Friday, September 16, 2016

నగరాన్వేషణలో గ్రామీణ మూలాల 'రియాలిటీ చెక్‌

నగరాల మీద రచనలు తెలుగులో ఎక్కువ వచ్చినట్లు లేవు. కానీ ఇంగ్లీష్‌లో విస్తృతంగా కన్పిస్తాయి. అసలు ఒక నగరం మీద రచన అంటే కేవలం ఆ నగరపు చరిత్ర మాత్రమే కాదు కదా. నగరాల సమకాలీన చరిత్ర మీద ఏమన్నా రచనలు వచ్చాయా అన్నదీ అనుమానమే. హైదరాబాద్‌ నగరపు చరిత్ర మీద పుస్తకాల్ని చూడొచ్చు. కానీ నగరంలో ఉండే విభిన్న సమూహాల గురించిన రచనలు వచ్చాయా అంటే ఆలోచించాల్సిందే. ఆ అవగాహనతో ఆలోచించినప్పుడు పూడూరి రాజిరెడ్డి 'రియాలిటీ చెక్‌' పుస్తకం ఆ ఖాళీని కొంతవరకు భర్తీచేస్తుంది. ఒక సంవత్సరం పాటు ఒక కాలంగా వచ్చిన 'రియాలిటీ చెక్‌' యిప్పుడు పుస్తక రూపం దాల్చింది. నగరానికి ఉన్న అనేక కిటికీల నుంచి కొన్ని ఎంపిక చేసుకున్న కిటికీల ద్వారా రాజిరెడ్డి తన నగరాన్వేషణలను కొనసాగిస్తాడు. ఊరినుంచి వచ్చిన వాడుగా అతనిలోని కుతూహలమే అతన్ని విభిన్న సమూహాలను పరిశీలించి వారిలో గ్రామీణ భయాల్ని గుర్తించినప్పుడు ఏదో తెలియని ఆనందం అతని వాక్యాల ద్వారా వెలువడుతుంది.
                  ఇంతకీ అతనిది నగరాన్వేషణా ! కచ్చితంగా చెప్పడం కష్టం. గ్రామీణ మూలాలను దర్శించి ఎక్కడో సంతృప్తిని పొందడమా! ఇంకో పక్క నగరంలో విభిన్న సమూహహాలను విభిన్న ప్రాంతాలను మనచేత దర్శింపచేయటమో అనుభూతి. ఒక చోట కల్లు కాంపౌండ్‌ లో సాయంత్రం సేదదీరే మనుషులకు బిన్నంగా పబ్‌ లో తూలిసోలే ఆధునిక యువత. మరోచోట హైదరాబాద్‌ సంస్కృతిలో భాగంగా వున్నా ఇరానీ కేఫ్‌ ను సవాలు చేస్తూ నిలిచే ఆధునిక కాఫీ షాప్‌ 'బరిస్తా'. ఇక నగర జీవితంలో ఒక భాగమైన ఎఫ్‌ ఎమ్‌ రేడియోలో మూడుగంటలు గడపడంతో నీలాగా నువ్వు బతుకు అన్న సూత్రాన్ని మరొక్కసారి రచయిత ధృవపరుచుకుంటాడు. ఒక శ్మశానానికో, ఒక మార్చురీకో, కూలీల అడ్డాకో, యాచకులని పరిశీలించటమో వంటి అంశాలను ఎంచుకోవడంలో రచయిత ఉరుకుల పరుగుల నగరంలో ఉలిక్కి పడే విషయాలుంటాయని చెప్పకనే చెబుతారు. హైదరాబాద్‌ నగర వారసత్వ ప్రతీకలయిన చార్మీనార్‌ ని, గోల్కొండ కోటను ఎంతో ప్రేమతో దర్శిస్తాడు. కానీ ఏం చెప్పాడు ! చార్మినార్‌ చుట్టూ అల్లుకుని వున్న జీవితాల్ని చూడమని లాలనగా చెప్తాడు. అలాగే గోల్కొండ కోట యిచ్చిన మతసామరస్యాన్ని కాపాడుకుందామని మథనపడుతాడు. ఆదివారం ఆబిడ్స్‌ లో పాతపుస్తకాల సందడిని వినమని ప్రేమగా చెబుతాడు. దుమ్ము పట్టిన అఫ్జల్ గంజ్‌ సెంట్రల్‌ లైబ్రరీని దర్శించి మన మస్తిష్కాలకు పడుతున్న బూజును వదిలించుకోమంటాడు. ఎర్రగడ్డ హాస్పిటల్‌ లోని దీనగాథలను మన ముందుంచి సన్నటి విభజన రేఖకు అవతల వాళ్ళు, యివతల మనం అని ఆవేదన చెందుతాడు.
                 ఇలాంటి రచనలకు ఏదో చెప్పాలన్న తాపత్రయం, సారళ్యమయిన వచనం, దోవచూపే దీపధారి కుండే నిబ్బరం, చిన్న చిన్న విషయాల్ని కూడా పాఠకులకు చూపగలిగే చొరవ.... ఇవే ఊపిరిగా నిలుస్తాయి. రాజిరెడ్డిలో ఆ లక్షణాలు పుష్కలంగా వున్నాయనిపిస్తుంది. అతని సున్నిత మనస్తత్వం కూడా చాలాసార్లు బయటకు తొంగి చూస్తు వుంటుంది. ఒక్కోసారి అది పాఠకులకు కొంచెం యిబ్బంది కూడా కలిగిస్తుంది. సంవత్సరం పాటు హైదరాబాద్‌ నగర సంస్కృతిని, ఆ సంస్కృతిలో నెమ్మదిగా చోటు చేసుకుంటున్న ఆధునిక పోకడలని, వైరాగ్య స్మృతులని పరిచయం చేయడం సామాన్యమయిన విషయం కాదు. ఆ పరిచయం చేసే క్రమంలో మనలోని అంతర్లోకాలని మనల్ని తడిమి చూసుకునేలా చేస్తారు. ప్రతి సందర్భాన్ని రన్నింగ్‌ కామెంటరీ లాంటి వ్యాఖ్యానంతో కొనసాగిస్తారు. కొన్ని చమక్కులు, విరుపులు, మెరుపులు, రసాత్మక వాక్యాలు యివన్నీ కలగలసి ఒక పరిమళాన్ని ప్రతి రియాలిటీ చెక్‌ కు అద్దాయి. ఇలా వచనంలో తనదయిన ముద్ర వేసుకున్నారు రాజిరెడ్డి.
                 నగర చరిత్రను చెప్పటం వేరు. నగరపు సమకాలీనతను చైతన్య స్రవంతి శిల్పంలా ఆవిష్కరించడం వేరు. అది పూడూరి రాజిరెడ్డి సాధించిన ఒక విజయం. అయితే చాలా సందర్భాలను రచయిత తనకు ఆన్వయించుకునే ప్రయత్నం చేశారు. అది కొంచెం పాఠకుణ్ణి కాస్త యిబ్బంది పెడుతుంది. అంత స్వీయాన్వేషణ అవసరం లేదేమో. దాన్ని లోపంగా చెప్పటం లేదు. కానీ ఒంటరిగా వుంటూనే సమూహాన్వేషణ జరిగినప్పుడు అది మరింత ఫలవంతంగా వుంటుంది.
         ఇక పుస్తకాన్ని చాలా సుందరంగా, ఒక తపనతో తీర్చిjదిద్దిన ' తెనాలి' ప్రచురణల వారిని అభినందించాలి. అతి తక్కువ ముద్రా రాక్షసాలు కన్పిస్తాయి. చక్కటి పేజీ మేకప్‌ తో దృష్టిని మరల్చనివ్వదు 'రియాలిటీ చెక్‌'. హైదరాబాద్‌ నగర వైదుష్యానికి, వైశిష్ట్యానికి సలాం చేస్తుందీ 'రియాలిటీ చెక్‌'.

