Wednesday, June 10, 2015

రియాలిటీ చెక్ పుస్తకం మీద 'చర్చ' (మొత్తం)

ఏడాది క్రితం, మే నెలలో, అంటే మే 10, 2014న బెంగుళూరు వేదికగా జరిగే 'చర్చ' కార్యక్రమంలో రియాలిటీ చెక్ పుస్తకం మీద చర్చ జరిగింది.
ఆ చర్చలో-
కవన శర్మ(రచయిత; అసలు పేరు కందుల వరాహ నరసింహ శర్మ; రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్)
డాక్టర్ సి.మోహన్(మెడికల్ ప్రొఫెషనల్; సైన్యం నుంచి రిటైర్ అయ్యారు; బెంగళూరులోని 'ఎం.ఎస్.రామయ్య హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్'లో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు)
కుందుర్తి రజనీకాంత్(బెంగుళూరులోని ఎం.ఎస్.రామయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గా పదవీ విరమణ చేశారు)
డాక్టర్ ఎం.జె.రావు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు, బెంగుళూరు నుంచి ప్రొఫెసరుగా రిటైర్ అయ్యారు)
... పాల్గొన్నారు.
ఆ చర్చకు హాజరై, వారి అభిప్రాయాల్ని రికార్డు చేసి, తిరిగి కంపోజ్ చేసి పంపారు రియాలిటీ చెక్ పుస్తక ప్రచురణ కర్తల్లో ఒకరైన సుధామయి. దాన్నే యథాతథంగా బ్లాగులో పోస్టు చేస్తున్నాను. ఇదంతా సంభాషణ కాబట్టి, వాక్యాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ముగియవచ్చు.

ముందుగా, అప్పటి నోట్:

Place: MMCR Of Mech Engg DEpt., Upstairs on Right hand side  IISC
Nirvahana: Kavana Sarma 9448113195
Time:       5pm to 7.30 pm
Book: Reality Check
Presentation by Sarma 10 mins
First round 5 to 7mins each member participating in charcha
2nd round       time  available can be used for general issues

ఇక చర్చలోకి...

కవన శర్మ:
'చర్చ 'లో ఈ పుస్తకాన్ని చర్చకోసం సూచించడానికి నాలుగు కారణాలున్నాయి.
ఒకటి, కాళీపట్నం రామారావు మాస్టారు ఈ పుస్తకాన్ని స్వయంగా ఆవిష్కరించి, దానిగురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడటం;
రెండు, రచయిత అడగకుండానే పబ్లిషర్ ఇంత ఖర్చుపెట్టి ఈ పుస్తకాన్ని అచ్చువేయడం;
మూడోదేంటంటే రఘోత్తమరెడ్డి- మనకందరికీ తెలిసిన రఘోత్తమరెడ్డి- దానికి ముందుమాట రాసి, దాన్ని పొగడటం;
నాలుగోదేంటంటే, నేను కాలం రాయడంలో ఎంత డిఫికల్టీ ఎక్స్‌పీరియన్స్ చేశానో నాకు తెలుసు కనక బాగారాయగలిగిన వారిపట్ల నాకున్న ఆరాధనాభావం.
కొంతమంది కాలమ్‌ను ఒక సాహిత్య ప్రక్రియగా చాలా తక్కువ అంచనా వేస్తారు. నేను వేయను. అది చాలా కష్టసాధ్యమయిందే. సమర్థవంతంగా కాలమ్‌ను నిర్వహించిన రచయిత శక్తి నన్ను అబ్బురపరుస్తుంటుంది.

ఇక పుస్తకంలో విషయానికొస్తే, రచయిత ఒక స్థలకాలాలలో చూసిన దృశ్యాలను పదాలతో, వాక్యాలతో చిత్రించాడు. అంటే, దృశ్యాన్ని వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఈ చిత్రణలో ఒక కవితాధోరణి ఉంది. అలా నాకనిపించింది. ఒక చైతన్య స్రవంతిలాంటి పద్ధతిలో ఒక దృశ్యాన్నించి మరొక దృశ్యానికి పరుగులు తీస్తూ ఒక అవిచ్చిన్నతని ఇవి ప్రదర్శిస్తాయనుకుంటున్నాను. చైతన్య స్రవంతిలో ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్ళి, ఫైనల్‌గా ఎక్కదో తేలతాడు. ఇందులో అలా కాకుండా ఒక దృశ్యంవైపునుంచి మరోదృశ్యానికి వెళ్తూ చెప్పదల్చుకున్నవేపు ఆయన ప్రయాణం చేసినట్టుగా చెప్పబడింది. చివరికి ఒకదానివెంట మరోటిగా వచ్చే ఆ దృశ్యాలు తనలో కలిగించిన తాత్త్వికతనూ, వివేచననూ మనకొక టార్చ్ లైట్ వేసి చూపిస్తాడు. ఇక్కడ మళ్ళీ ఈ మాటెందుకు వాడాల్సి వస్తోందంటే, కాళీపట్నం రామారావుగారు కొసమలుపు, కొసమెరుపు అంటుంటారు. చివర్లో ట్విస్ట్ పెట్టి ఒ.హెన్రీలాగా చేయడమొకటి; అలా చేస్తూ కూడా టార్చ్ లైట్ వేసినట్లు ఒక మెరుపులాగా లైట్ ఫోకస్ చేయడమొకటి. అంతవరకూ మనకు తట్టనిది... అది ఒక్కసారి హైలైట్ అవుతుందన్నమాట. ఒకదానివెంట ఒకటిగా వచ్చే దృశ్యాలు తనలో కలిగించిన తాత్త్విక వివేచనను ఒక టార్చ్ లైట్ వేసి చూపిస్తాడీయన.
ఆయన మొత్తం 60 రాశాడు. మనం అన్నీ తీసుకోలేం. మచ్చుకు 9 తీసుకున్నా. తొమ్మిదీ ఈక్వల్లీ గుడ్డా కాదా అన్నది మీరు నిర్ణయించాలి. ఇవి రచయిత రచనా విస్తృతికీ, తాత్త్వికతకీ, శైలికీ మచ్చు అని నేననుకుంటున్నాను. అలా మీరనుకోకపోవచ్చుననే జ్ఞానం కూడా నాకుంది. నేను ఇవి చేయడంవల్ల ఆయనలోవున్న లోపాలూ, ఆయన స్ట్రెంత్‌లూ బహుశా బయటికొస్తాయని ఈ తొమ్మిదీ సెలెక్ట్ చేశాను.

నా ముఖ్యమైన ప్రశ్నేమిటంటే, ఆయన చెప్పదల్చుకున్న భావానికి ఆయన చేసినటువంటి పదచిత్రణ, ఆయన చేసేటటువంటి తాత్విక చిత్రణ తాలూకు ఎసెన్స్ కన్‌క్లూజన్‌కి ఇవి దోహదపరుస్తున్నాయ్యా; ఇవి అదేవిధంగా కనిపిస్తున్నాయా అని నాకొక అనుమానం ఉంది. అంటే ఆ దృశ్యాల పద చిత్రణ మనలో అదేవిధమైన తాత్విక చింతన కలిగిస్తోందా లేక ఆయన వాక్యం చేశాక "అవును... ఇందులో అదేదో ఉంది... అది కావొచ్చు" అనిపిస్తోందా? వాక్యంగా చెప్పిన రచన మనకు వాక్యంవినా అందుతోందా? అనేది ప్రశ్న. ఉదాహరణకి, కార్టూన్ వేసినపుడు కొందరు కాప్షన్ రాస్తుంటారు. అది రాయక పోతే మనకు అర్థం కాలేదనుకోండీ. అప్పుడీ రాయడమనేది లోటుపూరకమవుతుంది.
అప్పుడు ఈయన చేసినటువంటి సమ్మరీ- ఆయన ఏం చెప్పదల్చుకున్నాడని నేననుకున్నానో మళ్ళా తర్వాత చెప్తాను- నిజంగా టార్చ్ లైట్ వేస్తోందా? ఆయన ఆ విషయాలగురించి ఆలోచిస్తుంటే ఆ భావం కలిగుండొచ్చు. అదేభావం ఆయన రచన చదివినపుడు మనకూ కలుగుతోందా? ఆయన ఆ భావం చెప్పాక- అవును. ఇందులో ఆ భావం ఉంది- అనిపిస్తోందా? ఆయన చెప్పినప్పటికీ అనిపించలేదా?... ఇవీ ప్రశ్నలు.

మొదటి ఆవృత్తంలో అభిప్రాయాలు చెప్పడం; రెండో ఆవృత్తంలో వాటిమీద చర్చించడం.

డాక్టర్ మోహన్:
(ప్రచురణకర్తతో) మీరు చేసిందానికి అభినందిస్తున్నా. చాలా బాగుంది, నాకు నచ్చింది. ముఖ్యంగా వచనకవిత్వమంటారు కదా, ఆ ధోరణిలో బాగా వచ్చింది. వాక్యాలు కంప్లీట్‌గా లేకపోయినా, పదనిర్మాణంలో అద్భుతమైన చిత్రణ బాగుంది. ఎంపిక చేసిన తొమ్మిది టాపిక్సూ నాకు బాగా నచ్చాయి.

కవన శర్మ :
నా ప్రశ్న గుర్తుంది కదా? ఆయన తాత్త్విక చింతనా... కంక్లూజన్... ఆయన హైలైట్ చేసింది ఆయన తీసుకున్న దృశ్యాలవల్ల ఆయన చిత్రించిన విధానాలవల్ల అనిపించిందా?

డాక్టర్ మోహన్ :
ఆయన చెప్పిన విధానంలో ఆయన వెళ్ళిన చోటుకి మనల్ని తీసుకెళ్ళారు. ముఖ్యంగా మార్చురీ, తర్వాత వికసించని మొగ్గలు... డౌన్ సిండ్రోమ్ పిల్లల దగ్గరకెళ్ళడమనేది చాలా చక్కగా హృద్యంగా చిత్రీకరించారాయన. తర్వాత వేదం, స్మార్తం, ఆగమం...  కీసరగుట్ట హైదరాబాదుకు దగ్గరగా ఉంది. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాను. ఈసారి వెళ్ళినపుడు దానిని(వేదపాఠశాల) చూద్దామనే ఆలోచన కలిగింది.
ఇక లేడీ కండక్టర్లతో సంభాషణ... ఇక్కడ లేడీ డ్రైవర్లు కూడా ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ రెండు డ్యూటీలు చేస్తుంటారు. కల్పించుకొని మాట్లాడటం కష్టమేననుకోండి, ఈయన జర్నలిస్ట్ అయినా కూడా... తన ఇన్‌హిబిషన్స్‌ని పక్కనబెట్టి ఆవిడతో మాట్లాడటం, ఒకచోటినించి మరోచోటికి బస్‌లో ఎలావెళ్ళారు... మొత్తానికి ఆయన చెప్పదల్చుకున్నది నాకు బాగా హత్తుకుంది. ముఖ్యంగా ఆయన రచన చాలా బాగుంది. సెంటెన్సెస్ లేకపోయినా, ఆ పదాల కూర్పుతో మనకు ఫీల్ కల్పించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నన్ను ఆలోచింపజేశాయి. ఓవరాల్‌గా ఆ ముగింపులో కొన్నింట్లో ఆ మలుపూ మెరుపూ లేకపోయినా, ఇష్యూ నన్ను ఆలోచింపజేసింది. అన్నింటిలో ఇవ్వాల్సిన పంచ్‌లైన్స్ లేవు; ఉన్నవాటిలో బాగున్నాయి.

