Friday, February 13, 2015

నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు

డిగ్రీ ఫెయిలవడంలో ఉన్న అసలు బాధ ఏమిటంటే, మరీ డిగ్రీ ఫెయిలయ్యామని చెప్పుకోలేం. అలాంటి టైములో నేను ఈ ‘డోర్ టు డోర్ మార్కెటింగ్’ పనికి కుదురుకున్నాను. కారణాలు: పేరు స్టైలిష్‌గా ఉంది; టై అదీ కట్టుకుంటారు; ఎగ్జిక్యూటివ్ అని వ్యవహరిస్తారు.
ఫెయిల్ ముఖంతో హైదరాబాద్ వచ్చిననాకు, ముందు ఒక ఆడవాళ్ల బట్టల షాపులో హెల్పర్‌గా పని దొరికింది. ఇది కూడా మార్కెటింగ్‌లోకి జంప్ అవడానికి కారణం. మరీ బట్టల దుకాణంలో పనిచేస్తున్నామని కూడా చెప్పుకోలేం కదా!
కాచిగూడలో ‘మా’ ఆఫీసు. ఈ ‘మా’ అనేది వ్యవహారంగా చెబుతున్నది కాదు; నా వెంట మా శివిగాడు కూడా ఉన్నాడు. వాడూ నా బాపతే. అందుకే ఇద్దరమూ ‘ఉద్యోగం’లో చేరినరోజు చాలా ఎక్సయిట్ అయ్యాం. కొన్ని కలలు ఉమ్మడిగా కన్నాం. ‘మేనేజర్ చెప్పిందే నిజమైతే మనమే ఒక రెండు మూడేండ్లలో ఓన్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చురా!’ అనుకున్నాం.
తెల్లారి ఉదయం ఎనిమిదికల్లా ఆఫీసులో ఉన్నాం. ఇది పనిలో దిగిన మొదటిరోజు. మాతో హిందీలో ‘డెమో’ ప్రాక్టీస్ చేయించారు. అందరూ యువకులే. గుండ్రంగా నిలబడ్డాం. ‘జీఎఫ్ హై క్యా?’ అన్నారు మధ్యలో. నాకు లేదు. మావాడు ఉందన్నాడు. కొన్ని రసబూతులు దొర్లిపడ్డాయి. మావాడు చాలా స్పోర్టివ్!
ఆ రోజంతా కంపెనీ ఏమిటి? దాని హెడ్‌క్వార్టర్ ఎక్కడుంది(అమెరికా)? సామాన్లు ఏమేం వస్తుంటాయి(ప్లాస్టిక్‌లో రకరకాలు)? వినియోగదారులతో మనం ఎలా వ్యవహరించాలి? ఎలా మెప్పించాలి? ఇలాంటి నేపథ్య సంగీతం వినిపించారు. ఇంకా ముఖ్యమైనది, మమ్మల్ని వేర్వేరు పర్సనల్ ట్రెయినర్స్‌కు అప్పజెప్పడం!
రెండోరోజు ప్రాక్టికల్ శిక్షణ. నా ట్రెయినర్ బి.డి.శర్మ. ఈయనది భోపాల్. ట్రెయినర్లంటే సీనియర్లే! అయితే ప్రతి సీనియరూ శిక్షకుడు కాలేడు. ట్రెయినర్ పొజిషన్ వచ్చిందంటే, సొంతంగా ఆఫీసు తెరుచుకోవడానికి కొంచెం దూరంలో ఉన్నవాళ్లన్నమాట! అప్పుడు వాళ్లు మేనేజర్లు అవుతారు. ప్రస్తుత మేనేజర్లు(ఇద్దరు) కూడా అలాంటి దశలు దాటి వచ్చినవారే(నని చెప్పేవారు)! కాబట్టి అదీ మేము నిన్న అంత ఎక్సయిట్ అవడానికి కారణం!
ఇద్దరమూ, నేనూ, నా ట్రెయినరూ, బయల్దేరాం. రైల్వేస్టేషన్ ముందరి హోటల్లో పూరీ తిని, టీ తాగి, బస్సెక్కాం. మధ్యాహ్నం కోఠిలో భోంచేశాం. తీసుకెళ్లినవి సగం భోజనానికి ముందు అమ్మాం; సగం భోంచేసిన తర్వాత అమ్మాం. కానీ అలవోకగా అమ్మాం. రాత్రికి కాచిగూడ తిరిగొచ్చి సంగంలో తిన్నాం. వెంట వెళ్లినందుకు నా ఖర్చంతా ఆరోజు ఆయనదే. ఆమ్లెట్ వేయించుకొమ్మంటే నేను మొహమాటపడ్డాను. ఆరోజు చాలా గొప్పగా గడిచింది. మార్కెటింగ్‌లో నిలదొక్కుకోవచ్చన్న నమ్మకం కలిగింది. దీన్ని పంచుకోవడానికి శివిగాడి కోసం ఉదయందాకా వేచివుండాల్సి వచ్చింది. వాడప్పటికే ‘విజయవంతం’గా వెళ్లిపోయాడు. మరునాడు పొద్దుటిపూట వాడూ, నేనూ మొన్నటికంటే ఆనందంగా ఉండటంతో పరగడుపునే సిగరెట్లు కాల్చాం.
మూడోరోజు నుంచి నేను సొంతంగా వెళ్లాలి. నాలుగో రోజు, ఐదో రోజు కూడా వెళ్లాల్సిందే!
అందరిలాగే నేనూ ఆరు సెట్లు పట్టుకెళ్లేవాణ్ని. అవి వివిధ పరిమాణాల్లో ఉన్న ఫైబర్ డిన్నర్ బౌల్స్. సెట్టు ఖరీదు 200. పన్నెండు వందల్లో పది శాతం చొప్పున మనకు 120 వస్తుంది. వస్తుందంటే, అవన్నీ అమ్మగలిగితే. కానీ అమ్మడం ఎలా?
బెల్లు కొట్టగానే రిసీవ్ చేసుకోవడంలో పరిచిత ముఖాలకీ, అపరిచిత ముఖాలకీ ఉండే స్పష్టమైన తేడా తెలిసిపోయేది. ‘‘సర్, దిసీజ్ రాజిరెడ్డి ఫ్రమ్…’’
‘‘వద్దొద్దు…’’
నేనేమిటి? ఎందుకొచ్చాను? ఊహూ. ముఖాల్లో భావాల్ని మర్యాద కోసం కూడా దాచుకునేవారు కాదు. కొందరైతే మనం గేటు కూడా పూర్తిగా దాటకముందే అనేసేవాళ్లు: ‘ఏంటండీ ఈ మార్కెటింగ్ వాళ్ల న్యూసెన్సు… టైమూలేదూ, పాడూలేదూ’.
ఈ ఉచితమైన టైము ఎప్పుడనేది నాకు అర్థమయ్యేది కాదు. తొమ్మిదీ పదీ ప్రాంతాల్లో వెళ్తే, ‘ప్చ్, ఆఫీసుకు రెడీ అవుతుంటే నీ గోలేంటీ?’ అనేవారు. మధ్యాహ్నం వెళ్తే, సాధారణంగా ఇల్లాళ్లు, ‘సెట్టు బాగుందిగానీ మా ఆయన ఉన్నప్పుడు వచ్చుంటే బాగుండేది,’ అనేవాళ్లు. సాయంత్రం వెళ్తే… అలా ఎలా వెళ్లగలం? మన టార్గెట్?
తటపటాయిస్తూనే ఒక ఇంటి తలుపు తట్టాను. ఒకాయన తీశాడు. ఎరట్రి కళ్లు. నటుడు జీవాలాగున్నాడు. ‘స్సర్…’
నా మాట బయటికి రాకముందే, ‘‘నేను పోయిపోయి వచ్చి ఇట్ల పండుకున్న; నువ్వు బెల్లు గొట్టినవ్; చెప్పు, నేను నిద్రపోవాల్నా లేదా?’’
నాకు గుండె ధడ్ ధడ్ అని కొట్టుకుంటోంది. ‘సారీ సర్’ అని గొణుక్కుంటూ, నవ్వుని పులుముకుని నెమ్మదిగా జారుకున్నాను. ‘ఎప్పుడూ ముఖంలో నవ్వు చెదరనీయొద్దు’. చెప్పారుగా మొదటిరోజు పాఠం. నేను ఆయన్ని నొప్పించిన మాట నిజమే కావొచ్చు. మర్యాదల్ని మీరడం కూడా అవుతుందేమో! కానీ ఒక ఇంట్లో ఒక మనిషి అప్పుడే వచ్చి పడుకున్నాడో, లేదా తీరిగ్గా ఎవరూ దొరక్క ఉబుసుపోక కూర్చున్నాడో మనకు ఎలా తెలుస్తుంది?
ఇక, నేను ఒక తీర్మానానికొచ్చాను. శర్మాజీతో వెళ్లినరోజు తగిలినవాళ్లందరూ మంచివాళ్లు. నాకు మాత్రమే ఇలా చెడ్డవాళ్లు తగులుతున్నారు.
సాయంత్రం ఒక్క సెట్టు కూడా అమ్మకుండా తిరిగివెళ్లిన నాలో మా శర్మే ధైర్యం నింపడానికి తాపత్రయపడ్డారు: ‘‘ఉస్‌కో(షానవాజ్, మా మేనేజర్) బాత్ కర్‌నేకో ఆతా హై… చూశావా, ఎలా తతత తడబడతాడో… కానీ మేనేజర్ అయ్యాడు… రాజ్, నువ్వు కచ్చితంగా సక్సెస్ అవుతావు’’.
నాకు శిక్షణ సరిపోలేదని తెల్లారి నన్ను శాండీతో పంపారు. ఈయనది ముంబై. ఇలా మార్చి మార్చి పంపడం ద్వారా ఎవరెవరు ఎలా డీల్ చేస్తున్నారన్నది పరిశీలించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ఈరోజు కూడా పొద్దున పూరీ తిన్నాం. తర్వాత చాయ్ తాగాం. మధ్యాహ్నం అమీర్పేటలో తృప్తిగా భోంచేశాం. భోజనానంతరం సిగరెట్ కాల్చాం. ఈయన నా అసలైన గురువు కాదు కాబట్టి నేను మొహమాటపడలేదు. రాత్రి సంగంలో తిన్నాం. ఈరోజు తనవెంట ఉన్నందుకు నా బాధ్యత శాండీదే!
అన్నట్టూ, ఈరోజు కూడా అన్నీ అమ్మాం. ఒకరిద్దరు అటూయిటుగా మాట్లాడినా శాండీ నవ్వుతూ తీసుకున్నాడు. ‘‘తుమ్ బెల్ బజానే సే డర్‌తే హో… బెల్లుకొట్టడానికి భయపడేవాడివి ఇక ఏం అమ్ముతావు?’’ అన్నాడు మధ్యలో నన్ను. ఆ ఉత్సాహంతో నేను నాలుగైదు బెల్లుల్ని తడుముకోకుండా మోగించాను; గేట్లు చప్పుడు చేశాను; ‘హలో మేడమ్… కోయీ హై అందర్?’ అని ఎలుగెత్తి అరిచాను.
శాండీ ఇదొకటైతే కచ్చితంగా చెప్పాడు: ‘‘రాజీ, యే ప్రొడక్ట్ క్యా హై బస్ ఉత్నా హీ కస్టమర్‌కో సమ్‌ఝావో… నువ్వు తెచ్చిందేమిటో వినియోగదారుడికి అర్థమయ్యేలా చెప్పు, దాని గుణగణాలేమిటో వర్ణించు, ఇది కొనకపోతే వాళ్లు కోల్పోయేదేమిటో చెప్పు (ఫియర్ ఆఫ్ లాస్); అంతేగానీ దీన్ని కొను కొను, అని మాత్రం చచ్చినా దేబిరించొద్దు’’.
ఏడోరోజున అనుకుంటాను. ఒక పోలీస్ క్వార్టర్స్‌కు వెళ్లాను. నిజానికి నేను వెళ్లకూడదు; కానీ నా పిరికితనాన్ని ‘జయించడం’ కోసం నాకు నేనే విధించుకున్న పరీక్ష అది. మొదటి ఇల్లు తలుపు తీసేవుంది. మనిషెవరూ కనబడలేదు. ధైర్యంగా మధ్యవేలి మడమతో తలుపుమీద కొట్టాను. ఒకాయన టక్కున బయటికి వచ్చాడు.
