Wednesday, February 2, 2011

చలం పురూరవలోంచి నాలుగు మాటలు

నాకు సంబంధించినంతవరకూ చలం గొప్ప వర్క్ పురూరవ నాటకం.
బహుశా, ఆయన అచ్చంగా ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఇందులో అర్థం అవుతుంది.
నిన్న ఉద్యోగంలో భాగంగా దాన్ని మరోసారి తిరగేస్తే, ఎక్కడ చూస్తే అక్కడే కొన్ని గొప్ప వాక్యాలు కొత్త వెలుగుతో కనిపించాయి.
అందులోంచి కొన్ని:

తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టి పడతారు మానవులు.

వూరికే వాంఛిస్తారుగాని, తమ అర్హతల్ని తలుచుకోరు మనుషులు.

అసలు బాధలో అంత బాధ లేదు.

మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్ళీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?

నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను.

ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏది చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు(ఈ మనుషులు).

... ఈ చిట్టచివరి మాటతో నాకు అద్భుతమైన లింకు స్ఫురించింది. ఫుకుఓకా చెప్పేదంతా ఇదే. డు నథింగ్. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండటం సాధ్యం కాదా? మామూలుగా ఉండొచ్చు కదా, అంటాడు. చలం కూడా మరోచోట, పిల్లలు ఊరికే ఏమీచేయకుండానే కాళ్లూపుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. పెద్దాళ్లే వాళ్లకు ఇవి మాత్రమే అనందం ఇస్తాయన్న మూసలు తయారుచేసుకుని, అలా జరిగినప్పుడు మాత్రమే సంతోషిస్తారు, అంటాడు. పురూరవ గతంలో చదివినప్పుడు, బహుశా ఫుకుఓకా నాకు తెలియదు కాబట్టి, నేను ఇలా ఆలోచించలేదనుకుంటా.
కాని ఇప్పుడనిపిస్తోంది, చలం చెప్పినదానికి కొనసాగింపు ఫుకుఓకా చింతనలో ఉంటుంది.