Monday, October 27, 2014

హైదరాబాద్ నాకేమిటి?

ఐదో క్లాసులో ఉన్నప్పుడు పెద్దమామ గృహప్రవేశానికి మేడ్చల్ వచ్చాం. బంగ్లా మీదికి ఎక్కితే విమానాలు తలమీదే ఎగురుకుంటూ పోతున్నాయి. హైదరాబాదీకి మేడ్చల్ మేడ్చలే  కానీ.. వేములవాడ దగ్గరి పల్లెటూర్లో పుట్టిన వాడికి మేడ్చల్ అంటే హైదరాబాదే ! ఆ బంగ్లా మీది నుంచి ఎత్తుగా ఒక నిర్మాణం కనబడింది. నాలుగు గుమ్మటాలు! ‘ఓహో అయితే ఇదే పుస్తకంలో చదువుకున్న చార్మినార్ కావొచ్చు,’ అనుకున్నా.
దాన్ని మా సుహాసిని వదిన సరిదిద్దింది. ‘‘ఇది మసీదు; చార్మినార్ అంటే సిటీలో ఉంటుంది,’’ అంది.
మేడ్చల్‌లో ఏనాడూ హైదరాబాద్‌ను హైదరాబాద్ అనగా వినలేదు. ‘సిటీ’యే! అదీ హైదరాబాద్ అనే ఉనికితో నా తొలి సంపర్కం.

తర్వాత కీసరగుట్ట రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. దానికోసం ఉప్పల్ బస్టాపులో 242 జీ ఎక్కాను. ఆలియా కాలేజీలో ఇంటర్ చేశాను. సిటీ అంతా నాకు థియేటర్లుగా పరిచయం! ‘మనోహర్ టాకీస్ లేదా?’ ‘ఆరాధన నుంచి ముందుకువోతే...’ ‘వెంకటాద్రి ఉంది సూడు’ ఇట్లా!

సికింద్రాబాద్ ఏనాడో హైదరాబాద్‌ను పెళ్లాడింది కాబట్టి రెంటినీ ఒకటిగానే కలిపేసి చెప్పేస్తున్నా.
హైదరాబాద్‌లోనే మొదటిసారి థియేటర్లో టికెట్‌కు నంబర్ ఉంటుందని తెలుసుకున్నా. ప్రశాంత్; రౌడీగారి పెళ్లాం; హెచ్ 14.
టీ చుక్క చొక్కా మీద ఒలికిపోతే ఆ రోజంతా వాసన వచ్చిన ఇరానీ చాయ్‌ని మొదటిసారి ఇక్కడే రుచిచూశాను. బ్లూ సీ; సికింద్రాబాద్.
తొలి సిగరెట్ ఇక్కడే కాల్చాను. సీనియర్ ఇంటర్; జూ పార్క్ దగ్గర; శివిగానితో. కానీ కాల్చడం అంటే అది కాదని తెలియడానికి నాకు మరో రెండేళ్లు పట్టింది.
మొదటి సాఫ్ట్ పోర్న్ సినిమా ఇక్కడే చూశాను. లాంబా; హిజ్ వైఫ్ అండ్ హర్ లవర్; నాకు తొలి ‘దర్శనం’ ఇచ్చింది హెలెన్ మిర్రెన్!
 గప్‌చుప్ పేరుతో ఒక గుండ్రటి ఐటెమ్ ఉంటుందని ఇక్కడే తెలుసుకున్నా (రేతిఫైల్ బస్‌స్టేషన్).
మొదటి దమ్‌కీ బిర్యానీ ఇక్కడే తిన్నా (బాంబే హోటల్; రాణీగంజ్).
అప్పుడే చేస్తున్న బ్రెడ్ వాసన ఇక్కడే పీల్చాను  (చార్మినార్).
అమ్మాయి సిగరెట్ తాగడం ఇక్కడే చూశాను (సంగీత్ థియేటర్).
పార్కులో అమ్మాయీ అబ్బాయీ యథేచ్ఛగా  ముద్దుపెట్టుకోవడం ఇక్కడే చూశాను (సంజీవయ్య పార్క్).
నా తొలి ‘ఉద్యోగం’ ఇక్కడే చేశాను. అంకుర్ బట్టల షాపులో హెల్పర్‌గా! చెప్పుకోవడానికి బాగుండే కష్టాలు నాక్కూడా కొన్ని ఉన్నయ్!
యండమూరిని మాత్రమే చదివిన నాకు చలం పుస్తకాలు ఇక్కడే పరిచయం (సుల్తాన్‌బజార్ విశాలాంధ్ర). పాతపుస్తకాలు అమ్మడం ఇక్కడే చూశాను (కోఠి).

 నా తొలి కథ ఇక్కడే రాశాను. డిగ్రీ అయిన తర్వాత రామ్‌నగర్‌లో అద్దెకున్నాను ఫ్రెండ్స్‌తో. ఓనర్ అర్జునరావు. ఆ మేడమీద రాశాను ‘ఆమె పాదాలు’. అంతకుముందు కొన్నిరాసినా కూడా నేను స్టాంపు కొట్టుకోవచ్చు అనుకున్నాను దీంతో.
మొదటిసారి సెల్‌ఫోన్ వాడింది ఇక్కడే. ఇంటర్నెట్ వినియోగించింది ఇక్కడే. భోజనం లేకుండా ఒకే రోజు మూడు సినిమాలు చూసింది ఇక్కడే. రన్నింగ్ బస్సుల నుంచి దూకి పడ్డది ఇక్కడే! కర్ఫ్యూ ఇక్కడే మొదటిసారి అనుభవించాను. పోలీసు దెబ్బ ఇక్కడే తిన్నాను. కాలు తొక్కి కూడా పశ్చాత్తాపం ప్రకటించని మనుషుల్ని ఇక్కడే చూశాను. కొనకపోతే కొట్టేంత పనిచేసే పొగరుబోతు అమ్మకందారుల్ని ఇక్కడే చూశాను.

ఇం..త.. సందులో ఇళ్లుండటం ఇక్కడే చూశాను. ముందట డ్రైనేజీ పారుతుంటే మనుషులు తినాల్సిరావడం ఇక్కడే చూశాను. షాపుల ముందు మనుషులు చాలీచాలని బట్టలతో నిద్రించడం ఇక్కడే చూశాను. ఇంకా, ఇప్పటి చాలామంది మిత్రుల్ని కలుసుకుంది ఇక్కడే! నా ఇద్దరు పిల్లలు ప్రాణం పోసుకుంది కూడా ఇక్కడే!
అందుకే ఈ నగరాన్ని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ద్వేషిస్తాను; ఎంతగా ద్వేషిస్తానో అంతగా ప్రేమిస్తాను. ఎందుకంటే నా జీవితంలోని చాలా విలువైన భాగం, విడదీయలేని భాగం ఈ నేలతో ముడిపడి వుంది కాబట్టి!

(సాక్షి, సిటీ ప్లస్, అక్టోబర్ 26, 2014)

Monday, October 13, 2014

ఫ్రీడ్రీక్ నీషే: దేవుడి శత్రువు?వ్యక్తి మనుగడలో దేవుడి పాత్ర ఏమిటి? ‘దేవుడు మరణించాడు’ అన్నాడు జర్మన్‌ తత్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీషే. ఆయన ప్రధాన భాగస్వామ్యం ఉన్న అసిత్వవాద సిద్ధాంతం ప్రకారం, మనిషి జీవితంలో– ఏ మానవాతీత శక్తి ప్రమేయమూ లేదు. తలరాత అనేది అబద్ధం. మనిషి తన నిర్ణయాన్ని తానే తీసుకుంటాడు. తన జీవనశైలికి తానే బాధ్యుడవుతాడు. తన మంచికీ, చెడుకీ కర్త తనే!

దేవుడు మరణించాడంటున్నాడంటే, నీషే దేవుణ్ని తిరస్కరిస్తున్నట్టా? దేవుణ్ని తొలగించుకున్నాక, దాన్ని పూరించే ఖాళీ ఏమిటి? ఇది అర్థం కాకే ప్రపంచానికి పిచ్చెక్కిపోతోంది. లేదా, ఇది అర్థమయ్యే దేవుణ్ని కొనసాగిస్తూ వస్తోందా?
లేక, దేవుణ్ని చంపింది మనుషులే అని నిందిస్తున్నాడా నీషే? ఒక విశ్వాసానికి కట్టుబడలేని కపటాన్ని ఎద్దేవా చేస్తున్నాడా? దేవుడిని కేవలం ఒక ట్రోఫీగా మార్చిన తీరుకు నిరసన చెబుతున్నాడా? ఏ శుద్ధజలంలో మనల్ని శుభ్రపరుచుకుందామని అడుగుతున్నాడా?

వివిధ పుస్తకాలుగా తన భావాల్ని వెల్లడించాడు నీషే. అందులో ‘థస్‌ స్పోక్‌ జరాతుష్ట్ర’ ముఖ్యమైనది. పూర్వపు మత, సాంఘిక విలువల శైథిల్యం ఆయన రచనల్లో కనబడుతుంది. జనం మందగా ఉండటాన్ని వెక్కిరిస్తాడు. మందకు ఒక పద్ధతంటూ ఉండదు. సమాజానిది కూడా ‘మంద’గమనమే! ఇక్కడ నీతి లేదు. జనం నమ్ముతున్న విలువలకు విలువ లేదు. విశ్వాసాలకు విశ్వసనీయత లేదు. ‘ఒంటెలాంటివాడు మనిషి. తనకు తానే మోకరిల్లి, తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని, ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు’. ‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’. తాను ఏమికాదో దాన్నే మోసుకు తిరుగుతాడు మనిషి. ‘నీలో విలయం తాండవిస్తేనేకానీ నర్తించే నక్షత్రానికి జన్మనివ్వలేవు’.

విల్‌ టు పవర్, సూపర్‌ మాన్‌ భావనలు ప్రవేశపెట్టాడు నీషే. ఇప్పటి వ్యక్తిత్వ వికాస నిపుణుల భావనలుగా కనబడతాయివి. ప్రతి జీవి కూడా తానున్న స్థితిలోంచి, మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి శక్తి కావాలి. అంతిమలక్ష్యం చేరుకోవడమన్నది ఆయా వ్యక్తుల శక్తి మీదే ఆధారపడివుంటుంది. పరిస్థితులతో పోరాడాలి. వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఈ సంఘర్షణలో నిలబడేది వీరులు మాత్రమే. కాబట్టి బలమే సుగుణం. శక్తిహీనతే దుర్గుణం. ఏ సిద్ధాంతం ఉపయోగపడితే దాన్నే అనుసరించాలి. అప్పుడే నువ్వు సూపర్‌మాన్‌ కాగలవు, అన్నాడు. ఇక్కడే నీషే వివాదాస్పదం అయ్యాడు. ఆయన భావాల్ని నాజీలు తమకు అనువుగా మలుచుకుని ఆర్యన్‌ జాతి గొప్పదన్న ప్రచారం చేసుకున్నారు.

నీషే బాల్యం అంతా మతవిశ్వాసాలు తీవ్రంగా ఉన్న పరిసరాల్లో గడిచింది. నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. బాల్యమంతా తల్లి, అమ్మమ్మ, అత్తలు, చెల్లి... ఇలా ఆడవాళ్ల చుట్టూనే తిరిగింది. కానీ అసలైన స్త్రీ సాంగత్యం కావాల్సిన యౌవనంలో తిరస్కారానికే గురైనాడు. చిన్నతనం నుంచీ మూడీగా, బలహీనంగా ఉండేవాడు. ఒంటరిగా గడిపాడు. స్నేహితులు లేరు. కోరుకున్న స్త్రీని అందుకున్న అదృష్టం లేదు. తనలో లేని ‘సూపర్‌ మాన్‌’కు ఇవన్నీ ఊతం అయ్యాయా?

పరస్పర విరుద్ధంగా ఉన్నట్టుగా తోస్తాడు నీషే. స్పష్టంగా ఏం చెప్పాడో ఒక కంక్లూజన్‌కు వచ్చినట్టు కనబడదు. ప్రపంచం ఇలా ఉండాలన్నాడా? ఇలా ఉందన్నాడా?
మళ్లీ ఏ విధమైన గుడ్డినమ్మకాలు, చారిత్రక సంకెళ్లు లేని స్వేచ్ఛా ఆత్మ గురించి యోచించాడు. సేచ్ఛగా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న మనిషినీ, కేవలం భయంలో, వాంఛలో మగ్గిపోయే మనిషినీ పట్టించాడు. భయమే మనిషిని బానిసను చేస్తుంది. ‘బానిస భావజాలంలో దయ, అణకువ, సహానుభూతి లాంటి పదాలుంటే, యజమాని నిఘంటువులో దర్పం, శక్తి, ఘనత లాంటివాటికే చోటుంటుంది. యజమాని ఘటనల్ని మంచికో చెడుకో దారితీసే పరిణామాలుగానే పరిగణిస్తాడు. బానిస అవే ఘటనల్ని మంచీ చెడూ ఉద్దేశాలుగా చూస్తాడు’.
‘సింహాసనం మీద ఎక్కడానికి అందరూ ఎగబడుతున్నారు. పిచ్చికాకపోతే అదేదో సంతోషం సింహాసనం మీద కూర్చునివున్నట్టు!’ ‘మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, రాజ్యంలో అందరూ విషం తాగినవాళ్లే. మంచివాళ్లని లేదు, చెడ్డవాళ్లని లేదు, అందరూ తమని కోల్పోయివున్నారు. ఈ నిదానమైన ఆత్మహత్యే జీవితంగా పరిగణించబడుతోంది’.

‘(అయితే) జీవితం ఏమీ పళ్లెంలో అందుకోవాల్సిన భోజనం కాదు. అది ఉత్తి అయోమయం, అర్థంపర్థం లేని గోల. దీనికి పరిపూర్ణత లేదు. ఇది అర్థమైతే ద్వేషం లేకుండా మనిషి జీవితాన్ని ఆమోదిస్తాడు’. బహుశా ఈ వాక్యంలో నీషే ఆత్మ నిక్షిప్తమైవుందేమో!

విద్యార్థి దశలో ఉన్నప్పుడే సిఫిలిస్‌ బారినపడ్డాడు. శిరోభారం, గాస్ట్రిక్‌ పెయిన్స్, పైయోరియా, కళ్ల మసక బాధించాయి. తరువాత మతిస్థిమితం తప్పింది. మానసికంగా, శారీరకంగా దుర్బలుడయ్యాడు. దశాబ్దం పాటు తీవ్ర వేదన అనుభవించి 55 ఏళ్లకే మరణించాడు(1844–1900). ఎవరైనా ఆస్తికుడు ఇది దేవుడు విధించిన శిక్షే అంటే నీషే గట్టిగా నవ్వుతాడేమో!

(సెప్టెంబర్ 2014; ఫన్ డే)
 

Monday, August 18, 2014

గుల్జార్: తోట దాటిన పరిమళం

తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: ‘నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు’. (‘ఇజాజత్’- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, ‘ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా’డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసింది. గుల్జార్ నిక్షిప్తం చేసే సూక్ష్మ వివరాలు అట్లాంటివి! ‘పంచమ్’కు మాత్రం తెలీదా! ఒకే గొడుగుకింద ఇరువురు పంచుకున్న జ్ఞాపకాల తడిని- అతడు ఏంచేసీ తిరిగివ్వలేడనీ! భౌతికమైన వస్తువుల మీదుగానే వాటిని మించిపోయే భావాన్ని ‘గుల్జార్ సాబ్’ కల్పించగలడనీ! ‘తోట’ అని అర్థాన్నిచ్చే కలంపేరును స్వీకరించిన అదే గుల్జార్- ‘ఆంధీ’లో అంటాడు: ‘ఈ పూలకొమ్మల్ని చూశావా? అవి నిజానికి అరబ్బీలో రాసిన ‘ఆయతులు’(చరణాలు)’. కాంతిబిందువులు చిలకరించే పన్నీరు; వర్షపు రాతిరి శుభ్రపడే హృదయం; చూపులు పలికే కంటిపాపల గీతం; ఆకాశం కింద, ఒక మూలకు ఒదిగి పడుకునే పేదవాడి దైన్యం; తిరిగి మళ్లీ ఎదురుచూడవలసిన ఒంటరి సాయంకాలం; పగటిని రాత్రిగా మారిపొమ్మనే విరహపు మారాం; రాకముందే వెళ్లిపోవాల్సిన చేదునిజం;

అతి సున్నితమైనదేదో, హృదయం ద్రవించేదేదో బొమ్మ కడుతుంది ఆయన పాటల్లో. అలాగని, మార్దవమో, గంభీరతో మాత్రమే గుల్జార్ చిరునామా కాదు. ‘కజ్రా రే’, ‘ఛయ్య ఛయ్య’, ‘జై హో’(రహమాన్‌తో కలిసి ఆస్కార్ అందుకున్న పాట) పుట్టించే హుషారును ఎలా కాదనగలం! ‘ఒక పాట పాపులర్ అయినంతమాత్రాన, అది అల్పమైనది కానక్కర్లేదు,’ అంటాడాయన. పొద్దుట పూజగదిలోంచి వినవచ్చే శ్లోకం, పాలబ్బాయి మోగించే సైకిల్ గంట, భిక్షాటన చేస్తూ పాడుకునే పకీరు, ఇల్లాలి లల్లాయి పదాలు... వీటన్నిటా సంగీతాన్ని ఆస్వాదిస్తాడు.

