Monday, October 27, 2014

హైదరాబాద్ నాకేమిటి?

ఐదో క్లాసులో ఉన్నప్పుడు పెద్దమామ గృహప్రవేశానికి మేడ్చల్ వచ్చాం. బంగ్లా మీదికి ఎక్కితే విమానాలు తలమీదే ఎగురుకుంటూ పోతున్నాయి. హైదరాబాదీకి మేడ్చల్ మేడ్చలే  కానీ.. వేములవాడ దగ్గరి పల్లెటూర్లో పుట్టిన వాడికి మేడ్చల్ అంటే హైదరాబాదే ! ఆ బంగ్లా మీది నుంచి ఎత్తుగా ఒక నిర్మాణం కనబడింది. నాలుగు గుమ్మటాలు! ‘ఓహో అయితే ఇదే పుస్తకంలో చదువుకున్న చార్మినార్ కావొచ్చు,’ అనుకున్నా.
దాన్ని మా సుహాసిని వదిన సరిదిద్దింది. ‘‘ఇది మసీదు; చార్మినార్ అంటే సిటీలో ఉంటుంది,’’ అంది.
మేడ్చల్‌లో ఏనాడూ హైదరాబాద్‌ను హైదరాబాద్ అనగా వినలేదు. ‘సిటీ’యే! అదీ హైదరాబాద్ అనే ఉనికితో నా తొలి సంపర్కం.

తర్వాత కీసరగుట్ట రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. దానికోసం ఉప్పల్ బస్టాపులో 242 జీ ఎక్కాను. ఆలియా కాలేజీలో ఇంటర్ చేశాను. సిటీ అంతా నాకు థియేటర్లుగా పరిచయం! ‘మనోహర్ టాకీస్ లేదా?’ ‘ఆరాధన నుంచి ముందుకువోతే...’ ‘వెంకటాద్రి ఉంది సూడు’ ఇట్లా!

సికింద్రాబాద్ ఏనాడో హైదరాబాద్‌ను పెళ్లాడింది కాబట్టి రెంటినీ ఒకటిగానే కలిపేసి చెప్పేస్తున్నా.
హైదరాబాద్‌లోనే మొదటిసారి థియేటర్లో టికెట్‌కు నంబర్ ఉంటుందని తెలుసుకున్నా. ప్రశాంత్; రౌడీగారి పెళ్లాం; హెచ్ 14.
టీ చుక్క చొక్కా మీద ఒలికిపోతే ఆ రోజంతా వాసన వచ్చిన ఇరానీ చాయ్‌ని మొదటిసారి ఇక్కడే రుచిచూశాను. బ్లూ సీ; సికింద్రాబాద్.
తొలి సిగరెట్ ఇక్కడే కాల్చాను. సీనియర్ ఇంటర్; జూ పార్క్ దగ్గర; శివిగానితో. కానీ కాల్చడం అంటే అది కాదని తెలియడానికి నాకు మరో రెండేళ్లు పట్టింది.
మొదటి సాఫ్ట్ పోర్న్ సినిమా ఇక్కడే చూశాను. లాంబా; హిజ్ వైఫ్ అండ్ హర్ లవర్; నాకు తొలి ‘దర్శనం’ ఇచ్చింది హెలెన్ మిర్రెన్!
 గప్‌చుప్ పేరుతో ఒక గుండ్రటి ఐటెమ్ ఉంటుందని ఇక్కడే తెలుసుకున్నా (రేతిఫైల్ బస్‌స్టేషన్).
మొదటి దమ్‌కీ బిర్యానీ ఇక్కడే తిన్నా (బాంబే హోటల్; రాణీగంజ్).
అప్పుడే చేస్తున్న బ్రెడ్ వాసన ఇక్కడే పీల్చాను  (చార్మినార్).
అమ్మాయి సిగరెట్ తాగడం ఇక్కడే చూశాను (సంగీత్ థియేటర్).
పార్కులో అమ్మాయీ అబ్బాయీ యథేచ్ఛగా  ముద్దుపెట్టుకోవడం ఇక్కడే చూశాను (సంజీవయ్య పార్క్).
నా తొలి ‘ఉద్యోగం’ ఇక్కడే చేశాను. అంకుర్ బట్టల షాపులో హెల్పర్‌గా! చెప్పుకోవడానికి బాగుండే కష్టాలు నాక్కూడా కొన్ని ఉన్నయ్!
యండమూరిని మాత్రమే చదివిన నాకు చలం పుస్తకాలు ఇక్కడే పరిచయం (సుల్తాన్‌బజార్ విశాలాంధ్ర). పాతపుస్తకాలు అమ్మడం ఇక్కడే చూశాను (కోఠి).

