Saturday, February 22, 2014

రియాలిటీ చెక్ ప్రసంగాలు-3: కారా మాష్టారు

ఫిబ్రవరి 8, 2014న శ్రీకాకుళం కథానిలయంలో కథానిలయం తరఫున రియాలిటీ చెక్ పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుగారు ఆవిష్కరించారు. ఇది పూర్తిగా కథానిలయం నిర్వహించిన సమావేశాల సమాహారం.
అయితే ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయాను. పుస్తకాన్ని ఆవిష్కరించిన తరువాత కారా మాష్టారు మాట్లాడారు. ఆ మాటల్ని రికార్డు చేసి "విన్నవి విన్నట్టుగా...'' రాసి పంపారు పుస్తక ప్రచురణకర్తల్లో ఒకరైన సుధామయి గారు. దాన్నే ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
--------------------------------------

తేదీ సరిగా జ్ఞాపకం లేదుగానీ ఒక రెండు వారాలో... క్రితం... మూడు వారాలో... జ్ఞాపకంలా నాకు డేటు... ... అదీ... తుమ్మేటి రఘోత్తమరెడ్డి అనీ... ... ఉన్నారు. ఆయనా... ఈ పుస్తకం మేష్టారూ, మీరు తప్పక చదవాలీ... అన్నాడు. ఎంచేతంటే, నా చూపుతోటి ఇబ్బందుందీ... పగలు తప్ప రాత్రి చదవలేను... కథానిలయంకొచ్చే ఏ పుస్తకమైనా సరే, నేనిక్కడుంటే నేంచూడందే కథానిలయానికి మావాళ్లు తీస్కెళ్లరూ... అంచేత... అలాగ.. ఏదైనా ఒక పుస్తకం
చదువుతూ కొన్నికొన్ని చూసి, ఆ తర్వాత నేను పెట్టేస్తుంటాను.
ఇదీ... ఆ.. చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలో ఎన్నో... చదవడానికి కూచున్నాను. అరవై వ్యాసాలూ చదవాలీ అంటే - మరీ ఎక్కువుండదు - మూడేసి పేజీలు. మాగ్జిమం నాలుగు పేజీలు... కదమ్మా?
(తలూపాను.) అలా వుంటుందన్నమాట.

అంచేత మొదటగా చూశా...న్నమాట. అరవైలోనూ ఏం చైడమని ఒకటేదో ఒక హెడ్డింగ్ బాగున్నదీ... ఆ... తెలంగాణా సంబురం... ('ఏమ్మా?'... 'అవునండీ'...) తెలంగాణా సంబురం అనీ అలాంటి హెడ్డింగ్‌తో ఉంది. అక్కడి
వంటకాలూ అవీ, ఏమొండుతారూ పండుగల్లోనీ, అవెలాగుంటాయీ... వాటిమీద.
నాకు అన్నిటికన్నా బాగా ఆ... ... ఆకర్షించిందేంటంటే ఎఖ్క... డానూ రచయిత అవుపళ్లా! రచయిత గొంతుకు మాత్రమే వినపడుతూ ఉంది. అదీ... ఆ గొంతుకు... వినపడిందా అంటే... తర్వాత .... చదివింతర్వాత... రచనకు అనుగుణమైన గొంతుక... ఎవరు ఈయనా? అనుకున్నాను...
తర్వాత అడిగితే ఫలానా అని చెప్పారు. ఆయన పేరు నేనెప్పుడూ వినలేదు. ఎంచేతంటే నేను పత్రికల్లో వచ్చే కథలు చదూతాను తప్ప సీరియల్స్ చదవను. రెండోది... ఉమ్... అలాగే ఫీచర్స్ కూడానూ... నేనూ... కాలక్షేపం కోసం పేజీలు నింపటానికి రాస్తారని నా అభిప్రాయం... అంచేత ఎప్పుడూ ముట్టుకునేవాడ్ని కాను.

చదివింతర్వాత ఎవరితనూ... ఏంచేస్తుంటాడు... ఇవన్నీ రఘోత్తమరెడ్డికి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆ... ఆరు చదివాను. ఆరులోనూ ఒకటి కూడానూ ఇబ్బంది పెట్టలేదు. పైగా ఇంకా చదవాలనే ఉంది. కానీ, నాకు ఒకేసారి ఐదారు పుస్తకాలు ఉంటయ్. అలాంటపుడు పక్కనబెడ్తాను. ఇది ఇప్పటికీ కథానిలయంలోకి వెళ్లలేదు, నా గదిలోనె ఉంటది. అదీ దీని గురించిన నా అభిప్రాయం.

