Friday, February 14, 2014

నా తొలి అధికారిక ప్రసంగం

జనవరి 5, 2014న 'రియాలిటీ చెక్' పుస్తక ఆవిష్కరణ తెనాలిలో జరిపాం. పుస్తక రచయితగా మాట్లాడక తప్పదు కాబట్టి, ముందే రాత ప్రతిని సిద్ధం చేసుకుని వెళ్లాను. అయితే రాసుకున్నది రాసుకున్నట్టుగా మాట్లాడలేదు. కొన్నింటిని అక్కడ కంగారును బట్టి స్కిప్ చేశాను, అదే కంగారును బట్టి కొన్ని కలిపాను కూడా. మొత్తానికి విజయవంతంగానే పూర్తిచేయగలిగాను. ఆ ప్రతిని, అంటే నేను కలిపినవాటిని కలుపుకొని, రాసుకునీ మాట్లాడనివాటిని విస్మరించకుండా తుదిరూపం ఇచ్చిన కాపీని ఇక్కడ ఉంచుతున్నాను.

నిజానికి సభ సభలా ఉండకూడదనీ, ప్రసంగం ప్రసంగంలా ఉండకూడదనీ, దానివల్ల ఒక ఇన్‌ఫార్మల్ లుక్ వస్తుందనీ ఎంత ప్లాన్ చేసినా కూడా, వందమంది కూర్చుండి ఒక మనిషి నిలబడి మాట్లాడటంతోనే అది ఫార్మల్ అయిపోతుంది కదా! ఆ లెక్కన ఇది నా తొలి అధికారిక ప్రసంగం.
అంతకు ముందు, అంటే ఏడాది క్రితం చిలుమూరు కథకుల సమావేశంలో చాలా 'ఊగిపోయి' మాట్లాడాను. నేను నిజాయితీగా ఊగానని అందరూ మెచ్చుకున్నారు కూడా! కాకపోతే అది కూర్చుండి మాట్లాడటం కాబట్టి, దానికి అధికారిక ముద్ర వేయడంలేదు.

ఇక ఉపన్యాసంలోకి వెళ్లేముందు...
ఊహించుకోవడానికి వీలుగా... తెనాలి చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్... పై అంతస్తు... సాయంత్రం ఆరుగంటల ప్రాంతం... చిన్న స్టేజీ... ఆ వీడియోను ఏం చేయాలో ఇప్పటికీ (మాకు) తెలియని ఒక వీడియోగ్రాఫర్... లోకల్ ఎడిషన్ల ఫొటోగ్రాఫర్లు... నేనేం మాట్లాడబోతున్నానోనని నావైపే చూస్తున్న కొన్ని జతల కళ్లు... నా గొంతు మీకు తెలిసే అవకాశం లేదు కాబట్టి మీ గొంతు మీకే అరువిచ్చుకుని...
స్టార్ట్!


రియాలిటీ చెక్ ఆవిష్కరణ నెపంతో ఒక సాయంత్రం

నా కాళ్లల్లో వణుకు మీకు తెలిసే అవకాశం లేదుగానీ, గొంతులో వణుకును మాత్రం అర్థం చేసుకోండి.

మీరు చెప్తే నమ్మరేమో!
నాకు ఫ్రాన్స్ అంటే ఒక పిచ్చి. ఆ పేరుతో నేను ఎందుకో కనెక్ట్ అయిపోతాను. నాకు ఆ దేశంతో ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. అదేంటో నేను స్పష్టంగా చెప్పలేను. కానీ ఏదో ఒక లింకు... టెన్నిస్‌లో మేరీ పియర్స్ నాకు నచ్చడానికి కారణం- ఆమె జడ ఒక్కటే కాదు, ఆమె ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా. ఇంకా- ఫుట్‌బాల్‌లో జినదిన్ జిదానే తెలుసంటే కేవలం కారణం ఆయన ఫ్రాన్స్‌కి చెందినవాడు! 1998 వరల్డ్ కప్‌లో నేను ఫ్రాన్స్‌కు ఎందుకు మద్దతిచ్చానంటే- అది ఫ్రాన్స్ కాబట్టి. నిజంగానే వాళ్లే కప్ గెలుచుకున్నారు.
ఇప్పుడు ఫ్రాన్స్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసిపోయేవుంటుంది... ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో తెనాలికి ఉన్న చారిత్రక లంకెను గుర్తుచేయడానికి.
ఆ పారిస్‌లో లేకపోయినా ఈ క్షణం నేను ఈ పారిస్‌లో ఉన్నాను. అదీ విషయం!