కుందుర్తి రజనీకాంత్:
క్షమిస్తే... కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటాను.
మొదట ఈ పుస్తకం... హైదరాబాద్‌లోని విషయాలదవటంవల్ల... మనకు పరిచయం ఉన్నదవటంచేత, కొంత చిన్న గిలిగింత. సలాం హైదరాబాద్‌లాగా... ఆ చిక్కడపల్లి, రెడ్డి కాలేజ్‌వైపు, ఆ ఎంఎల్ఎ క్వార్టర్స్, రవీంద్రభారతి... ఇలా కొద్దిగా చిన్న గిలిగింత పెట్టింది.
అయితే ఈ యాభై ఏళ్ళలో హైదరాబాద్ చాలా మారింది. ఈయన వయసులో నాకంటే బాగా చిన్నవాడు.... మిసెస్ ఎవిఎన్ కాలేజీ వాళ్ళు కవనశర్మగారికి ఒక సన్మాన పత్రం సమర్పించారు. అందులో ఒక పదం ఉంది- సుపరిచితులైన అపరిచితులు- అని. .... అంతకుముందు ఫైండ్ ద ఫెమిలియర్ స్ట్రేంజర్ అనే పుస్తకం చదివాను. అది నాకు బాగా పట్టుకుంది. అలాగనిపించింది ఇదికూడా. కొన్ని మనకి తెలియనివి కూడా ఆయన చూపించారు. ఉదాహరణకి ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ చూడలేదు నేను. అలాగే డౌన్ సిండ్రోమ్ పిల్లల స్కూల్ తెలీదు. అలాంటివి కొన్ని తెలియని సన్నివేశాల్ని, మరి కొన్ని తెలిసినవే ఒక కొత్త కోణంలోంచీ ఒక కొత్త కిటికీలోంచీ చూపించారు. మంచి శైలి. చాలా ఆకర్షణీయంగా రాసుకొచ్చారు.
ఆ శైలి గురించి చెప్పబోయేముందు, రచయిత ఉద్దేశం మామూలుగా ఏమిటీ అనుకుంటే, ఆయనే రాసింది- ఒక ఫీచర్- 'అమ్మ ఆవు ఉన్నట్టుండి ఊరు 'లో ఒకమాట చెప్పారు. మొత్తం ఫీచర్‌కి రచయిత ఉద్దేశం ఇదే అనిపించింది.
"ఒక నిర్దిష్ట సమూహంలో, ఒక నిర్దిష్ట కాలావధిలో ఒడిసిపట్టుకునే అంశాల ప్రామాణికత పరిధి బాగా తెలిసొచ్చింది. (లిమిటేషన్స్...) అయినా ఆ కొన్ని శకలాలనుంచే ఆ కాస్త జీవనసారాన్ని పిండుకోవడానికి న.డు.స్తు.న్నా.ను." ఇదే అనిపించింది నాకు ఈ మొత్తంలో ఆయన యొక్క ఉద్దేశం.
ఒక పరిమితమైనటువంటి కాలంలో ఒక పరిమితమైనటువంటి సందర్భంలో ఒక పరిమితమైనటువంటి వ్యక్తుల్ని మనం గమనించినపుడు మనకు తెలిసిన ఒక పాక్షిక సత్యం ద్వారా ఒక రకమైన జీవన సత్యాన్ని గ్రహించుకోవడానికి నువ్వు చేయగలిగే ప్రయత్నాన్ని తన రచన ద్వారా చూపించడానికి ఆయన ఈ ఫీచర్ ద్వారా ప్రయత్నించారనిపించింది. అందుకే ఆయన కిటికీ ప్రయాణాలు అన్నారు. అంటే ఒక దృక్కోణమే ఉంటుంది, పరిమితమైన సమూహంలో, పరిమితమైన కాలంలో చూట్టం వల్ల... అదే ఆయన ఉద్దేశంగా అనిపించింది.
మోహన్‌గారు చెప్పినట్లుగా చక్కటి శైలి, ఆకర్షణీయమైన వాక్య నిర్మాణం పదాలలో ఇమిడి ఉన్నాయి. అయితే ఈ ఎన్నుకున్న తొమ్మిదిలో అవి కొద్దిగా తక్కువున్నట్టు అనిపించింది. అంటే వేరే చోట్ల ఆ శైలీ, వాక్య నిర్మాణ వేగానికి మంచి ఉదాహరణలు వేరేచోట్లున్నాయ్, ఈ తొమ్మిదిలో కాకుండా. కేవలం వాటి విషయానికొస్తే...
ఉదాహరణకి, ఒక వానపడిన రోజు గురించి చెప్తూ... చివర్లో
ఏమైనా...
ఇది కుంట. ఇది చెరువు. ఇది నది. ఇది సముద్రం. ఇది పాట. ఇది తోట. ఇది నృత్యం. ఇది మర్త్యం. ఇది నెమలి. ఇది కమలి. ఇది పాడి. ఇది పంట. ఇది వెలుగు. ఇది చీకటి. ఇది పుట్టుక. ఇది చావు. ఇది అమృతం. ఇది సమస్తం. ఇది వర్షం. మన హర్షం.
అంటే నిండా ఒక కవిత్వ భావనతో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ 'ఇది ' ఇక్కడ వస్తుంది. ఇలాంటివి వేరే వ్యాసాల్లో ఉన్నయ్. కొన్ని అసమాపక క్రియల్ని వాడుకోవడం- ఇలాంటివన్నీ చాలా... ఈ తొమ్మిదింటిలోనే కాక వేరే వాటిల్లో ఉన్నాయనిపించింది. మిగిలిన వాటిలో...
అయితే వాక్య నిర్మాణం, పదాల వాడుకలో మాత్రం కచ్చితంగా మంచి పట్టున్న రచయిత. అందులో సందేహంలేదు. ఈ తొమ్మిదింటిలో వస్తు వైవిధ్యం కచ్చితంగా ఉంది. ఒక పక్కన హిజ్డాలు; మరోపక్క డౌన్ సిండ్రోమ్ పిల్లలు, మరోపక్కన వేదాలకు సంబంధించింది... చాలా బాగుంది. అందులో సందేహం లేదు.
ఈ ఫండేలో వారంలోపల ఒక ఫీచర్ రాయడమనేటువంటి పరిమితీ, ఒక వెయ్యి పదాలకే పరిమితమవటం... ఇలాంటివాటితో ఇంత బలమైన శైలితో రాయటం కచ్చితంగా నన్నాకట్టుకుంది. అయితే, ఆ కిటికీ ప్రయాణాలు చేస్తున్నపుడు, ఆయన భుజాలమీదుగా కిటికీలోంచి వాస్తవాల్ని చూసినపుడు ఆయనకి ఏమని తోచిందో ఆయన చివర్లో చెప్పినా; ఆ చెప్పకముందే నాకు తోచిన భావాలు, ఆయన చెప్పిన భావాలు దాదాపు అన్ని వ్యాసాల్లోనూ వేరుగా ఉన్నాయి. అందులోంచి నాకు కనపడిన సత్యం వేరుగా ఉంది, ఆయన చెప్పిన సత్యం వేరుగా ఉంది. కొన్నింట్లో నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు. అయితే...

ఉన్నంతమటుకు నాకనిపించినవి ఒక్కోటిగా తీసుకుని చెప్తాను.
మొదటి ఫీచర్ హిజ్డాలతో ఒక ఆత్మీయ సంభాషణ: అది రాయడం చక్కగా రాశారు. అయితే... దాంట్లో... చివర్లో- "గరుకైన పురుషులుగా పుట్టి, స్త్రీ సౌకుమార్యాన్ని అందుకోవాలన్న వీళ్ళ తపనను ఎలా అర్థంచేసుకోవాలి? మళ్ళీ విచిత్రంగా ఆ సౌకుమార్య సముపార్జనంతా మరో పురుషుడిని అందుకోవాలనే. అంటే తనలోని తనని అందుకోవాలనేనా?"- అదీ ప్రశ్న. అంటే, ఇక్కడేంటంటే... తనలోని తనని అందుకోవడం అంటే... తనలో పురుషుడున్నాడనీ, మళ్ళీ పురుషుడ్ని అందుకోవడానికి ప్రయత్నించాక తనలోని తనని అందుకునే ప్రయత్నం ఉందన్నట్టుగా ఆయన భావమనిపించింది. అయితే హిజ్డాలలో కోట్స్‌లో సమస్య ... అంటే. కోట్ సమస్య అన్‌కోట్. ఏంటంటే అసలు తనలో పురుషుడనే భావం లేదు. అందువల్ల... తనలో తను పురుషుడనే భావం లేనప్పుడు తనలో తనని అందుకోవటమనే ప్రసక్తి రాదు.
ఒకరు చెప్పినట్టు- అంటే ఈ ఎల్‌జిబిటి సమస్యమీద బోల్డంత సమాచారముంది మనకు అంతర్జాలంలో... లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్- ఎల్‌జిబిటి కమ్యూనిటీ మీద బోలెడంత సమాచారముంది. అందులో ఒకరు చెప్పినట్టుగా, 'పురుష శరీరంలో బందీ అయిన స్త్రీ ఆత్మ అనేది వాళ్ళ సమస్యన్నమాట; అంటే, సమస్యనుకుంటే. అందుకనే కోట్స్‌లో అన్నాను. అందువలన, చెప్పడానికి బాగున్నా కూడా, అలాకాదు. తనలోని తను కాదు... తనలో ఉన్నది స్త్రీ. అంచేత, పురుషుడ్నందుకోవటంలో సహజత్వమే ఉంది. అలా... ఆ భావంని... పురుషుని శరీరంలో బంధించబడిన స్త్రీ ఆత్మ... అనే భావంని మనం పట్టుకోకపోతే, వాళ్ళని అర్థంచేసుకోవడం కష్టమనేది నాకనిపించింది.
అలాగే... "వేషధారణకే అయినా, అమ్మాయిని అబ్బాయిగా మననిచ్చే సమాజం, అబ్బాయిని అమ్మాయిగా ఎందుకు ఉండనివ్వదు? వీళ్ళను తనలో భాగంగా ఎందుకు కలుపుకోదు?" అనే ప్రశ్న వేస్తారు. ఇక్కడిది వస్త్రధారణకు సంబంధించినది కాదు; మన సామాజిక జీవనంలోని ఒక ఉద్దేశం. కుటుంబం అనేది చాలా అవశ్యం అయినపుడు ఆ కుటుంబ వ్యవస్థకు దోహదం కానటువంటి లైంగిక ప్రవర్తననంతాకూడా సమాజం ఎప్పట్నించో నిరసిస్తూ ఉంది. అందువల్ల అది వేషధారణ, దానికి సంబంధించిన విషయం కాదు. కొంచం మరింత లోతైనటువంటి ఒక సమాజం యొక్క భావసంబంధ అనండి... భయమనండి... ఏదైనా కావొచ్చు. అందువల్ల అక్కడ కొంచం అలా తేడా అనిపించింది. ఆఁ.. దాన్ని అర్థంచేసుకోవటంలో అన్నమాట.
అదీ హిజ్డాలకు సంబంధించి.