కవిత్వాన్ని వదిలేసి, కేవలం ఆయన దర్శకత్వాన్ని పరిగణించినా గుల్జార్ ఇచ్చింది చాలా చాలా ఎక్కువ! కోషిష్, పరిచయ్, అచానక్(1973-పాటల్లేని సినిమా), మౌసమ్, ఖుష్బూ, ఆంధీ(1975-అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధించిన సినిమా), కితాబ్, కినారా, మీరా, నమ్‌కీన్, ఇజాజత్, లిబాస్, లేకిన్, మాచిస్(1996-పంజాబ్ అలజడుల నేపథ్యంలోని ప్రేమకథ), హు తు తు(1999-రాజకీయనాయకుల కపటానికి వాళ్ల పిల్లలే ఎదురునిలిచే సందర్భం)... తీక్షణమైన, అర్థవంతమైన, ఉద్వేగమిళితమైన సినిమాలాయనవి!

సార్వత్రికమైనదేదో పట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి మాట్లాడుతాడు. మనుషులుగా పరస్పరం పొదువుకోవాల్సిన అవసరాన్నీ, బంధాలకు పొదుగుకోవాల్సిన అందాన్నీ, వాటిల్లోంచి పొందగలిగే రసాన్నీ ఆయన ఆవిష్కరిస్తాడు. కవీ, కథకుడూ, అనువాదకుడు కూడా అయిన గుల్జార్- ‘బోస్క్‌యానా’గా నామకరణం చేసుకున్న తన ఇంటిని (కూతురు మేఘనను బోస్కీ అని పిలుస్తాడు)  పుస్తకాలు, పెయింటింగ్స్‌త అలంకరించాడు; మదినేమో మీర్జా గాలిబ్, గౌతమబుద్ధులతో!

దేశవిభజనకు ముందు రావల్పిండి దగ్గరి దీనాలో సంపూర్ణసింగ్ కల్రాగా 1936 ఆగస్టు 18న జన్మించాడు. చిన్నప్పుడు వాళ్లనాన్నకు ఆయన ‘పున్ని’. చిక్కటి స్మృతుల్ని హృదయంలో నింపే బాల్యాన్ని అక్కడ గడిపాడు. నలుగురూ వచ్చీపోయే ఇంటి వసారా, ఒంటికాలితో కుంటుతూ పరుగెత్తిన గల్లీలు, చిట్టచివర కూర్చుని చదువుకున్న బడి... వెనక్కి జార్చుకుని సరిహద్దు దాటాడు. అందుకే, ఆయనకు చిన్నతనం అంటే ఆనందం, విషాదం కూడా. గాలిబ్ వేడుకొన్నట్టుగా ఆయనా ప్రార్థిస్తాడు: బాధాకరమైన గతపు స్మృతుల్ని మరిచిపోయేలా, ఓ దేవుడా, నాకు మరపునైనా ఎందుకు ప్రసాదించవూ!

భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ‘కళ్లకు వీసాలు అక్కర్లేదు; కలలకు హద్దులు లేవు; కళ్లు మూసుకుని నేను సరిహద్దు దాటతాను,’ అని పాడుకున్నాడు. ఆయన పుట్టినరోజును ఇప్పటికీ లాహోర్‌లో జరుపుకునే స్నేహితులున్నారు. తను చదివిన స్కూల్లో ‘గుల్జార్ కల్రా బ్లాక్’ పెట్టారు. 70 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు గుండెబరువెక్కి ఆయన కళ్లు తడిసిపోయాయట! ‘ప్రేమలో కూడా బాధుంటుంది; జీవితంలో బాధ కూడా భాగమే’! ఆ బాధతో కూడా సౌకర్యంగా ఉండగలగాలి!

చాయ్, కింగ్స్, సింగిల్ మాల్ట్, టెన్నిస్, మనవడు సమయ్, విడిగావుంటూ విడాకులు తీసుకోని ‘రాఖీ’ బంధం, ఆమె ఏ ఆదివారమో వండుకొచ్చే  పసందైన చేపలకూర... సాహిత్య అకాడెమీ, పద్మభూషణ్, ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే... ఇట్లాంటి కొన్ని పదాల్ని వాడి, ఆయన్నొక పాట రాసిమ్మనాలి. కాకపోతే, మరీ ‘ఆత్మగీతం’ అవుతుందని ఆయన ఒప్పుకుంటాడో లేదో!
 ‘బంధాలంటే  ఒక దగ్గర జీవించడం, ప్రతిరోజూ కలవడం తప్పనిసరి కాదు; ఆ అవసరంలేని బంధాలు కూడా కొన్ని అలా ఏర్పడిపోతాయి’. గుల్జార్ అలాంటి ఒక బంధువేతర బంధువు!

-----------------------------------
ఫన్డేలో 'సత్వం' శీర్షికన...
తోట దాటిన పరిమళం: బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన ఒక కథ పేరు

Friday, August 8, 2014

మపాసా: 'ఫ్రెంచ్ చలం'ఉన్న ఒక్కగానొక్క జీవితంలో, మనిషి పొందాల్సిన అతిముఖ్యమైనది ఏమిటి? ఈ ‘మనిషి’, అనేచోట మగవాడిని గనక ప్రతిష్టించుకుంటే, దీనికి జవాబివ్వడం కొంత సులువు కావొచ్చు; అయితే, అప్పటికీ, దీనికి సమాధానం ఒకేవిధంగా ఉండకపోవచ్చు, ఒక్క మొపాసా లాంటివాడికి తప్ప!
‘జీవితంలో ఉన్న ఏకైక ముఖ్యవిషయం– ప్రేమ’!

ఇందాకా, మనిషి స్థానంలో మగవాడిని ఉంచడానికి కారణం, అతడికి భిన్నమైన లింగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికే! స్త్రీ కౌగిలి మాత్రమే మగవాడికి ధన్యతను చేకూర్చుతుంది; అతడి జన్మను చరితార్థం చేస్తుంది. ధనం, కీర్తి – ఇవేవీ కూడా, ఒక స్త్రీ ప్రేమను పొందడానికి పనికిరావు. అలా పనికిరానివేవీ కూడా మొపాసాకు పొందగలిగినంత విలువైనవి కావు.

గై డి మొపాసా, గీ ద మొపాసా, గై ద మొపాసా, గి ది మొపాసా, గీ డ మొపాసా, గీ డీ మొపాసా... రకరకాలుగా  ఉచ్చారణ ‘వీలున్న’ పేరు ఆయనది; నిజానికి ఆ వీలుండదు, కానీ అసలు ధ్వని తెలియని పరాయిభాష అలాంటి ‘సౌలభ్యం’ కల్పిస్తుంది. సింపుల్‌గా మొపాసా అనుకుందాం!

మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు.
సమాజాంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే!
స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు మొపాసా(1850–93) . మానవనైజంలోని అనేక పార్శ్వాలను పట్టుకున్నాడు. మనోవిశ్లేషణను కథకు జోడించాడు. కథా నిర్మాణానికి బలమైన గోడలు నిర్మించాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ ఆయన చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు.

చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్‌’(హ్యూగో) తర్వాత ఫ్రెంచ్‌ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వై’ పేరుతెచ్చుకుంది. ‘నా బాస్‌ తలనొప్పిగా ఉందన్నా ఇంటికి వెళ్లడానికి అనుమతించలే’దని తల్లికి ఉత్తరం రాసిన మొపాసా... అనతి కాలంలోనే ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పుస్తకాలతో వచ్చిన పేరు, పేరుతో ఒనగూడిన సంపదతో నౌక కొన్నాడు. తన తొలి నవల పేరుమీదుగా ‘బెల్‌ ఎమీ’గా దానికి నామకరణం చేశాడు. అందులో అల్జీరియా, ఇటలీ, ఇంగ్లండ్, సిసిలీలాంటి ఎన్నో దేశాల్లో పర్యటించాడు. తన అపార్టుమెంటులోని ఒక రహస్య మూలను, అందమైన స్త్రీల చెవుల్లో తన సాహసయాత్రలు వర్ణించి చెప్పటానికే వినియోగించాడు. ఫలితంగా సుఖవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది.

‘పళ్లను వదులుచేసి, వెంట్రుకలను రాల్చి, అవయవాల్ని ఛిన్నాభిన్నంచేసి మింగేయడానికి వచ్చే మృత్యువు’ ముంగిట శక్తిలేక కూలబడ్డాడు. ఎలుకను వేటాడే పిల్లిలాగా అది తరుముతూ వుంటే ఎటూ తప్పించుకోలేక  నిస్సహాయుడయ్యాడు. ఏకాంతంలోకీ, స్వీయధ్యానంలోకీ పోవడం మొదలుపెట్టాడు. తీవ్రమైన నిరాశలో గొంతు కోసుకుని ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు.

జీవనశైలిని కాకుండా రాయడం వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే– చలానికి ప్రకృతి వయసు పొడిగించింది కాబట్టి, దాన్ని ఆయన మరింత ‘సార్థకం’ చేసుకున్నట్టుగా కనబడుతుంది; కానీ ఆ అవకాశం మొపాసాకు లేదు. తన 43వ పుట్టినరోజు కూడా చూడకుండానే, జీవితరంగం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, చాలా కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్‌ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ అదే టాల్‌స్టాయ్‌ మెచ్చుకుంటాడు.

‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని రాసుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ గడిపి వెళ్లిపోయాడు.
--------------------------------
5 ఆగస్టు మొపాసా జయంతి
(ఫన్డే 2014)
Thursday, July 24, 2014

ఇన్మార్ బెర్గ్ మన్: లోపలి దర్శకుడుప్రపంచంలోని మేటి దర్శకులెందరో తమకు స్ఫూర్తిగా పేర్కొనే మహాదర్శకుడు ఇన్మార్‌ బెర్గ్‌మన్‌! ‘మూవీ కెమెరా కనుక్కున్నాక, భూమ్మీద జన్మించిన అతిగొప్ప సినిమా కళాకారుడు బెర్గ్‌మన్,’ అంటాడు దర్శకుడు వూడీ అలెన్‌.
మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్‌. తత్వోద్వేగాల సంక్లిష్ట సమ్మేళనంలాంటి ఆయన చిత్రాలకు నిజమైన సినిమా ప్రేమికులు పాఠ్యగ్రంథాల స్థాయినిస్తారు.

మనిషి అంతరంగపు అరాచకత్వాన్ని తక్కువ బడ్జెట్‌తో, పద్ధతిగా, ఏడాదికొక సినిమాగా మలుస్తూపోయాడు బెర్గ్‌మన్‌. సుమారు 45 సినిమాలు! హాలీవుడ్‌ని పట్టించుకోకుండా, తన మాతృదేశం స్వీడన్‌కే ఆయన పరిమితమవడానికి కారణం, లాభనష్టాల గురించి బేరీజు వేయనక్కర్లేని సృజనాత్మక స్వేచ్ఛ! తొలుత రంగస్థలంలో పనిచేసి, స్వయంప్రకాశంతో సినిమాల్లోకి వచ్చాడాయన. వింటర్‌ లైట్, సెవెన్త్‌ సీల్, వైల్డ్‌ స్ట్రాబెర్రీస్, పర్సోనా, క్రైస్‌ అండ్‌ విస్పర్స్, మెజీషియన్, సైలెన్స్, ఫ్యానీ అండ్‌ అలెగ్జాండర్, త్రూ ఎ గ్లాస్‌ డార్కీ... తమ జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమానైనా తీయాలని సృజనశీలురు కలలుగనే క్లాసిక్స్‌!

‘మా ఇంటి పెద్ద కిటికీలోంచి వచ్చే సూర్యోదయాన్ని నేను ‘వినేవాణ్ని’. దూరంగా మోగుతున్న చర్చి గంటల నేపథ్యంలో నాకు వెలుతురు వినిపించేది,’ అంటాడు తన బాల్యంలో దృశ్యానికి ఆకర్షితుడైన తీరును గురించి  బెర్గ్‌మన్‌. పూర్తి సానుకూలంగా లేని చిన్నతనంలో ఆయన్ని భయం, సోమరితనం, నిరాశ, కోపం లాంటి దయ్యాలే ఎక్కువగా పలకరించేవి. ‘ఎప్పుడైతే దయ్యం వాస్తవమో, దానికొక మానవస్పృహ అద్దడం అత్యవసరమైపోతుంది!’ ఒక చిన్న దృశ్యం, ఒక పలకరింపు, ఒక మనిషిపట్ల కలిగే ఉద్వేగం, ఒకరు చెప్పే సంఘటన, ఒక మనిషి ముఖం... అదేదైనా కావొచ్చు, అందులోంచి గుర్తింపునకు రాగలిగే బీజాన్ని ఆయన వృక్షంగా పెంపుచేసేవాడు. మళ్లీ దాన్ని పదాలుగా, వాక్యాలుగా కాగితంలోకి రూపాంతరం చెందించి, తిరిగి ఆ అక్షరాల్ని దృశ్యాలుగా ఆవిష్కరించేవాడు. అయితే, టెక్నికల్‌ వివరాలు, లాంగ్‌ షాట్, క్లోజప్‌ లాంటి మాటలు స్క్రిప్టులో రాయడం ‘బోర్‌’ అనేవాడు. ‘సంభాషణలు మ్యూజిక్‌ నోట్సులా ఉండాలి’. రాయకుండానే అందులోని రిథమ్, టెంపో అర్థం చేసుకోవడం సరైందనేవాడు.

పరిమితమైన అవసరాలతో, పరిమితమైన స్థలంలో జీవించిన బెర్గ్‌మన్‌... షూటింగుకు కూడా పూర్తి పరిచిత, పరిమిత వాతావరణం సృష్టించుకునేవాడు. నటీనటులుగానీ, సాంకేతిక నిపుణులుగానీ ఆయనకు దాదాపుగా అందరూ ‘రెగ్యులర్సే’. గున్నార్‌ జోర్న్‌స్ట్రాండ్, మాక్స్‌ వాన్‌ సిడో, గన్నెల్‌ లిండ్‌బ్లోమ్, ఇంగ్రిడ్‌ తులిన్, లివ్‌ ఉల్‌మాన్, బీబీ ఆండర్సన్, హారియెట్‌ ఆండర్సన్, స్వెన్‌ నైక్విస్ట్‌(కెమెరామన్‌)... ఆయన సినిమాలన్నింటా దాదాపుగా ఈ పేర్లే పునరావృతం అవుతాయి. బృందానికి ‘తల్లి’లాంటి ఆదరణతో టీ, లంచ్‌ సర్వ్‌ చేయడానికి  ఒకామెను నియమించుకుని, ఆమె పేరు కూడా టైటిల్స్‌లో వేసేవాడు. అందుకే, ఒక సందర్భంలో, ‘నేను పద్దెనిమిది మంది స్నేహితులతో పనిచేస్తాను,’ అన్నాడాయన. దానివల్ల, మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సిన పనిలేదు!  పనిలో పూర్తిగా నిమగ్నం కావడానికి అది ఉపకరిస్తుంది! ఇలాగైతే ఒక ఆర్టిస్టిక్‌ కంట్రోల్‌ ఉంటుందని ఆయన ఉద్దేశం!

