Wednesday, January 1, 2020

ఆటా సదస్సులో నా ప్రసంగం

(నోట్‌: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఈమధ్య హైదరాబాద్‌లో జరిపిన సాహిత్య సమావేశంలో నేను కూడా మాట్లాడాను. రాసుకుని తప్ప నేను మాట్లాడలేను కాబట్టి స్థూలంగా విషయం రాసుకెళ్లాను. దాన్నే ఇక్కడ పెడుతున్నాను. గుర్తుంచుకోవాల్సింది, నేను మాట్లాడేటప్పుడు కొంత స్పోకెన్‌ ధోరణీ, కొంత రిటెన్‌ ధోరణీ కలగలుస్తుంటాయి. ఇంకొకటి: నేను స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడిన సందర్భం కూడా ఇదే మొదటిసారి అనుకుంటాను:-) నేను మాట్లాడేలా చొరవ చూపిన రవి వీరెల్లిని ఇక్కడ గుర్తుచేసుకుంటున్నా.)



ఆటా సాహితీ సదస్సు
ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు
డిసెంబర్‌ 14, 2019; మధ్యాహ్నం సెషన్, 2–3:30
––––––––––––––––––––––––––––––––

చాలామంది రచయితలు నేను ఫలానా పుస్తకం చదివో, ఫలానా రచయితను చదివో నేను రాయడం వైపు వచ్చానని చెబుతుంటారు. కానీ నేను రాయడం వైపు రావడానికి ప్రధానంగా పనిచేసిన కారణం నా ఈగో.
అప్పటికి నా టెన్తు అయిపోయింది. మా అమ్మ, చెల్లి, తమ్ముడు ఉల్లిమడులకు పొతం చేయడానికి పొలంకాడికి పోయినం. అప్పుడు మా తమ్ముడు వాడి స్కూల్లో ఉన్న ఒక అన్న ‘ఇట్ల పాట రాసిండు’ అని చెప్పిండన్నమాట. ఓహో, అయితే నేను కూడా రాయొచ్చు అనిపించింది. ఆ గొప్పతనం నాక్కూడా సాధ్యమే అనిపించింది. అట్లా పొలంకాడినుంచి ఇంటికి పోవుడు పోవుడే రఫ్పు నోట్సులన్నీ తీసుకుని ఒక జానపద నవల రాయడం మొదలుపెట్టాను. ‘రాకుమారుడు – విచిత్రమణి’. ఎన్నో పాత్రలు, ఏవో మలుపులు, మణులు సాధించడాలు, అద్భుతాలు, కత్తుల విన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. మళ్లీ ఆ పాత నోట్సుల్లోంచి ఒక కొత్త నోటుబుక్కులోకి ఫెయిర్‌ చేసిన కాపీ నా దగ్గర ఇప్పటికీ ఉంది. దాని మొదటిపేజీ మీద తారీఖు 1994 మే 27 అని ఉంటుంది. సరిగ్గా 25 ఏళ్లు. అంటే ఈ సంవత్సరం దానికి రజతోత్సవ సంవత్సరం. సిల్వర్‌ జూబ్లీ ఇయర్‌.

మా చిన్నోడు ప్రతిరోజూ ఏదో ఒక కథ చెప్పమంటుంటాడు. ఎన్నని చెప్తాం? ఎక్కడెక్కడో చదివినవీ విన్నవీ నేను ఉద్యోగంలో భాగంగా చదివేటివీ అన్నీ వెతికి వెతికి వాడికి పనికొచ్చేవి వానికి పనికొచ్చేట్టుగా మార్చి చెబుతావుంటా. అయినా చాలవు. మొన్న ఐడియా వచ్చింది. ఇది కూడా చెప్పొచ్చు కదా! ఇంక చూడు, రాజశేఖరుడు, ప్రతాపవర్మ, డిభాసురుడు, కాళికాదేవి, నాగసింహుడు, ఇట్లాంటి పాత్రలు వస్తుంటే వాడి ముఖం చూడాలి! సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉండాలి అంటే గనక ఆ పుస్తకం రాసిన ప్రయోజనం మా వాడి వల్ల నెరవేరిపోయింది.