‘‘సర్ దిసీజ్ రాజిరెడ్డి ఫ్రమ్..’’ ఇంగ్లీషులో పరిచయం చేసుకుంటే కస్టమర్లు మనకు విలువ ఎక్కువిస్తారట. చెప్పారుగా మొదటిరోజు.
‘‘మార్కెటింగా?’’ చిరాకుగా, కోపంగా, ఈమాత్రానికి పరిచయం ఎందుకన్నట్టుగా ఆయన.
‘‘ఎస్ సర్’’
‘‘అది అమెరికా ఫోన్ తెలుసా? నీకోసం ఆపొచ్చాను,’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు.
నేను బిక్కమొహం వేశాను. అమెరికా ఫోన్ అయితే మాట్లాడాలిగానీ, బెల్లు కొట్టగానే పక్కన పెట్టేసి వెంఠనే ఎందుకు రావడం? ఆయన ఫోన్ మాట్లాడటం పూర్తయ్యేలోపు నెమ్మదిగా అక్కణ్నుంచి జారుకున్నాను.
నా ఈ మార్కెటింగ్ ప్రయాణంలో ఖైరతాబాద్, ముషీరాబాద్, బార్కాస్ ఇలాంటి చోట్లకు ఒక్కొక్కసారే వెళ్లినా చార్మినార్ వైపు మాత్రం మూడు సార్లు వెళ్లాను. కారణం: మొదటిసారి వెళ్లినప్పుడు భోంచేసిన హోటల్లో ఒక ఐదారుమంది కుర్ర గ్యాంగు పరిచయం కావడం. ఫహీమ్, ఇర్ఫాన్, అక్తర్…  చుట్టుపక్కల మెకానిక్కు, బ్రెడ్ తయారీవాలా, పీరియడ్ ఎగ్గొట్టిన విద్యార్థి… ఇలాంటి గ్యాంగది. సిగరెట్లు కాల్చడానికి ఆ హోటల్‌కు వచ్చేవారు. వాళ్లతో కూర్చున్నంతసేపూ ఉత్సాహంగా ఉండేది. తీరా బ్యాగు పట్టుకోగానే భయం నా భుజాన ఎక్కేసేది. ‘‘రాజ్, ఏ క్యా జాబ్ హై… డిగ్రీ చదివినవాడివి వేరేదాన్లోకి మారిపో,’’ అనేవాళ్లు.
అయితే ఇన్ని రోజుల్లో నేను ఏమీ అమ్మలేదా అంటే అమ్మాను. రతి అని ఒకామె- నార్త్ ఇండియన్- కొంది. అలాంటిపేరున్న మనిషిని జీవితంలో చూడటం అదే మొదటిసారి కాబట్టి, ఆ పేరు నాకు గుర్తుండిపోయింది. ఇంకొకామె- నేనేదో పెద్ద మార్కెటింగ్ అని వివరించబోతుంటే… చిన్నగా నవ్వి, ‘నేను ఎంబీఏ చేశాన్లే,’ అంది. ఆమె కూడా ఒక సెట్టు తీసుకుంది.
ఇంకో దగ్గర మరో అమ్మాయి- వాళ్ల ఇంటిముందు రెండు బుల్లి నల్లమేకలున్నాయి- దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబం- సెట్టు తీసుకుంటానంటుందిగానీ, ఇంకో సెట్టులోని బౌల్ ఫ్రీగా ఇమ్మంటుంది. అలా కుదరదు. అసలు రేటు కూడా ఫిక్స్డ్(!). ధర నిజానికి మరింత ఎక్కువుండాలిగానీ, ప్రమోషన్ కోసం తగ్గించియిస్తున్నాం, అని చెప్పాలి. అలా ధరను పెంచి తగ్గిస్తే సగటు కస్టమర్లు ఆనందపడతారట. మొదటిరోజు చెప్పారుగా!
ఈమె అవన్నీ పట్టించుకోలేదు. నేను చెప్పిన ధరకు ఒప్పుకుంటుంది. కానీ బౌల్ అదనంగా కావాలి. అలా ఇవ్వకూడదంటే, ‘నన్ను నీ చెల్లెలనుకొని ఇవ్వు,’ అంటుంది. ఎంతకూ తెగకపోవడంతో, ‘సరే నన్ను అన్న అనుకుని సెట్టు ఫ్రీగా తీసుకో,’ అన్నాను. అలా వద్దంటుంది. ఇక వద్దని చెప్పి నేను బ్యాగులో సర్దడం, వాళ్లు ఆపడం… మొత్తానికి నేను లొంగిపోయి, ఒక బౌల్ ‘కంపెనీ విరుద్ధంగా’ ఇచ్చేశాను.
సాయంత్రం తిరిగి అప్పజెప్పేటప్పుడు, ఈ బౌల్ తక్కువ సెట్టును మేనేజర్ స్వీకరించలేదు. సెట్టు ఖరీదు నా ఖాతాలో పడిపోయింది. అది మొదటిరోజే స్పష్టంగా చెప్పారుగదా! ‘యే డిక్ మార్‌నేసే బచానా చాహతా హై…’  అని నన్ను ఊరడించారు, జరిగింది విన్నవాళ్లు. ఏమీ అమ్మకుండా రావడం డిక్!
ఒకట్రెండిళ్లల్లో సెట్టు కొనడమే కాకుండా, టీ కూడా ఆఫర్ చేశారు. ఇక ఇప్పుడు చెప్పబోయేవాళ్లింట్లోనైతే టీకి ముందు స్నాక్స్ కూడా ఇచ్చారు. ఈ స్నాక్స్ ఘట్టంలోకి రాకముందు, నేను డెమో ఇస్తూ, బౌల్స్ కిందపడ్డా ఏమీ పగలవని, ఒకదాన్ని చేతుల్లోంచి జారవిడిచాను. ఇలా చేయగానే, కొందరు మళ్లీ మళ్లీ ఎత్తి పడేయమనేవారు. నా చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందేమోనన్నట్టుగా ఇంకొందరు నమ్మకపోయేవారు. హిందీలో డెమో నేర్పారు కాబట్టి, ఆ ఫ్లో తెలుగులో రాకపోయేది. అలా చెబుతూ ‘మైక్రోన్ మే భీ యూజ్ కర్‌సక్‌తే హై,’ అన్నాను. ‘నిజంగా పెట్టొచ్చా?’ అన్నాడాయన. అదేమిటో కూడా నాకు తెలియదు. పాఠం అప్పజెప్పానంతే! కానీ ఇప్పుడు వెనకడుగు వేయడం ఎలా? మొండిధైర్యంతో పెట్టొచ్చన్నాను. ‘నేను సెట్ కొంటాను, కానీ టెస్ట్ చేస్తా’ అన్నాడాయన. మైక్రోన్ మైక్రోన్ అనేస్తున్నానుగానీ మైక్రో ఓవెన్ అనేదాన్ని అప్పుడు చూశాను. ఓహో అయితే దీన్ని ఇలా వాడతారా! ఇది ఫ్రిజ్ కాదన్నమాట! కొంపదీసి వేడికి కరిగిపోతే! నా అదృష్టంకొద్దీ దానికి ఏమీ కాలేదు. మరీ మొదటిసారికే ఏమీ కాదేమో!
మధ్యాహ్నానికే వచ్చి కొందరు రెండో రౌండు సెట్లు తీసుకెళ్లేవాళ్లు. ఏమీ అమ్మక కొందరు డిక్ కొట్టేవాళ్లు; కానీ వాళ్లు ధైర్యంగా ఉన్నట్టే అనిపించేది. ఎంతటివాడైనా ఏదో ఒకరోజు డిక్ కొట్టడం మామూలే! అంతెందుకు సాక్షాత్తూ బి.డి. కూడా కొట్టొచ్చు! ఇలా అని నాకు ధైర్యం చెప్పింది మరో సీనియర్ కిరణ్. ఈయనది మహారాష్ట్ర. కెమికల్ ఇంజినీరింగ్ చేశానన్నాడు. గర్ల్ ఫ్రెండ్స్‌ని ‘కపడా జైసా బద్‌లా థా,’ అని చెప్తుంటే నేను నోరు తెరుచుకుని విన్నాను.
ఒకరోజుకు ఎలాగైనా ఇరవై రూపాయలు సంపాదించడం నా కనీస లక్ష్యం. రాత్రి పడుకోవడానికి కంపెనీకి రోజూ ఐదు రూపాయలు ఇవ్వాలి. ఏడ్రూపాయలు రాత్రి భోజనానికి. మిగిలిన ఎనిమిదిలో, ఉంటేగింటే, పొద్దున మధ్యాహ్నం దానికనుగుణంగా తినాలి. నేను ఆమ్లెట్ ఏరోజూ వేయించుకోలేదు. ఆలూ సమోసాను బన్నుతో తింటే ఒక మధ్యాహ్నపు భోజనం చెల్లిపోతుందని తెలుసుకోగలిగాను.
ఇక, పదకొండవ రోజు రానేవచ్చింది. అలా పొద్దున తీసుకెళ్లిన ఆరు సెట్లు సాయంత్రానికల్లా అమ్ముడైనాయి. బహుశా నేను ప్రయోజకుణ్నయ్యాను. అబ్బా ఇది నేను చేయగలను! డన్! దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దర్జాగా సిగరెట్ అంటించాను. తాగేసి, పర్సులో నోట్లను పద్ధతిగా సర్దుకొని, ప్యాంటు వెనకజేబులో పెట్టుకున్నాను. గాల్లో బయల్దేరాను. మూడో నంబరు బస్సు కాచిగూడ దగ్గర రైట్ టర్న్ అవుతుంటే, రన్నింగ్‌లో దూకేశాను. ముందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి, నిజానికి ఇదే వేగంతో ఆఫీసులో వాలాలనుంది, ఎదురవ్వబోయే అభినందనలకోసం. వాటిని ఊహించుకుంటూ అప్రయత్నంగా పర్సు మీద చేయివేశాను. శూన్యం తగిలేసరికి నా మెదడు మొద్దుబారింది. పిచ్చివాడిలా బస్సు వెంబడి పరుగెత్తాను. పరుగెత్తాను, పరుగెత్తాను. నేను ఫుట్‌బోర్డు వెనక సీట్లో కూర్చున్నాను. ఇంకా జేబులోంచి పడిపోయివుంటుందనే నమ్మాను. బస్సును పట్టుకోగలిగితే ఎవరి కాళ్లదగ్గరైనా పడిపోయివుంటుంది, తీసేసుకోవచ్చు. కానీ బస్సేదీ?
ఇక అందదూ అని నిశ్చయానికి వచ్చాక, నడుము కూలబడుతుంటే, ఎగపోస్తు అలుపు తీర్చుకుంటుండంగా, ‘ఏమైంది?’ అన్నాడు ఒకాయన.
‘‘ప.ర్సు.. బస్సులో ప..డిపోయింది. ‘‘
‘‘పర్సు పడిపోతదా… కొట్టేశుంటరు,’’ అన్నాడు. ‘‘చూసుకోవాలె పక్కన ఎవ్వలున్నరో…’’
నేను ఎన్నో చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతాను, మథనపడతాను; కానీ దాదాపుగా ఏడవను. అదే సినిమా చూస్తూ మాత్రం ఏడుస్తాను. ఆరోజు అది అటు ఏడుపూగాదూ, ఇటు బాధాగాదూ; వేరే స్థితేదో! తగు కారణం ఉన్నట్టుగా ఏడవడానికి సిద్ధపడిన నన్ను- ఏడవకుండా ఇంకేదో ఆపింది.
గుండ్రటి పార్కును చుట్టుకుంటూ తిరిగి వస్తుంటే, ఒక భిక్షగాడు కనబడ్డాడు. జేబులో తడిమితే పావలా తగిలింది. నిజంగా ఆ పావలాను నేను ధర్మం కోసం వేయలేదు. ఇన్ని రూపాయలు పోయినప్పుడు ఈ పావలా మాత్రం నా జేబులో ఉండటం ఎందుకు అన్న ఒక విరక్తి మాత్రమే దానికి కారణం!