-సి.ఎస్‌.రాంబాబు
(ప్రజాశక్తి ఆదివారం; 15 Jun 2014)

మూడు పుస్తకాలపై ఒక స్పందన

(పాఠకమిత్రుడు అశోక్ చిన్నం ఏప్రిల్, 2016లో మెయిల్ ద్వారా పంపిన లేఖా స్పందనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఒకట్రెండు అక్షర దోషాలు మాత్రం సవరించాను.)

రియాలిటీ చెక్
ఉద్వేగాలను అక్షర  రూపంలోకి బదిలీ చేయవచ్చు అని రియాలిటీ చెక్ చదివిన తరువాతే తెలిసింది. మన స్పృహలోకి రాకుండా మనలో అతి మాములుగా చెలరేగే అనేక భావాలు వాక్యరూపం లో చూసి, ఇటువంటి భావాలను కూడా రాయవచ్చా అని  ఆశ్చర్యపోయి, అక్కడే కొద్దిసేపు ఆగి, ఆ ఆశ్చర్యాన్ని సంపూర్ణంగా అనుభవించి, తిరిగి చదవడం మొదలుపెట్టేవాణ్ణి. ఇంత సాధారణ వ్యవహార భాషలో, ఇలాంటి వచనం లో కూడా మనసుకు హత్తుకుని, మెదడులో ఇంకిపోయేలాగా తత్వాన్ని వివరించారు. "ప్రపంచం రెండు పరస్పర విరుద్ధావకాశాలను మనముందుంచి ఎంచుకునే విచక్షణ మీద ఒత్తిడి పెడుతుంది." ఈ వాక్యం కంటి నుండి మెదడుకి చేరగానే ఒక్కసారిగా ఆలోచనలు మనల్ని మన గతంలోని అలాంటి సన్నివేశంలోకి తీసుకెళ్తాయి. "నిరాడంబరతను జీవన విధానంగా చూపిస్తే ఆ గుణాన్ని పూజిస్తారుగానీ తమ జీవితాల్లోకి తెచ్చుకోరు." ఈ వాక్యం తో దేవుడి స్వరూపాన్ని చూడడానికి నాకు ఒక కొత్త కోణం దొరికినట్టుగా అనిపించింది. నాలోని నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని ఒకేసారి సంతృప్తి పరచగలిగారు. మౌనసందేశం ఏదో ఇమిడి ఉంది అందులో. "మరణం మాత్రమే మనిషి విలువని నిక్కచ్చిగా లెక్కకట్టగలదు" అని చెప్పినపుడు మీలోని తాత్విక లోతులు కనిపించాయి. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బాధని సరాసరి మా మనసుల్లోకి బదిలీ చేయగలిగారు, మా కళ్ళను కూడా తడిగా చేయగలిగారు. ఈ పుస్తకం చదువుతూ ఆనందించాను, ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను, మౌనంగా ఐపోయాను, నవ్వాను, కోపం తెచ్చుకున్నాను, నాలోకి నేను వెళ్లి చూసుకున్నాను, నాలోనుండి ప్రపంచాన్ని కొత్తగా చూసాను. సుమారు దశాబ్దంన్నర నా పఠనం ప్రపంచంలో ఇంతగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఇదే!

