Monday, February 10, 2014

'ఫిక్షన్- నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద మెహెర్ స్పందన

(ఇప్పుడు నిలిచిపోయిన 'ఆజన్మం' సీరిస్-లో భాగంగా రాసిన 'ఫిక్షన్-నాన్ ఫిక్షన్' ఆర్టికల్ మీద Facebookలో  మెహెర్ వెల్లడించిన అభిప్రాయం:)
నోట్: (ఫొటోలోవి) అని విమర్శలో భాగంగా వచ్చేచోట ఆ భాగాన్నివిడిగా పెట్టకుండా మొత్తం ఐటెమ్-ను పోస్టు చేశాను. ఒకవేళ ఆ వ్యాసాన్నిచదవకపోయినా దీనికిదే అర్థం చేసుకోవచ్చు.
............................................................


Poodoori Rajireddy వారం వారం రాసే “ఆజన్మం” శీర్షిక ఒక్కటే నేను సాక్షి ఫన్ డేలో శ్రద్ధగా చదివేది. ప్రస్తుతం platitudes బారిన పడని వాక్యాలు దొరకటం తెలుగులో అరుదైన సందర్భం. అందుకే అది చదవటం. ఈ వారం శీర్షిక “ఫిక్షన్ – నాన్‌ఫిక్షన్”. అందులోని ఈ పేరాలు నన్ను కాస్త కన్ఫ్యూజ్ చేశాయి (ఫొటోలోవి).

వచనం – కవిత్వం అనే విభజనలాగే, ఫిక్షన్ – నాన్ఫిక్షన్ అనే విభజన కూడా నాకు arbitrary గా తోస్తుంది. Joyce, Proust, Kafka, Beckett లాంటి ఫిక్షన్ రచయితలు ఈ విభజన ఎప్పుడో చెరిపేశారు. అసలు ఫిక్షన్ - నాన్ఫిక్షన్ అన్న ముద్రలు పక్కన పెట్టి ఆలోచిస్తే ఒక మనిషి  ఏం రాసినా అది అతని స్వీయచరిత్రే అవుతుంది. స్వీయ చరిత్ర కానిదంటూ ఎవరూ ఏమీ రాయలేరు. ఒక్క వాక్యం కూడా. ఈ భావననే అర్జెంటినా రచయిత బోర్హెస్ (తన రచనా జీవితమంతా తనను ఆకట్టుకున్న ఫిలసాఫికల్ రిడిల్స్ ని డిటెక్టివ్, క్రైమ్ స్టోరీల రూపంలో చెప్పిన బోర్హెస్) ఇలా చెప్తాడు:

“A man sets out to draw the world. As the years go by, he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and individuals. A short time before he dies, he discovers that the patient labyrinth of lines traces the lineaments of his own face.”

అందుకే, “వ్యవస్థను శుభ్రం చేయసంకల్పించేది [ఫిక్షన్] ఐతే, వ్యక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ [నాన్ ఫిక్షన్]” అన్న రాజిరెడ్డి తీర్మానంలో నాకు అర్థం కనపడలేదు.

పోనీ ఇంత లోతుకు వెళ్లకుండా, ఈ రెండు ప్రక్రియల మధ్య form పరంగా కనిపించే బేధాన్నే తీసుకుని మాట్లాడినా, అప్పుడు కూడా నాకు నాన్-ఫిక్షన్ లోనే ఎక్కువ లోటు కనిపిస్తుంది. దానికి నేను అనుకునే కారణం చెప్తాను. బహుశా ఈ కారణం వల్లనే పైన పేర్కొన్న రచయితలంతా (తమ స్వీయానుభవాల్లోంచే రాసిన వీరంతా) ఫిక్షన్ అనే form వైపు మొగ్గు చూపి ఉంటారు.

