Friday, September 16, 2016

మూడు పుస్తకాలపై ఒక స్పందన

(పాఠకమిత్రుడు అశోక్ చిన్నం ఏప్రిల్, 2016లో మెయిల్ ద్వారా పంపిన లేఖా స్పందనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఒకట్రెండు అక్షర దోషాలు మాత్రం సవరించాను.)

రియాలిటీ చెక్
ఉద్వేగాలను అక్షర  రూపంలోకి బదిలీ చేయవచ్చు అని రియాలిటీ చెక్ చదివిన తరువాతే తెలిసింది. మన స్పృహలోకి రాకుండా మనలో అతి మాములుగా చెలరేగే అనేక భావాలు వాక్యరూపం లో చూసి, ఇటువంటి భావాలను కూడా రాయవచ్చా అని  ఆశ్చర్యపోయి, అక్కడే కొద్దిసేపు ఆగి, ఆ ఆశ్చర్యాన్ని సంపూర్ణంగా అనుభవించి, తిరిగి చదవడం మొదలుపెట్టేవాణ్ణి. ఇంత సాధారణ వ్యవహార భాషలో, ఇలాంటి వచనం లో కూడా మనసుకు హత్తుకుని, మెదడులో ఇంకిపోయేలాగా తత్వాన్ని వివరించారు. "ప్రపంచం రెండు పరస్పర విరుద్ధావకాశాలను మనముందుంచి ఎంచుకునే విచక్షణ మీద ఒత్తిడి పెడుతుంది." ఈ వాక్యం కంటి నుండి మెదడుకి చేరగానే ఒక్కసారిగా ఆలోచనలు మనల్ని మన గతంలోని అలాంటి సన్నివేశంలోకి తీసుకెళ్తాయి. "నిరాడంబరతను జీవన విధానంగా చూపిస్తే ఆ గుణాన్ని పూజిస్తారుగానీ తమ జీవితాల్లోకి తెచ్చుకోరు." ఈ వాక్యం తో దేవుడి స్వరూపాన్ని చూడడానికి నాకు ఒక కొత్త కోణం దొరికినట్టుగా అనిపించింది. నాలోని నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని ఒకేసారి సంతృప్తి పరచగలిగారు. మౌనసందేశం ఏదో ఇమిడి ఉంది అందులో. "మరణం మాత్రమే మనిషి విలువని నిక్కచ్చిగా లెక్కకట్టగలదు" అని చెప్పినపుడు మీలోని తాత్విక లోతులు కనిపించాయి. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బాధని సరాసరి మా మనసుల్లోకి బదిలీ చేయగలిగారు, మా కళ్ళను కూడా తడిగా చేయగలిగారు. ఈ పుస్తకం చదువుతూ ఆనందించాను, ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను, మౌనంగా ఐపోయాను, నవ్వాను, కోపం తెచ్చుకున్నాను, నాలోకి నేను వెళ్లి చూసుకున్నాను, నాలోనుండి ప్రపంచాన్ని కొత్తగా చూసాను. సుమారు దశాబ్దంన్నర నా పఠనం ప్రపంచంలో ఇంతగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఇదే!