మధుపం
రియాలిటీ చెక్ చదివిన తర్వాత కలిగిన కుతూహలంతో మీరు రాసిన ఇతర పుస్తకాల గురించి  ఆరా తీసి పనిగట్టుకుని కాచిగూడకి వెళ్లి తెచ్చుకున్న పుస్తకం మధుపం. అవివాహితుడినైన నాకు పెళ్లి మీద ఉండే సహజ కుతూహలాన్ని పెంచుతూ, అదే సమయంలో అస్పష్టమైన ఆందోళనను కూడా కలిగించింది ఈ పుస్తకం. ఒకే మగ జీవితాన్ని నాలుగైదు సార్లు జీవిస్తే తప్ప ఇలాంటి స్పష్టత (?), భావాలు కలుగవేమో అనిపించింది. స్వచ్ఛమైన, నిర్మలమైన మగ రాజసాన్నిఎంతగా అనుభవిస్తే ఇలాంటి భావాలు కలగాలి! " ఆ నవ్వు .. జీవితాన్ని చాలా చూసాక ఇంకా అంతకంటే నువ్ నన్నేం చేయగలవ్? అన్న ధిక్కారంలో నుంచి వచ్చిన నవ్వు... నీకు ఎదురొడ్డి పోరాడుతున్నాను చూడు... అన్న మగ అహంకారం లోనుంచి వచ్చిన నవ్వు.." లాంటి వాక్యాలు చదివినప్పుడు పెదవులు, ఛాతి ఒకేసారి కొంచెం వెడల్పు అయ్యాయి.. ఇది చదివిన ప్రతి మగవాడు తమ ఆత్మకథగా ఫీల్ అవుతాడు అని చెప్పడంలో అతిశయోక్తి  ఏమి అనిపించడం లేదు నాకు. అంతగా ప్రచారం లేని ఈ పుస్తకాన్ని నా స్నేహితుడికి ఇచ్చేటప్పుడే  హెచ్చరించాను తిరిగివ్వడం మర్చిపోవద్దని..

పలక పెన్సిల్
మొదటి రెండు పుస్తకాలు చదివిన తర్వాత, ఈ పుస్తకం నుండి మరిన్ని అనుభూతులు, చిరునవ్వులు ఆశించడంలో తప్పు లేదు. మొదటగా, వెనక కవర్ పేజి మీద ఉన్న "నువ్ ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో ఈ ప్రపంచాన్ని క్షమించేసాను" అనే వాక్యం చదవగానే ఈసారి మన రాజిరెడ్డికి కృష్ణశాస్త్రి  పూనాడేమో అని సందేహం కలిగింది. "పల్లెటూరి  సౌందర్యం అర్థం చేసుకోవాలంటే పట్నం రావాల్సిందే"  అని చదవగానే ఒక్కసారిగా బాధ, జ్ఞాపకాలు గాలివానలాగ చుట్టుముట్టాయి. "తొలి అడుగు" వ్యాసం ఒకేరోజు 4 సార్లు చదువుకున్నాను.. "నేనేమిటి" చదువుతున్నంతసేపు నిలువుటద్దం లో నన్ను నేను చూసుకున్న భావన. చక్కని ఫుట్ కోట్ లు వ్యాసాలకు మరింత ఆకర్షణగా నిలిచాయి . అలవాటు ప్రకారం ప్రతి వ్యాసంలో నచ్చిన వాక్యాలు అండర్ లైన్ చేస్తూపోయాను... తద్వారా చివరికి తెలిసింది ఏమిటంటే నా పెన్ లో ఇంకు ఐపోయింది అని. మన సిరిసిల్ల వ్యక్తిలో ఇంత తాత్వికత, భావ ప్రవాహం, రచనాపటిమ, మనో సంఘర్షణా విశ్లేషణ ఎలా పెరిగి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పుస్తకాన్ని అలమారలో సులువుగా కనిపించే విధంగా దాచుకున్నాను. బుచ్చిబాబు చివరకు మిగిలేది చదివిన తరువాత వచ్చే శూన్యం(?)  మరోసారి అనుభవించాను...

--
Ashok Ch.

Saturday, July 2, 2016

అన్ని రంగుల ప్రేమికుడు

ఓ, ఆరోజు కొంచెం సాహిత్యం గురించి కూడా మాట్లాడుకున్నాములే, మందెక్కువై.
ఆ గదిలో- దాన్ని గుహంటాను నేను- నలుగురం ఉన్నామప్పుడు.
మాటల దొర్లింపులో ఒక తొంబై ఏళ్ల పెద్దాయన ప్రసక్తి వస్తే, మా జట్టుకు నాయకుడిలాంటి వ్యక్తి ఇలా చెప్పాడు:
"ఆ పెద్దాయన ఎర్రటి కవికీ చప్పట్లు కొడతాడు; పచ్చటి కవినీ భుజం తడతాడు; నీలి కవినైనా చెవివొగ్గి వింటాడు; నిజమైన కవిత్వ ప్రేమికుడంటే నమ్ము''.
సరైన ట్యూనులో వినవచ్చే అదే పాటనూ, అదే ట్యూనులో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మరో పాటనూ కూడా నేను ఏకకాలంలో ఆనందించగలను. ఈ పెద్దాయనెవరో నాలాగే ఉన్నాడే!
అయితే, మాలో కవిత్వం రాసే అలవాటున్న స్నేహితుడు మరో సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు:
"మీరు చెప్తున్నది వినడానికి బాగుంది సర్. కానీ నాదో సందేహం. దృక్పథం లేకుండా ఆనందించగలిగే లగ్జరీ ఆయనకు పుట్టుకతో వచ్చిందా? సాధన వల్ల వచ్చిందా?''

(జూన్ 6, 2016 సాక్షి సాహిత్యం/ కలంపేరుతో ప్రచురితం)

Tuesday, March 1, 2016

చిన్నోడు పెద్దోడయ్యాడు

మా చిన్నోడ్ని చిన్నోడంటే ఒప్పుకోడు. బదులుగా తన మూరెడు కొలతను చూపిస్తాడు. వాడికిప్పటికీ వాడి అన్న వాడికన్నా ముందు ఎందుకు పుట్టాడనేది సహించలేని విషయమే! అదేదో తానే పుట్టవచ్చుగా! అయితే వాడు పెద్దోడయ్యాడని అంగీకరించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది.

