Monday, August 18, 2014

గుల్జార్: తోట దాటిన పరిమళం

తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: ‘నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు’. (‘ఇజాజత్’- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, ‘ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా’డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసింది. గుల్జార్ నిక్షిప్తం చేసే సూక్ష్మ వివరాలు అట్లాంటివి! ‘పంచమ్’కు మాత్రం తెలీదా! ఒకే గొడుగుకింద ఇరువురు పంచుకున్న జ్ఞాపకాల తడిని- అతడు ఏంచేసీ తిరిగివ్వలేడనీ! భౌతికమైన వస్తువుల మీదుగానే వాటిని మించిపోయే భావాన్ని ‘గుల్జార్ సాబ్’ కల్పించగలడనీ! ‘తోట’ అని అర్థాన్నిచ్చే కలంపేరును స్వీకరించిన అదే గుల్జార్- ‘ఆంధీ’లో అంటాడు: ‘ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు)’. కాంతిబిందువులు చిలకరించే పన్నీరు; వర్షపు రాతిరి శుభ్రపడే హృదయం; చూపులు పలికే కంటిపాపల గీతం; ఆకాశం కింద, ఒక మూలకు ఒదిగి పడుకునే పేదవాడి దైన్యం; తిరిగి మళ్లీ ఎదురుచూడవలసిన ఒంటరి సాయంకాలం; పగటిని రాత్రిగా మారిపొమ్మనే విరహపు మారాం; రాకముందే వెళ్లిపోవాల్సిన చేదునిజం;

అతి సున్నితమైనదేదో, హృదయం ద్రవించేదేదో బొమ్మ కడుతుంది ఆయన పాటల్లో. అలాగని, మార్దవమో, గంభీరతో మాత్రమే గుల్జార్ చిరునామా కాదు. ‘కజ్రా రే’, ‘ఛయ్య ఛయ్య’, ‘జై హో’(రహమాన్‌తో కలిసి ఆస్కార్ అందుకున్న పాట) పుట్టించే హుషారును ఎలా కాదనగలం! ‘ఒక పాట పాపులర్ అయినంతమాత్రాన, అది అల్పమైనది కానక్కర్లేదు,’ అంటాడాయన. పొద్దుట పూజగదిలోంచి వినవచ్చే శ్లోకం, పాలబ్బాయి మోగించే సైకిల్ గంట, భిక్షాటన చేస్తూ పాడుకునే పకీరు, ఇల్లాలి లల్లాయి పదాలు... వీటన్నిటా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు.

కవిత్వాన్ని వదిలేసి, కేవలం ఆయన దర్శకత్వాన్ని పరిగణించినా గుల్జార్ ఇచ్చింది చాలా చాలా ఎక్కువ! కోషిష్, పరిచయ్, అచానక్(1973-పాటల్లేని సినిమా), మౌసమ్, ఖుష్బూ, ఆంధీ(1975-అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధించిన సినిమా), కితాబ్, కినారా, మీరా, నమ్‌కీన్, ఇజాజత్, లిబాస్, లేకిన్, మాచిస్(1996-పంజాబ్ అలజడుల నేపథ్యంలోని ప్రేమకథ), హు తు తు(1999-రాజకీయనాయకుల కపటానికి వాళ్ల పిల్లలే ఎదురునిలిచే సందర్భం)... తీక్షణమైన, అర్థవంతమైన, ఉద్వేగమిళితమైన సినిమాలాయనవి!

సార్వత్రికమైనదేదో పట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడుతాడు. మనుషులుగా పరస్పరం పొదువుకోవాల్సిన అవసరాన్నీ, బంధాలకు పొదుగుకోవాల్సిన అందాన్నీ, వాటిల్లోంచి పొందగలిగే రసాన్నీ ఆయన ఆవిష్కరిస్తాడు. కవీ, కథకుడూ, అనువాదకుడు కూడా అయిన గుల్జార్- ‘బోస్క్‌యానా’గా నామకరణం చేసుకున్న తన ఇంటిని (కూతురు మేఘనను బోస్కీ అని పిలుస్తాడు)  పుస్తకాలు, పెయింటింగ్స్‌త అలంకరించాడు; మదినేమో మీర్జా గాలిబ్, గౌతమబుద్ధులతో!

