాన్ని విస్తృతపరచరు. ఉదాహరణకు నేల ఉసిరి, తుమ్మికూర, అటకమామిడి గురించి నేను మొదటిసారి నామిని దగ్గర విన్నాను. నిజానికి ఇదంతా మనకు పరంపరగా రావాల్సిన జ్ఞానం. కానీ ఎక్కడో లంకె తెగిపోయింది. దాన్ని తిరిగి ముడివేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించి చాలా విలువైనవాళ్లు. అందులో డీడీఎస్‌ వ్యవస్థాపకుడిగా పీవీ సతీశ్‌ మొదటి వరుసలో ఉంటారు.

21-3-2023

Friday, November 17, 2023

బాదాం పూత


బాదాంచెట్టు అనేది ఒకటి ఉంటుందని నాకు చాలా ఏళ్ల దాకా తెలీదు. అలాంటిది ఐదారేళ్ల కింద మా పొలంకాన్నే దీన్ని నాటాము. మా ‘వెళ్లిపోవాలి’ సినిమా చూసివుంటే, నేను పొలంకాడికి వెళ్లి తాకిన చెట్టు ఇదే అని గమనించివుంటారు. దీని పూత ఎంత అందంగా ఉంటుందో!
 
11-4-2023


 

Thursday, November 16, 2023

Liberal idealism...


Liberal idealism and liberal idealists are possible only in Russia. Mr. Verkhovensky, like every witty man, needed an audience, and he also had to feel that he fulfilled a supreme duty by spreading ideas through his words.

-Fyodor Dostoyevsky
(The Possessed)

Wednesday, November 15, 2023

మర్రి పండ్లు

 


మా కొజ్జిప్ప కాడి పొలంలో తీసుకున్న ఫొటో (5 మే 2023) ఇది. మర్రిపండ్లను తినొచ్చని చాలామందికి తెలీదు. పక్వానికొస్తే రంగు మారుతాయి. కానీ చూడటానికి ఈ రంగు బాగుంటుంది.
 



Tuesday, November 14, 2023

రోజూ కనబడే (లేదా కనబడని) పూలు.

 (ఆ మధ్య మా ఊరికి పోయినప్పుడు (జూలై 2023), పొద్దుపొద్దున్నే ఇంటి వెనకాల తిరుగుతుంటే, ముందు బెండ పువ్వు ముద్దుగా ఉందికదా అనిపించింది. తర్వాత ఒక్కొక్కటీ వాటివైన అందంతో దర్శనమిచ్చాయి. ఇక, అన్నింటినీ ఫొటోలు తీశాను. ఒక్క చింత పువ్వు మాత్రం మా పెరట్లో ఉన్న చెట్టుది.)

 


బెండ


దొండ


కాకర


సొర / ఆనిగెపు



వంకాయ


బబ్బెర


చింత


ఆముదం


తుమ్మి కూర


చుక్క కూర


10-7-2023


























Monday, November 13, 2023

ఒక మీమ్‌...

 



(రియాలిటీ చెక్‌ పుస్తకం మీద తన అభిమానం తెలిసేలా ‘తెలుగు కలెక్టివ్‌’ ఆదిత్య అన్నావఝల ఈ మీమ్‌ పోస్ట్‌ చేశాడు. అది ఇక్కడ:)

 10-9-2023


Sunday, November 12, 2023

మార్సెల్‌ ప్రూస్ట్‌

 