(తరువాయి కింది లింకులో)

http://vaakili.com/patrika/?p=10221

(వాకిలి; ఫిబ్రవరి 2016)

Wednesday, February 24, 2016

వీడియో: ఒక బాటసారి బైరాగి పదాలు

ఒక బాటసారి బైరాగి పదాలు పేరిట ఛాయ వాళ్లు ఫిబ్రవరి 7న హైదరాబాదులో ఏర్పాటుచేసిన ప్రసంగ కార్యక్రమపు వీడియోలు ఇవి:

https://www.youtube.com/watch?v=SjdU70Ieg1A

https://www.youtube.com/watch?v=1byCHpP590w




Thursday, February 18, 2016

ఒక ప్రస్తావన


(ఫిబ్రవరి 1, 2016; సాక్షి - ఫ్యామిలీ)

Sunday, January 31, 2016

ఒక బాటసారి బైరాగి పదాలు

ఎఫ్బీ లోకి దాదాపుగా షిఫ్ట్ అయిపోయినా కూడా, ఇంకా ఈ బ్లాగే నాకు మరింత దగ్గరగా అనిపిస్తుంది. పోస్టులు పెద్దగా పెట్టకపోయినా కూడా, దీన్ని వదలకపోవడానికి అదో కారణం. ఎఫ్బీలో ఆల్రెడీ పోస్టు చేసినా కూడా బ్లాగు మిత్రులకోసం ఈ అహ్వానం.

రాయడం అంతకు పదేళ్లముందే మొదలుపెట్టినా, 2008 నుంచి 2015 వరకు ఈ ఎనిమిదేళ్లలో మూడు పుస్తకాలు ప్రచురించాను. మధుపం, పలక-పెన్సిల్, రియాలిటీ చెక్. ఇంకా పుస్తకాలుగా రానివి ఆజన్మం కాలమ్, ఆ తర్వాతి రాతలు... అలాగే, నా కథలు. వీటన్నింటి గురించి మిత్రుడు, విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:30కు దోమలగూడలోని ఇందిరా పార్క్ దగ్గరి  హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మాట్లాడుతారు. ఆ రాతల్ని బట్టి, తన ప్రసంగానికి కాకుమాని ఎంచుకున్న శీర్షిక 'ఒక బాటసారి బైరాగి పదాలు'. ఈ కార్యక్రమ నిర్వహణ ఛాయ మిత్రులు.

వచ్చే ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమానికి హైదరాబాదులో ఉన్న మిత్రులు ఎవరైనా వీలు చేసుకుని వస్తే సంతోషిస్తాను.

Saturday, January 23, 2016

చిన్నప్పటి ఒక సరసపు వాక్యం

ఈ విషయం విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోకపోవడానికి కారణం, ఇలాంటిదొకటి జరగడం అనూహ్యం కాదనుకోవడమే!
మావాడి క్లాసులో ఉండే అక్షయ్‌రాజు అనే పిల్లాడు, అదే క్లాసులో చదివే ఒకమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడట! అలా అని మావాడితో చెప్పాడట! వాడు ఆ మాటను మోసుకొచ్చి వాళ్లమ్మ చెవిలో వేశాడు.
(తరువాయి కింది లింకులో)

(వాకిలి: జనవరి 2016)

కథంటే ఏమిటి?

కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(తరువాయి కింది లింకులో)

http://vaakili.com/patrika/?p=5820

(వాకిలి: జూలై 2014)

మన పర సమూహాలు

ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు జారిపోయింది. ముందుగా ‘రియాలిటీ చెక్’ రాస్తున్నప్పటి ఒక సంగతి.
(తరువాయి దిగువ లింకులో)
http://patrika.kinige.com/?p=5291

(కినిగె పత్రిక: మార్చి 19, 2015)

రెండు మొదటిసార్లు

ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు.
గత రాత్రి చలిమంట దగ్గర ఎవరో మరిచివెళ్లిన ‘తునికాకుల చుట్లు’ పుట్టించిన కుతూహలం మొట్టమొదటి అనుభవం. కానీ లేత పెదాలకు ఆ రుచేమీ గుర్తులేదు.
మళ్లీ కౌమారపు మలిపాదంలో- బస్‌పాస్‌ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందన్న భరోసా ఉన్న కాలంలో- అంటే- ఊరికే ఏదో బస్సెక్కేసి, ఎక్కడో దిగేసి, మరో బస్సెక్కి వచ్చెయ్యాలంతే! అలా ఉన్నట్టుండి జూ పార్కు ముందు దిగాం, నేనూ, శివిగాడూ.
(మిగతా కింది లింకులో)
http://patrika.kinige.com/?p=4977

(కినిగె పత్రిక: ఫిబ్రవరి 6, 2015)

దృశ్యం - భావం

రోడ్డు మీద మనకు తారసపడే ప్రమాద దృశ్యంలో – మనం పాలుపంచుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎప్పుడోగానీ రాదు. అక్కడెందుకో జనం గుమిగూడారని కుతూహలపడేలోపే, బాధితుడిని ఎవరో బండ్లో ఎక్కిస్తూవుండొచ్చు; అప్పటికే చెదిరిపోతున్న గుంపులోంచి, ‘ఎవరో బండిమీదికేలి వడ్డరు,’ అని వినాల్సి రావొచ్చు; అయితే, అలాంటి దాటిపోయే ప్రయాణికుడిగా ఉండలేని సందర్భం నాకోసారి ఎదురైంది. మా మధును కలవడానికి నేను హుడా కాలనీకి వెళ్తున్నాను. గంగారం దాటుతుండగా – ఉన్నట్టుండి నేను ప్రయాణిస్తున్న వాహనం సడెన్‌బ్రేక్‌తో ఆగిపోయింది; ‘అయ్యయ్యో’ ‘యాక్సిడెంట్’ లాంటి మాటలు దొర్లిపోతున్నాయి; ఒక్కసారిగా జనం మూగిపోయారు.
పెద్దాయన! పడిపోయివున్నాడు; కాలికి దెబ్బ తగిలింది; రక్తం కారుతోంది; హడావుడి మాటలేవో వినబడుతున్నాయి; ఒకాయనదైతే చాలా పెద్ద నోరు!
ప్రాథమిక కుతూహలం తీరిపోయాక, ఆయన చుట్టూ ఉన్న వలయంలోంచి ఒక్కొక్కరే వెనక్కి అడుగులు వేశారు. నేను ఉన్నచోటే ఉండటం వల్ల ముందుకైపోయాను.
(మిగతా కింది లింకులో)
(కినిగె పత్రిక: నవంబర్ 5, 2014)