దేశవిభజనకు ముందు రావల్పిండి దగ్గరి దీనాలో సంపూర్ణసింగ్ కల్రాగా 1936 ఆగస్టు 18న జన్మించాడు. చిన్నప్పుడు వాళ్లనాన్నకు ఆయన ‘పున్ని’. చిక్కటి స్మృతుల్ని హృదయంలో నింపే బాల్యాన్ని అక్కడ గడిపాడు. నలుగురూ వచ్చీపోయే ఇంటి వసారా, ఒంటికాలితో కుంటుతూ పరుగెత్తిన గల్లీలు, చిట్టచివర కూర్చుని చదువుకున్న బడి... వెనక్కి జార్చుకుని సరిహద్దు దాటాడు. అందుకే, ఆయనకు చిన్నతనం అంటే ఆనందం, విషాదం కూడా. గాలిబ్ వేడుకొన్నట్టుగా ఆయనా ప్రార్థిస్తాడు: బాధాకరమైన గతపు స్మృతుల్ని మరిచిపోయేలా, ఓ దేవుడా, నాకు మరపునైనా ఎందుకు ప్రసాదించవూ!

భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ‘కళ్లకు వీసాలు అక్కర్లేదు; కలలకు హద్దులు లేవు; కళ్లు మూసుకుని నేను సరిహద్దు దాటతాను,’ అని పాడుకున్నాడు. ఆయన పుట్టినరోజును ఇప్పటికీ లాహోర్‌లో జరుపుకునే స్నేహితులున్నారు. తను చదివిన స్కూల్లో ‘గుల్జార్ కల్రా బ్లాక్’ పెట్టారు. 70 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు గుండెబరువెక్కి ఆయన కళ్లు తడిసిపోయాయట! ‘ప్రేమలో కూడా బాధుంటుంది; జీవితంలో బాధ కూడా భాగమే’! ఆ బాధతో కూడా సౌకర్యంగా ఉండగలగాలి!

చాయ్, కింగ్స్, సింగిల్ మాల్ట్, టెన్నిస్, మనవడు సమయ్, విడిగావుంటూ విడాకులు తీసుకోని ‘రాఖీ’ బంధం, ఆమె ఏ ఆదివారమో వండుకొచ్చే  పసందైన చేపలకూర... సాహిత్య అకాడెమీ, పద్మభూషణ్, ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే... ఇట్లాంటి కొన్ని పదాల్ని వాడి, ఆయన్నొక పాట రాసిమ్మనాలి. కాకపోతే, మరీ ‘ఆత్మగీతం’ అవుతుందని ఆయన ఒప్పుకుంటాడో లేదో!
 ‘బంధాలంటే  ఒక దగ్గర జీవించడం, ప్రతిరోజూ కలవడం తప్పనిసరి కాదు; ఆ అవసరంలేని బంధాలు కూడా కొన్ని అలా ఏర్పడిపోతాయి’. గుల్జార్ అలాంటి ఒక బంధువేతర బంధువు!

-----------------------------------
ఫన్డేలో 'సత్వం' శీర్షికన...
తోట దాటిన పరిమళం: బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన ఒక కథ పేరు

Friday, August 8, 2014

మపాసా: 'ఫ్రెంచ్ చలం'ఉన్న ఒక్కగానొక్క జీవితంలో, మనిషి పొందాల్సిన అతిముఖ్యమైనది ఏమిటి? ఈ ‘మనిషి’, అనేచోట మగవాడిని గనక ప్రతిష్టించుకుంటే, దీనికి జవాబివ్వడం కొంత సులువు కావొచ్చు; అయితే, అప్పటికీ, దీనికి సమాధానం ఒకేవిధంగా ఉండకపోవచ్చు, ఒక్క మొపాసా లాంటివాడికి తప్ప!
‘జీవితంలో ఉన్న ఏకైక ముఖ్యవిషయం– ప్రేమ’!