ముగింపు:
సెట్లు అమ్మిన మొత్తం డబ్బులు కట్టాల్సిందేనన్నారు మేనేజర్. ఇది నవ్వులాటకు అంటున్నారనుకున్నాను, కానీ నిజంగానే కట్టమన్నారు. అప్పటికే, ‘ఈ చిప్పలు అమ్ముడు ఏం పనిరా!’ అని మా అమ్మ మా మామయ్య దగ్గర కన్నీళ్లు పెట్టకుందని తెలిసింది. ‘మా రాజు ఈ పనిచేస్తున్నడని తెలిసినప్పట్నుంచీ సేల్స్‌మెన్లను కొంచెం ఆదరంతో చూస్తున్నాంగానీ ఎప్పుడూ గౌరవించలేదు,’ అని సలీమ్‌వాళ్లు అన్నారు. మా శివిగాడు, నిజానికి వాడు ఇలాంటి వ్యవహారాల్లో నాకంటేయాక్టివ్- వాడే ‘ఇది మనకు సెట్‌గాదురా,’ అన్నాడు.
అందుకే, పోయిన డిగ్రీ సబ్జెక్టుల్ని మళ్లీ గట్టిగా చదవడమే మేలని నిర్ణయించుకుని, సిద్దిపేట బయల్దేరడానికి సిద్ధమయ్యాను. నా పదకొండు రోజుల మార్కెటింగ్ అలా ముగిసిపోయింది.