తర్వాత ఇంకోటేంటంటే, ఆ... ఆ... ఇరానీ హోటల్... అనీ ఒకటుంటది. ఇర... ఇరానీ హోటల్లో రెండున్నర గంటలు... ఆ రెండున్నర గంటల్లో నిన్ను... ఆయనేంటేంటి చూశాడు... ఏంటేంటి విన్నాడు... ఏం..టేంటి... అలాగ... ఎవరెవరొచ్చారు... ఏంటేంటి విన్నాడు.... ఏరకంవాళ్లొచ్చారు... అంటే... మనిషిని ... ఆ... మనిషిని పోలిన మనిషిగాని... గొంతుకుపోలిన గొంతుక్కాని... వాక్యాన్ని పోలిన వాక్యంకాని... లేకుండా... కొన్ని వందలమంది... ఆ రెండున్నరో మూడు పేజీల్లొనే కొన్ని వందలమంది నా కళ్లముందున్నారు.
నేను హైదరాబాదు కథానిలయం పనులమీద వెళ్లినపుడు ఇరానీ హోటల్‌కి తప్పకుండా వెళ్తుంటాను. అదీ... ఒక ప్రత్యేకమైన ఇదండీ... ఆ... పేరు జ్ఞాపకం రాటంలేదూ... ఆ లాడ్జ్ దగ్గర.... నేనెక్కువగా బసచేసేవాడ్ని. అక్కడ దగ్గర్లో ఉండేది ఇదీ... ఈ... పర్టిక్యులర్స్ తెలియవండీ... అక్కడా... మన విశాఖపట్న్.... హైదరాబాదులో ఉండేటువంటి రచయితలూ, కథకులూ అందర్నూ... ఫలానా ప్రతిరోజూనూ లేదంటే ఫలానా పర్టిక్యులర్ ఏదో ఒక హౌస్‌లో ఫలానాదగ్గర మీటవుతారని తెలుసూ... అలాంటి చోటుకి నేను తప్పకుండా వెళ్లేవాడ్ని. నేను అన్నిసార్లూనూ హైదరాబాదుతో పరిచయం చేసుకున్నానుగానీ... దీంట్లో నాకు పరిచయమైనంతగా ఆ హోటల్ లైఫ్ అన్నది నాకు పరిచయం కాలే!

అలాగే... అక్కడా... వెంకటేశ్వరుని దేవాలయం ఉందిగదా... ఆ దేవాలయం మీదకీ.... ఆ... వెళ్లేన్నేను... చూసేను... అవన్నీ అయ్యాయ్.... కానీ నేను గమనించనివి ఎన్నో ఉన్నయ్. ఎంతసేపూ తెల్లబట్టలేసుకోని... పట్టుబట్టలేసుకోని దేవాలయానికి వెళ్లేవాళ్లు నాకవుపడ్డారు కానీ, ఉత్పత్తి జనం అవుపళ్లేదు. ఈయన వాళ్లనీ, వాళ్లనే ప్రధానం చేసి .... వాళ్లందర్నీ చిత్రించాడు. అలాగే ప్రతీ వ్యాసంలోనూ అలాగే ఉంటుంది. అంత బాగా... అంటే... ఆ... తక్కువ పేజీల్లో అతి తక్కువ వాక్యాల్లో అతి ఎక్కువ పరిచయం చేసేటువంటి అతని శిల్పమే బ్రహ్మాండమైంది. అందుగురించి నేనా విషయం రఘుకి ఫోన్ చేస్తే, మేష్టారూ, ఈ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలీ... ఇక్కడ నాతో ఏం చెప్పారో అదే అక్కడ చెప్పండి...

ఆ... ఇదీ... పూడూరి రాజిరెడ్డి ఎవరో నాకు తెలియదూ... మీరూ తెలుసుకోవలసిన అవసరం లేదు. కానీ, హైదరాబాదే కాకుండా తెలంగాణాలో అనేక ప్రాంతాలు, ఇతర చోట్ల అనేక ప్రాంతాలు, అక్కడి జీవితం... ఎ... ఎన్నో ఎన్నో... చెప్పలేవండీ... ఎంతోమందితో మీకు పరిచయమవుతుంది. ఒక్కొక్క వాక్యంతోనే ఒక మనిషిని రూపుకడతాడు. స్వభావాన్ని... .... అలా నాకనిపించింది. ఇది నా అనుభవం. ఇదే కరెక్టని నేననుకోను. ఎంచేతంటే ఏదైనా జరిగినపుడు తమ జీవితం తాలూకు ఉండేటువంటి పరిచయం... లోకంతో ఉండేటువంటి పరిచయం... వయసు... తరవాతా... ఇంకా అనేకమైనవీ... చదువూ, ఆసక్తీ... ఇట్లాంటివి... ఒక్కొక్కళ్లకూ ఒక్కోలాగా ఉంటయి. అందరికీ ఒక్కలాగు ఉండవు. అంచేత అందరికీ ఏ రచనైనా ఒక్కలాగా అనిపించకపోవచ్చు. నిజంగా... ఇందాకా... మా... అర్నాద్ రచన గురించి అంతసేపు ఇంతమంది మాట్లాడుతుంటే ముఖ్యంగా వివినమూర్తి కూడా అలాగ మాట్లాడుతుంటే నాకాశ్చర్యమేసింది. ఎందుకింత చెప్తున్నారు? అని. అయితే దానికొక కారణముంది. కథానిలయానికి బీజం పడ్డానికి ఆ రోజుల్లో ఒక కొన్ని గైడ్‌లైన్స్... ఆ అభిమానం నన్నేకాదు... వివినమూర్తిని కూడా ఎంతో కట్టిపడవేసింది. ఇదీ అంతసేపు మాట్లాడటానికి కారణం. దాసరి రామచంద్రరావైనా అటువంటి కారణంచేతే మాట్లాడి ఉంటాడని నేననుకుంటున్నా. అదీ... అంచేత... దీని...