కాలాన్ని గెలిచినవాడు


గతం అనేది ఎక్కడుంది? గతంలో జీవించిన మనుషులు కాలపు పొరల్లో ఎక్కడ చిక్కుకుని ఉన్నారు? గతపు సంఘటనలు ఏ కాలగర్భంలో వెచ్చగా దాగి ఉన్నాయి? గతపు ఆలంబన అంటూ లేకపోతే మనిషికి వర్తమానంలో ఉన్నదేమిటి? గతం అనేది మనిషి యావజ్జీవితపు ధ్రువపత్రం. కానీ గతాన్ని వర్తమానంలోకి లాగే మంత్రదండం ఎక్కడుంది? జ్ఞాపకం ద్వారా మాత్రమే గతాన్ని చైతన్యవంతం చేయగలం. కానీ ఆ జ్ఞాపకం స్వచ్ఛందంగా మనసు లోకి దూకాలి. అలా దూకాలంటే ఇంద్రియాలను ఏదో కదిలించాలి. అది ‘బలమైనదే’ కానక్కరలేదు. బలంగా ముద్ర వేసినదైతే చాలు. అనుకోకుండా ఒక చలికాలం పూట వెచ్చదనం కోసం అమ్మ ఇచ్చిన టీ కప్పులో ‘మడలీన్‌’ అనే చిన్న గుండ్రపాటి కేకును అద్దుకోగానే, ఆ మొదటి రుచి అంగిలికి తాకగానే, ఎప్పుడో చిన్నతనంలో తాము నివసించిన ‘కోంబ్రే’లో అనుభవించిన అదే రుచి మార్సెల్‌ ప్రూస్ట్‌కు చప్పున గుర్తొస్తుంది. ఆ వెనువెంటనే బాల్యంలో తిరగాడిన ఆ ఊరు, ఆ మనుషుల తాలూకు జ్ఞాపకాలు జలజలా రాలుతాయి. ఇక కాలంలో వెనక్కి ఈదుకుంటూ వాళ్ల కుటుంబీకుల పుట్టుపూర్వోత్తరాలు ఏకధారగా వల్లెవేయడానికి కూర్చుంటాడు. అలా గతాన్ని స్వగతంగా మార్చుకోవడం ద్వారా ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విస్తారమైన ఆత్మకథాత్మక నవలారాజం ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’ సాహిత్యలోకానికి అందింది. సుమారు నాలుగు వేల పేజీలున్న ఈ నవల 1913 నుంచి 1927 మధ్య ఏడు భాగాలుగా ప్రచురితమైంది.

ఏ రచయితకైనా గతమే పెట్టుబడి. కానీ ప్రత్యేకించి ఆ గతంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించడంలోనే ప్రూస్ట్‌ రచనా వైభవం దాగివుంది. కాలం అనే విధ్వంసక శక్తిని కళ అనే సాధనంతో ఆయన ఎదుర్కొన్నాడు. కాలంలో కలిసిపోయిన వారిని సాహిత్యం ఊతంగా సజీవ మూర్తులుగా నిలబెట్టాడు. సమకాలీన ఫ్రెంచ్‌ సమాజపు రీతులు, బాధలు, భయాలు, తపనలు, ఒంటరితనాలు, సరదాలు, సంతోషాలు, నిర్దయలు, క్షమలు, ఇంకా ఆయన సంక్లిష్ట లైంగికేచ్ఛలు అన్నీ అక్షరాల్లోకి తెచ్చాడు. కిటికీలోంచి సముద్రం మీద కనబడే సూర్యోదయాన్ని చూస్తూ అనుభవించే తన్మయత్వంలా రాతను మలిచాడు. చరిత్రకారుడు, తాత్వికుడు, మానసిక శాస్త్రజ్ఞుడు, రాజకీయాంశాల వ్యాఖ్యాత, ఇంకా ‘పర్వెర్టు’, ఇంకా ఒక కవి– ఇలా ఆరుగురు ప్రూస్టులు ఇందులో కనబడతారంటారు ఆడమ్‌ గోప్నిక్‌. సంగీతం, సాహిత్యం, యుద్ధం, సమాజం, పెయింటింగ్, శృంగారం, కళలు, అసూయ, ఫ్యాషన్లు– ఇలా ప్రూస్ట్‌ అభిప్రాయానికి చిక్కకుండా మిగిలిపోయేది ఏదీ ఉండదు. ‘తన జీవితపు మెటీరియల్‌ను ఇంత బాగా ఏ రచయితా వాడుకోలేదు’ అంటారు టెన్నెస్సీ విలియమ్స్‌. ‘ఒక రచయిత ఒకసారి చదివితే పూర్తయ్యేట్టయితే ఆ రచయిత పెద్దగా ఏమీ చెప్పనట్టు. హోమర్‌లాగా జీవితకాలం వెంటతెచ్చుకోగలిగే రచయిత ప్రూస్ట్‌’ అంటారు డేనియల్‌ మెండెల్‌సన్‌.

