Monday, June 8, 2020

కొన్ని ఇంగ్లీషు ఆలోచనలు

(ఇది సరిగ్గా గతేడాది మే నెలలో రాసుకున్నది. ఇందులోని చాలా పాయింట్స్ మీద చర్చ జరిగింది; ఇంక మళ్లీ పునరుక్తి అవసరమా అనిపించిందప్పుడు. కానీ నా ఆలోచనా ధారను ఒక కొలిక్కి తెచ్చుకున్న ప్రయత్నాన్ని చూపడం కోసం ఇట్లా.)


పిల్లలు–చదువులు: 2

కొన్ని ఇంగ్లీషు ఆలోచనలు
-----------------------------
దీన్ని రాస్తున్నానంటేనే, నేను ఏ మీడియంలో నా పిల్లల్ని చదివిస్తున్నాను అనే ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంటుంది. దాన్నేమీ దాటేయను.

మొన్నమొన్నటిదాకా tiny అనే పదాన్ని టినీ అనుకున్నాను. అంతకుముందెప్పుడో ఓ స్టార్‌ హీరోను ఇంటర్వ్యూ చేయాలనిపోయి (precious) ప్రీసియస్‌ అని పలికి చిన్నబోయినంత పనైనాను. ఇంగ్లీషు భాషకు సంబంధించి ఇవి అత్యంత ‘టైనీ’ వివరాలు, కానీ నా వరకూ ‘ప్రెషస్‌’ వివరాలు. తెలుగులో మనకు రాయడం వస్తే చదవడం వచ్చేసినట్టే. కానీ ఇంగ్లీషులో రాయడం వస్తే చదవడం వచ్చినట్టు కాదు. దాన్ని ఎలా పలకాలో తెలిసినవాళ్ల దగ్గర వింటేనే మనకు ఇంగ్లీషు వచ్చినట్టు.
నా ఎఫ్బీ జాబితాలో ఉన్న ఓ బెంగాలీ రచయితను నువ్వెందుకు బెంగాలీలో రాయవూ అని అడిగాను. నేను ఇంగ్లీషులోనే ఆలోచిస్తాను, అన్నాడు. నాకు తెలిసి ‘మన’ చాలామంది ఇళ్లల్లో మన తల్లిదండ్రులకు ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో ఆలోచించడం అటుండనీ, కనీసం రోజువారీ జీవితంలో సుమారు ఇంగ్లీషు కూడా మాట్లాడం. మాట్లాడలేం.

ఈ మనం అనే మాట కొంచెం ట్రిక్కీ. సమాజాన్ని ఎన్నో రకాలుగా విభజించగలిగే సందర్భంలో మనం అంటే ఎవరం? దీన్ని ఎట్లా నిర్వచించాలి? మనం అని చదువుతున్నప్పుడు దాన్ని ఓన్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరూ ఈ మనంలో భాగమే.

ఇంగ్లీషు మాట్లాడగలిగినవాళ్లంతా జ్ఞానవంతులు అనే భ్రమ నాకు లేదు. ఇంగ్లీషు కూడానేమోగానీ, ఇంగ్లీషొక్కటే ఉపాధికి కీలకం అనీ నమ్మలేను. మన చుట్టూ ఎన్నో పనులు సమర్థంగా నిర్వహించగలిగిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీషులో గడగడా మాట్లాడలేరు. జీవితంలో అపారమైన అనుభవం ఉన్న ఎందరో పెద్దవాళ్లు ఇంగ్లీషులో మాట్లాడబోయి భంగపడటం చూస్తుంటాను. సమస్య ఏమిటంటే, హిందీ నాకు రాదు అని సింపుల్‌గా చెప్పేయొచ్చు. మై ఆతీ హై అని వెటకారం చేసినా ఎదుటివాడు జోక్‌ అనుకుని నవ్వేస్తాడు. కానీ ఈ వెసులుబాటు ఇంగ్లీషుకు లేదు. అది మన ప్రయోజకత్వానికి చిహ్నం. అది మన ప్రగతికి చిహ్నం. రాదంటే న్యూనత. ఉపాధి కంటే ఈ న్యూనత బలమైనది. దీన్ని దాటడం కష్టం. దాదాపు అసాధ్యం.

పాత తెలుగులో వర్ధంతి అనే మాటకు జయంతి అనే అర్థం. కానీ ఇప్పుడు వర్ధంతి అంటే చనిపోయాక చేసేదే. ప్రస్తుతం తెలుగు భాషకు ఈ వర్ధంతి అనే మాట ఏకకాలంలో భిన్న అర్థాలిస్తూ బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగని భాషను బతికించడం ప్రత్యేకంగా ఎవరి బాధ్యతో కాదు. మన కోసం భాషగానీ భాషం కోసం మనం కాదు. కానీ తెలుగు మీద, మాతృభాష మీద అభిమానం చూపడం బ్రాహ్మణీకమో మరొకటో కాదు. మన శరీరం మీద మనకు ఉండవలసింది అభిమానం కాదు. అది వాస్తవమన్న గ్రహింపు. అట్లా తెలుగు మన భాష. మన వాస్తవం.

కానీ మన దగ్గర తెలుగు అనగానే రెండు ఎక్స్‌ట్రీమ్స్‌ ఉంటాయి. రోడ్డు, బస్సు పదాలు కూడా వాడొద్దనే తెలుగొకటి. సంస్కృత పదాళ మేళవింపు నాది కాదని ఈసడించుకునే తెలుగొకటి. బస్సులో పోతున్నాను, అన్నప్పుడు– లో అనే కనెక్టింగ్‌ మాట పడినంతకాలమూ అది తెలుగే. అట్లాగే ప్రతి మాటా మనకు ముందే తెలిసివుండటానికి మనమేమీ భాషను తయారు చేయలేదు. దానికి సమానార్థకాన్నిచ్చే ఇంగ్లీషు కూడా పరాయిభాషే కదా!

నాకు తిక్కన పద్యాలు అర్థం కావు, కానీ Catcher in the Rye అర్థమవుతుంది. ఇదొక వైరుధ్యం. కాలం గడిచేకొద్దీ ఒక తరపు భాష తరువాయి తరాలకే పరాయిది అవుతుంది. ఇది తెలుగుకే కాదు, ఇంగ్లీషుకూ వర్తిస్తుంది. మొన్నేదో లింకులో జూలియన్‌ ఆఫ్‌ నార్విచ్‌ గురించి రాశారు. ఆమె ‘మిడిల్‌ ఇంగ్లిష్‌’లో రాసిన వాక్యాలను ఇప్పటి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి పెట్టారు. కాబట్టి తెలుగు అంటున్నప్పుడు మనం ఇవ్వాళ ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ సగటు తెలుగు. ఏ ఇబ్బంది లేకుండా అర్థం చేసుకుంటున్న తెలుగు. రైల్వే సిగ్నల్‌ను అనువాదం చేయనక్కర్లేని తెలుగు. మంచినీళ్లలా తాగగలిగే తెలుగు. ఒక్కోసారి పరగడుపున మంచినీళ్లు తాగడం కూడా కష్టమే. దానికీ కొంత ప్రయత్నం అవసరమే.

గాంధీజీ, సుందరయ్య, చిలుకూరి దేవపుత్ర లాంటి భిన్న భావజాలాలకు చెందిన వాళ్లందరూ మాతృభాషలోనే పిల్లల్ని చదివించడం మంచిదని అన్నారని చదివాను, విన్నాను. కానీ నాకు పిల్లలు పుట్టే కాలానికి లోకం ఒక రీతిలో సాగుతోంది. అందుకే చాలా గింజుకున్నాను, వేదన పడ్డాను, తలపోటు తెచ్చుకున్నాను, చివరికి ఒక స్థిరానికొచ్చాను. చాలాసార్లు మనం ప్రాక్టికల్‌గా ఉండవలసి వస్తుంది. లోకంతోపాటు నడిచి ఫెయిలైనా ఇబ్బంది ఉండదుగానీ లోకవిరుద్ధంగా పోయినప్పుడు విధిగా సక్సెస్‌ కావాల్సిన బరువు మన మీద పడుతుంది. అంత బరువు నేను మోయదలుచుకోలేదు. ఈ లోపల నా ఆలోచనల డోలాయమానం గానీ ఇంకే సంశయాలుగానీ లేకుండా ప్రభుత్వమే నా తరఫున నిర్ణయం తీసేసుకుంది. ఇంక నా పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. మునిగితే అందరం కలిసే మునుగుదాం.

నా పిల్లలు గవర్నమెంట్‌ బడికి పోవడం లేదు. పోతున్న ప్రైవేటు స్కూలు ఘనంగా ఏమీ లేదు. అంటే టీచర్లు అందరూ మంచి డిగ్రీలు ఉన్నవాళ్లే. కానీ ఆ ఇంగ్లీషు వినగానే ఇది అయ్యేది కాదని మనకు అర్థమైపోతుంది. నాకిప్పుడు ఉద్యోగంలో ఎదగాలన్న లక్ష్యం లేదు. సొంతిల్లు కట్టుకోవాలన్న సంకల్పం లేదు. నా ఆరోగ్యం గురించిన చింత లేదు. ఈ చదువుల తీరు మాత్రం కలవరపెడుతోంది.

