Saturday, October 28, 2023

మా ఊరి ముచ్చట 3: అభినందన




గ్రూప్‌ ఫొటో

 

కార్యక్రమం అనంతరం...


(ఇటీవల మా ఊరి దిలీప్‌కు హెచ్‌సీయూలో సీటొచ్చింది. సాయికిరణ్‌కు మెడిసిన్‌లో సీటొచ్చింది. నలుగురు(జలంధర్, రణధీర్, ప్రశాంత్, మనోజ్‌) కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు. ఇలాంటివన్నీ మా ఊరికి సంబంధించి పెద్ద విశేషాలే. అందుకే వారిని మా ఊరు కేంద్రంగా పనిచేసే ‘మై గిఫ్ట్‌’ స్వచ్ఛంద సంస్థ, క్రీడ విజ్ఞాన కళా వేదిక ఉమ్మడిగా ఊళ్లో దసరా పండుగ తెల్లారి జరిగిన ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో భాగంగా సత్కరించాయి. అందులో నన్నూ భాగం చేస్తూ మాట్లాడమంటే, ఈ మాటలు చెప్పాను:)

 

వేదిక ముందు, వేదిక మీద ఉన్న అందరికీ...

ఇక్కడున్న చాలామంది ఏదో సందర్భంలో ఊరికి దూరమై ఉండొచ్చు. అది చదువు కోసం హైదరాబాద్‌ వెళ్లడం కావొచ్చు, బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు పోవడం కావొచ్చు... అట్లా పోయినప్పుడు మన ఊరు మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. ఊరిలోనే ఉన్నప్పుడు మనకు అంతగా తెలియదు గానీ, ఊరికి ఎడంగా జరిగినప్పుడు మన ఊరు మనకు ఒక ఎమోషన్‌ అన్నది అర్థమవుతుంది. అందుకే దూరంగా ఉన్నప్పుడు ఊరి సంగతులు ఇంకా ఆసక్తికరంగా మారిపోతాయి. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న నాకు, ఈ పిల్లలు, వారి విజయాలు నాకు మరింత ముచ్చట గొలిపాయి.

ఇందులో ఇద్దరికి తండ్రులు లేరని తెలిసింది. ఒకతను పని కోసం గల్ఫ్‌ వెళ్లొచ్చి మళ్లీ కానిస్టేబుల్‌ పరీక్ష రాశాడు. ఇట్లా ప్రతి ఒక్కరికీ తమవైన సమస్యలున్నాయి. వాళ్ల కుటుంబ పరిస్థితులు, పరిమితులను అధిగమించిన వీళ్లందరూ నా దృష్టిలో సైలెంట్‌ హీరోలు. అసలు వీళ్లే కాదు, మొన్నటిదాకా బారాత్‌ డీజేలకు డ్యాన్స్‌ చేయడం తప్ప ఇంకేమీ తెలియదని అనిపించినవాళ్లు కూడా నెమ్మదిగా ఏదో ఒక పనిలో కుదురుకుని తమ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. వీళ్లందరూ అభినందనీయులే. 

వీరి సంతోషంలో భాగం అయినప్పుడు ఈ విజయం మనది కూడా అనిపిస్తుంది. ఒకరికి పది రూపాయలు దానంగా ఇవ్వొచ్చేమో గానీ, ఒక మనిషిని మనస్ఫూర్తిగా లోలోతుల నుంచి అభినందించడం అంత సులభం కాదు. ఒక మనిషిని అభినందించాలంటే పెద్ద మనసు ఉండాలి. ఈనాటి సత్కారం కూడా అలాంటి ప్రశంసలో భాగమే అనుకుంటున్నాను. దీనికి పూనుకున్న ‘మై గిఫ్ట్‌’ నిర్వాహకుడైన వీర సైనికుడు(సైన్యంలో పని చేస్తున్నాడు) పెరుక రాజుకు అభినందనలు. అట్లాగే దీనికి తోడ్పడిన క్రీడ విజ్ఞాన కళావేదిక బృందం గుర్రం శ్రీకాంత్, ఇతర మిత్రులకు కూడా.

మన ఊరిలో మనం ఫలానా వాళ్ల మనవడిగా, కొడుకుగా ఒక పరంపరలో ఉంటాం. బయటికి వెళ్తే మనం ఎవరో ఒక ‘ఎక్స్‌’ మాత్రమే. ఇప్పుడే మీ ప్రయాణం మొదలైంది. మున్ముందు ఏయే స్థానాల్లోకి వెళ్తారో! మనిషనేవాడు బయటికి వెళ్లాలి, ప్రపంచాన్ని చూడాలి. కానీ ఊరితో మొత్తంగా సంబంధం మాత్రం తెంచుకోవద్దు. వేరు లేనివాళ్లం అయిపోతాం. బయటెక్కడా మన ఆత్మ నిండదు. ఊరిని దాటాలి, ఊరితో టచ్‌లో ఉండాలి. అదే నేనిచ్చే సలహా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌!