కలిగిన ఫ్రెంచ్‌–యూదు కుటుంబంలో పుట్టాడు మార్సెల్‌ ప్రూస్ట్‌ (10 జూలై 1871– 18 నవంబర్‌ 1922). ఐఫిల్‌ టవర్‌ను నిర్మించిన ఇంజినీర్‌ గుస్తావ్‌ ఐఫిల్‌... ప్రూస్టులకు సన్నిహితుడు. తొమ్మిదో ఏట నుంచే ప్రూస్టుకు ఉబ్బసంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలుండేవి. పారిస్‌ ఉన్నత సమాజంలో ముందు కలియ తిరిగినప్పటికీ రానురానూ ఏకాంతంలోకి వెళ్లిపోయాడు. బయటి నుంచి వచ్చే పెద్ద శబ్దాలను కూడా భరించేవాడు కాదు. హైపర్‌ సెన్సిటివ్‌. అందుకే పగలు పడుకొని రాత్రుళ్లు రాయడం అలవాటు చేసుకున్నాడు. ‘నిశాచర సరస్వతి!’. కల్పనతో కూడిన తన ఆత్మకథలోని మొదటి భాగమైన ‘స్వాన్స్‌ వే’ను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. దాంతో సొంత డబ్బుతో అచ్చు వేయించుకున్నాడు. దాన్ని తిరస్కరించినవారిలో అప్పటి ప్రఖ్యాత రచయిత ఆంద్రే గిదె కూడా ఒకరు. ‘నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద తప్పిదం’ అని ఆయన తర్వాత పశ్చాత్తాపపడ్డారు. తన మృత్యువు సమీపంలో ఉందని ప్రూస్ట్‌కు తెలుసు. తన రచన ఎక్కడ పూర్తవ్వదో అనే ఆందోళన ఉండేది. నాలుగు భాగాలు ప్రూస్ట్‌ బతికి ఉన్నప్పుడే వచ్చాయి. ఆయన రాసుకున్న డ్రాఫ్టుల ఆధారంగా తర్వాతి మూడు భాగాలు ఆయన తమ్ముడు రాబర్ట్‌ ప్రూస్ట్, రచయిత జాక్వెస్‌ రివియేరీ సంపాదకులుగా వచ్చాయి. ఇందులో ఐదో భాగం అయిన ‘ద ప్రిజనర్‌’ సరిగ్గా నూరేళ్ల కింద 1923లో వచ్చింది. ఇది అనారోగ్యంతో ప్రూస్ట్‌ చనిపోయాక విడుదలైన మొదటి భాగం.

ఇప్పుడు ఆంగ్లంలో ప్రామాణిక అనువాదంగా పరిగణిస్తున్నది బ్రిటన్‌ అయిన సి.కె.స్కాట్‌ మాంక్రీఫ్‌ చేసినది. ఆయన పెట్టిన పేరు ‘రిమెంబ్రన్స్‌ ఆఫ్‌ థింగ్స్‌ పాస్ట్‌’. చాలా ఏళ్లు ఈ పేరుతోనే వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ఈ అనువాదానికి తర్వాత మెరుగులు దిద్దినవారిలో ఒకరైన డి.జె.ఎన్‌రైట్‌ నవల పేరును ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’గా మార్చారు. ఈ శీర్షికే ప్రూస్ట్‌ మానసిక ప్రపంచానికి దగ్గరగా ఉండి, స్థిరపడిపోయింది. ప్రూస్ట్‌ ఇల్లియర్స్‌ అనే చోట తన చిన్నతనం గడిపాడు. దాని ఆధారంగానే ‘కోంబ్రీ’ని సృష్టించాడు. 1971లో ప్రూస్ట్‌ శతాబ్ది సందర్భంగా దానికి ‘ఇల్లియర్స్‌–కోంబ్రీ’గా నామకరణం చేసి రచయిత పట్ల గౌరవం చాటుకున్నారు. జీవితం లోంచి సాహిత్యంలోకి వచ్చిన పేరు, మళ్లీ సాహిత్యం లోంచి జీవితంలోకి వచ్చింది. ఒక కొత్త మనిషిని అర్థం చేసుకోవడానికి పాత్రికేయులు ‘ప్రూస్ట్‌ ప్రశ్నావళి’(ప్రూస్ట్‌ క్వశ్చనెయిర్‌) అని అడుగుతుంటారు. మన జీవితానికి దగ్గరగా వెళ్లాలంటే– నేనెవరు? ఈ జీవితంతో ఏం చేసుకోవాలి? అనే ప్రశ్నలను అన్వేషిస్తూ జీవిత సాగరాన్ని అన్వేషించిన ప్రూస్టియన్‌ ప్రపంచంలోకి వెళ్లాలి.

Saturday, November 11, 2023

‘ఐదేళ్ల స్నేహమట...’


(ఫేస్‌బుక్‌లో ఐదేళ్ల స్నేహం అని మొన్న అక్టోబర్‌ 24న (2023) రిమైండర్‌ వచ్చినప్పుడు, దాన్ని తలుచుకుంటూనే, ‘మధుపం’ పుస్తకం మీద తన అభిప్రాయం రాశారు మానస చామర్తి. దాన్ని నేను ఈ బ్లాగులో తలుచుకుంటున్నాను.)