ఒక పది ఇరవై ఏళ్ల కిందట ఆ ఊరి సర్పంచ్‌ కొడుకూ, ఆ ఊరి సఫాయి కొడుకూ ఒకే బళ్లో చదివేవాళ్లు. ఏదో ఒక తలంలో రెండు భిన్న జీవితాలు సంపర్కం జరిగే అవకాశం ఉండింది. ఇప్పుడు ఇవి ఎప్పటికీ కలవనంత దూరం జరిగిపోతున్నాయి. ఒకే ప్రపంచంలో భిన్న ప్రపంచాలుగా మనుషులు బతికే ప్రమాదకరమైన వీలు ఏర్పడుతోంది. వాళ్లు పంపే స్కూళ్లు వేరు, మనం పంపే స్కూళ్లు వేరు. వాళ్లను కిందికి లాగాలని కాదు, కానీ మనం ఎప్పటికి వాళ్లదాకా ఎగబాకాలి? అందరికీ ఒకే రకమైన చదువు ఇవ్వగలిగే విద్యా వ్యవస్థ ఎందుకు లేకుండాపోయింది? అందుకే, నాలుగు లక్షల స్కూల్లో చదివినవాడు ‘మేనేజర్‌ ఇంగ్లిష్‌’ మాట్లాడితే, నలభై వేల వాడు ‘అటెండర్‌ ఇంగ్లిష్‌’ మాట్లాడేలా తయారవుతాడేమోనని నా భయం. అటు తెలుగూ రాక, ఇటు ఇంగ్లీషూ రాక కొత్తరకం నిరక్షరాస్యులుగా మన పిల్లలు తయారవుతారేమోనని నా దిగులు.

ఓసారి నేనూ, ఆనందూ ప్రెస్‌ క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైతే ఓ Biba నీళ్ల బాటిల్‌ చేతిలో పెట్టారు. అప్పుడు దీన్ని ఎలా పలకాలా అనే సందేహం వచ్చింది. బీబా, బైబా? అంటే దీన్ని ఎలా పలకాలో తెలిసినవాడిముందు మనం చిన్నబోయే సంభావ్యత యాభై శాతం. ఈ చిన్న చిన్న అవరోధాలనైనా దాటించగలిగే భాషాసామర్థ్యాలున్న  ఉపాధ్యాయులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండింటారు?

వెయ్యేళ్ల వయసున్న తెలుగును, దానికన్నా మూడొందల యేళ్లు చిన్నదైన ఇంగ్లీషు ఆడించడం పలు రాజకీయాల పరిణామం. భాష, రాజకీయంతో ముడిపడిపోయింది కాబట్టి, ఇక వెనక్కి వెళ్లలేమని తెలుసు. ఇది ఇప్పుడు మొదలైందీ కాదు, ఇక్కడితో ఆగేదీ కాదు. ఆ ఆంగ్లేయులతో ఇంగ్లీషులో మాట్లాడగలిగే శక్తి వల్లే సమాజంలో పైకి ఎదిగినవాళ్ల నుంచే ఇది మొదలైంది. అదే ఇంగ్లీషుతో అమెరికాలకు విమానాల్లో ఎగిరిపోయినవాళ్ల వల్ల బలపడింది. వీళ్లందరినీ ఆయా తీరాలకు చేర్చిన శక్తిసామర్థ్యాలు నిజానికి వేరేవి కావొచ్చు. కానీ కొట్టొచ్చినట్టు కనబడేది ఇంగ్లీషు. ఇంక దాన్ని అందుకోవడానికి ఎవరు మాత్రం ఎందుకు ప్రయత్నించరు? ఇప్పుడు ఇంగ్లీషు అనేది కేవలం ఒక భాష కాదు, అదొక విలువ.

కానీ తెలుగంతే జనాభా ఉన్న జర్మనీ గానీ, తెలుగులో ఎనిమిదో వంతే జనాభా ఉన్న స్వీడన్‌ గానీ తమ భాషల్ని అంతర్జాతీయంగా ఎలా వెలిగేలా చేసుకుంటున్నాయో ఆలోచించగలిగే మేధావులు, మార్గదర్శకులు ఇన్నేళ్లుగా ఈ నేలమీద లేకుండా పోవడమే వ్యక్తిగతంగా నా దురదృష్టం. విలువలు అనేవి మనం ఇవ్వడం వల్లే వస్తాయి. ఆ విలువల్నే తారుమారు చేయగలిగే శక్తిమంతులు తెలుగువాళ్లలో ఎవరూ లేకపోవడమే ఆశ్చర్యం.

------------------------------------------------------------------------------
(బొమ్మ,
ఇంకా చిన్నగానే ఉన్న మా పెద్దోడు ఇంకా చిన్నప్పుడు వేసింది.)

Saturday, May 2, 2020

వచన కళా లోలుడు


ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధలో ఏప్రిల్ 27, 2020న అచ్చయింది. కాకుమాని శ్రీనివాసరావు రాశారు. ఒక వ్యక్తి సాహిత్యాన్ని అంచనాగడుతూ వివిధలో వ్యాసం రావడమంటే అతడి కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ పడినట్టు:-)

దీన్ని ముందు ఎఫ్బీలో పంచుకున్నప్పుడు రాసిన కృతజ్ఞతా నోట్ ఇక్కడ:
దీన్ని షేర్ చేయడానికి ముందు నాలుగు మాటలేవో చెబుదామనుకున్నాను. కానీ ఇంకో తలంలో ఆలోచిస్తే అవన్నీ ఉత్త బోలు మాటల్లా తేలిపోతాయనిపించింది. అందుకే ఇక ఈ వ్యాసం ఇలా ఉనికిలోకి రావడానికి కారణమైన సహృదయులందరికీ థాంక్యూలతో సరిపెడుతున్నా.❤️



వ్యాస పాఠం:

.‘‘నియతి చేత విధించబడిన నియమాలను ఉల్లంఘించేదీ, ఆనందాన్ని ఇచ్చేదీ, పరతంత్రత లేనిదీ, నవరస రుచిరమైనదీ అయిన కవి వాక్కుకు జయము కలుగుగాక!’’
- ముమ్మటుడు

ఒక వ్యక్తి ఎందుకు సృజిస్తాడు? ఎక్కడో మారుమూల నర్శింగాపురం నుండీ హైదరాబాద్ నగరానికి చేరి, ఆ వీధుల్లో తిరిగే ఒకానొక ఎముకలగూడు, రక్తమాంసాల కూడిక, తన గడచిన జీవితం, తన అస్తిత్వానికి అర్థం ఏమిటని ప్రశ్నించుకుంటే పుట్టిన జవాబే రాజిరెడ్డి రచనలు. అతని లక్షణం తనకు చెందినదాన్ని పూర్తిగా వ్యక్తం చేసుకోవటం. అలా వ్యక్తం చేసుకొంటే వచ్చినవే ‘మధుపం’, ‘పలకా పెన్సిల్’, ‘రియాలిటీ చెక్’, ‘ఆజన్మం’, ‘చింతకింది మల్లయ్య ముచ్చట’, ఇంకొంత కవిత్వం.
తన రచనలకీ తనకీ ఉన్న సంబంధం దీపానికీ, కాంతికీ ఉన్న సంబంధం అంటాడు చలం. రాజిరెడ్డి తనలోని వైయక్తికం, సామాజికం, భౌతికం, అధిభౌతికం, రసాస్వాదన ప్రవృత్తి తన మొత్తం రచనల్లోకి వెల్లడించుకుని, తన అస్తిత్వాన్ని ప్రకటించుకుని, విముక్తుడయ్యాడు. రాగద్వేషాలకతీతంగా మంచీచెడులకు కారణమవుతున్న ‘మాయ’ను తెలుసుకుంటూ బైరాగి పదాల్ని సృష్టిస్తున్నాడు. సుఖదుఃఖాలను పూర్తిగా విచారించి తత్వాన్ని తెలుసుకోవటం వలన మనిషి వాటిని విడిచిపెట్టగలడు. ఇది ఆత్మవిద్య. ఇదొక స్వీయాత్మాభివ్యక్తీకరణ లాలస.

ఇంతకీ రాజిరెడ్డి రచనలు ఫిక్షనా? నాన్ ఫిక్షనా? అతడు జర్నలిస్టు కావటం చేత ఇవన్నీ రాసేడా? కాకపోతే రాసివుండేవాడు కాదా? ఒక సృజనకారుడు జర్నలిస్టు కావటం అతడు చేసిన నేరం, పాపం కాదు. ‘‘మనం పుస్తకం చదువుతున్నప్పుడు ఆ రచయిత మన వెనుకనే నుంచుంటాడు, అతనిని తెలుసుకొన్నాక అతడిని ప్రేమించటం మొదలుపెడతాం’’ అంటాడు రాజిరెడ్డి. రచయితలోని ఒకవిధమైన అమాయకత్వం, నిర్మలమైన నిజాయితీని పాఠకుడు ఇట్టే పసిగడతాడు. రాజిరెడ్డి ‘రియాలిటీ చెక్’ పుస్తకంలో ‘అడ్డాకూలీలతో కొన్ని మాటలూ, కొంత మౌనం’ రచనలో ‘‘ఇదిగో ఈ ఉదయంపూట నేను యూస్‌ఫగూడ చెక్ పోస్ట్ నుంచి బస్తీవైపు నడుస్తున్నాను.’’ అనే ప్రారంభ వాక్యాలను నేను ఒక పదిసార్లయినా చదివి ఉంటాను.