 నా తొలి కథ ఇక్కడే రాశాను. డిగ్రీ అయిన తర్వాత రామ్‌నగర్‌లో అద్దెకున్నాను ఫ్రెండ్స్‌తో. ఓనర్ అర్జునరావు. ఆ మేడమీద రాశాను ‘ఆమె పాదాలు’. అంతకుముందు కొన్నిరాసినా కూడా నేను స్టాంపు కొట్టుకోవచ్చు అనుకున్నాను దీంతో.
మొదటిసారి సెల్‌ఫోన్ వాడింది ఇక్కడే. ఇంటర్నెట్ వినియోగించింది ఇక్కడే. భోజనం లేకుండా ఒకే రోజు మూడు సినిమాలు చూసింది ఇక్కడే. రన్నింగ్ బస్సుల నుంచి దూకి పడ్డది ఇక్కడే! కర్ఫ్యూ ఇక్కడే మొదటిసారి అనుభవించాను. పోలీసు దెబ్బ ఇక్కడే తిన్నాను. కాలు తొక్కి కూడా పశ్చాత్తాపం ప్రకటించని మనుషుల్ని ఇక్కడే చూశాను. కొనకపోతే కొట్టేంత పనిచేసే పొగరుబోతు అమ్మకందారుల్ని ఇక్కడే చూశాను.

ఇం..త.. సందులో ఇళ్లుండటం ఇక్కడే చూశాను. ముందట డ్రైనేజీ పారుతుంటే మనుషులు తినాల్సిరావడం ఇక్కడే చూశాను. షాపుల ముందు మనుషులు చాలీచాలని బట్టలతో నిద్రించడం ఇక్కడే చూశాను. ఇంకా, ఇప్పటి చాలామంది మిత్రుల్ని కలుసుకుంది ఇక్కడే! నా ఇద్దరు పిల్లలు ప్రాణం పోసుకుంది కూడా ఇక్కడే!
అందుకే ఈ నగరాన్ని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ద్వేషిస్తాను; ఎంతగా ద్వేషిస్తానో అంతగా ప్రేమిస్తాను. ఎందుకంటే నా జీవితంలోని చాలా విలువైన భాగం, విడదీయలేని భాగం ఈ నేలతో ముడిపడి వుంది కాబట్టి!

(సాక్షి, సిటీ ప్లస్, అక్టోబర్ 26, 2014)

Monday, October 13, 2014

ఫ్రీడ్రీక్ నీషే: దేవుడి శత్రువు?వ్యక్తి మనుగడలో దేవుడి పాత్ర ఏమిటి? ‘దేవుడు మరణించాడు’ అన్నాడు జర్మన్‌ తత్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీషే. ఆయన ప్రధాన భాగస్వామ్యం ఉన్న అసిత్వవాద సిద్ధాంతం ప్రకారం, మనిషి జీవితంలో– ఏ మానవాతీత శక్తి ప్రమేయమూ లేదు. తలరాత అనేది అబద్ధం. మనిషి తన నిర్ణయాన్ని తానే తీసుకుంటాడు. తన జీవనశైలికి తానే బాధ్యుడవుతాడు. తన మంచికీ, చెడుకీ కర్త తనే!

దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా?
లేక, దేవుణ్ని చంపింది మనుషులే అని నిందిస్తున్నాడా నీషే? ఒక విశ్వాసానికి కట్టుబడలేని కపటాన్ని ఎద్దేవా చేస్తున్నాడా? దేవుడిని కేవలం ఒక ట్రోఫీగా మార్చిన తీరుకు నిరసన చెబుతున్నాడా? ఏ శుద్ధజలంలో మనల్ని శుభ్రపరుచుకుందామని అడుగుతున్నాడా?

వివిధ పుస్తకాలుగా తన భావాల్ని వెల్లడించాడు నీషే. అందులో ‘థస్‌ స్పోక్‌ జరాతుష్ట్ర’ ముఖ్యమైనది. పూర్వపు మత, సాంఘిక విలువల శైథిల్యం ఆయన రచనల్లో కనబడుతుంది. జనం మందగా ఉండటాన్ని వెక్కిరిస్తాడు. మందకు ఒక పద్ధతంటూ ఉండదు. సమాజానిది కూడా ‘మంద’గమనమే! ఇక్కడ నీతి లేదు. జనం నమ్ముతున్న విలువలకు విలువ లేదు. విశ్వాసాలకు విశ్వసనీయత లేదు. ‘ఒంటెలాంటివాడు మనిషి. తనకు తానే మోకరిల్లి, తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని, ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు’. ‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’. తాను ఏమికాదో దాన్నే మోసుకు తిరుగుతాడు మనిషి. ‘నీలో విలయం తాండవిస్తేనేకానీ నర్తించే నక్షత్రానికి జన్మనివ్వలేవు’.