(ప్రచురణ: కినిగె పత్రిక; డిసెంబర్ 10, 2014)

Wednesday, February 11, 2015

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ

సాక్షి ఫన్‌డే లో వారం వారం “రియాలిటీ చెక్” పేరన పూడూరి రాజిరెడ్డి రాసిన ఫీచర్‌ ఇప్పుడు పుస్తక రూపంలో విడుదలైంది. ఇది తెలుగులో కొత్త ప్రయోగం. రచయిత ఒక ఆవరణకి వెళ్తాడు, అక్కడి గుణాల్నీ వ్యక్తుల స్వభావాల్నీ క్లుప్తంగా రెండు పేజీల్లో చెప్తాడు. అక్కడి వాస్తవికతను వాక్యంలో పట్టుకుని అది మన అభిప్రాయ చిత్రాలతో సరిపోతోందో లేదో చూసుకొమ్మని మన ముందుంచుతాడు. మొద్దుబారని రాజిరెడ్డి చూపు, అతని సెల్ఫ్ కాన్షస్ నిజాయితీ, ప్రపంచం పట్ల కొత్త పెళ్ళికొడుకు ప్రేమ ఈ ఫీచర్ని వట్టి ఫీచర్‌గా మిగిలిపోనీయలేదు. “రాజిరెడ్డి వాక్యం” అనగానే ఏదో మనకు స్ఫురించేట్టుగా స్థిరపడిన అతని శైలి కూడా తోడైంది. ఉబుసుపోని వేళల్లో ఉన్నచోట నుంచే “కొన్ని కిటికీ ప్రయాణాలు” చేసి రాటానికి ఈ పుస్తకం బాగుంటుంది. “తెనాలి ప్రచురణలు” అందంగా ముద్రించిన ఈ పుస్తకం గత నెల (జనవరి) ఐదో తారీకున తెనాలిలో విడుదలైంది. ఈ సందర్భంగా రాజిరెడ్డితో బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ. 
– మెహెర్
(ప్రచురణ: కినిగె పత్రిక; ఫిబ్రవరి 19, 2014)

పూర్తి పాఠం కింది లింకులో...  
http://patrika.kinige.com/?p=1679

Monday, February 9, 2015

శృంగారం

మాట – ధర్మం, అంటుంది.
దేహం – మర్మం, వింటుంది.
అనువుకానప్పుడు, కఠినశిలను ఒరిసిన నొప్పి.
మనసైనప్పుడు, నీటిమడుగున ఈదిన హాయి.
భావం మీద భౌతిక విజయం!
భౌతికం మీద భావ విజయం!!

Saturday, February 7, 2015

దృశ్యం - భావం

రోడ్డు మీద మనకు తారసపడే ప్రమాద దృశ్యంలో – మనం పాలుపంచుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎప్పుడోగానీ రాదు. అక్కడెందుకో జనం గుమిగూడారని కుతూహలపడేలోపే, బాధితుడిని ఎవరో బండ్లో ఎక్కిస్తూవుండొచ్చు; అప్పటికే చెదిరిపోతున్న గుంపులోంచి, ‘ఎవరో బండిమీదికేలి వడ్డరు,’ అని వినాల్సి రావొచ్చు; అయితే, అలాంటి దాటిపోయే ప్రయాణికుడిగా ఉండలేని సందర్భం నాకోసారి ఎదురైంది. మా మధును కలవడానికి నేను హుడా కాలనీకి వెళ్తున్నాను. గంగారం దాటుతుండగా – ఉన్నట్టుండి నేను ప్రయాణిస్తున్న వాహనం సడెన్‌బ్రేక్‌తో ఆగిపోయింది; ‘అయ్యయ్యో’ ‘యాక్సిడెంట్’ లాంటి మాటలు దొర్లిపోతున్నాయి; ఒక్కసారిగా జనం మూగిపోయారు.
పెద్దాయన! పడిపోయివున్నాడు; కాలికి దెబ్బ తగిలింది; రక్తం కారుతోంది; హడావుడి మాటలేవో వినబడుతున్నాయి; ఒకాయనదైతే చాలా పెద్ద నోరు!
ప్రాథమిక కుతూహలం తీరిపోయాక, ఆయన చుట్టూ ఉన్న వలయంలోంచి ఒక్కొక్కరే వెనక్కి అడుగులు వేశారు. నేను ఉన్నచోటే ఉండటం వల్ల ముందుకైపోయాను.
సరే, ఇక చిత్తాన్ని స్థిరం చేసుకున్నాను. ఈయన బరువు ఇవ్వాళ నామీదే వేసుకుందాం!
ఆటోలోకి ఎక్కించడానికి ఇద్దరు ముగ్గురు సాయం పట్టారు. ఆటోలోకి నేను ఎక్కుతుండగా, పెద్దనోరాయన – “తమ్ముడూ, నీకేమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు ఫోన్ చెయ్,” అన్నాడు.
నేను నోటితో బదులివ్వకుండా, సరేనన్నట్టుగా తలూపాను.
మరీ పెద్ద ప్రమాదం ఏమీకాదు. పెద్దాయన మామూలుగానే ఉన్నాడు. ఆసుపత్రి ఫలానా చోట ఉందని డ్రైవర్‌ను ఆయనే గైడ్ చేశారు. మరీ యాక్సిడెంట్ అయిన మనిషిని ఒంటరిగా పంపడం ఇష్టంలేక వెళ్లడం లాంటిదే నాతోడు!
వెళ్తూ ఉండగా – నా పేరు, ఏం చేస్తావని అడిగారు; మరి ఇటువైపెందుకొచ్చావన్నారు.
రెండు నిమిషాలైన తర్వాత – “ఆ ఫోన్ చేయమన్నాయన ఎవరో నీకు తెలుసా?” అని అడిగారు. తెలీదని చెప్పాను. తల ముందుకూ వెనక్కీ ఆడించి, నెమ్మదిగా కళ్లు మూసుకున్నారు.
హాస్పిటల్‌కు చేరుకున్నాక – పేరు, చిరునామా ఏదో నింపాల్సివచ్చింది. ‘ముందు ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయండమ్మా’ అని ఆయన కోప్పడ్డారు. ‘ఫార్మాలిటీస్ ఉంటాయిగదా సార్’ అని ఓ పిల్ల గొణిగింది. ఈలోగా ఒకావిడ వచ్చి, ఆయన్ని వేరే గదిలోకి నెట్టుకెళ్లింది. ఇది జరుగుతుండగానే ఆయన నాకో నంబరిచ్చి, వాళ్ల రెండో కూతురు దగ్గర్లోనే ఉంటుందట – ఫోన్ చేయమన్నారు; కంగారు పడాల్సిందేమీ లేదని కూడా చెప్పమన్నారు.
పదీ ఇరవైనిమిషాల్లో ఆమె వచ్చింది. వాళ్ల నాన్నను చూసింది. కాసేపటికి కుదుటపడింది. ప్రమాదం జరిగిందన్న ఉద్వేగంలోంచి సాధారణ విషయాలు మాట్లాడుకునే స్థితిలోకి వచ్చారు (‘అక్క పొద్దున ఫోన్ చేసింది…’). ఇంకా నేను అక్కడ ఎందుకు కొనసాగాలో నాకు అర్థంకాని దశలో – “చాలా థాంక్సండీ,” అని ఆమె నాకు బదులు ఇచ్చింది; ఇక మీరు వెళ్తే వెళ్లండి అన్నట్టుగా. ఆయనతో చేయి కలిపి, నేను ఎదుర్కున్న దృశ్యానికి నిండుదనం చేకూర్చానన్న నమ్మకంతో అక్కణ్నుంచి వచ్చేశాను.
* * *
ఇది జరిగి కనీసం పన్నెండేళ్లయినా అయివుంటుంది. నాకు జరిగిన ఒక అనుభవాన్ని తిరిగి చెప్పడానికి కావాల్సిన ఒక నిర్మాణాన్ని పాటించానేగానీ నిజానికి ఇందులో చాలా విషయాలు నాకు ఇప్పుడు గుర్తులేవు. అంటే అసలు యాక్సిడెంట్ ఎలా అయింది… ఈయన్ని ఏదైనా బైక్ ఢీకొట్టిందా? ఆటోనా? ఈయనే రోడ్డు మీద నడుస్తూ దేనికైనా కంగారుపడి పడిపోయాడా? లేకపోతే తలతిరిగిందా?దెబ్బ సరిగ్గా ఏ భాగానికి తగిలింది? మోకాలి పైకా, కిందికా? ఎడమ కాలా, కుడికాలా? అసలు కాలికేనా?
ఆయన ముఖం గుర్తులేదు. అటు మరీ సన్నగానూ ఇటు మరీ లావుగానూ కాని నడిమిరకం దేహం. సంభాషణలో ఆయన పేరు, చేస్తున్న పని నాకు చెప్పడమైతే చెప్పినట్టుగా గుర్తుందిగానీ చెప్పిందేమిటో గుర్తులేదు. పేరు చివర ‘రావు’ వస్తుందేమోననిపిస్తోంది. బహుశా పూర్ణచంద్రరావు? వాళ్లమ్మాయి కొద్దిగా లావుగా ఉందని లీలగా జ్ఞాపకం. లేతరంగు పంజాబీ డ్రెస్ ధరించినట్టనిపిస్తోంది. ఇంతకీ నేను ఎందులో ప్రయాణిస్తున్నాను? బస్సా, ఆటోనా? ఆటోవైపే జ్ఞాపకం మొగ్గుతోంది.
చిత్రంగా ఆ హడావుడి మనిషి కూడా గుర్తులేడు. కానీ ఈ సంఘటనను తలుచుకున్నప్పుడల్లా ఆయనకు నేను ఒక తెల్లచొక్కా తొడిగి, చేతికి ఒక బంగారు ఉంగరం పెడుతుంటాను. హాస్పిటల్ పేరేమిటో గుర్తులేదు; కానీ చంద్రుడికి సంబంధించిన ఏదో పదం దాని పేరులో కలిసివుందనిపిస్తోంది. రిసెప్షన్ మాత్రం ఎడమవైపున్నట్టుగా గుర్తుంది.
ఇంకా ఆలోచిస్తే – ఫోన్ చేయమన్నప్పుడు ఆయన నాకు నంబర్ నోటితో చెప్పాడా? లేక, జేబులోంచి నోట్‌బుక్ తీసిచ్చి, ఇదీ నంబరని వేలితో చూపించాడా? అక్కడే ఏదైనా డైలీ పేపర్ ముక్క చింపి అందులో రాసిచ్చాడా?
అంటే… ఒక స్క్రీన్‌ప్లేకు అవసరమైన సూక్ష్మవివరాలు గుర్తులేవు. నేను ఆ దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు నాకు ఇవన్నీ గుర్తుండేవుంటాయి. కానీ ఇప్పుడు నేను ఆ దృశ్యాన్ని దాటిపోయి కేవలం ఒక భావంగా మాత్రమే మిగిలిపోయాను.
* * *
నాకున్న అలవాటుకొద్దీ దీన్నంతటినీ సమ్ అప్ చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సంఘటన అంతటినీ ఒక దృశ్యంగానూ, సంఘటన అనంతర స్థితిని భావంగానూ రాస్తున్నానిక్కడ.
దృశ్యం బలమైనదంటారుగానీ, అది పూర్తి నిజం కాదని తెలిసిపోతూనేవుంది; అలాగని అది పూర్తి బలహీనమైనదీ కాదు; కాబట్టే, ఛాయామాత్రంగానైనా నాలో మిగిలేవుంది. అయితే, నాలో మిగిలిపోయింది నిజమైన దృశ్యమేనా? అంటే, వాళ్లకు నేను ఏ రూపు అద్దానో అది నిజంగా నిజం మీదే ఆధారపడినదా? లేక, నా జ్ఞాపకంలో కరిగిపోయాక మిగిలిన దానికి, నాదైన పదార్థాన్నిచ్చి నిలబెట్టానా?
మరి, ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ, ఆ దృశ్యం నాకు జ్ఞాపకంగా ఎలా మారగలిగింది? దృశ్యాన్ని మించినదేదో దాన్ని నాలో నిలిపివుంచడానికి కారణమైందని నమ్ముతున్నాను. అందుకే నేననుకోవడం, ఒక్కోసారి దృశ్యం (వాస్తవం) అప్రస్తుతమైపోయి, భావం మాత్రమే ప్రస్తుతమవుతుందేమో!
దీన్ని ఇంకా కొనసాగిస్తే, మన జీవితంలో కూడా మన హోదా, ఆస్తి… ఇవన్నీ మరుగునపడిపోయి, చిట్టచివరికి మనం ఏ భావం దగ్గర తేలుతామన్నదే ముఖ్యమైపోతుందేమో! ఇదే చిట్టచివరకు ప్రధానమవుతుందని ‘తెలిసిరావడం’తో, నా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టయింది; ఒకరకమైన శాంతి లభించినట్టయింది.