మధుపం
రియాలిటీ చెక్ చదివిన తర్వాత కలిగిన కుతూహలంతో మీరు రాసిన ఇతర పుస్తకాల గురించి  ఆరా తీసి పనిగట్టుకుని కాచిగూడకి వెళ్లి తెచ్చుకున్న పుస్తకం మధుపం. అవివాహితుడినైన నాకు పెళ్లి మీద ఉండే సహజ కుతూహలాన్ని పెంచుతూ, అదే సమయంలో అస్పష్టమైన ఆందోళనను కూడా కలిగించింది ఈ పుస్తకం. ఒకే మగ జీవితాన్ని నాలుగైదు సార్లు జీవిస్తే తప్ప ఇలాంటి స్పష్టత (?), భావాలు కలుగవేమో అనిపించింది. స్వచ్ఛమైన, నిర్మలమైన మగ రాజసాన్నిఎంతగా అనుభవిస్తే ఇలాంటి భావాలు కలగాలి! " ఆ నవ్వు .. జీవితాన్ని చాలా చూసాక ఇంకా అంతకంటే నువ్ నన్నేం చేయగలవ్? అన్న ధిక్కారంలో నుంచి వచ్చిన నవ్వు... నీకు ఎదురొడ్డి పోరాడుతున్నాను చూడు... అన్న మగ అహంకారం లోనుంచి వచ్చిన నవ్వు.." లాంటి వాక్యాలు చదివినప్పుడు పెదవులు, ఛాతి ఒకేసారి కొంచెం వెడల్పు అయ్యాయి.. ఇది చదివిన ప్రతి మగవాడు తమ ఆత్మకథగా ఫీల్ అవుతాడు అని చెప్పడంలో అతిశయోక్తి  ఏమి అనిపించడం లేదు నాకు. అంతగా ప్రచారం లేని ఈ పుస్తకాన్ని నా స్నేహితుడికి ఇచ్చేటప్పుడే  హెచ్చరించాను తిరిగివ్వడం మర్చిపోవద్దని..

పలక పెన్సిల్
మొదటి రెండు పుస్తకాలు చదివిన తర్వాత, ఈ పుస్తకం నుండి మరిన్ని అనుభూతులు, చిరునవ్వులు ఆశించడంలో తప్పు లేదు. మొదటగా, వెనక కవర్ పేజి మీద ఉన్న "నువ్ ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో ఈ ప్రపంచాన్ని క్షమించేసాను" అనే వాక్యం చదవగానే ఈసారి మన రాజిరెడ్డికి కృష్ణశాస్త్రి  పూనాడేమో అని సందేహం కలిగింది. "పల్లెటూరి  సౌందర్యం అర్థం చేసుకోవాలంటే పట్నం రావాల్సిందే"  అని చదవగానే ఒక్కసారిగా బాధ, జ్ఞాపకాలు గాలివానలాగ చుట్టుముట్టాయి. "తొలి అడుగు" వ్యాసం ఒకేరోజు 4 సార్లు చదువుకున్నాను.. "నేనేమిటి" చదువుతున్నంతసేపు నిలువుటద్దం లో నన్ను నేను చూసుకున్న భావన. చక్కని ఫుట్ కోట్ లు వ్యాసాలకు మరింత ఆకర్షణగా నిలిచాయి . అలవాటు ప్రకారం ప్రతి వ్యాసంలో నచ్చిన వాక్యాలు అండర్ లైన్ చేస్తూపోయాను... తద్వారా చివరికి తెలిసింది ఏమిటంటే నా పెన్ లో ఇంకు ఐపోయింది అని. మన సిరిసిల్ల వ్యక్తిలో ఇంత తాత్వికత, భావ ప్రవాహం, రచనాపటిమ, మనో సంఘర్షణా విశ్లేషణ ఎలా పెరిగి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పుస్తకాన్ని అలమారలో సులువుగా కనిపించే విధంగా దాచుకున్నాను. బుచ్చిబాబు చివరకు మిగిలేది చదివిన తరువాత వచ్చే శూన్యం(?)  మరోసారి అనుభవించాను...

--
Ashok Ch.

2 comments:

  1. Anonymous17.9.16

    మూడు పుస్తకాలమీద ఒక సమీక్షలాగా చాలా చక్కగా విశ్లేషించి రాశారు. నైస్ కామెంట్.

    ReplyDelete
  2. Anonymous3.2.17

    రాజిరెడ్డి గారి రచనలు చదువుతున్నప్పుడు కలిగే వర్ణనాతీతమైన భావస్పందనల గురించి మీ సమీక్షా ప్రస్తావన చాలా బాగుంది.

    ReplyDelete