(24 అక్టోబర్‌ 2023)

 

Friday, October 20, 2023

బెల్లం చాయ్

 



బెల్లం చాయ్ 


రోజుకు ఐదారుసార్లు టీ నుంచి ఒకటి రెండు సార్లకు వచ్చాను ఇప్పుడు. పిల్లలు సెలవులకు ఊరెళితే ప్రత్యేకంగా మళ్ళీ పాలు తెచ్చుకోను. కానీ చాయ్ తాగాలి. 'డికాషన్' తాగొచ్చు, కానీ ఆ చాయ్ పత్తా, చక్కెర కూడా లేకుండా బెల్లం టీ ఆలోచన వచ్చింది. నీళ్లను కొద్దిగా వేడి చేసి అందులో బెల్లం వేయడమే! ఇది టీకి ప్రత్యామ్నాయం అవుతుందా అంటే, ఉడుకుడుగ్గా కడుపులోకి ఒక ద్రవం వెళ్లిన ఫీలింగే ముఖ్యం కాబట్టి నాకు సరిపోతోంది.

Wednesday, October 18, 2023

కాల్వీనో

 



సీన్యో కాల్వీనో

ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్‌ రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు. ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్‌ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు. జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్‌ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్‌ సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్‌ 15) సంవత్సరం ఇది.

ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్స్‌ ఆఫ్‌ ద మూన్‌). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్‌ నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది. ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్‌ గ్రాండ్‌మదర్‌)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్‌ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్‌ పాలొమార్‌’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది?(ద బ్లాక్‌ షీప్‌).
కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాదిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్‌ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్‌ ఆన్సెస్టర్స్‌’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్‌’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే. కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది, అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్‌ మాడర్నిస్ట్‌ నవల అంటారు (ఇఫ్‌ ఆన్‌ ఎ వింటర్స్‌ నైట్‌ ఎ ట్రావెలర్‌). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్‌ జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం.

‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంటబెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు.

ఒకరోజు, మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని చాట్‌జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్‌’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్‌ పొలొమార్‌’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట. ‘సీన్యో(మిస్టర్‌ లాంటి గౌరవవాచకం) కాల్వీనో, ఒక ఇటాలియన్‌ చెవికి అది ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్‌ వీవర్‌ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చి ఆయన్ని ఆనందపరచొచ్చు!

(9th October 2023)

(ద డిస్టన్స్‌ ఆఫ్‌ ద మూన్‌ అనువాదం క్రెడిట్‌: నౌడూరి మూర్తి గారు)
 


Tuesday, October 3, 2023

మా ఊరి ముచ్చట 2: అలాయ్‌ బలాయ్‌

 

మా ఇంట్లో బతుకమ్మ పేర్పు

 

మా ఊరి ముచ్చట 2: అలాయ్‌ బలాయ్‌


(2022లో దసరా పండగ టైమ్‌లో మా ఊరిలో ‘క్రీడ విజ్ఞాన కళా వేదిక’ తరఫున ‘అలాయ్‌ బలాయ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువమిత్రులు అడిగితే, నేను కూడా అందులో పాల్గొని పెద్దమనిషి లాగా నాలుగు మాటలు చెప్పాను.)


అందరికీ నమస్కారం.


మనిషి ఏందంటే, కొన్నిసార్లు ఏకాకి; కొన్నిసార్లు సంఘజీవి. సందర్భాన్ని బట్టి ఆ పాత్రలను ఎంచుకుంటాడు. నేనైతే చాలాసార్లు ఏకాకిని. మనుషుల్లో కలవడం అనేది నాకు కొంచెం కష్టమైన వ్యవహారం. అయితే, వయసు పెరుగుతుండటం కూడా ఒక కారణం కావొచ్చుగానీ... ఈ క్రీడ విజ్ఞాన కళావేదిక మిత్రులు నన్ను సంఘజీవితంలో కలుపుతూ ఉన్నారు.

బతుకమ్మ పండుగ... దసరా... ఆ జమ్మి పెట్టుకోవడం, ఆ మర్రికింద... అందరూ ఒక ఉమ్మడి ఆవేశం పంచుకున్నారు. సామాజిక జీవితంలోని ఉత్సవం అదే. అందరం ఒక పెద్ద కార్యక్రమంలో భాగం తీసుకోవడం ద్వారా, ఒక్కరి సంతోషాన్ని మరింతలు, పదింతలు చేసుకోవడం అది. మనుషులతో కలవడమే పండుగ!

చాలాసార్లు జీవితం ఇంకా ముందుంటుంది అనుకుంటాం. కానీ నిజానికి వెనకే వదిలేసుకుంటూ వస్తాం. వయసు పెరుగుతున్నాకొద్దీ అది ఇంకా బలంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి జీవితాన్ని సంతోషించడం తెలుసుకోవాలి. ఒక వయసుకొచ్చాక నీతులు చెప్పడం సులభమేగానీ, ఆ వయసులో మనం ఎట్లా ఉన్నాం, మన ఆవేశాలు ఎట్లా ఉన్నాయి అని గుర్తించి, యువకులను ఒక సానుకూల వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేయడం గొప్ప విషయం. అందుకు ‘కేవీకేవీ’ మిత్రులకు అభినందనలు.

కుల భేదం లేకుండా, మత భేదం లేకుండా, రాజకీయ భేదం కూడా లేకుండా అందరం కలవడం బాగుంది. విభేదం వైవిధ్యం అయినంతవరకూ సమస్య లేదు. వైవిధ్యం అనేది ఆనందం కూడా. ఆ ఉన్న విభేదాలన్నీ పోయేలా ఇట్లా కలవాలన్న ఆలోచన బాగుంది. దానికోసం ఊరిలో పెద్దోళ్లు, ఊరితో సంబంధమున్న పెద్దోళ్లు అందరూ భాగస్వాములుగా ఉన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం.

థాంక్యూ.

(6 అక్టోబర్‌ 2022)