ఇంకో తమాషా ఏమిటంటే ఎవరైనా రైటరూ ఒక పుస్తకం రాస్తే ఒకప్పుడు అరుదుగా పబ్లిషర్లు వచ్చేవాళ్లు. లేకపోతే... లేపోతే వాళ్లు ఏదో కారణంవల్ల, వేరే కారణాలవల్ల పబ్లిషర్ వస్తాడు. కానీ రచయిత అడక్కుండానే, రచయిత ఎవరో తెలియకుండానే దానికో పబ్లిషర్ రావడమనేది కూడా విశేషం ఈ పుస్తకం విషయంలో. ఈవిడ... ఇది... మొదటిసారి ఒకట్రెండు మాటలు మాట్లాడి ఉంటాను. ఇవ్వాళ ... ఇక్కడ కలిశాను... వీర్ని. ఈవిడ ఆ పుస్తకంలో కొన్ని రచనలు చదివి, అందులో ముఖ్యంగా ఒక రచన... పేరు జ్ఞాపకంలేదు... ఆ రచన చదివి, ఇంప్రెస్ అయ్యి, మొత్తం వ్యాసాలన్నీ కలెక్ట్ చేసి, అవన్నీ కలిపి ఈ పుస్తకంగా ఆథర్ తనని అడక్కుండా అచ్చేసింది. అంచేత... అదీ ప్రత్యేకం... ఈ పుస్తకం తాలూకు.
సెలవు.

1 comment:

  1. కారా గారి ఆవిష్కరణ తర్వాత చదవడానికి నేను మర్యాదపూర్వక ధన్యవాదాల నోట్ పంపించాను. ఆ నోట్ ఇక్కడ ఒక కామెంటుగా ఉంచుతున్నాను.
    -------------------------------------------

    8 ఫిబ్రవరి 2014

    కథానిలయంలో రియాలిటీ చెక్ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా రచయిత పూడూరి రాజిరెడ్డి అర్పిస్తున్న ధన్యవాదాల నోట్:


    అందరికీ నమస్కారం.

    ఇప్పుడు ఇక్కడి దృశ్యాన్ని నా మనసులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
    ఒక పసిరచయిత ఏం చెబుతాడా అని పెద్దవాళ్లందరూ చెవి ఒగ్గిన సంభ్రమ క్షణాన్ని నేను ఊహిస్తున్నాను.

    కథా నిలయం సాక్షిగా నా రియాలిటీ చెక్ పుస్తకం వేదికనెక్కడం సంతోషంగా ఉంది.
    కథల పుస్తకం కాకపోయినా, దీన్ని ఈ వేదిక అక్కున చేర్చుకున్నందుకు మరింత ఉత్సాహంగా ఉంది.

    ప్రసిద్ధ రచయిత, నాకు ఆత్మీయులైన తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఒక సందర్భంలో ఈ మాట చెప్పారు:
    ఒకసారి రచయిత ఒక పుస్తకమంటూ రాశాక, లేదా విడుదల చేశాక, ఇక దాని మంచిచెడ్డలు చూసుకోవాల్సింది వేరేవాళ్లే!
    రచయిత ఆ చర్చల్లో, వేదికల మీద ఉండకపోవడమే మంచి సంప్రదాయం.
    బహుశా, నేను ఇవ్వాళ ఇక్కడికి హాజరు కాకపోవడం ద్వారా నేను ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాననుకుంటాను.

    ప్రేమగా పుస్తకాన్ని ఆవిష్కరించిన అందరి మాష్టారు కారా గారు సదా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
    నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకున్న దాసరి రామచంద్రరావు గారికీ, వివినమూర్తి గారికీ, ఇంకా ఇందులో భాగస్వాములయ్యీ నాకు పేరు తెలియనివారికీ నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
    రియాలిటీ చెక్ పుస్తకానికి భౌతికంగా చెందకపోయీ ఈ సమయాన మానసికంగా చెందిన పెద్దవాళ్లందరికీ నా నమస్సులు తెలియజేస్తున్నాను.

    వీలైనంత త్వరగా శ్రీకాకుళం గడ్డమీది ఈ కథల దేవాలయాన్ని దర్శించుకుంటానన్న ఆశ నాకుంది.
    సెలవు.

    -పూడూరి రాజిరెడ్డి

    ReplyDelete