నాన్ – ఫిక్షన్ ఎప్పుడూ రాసేవాణ్ణించి స్వతంత్రంగా ఉండలేదు. రాజిరెడ్డి అన్న బైలైన్ లేకుండా ఈ “ఆజన్మం” శీర్షిక నిలబడలేదు. ఇవి ఎవరి అనుభవాలు, ఇవి ఎవరి పరిశీలనలు, ఇవన్నీ ఎవరికి నిజాలు... అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి జవాబులు రచనలో దొరకవు, రచన వెలుపల ఉంటాయి: రాజిరెడ్డి, ఒక మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి, సాక్షి ఫన్ డే ఉద్యోగి, హైదరాబాదీ, చదువరి, రచయిత... వగైరా.

కానీ ఫిక్షన్ అలాక్కాదు. అది రచయిత నుంచి స్వతంత్రంగా నిలబడగలదు, మనగలదు. కాబట్టి పాఠకుడు ఆ అనుభవాల్ని ఫలానా వ్యక్తి అనుభవాలుగా చదవడు, అతని ఏకాంత పఠనంలో ఇంకో వ్యక్తి సమక్షం ఉండదు, అప్పుడు పఠనం తనతో తనకు సంభాషణగా మారుతుంది, చదివేదాన్ని వెంటనే సొంతం చేసుకోగలుగుతాడు. ఈ ఆజన్మంలోవే కొన్ని వాక్యాల్ని ఒక కథలోని ఫిక్షనల్ వాక్యాలుగా భావిస్తే, “కొన్నిసార్లు, ఊరికే, అలా తీరుబడిగా కూర్చుని, ఆలోచనల్తో పొద్దుపుచ్చడం బాగుంటుంది” అన్న వాక్యం చదవగానే, ఇలా ఎవరికి బాగుంటుందీ అన్న ప్రశ్న రాదు, ఈ వాక్యం ఎవరిదీ అన్న ప్రశ్న రాదు. వచ్చినా వాటికి జవాబులు రచనకు వెలుపల వెతుక్కోనక్కర్లేదు. కాబట్టి నా పఠనం రాజిరెడ్డి మరియూ నేనూగా సాగదు, రచనా మరియూ నేనుగా సాగుతుంది. ఇంకోలా చెప్పాలంటే ఒక నిజమూ మరియూ నేనుగా సాగుతుంది. (అందుకే పాఠకుల్లో కొంతమందికి కథలు గుర్తుంటాయి గానీ, రచయితలు గుర్తుండరు. వీళ్లనే శాలింజర్ తన “Raise High the Roof beam...” పుస్తకంలో “అమెచ్యూర్ రీడర్” అంటాడు, ఆ పుస్తకాన్ని వాళ్లకే అంకితం ఇస్తాడు.)  

నా ఉద్దేశంలో ఫిక్షన్ అనేది రచయితకు “నేను” అనే చెరసాల నుంచి విముక్తి కల్పిస్తుంది. బహుశా పై రచయితలందరూ ఈ చెరసాల నుంచి విముక్తి కోరుకున్న వారే ఐ వుండొచ్చు.

కొంతమంది బాగా రాసేవాళ్లు ఫిక్షన్ వైపు వెళ్లలేకపోవటానికి ఈ “నేను” అనేది వాళ్ల చుట్టూ కట్టిన బలమైన చెరసాలలే కారణమని నాకు అనిపిస్తుంది. (మరో అభిశప్తుడు Naresh Nunna). రాజిరెడ్డి చుట్టూ ఈ చెరసాల ఎంత బలంగా ఉందో “పలక – పెన్సిల్”లో కొన్ని చోట్ల కనపడింది. అంటే “నేను”కి narcissistic సంకెళ్లతో బంధీ అయిపోవడం. కానీ “ఆజన్మం” దగ్గరికి వచ్చేసరికి, నెమ్మదిగా, “నేను” వైపు చూసే చూపు మారుతోందనిపించింది.