నాకు సంబంధించిన రెండు విషయాలు బ్రేక్ చేస్తున్నానిక్కడ. ఇంతకుముందు రెండు పుస్తకాలు అచ్చు వేసినా కూడా ఆవిష్కరణ సభంటూ జరపలేదు. స్పీచ్ అనేది పెద్దమాట అనుకుంటే, కొంత ఫార్మల్‌గా కూడా ఎప్పుడూ నేను మాట్లాడలేదు.
సాకం నాగరాజ గారు, కోట పురుషోత్తం గారు అడిగితే 'రైతు కథలు' పుస్తకానికి ఒంగోలులో మాట్లాడుదామని రిహార్సల్ చేసుకున్నాగానీ అక్కడికి వెళ్లడానికి రైల్వే వాళ్లు అడ్డంపడ్డారు, నాలుగైదు గంటలు ఆలస్యం చేసి. (ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇక్కడ చేయివూపాలి... అని ఎంతో ప్రాక్టీస్ చేశాను.)
నిజానికి ఈ సభ- దీనికంటే ముందటిది హైదరాబాద్‌లో జరగాలి. చివరి నిమిషం- అంటే ఖరారు చేసుకునే సమయంలో నాకు చిరాకొచ్చేసింది. ఈ ఫోన్లేమిటి? వాళ్లను పిలవడం ఏమిటి? వాళ్లకు వాళ్లు ఏయే పనుల్లోనో ఉంటారు, వారి ఉద్వేగాల్లోంచి దీన్లోకి నేను దారిమళ్లించాలి... ఇదంతా ఒక క్రమంలోకి పెట్టుకురావాలి... అయ్యబాబోయ్! అందుకే చేతులెత్తేసి... వద్దంటే వద్దని వదిలేశాను. కానీ వీళ్లు (సురేశ్ గారు, నారాయణ గారు, సుధామయి గారు) కచ్చితంగా చేయాలన్నారు. అందరం కలిసినట్టుగా కూడా ఉంటుంది కదా...

నాకేంటంటే-
మనుషుల్లో కలవడం ఇబ్బంది. గుంపులో కలిసిన మరుక్షణమే నాకు గదిలోకి పారిపోవాలనిపిస్తుంది. అలాగని గదిలోనే ఎక్కువసేపుంటేగనక బయటికి పరుగెత్తాలనిపిస్తుంది. ఆ గోడలు బోరుకొట్టేస్తాయి.
నాకేమనిపిస్తుందంటే, ఏదీ ఎక్స్‌ట్రీం ఉండకూడదు;
మన ఏకాంతాన్ని చీకాకు పరిచేంత సందడి ఉండకూడదు, అలాగే- స్తబ్ధతగా మారిపోయేంత ఏకాంతం కూడా ఉండకూడదు.
కొంత మితి... మధ్యేమార్గం... నార్మల్సీ... అదే సహజమేమో!
సభా మర్యాదలోకి రాని మాటలు- నా ఉద్దేశంలో రియాలిటీ అంటే ఒక్కోసారి మర్యాదను అతిక్రమించేదైనాసరే, అది వాస్తవమైనపుడు చెప్పాలనే అనుకుంటాను.
ఏదైనా కూడా రెండు పెగ్గుల సాయంత్రంలాగుండాలి; ఒకటీ కాదు, నాలుగూ కాదు. రెండే!
అట్లా నేను ఆశించే పరిమిత సందడి దొరుకుతుందనే నమ్మకంతోనే మనం ఇలా కలవాలని నేను కోరుకున్నాను.