(ప్రచురణ: కినిగె పత్రిక; నవంబర్ 5, 2014)

Thursday, February 5, 2015

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.
కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!
మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలు ‘కథాసమయం’ మిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. ఈ పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!
*
నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలు’ మీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసిన ‘తామందరినీ’ నిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన ఆ మాటలు ఎక్కడ ఆగాయంటే… సీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!
వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలే’ అని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాం… నేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!
 వాళ్లు లేవనెత్తినట్టుగా ఈ రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?
అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?
(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ ఆ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ ఈ బాధే ఉందేమో! )
ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.
వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, ఈ నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్‌ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్‌బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.
మొదటే చెప్పాల్సిన డిస్‌క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.
ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!
సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్‌లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాం… ఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లో ‘వచ్చాండా’, ‘పోతాండా’ లాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాస’ అని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే ఏ యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, ఆ దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.
*
నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్‌కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆ ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నా’కు బదులుగా ‘వస్తున్నా’ అని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!
ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలో ‘అచ్చిన’ అనరు; ‘వచ్చిన’ అనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; ఆ కులంవాళ్లు, ఈ కులంవాళ్లు; ఆ జిల్లావాళ్లు, ఈ జిల్లావాళ్లు; హైదరాబాద్‌తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.
నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్‌తో ‘ఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్‌తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనే’ అని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినా ‘ఏమే, ఏందే’ అనలేదు. ఏ కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!
అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్‌ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడా ‘రాజిరెడ్డి గారు’ అనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్‌ను వయసుతో నిమిత్తం లేకుండా ‘ఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఈ చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!
అవతలివారిని బట్టి, నా నాలుక ‘వచ్చిండ్రా’ అనేది ‘వచ్చారా’ అనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడా ‘నా గొడ’వే అన్నాడుగానీ ‘నా లొల్లి’ అనలేదు.
నా భార్య మొన్నోసారి మావాణ్ని ‘పోయిన’ బదులుగా ‘వెళ్లాను’ అనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి ఈ తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్‌తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. ఈ స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్‌టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.
నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటం… తన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఏ భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చిన ‘పాత్రోచిత సందర్భం’ అయితే తప్ప… లేదంటే ఈ ఆర్టికల్‌లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. ఆ పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!
*
మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘ఎ’ అని రాయబోయి, ‘టి’తో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారు’ పోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపును ‘రాంరెడ్డీ’ అని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ఓ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ఓ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!
ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా ఈ రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?
నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్‌రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్‌హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, ఏ నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?
నాకు కొంతకాలం ‘ఆనిగెపుకా’యే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికి ‘వాళ్ల’దయిపోతుంది.
ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఈ ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.
 మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?
నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. ఆ విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చిన ‘ఇండస్ పబ్లిక్ స్కూల్’ ముందుభాగంలో ‘జీపీఏ 10/10′ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. ఏ తల్లో ఆ పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజం’ ఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ఆ ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే ఆ వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. ఆ విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!
(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)
(ప్రచురణ: సారంగ సాహిత్య వారపత్రిక, నవంబర్ 19, 2014)

Tuesday, February 3, 2015

కథంటే ఏమిటి? అను ఒక తప్పుదోవ పట్టించే శీర్షిక

కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!

మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.

(వయా కావలి వెళ్లిన) ప్రకాశం జిల్లా రామాయపట్నంలో (2014 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో) జరిగిన ‘కడలి అంచున కథ’ సమావేశం కోసం కథకుడు ఖదీర్ బాబు కథంటే ఏమిటో నన్ను మాట్లాడమన్నారు.
కథా?
నేనా?
కథల్ని మొన్నమొన్నటిదాకా నేను సీరియస్గా పట్టించుకోనే లేదు. అయినా, కథంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించాలి? ఒకవేళ నిర్వచించినా, అదంతా ‘ముసలి డొక్కుల’ వ్యవహారం కదా!
ఇలా జరిగిన ఫోన్ సంభాషణనే మరింత విడమరిచి చెప్పొచ్చుగదా, అన్నారాయన.
నా స్వభావం ఏమిటంటే, ముందుగా ఒకటి అనూహ్యమైనది ఎదురవగానే చాలా కచ్చితంగా నిరాకరించినట్టే కనబడతాను (ఈలోపు నేను నిజంగా నిరాకరించినట్టేనని ఎదుటివాళ్లు నిర్ధారించుకుంటే నేను చేసేదేమీ లేదు). కానీ దానితో రిలేట్ చేసుకోగలిగేదేదో నాలో ఉంటేగనక, నాకు తెలియకుండానే నాలోపల ఏదో ఫామ్ అవుతూవుంటుంది. దాంతో, ‘ఫర్లేదు, కొంత కమాండ్ వచ్చింది, మేనేజ్ చేయొచ్చు’ అన్న ధైర్యం కలుగుతుంది.