సినిమాను సాహిత్యపు స్థాయికి తెచ్చిన బెర్గ్‌మన్‌ చిత్రంగా సాహిత్యాన్ని సినిమాగా తీయడాన్ని ఇష్టపడలేదు. అవి రెండూ భిన్నమాధ్యమాలనేవాడు. కానీ తను రాసే స్క్రిప్టును మాత్రం పూర్తిస్థాయి రచనలాగే చేసేవాడు. ఎదుటివారికి అర్థంకావడానికి అంతకంటే మార్గంలేదనేవాడు. చెప్పలేనివి కూడా అర్థం చేయించగలిగే ప్రత్యేక కోడ్‌ ఉంటే బాగుండేదని కూడా తలపోశాడు. అయినా భాషా పరిమితిని దాటి ఆయన ప్రపంచానికి చేరువయ్యాడు. అయితే, విజయానికి ప్రత్యేక విలువ లేకపోయినా, విజయం గొప్పతనం ఏమంటే, అది మనల్ని మనలా ఉండనిస్తుందన్నాడు.
దేవుడివల్ల కాదు, మనిషికి ప్రేమవల్లే విముక్తి దొరుకుతుందని విశ్వసించిన బెర్గ్‌మన్‌ సినిమాలన్నీ ఎవరికి వారు తమ దేహాన్ని నగ్నంగా చూసుకున్నంత ఆశ్చర్యంగా, గొప్పగా, చిత్రంగా, మురికిగా, వాస్తవంగా ఉంటాయి. అందుకే ఆయన్ని ఇష్టపడుతున్నానని ఎవరైనా ప్రత్యేకంగా చెప్పడంలో అర్థంలేదు; అది తమను తాము ఇష్టపడుతున్నామని చెప్పుకోవడమే!

-------------------------------------
జూలై 14న దర్శకుడు ఇన్మార్‌ బెర్గ్‌మన్‌ జయంతి
(ఫన్డే 2014)

 

Wednesday, July 23, 2014

జార్జ్ ఆర్వెల్: రాజకీయ రచయితచాలా చిన్నవయసునుంచే, బహుశా ఐదారేళ్లప్పటినుంచే, పెద్దయ్యాక ఎప్పటికైనా తనకు రచయిత కావాలని ఉండేదట జార్జ్‌ ఆర్వెల్‌కు! ‘ప్రపంచాన్ని ఏదో ఒక దిశకు నడిపించాలన్న బలీయమైన కాంక్షేదో రచయితను కలం పట్టేలా చేస్తుంది’. అలాగే, రాయడమంటే, ‘బిగ్గరగా ఏడ్చి, పెద్దవాళ్లను తనవైపు తిప్పుకునే చిన్నపిల్లల మారాం లాంటిది కూడా!’ ఇంకా ఆర్వెల్‌ ఉద్దేశంలోనే రాయడమంటే... ఒక వేదన. తనను తాను పూర్తి నిర్వీర్యుణ్ని చేసుకునే ప్రక్రియ. ఒక భయంకర జబ్బుతో చేసే పోరాటం. లోపల ఒక దయ్యంలాంటిదేదో కూర్చున్నవాడే రచనావ్యాసంగం జోలికి వెళ్తాడు. ఇంత నొప్పి ఉంది కాబట్టే, యౌవనంలోకి వచ్చేసరికి తనలోని రచయిత కావాలన్న ఆలోచనను విదిల్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడాయన. కానీ అది సాధ్యపడలేదు. పైగా అది తన స్వాభావిక ప్రవృత్తికే విరుద్ధంగా తోచింది. దాంతో రాయడానికి పూనుకోవడమే సరైందన్న నిశ్చయానికి వచ్చేశాడు.

బ్రిటిష్‌ వారి పాలనలో ఉన్న భారతదేశంలో ఎరిక్‌ ఆర్థర్‌ బ్లెయిర్‌గా జన్మించాడు ఆర్వెల్‌. తన రచనలతో తల్లిదండ్రులకు చీకాకుగా మారకూడదన్న ఉద్దేశంతో కలంపేరు ‘జార్జ్‌ ఆర్వెల్‌’ను ఎంచుకున్నాడు. ఉద్యోగ రీత్యా కొంతకాలం బర్మాలో పనిచేశాడు. అనివార్యంగా, సామ్రాజ్యవాదపు సాధనంగా ఉన్నాడు. స్థానికుల మీద తెల్లదొరలకుండే అర్థంలేని ఆధిపత్య కాంక్షనీ, పాలించాలనే ఆరాటమే తప్ప అర్థం చేసుకోలేని బలహీనతనీ దగ్గరగా గమనించాడు. మతమార్పిడి కోసం ఎవరైనా స్థానికుల వేషధారణను అనుసరించినా అదీ కపట నాటకంగానే కనబడేదాయనకు. స్థానికులకూ తనకూ భేదం లేదని చాటే ప్రయత్నంలో ఒక్కోసారి వెర్రి తెల్లవాడిగా మిగిలిపోయే పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు.

ఆయన పేదల్ని దగ్గరగా చూశాడు. స్వయంగా పేదరికాన్ని అనుభవించాడు. అందుకే పేదరికం గురించి... నిపుణులకన్నా పేదరికంలో మగ్గుతున్న తనలాంటి సామాన్యులు మరింత నైపుణ్యంతో కూడిన సలహాలు ఇవ్వగలరన్నాడు.

‘అందరూ సమానమే; కానీ కొందరు ఎక్కువ సమానం’. పశువుల మీద మనిషి చలాయించినట్టుగానే, పేదల మీద ధనికులు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఆ అన్యాయాన్ని సహించకూడదు! అయితే, అధికార దాహం గల మనుషుల వల్ల ఏ పోరాటమైనా కేవలం ‘నేతల మార్పిడి’కి మాత్రమే పరిమితమవుతుందని ఆయనకు తెలుసు. అందుకే, బ్రిటన్‌ సామ్రాజ్యవాదం కన్నా నాజీ జర్మనీ దుర్మార్గమైంది; అలాగే జర్మనీతో పోలిస్తే తక్కువ ప్రమాదకారి కాబట్టి, రష్యాకు మద్దతిస్తానన్నాడు. అదే సమయంలో, తనను తాను ప్రజాస్వామిక సామ్యవాదిగా  ప్రకటించుకున్నాడు. జీవితకాలం నిరంకుశత్వంపై నిబద్ధతతో పోరాడాడు. రష్యాను పూర్తి ఏకాధిపత్య పాలనా క్షేత్రంగా మార్చిన స్టాలిన్‌ను పూర్తిస్థాయిలో తిరస్కరించాడు.

ఆయుధాల చరిత్రే చాలావరకు నాగరికత చరిత్ర, అన్నాడు ఆర్వెల్‌. క్షణంలో ప్రపంచాన్ని బుగ్గి చేసే అణుబాంబును వ్యతిరేకించాడు. శాంతికాని శాంతిని తెచ్చే ఆయుధమేటను నిరసించాడు. ఆర్వెల్‌ రచనలన్నీ రాజకీయకోణంలో రాసినవే. అసలు కళకూ, రాజకీయాలకూ సంబంధం లేదనడం కూడా రాజకీయమేనంటాడు. అయితే, ఆ రాజకీయ రాతల్ని కూడా కళాత్మకస్థాయికి చేర్చాలనేది ఆయన సంకల్పం. అలా దగ్గర చేయగలిగినందువల్లే, ఆయన పుట్టించిన పదబంధాలు, ‘కోల్డ్‌ వార్‌’, ‘బిగ్‌ బ్రదర్‌’ లాంటివి సాహిత్యంలోంచి రాజకీయపరిభాషలోకీ  ప్రవేశించగలిగాయి.

ఆర్వెల్‌కు చక్కగా కాచిన టీ అంటే ఇష్టం. ఘాటైన పొగాకుతో స్వయంగా తానే చుట్టుకునే సిగరెట్లంటే ఇష్టం. జంతువుల్ని పెంచుకోవడమన్నా ఇష్టం. అలాగే, ప్రకృతి! ‘వసంతాగమనాన్ని ప్రేమించనివాడు, కార్మిక సంక్షేమ ఉటోపియాలో మాత్రం ఎందుకు సంతోషంగా ఉంటాడు!’

భార్య చనిపోయాక, స్త్రీ ఆదరణలేక ఒంటరితనంలో మగ్గాడు. పాత స్నేహితులతో రిజర్వుడుగా ఉండటం, పూర్తి కొత్తవారితో అరమరికలు లేకుండా మాట్లాడటం ఆయన చిత్రమైన ప్రవర్తన! వ్యక్తిగత అవసరాలను చాలా పరిమితం చేసుకుని, దుస్తుల విషయంలో స్వయం క్రమశిక్షణ పాటించి, ‘మనకాలపు సన్యాసి’ అనిపించుకున్నాడు.

‘యానిమల్‌ ఫామ్‌’, ‘1984’ లాంటి రచనలతో అమితమైన కీర్తిని గడించిన ఆర్వెల్‌– క్షయవ్యాధితో 46 ఏళ్లకే తనువు చాలించాడు.

నిజానికి ఆర్వెల్‌ రూపం మీద ఎవరికీ ఫిర్యాదు లేకపోయినా, తనను తాను ఆయన ఎప్పుడూ అందగాడిగా  భావించుకోలేదు. అది కొంత మథనాన్నే మిగిల్చిందాయనకు. అయితే, ఆయన సృష్టించిన వచనపు అందాన్ని మాత్రం చివరకు ఆయన కూడా వేలెత్తి చూపలేడు!
––––––––––––––––––––––––––
జూన్‌ 25న రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ జయంతి
(ఫన్డే 2014) 

Tuesday, July 22, 2014

సురవరం ప్రతాపరెడ్డి: సాంఘిక చరిత్రకారుడు‘మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే’నంటూ చరిత్రను సామాన్యీకరించి, దానిలో ఆత్మమాంసాల్ని నింపారు సురవరం ప్రతాపరెడ్డి. ‘రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో,  ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే!’ అన్నారు సురవరం– ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పీఠికలో.

‘తెనుగు సారస్వతము, శాసనములు, కైఫీయత్తులు, నాణెములు, సామెతలు, దానపత్రములు, సుద్దులు, జంగమకథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు’ ఇలాంటి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములను సమగ్రదృష్టితో చూస్తూ, నిఘంటువులలో లేని పదాలకు అర్థనిర్ణయం చేస్తూ, ‘ఒక జీవితకాలపు ముక్తఫలం’ వంటి గ్రంథరాజాన్ని తెలుగునేలకు కానుక చేశారు.

ఇంకెన్నో జీవితాలకు సరిపడిన సాఫల్యతను కూడా ఆయన అందుకున్నారు. ‘ప్రచారకుడుగా, పరిశోధకుడుగా, విద్యార్థి వసతిగృహ నిర్వాహకుడిగా, న్యాయవాదిగా, పత్రికా రచయితగా, పుస్తక ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అనేక ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రోత్సాహకుడిగా’ అనేక పాత్రల్లోకి పరిణమించిన ప్రతాపరెడ్డి... అప్పటి కాలం విసిరిన సవాలుకు ఒక దీటైన జవాబు.

సాహిత్యమూ రాజకీయమూ విడదీయలేని కాలంలో, తెలంగాణను తట్టి మేల్పొల్పవలసిన సందర్భంలో ‘గోల్కొండ’ పత్రికను నడిపారు. సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్‌ ఎడిటర్, ప్రూఫ్‌ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు. తానూ మూడు నాలుగు కలంపేర్లతో రాశారు. అత్యధిక ప్రజానీకపు భాషకు మన్నన దక్కని వాస్తవాన్ని మ.ఘ.వ.(మహా ఘనత వహించిన) నిజాం ప్రభువువారికి మరాఠీలు, కన్నడిగులను కూడా కలుపుకొని ఇలా నివేదించారు: ‘తమ మాతృభాషలను ప్రేమించుట ఉర్దూవారికివలెనే ఇతర మూడు భాషల వారికిని సహజమనుట గమనించవలసియుండును’.

‘రెండు కోట్ల రూపాయీల’ పైబడిన వ్యయంతో భాగమతి కోసం ఖులీ కుతుబ్‌షా తలపెట్టిన భాగ్యనగరం నిర్మాణం గురించి పాదుషా ఆజ్ఞను ఇలా ప్రస్తావిస్తారు: ‘గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. ఆమిర్లకు ఇబ్బందిగావుంది. నదికి అవతలిభాగంలో నగరనిర్మాణం చేయవలసింది. నాలుగుబాటలు నాలుగువీధులుండవలెను. నాలుగు కమానులు నాలుగుదిక్కుల కట్టవలెను. 14000 దుకాణాలుండవలెను. 12000 మొహల్లాలు(వాడలు) ఉండవలెను’.

తెలంగాణలో కవులే లేరన్న విమర్శకుగానూ 354 మంది కవుల కవితలతో కూడిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ద్వారా ఆరోగ్యకరమైన సమాధానమిచ్చారు. అశ్లీల కథలుగా ముద్రపడి తిరస్కరణకు గురవుతున్న చలం కథల్ని ధైర్యంగా ‘సుజాత’లో ప్రచురించారు.

సంస్కృతం, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలు తెలిసిన ప్రతాపరెడ్డి ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషములు’, ‘హైందవ ధర్మవీరులు’, కథలు, వ్యాసాలు రాశారు. మతపరమైన అంశాలు రాసినప్పుడు, ఆయనలోని ఆస్తికుడిని హేతువాది త్రోసిరాజన్నాడు. ‘ఇట్టి విమర్శ పూరాచారాభిమానులకు సరపడిద’నీ, వారికి ఆగ్రహము కలుగునని ఎరిగినప్పటికీ... చారిత్రక విమర్శలలో ఆగ్రాహానుగ్రహములకు తావులేదని కూడా ఆయన ఎరుగును.

హెదరాబాద్‌ రాష్ట్ర శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన ఈ నిక్కమైన వైతాళికుడు, ‘ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నావంటివారు ఏమియును పనికిరారు’ అని బాధపడ్డారు. కానీ సాహిత్యపు వీధుల్లో ఆయన అధిరోహించిన పల్లకీకి భుజం ఆనడానికి సిద్ధపడేవాళ్లెందరో!

––––––––––––––––––––––––––––––––––––––––
మే 28న రచయిత, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి

(ఫన్డే 2014)

Monday, June 2, 2014

మణిరత్నం: మణి!
అందరికీ అవే విశేషణాలు వాడి, మణిరత్నానికీ అవే ప్రయోగించాలంటే– దగ్గరి బంధువు కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏమీ వండలేకపోతినే అని చింతించే ఇల్లాలు గుర్తొస్తోంది. నిశ్శబ్దంగా మంచుతెరను దాటుతూ, ఎక్కడో పసుపు వర్ణపు పూవును సుతారంగా తాకుతూ, దూరంగా వినిపిస్తున్న రైలుకూతతో మేఘాల్లోకి మేల్కొంటూ... మణిరత్నం దృశ్యం అందంగా ఉంటుందన్నది మామూలు విషయమే. కానీ అందగత్తె మరింత వన్నెలద్దుకున్నట్టుగా ఉంటుంది(ఒక్కోసారి, ఆభరణాలే అతివను కప్పేయొచ్చు కూడా!). భారతదేశానికి వెలుపల– అడ్రియన్‌ లైన్, కీస్లోవ్‌స్కీ, మాజిది మాత్రమే ఇలాంటి మ్యాజిక్‌ చేశారనిపిస్తుంది.

నటులంతా అప్పుడే కొత్తగా జన్మెత్తినట్టు కనిపిస్తారు ఆయన సినిమాల్లో. పిల్లల్నుంచి నటన రాబట్టుకోవడంలో ఏ తాయిలాలు ఇవ్వజూపుతాడో అంతుపట్టదు. అంజలి, అమృత, గీతాంజలి, బొంబాయి, నాయకుడులో పిల్లలు మాత్రం! ‘కొన్ని పాత్రలేవో లీలగా మనసులో కదలాడుతాయి. ఇక అవి నన్ను సాధిస్తాయి, ఉత్సాహపరుస్తాయి, కష్టపడతాయి, మోహపడేలా చేస్తాయి... అది సినిమా అవుతుందో అవదో! అయినా ఆ నోట్సంతా రాస్తూవుంటాను. ఎప్పుడో ఒకసారి ఇక ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. సంభాషణలు రాయడానికి కూర్చున్నప్పుడు మరింత స్పష్టత వస్తూవుంటుంది. కానీ దానికి తుదిరూపం మాత్రం దానికివ్వాల్సినంత పరిధిని ఇచ్చే నటులవల్లే వస్తుంది. అందుకే నటుడు, నటి తమకే సొంతమైనదేదో ఆ పాత్రకు కలపాలనుకుంటాను,’ అని చెబుతాడాయన సినిమాకు సిద్ధపడే తీరూ, నటులనూ గురించి. ‘రోజా’ తెరమీదకు రావడానికి ఏడేళ్లకు ముందునుంచీ తన లోలోపల ఆలోచన సాగుతూనేవుందట!