“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి. ఈ రెంటి మధ్యా గీత చాలా పల్చన. మొదటి రకం కేవలం narcissism. రెండోది, ఒక శాస్త్రీయమైన కుతూహలం. ఈ ఫలానా గెలాక్సీలో, ఫలానా సౌరకుటుంబంలో, మూడో గ్రహమైన భూమ్మీద పుడుతూ జీవిస్తూ చివరికి చచ్చే ఈ మనిషి అనే జీవిని పరిశీలించాలంటే... రచయితకు అతి దగ్గరగా అందుబాటులో ఉన్న స్పెసిమన్ తానే. కాబట్టి మొత్తం మానవాళికి ప్రాతినిధ్యం వహించగలిగే ఈ స్పెసిమన్ ని శ్రద్ధగా చూస్తాడు, తన పరిశీలనల్ని నిర్మమత్వంతో నమోదు చేస్తాడు. ఈ నమోదు కాఫ్కాలో కనిపిస్తుంది. మనిషి అనే స్పెసిమన్ ని మరింత నిశితంగా పరిశీలించటానికి ఆయన తన ఫిక్షన్ లో మనుషుల్ని జంతువులు చేశాడు, జంతువులకు మనిషితనాన్ని ఆపాదించాడు –ఫిక్షన్ అన్న పేరు మీదే అలా చేయగలిగాడు.

ప్రక్రియల్ని నిరాకరించే దిలాసా రాజిరెడ్డిలో ఉంది (I hope it’s not his job as a journalist that’s making it compulsory for him to resort to these ingenious inventions). ప్రక్రియల మధ్య గీతలున్నాయని మర్చిపోగలిగేంత తన్మయత్వంలో కూడా పడిపోతేనో....  '

(నవంబర్ 17, 2013)


1 comment:

 1. ఈ ఆర్టికల్ మీద మెహెర్ వెల్లడించిన అభిప్రాయాలకు జవాబుగా నేను నా స్పందనను తనకు మెయిల్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేశాను. ఇక్కడ ఉంచుతున్నది అదే!
  అయితే, ఇప్పటికైతే మా ఇద్దరిమధ్య దీనిమీద అంగీకారం మాత్రం కుదరలేదు:-)
  ------------------------------------

  మెహెర్,
  దీన్ని నేను ఒక argumentలాగా మాట్లాడటం లేదు. కేవలం తన 'శ్రద్ధగల పాఠకుడి'తో 'రచయిత'- "ఆఆఆ... ఏమంటున్నావూ... ఇలా ఉండకూడదంటావా!" అని తెలుసుకునే ధోరణి మాత్రమే!

  "వచనం – కవిత్వం అనే విభజనలాగే, ఫిక్షన్ – నాన్ఫిక్షన్ అనే విభజన కూడా నాకు arbitrary గా తోస్తుంది."

  ఫిక్షన్- నాన్ ఫిక్షన్ అని నేను చేసిన విభజన ఒక బ్రాడర్ సెన్సులోనేగానీ నిజంగానే దానికి గట్టి సూత్రాలేం లేవు. అయితే, ఆ రెంటికీ గీత చెరిగిపోవడమనేది అన్ని రచనల్లోనూ జరుగుతుందనుకోను.self అధికంగా కనబడే రచనల్లోనే ఇది సాధ్యమనుకుంటాను.
  కథ, నవల లాంటి ఫిక్షన్ more of characterization. Expression దానికి అనుగుణంగా ఉంటుంది. కానీ నాన్ ఫిక్షన్-లో (నేను రాస్తున్నదాన్లో) ఇది తారుమారు అవుతోంది. ఇక్కడ Expression ముఖ్యం. దీన్నుంచి (నా) క్యారెక్టర్ ఏమైనా అంచనా వేసుకోవచ్చు.

  "నాన్ – ఫిక్షన్ ఎప్పుడూ రాసేవాణ్ణించి స్వతంత్రంగా ఉండలేదు. రాజిరెడ్డి అన్న బైలైన్ లేకుండా ఈ “ఆజన్మం” శీర్షిక నిలబడలేదు."