రెక్కల పెళ్లాం

అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పాటికి వాళ్ల కూతుళ్ల పెళ్లిళ్ల గురించి మథనపడుతూ ఉండివుంటారు!
కొంత వయసు ఖర్చయినా ఎట్టకేలకు తను కలగన్న భార్య దొరికింది. ఈ పరగణాలో అలాంటి ఇంకో అమ్మాయి ఉండే అవకాశమే లేదు!
తొలిపడకరోజు – మల్లెపూలు పెడుతున్న అల్లరిని కూడా గుర్తించకుండా – భార్య వీపును ఆత్రంగా తడిమాడు.
కొనదేలిన గూడుఎముకల స్పర్శ తప్ప, కావాల్సిన ఆనవాలు దొరకలేదు. ‘ఎక్కడో మోసం జరిగింది!’
తెల్లారి – పెళ్లి కోసం ఇన్నాళ్లుగా పట్టుబట్టిన అమ్మను నిలదీశాడు.
“నువ్వు మరీ చోద్యంరా; రెక్కల కోడల్ని ఎక్కడ్నించి తేను!”
(మిగతా దిగువ లింకులో)
(కినిగె పత్రిక: జూన్ 27, 2014)


పరిచిత అపరిచితుడు

అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.
(మిగతా కింది లింకులో)
http://magazine.saarangabooks.com/2015/12/30/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

(సారంగ: డిసెంబర్ 30, 2015)

రెండు దమ్ములు

నా కుతూహలానికి ఫలితం ఇవ్వాళ అనుభవించబోతున్నాను.
‘అన్నా, నైట్ ప్లాన్ ఏంటి? అక్కాపిల్లలు ఊళ్లో ఉన్నరా?’ అప్పుడెప్పుడో అనుకున్నది…’ పొద్దున్నే వంశీ నుంచి మెసేజ్.
ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. వేసవి సెలవులు కదా ఊరెళ్లారు. ఏ అజ్ఞాతస్థలంలోనో చేయాల్సివచ్చేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు! ‘పక్కోళ్లు గుర్తుపట్టరు కదా!’
(మిగతా కింది లింకులో)
http://magazine.saarangabooks.com/2015/06/18/%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A6%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/


(సారంగ: జూన్ 18, 2015)

నేనేం మాట్లాడుతున్నాను?

నేనేం మాట్లాడుతున్నాను?
NOVEMBER 19, 2014 

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.
కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!
మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలుకథాసమయంమిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!
*
నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలుమీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసినతామందరినీనిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన మాటలు ఎక్కడ ఆగాయంటేసీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!
వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలేఅని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాంనేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!

వాళ్లు లేవనెత్తినట్టుగా రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?
అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?
(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ బాధే ఉందేమో! )
ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.
వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.
మొదటే చెప్పాల్సిన డిస్క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.

ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!
సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాంఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లోవచ్చాండా’, ‘పోతాండాలాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాసఅని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.
*
నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నాకు బదులుగావస్తున్నాఅని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!
ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలోఅచ్చినఅనరు; ‘వచ్చినఅనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; కులంవాళ్లు, కులంవాళ్లు; జిల్లావాళ్లు, జిల్లావాళ్లు; హైదరాబాద్తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.
నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్తోఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనేఅని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినాఏమే, ఏందేఅనలేదు. కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!
అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడారాజిరెడ్డి గారుఅనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్ను వయసుతో నిమిత్తం లేకుండాఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!
అవతలివారిని బట్టి, నా నాలుకవచ్చిండ్రాఅనేదివచ్చారాఅనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడానా గొడవే అన్నాడుగానీనా లొల్లిఅనలేదు.
నా భార్య మొన్నోసారి మావాణ్నిపోయినబదులుగావెళ్లానుఅనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.
నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటంతన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చినపాత్రోచిత సందర్భంఅయితే తప్పలేదంటే ఆర్టికల్లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!
*
మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘అని రాయబోయి, ‘టితో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారుపోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపునురాంరెడ్డీఅని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!
ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?
నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?
నాకు కొంతకాలంఆనిగెపుకాయే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికివాళ్లదయిపోతుంది.
ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.

మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?
నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చినఇండస్ పబ్లిక్ స్కూల్ముందుభాగంలోజీపీఏ 10/10’ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. తల్లో పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజంఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!
(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)
-పూడూరి రాజిరెడ్డి



మీ మాటలు
1.    P.Jayaprakasa Raju. says:
“ ‘సమాజంఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర! ” —
కొన్ని భాషలు , సంస్క్రుతులు గుర్తింపు లేకుండా పోతున్నాయి అనుకునే వారంతా ఆలోచించవలసిన విషయం అనిపిస్తోంది !

o    Manjari Lakshmi says:
మన భాషా సంస్కృతులు నిలబెట్టుకోవాలంటే వెనకటి వ్యవస్థలోనే/పుట్టిన ఊరులోనే ఉండాల్సి వస్తుంది. అందరితో పాటు అభివృధ్ధి చెందాలంటే/పోటీ పడాలంటే వెనకటిదంతా వదిలేయాల్సి వస్తోంది. ఇది కొంత సంక్లిష్టంగానే అనిపిస్తోంది.