ఎప్పుడూ ఇంపుగా ధ్వనించని శేఖర్‌ అనే మామూలు పేరుకూడా కేవలం మణిరత్నం పెట్టాడు కాబట్టి ప్రియమైపోతుంది. అర్జున్‌ తండ్రి శేఖర్‌... కబీర్‌ నారాయణ తండ్రీ శేఖరే!

పోలికతో ఉన్న సమస్యేమిటంటే, అది అసలైన మనిషిని కప్పేస్తుంది. కానీ ఒకమేరకు అంచనా వేయడానికి పనికిరావొచ్చు. సావిత్రి–సత్యవంతుడు, దుర్యోధనుడు–కర్ణుడు, రావణుడు–సీత... ఒక్కోసారి, ప్రాచ్య ఇతివృత్తాలకు పాశ్చాత్య ఆధునికత అద్దిన రవివర్మలా తోస్తారు మణిరత్నం. తమిళ రాజకీయాలు, క్యాన్సర్‌ మరణాలు, కశ్మీర్, బొంబాయి, శ్రీలంక, ఈశాన్యం, వరదరాజ మొదలియార్, ధీరూభాయ్‌ అంబానీ... లోగొంతుకల అబ్బాయిలూ, కీచుమనే అమ్మాయిలూ, వెలుగు నీడలూ, మౌనరాగాలూ వీటన్నింటికీ సాహిత్యమో, జీవితమో దన్నుగా ఉంది కాబట్టే అవి తాత్కాలికంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో కట్టిన మేడల్లా కాకుండా ఇప్పటికీ నిలబడగలిగాయి.
జాలర్ల నేపథ్యం తీసుకుంటే... వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వానలు పడినప్పుడు ఏం చేస్తారు? పడవలు ఎక్కడ ఉంచుతారు? వలలు ఎక్కడ తగిలిస్తారు? ‘పాత్రికేయుడు, న్యాయవాదిలాంటివాడే దర్శకుడు కూడా’!

సినిమా దానికదే జరిగే అద్భుతం అనుకునే బాల్యపు భ్రమ నుంచి బయటపడి, ‘సినిమాను కూడా ఎవరో ఒక మనిషి నిర్దేశిస్తాడు’ అన్న జ్ఞానోదయం కలిగాక, సహజ పండితుడిలాగా ‘పల్లవి–అనుపల్లవి’(1983)తో తన ప్రస్థానం ప్రారంభించాడు మణిరత్నం. మితంగా, హితంగా, సున్నితంగా... ప్రేక్షకులకు కొత్తగా చూడటం నేర్పాడు. ‘సఖి’లో ఇద్దరు తండ్రులు మాట్లాడుకున్నప్పుడు, అసలు ఇందులో ఘర్షణ ఎక్కడుందీ అనిపిస్తుంది! చాలదా, ఒక్క పెళుసుమాట!

అయితే, ఇదంతా శ్రీధర్, బాలచందర్, భారతీరాజా, మహేంద్రన్‌ లాంటివాళ్లు పరిచిన బాటని ఆయనకు తెలుసు.
ఇదేకాదు, ఒక భాష సినిమాను మరో భాషలోకి డబ్‌ చేయడంలో కోల్పోయే ‘ఎలాస్టిసిటీ’ ఆయనకు తెలుసు; చాలా ఆత్మవిశ్వాసంతో మొదలయ్యే ప్రాజెక్టు కూడా విడుదలకుముందు అభద్రతకు గురిచేస్తుందని తెలుసు; స్క్రిప్టు దశనుంచి చివరిదాకా ఉండాల్సినంత సత్యంగా ఉన్నామా అని మథనపడాల్సివచ్చే అనివార్యపు రాజీలు తెలుసు!

‘కాటుక కళ్లతో కాటు’ వేసే ప్రధానస్రవంతి మాయలో చిక్కుకుని, మరో సత్యజిత్‌ రే కాగలిగీ మణిరత్నంగా మిగిలిపోయాడే అని దిగులు వేస్తూంటుంది. కానీ ఆయనంటాడూ: ‘కమర్షియల్‌ సక్సెస్‌ అనేది దానికదే చెడ్డది కాదు. ప్రధానస్రవంతిలో ఉండటమంటే మూర్ఖంగా ఉండటం కాదు. తార్కికంగా, కళాత్మకంగావుంటూ కూడా ప్రధాన స్రవంతిలో పనిచేయొచ్చు’. దీన్నీ ఒప్పుకోవాలేమో! మరి, ‘టైమ్‌ 100 ప్రపంచ గొప్ప చిత్రాల జాబితా’ను గనక ఒక ప్రమాణంగా అంగీకరిస్తే... అందులో, భారతీయ సినిమాకు ప్రాతినిధ్యంగా, పథేర్‌ పాంచాలి(సత్యజిత్‌ రే), ప్యాసా(గురుదత్‌)తోపాటు ఉన్నది మణిరత్నం ‘నాయకు’డే!


–––––––––––––––––––––––––––
జూన్‌ 2న దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు
 
(సత్వం శీర్షికన సాక్షి-ఫన్డేలో జూన్ 1, 2014న ప్రచురితం)

Tuesday, May 20, 2014

మన చలం
మెడలో మల్లెపూల దండ వేసుకుని, వాటి పరిమళం పక్కవాళ్లకూ పంచుతూ, తెనాలి వీధుల్లో తిరిగిన చలం సాయంత్రాల్ని ఒకసారి ఊహలోకి తెచ్చుకుంటే...! 
సాక్షాత్తూ ఆనందరూపుడిగా కనబడతారు చలం. ఆయనకన్నీ, అంతటా ఆనందమే! ఊయల్లో ఉత్తినే కాళ్లూపుకుంటూ గడిపే పసిపిల్లల్ని చూసినా, పంది వెంబడి పడి రాయితో బెదిరిస్తున్న తుంటరి బాలుడిని కాంచినా, పరికిణీ రెపరెపల్తో, మువ్వల సవ్వడుల్తో వయ్యారాలుపోయే కన్నెపిల్ల ఎదురైనా, ఇంకా ఉడతలూ గోరింకలూ భీమిలి సముద్రమూ నక్షత్రాల వెలుగూ... దేనికైనా బాధపడటానికి ఏముందని? ‘అసలు బాధలో అంత బాధ లేదు’.

ఏనాడూ రచనల్లో ‘ఎంగిలి మాటలు’ వాడని చలం, అనవసర పదం ఒక్కటి అదనంగా రాసినా నేరమేనన్న చలం, తానే సాహిత్యంగా బతికిన చలం– మైదానం, పురూరవ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, శశిరేఖ, అమీనా, అరుణ... కథలు, నవలలు, వ్యాసాలు, సంభాషణలు, ప్రేమలేఖలు, ఉత్తరాలు, కవితలు, మ్యూజింగ్స్‌... ఏ రూపంలోనైనా ఆనందం చుట్టూ తాను తిరుగుతూ, అక్షరాల చుట్టూ పాఠకుల్ని తిప్పాడు, దోసిళ్లకొద్దీ జీవనరసం తాగిస్తో. ఒక్కోసారి ‘గీతాంజలి’ని చలమే రాసి తమాషాకి టాగూర్‌ పేరు పెట్టాడేమోనని అనిపించదూ!

జీవితాన్ని ఏలుకునే తెలివిడిలేనివాళ్లకు మళ్లీ గుడిపాటి వెంకటాచలమే వచ్చి అన్నీ చెప్పాలని ఉడుక్కున్నాడు. ‘ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏదీ చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’ అని మనుషుల సౌందర్యలేమినీ, వేగపుయావనీ నిరసించాడు.

ఆయన్ని ఎవరు ఎలా ఆరాధించినా, ప్రత్యేకించి స్త్రీవాదీ, పురుషవాదీకాని స్వేచ్ఛావాది... చలం. ఆయన ఎంపిక స్వేచ్ఛను కోరుకున్నాడు. స్త్రీ పురుషులు సమానంగా, హిపోక్రసీ లేకుండా, ఒకరి చిరునవ్వుతో ఒకరు హృదయాన్ని వెలిగించుకుంటూ, ఒకరి ప్రపంచం మరొకరయ్యేంత గాఢంగా జీవించే కలగన్నాడు; ఒక్కోసారి అది తాత్కాలిక నీతిచట్రంతో భేదించేదే కావొచ్చుగాక!

ఇప్పటి ‘నైతిక ముద్ర’ అప్పటి ఆయన గాయాలకు లేపనం ఎటూకాలేదుగానీ... ఆయన పొందినట్టుగా కనబడిందంతా ఆయన పొందాలనుకున్న కల్పనేనేమో! స్త్రీ లాంటి ఒక బలమైన ఇచ్ఛేదో లేకుండా రోజువారీ బతుకులోని నిస్సారత ఆయనకు తెలుసు. అందుకే అంటాడు: ‘నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను’.

ఆయన స్వేచ్ఛ జీవితానికీ, కళకూ కూడా సంబంధించినది: ‘ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకరతిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం, క్రమంగా అతని ఆత్మలోకి పాకి, అతని జీనియస్‌ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది’.

ప్రేమికుడినుంచి అన్వేషిగా, అన్వేషకుడినుంచి ఆధ్యాత్మికుడిగా రూపాంతరం చెందుతూ... అసలు తొలినుంచీ అన్నీ ఆయనలో కలగలిసే ఉన్నాయి, ఆయన వచనంలోనే కవిత్వం మిళితమైనట్టుగా! అందుకే, తనలో ఉన్న చీకటినే కాగితం మీద పెట్టానేతప్ప ఏ బోధలూ చేయడం కోసం కాదన్నాడు. చీకాకు పరిచే ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి ఎప్పటికి కుదురుతుందోనని వాపోయాడు. సత్యం లోపల్నుంచే దొరకాలి తప్ప, బయటెక్కడో కాదన్నాడు. చలం అనేవాణ్ని మరిచిపోయేంతగా నిత్యనూతన జీవితాన్ని, పాత మకిలి లేని జీవితాన్ని అభిలషించాడు. తనలో ఉన్న ప్రశ్నలకు ఒక మేరకైనా సమాధానపడాల్సిన పక్వస్థితికి వచ్చాక ‘అరుణాచలం’లో స్థిమితపడ్డాడు.

‘మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్లీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?’
తనలోని చివరి ప్రశ్నలు, వాటికి దొరికీ దొరకని సమాధానాలతోనే కన్నుమూసిన చలం– ఎక్కడైనా నిజంగానే మేలుకున్నాడేమో! ఈ జీవితపు కొనని అక్కడ అందుకుని ఇదంతా కలని చెప్పేందుకు కాచుకుని కూర్చున్నాడేమో!

–––––––––––––––––––––
మే 19న రచయిత చలం జయంతి
 
(సత్వం శీర్షికన ఫన్డేలో 18-5-2014న ప్రచురితం.)

Thursday, May 1, 2014

ఉద్యమం - పాలన

"Agitation is all about poetry, governance is all about prose." 
- జైరామ్ రమేశ్.
ఈ వ్యాఖ్య నేను ఎలాగో మిస్సయ్యాను. పాత వీక్(ఫిబ్రవరి 2, 2014) తిరగేస్తుంటే Point Blankలో కనబడింది. ఇది చెప్పిన సందర్భం ఏమిటో కొంత ఊహించగలిగేదే! అయినా గూగుల్ ఉన్నది ఎందుకు!
ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జనవరిలో చేసిన వ్యాఖ్యానం అది. 
మొత్తం వ్యాఖ్య ఇది: 
"Agitation is all about poetry, governance is all about prose." 
(They have not made the transition from being agitators to administrators.)

ఆయన చెప్పిందాన్నే తిరగేస్తే కవిత్వాన్నీ, వచనాన్నీ ఇలా నిర్వచించుకోవచ్చేమో! 
Poetry is all about Agitation; Prose is all about Governance.Saturday, March 15, 2014

Native Touch

రియాలిటీ చెక్ పుస్తకంపై 'ద హిందూ' పత్రిక 'ఫ్రైడే రివ్యూ' పేజీలో మార్చ్ 14, 2014న వచ్చిన పరిచయం.
-------------------------------------------------------------------------------------------------

Poodoori Raji Reddy's book is a journey through his journeys as he traverses from the public to the personal, in 59 weeks in the form of a series that were published in a Telugu daily newspaper. The journey is more in the mental arena, recreating familiar places with a novel perspective, and with words that mesmerise and draw us in.
In lucid Telugu, the writer embarks on an experiment to conduct a reality check on what we see around us everyday, so that we review everything aroud us in a new light.

Reality Check
Poodoori Raji Reddy;
Tenali Prachuranalu;
Kotha Peta, Tenali; Rs. 250

Tuesday, March 11, 2014

క్రియేటివ్ కిక్!

రియాలిటీ చెక్ పుస్తకం పైన ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో మార్చ్ 9, 2014న వచ్చిన రివ్యూ.
పై హెడ్డింగ్ రివ్యూకు పెట్టినదే!
---------------------------------------------------------------------------------------------

అన్నీ అరవిచ్చిన మల్లియలే. పూదోటకే అందం. గర్భగుడిలోనే గుబాళింపు. సుకుమారి సిగలోనే నిగారింపు. అన్నీ తెలిసిన విషయాలే. అందంగా చెప్పడంలోనే ఒకింత తుళ్ళింత, పరవశం. భాగ్యనగరంలోని బతుకు పోరాటాలను ఒక్క చోట గుదిగుచ్చిన పుస్తకమిది. విషయ లోతులను స్పృశించనప్పటికీ, వాటిని తనకు అవసరమైన మేరకు అవగాహన చేసుకోవడంలో రచయిత కృతకృత్యుడయ్యారు. తన భావాలను అక్షరీకరించడంలో సఫలమయ్యారు. ఇందులో ఉన్న అరవై అంశాలు వేటికవే ప్రత్యేకం. ఇరానీ హోటల్ నుంచి గుడి, బడి, ఆసుపత్రి, శ్మశానం వరకు అన్నింటినీ తనదైన పద్ధతిలో తడిమారు. వ్యక్తీకరణలో వైవిధ్యం ఉంది. పలకరింపులో ఆత్మీయత ఉంది. అంతకుమించి హుందాతనం ఉట్టిపడుతోంది. అన్నింటినీ తనే చెప్పాలనుకోవడం ఇక్కడ ప్లస్ పాయింట్. దాంతో వేరొకరి వ్యాఖ్యానాల అవసరమే కలగలేదు.
'చీకటి కలువలు'లో చెత్త ఊడ్చేవారికి కొంగుపరుస్తుందని ఒకామె మరొకరిని దెప్పిపొడిచినప్పుడు, వాళ్ళు మనుషులు కాదా అన్న సూటి సమాధానం. 'లేడీ కండక్టర్'లో విసుగుతో ఆమె ఒక ప్రయాణికుడిని గద్దించినప్పుడు - ఓర్నాయనో! ఈమె సున్నితత్వాన్ని ఉద్యోగం ధ్వంసం చేసినట్టు ఉందంటూ ముక్తాయింపు. ఇలా ఎక్కడికక్కడ విషయ వివరణకు మించి రచయిత పదునైన వ్యాఖ్యలు కాలమ్‌కు అందం తెచ్చాయి. భాషపై, భావాలపై అనురక్తి ఉన్న పాఠకులకు ఇది మంచి పుస్తకం. అత్యంత అందంగా పుస్తకాన్ని తీసుకువచ్చిన ప్రచురణకర్తలకు అభినందనలు.

- మద్దిపట్ల మణి

రియాలిటీ చెక్, పూడూరి రాజిరెడ్డి
పేజీలు : 365, వెల : 250
ప్రతులకు : తెనాలి ప్రచురణలు, తెనాలి, సెల్ : 95509 30789

Saturday, March 8, 2014

కినిగె పత్రికలో నా బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ

రియాలిటీ చెక్ విడుదలైన సందర్భంగా ఫిబ్రవరి నెల 'కినిగె పత్రిక'లో వచ్చిన ఇంటర్వ్యూ ఇది.