రాజిరెడ్డి తన రచనలకి ‘ఆఖ్యాయిక’ అని పేరుపెట్టుకోవచ్చు. నాయకుడే స్వయంగా తన వృత్తాంతాన్ని చెప్పటం ఆఖ్యాయిక. స్వయం దృష్టార్థ కథనం ఆఖ్యానమని మరోటి ఉంది. రియాలిటీ చెక్‌కి ‘ఆహ్నికం’ అనీ పేరుపెట్టుకుని ఉండవచ్చు. ‘‘ఆహ్నా నిర్వృత్తం ఆహ్నికం’’ అంటే ఒక దినంలో నిర్వర్తింపబడినది, రచింపబడినది, చదువదగినది.
రాజిరెడ్డిలోని రచయిత శిల్పశక్తులతో విజృంభించి రాసిన విస్తృత యాత్రాగ్రంథం ‘రియాలిటీ చెక్’. ఇది ఒక విధమైన సంచార సాహిత్యం. ఒక బాటసారి బైరాగి సృష్టించి యిచ్చిన లోక వృత్తాంత తాత్విక గ్రంథం. మొత్తం హైదరాబాద్ అంతా తిరిగినా దానిమీద ప్రేమ, ద్వేషం ఏర్పరచుకోని ఈ బైరాగి, మంచీ చెడూ రెండూ ‘మాయే’ చేయిస్తుందంటాడు.

‘రియాలిటీ చెక్’ని దశరూపకాల్లోని ‘వీథి’ ప్రక్రియలోనూ చేర్చవచ్చు. ఈ ‘వీథి’లో ఒక్కడే నాయకుడు, ఒకటే అంకముంటుంది. అతడు ఆకాశ భాషితాలకు ప్రతిభాషితాలు చేస్తూ ముందుకు సాగుతుంటాడు. క్రీడాభిరామం ప్రత్యేకంగా ‘వీథి’కి చెందుతుంది. మనుష్య, వృక్ష, ఫలభక్ష్యాలు, వార్తా, వైచిత్రీ, విశేషాలు, వీటితోపాటు జాతివర్ణనలు హంసవింశతి, క్రీడాభిరామం వంటి రచనల్లో కనిపిస్తాయి. ‘రియాలిటీ చెక్’లోని ‘చార్మినార్ను అల్లుకున్న బతుకు తీగలు’ రచన చూడండి: ‘‘మీసాలతో గడ్డం, మీసాలు లేని గడ్డం, పొట్టిగడ్డం, పొడుగు గడ్డం, పిల్లి గడ్డం... ఈ గడ్డమీద ఎన్ని గడ్డాలు!’’ అనుకుంటూ మన యాత్రికుడు ముందుకు సాగుతాడు. కన్నెపిల్లలు, పిల్లతల్లులు, ముద్దబంతులు, ముత్తయిదువలు, గాజులు వేసుకుంటూ చూసుకుంటున్నవాళ్ళ మురిపాలను మనకు చూపెడుతూ ముందుకు నడుస్తూ... ‘‘ఎన్ని దుకాణాలు! తాళాలు, కత్తులు, చెప్పులు, పుస్తకాలు, గిన్నెలు, గడియారాలు, చీరలు, బ్యాగులు, చికెన్, మటన్, బీఫ్, పువ్వులు, బిస్కెట్లు’’ అంటాడు. అదొక సంత. అక్కడ క్రయ విక్రయాలు ‘వీథి’ని గుర్తుకుతెస్తుంటాయి.

రచనావరణం మొదటి అడుగులోనే ఒక సింబల్ని పట్టుకొంటాడు రాజిరెడ్డి. దాన్ని ఇంతకుముందు చాలాసార్లు చూచి ఉంటాం. అది మనకలా కనిపించి ఉండదు. జూపార్క్‌కి వెళ్లినపుడు అతడికి మొదట్లోనే రెండు తాబేళ్ళు స్వాగతం పలికాయి. చిన్న మడుగులో చి.. న్న.. గా నడుస్తున్నాయి. ఇంత నెమ్మదిగా తిరిగితే తప్ప ఈ ‘జూ’ని ఆనందించలేమన్నట్లుందిది అంటాడు.సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆనాటి కావ్య ప్రబంధాలను, కథాకావ్యాలను ఆధారం చేసుకొని రాసినట్లు, ఒక 100-150 సంవత్సరాల తర్వాత హైదరాబాదీ సంస్కృతీ చరిత్రలను రాజిరెడ్డి రచనలను ఆధారం చేసుకొని ఏ పరి శోధకుడో ఒక అద్భుత గ్రంథం రాయవచ్చు.

స్త్రీ పురుషుల మధ్య ఒక తాత్త్విక అవగాహన కలిగించే ఒక వచనకావ్యం ‘మధుపం’. దీనికి ఆయన పెట్టుకున్న ట్యాగ్ ‘‘ఒక మగవాడి ఫీలింగ్స్’’. స్త్రీకి మగవాడు ఏకకాలంలో యజమాని, బానిస. ‘‘మగవాడు తాను స్త్రీని ఎంతగా ఆరాధిస్తున్నాడో, ఎంతగా ద్వేషిస్తున్నాడో చెప్పటంలోనే స్త్రీకన్నా అనితరమైనదీ అతీతమైనదీ తనకేదీ లేదని ఒప్పుకోవటం’’ వల్ల ఇద్దరి జీవితాల్లో మధువు నింపబడుతుంది అనే విషయాన్ని ‘మధుపం’ నిరూపిస్తుంది. దీన్ని తెలుసుకొన్నాక ఆమె చేతి గాజులు తన చేతులకి గొలుసులైపోతాయి.

‘పలక పెన్సిల్’ని పుస్తకంగా వేయాలనుకొన్నప్పుడు వీటన్ని టిని ఎందుకు పుస్తకం రూపంలో తీసుకురావాలి? అన్నది అతడు ఎదుర్కొన్న ప్రశ్న. ‘‘ఏ ఆదివారపు మధ్యాహ్నమో సోమరిగా కూర్చుని, ఫోటో ఆల్బమ్ తిరగేస్తుంటే, నిజంగా అప్పుడు మనం బాగుండేవాళ్ళుం అనిపిస్తుంది చూడండి’’ అలాంటి రాత ప్రయ త్నాల్లో బాగున్నవనుకున్నవన్నీ ఈ పుస్తక అవతారంలోకి వచ్చాయి. ఇతడికి రాయటం ఒక పెయిన్. కానీ రాయకుండా ఉండలేడు. తన అస్తిత్వాన్ని ప్రతిబింబించే తన రక్తనాళాలతో కుట్టిన ఈ పుస్తకానికి అతడు పెట్టుకొన్న ట్యాగ్ - ఒక మగవాడి డైరీ!

వీటన్నిటికంటే తన కొడుకుకి ఇచ్చిన ‘దర్శనం’ ఆసక్తిగా ఉం టుంది. ‘వెయ్యిప్రశ్నల ఉదయం’ శీర్షికలో తన ఐదేళ్ళ కొడుకు అడిగిన అమాయకపు ప్రశ్నల్ని వరుసగా ఒక రచనలాగా పేర్చి అందించాడు. అందులో ‘‘కుక్క చేతుల్తోటి ఎందుకు నడుత్తాది? మనం నోటి తోటి ఎట్ల మాట్లాడుతాం? మట్టికింద ఏముంటది? నానా! నేను నిన్ను పెళ్లిచేసుకోవన్నా?’’ లాంటి ప్రశ్నలుంటాయి.

లోకవృత్తంలోపడి తిరుగాడుతున్నపుడు మనిషిని ఆకర్షించని వస్తువు కవి కల్పనలోపడి సృజనగా మారాక దాంట్లో అంతకు ముందులేని అందం వచ్చి చేరుతుంది. దీన్నే రాజిరెడ్డి ఇలా అంటాడు: ‘‘మామూలుగా ఏ దృశ్యమైనా చాలా మామూలుగా ఉంటుంది. దాన్నే వాక్యంలోకి తర్జుమా చేసినప్పుడు కొత్త అందం వచ్చి చేరుతుంది’’.

రాజిరెడ్డి కథల సంపుటి ‘చింతకింది మల్లయ్య ముచ్చట’. ఒక ప్రక్రియకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చేప్పే వాదం మీద ఈ రచయితకు వ్యంగ్యంతో కూడిన అసహనం ఉంది. ‘‘నీ కథల్లో కాల్పనికత ఏది?’’ అని అడిగిన వారికి ఊహించని అద్భుతమైన జవాబు అతడు రాసిన ‘రెక్కల పెళ్లాం’ కథ. మాంత్రిక వాస్తవికతతో జానపదరీతిలో సాగిన అత్యాధునిక కథ. స్త్రీ పురుషుల జీవితంలో కొరవడినది ఏది? కోరుకొన్నది ఏది? దొరుకుతున్నది ఏమిటి?... ఇలా వారిద్దరి మధ్యన నెలకొనాల్సిన మానవ సంబంధం గురించిన అత్యాధునిక కథ ఇది.రాజిరెడ్డి మొదటి కథ ‘నాలో(కి) నేను’ (2008). ‘నేను’కి సమూహంలో అర్థం ఏమిటి? ‘నేను’ని గుర్తించకపోతే సమూహానికి అర్థం ఉందా? జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు తీసుకోవాలా, మార్చి స్వీకరించాలా? అన్న ప్రశ్నల అన్వేషణే ఈ కథ. అనేక వైరుధ్యాలమధ్య మనిషి జీవితం అణగారిపోతున్న విషాదాన్ని గురించిన కథ రెండవది ‘మరణ రేఖలు’. జీవితాన్ని నాటకీయంగా చూసే మూకుమ్మడి దృష్టి కాకుండా జీవితాన్ని జీవితంలా చూడాలి అనే కథ ‘చింతకింది మల్లయ్య ముచ్చట’.