వెయ్యి కాపీల మిడిమేళానికి ఓ పుస్తకం వేయడం అవసరమా? అనికూడా ఒకటేదో నాలోపల గుంజాటన ఉంటుంది...
పుస్తకాలను చదవకపోవడం ఎప్పుడూ ఉంది.
పురాణం సుబ్రహ్మణ్య శర్మగారే 500 కాపీలతో మూడుసార్లు ప్రచురించుకుని మూడు ముద్రణలు పొందిందని సంతోషపడ్డారని మొన్నెక్కడో చదివాను.
శ్రీపాదలాంటివారు కూడా రచయిత పుస్తకం కష్టాలు అంటూ రాశారు. (అదృష్టవశాత్తూ నాకు మంచి పబ్లిషర్స్ దొరికారు...)
మనం రాసింది పుస్తకంగా ఎందుకు రికార్డ్ చేయాలనేదానిమీద నాక్కొంత క్లారిటీ ఉంది.
'2012 యుగాంతం' సినిమాలో అంతా నాశనమైపోతుంటే, కొందరు కొన్నింటిని కాపాడుతుంటారు... ఏనుగులు, ఒంటెలు, మోనాలిసా లాంటి పెయింటింగ్సు...
నిజంగానే భూమి అంతమంటూ జరిగితే ఒక కొత్త ప్రపంచంలో ఉండాల్సిన విలువైనవన్నింటినీ వాళ్లు భద్రపరిచే ప్రయత్నం ఒకటి చేస్తారందులో...
భూమి మునిగిపోయినా నా పుస్తకం అలా ఉండాలని కాదు ఇక్కడ నేను చెప్పబోయేది...
అందులో- యుగాంతం విషయం తక్కువ మందికి తెలిసుంటుంది.... అందులో ఒక శాస్త్రవేత్తగా నటించిన షువెటల్ ఎజియోఫార్ ఒక డైలాగ్ చెబుతాడు.
తన బ్యాగులో ఉన్న పుస్తకాన్ని హీరోయిన్‌కు చూపిస్తాడు. ఫేర్‌వెల్ అట్లాంటిస్ అని ఉంటుంది దానిమీద...
'హార్డ్లీ 500 కాపీస్ సోల్డ్ రచయిత' పుస్తకం తననెంట వస్తోందంటాడు. ఎందుకంటే ఆ క్షణాన ఆ పుస్తకం చదువుతున్నాడు కాబట్టి.
పుస్తకాన్ని అందరూ చదవాలని ఆశిస్తామేమోగానీ, ఎప్పుడూ చదవరు. కానీ చదివేవారు ఎవరో ఒక్కరే ఉంటారు. వాళ్లే ఆ పుస్తకం గురించి నమోదు చేస్తారు. దానివల్లే ఈ పుస్తకం పేరో, రచయిత పేరో ముందువాళ్లకు బట్వాడా అవుతూవుంటుంది, అందులో బట్వాడా కాదగినంత విషయం ఉంటే.
అట్లా కావడం వల్లే నేను మొన్నమొన్న పొట్లపల్లి రామారావు కథలు చదివాను. కల్యాణ సుందరీ జగన్నాథ్ పేరు విన్నానుగానీ ఇంతవరకూ ఆమె కథలు చదవలేదు. రేపెప్పుడో కచ్చితంగా చదువుతాను. ఎందుకంటే ఆ పేరుకు సంబంధించిన ఇదేదో పడిపోయింది నాలో...
పేరు రికార్డ్ కావడంవల్ల పుస్తకాన్ని ఎప్పటికైనా చదివించగలిగే ప్రేరేపణ ఏదో కలుగుతుంది. అట్లాంటి క్యుములేటివ్ దాన్లో యాడ్ అవుతూవస్తుంది. అయోమయంగా ఉన్న పాఠకుడికి ఒక సూచిక ఏదో దొరుకుతుంది. ధూర్జటి... ఈ పేరు వినడంవల్ల నేను కొత్తగా చదివాను. నాకు అభిమాన కవిగా మారిపోయేంత గొప్పతనం ఆయనకుంది. భావాల వల్లనేగానీ కవిత్వపు సొగసువల్ల కాదు; దానర్థం ధూర్జటి కవిత్వం సొగసైనది కాదని కాదు. కవిత్వాన్ని, చిత్రాల్ని అర్థంచేసుకునే శక్తి నాకు లేకపోవడంవల్ల నేను భావానికే పరిమితం అయ్యానని చెబుతున్నాను.
అలా నా గురించో, రియాలిటీ చెక్ పుస్తకం గురించో కూడా రికార్డ్ అవుతుందేమోనని ఆశ!
పుస్తకాన్ని చదవాల్సింది ఎప్పుడూ ఇప్పటి తరం వాళ్లు కాదు; చదివితే చదవొచ్చుగాక, కానీ చదవాల్సింది తర్వాతివాళ్లే!