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: పూడూరి రాజిరెడ్డితో
Saturday, February 22, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-3: కారా మాష్టారు

ఫిబ్రవరి 8, 2014న శ్రీకాకుళం కథానిలయంలో కథానిలయం తరఫున రియాలిటీ చెక్ పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుగారు ఆవిష్కరించారు. ఇది పూర్తిగా కథానిలయం నిర్వహించిన సమావేశాల సమాహారం.
అయితే ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయాను. పుస్తకాన్ని ఆవిష్కరించిన తరువాత కారా మాష్టారు మాట్లాడారు. ఆ మాటల్ని రికార్డు చేసి "విన్నవి విన్నట్టుగా...'' రాసి పంపారు పుస్తక ప్రచురణకర్తల్లో ఒకరైన సుధామయి గారు. దాన్నే ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
--------------------------------------

తేదీ సరిగా జ్ఞాపకం లేదుగానీ ఒక రెండు వారాలో... క్రితం... మూడు వారాలో... జ్ఞాపకంలా నాకు డేటు... ... అదీ... తుమ్మేటి రఘోత్తమరెడ్డి అనీ... ... ఉన్నారు. ఆయనా... ఈ పుస్తకం మేష్టారూ, మీరు తప్పక చదవాలీ... అన్నాడు. ఎంచేతంటే, నా చూపుతోటి ఇబ్బందుందీ... పగలు తప్ప రాత్రి చదవలేను... కథానిలయంకొచ్చే ఏ పుస్తకమైనా సరే, నేనిక్కడుంటే నేంచూడందే కథానిలయానికి మావాళ్లు తీస్కెళ్లరూ... అంచేత... అలాగ.. ఏదైనా ఒక పుస్తకం
చదువుతూ కొన్నికొన్ని చూసి, ఆ తర్వాత నేను పెట్టేస్తుంటాను.
ఇదీ... ఆ.. చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలో ఎన్నో... చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలూ చదవాలీ అంటే - మరీ ఎక్కువుండదు - మూడేసి పేజీలు. మాగ్జిమం నాలుగు పేజీలు... కదమ్మా?
(తలూపాను.) అలా వుంటుందన్నమాట.

అంచేత మొదటగా చూశా...న్నమాట. అరవైలోనూ ఏం చైడమని ఒకటేదో ఒక హెడ్డింగ్ బాగున్నదీ... ఆ... తెలంగాణా సంబురం... ('ఏమ్మా?'... 'అవునండీ'...) తెలంగాణా సంబురం అనీ అలాంటి హెడ్డింగ్‌తో ఉంది. అక్కడి
వంటకాలూ అవీ, ఏమొండుతారూ పండుగల్లోనీ, అవెలాగుంటాయీ... వాటిమీద.
నాకు అన్నిటికన్నా బాగా ఆ... ... ఆకర్షించిందేంటంటే ఎఖ్క... డానూ రచయిత అవుపళ్లా! రచయిత గొంతుకు మాత్రమే వినపడుతూ ఉంది. అదీ... ఆ గొంతుకు... వినపడిందా అంటే... తర్వాత .... చదివింతర్వాత... రచనకు అనుగుణమైన గొంతుక... ఎవరు ఈయనా? అనుకున్నాను...
తర్వాత అడిగితే ఫలానా అని చెప్పారు. ఆయన పేరు నేనెప్పుడూ వినలేదు. ఎంచేతంటే నేను పత్రికల్లో వచ్చే కథలు చదూతాను తప్ప సీరియల్స్ చదవను. రెండోది... ఉమ్... అలాగే ఫీచర్స్ కూడానూ... నేనూ... కాలక్షేపం కోసం పేజీలు నింపటానికి రాస్తారని నా అభిప్రాయం... అంచేత ఎప్పుడూ ముట్టుకునేవాడ్ని కాను.

చదివింతర్వాత ఎవరితనూ... ఏంచేస్తుంటాడు... ఇవన్నీ రఘోత్తమరెడ్డికి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆ... ఆరు చదివాను. ఆరులోనూ ఒకటి కూడానూ ఇబ్బంది పెట్టలేదు. పైగా ఇంకా చదవాలనే ఉంది. కానీ, నాకు ఒకేసారి ఐదారు పుస్తకాలు ఉంటయ్. అలాంటపుడు పక్కనబెడ్తాను. ఇది ఇప్పటికీ కథానిలయంలోకి వెళ్లలేదు, నా గదిలోనె ఉంటది. అదీ దీని గురించిన నా అభిప్రాయం.

తర్వాత ఇంకోటేంటంటే, ఆ... ఆ... ఇరానీ హోటల్... అనీ ఒకటుంటది. ఇర... ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు... ఆ రెండున్నర గంటల్లో నిన్ను... ఆయనేంటేంటి చూశాడు... ఏంటేంటి విన్నాడు... ఏం..టేంటి... అలాగ... ఎవరెవరొచ్చారు... ఏంటేంటి విన్నాడు.... ఏరకంవాళ్లొచ్చారు... అంటే... మనిషిని ... ఆ... మనిషిని పోలిన మనిషిగాని... గొంతుకుపోలిన గొంతుక్కాని... వాక్యాన్ని పోలిన వాక్యంకాని... లేకుండా... కొన్ని వందలమంది... ఆ రెండున్నరో మూడు పేజీల్లొనే కొన్ని వందలమంది నా కళ్లముందున్నారు.
నేను హైదరాబాదు కథానిలయం పనులమీద వెళ్లినపుడు ఇరానీ హోటల్‌కి తప్పకుండా వెళ్తుంటాను. అదీ... ఒక ప్రత్యేకమైన ఇదండీ... ఆ... పేరు జ్ఞాపకం రాటంలేదూ... ఆ లాడ్జ్ దగ్గర.... నేనెక్కువగా బసచేసేవాడ్ని. అక్కడ దగ్గర్లో ఉండేది ఇదీ... ఈ... పర్టిక్యులర్స్ తెలియవండీ... అక్కడా... మన విశాఖపట్న్.... హైదరాబాదులో ఉండేటువంటి రచయితలూ, కథకులూ అందర్నూ... ఫలానా ప్రతిరోజూనూ లేదంటే ఫలానా పర్టిక్యులర్ ఏదో ఒక హౌస్‌లో ఫలానాదగ్గర మీటవుతారని తెలుసూ... అలాంటి చోటుకి నేను తప్పకుండా వెళ్లేవాడ్ని. నేను అన్నిసార్లూనూ హైదరాబాదుతో పరిచయం చేసుకున్నానుగానీ... దీంట్లో నాకు పరిచయమైనంతగా ఆ హోటల్ లైఫ్ అన్నది నాకు పరిచయం కాలే!

అలాగే... అక్కడా... వెంకటేశ్వరుని దేవాలయం ఉందిగదా... ఆ దేవాలయం మీదకీ.... ఆ... వెళ్లేన్నేను... చూసేను... అవన్నీ అయ్యాయ్.... కానీ నేను గమనించనివి ఎన్నో ఉన్నయ్. ఎంతసేపూ తెల్లబట్టలేసుకోని... పట్టుబట్టలేసుకోని దేవాలయానికి వెళ్లేవాళ్లు నాకవుపడ్డారు కానీ, ఉత్పత్తి జనం అవుపళ్లేదు. ఈయన వాళ్లనీ, వాళ్లనే ప్రధానం చేసి .... వాళ్లందర్నీ చిత్రించాడు. అలాగే ప్రతీ వ్యాసంలోనూ అలాగే ఉంటుంది. అంత బాగా... అంటే... ఆ... తక్కువ పేజీల్లో అతి తక్కువ వాక్యాల్లో అతి ఎక్కువ పరిచయం చేసేటువంటి అతని శిల్పమే బ్రహ్మాండమైంది. అందుగురించి నేనా విషయం రఘుకి ఫోన్ చేస్తే, మేష్టారూ, ఈ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలీ... ఇక్కడ నాతో ఏం చెప్పారో అదే అక్కడ చెప్పండి...

ఆ... ఇదీ... పూడూరి రాజిరెడ్డి ఎవరో నాకు తెలియదూ... మీరూ తెలుసుకోవలసిన అవసరం లేదు. కానీ, హైదరాబాదే కాకుండా తెలంగాణాలో అనేక ప్రాంతాలు, ఇతర చోట్ల అనేక ప్రాంతాలు, అక్కడి జీవితం... ఎ... ఎన్నో ఎన్నో... చెప్పలేవండీ... ఎంతోమందితో మీకు పరిచయమవుతుంది. ఒక్కొక్క వాక్యంతోనే ఒక మనిషిని రూపుకడతాడు. స్వభావాన్ని... .... అలా నాకనిపించింది. ఇది నా అనుభవం. ఇదే కరెక్టని నేననుకోను. ఎంచేతంటే ఏదైనా జరిగినపుడు తమ జీవితం తాలూకు ఉండేటువంటి పరిచయం... లోకంతో ఉండేటువంటి పరిచయం... వయసు... తరవాతా... ఇంకా అనేకమైనవీ... చదువూ, ఆసక్తీ... ఇట్లాంటివి... ఒక్కొక్కళ్లకూ ఒక్కోలాగా ఉంటయి. అందరికీ ఒక్కలాగు ఉండవు. అంచేత అందరికీ ఏ రచనైనా ఒక్కలాగా అనిపించకపోవచ్చు. నిజంగా... ఇందాకా... మా... అర్నాద్ రచన గురించి అంతసేపు ఇంతమంది మాట్లాడుతుంటే ముఖ్యంగా వివినమూర్తి కూడా అలాగ మాట్లాడుతుంటే నాకాశ్చర్యమేసింది. ఎందుకింత చెప్తున్నారు? అని. అయితే దానికొక కారణముంది. కథానిలయానికి బీజం పడ్డానికి ఆ రోజుల్లో ఒక కొన్ని గైడ్‌లైన్స్... ఆ అభిమానం నన్నేకాదు... వివినమూర్తిని కూడా ఎంతో కట్టిపడవేసింది. ఇదీ అంతసేపు మాట్లాడటానికి కారణం. దాసరి రామచంద్రరావైనా అటువంటి కారణంచేతే మాట్లాడి ఉంటాడని నేననుకుంటున్నా. అదీ... అంచేత... దీని...

ఇంకో తమాషా ఏమిటంటే ఎవరైనా రైటరూ ఒక పుస్తకం రాస్తే ఒకప్పుడు అరుదుగా పబ్లిషర్లు వచ్చేవాళ్లు. లేకపోతే... లేపోతే వాళ్లు ఏదో కారణంవల్ల, వేరే కారణాలవల్ల పబ్లిషర్ వస్తాడు. కానీ రచయిత అడక్కుండానే, రచయిత ఎవరో తెలియకుండానే దానికో పబ్లిషర్ రావడమనేది కూడా విశేషం ఈ పుస్తకం విషయంలో. ఈవిడ... ఇది... మొదటిసారి ఒకట్రెండు మాటలు మాట్లాడి ఉంటాను. ఇవ్వాళ ... ఇక్కడ కలిశాను... వీర్ని. ఈవిడ ఆ పుస్తకంలో కొన్ని రచనలు చదివి, అందులో ముఖ్యంగా ఒక రచన... పేరు జ్ఞాపకంలేదు... ఆ రచన చదివి, ఇంప్రెస్ అయ్యి, మొత్తం వ్యాసాలన్నీ కలెక్ట్ చేసి, అవన్నీ కలిపి ఈ పుస్తకంగా ఆథర్ తనని అడక్కుండా అచ్చేసింది. అంచేత... అదీ ప్రత్యేకం... ఈ పుస్తకం తాలూకు.
సెలవు.

Thursday, February 20, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-2: అభిమాన మిత్ర వాక్యాలు

తెనాలిలో జరిగిన రియాలిటీ చెక్ ఆవిష్కరణ సభలో ఒక వక్త బి.ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ నాకు మిత్రుడు. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాదులోని డిజిటల్ గ్రీన్ ఎన్జీవోలో పనిచేస్తున్నాడు. రైతులకు వీడియో పాఠాలు నేర్పడం చేస్తుంటాడు. అంతకుముందు లయోలా విద్యార్థులకు 'ఫిలిం' బోధించేవాడు. అయితే, పని ఒత్తిడిలో ఆ రోజు సభకు హాజరుకాలేకపోయిన ప్రవీణ్ తన మాటల్ని రాసి పంపాడు. వాటిని ప్రముఖ న్యాయవాది, సుప్రసిద్ధ న్యాయవాది బి.చంద్రశేఖర్ సహచరుడు అయిన నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఆ పాఠాన్నే ఇక్కడ ఉంచుతున్నాను....

-----------------------------------------------------

రియాలిటీ చెక్ ఆవిష్కరణకోసం ఇక్కడికి రావాల్సి ఉండీ అనివార్యంగా రాలేకపోయిన మిత్రుడు ప్రవీణ్ తరఫున ఈ...
అభిమాన మిత్ర వాక్యాలు.

పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరింపబడటం చాలా ఆసక్తికరమైన విషయం.

ఈ విషయం లోలోపలికి వెళితేనే రాజిరెడ్డి రచయితగా బాగా అర్థం అవుతాడు. ఎందుకంటే రాజిరెడ్డి ఎప్పుడూ ప్రాంతం గురించి రాస్తున్నానని చెప్పుకోలేదు. అలా ఎప్పుడూ రాయలేదు. అదేవిధంగా- సిద్ధాంతాల ముసుగులో కూడా ఆయన ఎప్పుడూ గంభీరమైన ప్రకటనలు చేయలేదు. మతాల గురించిగానీ, కులాల గురించిగానీ- వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న భావన కూడా ఎప్పుడూ కల్పించలేదు. అయినా రాజిరెడ్డి చాలామంది ఆదివారం పాఠకులతో ఓ అర్ధగంటో, ఓ గంటో స్నేహం చేయగలిగాడు. అందుకే రాజిరెడ్డి పుస్తకం తెనాలిలో ఆవిష్కరింపబడటం నాకు చాలా ఆసక్తికరమైన విషయంగా తోచింది.

మనం(సాధారణంగా) ప్రమాణాలుగా పెట్టుకున్నటువంటి ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, ఇంకా చెప్పుకుంటూపోవాలంటే వర్గాన్ని కూడా ఆయన ప్రమాణంగా తీసుకోకపోవడమే అందుకు కారణమై ఉండొచ్చు. వీటన్నిటికీ అతీతమైనవాటిని ఏవో - ప్రస్తుతానికి నాకైతే స్పష్టత లేదు - రాజిరెడ్డి పట్టుకుంటున్నాడు. అందుకే రాజిరెడ్డి తెనాలి వాళ్లకు ఈ సందర్భంలో ఆప్తుడయ్యాడు. అలా సాహిత్యం ఉంటే- దానికి విశ్వసనీయత, విశ్వజనీనత ఉంటుందని నా నమ్మకం. ఆ దిశగా మిత్రుడు రాజిరెడ్డి పయనించడం నాకు ముచ్చట కలిగించే విషయం.

ఇప్పుడు రాజిరెడ్డి 'రియాలిటీ చెక్' పుస్తకం గురించి పదివాక్యాలు మాట్లాడుతాను.

నగరాలని కథగా చెప్పడం, లేదా వచనంలో ముక్కలుముక్కలుగా వ్యాసాలుగా చెప్పటం అనేది చాలా అరుదైన ప్రక్రియ. నాకు తెలిసినంత వరకు తెలుగులో నగరాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని చాలా తక్కువమంది రాసారు. రాజిరెడ్డి అటువంటి ప్రక్రియను చాలా సమర్థవంతంగా రాయగలిగాడు. నగరంలో జీవితం ఉంటుంది- ఆ జీవితం చుట్టూ అల్లుకుపోయిన వైవిధ్యాన్ని, చరిత్రను రాజిరెడ్డి తన చక్కెర గుళికల్లాంటి వ్యాసాల్లో బాగా రికార్డు చేయగలిగాడు.