§  P.Jayaprakasa Raju. says:
ఇందులో సంక్లిష్టత యేమీ లేదు. మనుషులు తమ బ్రతుకుదెరువు కోసం వెతుకులాడే క్రమం లో భాషా , సంస్క్రుతుల ఆలోచన వుండదు. ఆర్థికంగా స్థిరపడితేనో , లేక జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయినపుడో యివి అన్నీ గుర్తుకు వస్తాయి.

2.    venkat says:
రాజిరెడ్డి గారు

మన సోకాల్డ్ సాహిత్యకారులు అమెరికాను వ్యతిరేకించినట్టు కోస్తాంధ్రను వ్యతిరేకించనక్కర్లేదు. మీరు పొరపాటున ఆధిపత్యానికి అమెరికాను, కోస్తాంధ్రను ముడిపెట్టినట్లున్నారు. కోస్తాంధ్రలో కూడా మండలానికో మాండలికం ఉంది. అది రాతకు అంత తేలికగా లొంగేది కాదు. విని చూసి తీరవల్సిందే. నక్కా విజయరామరాజు వంటి కొద్దిమంది మాత్రమే దాన్ని పట్టుకోగలిగారు. అంత చిన్న కోస్తాలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే పలనాడు ఒక రకంగా ఉంటే తెనాలి, బాపట్లవైపు మరొక రకంగా ఉంటుంది. కృష్ణాజిల్లాలో తిరువూరు నూజువీడు ఒకరకంగా ఉంటే దివిసీమ భాషా సంస్క్రుతి వేరేగా ఉంటుంది. గోదావరిలో ఏజెన్సీ ఒకరకంగా ఉంటే కోనసీమ మరోలా ఉంటుంది.

నా మనవి ఏమంటే మనందరం ఆధిపత్య కులాల భావజాలాన్ని ప్రాంతానికంతటికీ అన్వయిస్తున్నాం. గుంటూరు, గోదావరి జిల్లాలలో దళితులు లేరా. దూదేకులు లేరా? దళిత క్రిస్టియనులు లేరా? పల్లీయుల భాష లేదా?
ప్రాంతాలను గుడ్డిగా ద్వేషించకండి మిత్రులారా

o    కంకట్ says:
వెంకట్ గారూ లామకాన్ లో విన్నదంతా అప్పజెప్పేస్తే ఎలా :)

3.    
Mythili Abbaraju says:
నావరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడతాను ”- బాగా చెప్పారండీ. దాన్ని గుర్తించగలగటం గొప్పసంగతి . వ్యాసం ముగింపులో చెప్పినమాటలు చాలా నిజం- పూర్తిగా వెనక్కిపోవటం దాదాపు అసాధ్యం , కొత్త బాటేదో పడతామంతే.

4.    venkatesh says:
రాజి రెడ్డి గారు,
మీ పోస్ట్ చాల బావుంది….ఆలానే అందులో చాల వాస్తవం కూడా వుందనిపిస్తుంది….ఆలోచించాల్సిన విషయమే సుమా……………పరిస్తితులను బట్టి మన ప్రవర్తన మారడం సహజమేనేమో .అభినందనలు

5.    Visweswara Prasad says:
మనసులో ఉన్నది ఎంత పచ్చిదైన (అది సరైనదా కాదా అన్న తార్కికాన్ని పక్కన పెడితే) దానిని నిర్మొహమాటం గా మీరు చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. బహుశా అందరు అలానే ఉండాలనుకుంటారు, కాని ఒక ముసుగు కప్పు కుంటాము సమాజానికి సంశయించి.
నేను మీ అభిమానిని రాజి రెడ్డి గారు. మొన్న రవి వీరేల్లి గారు వచ్చినపుడు మీతో పరిచయం కలిగించమని అడిగాను. కాని సమయాభావం వల్ల కుదరలేదు. మీరు అవకాశం ఇస్తే ఒక సారి కలవాలి మిమ్మల్ని.

6.    తహిరో says:
రాజీనీ బాధంతా అర్థం చేసుకున్నా. ఎదుటి వాళ్ళ భాష మనకు, మన భాష ఎదుటివాళ్ళకూ అర్థమయితే చాలు . అదే ప్రామాణిక భాష . మనలోని భావాలు ఎదుటి వారిలో కనిపించినప్పుడు మనలో ఎగసిపడే భావోద్వేగమేస్పందనఅయినట్టు , మన మాట ఎదుటి వాళ్ళకు అర్థమయినదేప్రామాణికభాష అనుకుంటే సరిపోదా ? నీ నర్సింగాపురం భాష నీకు ప్రామాణికం అయినట్టే ఎవరి నోటి నుండి వెలువడే భాష వాళ్ళకు ప్రామాణికం.

గంతేఇంకొకరు ఏమనుకుంటే ఏంది పిలగాఊకె ఏందీ రుస రుస ఆయ్!