ఐదేళ్ళ స్నేహమట రాజిరెడ్డి గారూ! :)) ఐదుసార్లైనా మాట్లాడుకోకపోతిరి అని వెక్కిరిస్తోంది ఎఫ్.బి.

😜
*

పెళ్ళి అనేది రోజువారీ పోరు, నిరంతర మైత్రి అంటాడు రాజిరెడ్డి. "ఈ మనిషి కచ్చితంగా మనకోసమే పుట్టిందన్నంత నమ్మకం కలుగుతుంది; ఇంకోసారి పోయిపోయి ఈమె బారిన పడ్డామే అన్నంత వేదన వస్తుంది" అని రాశాడు మధుపం మొదటి పేజీలోనే. వార్నీ, ఇట్లాంటి మాటలు ఆడవాళ్ళ దగ్గర కదా విన్నాను అని చిన్న నవ్వొచ్చి వాలింది నా పెదాల మీద. నిజమే, మగవాడి ఫీలింగ్స్ అంత ఫిల్టర్స్ లేకుండా తెలిసే వీలేదీ? "మధుపం" నా చేతుల్లో పడబట్టి కానీ. ఇంతకీ నవ్వుకున్నాను అంటే, అదేమీ బిగ్గరగా నవ్వుకునే హాస్యం కాదు. అందరితో చకచకా పైకి చదువుకు పంచుకు చెప్పుకునేదీ కాదు.

రాజిరెడ్డి రాతల సరంజామా అంతా నీదీ నాదీ కూడా అయినా సంసారి జీవితం. ఎవరికి వాళ్ళమే ఎక్కడో ఓ చోట తారసపడతాం. ఆ ఫీలింగ్ బాగుంటుంది. కన్వీనియంట్‌గా మర్చిపోయే చిరాకు క్షణాలు కొన్నింటిని రాజిరెడ్డి రహస్యంగా ఫైల్ చేసి పెట్టాడు అనుకుంటే ఉన్నట్టుండి బ్రతుకు మీద కొత్త జాగ్రత్త మొదలవుతుంది. మూతివిరుపూ, నవ్వూ, చీర కట్టు, ఆఖరికి తన క్రాఫ్‌లో కదలాడే వేళ్ళ స్పర్శకు నెమ్మదించే తలనొప్పి కూడా ఒద్దికగా ఒక రెప్పచాటున రికార్డ్ అవుతోందనుకుంటే, రెపరెపలాడే గర్వం తోడుగా కొంత జాగ్రత్త, ఇంకొంచం ప్రేమా - నిజమా, కాదా?! తా వలచింది రంభ అయినా కూడా అందం కన్నా ఆమ్లెట్ కే ఎక్కువ మార్కులు అనుకునే లౌక్యాన్ని మగాడిలో చూసీ చూడనట్టు పోవడం ఆడవాళ్ళకేం సమస్య కాదు కానీ, రాత్రి వేళ మెతుకు మెతుకూ రుచి చూసుకుంటూ తినే మొగుడిని "కానీయ్..గిన్నెలు సర్దాలి" అనే పెళ్ళాం గొంతులోని విసుగు రంపంలా కోస్తుందంటే ఏమిటోగా ఉండదా! అమ్మాయిలు సీతాకోకలేమోలే కానీ కందిరీగలు అనకూడదా? అని ఎదురొచ్చి నిలదీస్తే సమాధానం దొరకబుచ్చుకోవడానికి సమయం కావాలా అక్కర్లేదా!

చూపూ చూపూ కలిపి కవ్వించే ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గుర్తుపట్టి, వాళ్ళ అటెన్షన్ సీకింగ్ అర్థమైపోయిందనే మగవాళ్ళ వాలకం ఆడవాళ్ళకి గాభరా పుట్టించేస్తుంది. స్నేహితుడు ప్రాణాలడిగితే ఇచ్చేస్తాను కానీ పది రూపాయలంటేనే గుంజాటన మొదలవుతుందనే మధ్యతరగతి మొగుడి వాలకానికి అయ్యో రామా అనుకుంటుందేమో కానీ, నెలలో వారాలు గడిచేకొద్దీ బడ్జెట్ కి తగ్గట్టు జీవితాన్ని మలుపులు తిప్పుకుని కుటుంబాన్ని హత్తుకు పడుకునే వాణ్ణి ప్రేమించకుండానూ ఉండలేదు. అయినా అవన్నీ తెలిసే హత్తుకుంటారు వాళ్ళు, మధుపం చెప్పింది.