కథకి సమకాలీన ఫార్ములా మీద వ్యంగ్యం కలిగి ఉన్న కథ ‘చినుకు రాలినది’. మృత్యువు మార్మికంగా మారి, అదే చిట్టచివరి వాస్తవం అయినపుడు దాంట్లో అతడు ఎదుర్కొన్న ఘర్షణ ‘తమ్ముడి మర ణం’లా ఒక విషాద జ్ఞాపకంగా మిగులుతుంది.రాజిరెడ్డికి అలంకారాలు అపృథక్ ప్రయత్నంతో సిద్ధించాయి. ‘ఎండలో ఒక మధ్యాహ్నం’ రచనలో సాయంత్రపు సూర్యుడ్ని చూస్తూ ‘‘దిన వృక్షానికి పండి జారిపడిన ఫలం’’ అంటాడు. దూరంగా చెట్టుకు చిక్కుకొన్న సూ ర్యుడు, చుట్టూ బంగారపు రంగు వెండి మబ్బులు, ఎర్రగా పండిన పండయ్యాడు, తొడిమను వీడినట్లుగా కిందకు జారిపోయాడు. ‘‘ఏ పిల్లాడికి దొరికాడో’’ అనుకుంటాడు రచయిత. అలాగే మరోచోట ‘‘సుదీర్ఘ రాత్రి విరహం తర్వాత, మేలిముసుగు ధరించిన భూ వధువు మంచుతెరలు తొలగిస్తూ.. యౌవన సూర్యుడు! తొలుత మబ్బుల్లోకి లేకుంకుమను కుమ్మరించాడు, తన తరుణి నుదుటన దాల్చడానికి’’ అని ఉదయకాల సూర్యుణ్ణి ఈ ఆధునిక ప్రబంధకవి వర్ణించాడు.

కావ్యం అంటే ఒక్క వాక్యం కూడా కావచ్చు. అయితే ఆ వాక్యం రసాత్మకమైపోవాలి. సాహిత్య దర్పణంలో దాన్నే కదా విశ్వనాథుడు ‘‘వాక్యం రసాత్మకం కావ్యమ్’’ అన్నది. ‘రియాలిటీ చెక్’లో ఇలాంటి వాక్యాలు చాలానే ఉన్నాయి. అడ్డాకూలీలతో కలిసి కొంత సంభాషణ, కొంత మౌనం జరిపాక, ‘‘కాళ్ళు నడువత్తలేవు. బొక్కల్ల సందులచ్చినయని డాక్టర్లు చెప్పిన్రు’’ అన్న ఆ వృద్ధుణ్ణి రచయిత అడిగాడు: ‘‘మరేం జేస్తున్నవు?’’
‘‘అడుక్కుంటున్న బాంచెను’’ అన్నాడు వృద్ధుడు.
‘‘ఎన్ని నిర్మాణాలు, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని భవనాలు, ఎన్ని రోడ్లు, ఎన్ని అద్భుతాలు వీళ్ల చేతులమీదుగా సాకారమైనై! చేతులు బిగించి పని చెయ్యటానికీ, చేతులు చాచి యాచించటానికీ మధ్యన దూరం ఇంత తక్కువ వుందా?’’ అంటాడు రచయిత. ఈ ఒక్క వాక్యం చాలు- ఆర్థికశాస్త్రం, చరిత్ర, ఆంథ్రోపాలజి ఇవేవీ అర్థంచేయించలేని భావాన్ని వినిపించి కంటతడి పెట్టించడానికి.

ఒక భావాన్ని చెప్పగల పదసముదాయం ఎంత ఉన్నప్పటికీ, చెప్పదలచిన భావాన్నంతా చెప్పటానికిగల ఏకైక పదమే శబ్దం. రచయిత అలాంటి శబ్దాలను ఏరుకోగలగాలి. అలాగే సహృదయునికి ఆహ్లాదాన్ని కలిగించే స్వభావం కలిగిన సుందర శబ్దమే అర్థం. ఈ రెండు శబ్దార్థాలూ కలిగి ఉండటం వలన రాజిరెడ్డి వాక్యం అనన్యసాధ్యంగా తయారైంది.

ఋగ్వేదంలో- మహాదేవుడైన శబ్దం వృషభం వలె మానవుడి కోరికలను వర్షించటం కోసం అతడిని ఆవహించి రంకె వేస్తుంది అని ఉంటుంది. ఈ రకమైన శబ్ద విచ్ఛిత్తికి ఏవో ప్రక్రియల పేర్లు పెట్టాలనుకోవడం అవివేకం. అది మానవుని (కళాకారుడిని) ఆవహించి అతడి ఉరము, కంఠం, శిరస్సు నుండీ ఘోషలాగా వెలువడుతుంది అని చెప్పడం వెనుక ఒక అసంకల్పిత పక్రియ దాగిఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రకమైన ప్రాగ్రూప వాసనలతోటే బహుశా రాజిరెడ్డి ‘‘ప్రక్రియల మూసల్లో ఇమడని వాక్యం నాకిష్టం’’ అంటున్నాడు. గతకాలీనపు ప్రక్రియాగత స్వేచ్ఛ, వైవిధ్యం లోపించి సమకాలీన సాహిత్య ప్రక్రియలు ఘనీభవించాయి. సృజన స్వేచ్ఛ సంకుచితమైపోయింది. ఈ నేపథ్యంలో నిలబడి ‘‘ఏ రూపంలోనైనా నన్ను నేను వ్యక్తం చేసుకోవడం ఇష్టం. ‘ఇలాంటి పిల్లాడు కావాల’ని ఎలాగైతే సృష్టికార్యం ఆరంభించమో, ఇలాంటి ఆర్టికల్ రాయబోతున్నానని నాకూ తెలియదు, అలాంటి ‘డెలివరీ’ ఒక అద్భుతమైన అనుభవం’’ అంటున్నాడు రాజిరెడ్డి.

- కాకుమాని శ్రీనివాసరావు

Wednesday, January 1, 2020

'మహాభారతం మన చరిత్రే' ఆవిష్కరణ సభలో నా ప్రసంగం

(నోట్‌: కల్లూరి భాస్కరం గారి 'మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే' ఆవిష్కరణ సభలో నేను మాట్లాడాను. ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఇట్లా అధికారికంగా మాట్లాడటం, అంటే ఒక బుక్‌ ఇనాగ్యురేషన్‌ ఇన్విటేషన్‌ మీద పేరు వేయడం ఇదే మొదటిసారి నాకు. అంతకుముందు కొన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చినా అవన్నీ ఇన్‌ఫార్మల్‌ సమావేశాలు. కల్లూరి భాస్కరం గారు చాలా శ్రద్ధగా రాసే రచయిత అని నాకు గౌరవం. కానీ ఈ తరహా పుస్తకం నా శక్తికి మించినది. కానీ ఆయన నన్ను మాట్లాడమని కోరితే నిరాకరించగలిగే శక్తి కూడా లేకపోయింది. అక్కడ మాట్లాడిన ప్రసంగ పాఠం ఇది. తెల్లారి ఈనాడు మెయిన్ పేజీలో వచ్చిన కవరేజీ క్లిప్ కూడా జత చేస్తున్నా. అందులోని విజయలక్ష్మి పేరును  విజయభారతి అని చదువుకోగలరు.)



మంత్రకవాటం తెరిస్తే
మహాభారతం మన చరిత్రే
ఆవిష్కరణ సభ – హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్, ఎన్టీఆర్‌ స్టేడియం
డిసెంబర్‌ 29; సాయంత్రం 5:30
––––––––––––––––

ఎగ్జిబిషన్లో పుస్తకావిష్కరణ అంటే సామూహిక వివాహం లాగా. ఇక్కడున్నవారు నిజంగా దీనికోసమే వచ్చినవారో, లేకపోతే తరువాయి పెళ్లి/ఆవిష్కరణ కోసం ఉన్నవారో తెలీదు. ఏ కారణం వల్లయినా సరే, ఈ క్షణంలో ఇక్కడున్న వారందరికీ నమస్తే.

సంస్కృతం అటుండనీ, నేను తెలుగు మహాభారతమే చదవలేదు. చదవలేను కూడా. ఒరులేయవి యొనరించిన లాంటి ఒకట్రెండు పద్యాలు తప్ప నాకు ఇంకో పద్యం అర్థం కాదు. మహాభారతం అంటే దూరదర్శన్‌ సీరియల్‌ అనుకునే నాలాంటివాడిని వీరభద్రుడంతటివాడి పక్కన నన్ను భాస్కరం గారు వక్తగా ఎందుకు కూర్చోబెట్టినట్టు?
ప్రతిదీ ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏదోమేరకు బదిలీ అవుతూనేవుంటుంది. మనకు తెలిసో, తెలియకుండానో మన పూర్వీకుల వారసత్వాన్ని మోస్తూనేవుంటాం. ఆ అవిచ్ఛిన్నతకు ప్రతీకలాగా, నన్ను ఇప్పటి తరఫు ప్రతినిధిగా భావించారని నేను అనుకుంటున్నా.