ఆహారం, భాష, దుస్తులు …. ఇవి ఆయా ప్రాంతాల సంస్కృతితో ముడివడిన సంగతులు. విషయం లోతుసంస్కృతిఅనే పదాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది. సంస్కృతులు అనేవి యధాతధంగా వాటి స్థానంలో అవి ఉన్నపుడు ఒకటి గొప్పా కాదు, మరొకటి చెడ్డా కాదు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. ప్రజల సర్వతోముఖ అభివృద్ధితో ముడిపడి ఉన్నంతవరకు సంస్కృతి అయినా గొప్పదే. కానీ వచ్చిన చిక్కంతా చరిత్ర ఎక్కడి సంస్కృతిని అక్కడే ఉంచలేదు. ఇప్పుడు భారత దేశ ఎల్లలు దాటి విషయాన్ని పరిశీలిస్తే .. వ్యాపార వాణిజ్యాలతో పాటు, పాత వలస పాలన, ఆధునిక సామ్రాజ్యవాద దోపిడి లాంటి ఆర్ధిక ఆధిపత్య కార్యకలాపాలు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవటానికి, సంభాషించుకోవటానికి, సమ్మిళితం కావడానికి దారి తీసింది. అయితే ఆధిపత్య వర్గాలకు చెందిన సంస్కృతి డామినేట్ చేయటానికి ప్రయత్నించినపుడు ఘర్షణ తప్పదు. ఇడ్లీ, దోసెల నుండి బయటపడి పిజ్జా, బర్గర్ల లోకి లాగుతున్నారు. తెలుగులో ఉన్న అన్ని మాండలీకాలు పక్కన పడేసి ఇంగ్లీషే శరణ్యమంటున్నారు. సాంప్రదాయ దుస్తుల నుండి వాళ్ళ జీన్స్ లోకి తరుముతున్నారు. ఆహారం, భాష, దుస్తులు అన్నీ వాళ్ళ వ్యాపార అవసరాలకు అనుగుణంగా యూనివర్సల్ చేసే ప్రయత్నం (ఇక్కడ ప్రపంచీకరణ, సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనే పదాలు వాడక తప్పదు) జరుగుతున్నపుడు ఆగ్రహం, ఘర్షణ ఆయా సమాజాల్లో సహజమే.
అయితే పాత కొత్తల మధ్య సంఘర్షణ ఎప్పుడూ తప్పదు. సంఘర్షణ జరిగితేనే మెరుగైన అంశం బైటికి వచ్చి అభివృద్ది వైపుకి సమాజాన్నినడిపిస్తుంది. అలాగే ప్రపంచీకరణ యుగంలో స్థానికం, పరాయిల మధ్య సంఘర్షణ అనివార్యం. సంఘర్షణలోంచి పుట్టే మెరుగైన అంశాలను, అవి ఏవైపు నుండి వచ్చినా, స్వీకరించాల్సిందే.

అయితే ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావాలకు ఏది విలువ ఇస్తుందో అదే గొప్పది, అదే మెరుగైనది, అదే ఆధునికమైనది. కొత్తకు పునాది పాతే కనుక రెండింటిలోనూ ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావనలకు విలువ ఇచ్చేవి ఉంటాయి. వాటిని కాపాడుకుని విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించటమే నేటి మనిషి కర్తవ్యం. మాటకొస్తే కాలంలోనైనా, సంస్కృతి రీత్యా, మనిషికి కర్తవ్యం ఇదే. పాతలోంచిమంచిని నిలుపుకొని కొత్తలోని అభివృద్ధిని ఆహ్వానించాలి.