విల్‌ టు పవర్, సూపర్‌ మాన్‌ భావనలు ప్రవేశపెట్టాడు నీషే. ఇప్పటి వ్యక్తిత్వ వికాస నిపుణుల భావనలుగా కనబడతాయివి. ప్రతి జీవి కూడా తానున్న స్థితిలోంచి, మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి శక్తి కావాలి. అంతిమలక్ష్యం చేరుకోవడమన్నది ఆయా వ్యక్తుల శక్తి మీదే ఆధారపడివుంటుంది. పరిస్థితులతో పోరాడాలి. వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఈ సంఘర్షణలో నిలబడేది వీరులు మాత్రమే. కాబట్టి బలమే సుగుణం. శక్తిహీనతే దుర్గుణం. ఏ సిద్ధాంతం ఉపయోగపడితే దాన్నే అనుసరించాలి. అప్పుడే నువ్వు సూపర్‌మాన్‌ కాగలవు, అన్నాడు. ఇక్కడే నీషే వివాదాస్పదం అయ్యాడు. ఆయన భావాల్ని నాజీలు తమకు అనువుగా మలుచుకుని ఆర్యన్‌ జాతి గొప్పదన్న ప్రచారం చేసుకున్నారు.

నీషే బాల్యం అంతా మతవిశ్వాసాలు తీవ్రంగా ఉన్న పరిసరాల్లో గడిచింది. నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. బాల్యమంతా తల్లి, అమ్మమ్మ, అత్తలు, చెల్లి... ఇలా ఆడవాళ్ల చుట్టూనే తిరిగింది. కానీ అసలైన స్త్రీ సాంగత్యం కావాల్సిన యౌవనంలో తిరస్కారానికే గురైనాడు. చిన్నతనం నుంచీ మూడీగా, బలహీనంగా ఉండేవాడు. ఒంటరిగా గడిపాడు. స్నేహితులు లేరు. కోరుకున్న స్త్రీని అందుకున్న అదృష్టం లేదు. తనలో లేని ‘సూపర్‌ మాన్‌’కు ఇవన్నీ ఊతం అయ్యాయా?

పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా తోస్తాడు నీషే. స్పష్టంగా ఏం చెప్పాడో ఒక కంక్లూజన్‌కు వచ్చినట్టు కనబడదు. ప్రపంచం ఇలా ఉండాలన్నాడా? ఇలా ఉందన్నాడా?
మళ్లీ ఏ విధమైన గుడ్డినమ్మకాలు, చారిత్రక సంకెళ్లు లేని స్వేచ్ఛా ఆత్మ గురించి యోచించాడు. సేచ్ఛగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న మనిషినీ, కేవలం భయంలో, వాంఛలో మగ్గిపోయే మనిషినీ పట్టించాడు. భయమే మనిషిని బానిసను చేస్తుంది. ‘బానిస భావజాలంలో దయ, అణకువ, సహానుభూతి లాంటి పదాలుంటే, యజమాని నిఘంటువులో దర్పం, శక్తి, ఘనత లాంటివాటికే చోటుంటుంది. యజమాని ఘటనల్ని మంచికో చెడుకో దారితీసే పరిణామాలుగానే పరిగణిస్తాడు. బానిస అవే ఘటనల్ని మంచీ చెడూ ఉద్దేశాలుగా చూస్తాడు’.
‘సింహాసనం మీద ఎక్కడానికి అందరూ ఎగబడుతున్నారు. పిచ్చికాకపోతే అదేదో సంతోషం సింహాసనం మీద కూర్చునివున్నట్టు!’ ‘మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, రాజ్యంలో అందరూ విషం తాగినవాళ్లే. మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, అందరూ తమని కోల్పోయివున్నారు. ఈ నిదానమైన ఆత్మహత్యే జీవితంగా పరిగణించబడుతోంది’.

‘(అయితే) జీవితం ఏమీ పళ్లెంలో అందుకోవాల్సిన భోజనం కాదు. అది ఉత్తి అయోమయం, అర్థంపర్థం లేని గోల. దీనికి పరిపూర్ణత లేదు. ఇది అర్థమైతే ద్వేషం లేకుండా మనిషి జీవితాన్ని ఆమోదిస్తాడు’. బహుశా ఈ వాక్యంలో నీషే ఆత్మ నిక్షిప్తమైవుందేమో!

విద్యార్థి దశలో ఉన్నప్పుడే సిఫిలిస్‌ బారినపడ్డాడు. శిరోభారం, గాస్ట్రిక్‌ పెయిన్స్, పైయోరియా, కళ్ల మసక బాధించాయి. తరువాత మతిస్థిమితం తప్పింది. మానసికంగా, శారీరకంగా దుర్బలుడయ్యాడు. దశాబ్దం పాటు తీవ్ర వేదన అనుభవించి 55 ఏళ్లకే మరణించాడు(1844–1900). ఎవరైనా ఆస్తికుడు ఇది దేవుడు విధించిన శిక్షే అంటే నీషే గట్టిగా నవ్వుతాడేమో!

(సెప్టెంబర్ 2014; ఫన్ డే)