అయితే, కథ అంటే ఏమిటనే పజిల్ను పూరించే శక్తి నాకులేదుగానీ, తమాషాకైనా నాలుగు మాటలు చెప్దామనుకున్నాను; ఊరికే నా కోటా పూర్తిచేసుకోవడం కోసం. కానీ తీరా అక్కడికి వెళ్లాక- ‘మీడియా-కథకులు’ అంశం చుట్టూ మాట్లాడవలసి వచ్చింది. అయితే, అది ఇంటెరాక్టివ్ సెషన్ లాంటిదే కాబట్టి, ముందుగా ప్రిపేర్ కాకపోయినా కొంతమేరకు చెల్లిపోయింది.
ఈ మాట్లాడటానికి ముందు నేను సిద్ధం చేసుకున్న చిత్తుప్రతినే ‘ఇక్కడ’ మరింత క్రమంలోకీ, మరింత వివరంగా రాతలోకి తెచ్చాను. కచ్చితమైన క్లైమాక్స్ వాక్యం మాత్రం ఇప్పుడే చెప్పేస్తున్నా. కథంటే ఏమిటో నాకు తెలియదు. కథ అంటే ఏమిటో నేను మాట్లాడబోవడం లేదు. కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం కొంతమేరకు కథ గురించే; ఇంకా చెప్పాలంటే సాహిత్యం ఏమిటో, నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో ఏ కొంతైనా చెప్పడం! ఏమో, ఇది కూడా నేను మాట్లాడతానన్న కచ్చితమైన హామీ ఏమీ ఇవ్వను.

నాకు చదవడం ఎలా అలవాటైందో గుర్తులేదుగానీ, రాయడం ఎలా ప్రారంభమైందో జ్ఞాపకముంది.
అప్పటికి నా ఇంటర్ ఫస్టియర్ ఐపోయింది. ఆన్వల్ ఎగ్జామ్స్ రాశాక, సెలవులకి ఊరెళ్లాను.
ఆ ఎండాకాలం ఓ ఉదయాన మా అమ్మా నేనూ తమ్ముడూ చెల్లీ నలుగురం కలిసి పొలానికి వెళ్లాం, ఉల్లిమడులకు సిద్ధం చేయడానికి. అమ్మా చెల్లీ కొంకల్తో తవ్వుతున్నారు; నేను నలిని చిన్న చిన్న కుప్పలేస్తున్నాను; వాటిని ‘ఎదురుకొని’ తమ్ముడు మడి అవతల పారేసి వస్తున్నాడు.
మేమెప్పుడు పనిచేసినా మా చెల్లీ తమ్ముడూ ఏం చేస్తారంటే, నన్ను ఏదైనా ‘స్టోరీ’ చెప్పమంటారు. సాధారణంగా నేనప్పటికి కొత్తగా చూసివున్న సినిమా కథను వాళ్లకు చెప్తానన్నమాట! “ఫస్టు ఫస్టు ఇట్ల పేర్లు వడుతయ్… పడంగనే ఏమైతదంటే…” ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా వదలకుండా అలా చెప్పుకుంటూ పోతాను. ఇంక అందులో ఏవేవో ముచ్చట్లు వస్తూవుంటాయి. అలా మా తమ్ముడు ఏదో ‘మాటమీదికేలి మాట’గా, “మా స్కూల్లో ఓ అన్న ఉన్నడూ, ఆయినె సొంతంగ పాట రాసిండన్నా” అని గొప్పగా చెప్పాడు. ఆ అన్న గురించి ఈ అన్నతో చెప్పడం!

తమ్ముడు అప్పుడు ‘నవోదయా’లో చదువుతున్నాడు. వాడు నాకంటే ఐదేళ్లు చిన్న. వాడు చెబుతున్న ఈ కొత్త అన్న నాకన్నా రెండు మూడేళ్ల చిన్నవాడు! అంటే, నాకంటే రెండుమూడేళ్ల చిన్నవాడు ఏదో రాయగలడంటే నేను కూడా రాయొచ్చన్నమాట! అంటే, మా తమ్ముడు అతడు రాయడం గురించి గొప్పగా చెప్పాడంటే, ఆ గొప్ప పొందడం నాగ్గూడా సాధ్యమేనన్నమాట! ఇంత స్పష్టంగా కాకపోయినా, రాయడం అనే ఒక ప్రక్రియలోకి నేను కూడా పోవచ్చు, పోగలను, లేదా పోవడానికి ఆలోచించవచ్చు, ఇంకా చెప్పాలంటే, అది కూడా నాలాంటివాళ్లే చేస్తారు, ఇలాంటి భావనేదో నాలో కలిగింది.
ఇక ఎండ ముదిరేలోపు పని ముగించుకుని మధ్యాహ్నంకల్లా మేము ఇంటికి వచ్చాక-
పాత నోట్సుల్లో మిగిలిపోయిన తెల్లకాగితాల్లో ఒకటేదో రాయడం మొదలుపెట్టాను.
అది ఒక జానపద నవల!
ఒక రాజు. అభిషిక్తవర్మ. మంచివాడు. రాణి. సుధేష్ణాదేవి. ఈవిడా మంచి ఇల్లాలే! కానీ వీళ్లకు సంతానం లేదు. మామూలుగా కథల్లోని ఏ రాజుకైనా పిల్లలుండరుగదా!
రాజులాగే మంచివాడైన మంత్రి. ఆయనకూ పిల్లల్లేరు. ఇది నా జోడింపు.
ఎప్పటికైనా రాజద్రోహం చేయడానికి కాచుకునివున్న సేనాధిపతి. ఇతడు స్వయానా రాణికి తమ్ముడు.
ఎక్కడో ప్రపంచాన్ని జయించాలని వందమంది రాకుమారులను బలి ఇచ్చే లక్ష్యం మీదున్న మాంత్రికుడు. డిభాసురుడు. వాడి ప్రాణం మరెక్కడో చిలకలో ఉంటుంది. ఆ చిలకను చంపాలంటే మణి తేవాలి. ఆ మణి ఒక నాగసర్పం తలమీద ఉంటుంది.
మెల్లిగా పిల్లలు- హీరోలు- ప్రతాపుడు, రాజశేఖరుడు… వాళ్లిద్దరూ కవలలు. కానీ విడిగా పెరుగుతారు. రాజశేఖరుడు… నాపేరుకే కొంత జోడించాను.
వీళ్లకు జంటగా రాకుమార్తెలు- పల్లవి, ప్రియంవద… అప్పటికి నేనెరిగిన అందమైన అమ్మాయిల పేర్లు.
మెల్లిగా లింకులు కలుపుకుంటూ వెళ్లాను. కలవనిచోట అక్కడ కథకే కొంత ఫ్లాష్ బ్యాక్ చేర్చి, ‘లాజిక్’ మిస్సవ్వకుండా చూశాను.
రాస్తూవుండగానే ‘రాకుమారుడు- విచిత్రమణి’ అని టైటిల్ పెట్టేశాను. ఇద్దరు రాకుమారులు ఉండికూడా ఒక రాకుమారుడే టైటిల్లోకి రావడానికి కూడా రీజనింగ్ ఇచ్చాను.
ఏడెనిమిది నోటు పుస్తకాల్లోంచి దీన్నంతా మళ్లీ సరికొత్త నోటుబుక్కులో ఫెయిర్ చేసి, దానికి తెల్లపుట్ట వేసి, ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమా డిజైన్లో అక్షరాలు రాసుకున్నాను.
నా అధ్వాన్నపు చేతిరాతలో మొత్తం 192 పేజీలు!

రాయడం అయిపోయింది కాబట్టి, దీన్ని కచ్చితంగా ఎవరికైనా అంకితం ఇవ్వాలి! పుస్తకం అంటూ రాశాక అంకితం చేయాలిగదా! కానీ ఏం చేస్తే అంకితం ఇచ్చినట్టు అవుతుంది? దానికేదైనా కార్యం చేస్తారా? ఏం చేయాలో తెలియదు కాబట్టీ, ఎవరిని అడగాలో అసలే తెలియదు కాబట్టీ, ‘నాకు జన్మనిచ్చిన పూజనీయ తల్లిదండ్రులు పూడూరి రాంరెడ్డి, లక్ష్మి…. దీన్ని అంకితం ఇస్తున్నాను’ అని ముందే ప్లాన్డ్గా వదిలేసిన మొట్టమొదటి తెల్లకాగితంలో బాక్సు కట్టి, చుట్టూ రెడ్ పెన్తో గీత కొట్టి మరీ రాశాను.

తర్వాత కొన్ని రోజులు గడిచాక-
నా మనసు అప్పుడు ఎక్కువగా వింటూండే ‘ఆకాశవాణి’ మీదకు మళ్లింది. దాంతో గేయాలు అల్లడం మొదలుపెట్టాను. ‘భారతమాతకు వందనం’, ‘మనమంతా ఒక్కటే’, ‘కులం లేని మతం లేని సమాజం కోసం’ తరహా.
ఒకసారి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి నా గేయం కూడా పంపించి, ‘ఇవ్వాళ పాడుతారేమో’, ‘రేపైనా పాడుతారేమో’నని ఎదురుచూశాను. కానీ పాడలేదు.