తర్వాత, లేడీ కండక్టర్లు ఉన్న బస్సుల్లో...
బానే పట్టుకున్నారవన్నీ. అయితే... వారిపట్ల సానుభూతి చాలాసార్లు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. స్త్రీలు తమ ప్రివిలేజెస్ కోల్పోతున్నారా, కండక్టర్లవడం వల్ల, నిల్చోడంవల్ల... అదీ... ఉద్యోగాల్లో, అన్ని రకాల ఉద్యోగాల్లో అన్నిరకాల... దాని తాలూకు ఏవైతే సమస్యలుంటాయో వాటిని ప్రివిలేజ్ కోల్పోవటం అనచ్చో లేదో తెలియదు నాకు. కేవలం కండక్టర్లే కాదు, అనేక రకాల ఉద్యోగాలున్నాయి, అనేక రకాలైన కష్టాలున్నాయి. స్టోన్ క్రషింగ్‌లో ఫరెక్జాంపుల్- మంచి ఎండలో కూర్చొని రాళ్ళు కొడుతుంటారుకదా, ఆడవాళ్ళు కూడా- ఆ పని ఇంతకంటే గొప్ప పనే. అంటే... అది కొంచం ఎందుకో అలా అన్పించలేదు... అంటే ఆ సానుభూతి నేను పడలేకపోయాను. పడలేకపోయాను అంటే... వాళ్ళపట్లా, అందరిపట్లా అయితే ఉంది. సహజంగానే శ్రామికజీవుల కష్టంపట్ల ఆ సానుభూతి వేరు. ప్రత్యేకించి లేడీ కండక్టర్ల పట్ల పడాల్సినంత నాకేం.. నాక్కనిపించలేదు. ఆ చివర్లోనూ... "ఎంత దూరం ప్రయాణం చేసినా మానసికంగా చేసుకున్న కంక్లూజన్స్ ముఖ్యం" అన్నారు. అయితే ఈ ఫీచర్‌లో ఆ కంక్లూజన్స్ ఏమిటనేది స్పష్టంగా నాకర్థంకాలేదు... ఈ పర్టిక్యులర్ ఫీచర్‌లో. కంక్లూజన్స్ ముఖ్యమే; కాకపోతే ఈయన చేసుకున్న కంక్లూజన్స్ ఏమిటనేది ఈ ఫీచర్‌లో అంతగా తెలియలేదు.

మూడోది, ఒక భయానికి ముందూ తరువాతా...
అదీ... చక్కగానే రాశారు. ఐతే ఇక్కడకూడా కొద్దికొద్దిగా అక్కడక్కడా కొంచం ఇబ్బంది... అంటే "జీవితం అందించే ఆశ్చర్యానందాల్ని ఒక స్త్రీతో ఉమ్మడిగా పంచుకోవాలిగానీ పురుషుడితో ఏం మజా ఉంటుందీ! లాభం లేదు. అందుకే."- తెలీదు... కొన్ని ఆనందాల్ని స్నేహితులతో కూడా బానే పంచుకోవచ్చు అనుకుంటున్నాను. "ఇల్లు, బైకు, ఫర్నిచర్.. ఇలా నాకు ఏమేం లేవో పెద్దక్షరాల్లో ప్రపంచానికి చాటుతూ వ్యాపార ప్రకటనల హోర్డింగులు..."- ప్రకటనల హోర్డింగుల ఉద్దేశం ప్రపంచానికి చాటడం కాదు; మనకు చాటడమే. 'ఇదిగో వెధవా, నీకివన్నీ లేవురా ' అని మనకు జెప్పాలి. అందువల్ల, ఈ చెప్తున్నది అతన్నుద్దేశించే అన్నమాట. 'చూడూ, నీకు బైక్ కూడా లేదు ' అని నిన్నుద్దేశించే చెప్తుంది ఏ అడ్వర్టైజ్‌మెంటయినా... నువ్వు కొనుక్కో అర్జెంటుగా... అని. అలాగే, "చీకటి ఉన్నంతవరకే భయం. కాకపోతే అది గదిలోదా? మదిలోదా? మదిలోదే అయితే, దాన్ని దేనితో వెలిగించుకోవాలన్నదే ఇప్పుదు నా సమస్య. "- ఇక్కడ కూడా కొంచం... చీకటిని వెలిగించం; చీకటిని తొలగిస్తాం.... కొంచం... అలా అనిపించింది.
చివర్లో "ఒక ఆలోచనను అసహజం అనుకుంటాంగానీ, నిజానికి అదికూడా మనలో సహజంగా కలిగిందే!"(ఫుట్‌కోట్)... అంటే ఇది ఎపిగ్రమేటిక్‌గా రాయటంలో వచ్చినటువంటి ఒక మోహం. అంటే... అసహజమైనవని అన్నప్పుడు అవి సహజంగా పుట్టేవేనని అందరికీ తెలుసు. ఎందుకు అసహజం అంటామంటే, ఆ రకమైన సన్నివేశంలో ఆ రకమైన సందర్భానికి ప్రతిచర్యగా చాలామందికి పుట్టేటువంటి భావానికి కానిభావన పుడితే, దాన్ని మనం అసహజం అంటాం. అంతేగాని సహజంగా పుట్టలేదని మనం అనుకోం. అంటే కొద్దిగా ఎపిగ్రమేటిగ్గా రాయాలని అప్పుడప్పుడూ కొంచం జర్నలిస్టిక్ లోభానికి లోబడినట్లుగా అనిపిస్తుందన్నమాట చాలావాటిల్దగ్గర.

తర్వాత,
అమ్మ ఆవు ఉన్నట్టుండి ఊరు:
ఇందులో మంచి ప్రశ్న; అన్నింట్లోకి... అన్ని వ్యాసాలు... ఈ తొమ్మిదింటిలోకీ కూడా చాలా బలమైన, ముఖ్యమైనటువంటి ప్రశ్నను ఇందులో లేవనెత్తారు. "అభివృద్ధిని నిరసించకుండా ప్రకృతిని ప్రేమించడం సాధ్యమవుతుందా?" (ఫుట్ కోట్) ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. దీనిగురించి బహుశా అసలు ఒక సిద్ధాంత వ్యాసం కూడా రాయగలిగినంత సమాచారం ఉంది. ఎప్పుడైనా మనం కూడా 'చర్చ'లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ అభివృద్ధినిన్నూ, ప్రకృతిని ప్రేమించడాన్ని రెండింటినీ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధ భావనలుగానే చిత్రీకరిస్తూ వచ్చాం. ప్రకృతిని ప్రేమించేవాళ్ళు పూర్తిగా అభివృద్ధిని నిరసించడం, లేదా అభివృద్ధిని కావాలన్నవాళ్ళు ప్రకృతి జోలికి వెళ్ళకపోవడం అనేటువంటి... ఆ రకమైనటువంటి ఘర్షణాపూరితమైనటువంటి ధోరణిలో కాకుండా, అభివృద్ధిని నిరసించకుండా కూడా ప్రకృతిని ప్రేమించడం సాధ్యమవుతుందా?... ఇది చాలా... నాకన్నింటికన్నా బాగా నచ్చిన ప్రశ్న. దానికొక కారణం కూడా ఏమిటంటే- ఇంజినీర్లవటంవలన మనం ప్రకృతితో దాన్ని ఎంత కంపు చేయాలో అంతా చేసే వృత్తిలో ఉన్నాం కాబట్టి. అందువల్ల... అది బాగా నచ్చింది నాకా ప్రశ్న. దీన్ని ఆలోచించాలనుకోండి...
అయితే ఇక్కడకూడా మళ్ళీ చిన్న ఇబ్బందేముందంటే, ఆయన అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఊర్లోకెళ్ళినపుడు ... ఆ.. ఇరవైనాలుగు తరాలక్రితం వాళ్ళక్కడ ఎలా కూర్చున్నారో, ఎలా నవ్వుకున్నారో... ఆ ఆనందం అంతా... వెళ్ళాలనిపించిందీ... అంటారు. ఒకరకమైన నోస్టాల్జియా... పాత పట్ల మోజు... అంటే, చాలామందికి ఏర్పడుతుంటుంది. కాని, నిజంగనక ఆలోచిస్తే... 24 తరాలంటే 24x30=720 సంవత్సరాలనుకుంటే... ఏ 1300 సంవత్సరంలోకో వెళ్తే... అప్పట్లో జనం ఇంత సుఖంగా కూడా ఉన్నారనుకోను. రాజరికపు వ్యవస్థ, పల్లెల్లో పంటలు సరిగా పండేవి కాదు; కరవు కాటకాలు... అధికారులయొక్క ఇది... ఆ రోజుల్లో...(డా. ఎంజె రావు: బోయకొట్టాలు) ఆఁ కరక్టే... బోయకొట్టములు ఆ ప్రాంతానికి చెందిందే; ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, పుట్టుకతోనే చనిపోయే పిల్లల సంఖ్య చాలా ఎక్కువవటం, బాలెంతరాళ్ళు చనిపోవటం... ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో అప్పుడు జనం... మనం ఊహించటానిక్కూడా వీల్లేనటువంటి పరిస్థితి 1300 సంవత్సరాలనాటికంటే. ఆ రకమైనటువంటి ఒక రొమాంటిక్ నాస్టాల్జియా చొరబడటం అనేది... కొంచం ఇబ్బంది కలిగించింది.

తర్వాత, ఐదోది...
చోడ్ చింత మార్ ముంత:
కొద్దిగా నాక్కూడా తెలుగుతో కొంత ఇబ్బందుంది... అందువల్ల అప్పుడప్పుడు... టక్కున పట్టుకోలేకపోయాను ఈ వ్యాసంయొక్క... అది... ఏంటనేది.' ఛో'డ్ అయితే వెంటనే పట్టుకునేవాడ్ని... ఆ 'చో'కు వత్తు లేకపోవడంవల్ల నాకది వెంటనే దొరకలేదు, అదేంటనేది... అది చదవడం ప్రారంభించినాక అర్థమయింది... చోడ్ చింత మార్ ముంత అనేది అర్థమయింది. బావుంది, అదికూడా. ముఖ్యంగా చిక్కడపల్లి కల్లు కాంపౌండు... ఇలాంటివన్నీ కొన్ని... ఏవో ఊహలు మనసులో కదిలి... ఒక గిలిగింత... (నవ్వులు)

డా. ఎంజె రావు:
వెళ్ళారనా? వెళ్ళలేదనా?
(పెద్దగా నవ్వులు)

రజనీకాంత్:
(నవ్వుతూ...) ఆఁ... అవన్నీ చాలా వదిలేశాన్సార్... చెప్పలేనింక... గిలిగింత అనగానే వదిలేయాలి మీరు. మీరు వాటిని ప్రశ్నించటం...
అయితే ఇందులో కూడా కొన్ని..."పేదరికంలో ఉండిన తాగే స్వేచ్ఛ, మధ్యతరగతి అనే దశ దాటాక తప్ప, ఆధునిక స్త్రీలకు మళ్ళీ రాదేమో " - హైదరాబాదులో ఉండి ఈ ప్రశ్న వేయడం నాక్కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఈ రోజుల్లో మధ్యతరగతిలో కూడా కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు పబ్బులకెళ్తే ఎక్కడైనా కనబడతారు. అందువల్ల ఇది పేదరికం లేదా మధ్యతరగతి దాటినవాళ్ళకే అనిగాదు... దాదాపు అందరికీ ఉంటుంది.
కొన్ని తెలియని విషయాలు కూడా ఇందులో బాగా చెప్పారు... అమ్మవారికి కల్లు పోయటం ఒక గుండంలో... అది నాకు తెలియదు, గమనించలేదు నేనెప్పుడూ... కొన్ని తెలియని పదాలు కూడా వచ్చినయ్... అర్థంకాలేదు నాకవి... "చాకులం మూకులానికి వీలుగా సర్దుతున్న మరో మిత్రుడు" - కొద్దిగా అర్థం కాలేదు. చాకులం అంటే ఏమిటో... మూకులానికి వీలుగా సర్దుతున్న మరో మిత్రుడు అంటే... తెలియలేదిది.

డా.ఎంజె రావు:
అక్కడి భాషేమో...