రియాలిటీ చెక్ ఎలా ప్రారంభం అయిందీ...
ఇదో పద్ధతిగా మొదలైంది కాదు. ఇలా రాయబోతున్నానని కూడా అనుకోలేదు.
2011లో ఫన్‌డేలో మార్పులు చేసినపుడు-
మెయిన్ కవర్ స్టోరీతో పాటు సెకండ్ స్టోరీ ఏదో ఉండాలనుకున్నారు అప్పుడు కన్సల్టంట్-గా ఉన్న ఇప్పటి ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమి గారు. ఈ ఐటెం, ఆ ఐటెం అనుకున్న తర్వాత- ఇరానీ హోటల్ మీద ఏదైనా రాయొచ్చు కదా... ఇరానీ హోటల్ రాశాం కాబట్టి, ఎర్రగడ్డకు వెళ్తే బాగుంటుంది కదా... అట్లా ఇందిరా పార్క్... అప్పటికి స్పష్టత రావడం మొదలైంది. ఈ ఫీచర్‌కు ఒక రూపం రావడం మొదలైంది... నేను కేవలం పాత్రికేయుడిగా కాకుండా, దాన్లోకి మరింత నేనుగా చొరవ తీసుకుంటూ వెళ్లాను.
చార్మినార్... బిర్లా మందిర్... మెన్స్ బ్యూటీ పార్లర్... షాపింగ్ మాల్... పశువుల అంగడి...
కల్లు కాంపౌండ్‌కు వెళ్లాను... అలాగని పబ్బులోకి వెళ్లడం నిషేధం అనుకోలేదు.
అడ్డాకూలీలతో మాట్లాడాను... ఎఫ్ఎం రేడియో జాకీలనూ పరామర్శించాను...
భిక్షుకుల కోసం వెతికాను... వేద పాఠశాల విద్యార్థులను కలిశాను.
శ్మశానమూ... జూ పార్కూ...
చేపల మార్కెట్... రైతు బజారు...
తలకోన అడవి... కొత్తపట్నం సముద్రం...
గాంధీ హాస్పిటలూ... కుక్కలకోసం పెట్టిన ఆసుపత్రీ...
ఎక్కడెక్కడ జీవితం ఉందనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చాను... ఎన్ని రకాలుగా జీవితాన్ని పట్టుకోవచ్చో అన్నిరకాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించాను.
నిజానికి ఈ ఫీచర్ 59 వారాలతో ముగిసిపోయినా... ఇది ఎప్పటికీ రాయదగిన టాపిక్కేనేమో!
ఇది రాసినప్పటికంటే రాసింతర్వాత- ఇప్పుడు నాకు మరింత విలువైన అనుభవంగా కనబడుతోంది.
హిజ్డాలు సజీవంగా ఉన్నారు... మార్చురీ దగ్గర ఏడుపులు గుర్తున్నాయి...