  కాఫ్కా రచనలే తీసుకుంటే... దీన్ని రాసింది ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి? మానసిక పరిస్థితులు ఏమిటి? ఆయనకున్న ఉద్దేశాలు ఏమిటి? ఆయన చూసిన ప్రపంచమూ నేను చూస్తున్న ప్రపంచమూ ఒకటేనా? అన్న ప్రశ్నలు చదువరికి తొలవొచ్చు. అంటే మళ్లీ కాఫ్కా వచ్చి పాఠకుడి వెనక నిలబడుతున్నాడు. అలాంటప్పుడు, రచయిత నుంచి విడవిడి... 'రచనా- నేనూ' అయ్యే సందర్భం ఎక్కడ? బహుశా తొలి రీడింగులో అలా ఉంటుంది. కానీ వన్స్ ఆ రచన నీకు అభిమానపాత్రం అయిందంటే, మళ్లీ రచయిత నీ పుస్తకం వెనకే వచ్చి నిల్చుంటాడు; నీవే హత్తుకుని ఆయన్ని తెచ్చేసుకుంటావు. "కొంత సమయం''... నీ ఏకాంత సమయంగా ఉంటుందే తప్ప, పూర్తిగా విడిపడి ఉండదు. 'స్వీయ' అంశాలు రాసే రచయితలతో ఈ పేచీ ఎప్పుడూ ఉంటుందనుకుంటాను.
  Holden ముఖ్యమా? Salinger ముఖ్యమా?

  ఫిక్షన్ ఏమిటంటే- కొన్నింటిని నిర్భీతిగా చెప్పుకోగలిగే వెసులుబాటు కలిగిస్తుంది. నా పక్కింటివాడి గురించి నేను అంత సులభంగా ప్రతికూలాంశం రాయలేను. దాన్ని మరుగుపరచాలంటే నేను అతణ్ని పక్క కాలనీలోనో, పక్కూర్లోనో ప్రతిష్టించి, అక్కణ్నుంచి కథ చెప్పకుంటూ రావాలి. ఫిక్షన్ (రాయడంలో) ఎక్కువ ఆదరణ పొందడానికి ఇదే కారణమనకుంటాను.

  పోనీ, తన రచన మన్నన పొందిన తర్వాత అంతటితో ఊరుకుంటాడా రచయిత? దానితో అటాచ్ అవకుండా ఉండటం సాధ్యమా? దీని సృష్టికర్తగా పాఠకుడు తనను ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వెళదామా అని ఎదురుచూడడా? తన సెల్ఫుని అంతగా జీరో చేసుకోగలడా?

  "“నేను” వైపు చూసుకోవటంలో రెండు రకాలున్నాయి. తనని తాను మనుషుల్లో ప్రత్యేకతగా చూసుకోవటం ఒకటి. తనని తాను మనిషికి ప్రతినిధిగా చూసుకోవటం ఒకటి."

  'కొన్ని పిల్ల సినిమా ఆలోచనలు' (పలక-పెన్సిల్)లో ఈ మాటొకటి వస్తుంది. 'నానుంచి నేను విడివడి చూసుకుంటే పిల్లలు ఇలా ఆలోచిస్తారా అనిపిస్తుంది...'
  రియాలిటీ చెక్-లో కూడా ఇలాంటి వాక్యం వస్తుంది: జీవితం నుంచి విడిపడి జీవితాన్ని అర్థం చేసుకోవడంలో నాకు ఆనందం ఉంది....

  ఇది అటో ఇటో తేల్చేట్టుగా ఉండదు. నేను మనుషులకు, ఒక సమూహానికి ప్రతినిధినే; అదే సమయంలో నేను రాజిరెడ్డినే! ప్రత్యేకమైనవాణ్ని అన్న ఒక 'బలం' ఏదో లేకుండా రాయడంలో ఉత్సాహం ఎక్కడుంటుంది?

  ఇదంతా కూడా పాక్షిక స్పందన అనే అనుకుంటున్నాను. ఏమో!
  Good day.

  -రాజిరెడ్డి

  పీఎస్:
  ఇప్పుడీ ఉత్తరాన్నే తీసుకుంటే- పైన మెహెర్, కింది రాజిరెడ్డి అన్న పేర్లు మినహాయిస్తే- దీన్ని 'నిలబెట్టగలిగే' అంశం ఏమీ ఉండదా?

  (నవంబర్ 19, 2013)

  ReplyDelete