రజనీకాంత్:
అక్కడి భాషతో కూడా నాకు పరిచయముంది. బట్... ఇది అందలేదు నాకు. బహుశా తెలియదు నాకు అదేందో. అక్కడున్న పదం అది. చాకులం అంటే ఏదన్నా టీపాయ్‌లాగా పెడ్తున్నాడా అనేది... అర్థంకాలేదు మొత్తానికి. చాకులం మూకులానికి వీలుగా సర్దుతున్న మరో మిత్రుడు- అదీ అందులో ఉన్న మాట... అర్థంకాలేదు నాకు.
ఇక్కడకూడా చిన్న... ఒకట్రెండు ఇబ్బందులు కలిగించినవి... "సాధారణంగా మన లోపలి జంతువును దేహగృహంలోనే బంధించి, మనిషిని మాత్రమే వీధుల్లోకీ, వ్యవహారాల్లోకీ పంపిస్తూవుంటాం. కానీ, ఇక్కడ జంతువే మనిషిని బంధించి, స్వైరవిహారం చేస్తూవుంటుందేమో! మళ్ళీ మనిషి మేల్కొని తన శక్తి సముపార్జించుకునేదాకా జంతురాజ్యమే. ఇదొక అథోజగత్ రంగస్థలమే."- అన్నారు. కానీ, ఆ మరుసటి... ఆ పక్క పేరాగ్రాఫ్‌లోనే ఒక కాటన్ కంపెనీలో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డుంటాడు. అతని ప్రవర్తన చూస్తే... జంతువుయొక్క స్వైరవిహారంగా గానీ... ఆ లైన్ కనపడదు. అతను చెప్తాడు కూడా- సుబ్బరంగా రెండు బుడ్లు కల్లుదాగుతం.. కడుపు చల్లగా ఉంటుంది.. ఇంటికెల్లి నిద్రవోతం.. ఇంట్లోనూ ఇబ్బంది లేదూ ఇక్కడా ఇబ్బందిలేదూ- అని. అంచేత త్రాగేవాళ్ళలో చాలామందిలోకూడా ఈ రకమైనటువంటి జంతువు స్వైరవిహారం చేయడమనేది జరక్కపోవచ్చు అని అనిపించింది. అంటే, ఈ సాధారణీకరణ సరైంది కాదనిపించింది. అలాగే బహుశా ఆయన ఎక్కువ తాగరనుకుంటాను... లేదా ఎప్పుడూ తాగలేదేమో తెలియదూ...(నవ్వు)
"స్వీయ నియంత్రణ కోల్పోవడానికి కల్లే కావాలా! కోపరసం, ద్వేషరసం, ఈర్ష్యారసం, ఇవి చాలవా!" - ఆఁ... తాగడంయొక్క ఉద్దేశం స్వీయ నియంత్రణ కోల్పోవడానికి కాదు. 'నేనూ' అనేటువంటి అహం కోల్పోవటమే తాగటంయొక్క ముఖ్య లక్షణం. అది నియంత్రణ కాదు. అందువల్ల... నేననుకోవటం... బహుశా... ఆయనకు తాగుడు కొత్తేమోననపించింది... (బాగా నవ్వులు)
దాని ఫుట్‌నోటు నాకు పూర్తిగా అర్థంకాలేదు... "యుద్ధాలు చేయదగిన స్త్రీలు లేకపోవడం వల్లే, మనం వీరులం కాలేకపోయాం!" - అర్థంకాలేదిది. నిజంగానే ఇదేమిటో... ఆ ఫీచర్‌కీ... ఆ ఫీచర్‌కి కాకపోయినాకూడా, విడిగా గమనించినా ఆ ఫుట్‌నోట్‌కు అర్థమేమిటనేది నాకు బుర్రకెక్కలేదు...

శవాల గదికి వెళ్ళేముందు...
చాలా... అంటే బాగా మనసును కదిలించేవిధంగా వర్ణించగలిగేరు. అందులో ఉండే ఆ బీభత్సం, దైన్యం, శోకం- అదంతా కూడా చాలా చక్కగా చిత్రించారు. ఈ ఉన్న తొమ్మిదిలోనూ శైలిపరంగా చాలా బలమైన చిత్రీకరణ ఉన్నది ఇది- మార్చురీ... శవాల గది.
అయితే ఇక్కడ కూడా ఒక చిన్న పంటికింద రాయి... ఇవన్నీ చూసి ఆయన 'నా పిల్లల్ని డాక్టర్లనుగా చేయనుగాక చేయను' అన్నారు. నేను డాక్టర్ని అవనుగాక అవను అంటే బానేవుంటుంది... నా పిల్లల్ని చేయను అంటంలో ఒకరకమైన... కొద్ది ఇబ్బందికరమైనటువంటి ఆలోచనాధోరణుంది. పిల్లలు ఏమవదల్చుకుంటే అదవుతారు. ప్రోత్సాహమివ్వడమే తల్లిదంద్రులుగా మన పని. అంతేగాని, నేను నా కొడుకుని పైలెట్‌గా చేస్తాను.. నా కొడుకుని డాక్టర్‌గా చేస్తాను.. నా కొడుకుని ఇంజినీర్‌ని చేయను- ఇలా అనుకోవడం అనేది సబబైన, ఆరోగ్యకరమైన ధోరణి కాదు. అంటే... మనం సినెమాల్లో చూస్తుంటాం... ఆవిడ భర్త పైలెట్ అయ్యి చనిపోతాడు కాబట్టి ఈవిడ కొడుకుని ఎట్లయినా పైలెట్‌ని చేయాలని చిన్నప్పట్నించీ కలగంటుంది... ఆరాధన సినెమా. (నవ్వులు) అంటే నా కలని నా పిల్లలమీద రుద్దటమనేది చాలా అనారోగ్యకరమైన ఆలోచనా ధోరణనేది నా అభిప్రాయం. అందువల్ల అది కొద్దిగా ఇబ్బందిపెట్టింది.

విచ్చుకోని మొగ్గలు:
అసలు నాకు పూర్తిగా పరిచయం లేనటువంటి సన్నివేశం, వాతావరణం. అందువల్ల అందులోంచి గ్రహించగలిగిందేమిటో నాక్కూడా అర్థంకాలేదు. అయితే, చక్కగా చిత్రీకరించారు. అందులో సందేహంలేదు. అయితే దానిగురించి నాకు ఏరకమైనటువంటి వ్యాఖ్యానం లేదు.  

హైటెక్ గ్రామం
అది కూడా చాలా బాగా చిత్రీకరించారు. ఆ పరిసర ప్రాంతాలన్నీ నాకు బాగా తెలిసినవే. అందువల్ల మళ్ళీ ఒక చిన్న గిలిగింత ఉంటుంది. అయితే మళ్ళీ చివర్లో చిన్న రొమాంటిక్ భావన ఒకటుంది. "మహోన్నతమైన భారతీయ గ్రామాన్ని మరుగుజ్జు నగరం బంధించినట్టు అనిపించింది. కాకపోతే, సమరంలో 'పిగ్మీల'వైపు నిలబడాల్సి రావటమే జీవితంలోని నైతిక విషాదం." - ఇదికూడా నాకు చాలా రొమాంటిక్ భావననిపించింది. మనం చదివాం- పల్లెను మింగిన పెట్టుబడి- అప్పుడు ఇదే సమస్యొచ్చింది. ఎంజె రావుగారన్నారు... 'ఇది పల్లెను మింగిన పెట్టుబడి కాదు; పల్లెను మార్చిన పెట్టుబడి' అనాలని. 'మింగిన'లో ఒకరకమైనటువంటి రొమాంటిక్ భావన ఉందన్నమాట. ఇక్కడకూడా అలాంటిదే కనపడింది- ఆ పిగ్మీలవైపు నిలబడాల్సిరావడమే నైతిక విషాదం- అని. ఇదసలు సమరమే కాదు. సమరం అయిపోయిందని మనకు 'పల్లెను మింగిన పెట్టుబడి' స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఇక్కడకూడా ఒక చిన్న రొమాంటిక్ మాట... అలాగే చివ్వర్లో "మనది కాని బాధ; మనది కాని బతుకు!" (ఫుట్‌కోట్)అంటారు... అది ఆయనది కాని బాధ ఆయనది కాని బతుకేమో కానీ, ఇది నాది కాని బాధా నాది కాని బతుకూ కాదు. నా బతుకిదే. అందువల్ల నాకక్కడ కొంచం తేడా కనిపించింది.

వేదం స్మార్తం ఆగమం
బాగా రాశారు అదికూడా. కీసరగుట్ట... చక్కగా... ఆ లోపలి ధోరణులన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అందులోకూడా కొన్ని నాకు తెలియనివి ఉన్నాయ్. ఇప్పుడు పాంచారాత్రం, వైఖాసనం... వీటితో పరిచయముంది కానీ, తంత్రసారాగమంతో పరిచయంలేదు. మంత్రాగమంలో చెప్తారట... తెలుసుకోవాలి, ప్రయత్నించాలి. మిగిలినవాటిలో కొంత పరిచయం ఉంది. శైవాగమ విధానం, వైష్ణవాగమ విధానాలతో పరిచయాలున్నాయ్ నాకు. బాగా చక్కగా చెప్పారు. వాళ్ళయొక్క ఇది... అందులో ఉన్నటువంటి వాళ్ళయొక్క లౌకికమైన ఆలోచనా ధోరణి... ఎలా నిత్య నైమిత్తిక కర్మలకి ముహూర్తాలు పెట్టడం, ఎలా ఇలాంటివన్నీ సంపాదనకి ముఖ్యమైన దోహదాలో, అందువల్ల అది ఎలా లౌకికమైన కర్మ.... ఆ రకమైన వ్యాఖ్యానం చాలా బాగా చేశారనిపించింది. "అలౌకికంగా ఏదీ సిద్ధించదు. చివరికి ధ్యానం కూడా లౌకిక కర్మే"(ఫుట్‌కోట్) అన్న ఊహని ఆయన బాగానే సమర్థవంతంగా తీసుకొచ్చారు. చాలామటుకు నిజమేకూడా అనిపించిందది. చిక్కడపల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిముందు మంటపమ్మీద ఎప్పుడూ ప్రతిరోజూ ఉదయాన్న ఒక పదిహేను ఇరవైమంది పూజారులు కూర్చునివుంటారు... ఎవరు పిలుస్తుంటారా అన్చెప్పి. రోజూ వాళ్ళని చూసేవాళ్ళం మేం. అందువల్ల ఇది కొంచం అర్థమైంది బాగానే. అంటే... ఇక్కడకూడా ఒక చిన్న రొమాంటిక్ భావనలాంటిది... ఆయన తిరిగి వస్తున్నపుదు... ఆ వేద విద్యార్థుల్నీ, తర్వాత బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకతను చెవులకు పోగులు అవన్నీ పెట్టుకున్నాడు... ఈ రెంటియొక్క వైవిధ్యాన్ని చూపిస్తూ "... నాగరికత చాలా దూరం ప్రయాణం చేసింది కానీ, ఆ అంతరం ఒక విలువగా ఏపాటి?" అన్నారు. ఈ అంతరం ఎప్పుడూ ఉంది. ఇవ్వాళ చెవులకు లోలాకులున్నూ... ఇవుండొచ్చు; మరో రోజుల్లో
నటవిటగాయకగణికా కుటిల వచస్సీధురసముగ్రోలెడు చెవికుం
గటువీ శాస్త్రము వలదిచ్చట
నిను చదివింపకున్న జరుగదె మాకున్ ...
అలా ఒకప్పుడు కూడా ఎలా వేదపాఠాల్నీ వీటినీ ఒకరకమైన అలౌకిక భావంతోనో లౌకికభావంతోనో చదివేవాళ్ళుండేవాళ్ళో; మరోపక్కన సురాపానమో... మరో మరో మరో ఆనందాలతో ఉండేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఈరోజున్నటువంటి సమస్య కాదు. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా నాగరికత చాలాదూరం ప్రయాణం చేసింది కాబట్టి వీళ్ళమధ్య ఈ అంతరం ఉందని ఆలోచించనక్కర్లేదు. ఎప్పుడూ ఆ అంతరం ఉంటూనే ఉంది.
సమాజంలోని వివిధ వర్గాలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా రకరకాలైనటువంటి... చేస్తూనేవున్నారు. అయితే వాటియొక్క రూపాలు మారుతూ వస్తాయి. అందులో సందేహంలేదు. ఈ వేదాధ్యయనం యొక్క రూపం కూడా ఇప్పుడు మారింది. వీళ్ళు ఒక్కోదాన్ని పన్నెండేళ్ళో పద్నాలుగేళ్ళో చదువుతారు. పూర్వకాలంలోని గురుకులంలో అలా ఏంలేదు... నీకొచ్చేదాకా నువ్వు చదువుతూనే ఉంటావ్; వచ్చిందయిపోతే పొమ్మని చెప్తాన్నేను. ఇలా మార్పులొచ్చినయ్. దీనిక్కావలసిన వాటికి లౌకికమైన సదుపాయాలు చేయటం... వీటన్నిటిలో మార్పులొచ్చినయ్.
దీనికి ఉదాహరణకి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డబ్బులిస్తున్నారు. సో... ఇందులోనూ మార్పులొచ్చినయ్. మార్పులెప్పుడూ జరుగుతూనే ఉంటాయ్. అన్నిట్లోనూ మార్పులొస్తుంటాయ్, ముందుకెల్తుంటాయ్. ఆ అంతరం ఒక విలువగా ఏపాటి? అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం. ఈ రోజునా మనం వేసుకోవచ్చు. కానీ, ఈ రోజు ప్రత్యేకత ఏమీ లేదని నాకనిపించింది.
ఇదీ... ఈ తొమ్మిదింటికీ సంబంధించినటువంటి విషయం.