ఇంగ్లీషు సాహిత్యంలో అయితే- చార్లెస్ డికెన్స్... లండన్ నగరం గురించి, జేమ్‌స్ జాయిస్... డబ్లిన్ గురించి, ఓరహాన్ ఫాముక్... ఇస్తాంబుల్ గురించి చాలా అద్భుతమైన వర్ణ వివరణ చేసారు. ఇండియన్ ఇంగ్లీషులో సుకేతు మెహతా 'మ్యాక్సిమమ్ సిటీ' పుస్తకంలో ముంబయి గురించి ఆసక్తికరమైన వచన రచన చేసాడు. అలా మహా మహా రచయితలు భుజానికెత్తుకున్న నగర జీవితం అన్న అంశంపై పూడూరి రాజిరెడ్డి... హైదరాబాద్ గురించి రాయడం తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన ప్రయోగం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో హైదరాబాద్ గురించి రాయబడిన పుస్తకం... రేపు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కచ్చితంగా పాపులర్ అవుతుందని పాఠకునిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్నుకొన్న బ్యాక్‌డ్రాప్ హైదరాబాదే కావొచ్చు... కానీ అందులో రాసిన జీవితం కేవలం హైదరాబాద్‌కే సంబంధించినది కాదు.

అందుకే మళ్లీ చెబుతున్నాను...
పూడూరి రాజిరెడ్డి పుస్తకం 'రియాలిటీ చెక్' తెనాలిలో ఆవిష్కరించబడటం చాలా ఆసక్తికరమైన విషయం. గమనించాల్సిన విషయం.

కృతజ్ఞతలతో...
బి.ప్రవీణ్ కుమార్
(జనవరి 5, 2014)

Friday, February 14, 2014

నా తొలి అధికారిక ప్రసంగం

జనవరి 5, 2014న 'రియాలిటీ చెక్' పుస్తక ఆవిష్కరణ తెనాలిలో జరిపాం. పుస్తక రచయితగా మాట్లాడక తప్పదు కాబట్టి, ముందే రాత ప్రతిని సిద్ధం చేసుకుని వెళ్లాను. అయితే రాసుకున్నది రాసుకున్నట్టుగా మాట్లాడలేదు. కొన్నింటిని అక్కడ కంగారును బట్టి స్కిప్ చేశాను, అదే కంగారును బట్టి కొన్ని కలిపాను కూడా. మొత్తానికి విజయవంతంగానే పూర్తిచేయగలిగాను. ఆ ప్రతిని, అంటే నేను కలిపినవాటిని కలుపుకొని, రాసుకునీ మాట్లాడనివాటిని విస్మరించకుండా తుదిరూపం ఇచ్చిన కాపీని ఇక్కడ ఉంచుతున్నాను.

నిజానికి సభ సభలా ఉండకూడదనీ, ప్రసంగం ప్రసంగంలా ఉండకూడదనీ, దానివల్ల ఒక ఇన్‌ఫార్మల్ లుక్ వస్తుందనీ ఎంత ప్లాన్ చేసినా కూడా, వందమంది కూర్చుండి ఒక మనిషి నిలబడి మాట్లాడటంతోనే అది ఫార్మల్ అయిపోతుంది కదా! ఆ లెక్కన ఇది నా తొలి అధికారిక ప్రసంగం.
అంతకు ముందు, అంటే ఏడాది క్రితం చిలుమూరు కథకుల సమావేశంలో చాలా 'ఊగిపోయి' మాట్లాడాను. నేను నిజాయితీగా ఊగానని అందరూ మెచ్చుకున్నారు కూడా! కాకపోతే అది కూర్చుండి మాట్లాడటం కాబట్టి, దానికి అధికారిక ముద్ర వేయడంలేదు.

ఇక ఉపన్యాసంలోకి వెళ్లేముందు...
ఊహించుకోవడానికి వీలుగా... తెనాలి చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్... పై అంతస్తు... సాయంత్రం ఆరుగంటల ప్రాంతం... చిన్న స్టేజీ... ఆ వీడియోను ఏం చేయాలో ఇప్పటికీ (మాకు) తెలియని ఒక వీడియోగ్రాఫర్... లోకల్ ఎడిషన్ల ఫొటోగ్రాఫర్లు... నేనేం మాట్లాడబోతున్నానోనని నావైపే చూస్తున్న కొన్ని జతల కళ్లు... నా గొంతు మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి మీ గొంతు మీకే అరువిచ్చుకుని...
స్టార్ట్!


రియాలిటీ చెక్ ఆవిష్కరణ నెపంతో ఒక సాయంత్రం

నా కాళ్లల్లో వణుకు మీకు తెలిసే అవకాశం లేదుగానీ, గొంతులో వణుకును మాత్రం అర్థం చేసుకోండి.

మీరు చెప్తే నమ్మరేమో!
నాకు ఫ్రాన్స్ అంటే ఒక పిచ్చి. ఆ పేరుతో నేను ఎందుకో కనెక్ట్ అయిపోతాను. నాకు ఆ దేశంతో ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. అదేంటో నేను స్పష్టంగా చెప్పలేను. కానీ ఏదో ఒక లింకు... టెన్నిస్‌లో మేరీ పియర్స్ నాకు నచ్చడానికి కారణం- ఆమె జడ ఒక్కటే కాదు, ఆమె ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా. ఇంకా- ఫుట్‌బాల్‌లో జినదిన్ జిదానే తెలుసంటే కేవలం కారణం ఆయన ఫ్రాన్స్‌కి చెందినవాడు! 1998 వరల్డ్ కప్‌లో నేను ఫ్రాన్స్‌కు ఎందుకు మద్దతిచ్చానంటే- అది ఫ్రాన్స్ కాబట్టి. నిజంగానే వాళ్లే కప్ గెలుచుకున్నారు.
ఇప్పుడు ఫ్రాన్స్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసిపోయేవుంటుంది... ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో తెనాలికి ఉన్న చారిత్రక లంకెను గుర్తుచేయడానికి.
ఆ పారిస్‌లో లేకపోయినా ఈ క్షణం నేను ఈ పారిస్‌లో ఉన్నాను. అదీ విషయం!

నాకు సంబంధించిన రెండు విషయాలు బ్రేక్ చేస్తున్నానిక్కడ. ఇంతకుముందు రెండు పుస్తకాలు అచ్చు వేసినా కూడా ఆవిష్కరణ సభంటూ జరపలేదు. స్పీచ్ అనేది పెద్దమాట అనుకుంటే, కొంత ఫార్మల్‌గా కూడా ఎప్పుడూ నేను మాట్లాడలేదు.
సాకం నాగరాజ గారు, కోట పురుషోత్తం గారు అడిగితే 'రైతు కథలు' పుస్తకానికి ఒంగోలులో మాట్లాడుదామని రిహార్సల్ చేసుకున్నాగానీ అక్కడికి వెళ్లడానికి రైల్వే వాళ్లు అడ్డంపడ్డారు, నాలుగైదు గంటలు ఆలస్యం చేసి. (ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇక్కడ చేయివూపాలి... అని ఎంతో ప్రాక్టీస్ చేశాను.)
నిజానికి ఈ సభ- దీనికంటే ముందటిది హైదరాబాద్‌లో జరగాలి. చివరి నిమిషం- అంటే ఖరారు చేసుకునే సమయంలో నాకు చిరాకొచ్చేసింది. ఈ ఫోన్లేమిటి? వాళ్లను పిలవడం ఏమిటి? వాళ్లకు వాళ్లు ఏయే పనుల్లోనో ఉంటారు, వారి ఉద్వేగాల్లోంచి దీన్లోకి నేను దారిమళ్లించాలి... ఇదంతా ఒక క్రమంలోకి పెట్టుకురావాలి... అయ్యబాబోయ్! అందుకే చేతులెత్తేసి... వద్దంటే వద్దని వదిలేశాను. కానీ వీళ్లు (సురేశ్ గారు, నారాయణ గారు, సుధామయి గారు) కచ్చితంగా చేయాలన్నారు. అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది కదా...

నాకేంటంటే-
మనుషుల్లో కలవడం ఇబ్బంది. గుంపులో కలిసిన మరుక్షణమే నాకు గదిలోకి పారిపోవాలనిపిస్తుంది. అలాగని గదిలోనే ఎక్కువసేపుంటేగనక బయటికి పరుగెత్తాలనిపిస్తుంది. ఆ గోడలు బోరుకొట్టేస్తాయి.
నాకేమనిపిస్తుందంటే, ఏదీ ఎక్స్‌ట్రీం ఉండకూడదు;
మన ఏకాంతాన్ని చీకాకు పరిచేంత సందడి ఉండకూడదు, అలాగే- స్తబ్ధతగా మారిపోయేంత ఏకాంతం కూడా ఉండకూడదు.
కొంత మితి... మధ్యేమార్గం... నార్మల్సీ... అదే సహజమేమో!
సభా మర్యాదలోకి రాని మాటలు- నా ఉద్దేశంలో రియాలిటీ అంటే ఒక్కోసారి మర్యాదను అతిక్రమించేదైనాసరే, అది వాస్తవమైనపుడు చెప్పాలనే అనుకుంటాను.
ఏదైనా కూడా రెండు పెగ్గుల సాయంత్రంలాగుండాలి; ఒకటీ కాదు, నాలుగూ కాదు. రెండే!
అట్లా నేను ఆశించే పరిమిత సందడి దొరుకుతుందనే నమ్మకంతోనే మనం ఇలా కలవాలని నేను కోరుకున్నాను.

వెయ్యి కాపీల మిడిమేళానికి ఓ పుస్తకం వేయడం అవసరమా? అనికూడా ఒకటేదో నాలోపల గుంజాటన ఉంటుంది...
పుస్తకాలను చదవకపోవడం ఎప్పుడూ ఉంది.
పురాణం సుబ్రహ్మణ్య శర్మగారే 500 కాపీలతో మూడుసార్లు ప్రచురించుకుని మూడు ముద్రణలు పొందిందని సంతోషపడ్డారని మొన్నెక్కడో చదివాను.
శ్రీపాదలాంటివారు కూడా రచయిత పుస్తకం కష్టాలు అంటూ రాశారు. (అదృష్టవశాత్తూ నాకు మంచి పబ్లిషర్స్ దొరికారు...)
మనం రాసింది పుస్తకంగా ఎందుకు రికార్డ్ చేయాలనేదానిమీద నాక్కొంత క్లారిటీ ఉంది.
'2012 యుగాంతం' సినిమాలో అంతా నాశనమైపోతుంటే, కొందరు కొన్నింటిని కాపాడుతుంటారు... ఏనుగులు, ఒంటెలు, మోనాలిసా లాంటి పెయింటింగ్సు...
నిజంగానే భూమి అంతమంటూ జరిగితే ఒక కొత్త ప్రపంచంలో ఉండాల్సిన విలువైనవన్నింటినీ వాళ్లు భద్రపరిచే ప్రయత్నం ఒకటి చేస్తారందులో...
భూమి మునిగిపోయినా నా పుస్తకం అలా ఉండాలని కాదు ఇక్కడ నేను చెప్పబోయేది...
అందులో- యుగాంతం విషయం తక్కువ మందికి తెలిసుంటుంది.... అందులో ఒక శాస్త్రవేత్తగా నటించిన షువెటల్ ఎజియోఫార్ ఒక డైలాగ్ చెబుతాడు.
తన బ్యాగులో ఉన్న పుస్తకాన్ని హీరోయిన్‌కు చూపిస్తాడు. ఫేర్‌వెల్ అట్లాంటిస్ అని ఉంటుంది దానిమీద...
'హార్డ్లీ 500 కాపీస్ సోల్డ్ రచయిత' పుస్తకం తననెంట వస్తోందంటాడు. ఎందుకంటే ఆ క్షణాన ఆ పుస్తకం చదువుతున్నాడు కాబట్టి.
పుస్తకాన్ని అందరూ చదవాలని ఆశిస్తామేమోగానీ, ఎప్పుడూ చదవరు. కానీ చదివేవారు ఎవరో ఒక్కరే ఉంటారు. వాళ్లే ఆ పుస్తకం గురించి నమోదు చేస్తారు. దానివల్లే ఈ పుస్తకం పేరో, రచయిత పేరో ముందువాళ్లకు బట్వాడా అవుతూవుంటుంది, అందులో బట్వాడా కాదగినంత విషయం ఉంటే.
అట్లా కావడం వల్లే నేను మొన్నమొన్న పొట్లపల్లి రామారావు కథలు చదివాను. కల్యాణ సుందరీ జగన్నాథ్ పేరు విన్నానుగానీ ఇంతవరకూ ఆమె కథలు చదవలేదు. రేపెప్పుడో కచ్చితంగా చదువుతాను. ఎందుకంటే ఆ పేరుకు సంబంధించిన ఇదేదో పడిపోయింది నాలో...
పేరు రికార్డ్ కావడంవల్ల పుస్తకాన్ని ఎప్పటికైనా చదివించగలిగే ప్రేరేపణ ఏదో కలుగుతుంది. అట్లాంటి క్యుములేటివ్ దాన్లో యాడ్ అవుతూవస్తుంది. అయోమయంగా ఉన్న పాఠకుడికి ఒక సూచిక ఏదో దొరుకుతుంది. ధూర్జటి... ఈ పేరు వినడంవల్ల నేను కొత్తగా చదివాను. నాకు అభిమాన కవిగా మారిపోయేంత గొప్పతనం ఆయనకుంది. భావాల వల్లనేగానీ కవిత్వపు సొగసువల్ల కాదు; దానర్థం ధూర్జటి కవిత్వం సొగసైనది కాదని కాదు. కవిత్వాన్ని, చిత్రాల్ని అర్థంచేసుకునే శక్తి నాకు లేకపోవడంవల్ల నేను భావానికే పరిమితం అయ్యానని చెబుతున్నాను.
అలా నా గురించో, రియాలిటీ చెక్ పుస్తకం గురించో కూడా రికార్డ్ అవుతుందేమోనని ఆశ!
పుస్తకాన్ని చదవాల్సింది ఎప్పుడూ ఇప్పటి తరం వాళ్లు కాదు; చదివితే చదవొచ్చుగాక, కానీ చదవాల్సింది తర్వాతివాళ్లే!

రియాలిటీ చెక్ ఎలా ప్రారంభం అయిందీ...
ఇదో పద్ధతిగా మొదలైంది కాదు. ఇలా రాయబోతున్నానని కూడా అనుకోలేదు.
2011లో ఫన్‌డేలో మార్పులు చేసినపుడు-
మెయిన్ కవర్ స్టోరీతో పాటు సెకండ్ స్టోరీ ఏదో ఉండాలనుకున్నారు అప్పుడు కన్సల్టంట్-గా ఉన్న ఇప్పటి ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమి గారు. ఈ ఐటెం, ఆ ఐటెం అనుకున్న తర్వాత- ఇరానీ హోటల్ మీద ఏదైనా రాయొచ్చు కదా... ఇరానీ హోటల్ రాశాం కాబట్టి, ఎర్రగడ్డకు వెళ్తే బాగుంటుంది కదా... అట్లా ఇందిరా పార్క్... అప్పటికి స్పష్టత రావడం మొదలైంది. ఈ ఫీచర్‌కు ఒక రూపం రావడం మొదలైంది... నేను కేవలం పాత్రికేయుడిగా కాకుండా, దాన్లోకి మరింత నేనుగా చొరవ తీసుకుంటూ వెళ్లాను.
చార్మినార్... బిర్లా మందిర్... మెన్స్ బ్యూటీ పార్లర్... షాపింగ్ మాల్... పశువుల అంగడి...
కల్లు కాంపౌండ్‌కు వెళ్లాను... అలాగని పబ్బులోకి వెళ్లడం నిషేధం అనుకోలేదు.
అడ్డాకూలీలతో మాట్లాడాను... ఎఫ్ఎం రేడియో జాకీలనూ పరామర్శించాను...
భిక్షుకుల కోసం వెతికాను... వేద పాఠశాల విద్యార్థులను కలిశాను.
శ్మశానమూ... జూ పార్కూ...
చేపల మార్కెట్... రైతు బజారు...
తలకోన అడవి... కొత్తపట్నం సముద్రం...
గాంధీ హాస్పిటలూ... కుక్కలకోసం పెట్టిన ఆసుపత్రీ...
ఎక్కడెక్కడ జీవితం ఉందనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చాను... ఎన్ని రకాలుగా జీవితాన్ని పట్టుకోవచ్చో అన్నిరకాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించాను.
నిజానికి ఈ ఫీచర్ 59 వారాలతో ముగిసిపోయినా... ఇది ఎప్పటికీ రాయదగిన టాపిక్కేనేమో!
ఇది రాసినప్పటికంటే రాసింతర్వాత- ఇప్పుడు నాకు మరింత విలువైన అనుభవంగా కనబడుతోంది.
హిజ్డాలు సజీవంగా ఉన్నారు... మార్చురీ దగ్గర ఏడుపులు గుర్తున్నాయి...