మనకు తెలియకుండానో తెలిసో ఒక దారిలోకి వస్తాం. ఏమో రాస్తాం. మర్డర్‌ మిస్టరీ నవలలు, థ్రిల్లర్లు, కామెడీ రొమాన్సులు, జానపదాలు, ఏవేవో నవలలు కొన్ని భాగాలు రాశాను. కథలు, పాటలు, పద్యాలు; వయసు, దినుసు, సొగసు, పులుసు లాంటి మాటలతో సినిమా పాటలు...
అప్పుడు నేను రాస్తున్న ఒక నవలలో ఒక విలన్‌ ‘పీటర్‌ స్కాట్‌’ తాగుతుంటాడు అనే వాక్యం ఉంటుంది. ఎందులోంచో ఎత్తుకొచ్చిన వాక్యం ఇది. ఏంటిది? అదేమిటో తెలియకుండా నేను ఎందుకు రాస్తున్నాను? మనకు ఏమీ తెలియకుండా, నా అనుభవంలోంచి చీల్చుకుని రాకుండా ఒక్క వాక్యం కూడా నేను రాయొద్దన్న ఇంగితం లాంటిదేదో నాకు ఆరోజు కలిగింది. నేను మా ఊళ్లో ఉన్నానప్పుడు. మా ఇంటి వెనకాల జామచెట్టు ఉంటుంది. నా సందూగులో నిండిపోయివున్న కాగితాలను చూస్తేనే సిగ్గయ్యింది. ఆ రాత్రికి రాత్రే చెట్టుకిందికి వెళ్లి ఆ కాగితాలన్నింటినీ గుట్టలాగా పోసేసి కాల్చేశిన. రాసే ప్రతి వాక్యమూ సాహిత్యం కాదు. నేను రాస్తున్నది సాహిత్యం కాదని తెలుసుకోవడానికి కొన్ని వందల రోజులు, కొన్ని వేల కాగితాలు ఖర్చు చేశాను.

మనకు తెలియకుండానే ఒక దారిలోకి వచ్చినప్పుడు మనం ఏ దారిలో నడుస్తున్నాం, దీనినుంచి ఏం సాధించాలనుకుంటున్నాం అనే ఆలోచనలు వస్తాయి. ఆటోమేటిగ్గా ఎవరెవరు ఏ దారుల్లో నడుస్తున్నారో కూడా గమనించడం మొదలవుతుంది. నాకు అర్థమైన మేరకు తెలుగులో వాదం లేని సాహిత్యం లేదు. ఏదో ఒక వాదం. ప్రాంతీయ వాదం నుంచి మొదలుపెట్టి విశ్వ కార్మిక వాదం దాకా అన్నీ వాదాలే. కానీ నాకు ఏమనిపిస్తుందంటే ఈ వాదాలన్నీ చిల్లులున్న కుండలే. ఏదీ అంతిమం కాదు, ఏదీ పరమం కాదు. ఏదీ ఎప్పటికైనా చేరుకోవాల్సిన గమ్యాన్ని ఇవ్వదు. ఈ చిల్లులు ఏమిటి? మనుషులుగా మనం దాటలేని బలహీనతలు. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని విప్లవాలు, ఎందరు మేధావులు, అన్నింట్లోనూ అంతిమంగా అందరూ బోర్లాపడేది ఈ మానవ బలహీనతల దగ్గరే.
ప్రతి వాదమూ దానిదైన అవసరంలోంచే పుడుతుండవచ్చు. దాన్నేమీ నిరాకరించను. ప్రతీ చిల్లు కుండ కూడా కొంత నీటిని కొంత దూరం మోసుకుపోగలదూ, కొందరి దాహాన్నయినా తీర్చగలదు. ఇదీ ఒప్పుకుంటాను. కానీ ఎంత చేసినా అది చిల్లులున్న కుండే!

అందుకే నా రాతకు నేనొకటి పెట్టుకున్నాను. రాసే ప్రతిదీ నా అనుభవంలోంచి తప్ప ఇంకోటి రాయకూడదు. నా తప్పులేమిటి, ఒప్పులేమిటి అని చెప్పుకోవడానికి రాయాలి, నా పశ్చాత్తాపాలనూ గుణదోషాలనూ వెల్లడించాలి. ఎందుకూ? అట్లా మాత్రమే నన్ను నేను నిర్వచించుకోగలను, నన్ను నేను శుభ్రం చేసుకోగలను. రాయడం అనేది శిల్పం, శైలి, వీటన్నింటికీ మించి నిజాయితీకి సంబంధించినది అనుకుంటాను. ఇలా రాయడాన్ని కన్ఫెషన్‌ లిటరేచర్‌ అనుకోవచ్చు. నేను ఇవ్వాళ రెండు కార్లు, నాలుగు మొబైళ్లు, ఫ్రిజ్‌ ఏసీ వాడుతూ పర్యావరణ హితం కోసం నిలబడలేను. ఆఫీసులో బాయ్‌ను ‘ఒరేయ్‌ నీళ్లు పెట్రా’ అని అరుస్తూ మనుషులంతా సమానం అని మాట్లాడలేను. కేవలం ఆన్‌ రికార్డ్‌ నేను రాయలేను. మాటవరుసకు ఒకటి అట్లా పడివుంటుదని రాసేయలేను. అది నాలో సింక్‌ కాకుండా. అదొక లోపమే కావొచ్చు. కానీ ఇట్లా ఉన్నాన్నేను.