మిగిలిన కొన్నిటికి సంబంధించినవి మళ్ళా రెండో ఆవృత్తంలో మాట్లాడుకుందాం. మొదటి తొమ్మిది సమీక్ష మాత్రం ముగిసింది.

డాక్టర్ ఎంజె రావు:
రజనీకాంత్‌గారు మాట్లాడిన తర్వాత నాకు ప్రత్యేకంగా మాట్లాడటానికి ఎక్కువ కనిపించడంలేదు. ప్రతిదీ ప్రతిసారీ చదవటం ఎలా అవుతోందంటే, ఏదో ఎక్జామ్‌కి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్‌లాగా (నవ్వులు)... ఏదో నిన్నా, ఇవ్వాళా కొంచం చదివానండీ. అంత పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. నాకు కనిపించినయ్ రెండుమూడు విషయాలు చెప్తాను. చదివిన వీటిల్లోనే... ఈ తొమ్మిదీగాక ఇంకో రెండు చదివిన వాటిల్లో రెండురకాలుగా అనిపించింది.
ఒకటేమిటంటే అబ్జర్వేషనన్నమాట. అంటే, ఇప్పుడు మనం జనరల్‌గా ఏదైనా సొసైటీలో మనుషులమధ్య రిలేషన్‌షిప్సూ, జరుగుతున్న యాక్టివిటీస్‌ని రచయిత చూస్తున్నపుడు తన ఇంటర్ఫియరెన్సూ, తన ఇన్వాల్వ్‌మెంటూ ఉంటుంది; జనరల్‌గా... ఇందులోనూ రెండు రకాలుగా ఉన్నయ్. కొన్ని వ్యాసాలు... వ్యాసాలనండీ... దానికి ఏం పేరుపెట్టాలో తెలియదు. (కవన శర్మ: కాలమ్) ... కాలమనండీ... వాటిల్లో ఓన్లీ ఇంటర్ఫియరవకుందా, ఇన్వాల్వవకుండా  అబ్జర్వేషన్ కింద కొన్ని ప్రెజెంట్ చేస్తారు. అవి... వీలయినంతవరకూ కష్టపడి ప్రెజెంట్ చేసారలాగ. ఇరానీ హోటల్లో... ఇరానీ హోటల్ ఇందులో ఉన్నట్టు లేదూ... మొట్టమొదటిది... అదీ జస్ట్ అలా వెళ్ళి... ఎవరు చూసినా అదే కనిపిస్తుంది. కాకపోతే ఒక సీక్వెన్స్‌లో రాశారు తప్పిచ్చి ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అందులో నాకేం కనిపించలేదు. అంటే మీకు ప్రెజెంట్ చేశారు. అది చాలా కష్టం. మనం ఇన్వాల్వ్ అవకుండా, మన ఇంటెర్‌ప్రిటేషన్ ఇవ్వకుండా ప్రెజెంట్ చేయడమనేది చాలా కష్టమనిపించింది. అది కొన్నిచోట్ల చాలా బాగా చేశారు.

రెండోది, ఆయన స్టార్టింగ్‌నుంచీ కూడా ఆయన దృక్పథంతో, ఆయన అనుకునేది చెప్పేదాంట్లో... దాని ప్రకారమే అబ్జర్వ్ చేసిన ఆ సీక్వెన్స్‌లోనో లేకపోతే మధ్యలో ఆయన సెంటెన్స్... అలావుంది. ఆయనతో వెళ్తే ఒక జర్నీ చేసినట్లుంటుంది. కొత్త అనుభవాలను మనకు చూపించారు. ఇప్పుడు ఈ మార్చురీలాంటివి కూడా రాసినప్పుడు అక్కడున్న బాధను చూపించారు కానీ... మళ్ళా అది మరీ ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ లేకుండా... ఆ ఎక్స్‌పీరియన్స్ మనకందరికీ రాదుకదా! మనం ప్రతివాళ్ళం కావాలని వెళ్ళి మార్చురీకి వెళ్ళి ఒక గంటసేపు చూడాలని వెళ్ళం. అలాంటి పరిచయాన్ని మీకు ఆయనా చాలా వాటిల్లో చూపించారు. అదీ... అదొకటి...
కావాలనుకుంటే మూడు దశలనుకోవచ్చు... ఒకటేమో అసలేమీ ఆయన పార్ట్... ఆయన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా చేసింది; కొంత లిమిటెడ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి; కొంత పూర్తిగా చేయడం. జనరల్‌గా సోషల్ ఫినామినాని ఏదైనా సరే, నాన్-ఇన్వాల్వ్‌మెంట్‌గా రాయడం చాలా కష్టం. ఏంజేసినా మనం అందులోకొస్తాం- మనం రిపోర్ట్ చేశాం అంటే మనం రిపోర్ట్ చేశాం. అబ్జర్వర్ ఇంటర్ఫియరెన్స్ లేని ఎక్స్‌పెరిమెంట్‌లాంటిదన్నమాట. ఇంజినీర్లకీ, సైంటిస్టులకీ అలవాటయ్యేది ఇక్కడ సాధ్యం. లెబారేటరీలలో చేయడం సాధ్యం. బట్, ఈ సోషల్ సైన్సెస్‌లో కూడా అది చాలా కష్టం. చాలా కష్టం అతను అబ్జర్వ్ చేసి చదివించడం. ఇది చాలా నచ్చింది. అంతకన్నా చెప్పడానికి నాకు లేదు.

కవనశర్మ:
(సుధామయితో) మీరు? మీరు మాటాడాక...

సుధామయి:
అంటే... నేనేం మాట్లాడాలి?

కవనశర్మ:
ఊఁ... చెప్పండి, మీరెందుకు ఈ పుస్తకాన్ని వెయ్యాలనుకున్నారు? అసలిందులో మీకు నచ్చిందేమిటీ? నా ప్రశ్న మీకర్థమైందిగదా? ప్రశ్న ఒకటే ఒకటి... ఆయన చెప్పదల్చుకున్నది ఆ రచనలో బయటికొచ్చిందా? అలాకాకపోతే అది విడిగా ఇంకోలా వచ్చిందా? అదొకటే నా ప్రశ్న. అదే సమాధానం చెప్పక్కర్లేదు మీరు... విడిగా ఇంకోటి కూడా చెప్పొచ్చు- నాకు తట్టనిది.

సుధామయి:
అంటే... నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నేను ఎందుకు ఈ పుస్తకాన్ని చేశాననేది ముందుమాటలో రాశాను. ఇంకొకటేంటంటే నేను రజనీకాంత్‌గారికి... చెప్పనా?

రజనీకాంత్:
ఆఁ... చెప్పండీ

కవనశర్మ:
అంటే... రెండో ఆవృత్తందాకా ఆగితే... ఖండించొచ్చు.

సుధామయి:
అహ... ఖండించట్లేదు (నవ్వులు)... నేను ఖండించట్లేదు. ఆంటే... ఇప్పుడు కింద ఫుట్‌కోట్స్‌కిన్నూ రచనకేమీ సంబంధం లేదండీ. అది ఆయన ముందుమాటలో రాసుకున్నారు.

రజనీకాంత్:
ఆయన ముందుమాటలో ఏం రాశారంటే... అంటే ఇది రెండో రౌండ్ అవుతుంది... ఫర్లేదంటే చెప్తాను.

కవనశర్మ:
ఇదీ రెండో రౌండ్లోకి వెళ్తుంది. ఇవి ఇంఫ్లుయెన్స్ చేస్తాయ్... కాబట్టి మీ అభిప్రాయాలు చర్చిస్తే...

సుధామయి:
సరే... సరేనండీ... నా అభిప్రాయాలు ఏం లేవండీ...

కవనశర్మ:
నేను... నాకున్న అభిప్రాయాలకొస్తే... ఫస్ట్‌న ఇవే ఎందుకు సెలెక్ట్ చేయాల్సొచ్చిందీ అంటే... బాగున్నవే సెలెక్ట్ చేయడం అనేది ఒక దుష్ట సంప్రదాయం అని నాకనుమానం. అవే మనం తీసుకుని... ఈయన చాలా బాగా  రాశాడండీ... అని... లేనివి వదిలేయొచ్చు. కాలమ్ రచనలో ఉన్నదేంటంటే అన్నీ సమానంగా ఉండవు. సమానంగా ఉండటమనేది కష్టం. రెండోది... ఇరానీ హోటల్ గురించి ఎంజె రావుగారు చెప్పిందీ, కాళీపట్నం రామారావుగారు చెప్పిందీ ఒకటే... రమారమి. ఆయన అదే చెప్పారు ఆరోజు సభలో. నేనందుకనేసి అది పక్కన పెట్టేశాను. తర్వాత... అంటే...
అఫ్‌కోర్స్... ఇప్పుడు రెండో రౌండు మొదలయ్యింది. నాది మొదట అయింది కాబట్టి నేను చెప్తాను. observed and observer... are they different? అనేది చాలా పెద్ద ప్రశ్న. అంటే... వ్యక్తినిష్టం కాని అబ్జర్వేషన్ ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. అంచేత దాని జోలికెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళడంలేదు- దీనికి సంబంధించింది కాదు కనక. నాకీ విషయాల్లో కనిపించిందేమిటంటే... నా పుస్తకమిస్తే నేను అండర్‌లైన్ చేసినవి చూసుకుంటా. (నవ్వులు)...
ఆయనకీ... మీరెన్ని చెప్పినా నాస్టాల్జియా పట్ల ఒక రొమాంటిక్ భావం ఉంది. అంటే... వేదం స్మార్తం.. అనే కథ ఈవిడొ(సుధామయి)క్కసారి నాకు నచ్చలేదని చెప్పారు. ఆవిడకి నచ్చని కథల్లో అదొకటి. అంటే... అసలెందుకు నచ్చలేదు? అని నేను చూసా. చూస్తే... చివర నేను... ఇప్పుడాయన చెప్పారే... చెవుల్లో పెట్టుకున్న.. రెండు పంచలు.. లాస్ట్ స్టేట్‌మెంటూ.. అంటే వెనక్కొస్తున్నానేమో...
"... రంగుజుట్టు, చెవిలో వైరు, బుగ్గప్యాంటు, బూట్లతో ఒక స్టూడెంట్! చెప్పుల్లేని, టీవీ చూడని, వేద విద్యార్థుల రెండుపంచల వస్త్రధారణ నుంచి, మొబైల్‌తో కూడిన ఈ వేషధారణకు నాగరికత చాలాదూరం ప్రయాణం చేసింది. కానీ, ఆ అంతరం ఒక విలువగా ఏపాటి?"- అసలు ఇందులో విలువల ప్రసక్తి ఎక్కడుంది? ఎవరు తెచ్చారు? రచయిత తెచ్చాడా? అంటే... దాన్ని ఎవరో ఒకరు .. ఒకదాన్ని గొప్పగా చూస్తున్నారు ఒకదాన్ని గొప్పగా చూట్టంలేదనేది నాకు రచనలో ఎక్కడా కనపడలేదు. మీకు కనిపిస్తే నాకు తెలియదు. నాకు మాత్రం అది విలవలకు సంబంధించిన విషయంగా కాకుండా విడిగా, ఆయనంతట ఆయన ఆయన మనసులో ఉన్నది చెప్పినట్టుగా అనిపించింది. అంటే... ఇది నిజంగా విలవల మీద చర్చకు సంబంధించిన ఇదని నేననుకోలేదప్పుడు. కానీ... ఆయన చాలా గొప్ప రచయిత. అన్నీ... రాయటంలో.. ఆయన చెప్పినట్టుగా ఒక కవితాసృష్టుంది, ఒక పొయెటిక్ టచ్చుంది. పదాలు ఎంచుకుంటారు, చాలా బలంగా చెప్తారు. చెప్పినది... ఆయనకు కలిగిన భావమే... రజనీకాంత్‌గారు చెప్పినట్టు ... నాక్కొన్నిట్లో కలగలేదు.. అంచేత సెలెక్ట్ చేసిన కారణమేంటంటే, విస్తృతుండాలి. కొన్ని మీకు కనీసం చప్పగా కనిపించే అవకాశం ఉన్నవై ఉండాలని నేననుకున్నాను. అంటే... పూర్తిగా భేష్ అనేవి కాకుండా కావాలని కొంత నే చేశాను.