అయినా నిరాశ చెందక, నా కలం కొత్త పుంథలో కదంతొక్కింది. సినిమా పాటలు రాయాలన్న గట్టి సంకల్పం కలిగింది.
అయితే దీనికి ముందుగా నా పేరుకు సంబంధించిన చిక్కు ఒకటి వచ్చింది. ‘రాజిరెడ్డి’ అనే పేరు రాహుల్ లాగా అందంగా లేదు. ఉత్త పల్లెటూరి పేరు. నా పేరు కనీసం అరుణ్ అయివుంటే బాగుండేదేమో! కిరణ్ అయినా చెల్లిపోయేదేమో! అందుకని, ‘శ్రీ’లు తగిలించుకోవడం చూస్తూవస్తున్నాను కాబట్టి, నాపేరు ‘రాజుశ్రీ’గా మార్చుకున్నాను. బయటివాళ్లకు నేను రాజిరెడ్డి అయినా, ఇంట్లోవాళ్లకూ, మా చుట్టాలకూ నేను మామూలు రాజునే!
రాజుశ్రీ పేరుతో ఇక ‘రాతిరంతా జాతరే’! దినుసు పులుసు వయసు సొగసుల్లాంటివి మేళవించి పదులకొద్దీ పాటలు రాశాను. ‘ఫస్టునైటు కొచ్చింది భామ/ దీని లెఫ్టు రైటు వాయించుకోనా’ అని ట్యూన్లు కట్టుకుని పాడుకున్నాను.

ఒకవైపు లలితకవిగా, సినీకవిగా రాణిస్తూనే… మరోవైపు రచయితనవడానికి కృషి చేయడం మొదలుపెట్టాను. దానికోసం ముందుగా కొన్ని కథానికలు రాయాల్సివుంది! ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి రాశానని కాదుగానీ, ఆర్డర్ కోసం ఒకదాని వెంట ఒకటి చెప్పడమే! నిజానికి నా రచనావ్యాసంగం అన్నివైపుల నుంచీ సాగింది.
‘ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగగానే బద్దకంగా లేచాడు సూర్య’ తరహా ప్రారంభం… అత్తను వేధిస్తున్న కోడలు చివరికి పశ్చాత్తాపపడటం… సంతానం లేని తల్లిదండ్రులు అనాథబాలుణ్ని దత్తత చేసుకోవడం… కచ్చితమైన పరిష్కారాల్ని కథల్లో చూపించేవాణ్ని.
ఒక గల్పిక- పేరు గుర్తులేదు- ‘వార్త’కు పంపి- నేను పోస్టులో పంపిన మొదటి, ఇప్పటికి ఏకైక రచన అదే- పంపిన తరువాయి వారంనుంచీ పడిందేమోనని చూడ్డం! ఒకట్రెండు వారాలు చూశాక చూడటం మానేశాను.
ఇదంతా సాగుతుండగానే నవలల మీద కూడా దృష్టి సారించాను. అయితే ఇవి ముందు రాసిన చందమామ నవలలు కాదు. ఇన్ స్పెక్టర్ సంగ్రామ్, డాక్టర్ వైద్య, ఇంజినీర్ ఇంకెవరో… ఇలాంటి పాత్రలుంటాయి. వాళ్లు దేశం మొత్తాన్నీ రక్షించే పెద్ద సాహసం చేస్తారు. అప్పుడు నడుస్తున్న ఇంగ్లీష్ సినిమా పేరు చూసి (సినిమా చూసి కాదు, సినిమా పేరు చూసే) ఆ నవలకు ‘టాప్ క్రిమినల్స్’ అని పేరు పెట్టాను, విలన్ల కోణంలో!
‘రాజిరెడ్డి’ అని నా పేరే పెట్టుకుని ఒక చారిత్రక నవల ప్లాన్ చేశాను.
‘లింబు’ పేరుతో ఒక కామెడీ సీరియల్ మొదలుపెట్టాను.
‘శూర్పణఖ’ టైటిల్తో ఒక మర్డర్ మిస్టరీ కూడా! రచయిత అంటే అన్ని రకాలూ రాయాలిగదా!
‘తిరగరాయదా చరిత/ తిరుగులేని ఈ చిరుత’ అని ప్రతి నోటుబుక్కుమీదా క్యాప్షన్ ఉండాల్సిందే!

మా బాపు కంటబడకుండా చేసే ఈ పనుల్లో ఒకసారి పెద్దపీట మీద వదిలేసిన కాగితాల్తో దొరికిపోయాను. ‘రాజిరెడ్డి’ అన్న టైటిల్ ఏ4 సైజు ప్రాక్టికల్ నోటుబుక్కులో పెద్ద అక్షరాల్తో ఉంది.
“నీమీద నువ్వు రాసుకునుడు ఏం గొప్పరా?” అన్నాడు బాపు.
మా బాపు ఎప్పుడూ నన్ను ఓర్వడని అనుకునేవాణ్ని. ఎందుకంటే ఆయనకు నేను ట్రాక్ తప్పుతానన్న భయం ఏమైనా ఉండిందో నాకు తెలియదు.
బాపు వీలైనప్పుడు ‘స్వాధ్యాయ’లో పాల్గొనేవాడు. అక్కడ సాయంకాలాలు ‘రాధేశ్యామ్ రాధేశ్యామ్’ అంటూ భజనలు జరిగేవి. ఆ భక్తి సమావేశాల్ని నేను ఎప్పుడూ పట్టించుకోకపోయినా, ‘అరే, నేనేదైనా పాటరాసి అక్కడ పాడితే బాగుంటుందిగదా’ అనిపించింది. బృందంలో పాడాలని నిర్ణయించుకున్నానంటే, దానికోసం నేను ఎంత ధైర్యం తెచ్చుకుని ఉంటానో మీరు ఊహించుకోవాల్సిందే!
‘రాధామాధవ కథనము రసమయము నవరసమయము/ శుచిమయమూ బహురుచిమయమూ’ నాకు నేనే ట్యూన్ కట్టుకున్న పాట పాడటం మొదలుపెట్టాను. నా అమాయక భక్తులు- ఇందులో ఎక్కువమంది నాకు ఏదో ఒక వరస అయేవాళ్లే- నన్ను అనుసరించారు. కానీ బాపు దాన్ని మధ్యలోనే ఆపించేశాడు. ‘అధికారిక’ పుస్తకంలోనివి కాకుండా మరొక్కటి చదవడానికి వీల్లేదన్నాడు. నేను నొచ్చుకున్నాను. మళ్లీ భజనల జోలికి వెళ్లలేదు.

ఇదంతా కూడా నా డిగ్రీ పూర్తవకముందే జరుగుతోంది.
‘టాప్ క్రిమినల్స్’ నవల్లోని ఒక సన్నివేశంలో, విలన్ ‘పీటర్ స్కాట్’ దర్జాగా తాగుతున్నాడన్న అర్థం వచ్చే ఒక వాక్యం రాశాను. ఈ పీటర్ స్కాట్ ఎక్కడో చదివినదాన్లోంచి ఎత్తుకొచ్చింది!
అది రాసిన తర్వాత నాకు నేను ఆలోచనలో పడ్డాను.
ఏం రాశాను నేను? ఈ పీటర్ స్కాట్ అనేది ఏమిటి? అది విస్కీయా? బ్రాండీయా? దాని రుచి నాకు తెలుసా? దాని ఖరీదు నాకు తెలుసా? అప్పటికి నా ఫస్ట్ బీర్ కూడా రుచిచూసివుండను! నాకు తెలియని దేన్నో నేను ఎందుకు ఇందులోకి తెచ్చి కృతకంగా రాస్తున్నాను?
నా రాయడానికి సంబంధించిన ఒక నిర్ణయాత్మక క్షణం లాంటిదది. అంటే వెలుగేదో రాలేదుగానీ అస్పష్టంగానైనా ఒకటేదో నాలో బలపడటం మొదలైంది.