అసలు సామూహిక సత్యాలు అనబడేవీ ఏమీలేవేమో, ఉన్నవన్నీ వ్యక్తిగత సత్యాలేనేమో అని కూడా ఈమధ్య బలంగా అనిపిస్తూవుంది. ఒక సమూహం కాగలిగేది ఏదీ లేదు. ప్రతి ఇద్దరమూ వేర్వేరే. అందువల్ల కూడా నేను ఈ దారిలో ప్రయాణిస్తున్నాను.

ఈ ప్రయాణంలో ఎంతదూరం వచ్చాను, ఎంతదూరం పోవాలి అంటే కనుచూపుమేర కూడా మనకు గమ్యం కనబడదు. అదేమీ రేపటితో అయ్యేది కాదు. ఒక వైపు క్లీన్‌ చేస్తుంటే ఇంకోవైపు నుంచి మురుగునీళ్లు వచ్చే హుస్సేన్‌ సాగర్‌ లాంటిది ఈ మనసు. మరింకేంటి దీనికి హోప్‌?

రేడియం, యురేనియం, థోరియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలకు హాఫ్‌ లైఫ్‌ పీరియడ్‌ అని ఉంటుంది. ఒక నిర్దేశిత కాలంలో దాని పరిమాణం సగం అవుతుంది. మళ్లీ ఆ కాలానికి ఆ ఉన్న సగంలో సగం అవుతుంది. ఎప్పటికీ అంతం కావడం ఉండకపోవచ్చు. కానీ పరిమాణం తగ్గుతుంది. బహుశా నా లక్ష్యం కనీసం అట్లా నాలోని చెడును, నా బలహీనతలను చనిపోయేంతవరకూ సగానికి సగం తగ్గించుకుంటూ పోవడం.

థాంక్యూ ఆటా.

5 comments:

  1. చాలా బాగుంది రాజిరెడ్డి గారూ. ఇవే కారణాలకు మీ రచనలు నాకు దగ్గరగా అనిపిస్తాయి. మిమ్మల్ని చాలా ప్రెడిక్టబుల్ అనుకుంటాను, అంటే మీరేం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలిసిపోవడం కాదు. మీరెందుకలా చేస్తున్నారో ఊహించగల్గుతాను, అర్థం చేసుకోగలుగుతాను. అందువల్ల ఫిర్యాదులుండవు, 'అంతే కదా' అనిపించడం తప్ప. సాహిత్యం ఇలాంటి ఒక ఒప్పుకోలుని అన్నింటిపట్లా, అందరి పట్లా ఇవ్వగలిగితే అంతకన్నా కావల్సినదేముంది? హాఫ్ లైఫ్ పీరియడ్ మీరు చెప్పిన వాటికేనా, వాటితో పాటుగా మసలుకునే మిగతావాటికీనా? :) నిర్దేశిత కాలమెంతో తెలీట్లేదు కానీ, ఆగండి - నేనే చెప్తాను :)

    ReplyDelete
  2. చాలా బాగుంది నిజాయితీగా నిక్కచ్చిగా. అలాగే రాస్తూ ఉండండి.

    ReplyDelete
  3. పనిలో పని ఆ జానపద నవల పబ్లిష్ చెయ్యండి. నిజ్జంగా...

    ReplyDelete
    Replies
    1. హహ. లిటెరరీ వేల్యూ ఏమీ ఉండదు దానికి.

      Delete
  4. బాగుంది.నా ఐడియాలజీ ఇలాగే ఉండటం,చిన్నప్పుడు ఇలాగే నోట్స్ లో నవలరాసుకోవడం యాదృచ్చికమేమో..

    ReplyDelete