తర్వాత, హిజ్రాలలో తాను పురుషుడే అన్న భావం ఉండదన్న రజనీకాంత్‌గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే నేను ఇంటర్నెట్‌లో కూడా నాకు ఎంత ప్రయత్నించినా దొరకని కొంత సమాచారం... వీళ్ళని ఇలాంటివాళ్ళని ఈ పేరుతో పిలుస్తారు, అలాంటివారిని ఆ పేరుతో పిలుస్తారు అని ఆయన రాసింది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే నాకెక్కడా దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కనపడలేదు. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హిజ్రాస్... మీరు చదివే ఉంటారు అందరూనూ... దాని ఇన్‌ఫర్మేషన్ నాకెక్కడా దొరకలేదు.

ఎంజె రావు:
ఆయనా... ఆ మాటలుపయోగించారు. వీళ్ళనిట్లా అంటారు అని మాట చెప్పారంతే. హైదరాబాద్‌లో అంటారూ అని... అలా చెప్పారు.

కవనశర్మ:
అలా అంటారా...

రజనీకాంత్:
అంటే... ఏ పర్టిక్యులర్ పదాలు మీకు...

కవనశర్మ:
చెప్తాను... "స్త్రీ పట్ల నిస్సహాయుడయ్యేవాడు నపుంసకుడు. స్త్రీ మీది ఆకర్షణను జయించినవాడు యోగి. పురుషుడిగా ఉంటూ పురుషుడిని కోరుకునేవాడు గే. పురుషుడి కోసం స్త్రీలా బతకాలనుకునేవాడు హిజ్డా. దానికోసం లింగమార్పిడి చేసుకునేవాడు ట్రాన్స్‌జెండర్. అటు స్త్రీ, ఇటు పురుషుడు ఇద్దరిపట్లా ఆకర్షితుడయ్యేవాడు బై-సెక్సువల్..."

ఎంజె రావు:
ఆఁ... ఇవన్నీ కరెక్టే.

రజనీకాంత్:
ఎల్‌జిబిటి డెఫినిషన్స్ ఉన్నాయి సార్... ఎల్‌జిబిటి కమ్యూనిటీ మీద మీకు కావలసినంత సాహిత్యమూ ఉందీ, డెఫినిషన్సూ ఉన్నాయి. అంటే యోగి అంటే తన సొంత... (ఎంజె రావు: మొదటి రెండూ...) సాధారణీకరణలు. అంటే గెలిచినవాడు యోగి అనుకునేది... ఆకర్షణను జయించినవాడు యోగి అనుకునేది తన సొంత సాధారణీకరణ. ఇప్పుడు సాధారణంగా అందరూ ఒప్పుకునే సాధారణీకరణ.

కవనశర్మ:
ఇప్పుడూ... పురుషుడి కోసం స్త్రీలా బతకాలనుకునేవాడు హిజ్డా... అనేది...

రజనీకాంత్:
అంటే... దానిక్కారణమేంటంటే... చెప్పానుగదా... హిజ్డాల్లో సాధారణంగా అనుకునేది... అంటే ఎస్టాబ్లిష్డ్ ఏంటంటే, పురుషుడి శరీరంలో బంధించబడి ఉన్నటువంటి స్త్రీ ఆత్మ అని ఒక సాధారణ నిర్వచనం. అప్పుడేంటంటే పురుషుడ్నే కోరుకుంటారు. అందువల్ల అది పురుషుని శరీరంలో ఉండి కూడా పురుషుడ్ని కోరుకోవడం...

కవనశర్మ:
ఒక మాటుంది సార్... హెర్మాఫ్రోడైట్సో(hermaphrodite)... ఏదో ఉంది... ఇందులో వస్తుంది... ఎందుకంటే మన పురాణాల్లో మనకి అరుణుడు ఒకడు... ఇల ఇంకొకడు; శిఖండి... I am not very sure... అరుణుడికిద్దరు పిల్లలు కూడా- వాలి, సుగ్రీవుడు. అంటే వాడు మగాడా? ఆడదా? వాళ్ళు సంతానాన్ని కనగలరా? కనలేరా?... ఈ ప్రశ్నలు కూడా... కొంత చర్చ జరిగింది. ఇలాంటివన్నీ కొన్ని... నేనంచేత ఇంటర్నెట్లో దానిగురించి కూడా... చేస్తే 'ఇట్స్ పాజిబుల్' అని రాశారు యుకె నుంచి కొంతమంది. వాటితో కంపేర్ చేసి చూశాను... నాకు కొన్నిటిలో ఆ మాటలు వాడటం కనపడలేదు. అంటే... బహుశా నాకు ఇతర భాషల్తోటి ... ఇంగ్లిష్‌తో తప్ప మిగిలిన ఉర్దూ అలాంటి వాటిల్లో నాకు పెద్దగా పరిచయం లేకపోవటం అయుండచ్చు.

తర్వాత లేడీ కండక్టర్ అనేదాంట్లో ఆయన చెప్పిన సానుభూతి విషయానికొస్తే... ఎక్కువగా... నేననుకున్నదేమిటంటే, ఆయన... ప్రతి ఆఫీస్‌లోనూ ప్రతి స్త్రీకీ సంబంధించిందేమిటంటే టాయ్‌లెట్స్ గొడవ. ఆ స్త్రీలు... ఆ దేహాన్ని ఎంత నియంత్రించుకోవాలి.. ఎంత తీర్చిదిద్దుకోవాలి- అన్న మాటలు నాకు చాలా నచ్చిన విషయం ఆ లేడీ కండక్టర్‌లో...
భయానికి ముందూ తర్వాతా... ఆ భయం ముందు ఈ భయం ఎంత? అంటూ ఒకటేదో స్టేట్‌మెంట్ వస్తుంది... పెద్దాడి... మా పెద్దాడి అనారోగ్యం కన్నా ఇది ఎక్కువ నన్ను భయపెట్టగలదా? అనేది. అఫ్‌కోర్స్ ఇది bizarre వరల్డ్‌కి వెళ్ళినవాళ్ళకి బాగా పరిచయమున్న ఎక్స్పీరియన్సే ఇది.

తర్వాత గ్రామాలూ... డెవలప్‌మెంట్... అభివృద్ధిని నిరసించకుండా ప్రకృతిని ప్రేమించగలమా? అనే ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. అదే నాకూ అనిపించింది. మామూలుగా ఉన్న కొన్ని అభిప్రాయాలు... అంటే గ్లోబలైజేషన్... అలాంటి అభిప్రాయాలు ఈయనమీద ప్రభావం చూపిచ్చాయేమోనని నేననుకున్నాను మరి. ఈ గ్రామాల విషయంలోనూ నాస్టాల్జియా అన్నదానితోపాటు ఆయనకొకవిధమైనటువంటి అభిప్రాయం ఉందేమోనని అనిపించింది. అంటే, ఇవి మంచివి కాదు.. ఇవి మంచివి... అనే ఒక జనంలో ప్రచారంలో వున్న భావాల పట్ల ఈయనకొక ఏకీభావం ఉంది అని అనిపించింది.
చోడ్ చింత మార్ ముంతలో మిడిల్ క్లాస్ విమెన్... దాని గురించి చెప్పిందే నేనూ అండర్‌లైన్ చేశాను; రజనీకాంత్‌గారు చెప్పారు. ఆ మాటకు నాకూ... చాకులానికీ మూకులానికీ... కొంచం... ఏ కులమంటే గోకులమంటా... నేనూ కొంచం(నవ్వు)...
శవాల గదిలో... "... జీవితంలో ఏది నిజమో, ఏది అబద్ధమో ఒకపట్టాన తేల్చుకోలేంగానీ జీవితపు సిసలైన వాస్తవికత మాత్రం మృత్యువు." అంటాడాయన. ఈ లైన్ నాకు నచ్చింది. అది ఆయన చెప్పదల్చుకున్న విషయమనుకున్నాను. అది... ప్రతిదాంట్లోనూ నేను చెప్పదల్చుకున్న భావం అని నేను అండర్‌లైన్ చేసుకున్నది రచనలోంచి వచ్చిందా? ఆయన మనసులో రావడం వల్ల మనకిది బానే ఉన్నట్టనిపించిందా అనే ప్రశ్న మాత్రం నాకు త్రూఅవుట్ కలిగింది. అంటే నిజంగా రచన చదివితేనే ఆ భావం నాకు కలుగుతుందో లేదో చెప్పలేను.
విచ్చుకోని మొగ్గలులో కూడా నాకు నచ్చింది... అన్నం తినటం అనేది ఇవాల్టి లెర్నింగ్ ప్రాసెస్‌లా, అంటే- నేర్చుకోవాల్సిన స్కిల్ కింద చెప్పటం; తరవాత, ఇటువంటివాళ్ళకోసం ఎంతోమంది ఎంతో శ్రమపడాలన్న విషయం నాకు బాగా నచ్చింది.
అయితే ఇక హైటెక్ గ్రామం గురించి  చెప్పేశాం, వేదం స్మార్తం గురించి చెప్పేశాం. పోతే ఒకటేంటంటే, తిరుపతి దేవస్థానంవాళ్ళు ఒక్కొక్క వటువుకీ చదువుకోడానికి కావలసినంత డబ్బిస్తారా! ఎంతిస్తారంటే, 700 రూపాయలిస్తారు ఏడాదికి! అంఛేత అదీ... ఇట్సే వెరీ... చాలీ చాలని...(ఎంజె రావు: చాలీచాలనేంటీ? చాలదది...) తిండి ఎవరో పెడతారు... నేను ఈ శృంగేరీ మఠంలో చూశాను, తర్వాత బందరులో శంకర మఠంలో చూశాను... అది నిజంగా ఆకలి తీర్చదేమో అనుకుంటాను. అదీ నా అభిప్రాయం. ఇప్పుడు నా కంక్లూజన్ అయిందికనక ఎవరైనా ఎవరినైనా ప్రశ్న వేయొచ్చు.