జీవితంలో సాహిత్యం మాత్రమే సర్వస్వం కాదు. సాహిత్యం మాత్రమే దేన్నీ పూరించలేదు. అసలు ఏదీ సర్వస్వం కాజాలదు.
రుచిగా వండిన వంకాయ కూర కూడా ఒక పూరింపు అవుతుంది.
కొన్ని మాటలు, కొంత ఆత్మీయ సమావేశాలు... మీరందరూ నాకు కాగితాల ద్వారా తెలుసు... కానీ వాస్తవంగా నిలువెత్తుగా ఇలా చూడటం కూడా నాక్కావాలి... ఇవన్నీ మన జీవితంలో దేన్నో ఒకదాన్ని పూడ్చుతూనే ఉంటాయని నమ్ముతాను. అందుకే నా విన్నపాన్ని మన్నించి మీరందరూ రావడం నాకు సంతోషంగా ఉంది.
చివరగా ప్రచురణకర్తల గురించి...
పుస్తకాన్ని ప్రచురించడం వేరు. అభిమానంతో, శ్రద్ధతో ప్రచురించడం వేరు. నా పుస్తకాన్ని చక్కగా తెచ్చిన తెనాలి ప్రచురణల బృందం సుధామయి గారు, సురేశ్ గారు, నారాయణ గారు... పుస్తకాన్ని ముద్రించిన చరిత సుబ్బయ్య గారు... వీళ్లను ఈ సందర్భంగా తలచుకుంటూ...
పెద్దలు, స్నేహితులు అందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ... థాంక్యూ!

మీ
పూడూరి రాజిరెడ్డి

Monday, February 10, 2014

'ఫిక్షన్- నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద మెహెర్ స్పందన

(ఇప్పుడు నిలిచిపోయిన 'ఆజన్మం' సీరిస్-లో భాగంగా రాసిన 'ఫిక్షన్-నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద Facebookలో  మెహెర్ వెల్లడించిన అభిప్రాయం:)
నోట్: (ఫొటోలోవి) అని విమర్శలో భాగంగా వచ్చేచోట ఆ భాగాన్నివిడిగా పెట్టకుండా మొత్తం ఐటెమ్-ను పోస్టు చేశాను. ఒకవేళ ఆ వ్యాసాన్నిచదవకపోయినా దీనికిదే అర్థం చేసుకోవచ్చు.
............................................................


Poodoori Rajireddy వారం వారం రాసే “ఆజన్మం” శీర్షిక ఒక్కటే నేను సాక్షి ఫన్ డేలో శ్రద్ధగా చదివేది. ప్రస్తుతం platitudes బారిన పడని వాక్యాలు దొరకటం తెలుగులో అరుదైన సందర్భం. అందుకే అది చదవటం. ఈ వారం శీర్షిక “ఫిక్షన్ – నాన్‌ఫిక్షన్”. అందులోని ఈ పేరాలు నన్ను కాస్త కన్ఫ్యూజ్ చేశాయి (ఫొటోలోవి).

వచనం – కవిత్వం అనే విభజనలాగే, ఫిక్షన్ – నాన్ఫిక్షన్ అనే విభజన కూడా నాకు arbitrary గా తోస్తుంది. Joyce, Proust, Kafka, Beckett లాంటి ఫిక్షన్ రచయితలు ఈ విభజన ఎప్పుడో చెరిపేశారు. అసలు ఫిక్షన్ - నాన్ఫిక్షన్ అన్న ముద్రలు పక్కన పెట్టి ఆలోచిస్తే ఒక మనిషి  ఏం రాసినా అది అతని స్వీయచరిత్రే అవుతుంది. స్వీయ చరిత్ర కానిదంటూ ఎవరూ ఏమీ రాయలేరు. ఒక్క వాక్యం కూడా. ఈ భావననే అర్జెంటినా రచయిత బోర్హెస్ (తన రచనా జీవితమంతా తనను ఆకట్టుకున్న ఫిలసాఫికల్ రిడిల్స్ ని డిటెక్టివ్, క్రైమ్ స్టోరీల రూపంలో చెప్పిన బోర్హెస్) ఇలా చెప్తాడు:

“A man sets out to draw the world. As the years go by, he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and individuals. A short time before he dies, he discovers that the patient labyrinth of lines traces the lineaments of his own face.”

అందుకే, “వ్యవస్థను శుభ్రం చేయసంకల్పించేది [ఫిక్షన్] ఐతే, వ్యక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ [నాన్ ఫిక్షన్]” అన్న రాజిరెడ్డి తీర్మానంలో నాకు అర్థం కనపడలేదు.

పోనీ ఇంత లోతుకు వెళ్లకుండా, ఈ రెండు ప్రక్రియల మధ్య form పరంగా కనిపించే బేధాన్నే తీసుకుని మాట్లాడినా, అప్పుడు కూడా నాకు నాన్-ఫిక్షన్ లోనే ఎక్కువ లోటు కనిపిస్తుంది. దానికి నేను అనుకునే కారణం చెప్తాను. బహుశా ఈ కారణం వల్లనే పైన పేర్కొన్న రచయితలంతా (తమ స్వీయానుభవాల్లోంచే రాసిన వీరంతా) ఫిక్షన్ అనే form వైపు మొగ్గు చూపి ఉంటారు.

నాన్ – ఫిక్షన్ ఎప్పుడూ రాసేవాణ్ణించి స్వతంత్రంగా ఉండలేదు. రాజిరెడ్డి అన్న బైలైన్ లేకుండా ఈ “ఆజన్మం” శీర్షిక నిలబడలేదు. ఇవి ఎవరి అనుభవాలు, ఇవి ఎవరి పరిశీలనలు, ఇవన్నీ ఎవరికి నిజాలు... అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి జవాబులు రచనలో దొరకవు, రచన వెలుపల ఉంటాయి: రాజిరెడ్డి, ఒక మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి, సాక్షి ఫన్ డే ఉద్యోగి, హైదరాబాదీ, చదువరి, రచయిత... వగైరా.

కానీ ఫిక్షన్ అలాక్కాదు. అది రచయిత నుంచి స్వతంత్రంగా నిలబడగలదు, మనగలదు. కాబట్టి పాఠకుడు ఆ అనుభవాల్ని ఫలానా వ్యక్తి అనుభవాలుగా చదవడు, అతని ఏకాంత పఠనంలో ఇంకో వ్యక్తి సమక్షం ఉండదు, అప్పుడు పఠనం తనతో తనకు సంభాషణగా మారుతుంది, చదివేదాన్ని వెంటనే సొంతం చేసుకోగలుగుతాడు. ఈ ఆజన్మంలోవే కొన్ని వాక్యాల్ని ఒక కథలోని ఫిక్షనల్ వాక్యాలుగా భావిస్తే, “కొన్నిసార్లు, ఊరికే, అలా తీరుబడిగా కూర్చుని, ఆలోచనల్తో పొద్దుపుచ్చడం బాగుంటుంది” అన్న వాక్యం చదవగానే, ఇలా ఎవరికి బాగుంటుందీ అన్న ప్రశ్న రాదు, ఈ వాక్యం ఎవరిదీ అన్న ప్రశ్న రాదు. వచ్చినా వాటికి జవాబులు రచనకు వెలుపల వెతుక్కోనక్కర్లేదు. కాబట్టి నా పఠనం రాజిరెడ్డి మరియూ నేనూగా సాగదు, రచనా మరియూ నేనుగా సాగుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఒక నిజమూ మరియూ నేనుగా సాగుతుంది. (అందుకే పాఠకుల్లో కొంతమందికి కథలు గుర్తుంటాయి గానీ, రచయితలు గుర్తుండరు. వీళ్లనే శాలింజర్ తన “Raise High the Roof beam...” పుస్తకంలో “అమెచ్యూర్ రీడర్” అంటాడు, ఆ పుస్తకాన్ని వాళ్లకే అంకితం ఇస్తాడు.)  

నా ఉద్దేశంలో ఫిక్షన్ అనేది రచయితకు “నేను” అనే చెరసాల నుంచి విముక్తి కల్పిస్తుంది. బహుశా పై రచయితలందరూ ఈ చెరసాల నుంచి విముక్తి కోరుకున్న వారే ఐ వుండొచ్చు.

కొంతమంది బాగా రాసేవాళ్లు ఫిక్షన్ వైపు వెళ్లలేకపోవటానికి ఈ “నేను” అనేది వాళ్ల చుట్టూ కట్టిన బలమైన చెరసాలలే కారణమని నాకు అనిపిస్తుంది. (మరో అభిశప్తుడు Naresh Nunna). రాజిరెడ్డి చుట్టూ ఈ చెరసాల ఎంత బలంగా ఉందో “పలక – పెన్సిల్”లో కొన్ని చోట్ల కనపడింది. అంటే “నేను”కి narcissistic సంకెళ్లతో బంధీ అయిపోవడం. కానీ “ఆజన్మం” దగ్గరికి వచ్చేసరికి, నెమ్మదిగా, “నేను” వైపు చూసే చూపు మారుతోందనిపించింది.

“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు. ఈ నమోదు కాఫ్కాలో కనిపిస్తుంది. మనిషి అనే స్పెసిమన్ ని మరింత నిశితంగా పరిశీలించటానికి ఆయన తన ఫిక్షన్ లో మనుషుల్ని జంతువులు చేశాడు, జంతువులకు మనిషితనాన్ని ఆపాదించాడు –ఫిక్షన్ అన్న పేరు మీదే అలా చేయగలిగాడు.

ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....  '

(నవంబర్ 17, 2013)


Saturday, February 1, 2014

'పోలీస్ స్టేషన్లో రెండు గంటలు' వ్యాసానికి ప్రతిస్పందన

నేను ప్రతిదానికీ వివరణ ఇవ్వబూనుకుంటున్నానంటే, ఏదో డిఫెన్సులో పడిపోతున్నానని నాకే అర్థమవుతోంది. అంటే ఇక్కడ స్పందనలు పెట్టడం వల్ల నా గురించి నేను గొప్పకు పోతున్నానని ఈ బ్లాగు చదివే పాఠకులు అనుకుంటారనీ, అలా కాదని చెప్పడానికి నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాననీ అర్థం. ఈ రెండూ నిజమే అయినా, మరి నా ఐటెమ్స్ మీద వచ్చిన స్పందనలు ప్రచురించడానికి
ఈ బ్లాగు కాకుండా మరేదీ దీనికి అనువైన చోటు?
కాబట్టి, ఆ ఫీలింగును వదలించుకుని దీన్ని పోస్టు చేస్తున్నాను.
రియాలిటీ చెక్ సిరీస్-లో భాగంగా పోలీస్ స్టేషన్ వాతావరణం మీద రాసిన ఆర్టికల్-కు వచ్చిన స్పందన ఇది. అందుకున్న తేది మార్చ్ 21, 2012. మెయిల్ ద్వారా వచ్చిన ఈ స్పందన వ్యాసకర్త అప్పుడు 'ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం'  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న యేదుల గోపిరెడ్డి గారు. ఇప్పుడాయన అదే సంఘానికి అధ్యక్షులయ్యారు.

ఈ ఉత్తారానికి స్పందనగా ఆయనతో నేను ఫోన్లో సంభాషించానేగానీ ఉత్తర రూపంలో మాత్రం జవాబు ఇవ్వలేదు. ఆయన మంచి చదువరి. స్నేహశీలి.
పోలీసులు, ముఖ్యంగా పోలీసు కానిస్టేబుళ్ల కోణంలో అర్థం చేసుకోవాల్సిన ఎన్నో అంశాల్ని గోపిరెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. వాటన్నింటితో నేను అంగీకరిస్తానుగానీ, నన్ను ముల్లులా పొడిచిందీ, ఆ వాతావరణంలో నా మనసును చేదెక్కించిందీ వాళ్ల అమర్యాదకర ప్రవర్తన. బహుశా, "ప్రశ్నించజాలని అధికారం" వాళ్లను ఇలా ప్రవర్తించేలా చేస్తుందేమో! మండల కేంద్రాల పోలీసు స్టేషన్లలో ఇది మరింత నిజం. వాళ్లకు వంద చికాకులున్నా కూడా సాటి మనిషి పట్ల మనిషి చూపాల్సిన కనీస మర్యాదకు ఇవన్నీ అడ్డం రాకూడదని నా నిశ్చయమైన నమ్మిక.Friday, January 31, 2014

ఒక అభిమాన ఉత్తరం-2: జిందగీ కా ఛాట్

ఒక అభిమాన ఉత్తరం-1: పదాలు-పెదాలు
ఒక అభిమాన ఉత్తరం: ఉపోద్ఘాతం

ఇది అభిమాని రాసిన ఉత్తరం అనే బడాయిలోకి నేను పోదల్చుకోలేదు. అందుకే దీన్ని అభిమానంతో రాసిన ఉత్తరంగానే భావిస్తున్నాను.

2011 డిసెంబరు18న వీటిని(అవును, రెండూ) అందుకున్నాను. ఒకటి: "పదాలు-పెదాలు" శీర్షిక మొత్తం మీద తన అభిప్రాయం. రెండోది: రియాలిటీ చెక్ కోసం నేను రాసిన ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు ఐటెమ్-ను అనుకరిస్తూ ఛాట్ మీద రాసి పంపింది. మనకు నచ్చినదాన్ని అనుకరిస్తూ రాసి పంపడం మన అభిమానాన్ని ప్రకటించడంలో ఒక అత్యున్నత విధానం అనుకుంటాను! ఇది ఉత్తరంలో వెల్లడైన భావమే! ఇదే ఛాట్ ఐటెమ్ గనక నేను రాయాల్సివస్తే- "పళ్ల మధ్య ఇరుక్కున్నదేదో నాలుకతో తీసే ప్రయత్నాల ఉబ్బు దవడలు" వాక్యాన్ని నేను పట్టుకోగలిగేవాణ్నా, అనిపించింది. ఇదేమీ modesty కాదు.

వీటిని రాసిన తేదీలు వేర్వేరు. మొదటిది: 7 డిసెంబరు 2011; రెండవది: 10 డిసెంబరు 2011.

ఇవి రాసిన అమ్మాయి పేరు అనన్యా రెడ్డి. ఆ పేరు వల్ల నేను అమ్మాయిగా భావిస్తున్నాను; నిజానికి పెద్దావిడ కూడా కావొచ్చు. (వాటిని అందుకున్నట్టు తెలియజేసిన తక్షణ స్పందనలో నేను 'గారు' అనే సంబోధించాను.) అయితే, ఉత్తరాల కింద సంతకం లేదు. బహుశా అమ్మాయిగా తను తీసుకున్న"జాగ్రత్త" కావొచ్చనుకున్నాను. లేదా, సంతకం పెట్టడానికి అంత ప్రాధాన్యత లేదనో!

వీటిని నేను మెయిల్ ద్వారా అందుకున్నాను. అంటే స్కాన్ చేసి మెయిల్ చేశారు. ముందుగా దేదీప్యారెడ్డి నుంచి నా మెయిల్ ఫార్వర్డ్ అయింది. అక్కణ్నుంచి అనన్య ద్వారా ఈ లేఖలు అందాయి. బహుశా, వీళ్లిద్దరూ కవలలేమో అని నాకు నేను అనుకున్నాను. వాళ్లను అడగలేదు.

ఈ ఉత్తరాలు వచ్చిన ఇరవై నెలల తర్వాత 'పదాలు-పెదాలు' ఒక విభాగంగా ఉన్న 'పలక-పెన్సిల్' పుస్తకం అచ్చయింది. వీళ్లకు ఒక కాపీ పంపుదామనుకున్నాను, నా కన్సెర్న్ చూపడం కోసం. అయితే అప్పటి మెయిల్ పనిచేయడం లేదు. అది అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న మెయిలేమో(మెయిళ్లేమో) నేను చెప్పలేను. కాబట్టి వాళ్లకుగా నాకు టచ్-లోకి వస్తే తప్ప నేను వాళ్లను ట్రేస్ చేయలేను.