ఇన్ని రహస్యాలు తెలిసినవాడికి, కుతూహలం పోవడమే నిరాసక్తతకు కారణం అని కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. అట్లాంటివాడు మరిక స్త్రీని ఎన్ని మాయలైనా చెయ్యగలడు. ఆమెకి ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు. రాత్రి పూట తన చేత్తో భోంచేసి ఎన్నాళ్ళైందో అనుకుంటూనే, పెళ్ళాం అంటే కోడెలేగ పొగరణచడానికి దాని మెళ్ళో కట్టే లెంకపీట లాంటిదని కూడా అనగలడు. సరే ఎన్ని అన్నా ఇంటికి రావడానికి ఒక కారణంగా కనపడే ఆమె వంటి విరుపు, టాటా చెప్పే పిల్లాడి కంటి మెరుపు చాలనుకునే సంసారిని మెచ్చకుండా ఎట్లా! "పెళ్ళి మోసపురాణమే కానీ, ఆ మోసంలో అందం ఉంది, ఆకర్షణ ఉంది, ఇష్టం ఉంది, స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన వాళ్ళమన్న గమనింపు ఉంది, ఏదోలా కాపురాన్ని సౌఖ్యంగా మలచుకోవాలన్న తహ తహ ఉంది..." అని కన్ఫెస్ చేశాక ఇక ఇలా ఎందుకన్నావ్ అని పోట్లాడేందుకేముంది? నిన్న పెట్టుకున్న నాగుపాము బొట్టుకూ, ఇవ్వాళ్టి దోసగింజ తిలకానికీ తేడా గుర్తించగల బ్రహ్మచారి చూపు సంసారంలో పడ్డాక కూడా ఎక్కడో నక్కి ఉంటుందనుకోవడంలోనే ఉంది బ్రతుకులోని "తీయ తేనియ బరువు"! ఈ రాజిరెడ్డి అలా కాదే! ఉందనో లేదనో అనడు. ఉందో లేదో అన్న గుంజాటన వీడడు. "సాహిత్యానికి చిక్కని క్షణాలు" పేజీల నిండుగా పరిచి, వెదుక్కుంటున్నది ఉందో లేదో వేయి వైపుల నుండి లెక్కలేసి చూసుకుని చూపిస్తాడా, దాని లెక్క తేల్చడం ఆషామాషీ వ్యవహారమేం కాదు.

24-10-2023

Friday, November 3, 2023

గోల్డ్‌ మెడల్‌






1992–93: నా పేరూ, 528 మార్కులతో సెకండొచ్చిన మా సత్యంగాడి పేరూ 
మా స్కూల్లోని బోర్డు మీద చూడొచ్చు.



పదో తరగతి ఫొటో
 


మొన్న బతుకమ్మ పండక్కి ఊరెళ్లినప్పుడు, పిల్లల దగ్గర నా ఘనతను చాటుకుందామని, ఇంట్లో భద్రంగా ఉన్న దీన్ని బయటికి తీయడమైనది. చూస్తే దీనిమీద నా పేరు కూడా ఉందని గమనించాను. ఈ పదీ ఇరవై ఏళ్లలో మళ్లీ చూసింది లేదు. టెన్తులో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినందుకు మా కీసరగుట్ట రెసిడెన్షియల్‌ స్కూల్లో ఇచ్చారు. మేడ్చల్‌ లయన్స్‌ క్లబ్‌ వాళ్లు ప్రదానం చేశారు. టెన్తు హాల్‌టికెట్‌ కోసం వేములవాడలో ఫొటోలు తీసుకున్నప్పుడు, అవి బాగా వచ్చాయని స్టూడియో ఆయన ఊరించాడు. అయితే అది పేపర్ల పడుతది కావచ్చు, అని మా బాపు మురిసిపోయాడు. పడలేదులేగానీ 533 మార్కులు వచ్చాయి. అప్పుడు స్టేట్‌ (ఉమ్మడి ఏపీ) ఫస్ట్‌ ర్యాంకర్‌ మార్కులు 556. అటూ ఇటూ తిప్పుతూ, 1993–2023 అంటే సరిగ్గా ముప్పై ఏళ్లయిందని బాపు గుర్తుచేశాడు. బంగారు పతకం ఏమోగానీ, మాయమైన బంగారం లాంటి వయసు మీదకు నా ఆలోచన పోయింది.


(31 అక్టోబర్‌ నాటి ఎఫ్బీ పోస్ట్‌)