రజనీకాంత్:
"ఐటెమ్‌కు వెళ్ళినప్పుడు లేదా తిరిగి వస్తున్నప్పుడు, లేదా తిరిగి రాస్తున్నప్పుడు, ఒక ఆలోచనలోంచి ఇంకో ఆలోచనలోకి జారుకుంటున్నప్పుడు ఇంకేదో మనసులోకి వచ్చిచేరుతూ ఉంటుంది. అది అసందర్భమే కావొచ్చుగాక! అలా దొర్లిపోయిన వాక్యాల్లో కొన్నింటిని ఫుట్‌కోట్స్‌గా ఇస్తున్నాను. అయితే అవి ప్రధాన వ్యాసాలకు అనుబంధం ఏవిధంగానూ కావు. ఈ రచనాకాలంలో నాలోకి చొరబడిన ఏకవాక్య ఆలోచనలుగా తీసుకుంటే సరిపోతుంది."
అంటే... ఆ ఫుట్‌కోట్ వచ్చే సందర్భంలో ఆ చూసిన సంఘటన తాలూకు ఏదో విషయం ఏదో రకంగా ప్రభావితం చేయటంవల్ల అదొచ్చింది. అందువల్ల దానికి చూట్టానికి అసందర్భంగా వున్నా, ఆ ఆలోచనకున్నూ ఆ చూసిన సంఘటనకీ మధ్య ఒకరకమైనటువంటి లంకె వున్నది. అంటే వాక్యంగా ఉండకపోవచ్చు. కానేంటంటే... అదీ... ఆ సందర్భం చూసీ దానిగురించి ఆలోచించీ దాన్నిగురించి రాస్తున్న సందర్భంలో చొరబడిన ఆలోచన. అంటే అది ఎక్కడో ఒకచోట కచ్చితంగా... అసంకల్పితంగానో లేకపోతే సుప్తచైతన్యంలోనో దాని తాలూకు లంకె పడేవుంటుంది... అని నేను తీసుకున్నాను... ఆయన రాసింది చదివిన తర్వాతకూడా.
ఆ ఫుట్‌కోట్‌కేమన్నా అర్థం తెలిసిందా సార్? మీకు తెలిస్తే చెప్తారా?... "యుద్ధాలు చేయదగిన స్త్రీలు లేకపోవడం వల్లే మనం వీరులం కాలేకపోయాం!"

కవనశర్మ:
అదీ... దీనికి సంబంధంలేనిది... ఈ పుస్తకానికి సంబంధం లేనివిషయం, చెప్పమంటే చెప్తాను. బెర్ట్రండ్ రస్సెల్ ఒకచోట అంటాడూ... 'యుద్ధాలు చేసే అవకాశం తగ్గినకొద్దీ ఫుట్‌బాల్ మీద క్రేజ్ పెరిగిందీ' అని. (నవ్వులు) అంటే... 'It is a poor substitution for wars' అంటాడు. అంటే... అలాగ... నాకు నవ్వొచ్చింది అది చదివినపుడు... ఇది గుర్తొచ్చిందెందుకో.. బెర్ట్రండ్ రస్సెల్‌ది...

రజనీకాంత్:
అంటే, అక్కడ అర్థం ఉంది సార్ ఆయన చెప్పినదానికి... అగ్రెషన్‌కి... మనకెప్పుడూ బయటకు చెప్పుకునే మార్గాలుండాలి. బుల్‌ఫైట్ కానీండి లేదా రెజ్లింగ్ కానీండి లేదా బాక్సింగ్ కానీండి- వీటన్నిటిలో ఉన్న ఆకర్షణ అగ్రెషన్‌కీ మనకీ భయంలేకుండా వ్యక్తీకరణ చేయగలగడం. దానికే వక్రీకరణలు కార్టూన్ల భావం అని నా ఆలోచన. కానీ, ఇదేంటీ... నాకర్థం కాలా.

ఎంజె రావు:
సంబంధం లేకుండా కూడా కొన్ని ఫుట్‌కోట్స్ వచ్చాయి కావచ్చు...

రజనీకాంత్:
అంటే... విషయానికి సంబంధించిందని కాదు... దీనికి అర్థమేంటని అసలు? ఫీచర్ సంబంధంగా నేనడగటంలేదు. ఏ ఫీచర్‌కూ సంబంధం లేకుండా అసలా వాక్యం యొక్క అర్థమేమిటీ?

డా. సి.మోహన్:
అంటే... ఈమధ్యన ఒకటి చదివాను. దానికీ దీనికీ లింకుందేమో తెలీదు. హిస్టరీలో ఉమన్ సోల్జర్స్ ఉమన్ ఆర్మీస్ ఉన్నయ్. కానీ ఎక్కడా ఏ హిస్టోరియన్ ఎక్నాలెడ్జ్ చేయలేదు. అంటే.. ఈవెన్.. ఆల్‌మోస్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ వరకూ, అంటే కంప్లీట్ బెటాలియన్స్ కిందవుండి వాళ్ళు బాగా ఫైట్ చేసి, అంటే విక్టరీ సంపాయించినా అఫీషియల్ హిస్టరీలో వాళ్ళనెవళ్నీ- అసలలాంటివి ఉన్నాయని కూడా ఎవరూ ఎక్నాలెడ్జ్ చేయలేదు... అని ఒకాయన ఇన్సిడెంట్స్ అవన్నీ రాసుకొచ్చారు. దానికీ దీనికీ ఏదైనా సంబంధముందా? అంటే...

రజనీకాంత్:
ఈ వాక్యం అర్థమయితే అసలు సంబంధమే లేదు. ఈ వాక్యమే అర్థంకాలేదు నాకసలు. యుద్ధాలు చేయదగిన స్త్రీలు... అంటే... మనం ఎవరికోసం యుద్ధాలు చేయాలో అటువంటి స్త్రీలు లేరనా?

కవనశర్మ:
స్త్రీలకోసం యుద్ధాలు జరిగాయ్...

రజనీకాంత్:
ఎవరికోసం యుద్ధాలు చేయాలో అటువంటి స్త్రీలు లేకపోవడంవల్ల యుద్ధాలు చేయక మనం వీరులం కాలేకపోతున్నామా, మనం యుద్ధాలు చేయటంలేదనా?

కవనశర్మ:
అటువంటి పరిస్థితులు లేవు. చిత్తోడ్ రాణి పద్మిని కోసం...

రజనీకాంత్:
హెలెన్ ఆఫ్ ట్రాయ్, ట్రీజా... లేరు అంటారా ఇప్పుడూ... అందువల్ల మనం వీరులం కాలేకపోయామా? అంటే... నాకర్థం కాలేదు సార్... దీని భావమేమిటా అని! దీని భావమేమి తిరుమలేశా... ఇంతకంటే మరేం లేదు. అది అతుకుతుందా లేదా అని కాదు...

సుధామయి:
అంటే... అతుకుతుందా లేదా అనేదానికైతే... యాక్చువల్‌గా నేను... ఈ పుస్తకం నేనే మొత్తం చేసింది. అంటే... లే అవుట్ పెట్టడంగానీ, మొత్తం తయారు చేసింది నేనే. అయితే... ఆయన మామూలుగా తనకు వచ్చిన ఆలోచనలన్నీ అలా పెట్టుకుంటాడు. పెట్టుకుని, ఇంతకుముందు పుస్తకాల్లో వాడనివి- అంటే, ఇంతకుముందు తనవి రెండొచ్చినయ్... మధుపం అనీ, పలక-పెన్సిల్ అనీ. ఆఁ... వాడనివాటిని ఇందులో పెడదామని పంపించారన్నమాట. నేనూ... ఆ సబ్జెక్ట్ చదువుకుని నాకు కొంచం అతుకుతదీ అన్నవాటిదగ్గర నేను పెట్టాను వాటినీ...

రజనీకాంత్:
నాకేం అభ్యంతరం లేదు. కేవలం ఏంటంటే... అర్థమేంటా? అని.

సుధామయి:
లంకె లేదు అన్నారిందాక మీరు... అందుకని చెప్తున్నా...

రజనీకాంత్:
నేనేంటంటే... అక్కడున్న ఫీచర్‌తో సంబంధం లేకుండా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాన్నేను. చేస్తే... దాని అర్థమే నాకర్థంకాలేదు.
ఇంకోటి అడ్డా కూలీలతో... అయితే ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన ఆలోచనల తాలూకు వ్యక్తీకరణలో వచ్చిన చిన్న ఇబ్బందులే. ఇది కూడా చాలా బాగా రాశారు కానీ, "... కష్టపడితే డబ్బులొస్తాయి అనేది నిజమే అయితే గనక వీళ్ళంతా ఈపాటికి కోటీశ్వరులై ఉండాలి." కష్టం గురించి కాదిది. డబ్బులు రావడానికర్థం కోటీశ్వరులవుతారని కాదుకదా? డబ్బులొస్తాయ్. ఎంతొస్తాయ్? ఒక వందో రెండోందలో వెయ్యో రెండువేలో... కోటీశ్వరులు అవ్వాలని ఎక్కడుందీ?

కవనశర్మ:
రిక్షా తొక్కి కోటీశ్వరుడ్నవుతానంటాడు రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కో దేంట్లోనో... చెల్లెలికి పెళ్ళి చేయడానికి రాత్రంతా రిక్షా తొక్కి కోటీశ్వరుడ్నవుతానంటాడు.

రజనీకాంత్:
అందులోనూ కొన్ని మంచి... యివున్నాయ్. ఇంకోటి... అందులోనే చివర్లో "శత్రువేమిటో, ఎవరో తెలియని యుద్ధరంగం జీవితం."... అది బాగా నచ్చింది. చాలాచోట్ల సామూహిక సమస్య.
అందులోనే అటువంటివి చాలా ఉన్నాయి... 'దేవుడితో కొన్ని కోరికలు' దాంట్లో "నిరాడంబరతను జీవన విధానంగా చూపిస్తే ఆ గుణాన్ని పూజిస్తారుగానీ జీవితాల్లోకి తెచ్చుకోరు."
ఇది కూడా చాలా చక్కటి...

కవనశర్మ:
కోటబుల్ కోట్స్ చాలా ఉంటాయి.

రజనీకాంత్:
అంటే... ఆ సందర్భంలో ఆయన పట్టుకున్నటువంటి ఒక సత్యం. మంచి సత్యమన్నమాట...

మరోచోట కొద్దిగా,  "జీవితంలోంచి స్త్రీ కుతూహలం కూడా మాయమయ్యాక ఇక ఆ ఖాళీని పూరించగలిగే శక్తి దేవుడికి తప్ప మరొకరికి లేదు." 'దేవుడితో కొన్ని కోరికలు 'లో ఫుట్‌కోట్. పురుష కుతూహలం మాయమైతే?

సుధామయి:
ఆఁ...!!!

రజనీకాంత్:
అవును. పురుషకుతూహలం మాయమైతే?

సుధామయి:
అవీ... ఆయన సొంత అభిప్రాయాలు.(ఎక్కువ నవ్వులు)

రజనీకాంత్:
'నాకు' అని రాయలేదుకదా? జనరిగ్గా రాశారు. ఇందులో కొంత పురుష... పురుష కుతూహలం మాయమైతే ఏమిటీ?

కవనశర్మ:
శంకరాచార్యులవారు కూడా అన్నీ పురుషపరంగానే చెప్తారు.