ఆరోజు నాకింకా గుర్తుంది. మా ఇంటి వెనకాలి జామచెట్టు కింద… ఆ చీకట్లో… ఒక ఆవేశం లాంటిది తన్నుకొచ్చి… నేను రాస్తున్నదంతా చెత్త అన్న కచ్చితమైన ఇంగితం లాంటిదేదో నాలో కలిగాక… ఇక ఆ కాగితాలు దగ్గర ఉంటే నాకు నేనే న్యూనంగా నిలబడతానేమోనని… అన్నింటినీ తీసుకెళ్లి, చించేసి, కుప్పేసి, అగ్గిపుల్లతో అంటించేశాను.
చూస్తుండగా రాజుశ్రీ మంటల్లో కాలిపోయాడు. నాకు మాత్రమే తెలిసిన, ప్రపంచానికి తెలియకపోయినా ఫర్లేని ఆ అక్షరాలు నల్లటి పూవుల్లా ఎగరడం మొదలుపెట్టాయి. నాకు తెలియకుండానే ఒక గర్వం లాంటిదేదో నాలో కలిగింది.
సాహిత్యం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదుగానీ, సాహిత్యం ఏది కాదో మాత్రం అర్థమైంది.
* * *
ఇటీవలే ‘కినిగె పత్రిక’లోనూ, వాళ్ల రెకమెండేషన్ మీద ‘కవన కుతూహలం’ పుస్తకం సంపాదించీ చదివాను. ‘కవిత్వం అంటే ఏమి’టని అడిగిన శ్రీశ్రీకి చెళ్లపిళ్ల కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చాడని తెలిసి, నాకు చెళ్లపిళ్ల మీద కోపం వచ్చింది. ‘కవిత్వం అంటే ఏదికాదో చెప్పడం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పడం కష్టం’ అన్నాడట చెళ్లపిళ్ల.
నేనుగా ఆలోచించిన ఒక విషయాన్ని నాదని చెప్పుకోలేకుండా చేశాడే ఈ మహానుభావుడు! సరేపోనీ… కాకపోతే నేను కూడా చెళ్లపిళ్లలాగే ఆలోచించాను… ఛాఛా… నాలాగే చెళ్లపిళ్ల కూడా ఆలోచించాడు. అంటే నేనూ పెద్దవాణ్నే!
* * *
ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఆ పిల్లతనాన్ని దాటి నేను ఎక్కడికో వెళ్లిపోయానని చెప్పడం కోసమా? రేపెప్పుడో ఇప్పుడు రాస్తున్నదంతా పిల్లతనంగా కనబడితే?
నా ఉద్దేశంలో అది మనిషికి సంబంధించిన ఉత్కృష్ట స్థితే! నువ్వు రాసిన వాక్యాలేవీ నీకు అక్కర్లేనంతగా నీకు నువ్వు నిలబడగలిగిన రోజున… నేననుకోవడం ఆ రచయిత(!) మరింత పూర్ణస్థితి లాంటిదానికి చేరుకున్నట్టు గుర్తు.


(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

(పునఃప్రచురణ: వాకిలి e-సాహిత్య పత్రిక, జూలై 2014)

బుచ్చిబాబు: రసమూర్తి

ఒక రకం మానసిక సంసిద్ధత ఉన్న పాఠకుడికి... బుచ్చిబాబు కథల్ని విశ్లేషించడం తెలియకపోయినా, ‘ఇది నాకు నచ్చుతోంది,’ అని మాత్రం అనిపిస్తుంది. ‘నేను’ అంటూ ఆయన ఆత్మీయంగా భుజం మీద చేయి వేసి, పాఠకుల్ని అలా తనవెంట నడిపించుకుంటూ వెళ్తారు. అలాగని తన గోడు వెళ్లబోసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే మనిషి కాదు. ‘తన వ్యక్తిత్వాన్ని దిగమింగి, అహంని జయించటంలోనే కళాకారుడి పురోగమనం ఉందన్న సూత్రాన్ని నేను స్వీకరిస్తాను’ అంటారు. అలా నమ్మినా, బోధ చేయడంలోకి రచనల్ని దిగజార్చకుండా, తన వ్యక్తిగతమైన విముక్తి మాత్రమే ప్రేరణగా రచనలు చేశారు.

  సౌందర్యం, సత్యం, తత్వం ఆయన సహజగుణాల్లాగా, సాహిత్యం కేవలం ఆయన ధారను స్పష్టపరుచుకునే ప్రక్రియలాగా తోస్తుంది. అందుకే తన ఏకైక నవల ‘చివరకు మిగిలేది’ ముందుమాటలో ఈ మాట అనగలిగారు: ‘చాలాకాలం దగ్గర పరిచయం వల్ల, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం సులభమన్నది నా అనుభవం కాదు’.

 ఆయన వాక్యాలు ఒక్కోసారి అర్థంకాని పెయింటింగ్‌లాగా ఉన్నా, అందులోని అందం కట్టిపడేస్తుంది. ‘ఇంటికప్పు మీద నుండి జారిన వెన్నెల వెలుగు ఆమె నుదుటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది.’ ‘ఆకుల మధ్య కిరణాలు వనదేవత కుట్టుపనిలో సూదులలా వెనక్కీ ముందుకీ కదుల్తున్నాయి.’

 ‘సమాజంలో స్త్రీ, పురుషులు ఎలా బ్రతకాలి? ఏ మార్గం మానసిక చైతన్యాన్నిస్తుంది? సంసారంలో బందితుడైన వ్యక్తికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, అందునుండి జనించిన వికాసం సాధ్యమా?’ లాంటి ప్రశ్నలకు జవాబులేవో ఆయన రచనల్లో అందుతాయి. స్త్రీ, పురుషులమధ్య ఉండీలేని సజీవ ఆకర్షణలు, ‘నిప్పులేని పొగ’లాంటి బంధాలు, మనుషులు పెంచుకోవాల్సిన మనోవైశాల్యం, జీవితంతో సమాధానపడవలసిన తీరు, వీటన్నింటితోపాటుగా, ‘ఆధునిక నాగరకతలో పూర్తిగా లౌకిక విలువలకి లొంగిపోతున్న మానవుడిలో ఎక్కడో అణిగిమణిగి ఉన్న కళాతృష్ణ, అలౌకిక విలువలు వొకానొక సన్నివేశంలో ఉప్పొంగి బయటపడటం ఆయన కథల్లో చూస్తాము’.

 ‘మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా కొనసాగాలంటాను కథానిక,’ అంటారు బుచ్చిబాబు. దానికోసం ఆయన చేసే పరిశోధన, పరిశీలన అసామాన్యం. ‘ఈరకం వైజ్ఞానిక విషయాల సమీకరణ, పాండిత్యం నవలకి అవసరం కాని, కథానికకి అక్కర్లేదు. ‘ఈయన హడావుడి చేస్తున్నాడు’ అనుకోవచ్చు కొందరు. అక్కర్లేదు, నిజమే. నేను తెలుసుకున్న వాటిలో ఒకటి రెండు తప్ప ఈ కథలో వాడనేలేదు. ఏమీ తెలుసుకోకుండా వ్యాధితో బాధపడినవారిని చూస్తే సరిపోవచ్చు. కానీ నాకట్లాగనిపించదు. ఆ వ్యాధి భోగట్టా అంతా తెలుసుకున్నాక మనస్సులో వస్తువుకి అనువైన మానసిక స్థితి ఏర్పడుతుంది,’ అని చెబుతారు.
 తెలుగు సాహిత్యపు కిటికీలను ప్రపంచంవైపునకు తెరవడానికి ప్రయత్నించారు బుచ్చిబాబు. పాశ్చాత్య మనోవైజ్ఞానికతనీ, చైతన్య స్రవంతినీ తెలుగుకథకు అద్దారు. మనిషి అంతరంగ సంక్లిష్టతను విడమరిచే ప్రయత్నం చేశారు. అనుభూతి ప్రాధాన్యతను గుర్తించారు. కథనం దానికదే ప్రధానమైనదే అయినా, ఆయన చింతనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మనిషి.

 ‘మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను.’
 ‘జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు. నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా వుండొచ్చు; కాని ప్రేమించలలేకపోవడంలో అట్లా సమాధాన పడేటందుకేమీ లేదు’.

 ‘ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాలముందు వాల్తుంది.’
 ‘ఈ జీవితం రహస్యం- దాన్ని తెలుసుకోవడానికి మానవుడు చేసే యత్నం.’
 ఆయన, ‘రచనల్లోనే కాదు- నిత్య జీవితంలోనూ- నిజమైన కళోపాసకుడుగా, సంపూర్ణ మానవుడుగా, స్నేహవత్సలుడుగా జీవించిన గొప్ప కళాతపస్వి’.
 ‘నన్ను గురించి కథ వ్రాయవూ’లో  కథానాయిక కుముదంను ఇలా వర్ణిస్తారు: ‘ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికిగలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’.
 బుచ్చిబాబు అనే కలంపేరుగల శివరాజు వెంకటసుబ్బారావు గనక తెలుగు నేలమీద జన్మెత్తకపోయివుంటే, తెలుగు సాహిత్యంలో కచ్చితంగా కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడివుండేది.

(జూన్ 8, 2014 సాక్షి ఫన్డే సంచిక)

 - జూన్ 14న రచయిత బుచ్చిబాబు జయంతి