ఇందాకా, మనిషి స్థానంలో మగవాడిని ఉంచడానికి కారణం, అతడికి భిన్నమైన లింగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికే! స్త్రీ కౌగిలి మాత్రమే మగవాడికి ధన్యతను చేకూర్చుతుంది; అతడి జన్మను చరితార్థం చేస్తుంది. ధనం, కీర్తి – ఇవేవీ కూడా, ఒక స్త్రీ ప్రేమను పొందడానికి పనికిరావు. అలా పనికిరానివేవీ కూడా మొపాసాకు పొందగలిగినంత విలువైనవి కావు.

గై డి మొపాసా, గీ ద మొపాసా, గై ద మొపాసా, గి ది మొపాసా, గీ డ మొపాసా, గీ డీ మొపాసా... రకరకాలుగా  ఉచ్చారణ ‘వీలున్న’ పేరు ఆయనది; నిజానికి ఆ వీలుండదు, కానీ అసలు ధ్వని తెలియని పరాయిభాష అలాంటి ‘సౌలభ్యం’ కల్పిస్తుంది. సింపుల్‌గా మొపాసా అనుకుందాం!

మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు.
సమాజాంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే!
స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు మొపాసా(1850–93) . మానవనైజంలోని అనేక పార్శ్వాలను పట్టుకున్నాడు. మనోవిశ్లేషణను కథకు జోడించాడు. కథా నిర్మాణానికి బలమైన గోడలు నిర్మించాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ ఆయన చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు.

చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్‌’(హ్యూగో) తర్వాత ఫ్రెంచ్‌ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వై’ పేరుతెచ్చుకుంది. ‘నా బాస్‌ తలనొప్పిగా ఉందన్నా ఇంటికి వెళ్లడానికి అనుమతించలే’దని తల్లికి ఉత్తరం రాసిన మొపాసా... అనతి కాలంలోనే ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పుస్తకాలతో వచ్చిన పేరు, పేరుతో ఒనగూడిన సంపదతో నౌక కొన్నాడు. తన తొలి నవల పేరుమీదుగా ‘బెల్‌ ఎమీ’గా దానికి నామకరణం చేశాడు. అందులో అల్జీరియా, ఇటలీ, ఇంగ్లండ్, సిసిలీలాంటి ఎన్నో దేశాల్లో పర్యటించాడు. తన అపార్టుమెంటులోని ఒక రహస్య మూలను, అందమైన స్త్రీల చెవుల్లో తన సాహసయాత్రలు వర్ణించి చెప్పటానికే వినియోగించాడు. ఫలితంగా సుఖవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది.

‘పళ్లను వదులుచేసి, వెంట్రుకలను రాల్చి, అవయవాల్ని ఛిన్నాభిన్నంచేసి మింగేయడానికి వచ్చే మృత్యువు’ ముంగిట శక్తిలేక కూలబడ్డాడు. ఎలుకను వేటాడే పిల్లిలాగా అది తరుముతూ వుంటే ఎటూ తప్పించుకోలేక  నిస్సహాయుడయ్యాడు. ఏకాంతంలోకీ, స్వీయధ్యానంలోకీ పోవడం మొదలుపెట్టాడు. తీవ్రమైన నిరాశలో గొంతు కోసుకుని ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు.

జీవనశైలిని కాకుండా రాయడం వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే– చలానికి ప్రకృతి వయసు పొడిగించింది కాబట్టి, దాన్ని ఆయన మరింత ‘సార్థకం’ చేసుకున్నట్టుగా కనబడుతుంది; కానీ ఆ అవకాశం మొపాసాకు లేదు. తన 43వ పుట్టినరోజు కూడా చూడకుండానే, జీవితరంగం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, చాలా కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్‌ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ అదే టాల్‌స్టాయ్‌ మెచ్చుకుంటాడు.

‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని రాసుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ గడిపి వెళ్లిపోయాడు.
--------------------------------
5 ఆగస్టు మొపాసా జయంతి
(ఫన్డే 2014)