రజనీకాంత్:
అంటే ఆ రోజుల్లో చెప్తే ఓకే. ఈ రోజుల్లో చెప్తే... 2013లో చెప్తే(నవ్వులు) 13లో చెప్తే ఓకే, 1903లో చెప్పినా ఫరవాలేదు (బాగా నవ్వులు)... 2013లో చెప్పడమే...

సుధామయి:
ఆయనా... ప్రపంచమే పురుషులది అంటాడాయన...

కవనశర్మ:
అది ఒక సాంప్రదాయవాదం

రజనీకాంత్:
ఇందులో చాలా స్పష్టంగా స్త్రీ కుతూహలం అనే మాట వాడారు కద సార్... అందువల్ల దానికి ఇబ్బందయింది.
తర్వాత, జూలో... "చాలామంది బలహీనులు కలిసి వేసిన ఒక మహత్తర ఎత్తుగడ ఈ ప్రజాస్వామ్యమేమో!" - అది కరెక్ట్‌గా ఆపోజిట్‌గా ఉంటుంది నా ఊహ. 'కొద్దిమంది బలవంతులు కలిసి వేసిన ఒక మహత్తర ఎత్తుగడ ఈ ప్రజాస్వామ్యం ' అని నేననుకుంటాను.(నవ్వులు) అంటే నా కోరికను పదిమంది కోరికగా నమ్మించడం ఎప్పుడూ కూడా ఒక తెలివైనవాడు చేసే పని మొదట్నించీ... అదీ అవసరం ఎడ్మినిస్ట్రేటర్‌కి కూడా అనుకునేవాడ్ని. అందువల్ల, అంటే... తెలివైనవాడికి ప్రజాస్వామ్యం ఎప్పుడూ చాలా అనుకూలం అన్నమాట.. అంటే, నిర్ణయం తీసుకునేది నేను. కానీ వెళ్ళేటప్పుడు పదిమందీ మేం తీసుకున్న నిర్ణయమనుకుని వెళ్తారు ఆనందంగా... ఇది మంచి ఎడ్మినిస్ట్రేటివ్ లక్షణం కూడా సార్, ఎప్పుడూకూడా...

కవనశర్మ:
మంచి అడ్మినిస్ట్రేటర్ తనది ప్రజల నిర్ణయం...

రజనీకాంత్:
అవును. ప్రజల్ని నమ్మించాలి... ప్రజలచేత నమ్మించాలి. వాళ్ళచేతే నమ్మించాలి... వాళ్ళే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళేప్పుడే ఇదంతా మా నిర్ణయమే, మా బతుకే అనుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడే...

కవనశర్మ:
ప్రజాస్వామ్యంలో కనీసం ఇది మాది కాదు అనే అవకాశం ఉంటుందేమోనని చిన్న నమ్మకం నాకు...

రజనీకాంత్:
కరెక్ట్ సార్. నే వెళ్ళి ప్రజాస్వామ్యంలో అది చేస్తే, నే ద్రోహిని కానక్కర్లేదు. నేరస్తుడ్ని కానక్కర్లేదు.. బట్ నే కోరుకున్నది నెరవేరుతుంది. అందువల్ల ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా 'కొద్దిమంది బలవంతులు కలిసి వేసిన మహత్తర ఎత్తుగడ' అని నేనంటాను.
తర్వాత వాన... బాగా రాశారది. బాగ రాశారు అది కూడా. మంచి కవితా ధోరణి ఉన్న రచన అది.

కవనశర్మ:
మీరు "ఇది కుంట..." అది చెప్పారూ; మర్చిపోయాను నాక్కూడా చాలా నచ్చిందది.

రజనీకాంత్:
అందులోనే, కారు... వానపడుతున్నపుడు ఆ వైపర్సుతో తుడవటం, మొహం తుడుచుకున్నట్టుగా... చక్కటి పోలికనిచ్చారు. అంటే, చేత్తో మొహం తుడుచుకుంటున్నట్టుగా కారు వైపర్స్‌తో అద్దాన్ని తుడుచుకున్నట్టు... చాలా చక్కగా రాశారు. ఇక్కడ కూడా మళ్ళా కొన్ని... "ప్రకృతి మంచిది కాదు, చెడ్డది కాదు. అది ప్రకృతి. అదే దాని ప్రకృతి. అయినా దుఃఖించడం మన ప్రకృతి."- చెప్పడం చాలా బాగా చెప్పారు. కానీ ఇంజినీర్లకీ, సైంటిస్టులకీ దాని ప్రకృతిగా దాన్ని వదిలేయటమనేది అసలు లక్షణం కాదు. దాని ప్రకృతితో మెస్సప్ చేయడమే మన ఉద్దేశం... మన జీవిత లక్ష్యం. (నవ్వులు) To mess up the nature is the job of the engineer... అనీ... అందువల్ల మనం...(నవ్వు)

ఎంజె రావు:
కాదు సార్. న్యూటన్ చెప్పింది సైన్స్.

రజనీకాంత్:
అవున్సార్. ఇంజినీర్లన్నాను అందుకే...

ఎంజె రావు:
న్యూటన్ చెప్పిందేందంటే... nature is disorderly...

రజనీకాంత్:
"... సమాధానాలతో నిద్రించడమే కావాలి." అదీ... 'దేవుడితో కొన్ని కోరికలు 'లో ఉంది. అది కూడా సరిగా అర్థంకాలా నాకు. అంటే, సమాధానాలతో నిద్రించలేకనే కదా వచ్చింది...

సి.మోహన్: ప్రశ్నలుంటే నిద్రపోవటం సాధ్యంకాదు.

రజనీకాంత్:
సమాధానాలు లేకే నిద్ర రావటంలేదు. నిద్రపోవడమే కావాలిప్పుడు అంటే... సమాధానాలుంటే నిద్ర బాగానే పడుతుంది. సమాధానాలు లేవు కదా, అందుకే నిద్ర లేదు.

కవనశర్మ:
తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసింది మీరు చదివారు కదా... మీ అభిప్రాయాలు...

రజనీకాంత్:
మూడు చెప్పారండీ. ఒక సమాజంలో శ్రోతలు. చాలా పాత రోజుల్లో మనం చెపితే వింటం ప్రధానంగా ఉండేది. అంటే, శ్రోతల యుగం. కొన్నాళ్ళ తర్వాత వచ్చింది పఠితల యుగం. అంటే, చదవటం మొదలెట్టాం. ఇప్పుడు దృశ్య యుగం... చూట్టమనేది అన్నట్టు ఒక రకమైన... వ్యాఖ్యానించారు.

కవనశర్మ:
అంటే మూడూ కనిపిస్తున్నాయనా?

రజనీకాంత్:
మూడూ కనిపిస్తున్నాయా అంటే...

కవనశర్మ:
"... పూర్వపు ఆశు సంప్రదాయం ధ్వనిస్తుంది. ఆధునిక రాతకథా లక్షణమూ పొడగడుతుంది. దృశ్యకావ్యపు లక్షణమేదో ద్యోతకమవుతుంది..."

రజనీకాంత్:
అదీ... కొంతమటుకూ ఆ మూడూ కూడా నిజమే. మూడూ కనిపిస్తున్నాయనేది నిజమే కానీ, దానికంటే ముఖ్యంగా... ఆ రకంగా ఆ మూడూ వున్నయ్యీ. ఇప్పుడు ఈ ధోరణి... యిదీ నాక్కూడా కొత్తగా ఉంది అని ఆయన రాశారు. అది బావుంది అనిపించింది నాకు. కొద్దిగా సునిశితమైనటువంటి వ్యాఖ్య; ప్లస్ అబ్జర్వేషన్ కూడా అది అనిపించింది. ముందు చెపుతున్నపుడు- సంప్రదాయం గురించి చెప్పినపుడు అలా చెప్పారు. అది బాగా నచ్చింది నాకు.

కవనశర్మ:
"ప్రతి దృశ్యంలో కదలని, కదిలే బొమ్మలతోపాటు ఒక తాత్వికుడి ఆలోచనలతోపాటు ప్రవహించే వాక్యాలలో అనేకం 'పొయెటిక్ టచ్' ఉన్నవే. ప్రతి దృశ్యం ఒక కవితాత్మక వ్యాఖ్యానంతో ముగుస్తుంది."
అంటే, ఈ పుస్తకానికి రెండు కితాబులొచ్చాయి. ఒకటి కాళీపట్నం రామారావుగారి దగ్గర్నుంచి, మరోటి తుమ్మేటి రఘోత్తమరెడ్డి నుంచి. అవి రావడం వల్ల చర్చకు బావుంటుంది అని అనిపించింది.

సుధామయి:
ఇందాక 'పొయెటిక్ టచ్' ఉందని చెప్పింది... అదీ చింతపట్ల సుదర్శన్‌గారి ముందుమాటలో ఉందది.

రజనీకాంత్:
తుమ్మేటిగారు చెప్పిందీ... ఆఁ.."నా తరానికి ఆధునిక లిఖిత కథ, నవల అందుబాటులోకి వచ్చినట్టుగానే (నాకైతే 1965-70ల మధ్యగానీ అందుబాటులోకి రాలేదు.) సుమారుగా 1985 నుంచి ప్రారంభమయ్యే ఈ తరానికి టెలివిజన్, తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి. (అంటే, కొన్ని మార్పులొచ్చినయ్.) ఇల్లే ఒక థియేటర్‌గా మారింది. వందలాది చానళ్ళు వేలాది కార్యక్రమాలని దృశ్యమానం చేసి, 'పదునాల్గు భువనభాండములన్ ' కళ్ళెదుట కనిపింపజేస్తున్నాయి. ఇంటర్నెట్ మూలంగా ఈ తరానికి ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చిచేరింది. ఈ తరానికి నా తరంలాగా చదవవలసిన అవసరం అంతగా పడలేదు. 'చూడవలసిన ' పరిస్థితులు ఏర్పడ్డాయి." - అంటే అది దృశ్యమాధ్యమంలోకి వెళ్ళామనేది. ఇక్కడ ఈ వాక్యం..."... మొన్నటిదంతా శ్రోతల తరం, నిన్నటిదంతా పాఠకుల తరం, నేటిదంతా ప్రేక్షకుల తరం.".. అదీ.. ఆ వాక్యం.

కవనశర్మ:
దాని కంటిన్యూషనే సమ్మరీలాగా అక్కడా...

రజనీకాంత్:
అదే... ఆ వాక్యం... అంతా నచ్చింది. ఆయన అబ్జర్వేషన్ కూడా బాగుందనిపించింది.

కవనశర్మ:
ఆయన చెప్పిందాంట్లో ఇప్పుడంతా టీవీలొచ్చాక పోయిందనే ఒక దుగ్ధ లేదు.

రజనీకాంత్:
లేదు.

కవనశర్మ:
అబ్‌స్ట్రాక్ట్‌గా చెప్పారు.

రజనీకాంత్:
అదేకాదు. రచనల్ని కూడా దాన్ని మనకనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందీ... ఈ రచయిత దాన్ని గ్రహించాడూ అన్న ఒకరకమైన అభినందన కూడ ఉంది.

కవనశర్మ:
ఇది కాలంతో వచ్చిన మార్పుగా గుర్తించి రచయిత దీన్ని వాడుకున్నాడు - అని.

రజనీకాంత్:
ఆ వాడుకుంటాన్ని ఎలా నేర్చుకున్నారు ఇప్పటి రచయితలు అనేది చూట్టంకోసం నేను వీళ్ళందరినీ చదువుతుంటానని కూడా చెప్పారు. అంటే...
"... మొన్నటిదంతా శ్రోతల తరం, నిన్నటిదంతా పాఠకుల తరం, నేటిదంతా ప్రేక్షకుల తరం." ఆ వాక్యం బాగా నచ్చింది.

(అయిపోయింది)