ఒకసారి గుడిమల్కాపుర్‌లో నడుస్తూవున్నాను. ఈ ఎల్జీబీటీ ఇలాంటిది ఏదో మనసులో మెసులుతూ ఉందేమో. ఉన్నట్టుండి శిఖండి గుర్తొచ్చాడు. అందులో అంబ ముందు ఆత్మహత్య చేసుకుంటుంది, తర్వాత శిఖండిగా పుడతాడు. అంటే ముందు అతడిలోని స్త్రీ బలవంతంగా చచ్చిపోయింది. మిగిలిన పురుష దేహంతో అతడు  బతుకును ఈడ్చాడు. ఈడ్చాడు అని ఎందుకు అంటున్నానంటే, భీష్ముడు అతడిని గౌరవించడు. తనలోని స్త్రీ చచ్చిపోయింది, చంపబడింది అనే పాయింట్‌ నన్ను ఎక్సయిట్‌ చేసింది. ఇదంతా కూడా ఒక ప్రతీక యేమో. దాని గురించి వ్యాఖ్యానించుకోవడానికి ఎంత స్కోప్‌ ఉందికదా అనిపించింది. ఒక కాలాతీతమైన పాత్రను సృష్టించడంలో మహాభారత కర్త గొప్పదనం అది.
మహాభారతం ఇందాక నేను చదవలేదు అన్నాను. కానీ మహాభారతం కనీసం విననివాళ్లెవరు ఈ నేలమీద? ప్రతి పాత్రనూ మానవ సహజంగా ఆవిష్కరించుకోవచ్చు, అదే సమయంలో వాటిమీద ఒక మాయపొరను కప్పి మాట్లాడుకోవచ్చు. చూడండి, మహాభారతంలో పర్ఫెక్ట్‌ క్యారక్టర్సే కనబడవు. అన్నీ మానవ సహజమైన ఉద్వేగాలను, లోపాలను, రక్తమాంసాలతో సహా ప్రదర్శిస్తాయి. ఆ పొరలు తొలగిస్తూ, ఆ ప్రతీకలన్నింటినీ డీకోడ్‌ చేస్తూ, భారతంలోని ఆత్మను, వాస్తవాన్ని పట్టుకోవడమే భాస్కరం గారు ఈ పుస్తకం అంతటా చేసిన పని.

పేరుకే ఇది మహాభారత వ్యాఖ్యానం. ఇందులో ప్రస్తావనకు రాని విషయమంటూ కనబడదు.
బుద్ధుడు, గురజాడ, కన్యాశుల్కం, క్రూసేడ్లు, మంగోలులు, మెసపటోమియా, సిరియా, రాజరాజనరేంద్రుడు, కృష్ణదేవరాయలు, సుమేరులు, భ్రూణ హత్యలు, గ్రీసు ఒలింపిక్స్, రాజుల పుట్టుక, బానిస వ్యవస్థ, దశావతారాలు, హింస అహింస, అలెగ్జాండర్, సెల్యూకస్, భ్రూణ హత్యలు, నీటి యుద్ధాలు, ఆఖరికి కశ్మీర్‌ సమస్య. నేను చెప్పినప్పుడు వీటన్నింటికీ ఒక క్రమం కనబడట్లేదు; కానీ పుస్తకంలోకి వచ్చేసరికి అవన్నీ ఒక ప్యాటర్న్‌లోకి ఒదిగిపోతాయి.
మహాభారతం గురించి మనకు ఒకటి చెబుతారు కదా, ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నదీ, ఇందులో లేనిదేదీ ప్రపంచంలో కూడా లేదూ అని. అట్లా సమకాలీన సాహిత్య, మేధో ప్రపంచం ఆలోచనల్లో ఉన్న భారతీయ వర్తమాన సామాజిక స్థితిగతులు అన్నీ ఇందులో ప్రతిఫలిస్తాయి. మళ్లీ ఊరికే ప్రస్తావనగా కాదు, ప్రతిదీ దానిదైన సందర్భంలోనే వస్తుంది, దానికి రచయిత ఇవ్వగలిగే వెలుతురు సోకే వస్తుంది. ఒకచోట, పాశ్చాత్య సమాజానికి భారతదేశం అంటే ఎందుకు అంత ఆకర్షణో చెప్తూ–
పాశ్చాత్య సమాజపు వర్తమానానికి భారతీయ సమాజం గతం, అంటారు. వాళ్లు దాటిపోయిన దశను మనం జీవిస్తున్నాం ఇంకా.
మళ్లీ దీనికే కొనసాగింపుగా ఇంకోచోట, ఆయుధోపజీవుల గురించిన ప్రస్తావన వస్తుంది. అంటే ఆఫ్గనిస్తాన్‌లోని నిరంతర అశాంతికి మూలాలేమిటి అన్నది వచ్చినప్పుడు, భారతీయ సమాజం దాటివచ్చిన గతం ఇంకా ఆఫ్గనిస్తాన్‌లో ఉందంటారు. గుర్తుంచుకోవాల్సింది ఒకప్పటి గాంధార దేశం అది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి అక్కడి అమ్మాయే. ప్రపంచ పరిణామం ఎన్ని లేయర్సులో ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.

ఈ పుస్తకం మనం అనుకునే చాలా గీతల్ని చెరిపేయొచ్చు. జగజ్జనని అనే కాన్సెప్టు మనది కాదు, మనది మాత్రమే కాదు, అది ఇంకా పైకి పశ్చిమానికి, ఇరాన్‌–సిరియాల్లోనే ఉంది అని చెబుతుంది. దేవాలయ క్రతువులు, తులసికోటలు అన్నీ ఇక్కడివే అని మనస్ఫూర్తిగా నమ్ముతుంటే గనక దాన్ని దెబ్బ కొడుతుంది. ఇజ్రాయిల్‌లోనూ అలాంటి నిర్మాణాలు ఉన్నాయంటుంది.
గ్రీసు ద్వీపమైన క్రీటుకూ, రామాయణ కాలపు కృతయుగానికీ లంకె కుదిర్చే ప్రయత్నం ఉంటుంది;
పర్షియన్‌ చక్రవర్తి క్జెరెక్సెస్‌కూ శ్రీరాముడికీ ఉన్న పోలికలు చెబుతుంది.
అతడు గ్రీసు మీదికి వెళ్తే, ఇతడు లంక మీదికి వెళ్లాడు. ఇద్దరూ సముద్రం మీద వారధి నిర్మించాల్సి వస్తుంది. ఇద్దరికీ సముద్రుడు ప్రసన్నం కాకపోతే కోపం వస్తుంది. ఇద్దరూ సూర్యవంశ క్షత్రియులు.
గ్రీకుల మినోస్‌కూ, మన మనువుకూ ఎలాంటి సామ్యాలున్నాయో చెబుతుంది. మినోస్, మనువు– ఆ పేర్ల సామ్యం ఒక్కటే కాదు, ఇద్దరూ కూడా ప్రళయం వచ్చినప్పుడు నౌకలో వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించినవారే.
ఆఖరికి మహాభారతంలోని ప్రధాన పాత్రలకు మూలపురుషులైన పూరుడు, ఆయన తండ్రి యయాతి, ఆయన తండ్రి నహుషుడు, ఆయన ముత్తాత పురూరవుడు ఎక్కడో పశ్చిమాసియాలో పుట్టినవాళ్లు అయివుండొచ్చు అన్నదాన్ని ఏదోమేరకు బలపరుస్తుంది.
ఒక విధంగా మనం ఇప్పుడు భారత సంప్రదాయం, సంస్కృతి అని వేటిని అనుకుంటున్నామో అవన్నీ ఆ లెవాంట్‌– అంటే ఆ సిరియా, ఇరాక్, లెబనాన్, ఇజ్రాయిల్‌... అని ఇప్పుడు విభజించుకుంటున్న ప్రాంతంలోనే పుట్టివుండొచ్చు, అక్కడే మన మూలం ఏదో ఉండొచ్చు, అని చెబుతుంది. అదే సమయంలో దీనికి భిన్నమైన ప్రమాణం దొరికితే అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.
పాండురాజు సంతానం కోసం ప్రయాణం చేసిన శతశృంగం టిబెట్‌లో ఉందని ఒక రిఫరెన్సు. మన కాళీమాతకూ మెడూసా దేవతకూ ఉండే పోలికలేమిటో ఇంకోచోట. మెసొపటేమియా దేవుడు పొసైడన్‌కూ–నటరాజ రూపంలోని శివునికీ మధ్య ఉండే సామ్యం ఒక చోట. ఇద్దరూ త్రిశూలం ధరిస్తారు. ఇద్దరి వాహనం వృషభం అందులో కొన్ని. నల దమయంతుల ప్రేమకథను పోలిన కథ గ్రీకు పురాణాల్లో ఒడీసియస్‌ పెనెలొపిది. ‘ఇంతమేరకు ఇది భారతదేశం’ అని మనం గీసుకునే ఎల్లల్ని ఈ పుస్తకం చెరిపేస్తుంది.

ఇంకో తమాషా చూడండి: ఒక సందర్భంలో నహుషుడు వేదప్రమాణాన్ని నిరాకరిస్తాడు. అంటే మాంసం తినడం కోసం పశువుల్ని చంపడం తప్పంటాడు. దీన్ని బ్రాహ్మలు వ్యతిరేకిస్తారు. ఫలితంగా తన సింహాసనం కోల్పోతాడు.  నాగరికత స్థిర వ్యవసాయంలోకి మళ్లుతున్న దశకీ, పశుపాలన చేస్తూ బతికే దశకూ మధ్య ఘర్షణను అది చిత్రిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది పూర్తి విరుద్ధం. కానీ గమనించవలసింది, పవర్‌ ప్లే అనేది అట్లానే ఉంది, ఆ మాంసం చుట్టూ, పశువుల చుట్టూ.
అందుకే రచయిత అంటాడు, అసలు చాలా విషయాలకు మనం ఇంకా భారతకాలంలోనే ఉన్నాం, ఆధునికతలోకి ప్రవేశించనే లేదూ అని.