o    ramana s.v. says:
రామా సుందరి గారూ
మీరు తెలుగులో రాయడానికి ప్రయత్నిచ వచ్చు గదా. పారిభాషిక పదాలు వాడి పై చేయి తీసుకోవాలనుకోవడం ఎందుకూ?
~~~ అయితే ఆధిపత్య వర్గాలకు చెందిన సంస్కృతి డామినేట్ చేయటానికి ప్రయత్నించినపుడు ఘర్షణ తప్పదు.~~~
మీరన్నది కరెక్ట్. నిమ్న కులాల వారికి విద్య ను దూరం చేయడానికి బ్రాహ్మణులు భాషను ప్రామాణీకరించారు. అకశేరుకాలు సకశేరుకాలు అంటూ బెదరగొట్టి భయ పెట్టారు. వాళ్ళు నాలుగు తెలుగు ముక్కలు నేర్చుకొనే సరికి వోడలు ఎక్కి ఇంగ్లాండు వెళ్ళి ఇంగ్లిష్ నేర్చుకొని వచ్చి ప్లీడరీ గ్రహించి పామరులను నానా హింసలు పెట్టారు. పునాదితో ఇవ్వాల్టికీ IAS లలో ప్రధాన భాగం ఆక్రమించి (చూ. అరుంధతి రాయ్ వ్యాసం) దేశాన్ని పరొక్షంగా తమ ఆధిపత్యం కింద తీసుకుని వున్నారు.
ఘర్షనే మొదటి ప్రయారిటి.
సాహిత్యంలో కూడా అంతే.
మరో సంగతి. కొలకలూరి ఇనాక్ కు పద్మశ్రీ వచ్చినప్పుడు `మరోసారి ఇనాక్ కథలు` శీర్షిక మీరు నిర్వహించి వుంటే నేను చాలా సంతోషించి వుండే వాణ్ణి. ఆధిపత్య వర్గాలకు చెందిన సంస్కృతి డామినేట్ చేయటం అంటే అదే.

8.    నిశీధి says:
>> ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! <<

వాక్యాలు ఎంత నిజం కదా ? ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక పూర్తీ సమాజపు అస్తిత్వం అంతా పదాల్లో కనిపిస్తుంది .


9.    N.RAJANI says:
మీ వ్యాసం బాగుంది అనే కంటే ఆలోచింప చేసేదిగా ఉంది.

చాలా మంచి వ్యాసం. ఆలోచింపచేలా ఉంది.

11. Sasidhar Pingali says:
రాజి రెడ్డి గారూ! వ్యాసం చాలా బాగుంది. ముఖ్యంగా భాషపట్ల మీ దృక్పథం నచ్చింది. చర్చల్లో పాల్గొనే అర్హత, అనుభవమూ రెండూలేనివాణ్ణి, కానీ వ్యాసం చదివాక నా అభిప్రాయాన్ని కూడా పంచుకోవాలనిపించి వ్రాస్తున్నా. నేనుద్యోగంలో చేరిన కొత్తల్లో తిరుపతినుండి వచ్చిన ఒక కొలీగ్ వుండే వాడు. ఛాలా కాలం కలసి పనిచేసినా ఎప్పుడు అతని ప్రాంతీయతని గుర్తించలేదు. ఒకసారి వాళ్ళ ఇంటినుంది అమ్మో, అన్నో ఎవరో ఫోన్ చేసారు. వెంటనే అతని మాట్లాడే యాస మారిపోయింది. సంభాషణ అయ్యేంతవరకు నేను నోరుతెరచి చూస్తూనే వున్నా. నాకెందుకో సంభాషణలో, యాసలో ఒకలాంటి ఆత్మీయత కనిపించింది. ఆతర్వాతే మిగతా వారిని గమనించటం మొదలుపెట్టాను. ప్రతి యాసలోనూ నాకు వారి ఆత్మీయత, నిజం చెప్పాలంటే ఆత్మ కనిపించింది. ఇక కోస్తా భాషల విషయానికొస్తే అది కేవలం పుస్తక భాష. (ఇదే విషయం ఇంతకుముందెవరో కూడా అన్నట్లు గుర్తు, పేరు గుర్తులేదు క్షమించాలి) సంభాషణలో నాకు ప్రతేకించి విడిగా ఆత్మీయత కనబడదు. నేనూ అక్కడి వాడినే మరి.

ఇక మనం ప్రాంతీయ భాష అంటున్నది చాలావరకు ఉచ్చారణను దృష్టిలో పెట్టుకునే. పల్లీయుల ఉచ్చారణకీ, అదే చదువుకున్న వారి ఉచ్చారణకీ ఖచ్చితంగా బేధం వుంటుంది. ప్రాంతీయంగా కొన్ని కొన్ని పర్యాయపదాలు కొన్ని కొన్ని చోట్ల వాడుతు వుంటారు. సొరకాయని ఆనపకాయ అన్నట్లుగా. నా నాలుక నాలుగు భాషలు మాట్లాడుతుందని మీరన్నది కొంతవరకు అవసరం, అనివార్యం రెంటికీ మించి సంస్కారం. ఒక తెలుగు రాని పరాయి రాష్ట్రీయుడితో మాట్లాడాలంటే మాధ్యమంగా హిందీనో, ఇంగ్లీషునో వాడతాం. ఎందుకంటే మనభావమో, బాధో వాడికి అర్థం కావాలి కాబట్టి. అంతమాత్రానా మనభాష పనికిరానిదైపోదుకదా. నేను గమనించినంతవరకూ చదువుకున్న కోస్తా వారిలో కంటే పల్లీయులదగ్గ, ఇతర ప్రాంతీయులదగ్గరా ఎక్కువ సంస్కృత పదాలు వింటూవుంటాం. ఎంతచదువుకున్నవారైనా అక్కడ ఒక్ హోల్ ని చూస్తే చిల్లు అనో, ఇంకా పచ్చిగా బొక్క అనో అనేస్తారు అదే పల్లీయులైతే రంధ్రం అంటారు. ఇలాంటి వుదాహరణలు చాలా చెప్పచ్చు. సుబ్బిగాడు సుబ్బారావైనట్లు నాగరికత పెరిగినప్పుడు భాషా మారుతుంది. గొప్ప గొప్ప తెలుగు రచనలు నాలుగు గోడలమధ్యనే వుండిపోవటానికి కారణం వాటిని ఒక సంధాన భాష లొకి (కామన్ ల్లంగ్వేజ్ ఇంగ్లీష్ లాంటి) తీసుకురానందుకే. రవీంద్రుని గీతాంజలికి నోబుల్ బహుమతి వచ్చిందికూడా ఆయన ఇంగ్లీషు అనువాదానికే కానీ బెంగాలీ మాతృకకు కాదు. మనగోడు అందరికీ అర్థమవ్వాలంటే అందరికీ అర్థమయ్యె భాష అవసరమే మరి.


12. ramana s.v. says:
రమాసుందరి గారూ
మీరు తెలుగులో రాయడానికి ప్రయత్నిచ వచ్చు గదా. పారిభాషిక పదాలు వాడి పై చేయి తీసుకోవాలనుకోవడం ఎందుకూ?
~~~ అయితే ఆధిపత్య వర్గాలకు చెందిన సంస్కృతి డామినేట్ చేయటానికి ప్రయత్నించినపుడు ఘర్షణ తప్పదు.~~~
మీరన్నది కరెక్ట్. నిమ్న కులాల వారికి విద్య ను దూరం చేయడానికి బ్రాహ్మణులు భాషను ప్రామాణీకరించారు. అకశేరుకాలు సకశేరుకాలు అంటూ బెదరగొట్టి భయ పెట్టారు. వాళ్ళు నాలుగు తెలుగు ముక్కలు నేర్చుకొనే సరికి వోడలు ఎక్కి ఇంగ్లాండు వెళ్ళి ఇంగ్లిష్ నేర్చుకొని వచ్చి ప్లీడరీ గ్రహించి పామరులను నానా హింసలు పెట్టారు. పునాదితో ఇవ్వాల్టికీ IAS లలో ప్రధాన భాగం ఆక్రమించి (చూ. అరుంధతి రాయ్ వ్యాసం) దేశాన్ని పరొక్షంగా తమ ఆధిపత్యం కింద తీసుకుని వున్నారు.
ఘర్షనే మొదటి ప్రయారిటి.
సాహిత్యంలో కూడా అంతే.
మరో సంగతి. కొలకలూరి ఇనాక్ కు పద్మశ్రీ వచ్చినప్పుడు `మరోసారి ఇనాక్ కథలు` శీర్షిక మీరు నిర్వహించి వుంటే నేను చాలా సంతోషించి వుండే వాణ్ణి. ఆధిపత్య వర్గాలకు చెందిన సంస్కృతి డామినేట్ చేయటం అంటే అదే.

13. hari.S.babu says:
భాషకీ ప్రాంతానికీ గట్టి లింకుందని నేననుకున్నది నిజమేనని తెలిసింది!

ప్రాంతం,భాష,సాంప్రదాయంఇవే మనిషి ఆస్తిత్వ త్రిగుణాలు కాబోలు?