ఇంకోటేమిటంటే- అసలు దేదీప్యే వీటిని రాస్తే, అనన్య స్కాన్ చేసి పంపిందా? అన్న అనుమానమూ లేకపోలేదు. ఒకవేళ, ఇందులో ఉన్న అక్షరాలు ముఖ్యంగానీ కర్త ఎవరు అన్నదానికి నిమిత్తం లేకుండా చేయడానికి ఈ రెండు మెయిల్ల తమాషా ఏమైనా జరిగిందా?
ఇందులో ఏ తమాషా లేకపోతే గనక, నేను ముందు చెప్పినట్టు వీటి కర్తృత్వాన్ని అనన్యకే ఆపాదించాల్సి ఉంటుంది.

అయితే, వీటిని ఇప్పుడు ఎందుకు పోస్టు చేస్తున్నాను? కేవలం నాకుగా తెలియపరిచిన విషయాల్ని నేను ఇలా ప్రకటించవచ్చా? ఇది ఏమైనా తన ప్రైవసీని భంగపరచడం అవుతుందా?
ఇది అంత అనైతికమైన పని కాదేమోననే అనుకుంటున్నాను. విశ్లేషణగా మొదటిదాన్నీ, ఐటెమ్-గా రెండవదాన్నీ చూడవచ్చుకదా! నాకు రాయడమన్నది అటుంచితే, వీటిల్లో వీటిగా తీసుకోవలసిందేమైనా ఉందేమో కూడా కదా!!

రెండేళ్ల నాటి ఈ లేఖల్ని అప్పుడు ఎందుకు ప్రకటించాలని అనిపించలేదో అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు అనిపించిందో అనిపించింది.
అయితే, ఈ రెంటిని ఒకే పోస్టుగా కాకుండా విడివిడిగా, కానీ వెన్వెంటనే పోస్టు చేస్తున్నాను.

రియాలిటీ చెక్: వన్ ఇండియా రైటప్

తెనాలిలో 'రియాలిటీ చెక్' ఆవిష్కరణ


పుస్తక ఆవిష్కరణ జరిగిన జనవరి 5, 2014 తెల్లారి సాక్షి గుంటూరు ఎడిషన్లో వచ్చిన కవరేజి.

Tuesday, January 28, 2014

రియాలిటీ చెక్ రివ్యూ: ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...

రియాలిటీ చెక్ పుస్తకం మీద సాక్షి సాక్షిత్యం పేజీలో జనవరి 25, 2014న వచ్చిన సమీక్ష:


Saturday, January 25, 2014

ఈ సమీక్షల గురించి ఒక వివరణ

నా పుస్తకాల మీద వెలువడిన అభిప్రాయాలను ఇక్కడ వరుసగా పోస్టు చేస్తూ వస్తున్నాను. ఆయా అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవించినట్టూ కాదూ, అలాగని పూర్తిగా విభేదించినట్టూ కాదు. ఒక 'రికార్డు'గా వాటిని ఇక్కడ ఉంచడం!
ఇదంతా బ్లాగు పాఠకుడిని పుస్తకం/పుస్తకాలు కొనమన్న ఒత్తిడికి గురి చేస్తుందేమోనన్న అనుమానం కూడా నాకుంది. అది నేను ఏ మాత్రమూ వాంఛింపనిది. అందుకే మళ్లీ చెబుతున్నాను: ఇక్కడ పోస్టు చేయడం అనేది ఒక రికార్డుగా ఉండటం కోసమే. అంతెందుకు, నాకు నేను చదువుకోవడానికి కూడా! కొనుగోలు లింకులు కూడా సమాచారంలో భాగమే! ఎంతైనా ఇది 'నా' బ్లాగు కదా....

సాహిత్యం పబ్లిసిటీ స్టంట్ కాదు!


ఆంధ్రభూమి సాహిత్యం పేజీలో 28-10-2013న వచ్చింది.

వాక్యాలకు నులివెచ్చదనం

(పలక -పెన్సిల్ పుస్తకం గురించి ఇంకో అభిప్రాయం)

సాధారణ విషయాల గురించి అబ్బురపడేలా రాయడం జర్నలిజంలోని ఒక సుగుణమని జి.కృష్ణగారు చెబితేనే అర్థమయింది. అది కూడా మామూలు తెలుగులో మనసుకు హత్తుకునేట్టు చెప్పడం ఒక కళ. పత్రికారచనని ఒక కళాత్మక స్థాయికి తీసుకెళ్లడం అప్పుడే సాధ్యమని ఆయన చెప్పలేదుగాని నాకు అర్థమయింది. అర్థం కావడం వేరు. అనుభవంలోకి రావడం వేరు. కళాత్మకస్థాయిని అందుకోవడానికి ప్రయత్నపూర్వకంగా చేసినా అప్రయత్నంగా చేసినట్టు అనిపించడమూ ఓ కళ. ఈ కళ ఏదో పూడూరి రాజిరెడ్డికి పట్టుబడింది. ఇదివరలో 'మధుపం' రచన ద్వారా తెలుగు వాక్యానికి కొత్త జిలుగులు అద్దిన రాజిరెడ్డి ఇప్పుడు 'పలక-పెన్సిల్' అంటూ మన ముందుకొచ్చాడు. ఈ రెండిటికీ కాలం చెల్లిందో, చెల్లుతున్నదో అనుకుంటున్న దశలో ఈ శీర్సిక ద్వారా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు.
ఎంతగా చెరిపి చెరిపి రాస్తే అంతగా అక్షరాలు వచ్చినట్టు, ఎంత అల్లరల్లరిగా రాస్తే అంత కవిత్వంలా మనసును తాకినట్టు రాజిరెడ్డి పదాలు, వాక్యాలు మన మదిని అల్లుకుపోతాయి. అందుకే ఒక తెలియని ఉన్మత్త పరవశంతో ప్రేమ గురించి రాసినా, కోనసీమ గురించి చెప్పినా మురిసిపోతాము, ముగ్ధులమవుతాము.
వాక్యాలకు ఒక ఉన్మత్త పరవశాన్ని కూర్చిన కళానైపుణ్యం తెలియకనే రాజిరెడ్డికి అబ్బింది. మా ఊరి ముచ్చట అంటూ చెప్పినా, మనుషుల మ్యూజియం గురించి మాట మాత్రంగా రాసినా ఏదో లాలన, ఆర్తి కనిపిస్తుంది. సూక్తుల్లా కాకుండా తన జిగిరి దోస్తుతో చెప్పినట్టుగా వాక్యాలకు ఒక తడిని, నులి వెచ్చదనాన్ని అద్దడం వల్ల ఆ విషయాలు మనసులో నిలిచిపోతాయి. ఏదో సందర్భంలో గుర్తుకు వస్తాయి. రాజిరెడ్డి చెప్పినట్టుగానే (ప్రపంచం?) వుందనిపిస్తుంది.
ఇలా చెప్పడం కాదుగానీ మంచి తెలుగు పుస్తకం చదివి చాన్నాళ్లయితే ఈ పుస్తకం చదవండి. మీకు తెలియకనే మీరు పుస్తకాల ప్రేమలో పడతారు. జీవితం మీద ప్రేమను పెంచుకుంటారు. మనుషుల్ని కాసింత దయతో పలకరించడం ఎలానో తెలుసుకుంటారు. అన్నిటికీ మించి నేనేమిటో అనుకుంటూ మీ గురించి మీరు తెలుసుకొని విస్తుపోతారు. ఈ విధంగా చిత్రవిచిత్రమైన అనుభూతులకు లోనుచేసే వాక్య విన్యాసం, విషయబలం ఉన్న 'పలక-పెన్సిల్' చదవకపోతే రచయితకు పోయేదేం లేదు, పాఠకులే చక్కటి పఠనానుభవం కోల్పోతారు. 'ఇది ఒక మగవాడి డైరీ' అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ చదవాలన్నది రచయిత ఉద్దేశం కావచ్చు. కాదన్నది అవుననడం ఆడవాళ్ల తీరు అయితే రచయిత లక్ష్యం నెరవేరుతుంది.


-పాలపిట్ట మాసపత్రిక, డిసెంబర్ 2013

ఒక మనిషి డైరీ అంటే బాగుండేది!

పలక- పెన్సిల్ పుస్తకం మీద సారంగ పత్రిక 2013 నవంబర్ సంచికలో కొల్లూరి సోమశంకర్ గారి సమీక్ష:

ఒక మనిషి డైరీ అంటే బాగుండేది!

అలసట లేని కొన్ని అలల స్వగతం!

పలక-పెన్సిల్ పుస్తకం మీద 2013 అక్టోబర్ నాటి సారంగ పత్రికలో వాయుగండ్ల శశికళ గారు వ్యక్తం చేసిన అభిప్రాయం:

అలసట లేని కొన్ని అలల స్వగతం

జీవిత పథ సోపాన పుటలు

పలక-పెన్సిల్ పుస్తకం మీద అక్టోబర్ 2103 నాటి మాలిక పత్రికలో అరిపిరాల సత్యప్రసాద్ గారి అభిప్రాయం:

జీవిత పథ సోపాన పుటలుMonday, January 20, 2014

డబ్బుల వ్యసనం

I was lucky. My experience with drugs and alcohol allowed me to recognize my pursuit of wealth as an addiction.
- For the Love of Money By SAM POLK 

Thursday, January 9, 2014

కిటికి ప్రయాణాల రియాలిటీ చెక్: జర్నలిజంలో ఒక వినూత్న ప్రయోగం

పూడూరి రాజిరెడ్డి ప్రస్తుత ప్రచురణ ఒక విలక్షణమైన రచన. రోజూ మనం చూస్తూ అంతగా పట్టించుకోనివారి గురించీ, రోజూ మనకు తారసపడీ అంతగా ఆలోచింపజేయని సంభావాల్ని గురించీ మనసుకు హత్తుకునేట్లుగా చెప్పిన 60 పదునైన కథనాల అపూర్వ సంపుటి ఇది. జీవన ప్రస్థానంలో కొన్ని జ్ఞాపకాల మజిలీలు, కొన్ని అసాధారణ దృశ్యాల చిత్రణ, కొన్ని సంభావాల వివరణ, కొన్ని ఘటనల విశదీకరణ, కొన్ని ఘట్టాల అనుభవం, కొందరు భిన్న పోకడల మనుషుల పరిచయం, కొన్ని వ్యవస్థల ప్రాతినిధ్య రూపాలు, కొందరు సామాన్యేతర వ్యక్తుల జీవన చిత్రణ, ఇన్నీ కలిసి ఒక అక్షర జ్యోతి, ఒక ఆర్తి జ్వాల- ఈ సంపుటి. 60 కథనాలు, 60 బాధా శకలాలు, 60 బతుకు గాథలు, 60 వచనంలో వచ్చిన కవితా వీచికలు.

'ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు'తో మొదలై 'ఎవరి గెలుపు, ఎవరి ఓటమి'తో ముగుస్తుంది ఈ విశిష్ట రచనా సంపుటి. ఈ మధ్యలో చదువరి మెదడుకు మేతగా... ఎర్రగడ్డ హాస్పిటల్లో మానసిక రోగులూ, ఇందిరా పార్క్ లో ప్రేమికులూ, పంజాగుట్ట శ్మశానవాటికలో కాపరులూ, ఆత్మీయ సంభాషణలో హిజ్డాలూ, పోలీసు స్టేషన్లో ఈనాటి పోకడలూ, కోర్టుల్లో ప్రహసనాలూ, బస్సుల్లో కండక్టర్ల దిలాసాలూ, కొన్ని మొక్కలు, ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాలూ, ఆర్టిస్టులూ... ఎంతో మంది, ఎన్నో దృశ్యాలు కళ్లముందు నిలిచి కలవరపెడుతాయి. అలజడి రేపుతాయి.
జర్నలిజం వేరు, జర్నలిజంలో సృజన వేరు. రాజిరెడ్డి రచనలో ఈ తేడాని గమనిస్తూ చదువుకుపోతాడు ఈ కథనాల్ని పాఠకుడు. తనదైన సొంతముద్రతో విశిష్టమైన వాక్యనిర్మాణ శైలితో రాజిరెడ్డి ఈ కథనాల్ని అనుభూతి ప్రదానం చేశారు. భావాన్ని కవితామయం చేసే వ్యక్తీకరణ శక్తి ఆలోచనా ప్రేరకంగా సాగింది.

ఉదాహరణకి- 'ఇచ్చేది చాయ్ కాదు/ అది జీవన రసం' అని ముగుస్తుంది... 'ఇరానీ హోటల్' కథ.
ఈ సమస్త ప్రపంచంలో ఒకానొక మనిషి మరణించడమంటే, ఒక అంకె తగ్గిపోవడం కాదు; ఆ ఒక్కడితో ముడిపడివున్న సమస్త ఆనందాల ప్రపంచం అంతం కావడం- అంటూ ముగుస్తుంది- 'ప్రతీక్ లేని ఇల్లు' అనే గుండెని కలచివేసే ఖండిక. ఇలాంటిదే 'శవాల గది' గురించిన కథనం కూడా. తెల్లబట్టలో చుట్టివచ్చే ఆ మాంసం ముద్ద కోసం వాళ్లు ఎదురుచూస్తూ నిల్చున్నారు. జీవితంలో ఏది నిజమో, ఏది అబద్ధమో ఒక పట్టాన తేల్చుకోలేంగానీ, జీవితపు సిసలైన వాస్తవికత మాత్రం మృత్యువు- వంటి వాక్యాలు ఆలోచనా ప్రేరకాలుగా వెంటాడుతూవుంటాయి. 'నీది మరణం- నాది జీవన్మరణం' కథనంలో... 'అసంపూర్ణ వాక్యంలా వెళ్లిపోయాడు శరత్' వంటి వాక్యాలు చదువరిని నిలవేస్తాయనటం అతిశయోక్తి కాదు. శతకోటి హృదయాల అవ్యక్త ఘోషకి ఆర్ద్రమైన అభివ్యక్తి రూపం ఈ 'రియాలిటీ చెక్'!

- విహారి
డిసెంబర్ 22, 2013 నాటి 'ఆంధ్రభూమి' 'మెరుపు' పేజీ.

Thursday, January 2, 2014

Musings of a Man

The author is a journalist with a few published books to his credit, in addition to articles published by way of his duties. The essays in this book are a collection of written musings as well as spontaneous reminiscences. While some of the essays here have been picked and dusted from papers he had set aside over the years, some others are random writings of personal interest.
Chronologically organised from his early childhood beginning with chapter Balapam, then Pencil and finally Pen, the writer shares memories of his life over the years like the movies he watched and his attempts to paint.
The last, he writes in a humorous, self-deprecatory manner saying there is a 'Ssocapi' (reversed in Telugu, it reads Picasso) hidden in him. Writeen (written) in a lucid, light hearted and anecdotal manner, the book makes for a fun read.


Palaka Pencil: Oka Magaadi Diary by Poodoori Rajireddy, Saranga books, copies available with Navodaya Book House, opp Arya Samaj Mandir, Near Kachiguda Croos(Cross) roads, Hyderabad-27, contact 040 24652387; Rs 75.


('హిందూ' పత్రిక 'ఫ్రైడే రివ్యూ'లో నవంబరు 15, 2013న వచ్చిన 'పలక-పెన్సిల్' పరిచయం యధాతథంగా...)

Wednesday, January 1, 2014

రియాలిటీ చెక్ పుస్తకం మీద కినిగె నోట్

రాజిరెడ్డి వాక్యాలు బయటికన్నా ఎక్కువ లోపలివైపే చూస్తాయి. అక్కడ కనపడిందానికి ఏ అలంకారమూ దిగేయకుండా ఉన్నదున్నట్టుగానే పట్టుకోవాలని అతని ప్రయత్నం. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే ప్రక్రియలోనూ ఇమడక తనదైన ప్రక్రియను కూడా వెతుక్కుని సమకూర్చుకుంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. సాక్షి- ఫన్డేలో ఆయన రాసిన స్థల పురాణాలు (ముఖ్యంగా హైదరాబాద్ స్థల పురాణాలు) ఇప్పుడు పుస్తకంగా వెలువడ్డాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం అలా ఎప్పటికీ నిలిచిపోతుందేమో!
- (మెహెర్) 

రియాలిటీ చెక్ ఆవిష్కరణ నెపంతో ఒక సాయంత్రం'రియాలిటీ చెక్' ఆవిష్కరణ నెపంతో ఒక పూట కలుసుకుందాం!
తేది: జనవరి 5, 2014; ఆదివారం
సమయం: సాయంత్రం 5 గంటలకు
వేదిక: తెనాలి చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్, గంగానమ్మపేట, తెనాలి