ఇరవై ఏళ్ల క్రితం రాసిన కథలో తల నెరిసింది అంటే అతడు వృద్ధుడు అని. కానీ ఇప్పుడు నాతో సహా ఎందరికో జుట్టు నెరుస్తోంది. అంటే ఆ వాక్యం దాని నిజమైన అర్థం కోల్పోయింది. కానీ ఎప్పుడో మూడువేళ్ల ఏళ్ల క్రితం చరిత్రకు ప్రతిబింబంగా ఉన్న భారతం ఇప్పటికీ రిలవెంట్‌గా ఉండటం ఏమిటి, మ్యాజిక్‌ కాకపోతే.

ఇంకోటి కూడా ఇక్కడ చెప్పబుద్ధవుతోంది.
శర్మిష్ఠ–దేవయాని కథ చూడండి. ఒకసారి పొరపాటున దేవయాని విడిచిన మైల బట్టలను శర్మిష్ఠ కట్టుకున్నప్పుడు– నా బట్టలు నువ్వు కట్టుకుంటావా అని స్థాయీభేదాలు మాట్లాడి శర్మిష్ఠను దేవయాని అవమానిస్తుంది. కానీ దీనికి కొనసాగింపుగా జరిగింది ఏమిటి? శర్మిష్ఠ ఇష్టపడిన యయాతినే దేవయాని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. ఒక విధంగా ఆమె (మానసికంగా) మైల చేసిన వాడిని ఈమె కట్టుకోవాల్సి వచ్చింది.
ఎంత గొప్ప శిల్పం ఇది. చిన్న కథ నిర్మాణానికి గొప్ప ఫ్రేమ్‌ ఇది. ఇప్పటి ఆధునిక కథకు మూలపురుషుడు అని చెప్పుకునే అమెరికన్‌ రచయిత ఎడ్గార్‌ అలెన్‌ పో మహా అయితే 1820ల్లో రాశాడు. రెండు వందల ఏళ్ల కిందట. ఎప్పటి మహాభారతం!

ఈ పుస్తకం, అంటే మన భాస్కరం గారి పుస్తక నిర్మాణం గురించి కూడా చెప్పాలి. ఒక విధంగా ఇది కూడా మహాభారతం అంతటి సంక్లిష్టమైనదే.
ఇది నాలుగు స్రవంతులుగా ప్రారంభమవుతుంది.
ఒకటి ఎటూ మహాభారతం.
రెండోది, 200–250 ఏళ్ల క్రితం నాటి అలెక్స్‌ హేలీ ‘రూట్స్‌’ లేదా ఏడు తరాలు నవల లింక్‌.
మూడోది, 70–80 ఏళ్ల క్రితపు భారత స్వాతంత్య్రోద్యమపు గాంధీజీ లింక్‌.
నాలుగోది, రచయితకు ఉన్న తనదైన వ్యక్తిగత అన్వేషణ.
అట్లా అని తర్వాతి మూడు పాయలు అవే ఉంటాయని కాదు. అవి ముగుస్తూనే ఇంకో ప్రవాహం వచ్చి కలుస్తుంది. అది గ్రీకు పురాణం కావొచ్చు, సుమేరు గాథ కావొచ్చు, ఒక ఐరిష్‌ కథ కావొచ్చు. బైబిల్‌ కథ కూడా కావొచ్చు. ఏవి వచ్చినా ఈ అన్ని ప్రవాహాలూ ఒక్కోసారి సమాంతరంగా ఒరుసుకుంటూనూ, మరోసారి ఖండించుకుంటూనూ సాగుతాయి. అయినా ఎక్కడా జర్క్‌ రాదు. సాఫీగా, హాయిగా ఒక మేళనంలాగా ప్రవహిస్తాయి. ఇదీ రచయితకు సబ్జెక్టు మీద ఉన్న అథారిటీ. పట్టు.

తెలుగునాట ప్రతి ఇంట్లోనూ ఒక ఒక మహాభారతం ఉండేంత ప్రాచుర్యం ఉన్నా, తెలుగునేల మీద ఒక భైరప్ప ఎందుకు పుట్టలేదో అర్థం కాదు. ఒక పర్వ ఎందుకు రాయబడలేదో తెలీదు. నిరాశ ఏల? భైరప్ప లేకపోతేనేం, మనకు భాస్కరం ఉన్నారు.

ఈ పుస్తకాన్ని, లేదా మానవ నాగరికతా క్రమాన్ని స్థూలంగా ఇట్లా విభజించుకోవచ్చు.
ఒకటి, వ్యవసాయానికీ పశుపాలనకూ మధ్యన జరిగిన ఘర్షణ.
రెండు, ఆదివాసీలు, నాగరికుల మధ్య జరిగిన ఘర్షణ.
3. గణాలు– స్థిరరాజ్యాలుగా ఏర్పడుతున్న కాలపు మధ్యపోరాటం.
4. లైంగికత పట్ల ఏ కట్టూ లేని దశా, దానికి పవిత్రత ఆపాదించబడుతున్న దశల మధ్య ఘర్షణ.
5. ఇంకా ఎక్కువ చర్చకు వచ్చేది– మాతృస్వామ్య వ్యవస్థలోంచి పితృస్వామ్య వ్యవస్థలోకి ప్రపంచం పరిణామం చెందుతున్నప్పుడు పుట్టిన ఘర్షణ.
మహాభారతం పరంగా చూస్తే కౌరవులు పితృస్వామ్యానికి సూచిక. పాండవులు మాతృస్వామ్యానికి ప్రతీక. ఇట్లా చెప్పడానికి ఎన్నో రిఫరెన్సులు ఇస్తాడు రచయిత. పాండవులను కౌంతేయులు అని వ్యవహరించే చిన్న వివరం నుంచి, తపతీ సంవరుణుల ప్రేమ కథ, ఆ వంశ చరిత్ర దాకా.
తమాషా ఏమిటంటే– మాతృస్వామ్యం పాతది, పితృస్వామ్యం అప్పటికి ప్రగతిశీలం. కానీ భారతంలో విజయం సాధించింది పాండవులు. అంటే మాతృస్వామ్య వ్యవస్థ గెలిచినట్టు. సమాజం ఒకవైపు పరిణమిస్తుంటే దాన్ని ఎందుకు నిలువరించడానికి ప్రయత్నించివుంటాడు భారత రచయిత?

మన పాత సినిమాల్లో చూడండి. స్త్రీ కొంత స్వేచ్ఛగా, కొంత టిప్పుటాపుగా తయారై, ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడు– ఆ పాత్రకూ హీరో పాత్రకూ ఘర్షణ పుడుతుంది. చిట్టచివరికి, సినిమా ముగింపులో ఆ అమ్మాయి వాటిని అన్నింటినీ కట్టిపెట్టి హీరో పాదాల దగ్గర వాలిపోతుంది. ఎందుకూ అంటే? దర్శకుడి టార్గెట్‌ ప్రేక్షకులు ఇంకా హీరో దశలోనే ఉన్నారు కాబట్టి. సమాజం ఏ పోకడ పోయినా ఆమెను వెనక్కి గుంజి చూపించడంలోనే ప్రేక్షకుల ఈగో తృప్తి చెందుతుంది. బహుశా భారత కర్త టార్గెట్‌ శ్రోతలు కూడా మాతృస్వామ్యంలో ఉండివుంటారు. అందువల్లే పాండవులను గెలిపించివుంటాడు.
ఇంకొకటి:
పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది అంటారు. కానీ పూర్తిగా ఏర్పడిందా? మా అమ్మమ్మ గారి ఊరు, మా అత్తగారి ఊరు అనే అంటున్నాం. అంటే పరిణామం ఇంకా సాగుతూనేవుంది. లేదా ఘర్షణ అయినా సాగుతోంది. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, హింస కూడా ఆ ఘర్షణకు ప్రతిఫలనాలేమో అనిపిస్తుంటుంది.
ఈ పుస్తకం ప్రకారమే చెప్పుకుంటే– పూతనను కృష్ణుడు చంపడం అనేది ప్రతీక మాత్రమే. పూతన ఇప్పుడు మన ఊహల్లో స్థిరపడ్డట్టుగా రాక్షసి కాదు, అప్పటికి ఉన్న దేవత. ఆ మాతృదేవతను వెనక్కి నెట్టేసి, ఈ పురుషస్వామ్యపు ఆధిక్యతను ప్రతిష్టించడం ఆ కథ ఉద్దేశం. గమనించాల్సింది, ఒక పరిణామం అంతకుముందు ఉన్నదాన్ని మొత్తం అంతం చేయడం జరగదు అంటారు రచయిత. పశ్చిమ భారతంలో ఇప్పటికీ పూతన అనే పేరు పెట్టుకునేవాళ్లు ఉన్నారట.

లైంగికత అంశమే చూడండి. సత్యవతి వివాహ సందర్భంగానీ, ద్రౌపది వివాహం ధర్మసమ్మతమేనా అనిగానీ,  కుంతి పిల్లల పుట్టుక గురించిగానీ ఇందులో చాలా చర్చ నడుస్తుంది. గుంపులు–గుంపుల మధ్య సామూహికంగా జరిగిన వివాహాలు, అన్నదమ్ములందరూ ఒక స్త్రీని పెళ్లాడిన వివాహాలు నుంచి ఇప్పుడు మనం ఉన్న ఒక స్త్రీ– ఒక పురుషుడు దశకు సమాజం క్రమంగా పరిణామం చెందుతూ వచ్చింది. దీనికి ఎన్నో కథల్ని మనకు మహాభారతం ఊతంగా వినిపిస్తాడు రచయిత. అయితే, లైంగికత అనేది ప్రకృతి ధర్మంగా మాత్రమే భావించిన ఒక ఎక్స్‌ట్రీమ్‌ నుంచి లైంగికత అనేది పూర్తిగా సామాజిక నియతిలో భాగమైన మరో ఎక్స్‌ట్రీమ్‌కు వచ్చాం, అంటాడు. ఆ లైంగికత మీద మోపబడుతున్న ఒత్తిడే భిన్న వికృతాలుగా ప్రతిఫలిస్తున్నదేమో.