జీవితంలో సాహిత్యం మాత్రమే సర్వస్వం కాదు. సాహిత్యం మాత్రమే దేన్నీ పూరించలేదు. అసలు ఏదీ సర్వస్వం కాజాలదు.
రుచిగా వండిన వంకాయ కూర కూడా ఒక పూరింపు అవుతుంది.
కొన్ని మాటలు, కొంత ఆత్మీయ సమావేశాలు... మీరందరూ నాకు కాగితాల ద్వారా తెలుసు... కానీ వాస్తవంగా నిలువెత్తుగా ఇలా చూడటం కూడా నాక్కావాలి... ఇవన్నీ మన జీవితంలో దేన్నో ఒకదాన్ని పూడ్చుతూనే ఉంటాయని నమ్ముతాను. అందుకే నా విన్నపాన్ని మన్నించి మీరందరూ రావడం నాకు సంతోషంగా ఉంది.
చివరగా ప్రచురణకర్తల గురించి...
పుస్తకాన్ని ప్రచురించడం వేరు. అభిమానంతో, శ్రద్ధతో ప్రచురించడం వేరు. నా పుస్తకాన్ని చక్కగా తెచ్చిన తెనాలి ప్రచురణల బృందం సుధామయి గారు, సురేశ్ గారు, నారాయణ గారు... పుస్తకాన్ని ముద్రించిన చరిత సుబ్బయ్య గారు... వీళ్లను ఈ సందర్భంగా తలచుకుంటూ...
పెద్దలు, స్నేహితులు అందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ... థాంక్యూ!

మీ
పూడూరి రాజిరెడ్డి

4 comments:

  1. ఇవి ఫన్ డేలో వస్తున్నప్పుడు శ్రద్ధగా చదివేవాడిని. మీలోని పరిశీలనా దృష్టికి, వస్తు వైవిద్యానికి ఇవి దర్పణాలు.

    ReplyDelete
  2. Really nice. One of my friend was travelling to India recently, he asked me to give your book to read in the flight. But, I denied saying the book is gift by author himself. It was such a good feeling.

    And coming to the context, it is really nice speech to start with.

    Aravinda Chary

    ReplyDelete
  3. రాజిరెడ్డి గారూ,
    నిజంగా చెప్పాలంటే నేను కేవలం రియాలిటీ' చెక్ కాలమ్ గురించి ప్రతి సండే మా పేపర్ షాప్ ఆయనవద్ద ఫండే బుక్ రిజర్వు చేసుకునే వాడిని. నేను నమస్తే తెలంగాణా పేపర్ చదివిన కానీ ఈ ఫండే ఒక్క ఇష్యూ కూడా మిస్ కాకపోయే వాడిని. పేపర్ షాప్ అతను ఏంటి సారూ ఒక్క సండే మాత్రమే తీస్కుంటారు ఎందుకంటే.. అదే మరి స్పెషల్ అని చెప్పాను.

    పూడూరి రచనా శైలి కి రాసే సంఘటనలకి నాలాంటి ఎందరో అభిమానులుగా మారి ఉంటారు. ఒకానొక సమయంలో మీ బ్లాగు చూసి మీ యొక్క అన్ని రచనలు చదివి మరింత ఆనందించాను.

    "జీవితంలో సాహిత్యం మాత్రమే సర్వస్వం కాదు. సాహిత్యం మాత్రమే దేన్నీ పూరించలేదు. అసలు ఏదీ సర్వస్వం కాజాలదు."

    బాగాచెప్పారు, మీ ప్రసంగంకుడా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి మరొక అదనపు రియాలిటీ చెక్ స్టొరీ విన్నట్టు/చదివినట్టు తోచింది.

    ReplyDelete
  4. Sir where do I get your reality check book.. pls

    ReplyDelete