మహాభారతం అధారంగా మన గతాన్నీ, దాని వెలుగులో మన వర్తమానాన్నీ అర్థం చేసుకోవడానికి భాస్కరం గారి పుస్తకం గొప్ప ఉపకరణం. అయితే భారతాన్ని రీజన్‌తో పని లేకుండా తీసుకోవడం గుడ్డి విశ్వాసం అవుతుంది. ఆ టెక్స్‌›్ట మీద గౌరవం లేకపోతే ఒక మహత్తరమైన సాంస్కృతిక సంపద నాలాంటివాళ్లకు అందకుండా పోతుంది. అటు గౌరవం ఇస్తూనే ఇటు రీజన్‌ను పక్కన పెట్టకుండా గొప్ప సంయమనం చూపాడు రచయిత.

నాకు చాలాసార్లు విమర్శ అనేది సెకండరీ లిటరేచర్‌ అనిపిస్తుంది. నువ్వెంత గొప్ప వ్యాఖ్యానం చెయ్యీ, నువ్వు సృజనకారుడితో సమానం కాలేవు. నువ్వు కడుతున్న భవనానికి పునాది ఇంకొకరిది. అందుకే ఎనర్జీని ఉత్తినే వృథా చేసుకోవడం అని కూడా అనిపిస్తుంటుంది. ఇది భాస్కరం గారికి తెలియదని నేను అనుకోను. అయినా ఇంత కష్టం ఎందుకు పడ్డట్టు?
రెండు ప్రయోజనాలు:
1. మొదట్లో సామూహిక వివాహం అన్నాను. ప్రపంచం కూడా ఇంతే కదా. ఆయా మనుషులు ఆయా ప్రాంతాల్లో ఎందుకు ఉండాల్సివస్తుందో వస్తుంది. వాటికి ఏవేవో కారణాలు, ఒత్తిళ్లు, ఆశలు, రాజకీయాలు పనిచేస్తాయి. అప్పుడు అప్పటికే ఉన్న మనుషులతోనూ, అక్కడికే వస్తున్న మనుషులతోనూ ఏర్పడే ఘర్షణ, అనంతర సర్దుబాటు, ఇదే చరిత్ర పొడుగునా.
ప్రపంచం అంతా దాదాపు ఒకే చరిత్రను పంచుకుంది, ఒకేరకమైన సర్దుబాట్లు చేసుకుంది. మన పౌరాణిక గాథలు అవే చెబుతున్నాయి, మన విశ్వాసాలు అవే చెబుతున్నాయి. అయినా వ్యవస్థను గడ్డ కట్టించే ప్రయత్నం ఒకటి చరిత్ర పొడవునా జరిగింది, ఇప్పటికీ జరుగుతూనేవుంది. అయినా సమాజం మన నియంత్రణలో లేనివిధంగా ద్రవంలా పలురీతుల్లో ప్రవహిస్తూనే ఉంది. ఇది మన వశంలో, ఎంతటి అధికార వశంలోనైనా లేని విషయం అని స్పష్టం చేయడం రచయిత లక్ష్యాల్లో ఒకటి అని నేను అనుకుంటున్నా.

2. బహుశా, మనిషి అస్తిత్వానికి మూలకేంద్రకాన్ని అన్వేషించడం రచయితకు ఎక్సయిటింగ్‌గా తోచింది. ఈ ప్రపంచం మొత్తాన్నీ ఒక వృత్తం చేసి, మనిషిని దానికి కేంద్రంగా నిలబెడతాడు. ఈ మొత్తం చరిత్రలో మన ముందున్న తరాల వారసత్వాన్ని మనకు బదలాయించడం ద్వారా మన ఉనికికి ఒక దన్నును ఇస్తాడు.
మౌఖిక చరిత్రలు ఉన్నప్పుడు మనం అందరికీ ఒక అస్తిత్వం ఉండింది; మనం అందరం ప్రాముఖ్యం ఉన్నవాళ్లమే; లిఖిత చరిత్రలు రాయడం మొదలైనప్పటినుంచే మనిషి చరిత్రహీనుడయ్యాడు, అంటాడు. ఈ లిఖిత పుస్తకంలో ఆ మౌఖిక గాథల సారాన్ని ఇమడ్చడం ద్వారా నరుడికి, సామాన్యుడికి కిరీటం తొడిగాడు.

మానవ స్వభావంలోని సంక్లిష్టతే మొత్తం నాగరికతను ప్రభావితం చేస్తూ వచ్చిందని నాకు అనిపిస్తుంటుంది. నేను సామ్యానుడిని, నేను అందరిలాంటివాడిని అంటే ఒప్పుకోబుద్ధి కాదు. నేను పక్కవాడికంటే కొంచెం ప్రత్యేకం అనుకునే గుణం ఎందుకో మనిషిని వదలదు. అలా ఆపాదించుకునే అవ్యక్త గొప్పతనమే మంచికీ చెడుకూ రెంటికీ దారితీసుండవచ్చు. ఒక తెగ, మతం, ప్రాంతం ఏవీ దీనికి అతీతం కావు. ఈ సంక్లిష్టతను కూడా ఈ పుస్తకం డిస్కస్‌ చేయడం నాకు నచ్చింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అంటే నాకు గౌరవం. వాళ్లు ఎంపిక చేసుకునే పుస్తకాలు చూజీగా, పికీగా ఉంటాయి. కానీ వాళ్ల మీద నా ఫిర్యాదు ఏమిటంటే– దానికి తగ్గ ప్రొడక్షన్‌ వాల్యూ అన్నిసార్లూ కనబడదు. ముఖ్యంగా తప్పుల విషయంలో. ఈ 800 పేజీల పుస్తకంలో బీభత్సంను భీభత్సం అని రావడం తప్ప నాకు మరో దోషం కనబడలేదు. పైగా మంచి కాగితం వాడారు. అందుకు అభినందనలు.

ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత దీనికి ఏమైనా ఒక దిష్టి చుక్క పెడదాం అనిపించింది. ముగింపుకు వచ్చేసరికి పుస్తకం సరిగ్గా అయిపోయింది అన్న ఫీలింగ్‌ రాదు. పాఠకుల్ని రోడ్డు మీద వదిలేసి, వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. ఆ లోపం రచయితది కూడా కాదేమో. ఎంత తవ్వుకుంటే అంత చరిత్ర! దీనికి కామా పెట్టగలమేగానీ ఫుల్‌స్టాప్‌ ఎట్లా? అందుకే ఇంత భారీ పుస్తకం కూడా ఇంకో మహత్తర ప్రణాళికకు ప్రిలోగ్‌ మాత్రమే అంటున్నాడు. చూద్దాం  ఇంకా ఏం రాయబోతున్నారో.

దీన్ని మినహాయించి ఇక చివరి మాట:
కొన్ని మాటలు అయిందానికీ కానిదానికీ వాడటం వల్ల వాటి నిజవిలువను పోగొట్టుకుంటాయి. అందులో అద్భుతం ఒకటి. ఈ పుస్తకంలో రచయిత నిభాయించుకోలేక ఆ మాట కొన్నిసార్లు వాడుతుంటాడు. నేను కూడా అదే చెబుతున్నా. కాకపోతే స్పోకెన్‌ వర్డ్‌కు ఉండే ఎంఫసిస్‌తో. ఈ పుస్తకం ఒక అద్భుతం!

ఆటా సదస్సులో నా ప్రసంగం

(నోట్‌: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఈమధ్య హైదరాబాద్‌లో జరిపిన సాహిత్య సమావేశంలో నేను కూడా మాట్లాడాను. రాసుకుని తప్ప నేను మాట్లాడలేను కాబట్టి స్థూలంగా విషయం రాసుకెళ్లాను. దాన్నే ఇక్కడ పెడుతున్నాను. గుర్తుంచుకోవాల్సింది, నేను మాట్లాడేటప్పుడు కొంత స్పోకెన్‌ ధోరణీ, కొంత రిటెన్‌ ధోరణీ కలగలుస్తుంటాయి. ఇంకొకటి: నేను స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడిన సందర్భం కూడా ఇదే మొదటిసారి అనుకుంటాను:-) నేను మాట్లాడేలా చొరవ చూపిన రవి వీరెల్లిని ఇక్కడ గుర్తుచేసుకుంటున్నా.)



ఆటా సాహితీ సదస్సు
ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు
డిసెంబర్‌ 14, 2019; మధ్యాహ్నం సెషన్, 2–3:30
––––––––––––––––––––––––––––––––

చాలామంది రచయితలు నేను ఫలానా పుస్తకం చదివో, ఫలానా రచయితను చదివో నేను రాయడం వైపు వచ్చానని చెబుతుంటారు. కానీ నేను రాయడం వైపు రావడానికి ప్రధానంగా పనిచేసిన కారణం నా ఈగో.
అప్పటికి నా టెన్తు అయిపోయింది. మా అమ్మ, చెల్లి, తమ్ముడు ఉల్లిమడులకు పొతం చేయడానికి పొలంకాడికి పోయినం. అప్పుడు మా తమ్ముడు వాడి స్కూల్లో ఉన్న ఒక అన్న ‘ఇట్ల పాట రాసిండు’ అని చెప్పిండన్నమాట. ఓహో, అయితే నేను కూడా రాయొచ్చు అనిపించింది. ఆ గొప్పతనం నాక్కూడా సాధ్యమే అనిపించింది. అట్లా పొలంకాడినుంచి ఇంటికి పోవుడు పోవుడే రఫ్పు నోట్సులన్నీ తీసుకుని ఒక జానపద నవల రాయడం మొదలుపెట్టాను. ‘రాకుమారుడు – విచిత్రమణి’. ఎన్నో పాత్రలు, ఏవో మలుపులు, మణులు సాధించడాలు, అద్భుతాలు, కత్తుల విన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. మళ్లీ ఆ పాత నోట్సుల్లోంచి ఒక కొత్త నోటుబుక్కులోకి ఫెయిర్‌ చేసిన కాపీ నా దగ్గర ఇప్పటికీ ఉంది. దాని మొదటిపేజీ మీద తారీఖు 1994 మే 27 అని ఉంటుంది. సరిగ్గా 25 ఏళ్లు. అంటే ఈ సంవత్సరం దానికి రజతోత్సవ సంవత్సరం. సిల్వర్‌ జూబ్లీ ఇయర్‌.

మా చిన్నోడు ప్రతిరోజూ ఏదో ఒక కథ చెప్పమంటుంటాడు. ఎన్నని చెప్తాం? ఎక్కడెక్కడో చదివినవీ విన్నవీ నేను ఉద్యోగంలో భాగంగా చదివేటివీ అన్నీ వెతికి వెతికి వాడికి పనికొచ్చేవి వానికి పనికొచ్చేట్టుగా మార్చి చెబుతావుంటా. అయినా చాలవు. మొన్న ఐడియా వచ్చింది. ఇది కూడా చెప్పొచ్చు కదా! ఇంక చూడు, రాజశేఖరుడు, ప్రతాపవర్మ, డిభాసురుడు, కాళికాదేవి, నాగసింహుడు, ఇట్లాంటి పాత్రలు వస్తుంటే వాడి ముఖం చూడాలి! సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉండాలి అంటే గనక ఆ పుస్తకం రాసిన ప్రయోజనం మా వాడి వల్ల నెరవేరిపోయింది.

మనకు తెలియకుండానో తెలిసో ఒక దారిలోకి వస్తాం. ఏమో రాస్తాం. మర్డర్‌ మిస్టరీ నవలలు, థ్రిల్లర్లు, కామెడీ రొమాన్సులు, జానపదాలు, ఏవేవో నవలలు కొన్ని భాగాలు రాశాను. కథలు, పాటలు, పద్యాలు; వయసు, దినుసు, సొగసు, పులుసు లాంటి మాటలతో సినిమా పాటలు...
అప్పుడు నేను రాస్తున్న ఒక నవలలో ఒక విలన్‌ ‘పీటర్‌ స్కాట్‌’ తాగుతుంటాడు అనే వాక్యం ఉంటుంది. ఎందులోంచో ఎత్తుకొచ్చిన వాక్యం ఇది. ఏంటిది? అదేమిటో తెలియకుండా నేను ఎందుకు రాస్తున్నాను? మనకు ఏమీ తెలియకుండా, నా అనుభవంలోంచి చీల్చుకుని రాకుండా ఒక్క వాక్యం కూడా నేను రాయొద్దన్న ఇంగితం లాంటిదేదో నాకు ఆరోజు కలిగింది. నేను మా ఊళ్లో ఉన్నానప్పుడు. మా ఇంటి వెనకాల జామచెట్టు ఉంటుంది. నా సందూగులో నిండిపోయివున్న కాగితాలను చూస్తేనే సిగ్గయ్యింది. ఆ రాత్రికి రాత్రే చెట్టుకిందికి వెళ్లి ఆ కాగితాలన్నింటినీ గుట్టలాగా పోసేసి కాల్చేశిన. రాసే ప్రతి వాక్యమూ సాహిత్యం కాదు. నేను రాస్తున్నది సాహిత్యం కాదని తెలుసుకోవడానికి కొన్ని వందల రోజులు, కొన్ని వేల కాగితాలు ఖర్చు చేశాను.

మనకు తెలియకుండానే ఒక దారిలోకి వచ్చినప్పుడు మనం ఏ దారిలో నడుస్తున్నాం, దీనినుంచి ఏం సాధించాలనుకుంటున్నాం అనే ఆలోచనలు వస్తాయి. ఆటోమేటిగ్గా ఎవరెవరు ఏ దారుల్లో నడుస్తున్నారో కూడా గమనించడం మొదలవుతుంది. నాకు అర్థమైన మేరకు తెలుగులో వాదం లేని సాహిత్యం లేదు. ఏదో ఒక వాదం. ప్రాంతీయ వాదం నుంచి మొదలుపెట్టి విశ్వ కార్మిక వాదం దాకా అన్నీ వాదాలే. కానీ నాకు ఏమనిపిస్తుందంటే ఈ వాదాలన్నీ చిల్లులున్న కుండలే. ఏదీ అంతిమం కాదు, ఏదీ పరమం కాదు. ఏదీ ఎప్పటికైనా చేరుకోవాల్సిన గమ్యాన్ని ఇవ్వదు. ఈ చిల్లులు ఏమిటి? మనుషులుగా మనం దాటలేని బలహీనతలు. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని విప్లవాలు, ఎందరు మేధావులు, అన్నింట్లోనూ అంతిమంగా అందరూ బోర్లాపడేది ఈ మానవ బలహీనతల దగ్గరే.
ప్రతి వాదమూ దానిదైన అవసరంలోంచే పుడుతుండవచ్చు. దాన్నేమీ నిరాకరించను. ప్రతీ చిల్లు కుండ కూడా కొంత నీటిని కొంత దూరం మోసుకుపోగలదూ, కొందరి దాహాన్నయినా తీర్చగలదు. ఇదీ ఒప్పుకుంటాను. కానీ ఎంత చేసినా అది చిల్లులున్న కుండే!

అందుకే నా రాతకు నేనొకటి పెట్టుకున్నాను. రాసే ప్రతిదీ నా అనుభవంలోంచి తప్ప ఇంకోటి రాయకూడదు. నా తప్పులేమిటి, ఒప్పులేమిటి అని చెప్పుకోవడానికి రాయాలి, నా పశ్చాత్తాపాలనూ గుణదోషాలనూ వెల్లడించాలి. ఎందుకూ? అట్లా మాత్రమే నన్ను నేను నిర్వచించుకోగలను, నన్ను నేను శుభ్రం చేసుకోగలను. రాయడం అనేది శిల్పం, శైలి, వీటన్నింటికీ మించి నిజాయితీకి సంబంధించినది అనుకుంటాను. ఇలా రాయడాన్ని కన్ఫెషన్‌ లిటరేచర్‌ అనుకోవచ్చు. నేను ఇవ్వాళ రెండు కార్లు, నాలుగు మొబైళ్లు, ఫ్రిజ్‌ ఏసీ వాడుతూ పర్యావరణ హితం కోసం నిలబడలేను. ఆఫీసులో బాయ్‌ను ‘ఒరేయ్‌ నీళ్లు పెట్రా’ అని అరుస్తూ మనుషులంతా సమానం అని మాట్లాడలేను. కేవలం ఆన్‌ రికార్డ్‌ నేను రాయలేను. మాటవరుసకు ఒకటి అట్లా పడివుంటుదని రాసేయలేను. అది నాలో సింక్‌ కాకుండా. అదొక లోపమే కావొచ్చు. కానీ ఇట్లా ఉన్నాన్నేను.

అసలు సామూహిక సత్యాలు అనబడేవీ ఏమీలేవేమో, ఉన్నవన్నీ వ్యక్తిగత సత్యాలేనేమో అని కూడా ఈమధ్య బలంగా అనిపిస్తూవుంది. ఒక సమూహం కాగలిగేది ఏదీ లేదు. ప్రతి ఇద్దరమూ వేర్వేరే. అందువల్ల కూడా నేను ఈ దారిలో ప్రయాణిస్తున్నాను.

ఈ ప్రయాణంలో ఎంతదూరం వచ్చాను, ఎంతదూరం పోవాలి అంటే కనుచూపుమేర కూడా మనకు గమ్యం కనబడదు. అదేమీ రేపటితో అయ్యేది కాదు. ఒక వైపు క్లీన్‌ చేస్తుంటే ఇంకోవైపు నుంచి మురుగునీళ్లు వచ్చే హుస్సేన్‌ సాగర్‌ లాంటిది ఈ మనసు. మరింకేంటి దీనికి హోప్‌?

రేడియం, యురేనియం, థోరియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలకు హాఫ్‌ లైఫ్‌ పీరియడ్‌ అని ఉంటుంది. ఒక నిర్దేశిత కాలంలో దాని పరిమాణం సగం అవుతుంది. మళ్లీ ఆ కాలానికి ఆ ఉన్న సగంలో సగం అవుతుంది. ఎప్పటికీ అంతం కావడం ఉండకపోవచ్చు. కానీ పరిమాణం తగ్గుతుంది. బహుశా నా లక్ష్యం కనీసం అట్లా నాలోని చెడును, నా బలహీనతలను చనిపోయేంతవరకూ సగానికి సగం తగ్గించుకుంటూ పోవడం.

థాంక్యూ ఆటా.